వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము - 9

 

భూదేవి:

ఆదౌ కృతయుగే నాథ కిం కృతం విశ్వమూర్తినా,

నారాయణేన తత్సర్వం శ్రోతుమిచ్ఛామి తత్త్వతః.

 

భూదేవి:

నాథా! మొదట కృత యుగమున విశ్వమంతయు తన రూపమే అయిన శ్రీమన్నారాయణు డేమి చేసెనో దానిని ఉన్నదున్నట్లు విన గోరుదును.

 

శ్రీవరాహ దేవుడు:

పూర్వం నారాయణ స్త్వేకో నాసీత్‌ కించిద్ధరేః పరమ్‌,

సైక ఏవ రతిం లేభే నైవ స్వచ్చంద కర్మ కృత్‌.

 

శ్రీవరాహ దేవుడు:

మొదట నారాయణుడు ఒక్కడే యుండెను. హరి కంటే వేరుగా నేమియు లేదు. ఇచ్చ చొప్పున ఆయా కార్యములు చేయు ఆ యోక్కనికి ప్రీతి కలుగ కుండెను.

 

తస్య ద్వితీయ మిచ్ఛంత శ్చింతా బుద్ధ్యాత్మికా బభౌ,

అసా విత్యేవ సంజ్ఞాయా క్షణం భాస్కర సన్నిభా.

 

రెండవది యున్నచో మేలు గదా! అని తలపురాగా ఆతని బుద్ది స్వరూపిణి అయి ‘ఇదిగో’ అని ఒక్క క్షణము సూర్యుని వెలుగు వలె ప్రకాశించెను.

 

తస్యా అపి ద్విధా భూతా చింతాభూద్‌ బ్రహ్మవాదినీ,

ఉమేతి సంజ్ఞయా యత్తత్సదా మర్త్యే వ్యవస్థితా.

 

ఆ భావనయు బ్రహ్మమును తెలుపుచు ఉ,మ అను స్వరూపములతో రెండయ్యెను. అది మానవ లోకము నెలకొని యుండెను.

 

ఓ మిత్యేకాక్షరీభూతా ససర్టేమాం మహీం తదా,

భూః ససర్జ భువం సోపి స్వః ససర్జ తతో మహః.

తతశ్చ జన ఇత్యేవ తపశ్చాత్మా ప్రలీయతే,

ఏతదోతం తథా ప్రోతం సూత్రే మణిగణా ఇవ.

 

ఆ భావన ‘ఓమ్’ అను ఒక్క అక్షరముగా నై ఈ భామిని సృజించెను. అదియే ‘భూ’ లోక మాయెను. పిదప భువము, స్వస్సు మహస్సు, జనము, తపస్సు అను వానిని సృజించెను. అటుపై ఆత్మ పరమాత్మలో లీనమాయెను. ఇట్లది ఓతప్రోతముగా దారములో మణుల సముదాయము వలె అంతట అల్లు కొని పోయెను. (ఓతప్రోత మనగా బట్టలో దారము వలె అల్లుకొని పోయినది).

 

జగత్‌ ప్రణవతో భూతం శూన్యమేతత్‌ స్థితం తదా,

యేయం మూర్తి ర్భగవతః శంకరః స స్వయం హరిః.

 

ఇట్లు జగత్తంతయు ప్రణవము వలన (ఓంకారము వలన) నేర్పడెను. అప్పుడది శూన్యముగా నుండెను. అట్లయిన ఆ భగవంతుని మూర్తియే శంకరుడు. ఆ శంకరుడు స్వయముగా హరియే.

 

శూన్యాన్‌ లోకా నిమాన్‌ దృష్ట్వా సిసృక్షుర్మూర్తిముత్తమామ్‌,

క్షోభయిత్వా మనోధామ తత్రాకారః స్వమాత్రతః.

 

శూన్యము లైన ఈ లోకము లన్నియు చూచి ఆ ప్రభువు ఉత్తమ మగు ఆకారమును సృష్టి చేయ గోరెను. తన మనస్థానమును కుదిపి వేయగా అందు తన యంశముతో ఒక ఆకార మేర్పడెను.

 

స్ఠిత స్తస్మిన్‌ యదాక్షుబ్ధే బ్రహ్మాండ మభవత్తదా,

తస్మింస్తు శకలీభూతే భూర్లోకంచ వ్యవస్థితమ్‌.

 

దానిపై నాతడు కూర్చుండగా అది అట్టిటు కదలాడి బ్రహ్మాండముగా రూపొందెను. అది ముక్కలు కాగా భూలోక మేర్పడెను. (క్రింది ముక్కయని యర్ధము).

 

అపరం భువనం ప్రాయా న్మధ్యే భాస్కర సన్నిభమ్‌,

పురాణ పురుషో వ్యాప్య పద్మకోశే వ్యవస్థితః.

 

పై చెక్క సూర్యుని వలె వెలుగొందుచు మధ్య భాగమున కరిగెను. అందు పురాణ పురుషుడగు నారాయణుడు పద్మము మొగ్గలో నెల కొని యుండెను. (మధ్యే అనగా ఇప్పటి మన చూపులో నక్షత్ర మండలము మొదలగునవి యున్న భాగము పైని వని భావింప వలయును)

 

స హి నారాయణో దేవః ప్రాజాపత్యేన తేజసా,

అకారాద్యం స్వరం నాభ్యాం హలంచ విససర్జ హ.

 

అట్టి నారాయణ దేవుడు ప్రజాపతి తేజస్సుతో (ప్రజాపతి = సృష్టి కర్త) బొడ్డు నుండి ఆకారము మొదలగు స్వరములను (అచ్చులను) హల్లులను (వ్యంజనములను) చక్కగా నేర్పరచెను.

 

అమూర్తసృష్టౌ శాస్త్రాణి ఉదగాయత్‌ తదా దిశః,

సృష్ట్వా పున రమేయాత్మా చింతయామాస ధారణమ్‌.

 

ఇంకను సృష్టి ఆకారము లేర్పడక మున్నే నారాయణుడు శాస్త్రములను (వేదములను) గానము చేసెను. అటుపై దిక్కులను సృజించి అమెయాత్ముడగు ఆ ప్రభువు ఇవి నిలుచుట ఎట్లాయని భావన చేసెను.

 

తస్య చింతయతో నేత్రాత్‌ తేజః సమభవన్మహత్‌,

దక్షిణం వహ్ని సంకాశం వామం తుహిన సన్నిభమ్‌.

 

అట్లు భావన చేయుచున్న ఆతని కన్నుల నుండి గొప్ప వెలుగు, కుడి కంట నిప్పు వంటిదియు, ఎడమ కంట మంచు వంటిదియు నేర్పడెను.

 

తం దృష్ట్వా చంద్ర సూర్యౌతు కల్పితౌ పరమేష్ఠినా,

తతః ప్రాణః సముత్తస్థౌ వాయుశ్చ పరమేష్ఠినః.

 

అంత పరమేష్టి ఆ రెంటిని చూచి వానిని సూర్య చంద్రులుగా మలచెను. అటుపై నుండి ప్రాణము వెలికి వచ్చెను. అదియే వాయువు.

 

స ఏవ వాయు ర్భగవాన్‌ యెద్యాపి హృదిగో విభుః,

తస్మాద్‌ వహ్నిః సముత్తస్థౌ తస్మాదగ్నేర్జలం మహత్‌.

 

ఆ వాయునే ఇప్పటికిని సర్వ ప్రాణుల హృదయముల యందున్న భగవంతుడు. ఆ వాయువు నుండి అగ్ని పుట్టెను. దాని నుండి గొప్ప ప్రమాణమున నీరు ఉప్పతిల్లెను.

 

య ఏవాగ్నిః సవై తేజో బ్రహ్మం పరమకారణమ్‌

బాహుభ్యా మ ప్యసౌ తేజః క్షాత్రం తేజః ససర్జ హ.

 

ఆ పరమాత్మ నుండి యేర్పడిన అగ్నియే బ్రహ్మ తేజము. అదియే బ్రాహ్మణ జాతికి మూల కారణము. అదే తేజస్సు భుజముల నుండి యేర్పడి క్షత్రియ జాతిని పుట్టించెను.

 

ఊరుభ్యా మపి వైశ్యాంశ్బ పద్భ్యాం శూద్రాం స్తథా విభుః,

తతస్తు ససృజే యక్షన్‌ రాక్షసాంశ్చ తథా విభుః.

 

ఆ ప్రభువే తొడల నుండి వైశ్యులను, పాదముల నుండి శూద్రలను పుట్టించెను. అటుపై యక్షులు, రాక్షసులు అను జాతులను గూడ ఆ ప్రభువు సృజించెను.

 

చతుర్విధైస్తు భూలోకం భువర్లోకం వియచ్చరైః,

భూతైః స్వ ర్మార్గగై రన్యైః స్వర్లోకం సమపూరయత్‌.

 

బ్రాహ్మణులు మొదలగు నాలుగు విధముల వారితో భూలోకమును నింపెను. యక్షాదులతో భూవర్లోకమును నింపెను. పుణ్య మార్గమున బోవు ఇతర భూతములతో స్వర్లోకమును నింపెను.

 

మహర్లోకం తథా తైసైత ర్భూతైశ్చ సనకాదిభిః,

జనో లోకం తతశ్చైవ వైరాజైః సమపూరయత్‌.

 

సనకుడు మొదలుగా గల ప్రాణులతో మహార్లోకమును, వైరాజులనెడు ప్రాణులతో జన లోకమును పూరించెను.

 

 

తపస్సు నందు నిష్ఠ గల వారితో తపో లోకమును, తిరిగి మరణము లేని దేవతలతో సత్య లోకమును నిండించెను.

 

 

ఇట్లు భూతముల (ప్రాణులు, ప్రాణము లేని వస్తువులు) అన్నింటిని మనసుతో ఊహించి సృష్టించిన భగవానుడు కల్పమను పేరు గల తనదగు పగటి భాగమున మేల్కొని యుండును.

 

 

ఆ పగటి యందు భూలోకము, భూవర్లోకము, స్వర్లోకము అను నీ మూడును పుట్టు చున్నవి. ఇందు సంశయము లేదు.

 

 

ఆ దేవుడు కల్పము ముగిసిన పిదప నిద్రింపగా తిరిగి అంతే కాలము రాత్రి యగును. అప్పుడీ మూడు లోకములు నిద్రించును. అట్లే అవి ప్రళయము పొందును.

 

 

అంత నారాత్రి గడువగా పద్మ లోచనుడు ఆ వేదములను గూర్చియు, వాని మాతృ దేవియగు సావిత్రిని గూర్చియు భావన చేసెను. కాని వాని నాతడు పొంద కుండెను.

 

 

లోక మార్గమునకు ఒక ఏర్పాటు చేయ గోరి నిద్ర వలన స్మృతి పోగా వేదములు రూపొంద లేదని తలపోసెను.

 

 

పిదప వేదములు జలమున కలసి పోయిన వని యెరిగి వానిని తిరిగి పొందుటకై చేపనై నీటి లోనికి చొర బారెదనని భావించెను.

 

 

ఇట్లు భావించి వెను వెంటనే పెద్ద చేపయై నీటిలో ప్రవేశించి అంతయు కలయ దిరిగెను.

 

 

ఒక పెద్ద పర్వత మంత దేహముతో దేవ దేవుడు చేప రూపుదాల్చి మహా సముద్ర జలమున ప్రవేశింపగా భూమిని ఉద్దరించిన ఆ హరిని దేవతలు అందఱు నిటు కొనియాడిరి.

 

 

వేదములను మూల ముట్టుగా భావించిన వారి ఊహలకును అందని ఓ దైవమా! నారాయణా! మత్స్యరూపా! మధుర నాదము గల ఓ దేవా! విశ్వమూర్తీ! రెండు విద్యల స్వరూపము తాల్చిన ఓ పరమేశా నీకు నమస్కరింతును. (విద్యాద్వాయము ~ విద్య,అవిద్య).

 

 

సూర్యుడు, చంద్రుడు, దేవతలు అను స్వరూపములు గల స్వామీ! విశ్వమంతయు నీట మునిగి నశింపగా నిలిచి యున్న ప్రభూ! మనోహరములగు కన్నులతో అలరారు దేవరా! విష్ణూ! నిన్ను శరణు పొందెదము. ఈ చేప రూపు విడిచి మమ్ములను కాపాడుము.

 

 

అనంతములగు రూపములు గల ఓ స్వామీ! ఈ విశ్వమంతయు నీ తోడనే నిండి యున్నది. నీ కంటె భిన్నమై కొంచె మైనను గలదా? నీవును దీనికి వేరైన రూపము కలవాడవు కావు. నీ వలననే మేమున్నాము. అట్టి నిన్ను శరణు పొందితిమి.

 

 

ఆకాశమున కాత్మయగు సూర్యుడు, చంద్రుడు, అగ్ని, మనస్సు, రూపము. ఇవి యన్నియు ఓ పురాణ మూర్తీ! నీవే. పద్మ లోచనా! నాయందు భక్తి కోరవడినచో క్షమింపుము. దేవదేవా! నీ వలననే లోకము భాసిల్లు చున్నది.

 

 

దేవా! ఈ నీ రూపము వెరపు గొలుపుచు, పెద్ద ఘోషతో, కొండంతయై విపరీతముగా నున్నది. పురాణ పురుషా! దేవదేవా! జగన్నివాసా! అచ్యుతా! వాడి కిరణములు గల ఓ ప్రభూ! శాంతి పొందుము.

 

 

స్వామీ! మేమందరము నిన్ను శరణు జొచ్చితిమి. నీయీ రూపము చూచి మాకు భయము కలుగు చున్నది. నీవు సర్వ దేహములలో సనాతనుడనై యున్నావు. కనుక ఈ లోకమున నీవు లేని దేదియు నుండదు.

 

 

దేవత లిట్లు స్తుతించు చుండగా ఆ దేవుడు వేదములను ఉపనిషత్తులతో పాటుగా పట్టుకొని వచ్చి తనదైన లోపలి రూపమును పొందిన వాడాయెను.

 

 

భగవానుడు తన స్వరూపమును పొందునంత వరకే ఈ జగత్తు కాన వచ్చును. తన ప్రకృతిలో నున్నపుడు అతనిలో కలసి పోవును. వికారము కలిగి నపుడు (దేహము ధరించి నపుడు) వృద్ది పొందు చుండును.