వరాహ మహా పురాణము
అధ్యాయము - 89
విభూ! దేవా! పరమాత్ముడు పుణ్యమూర్తి శివుడని కొంద రందురు. ఇతరులు హరిని చెప్పుదురు. మరి కొందరు బ్రహ్మను పలుకుదురు. వీరిలో పరదైవ మెవరు? దీనిని నాకు చెప్పుము. నాకు చాల కుతూహలముగా నున్నది.
శ్రీవరాహ దేవుడు:
శ్రీవరాహ దేవుడు:
నారాయణుడే పరమ దైవము. ఆతని నుండి చతుర్ముఖుడు పుట్టెను. అతని వలన రుద్రుడు కలిగెను. అతడు సర్వజ్ఞత్వమును పొందెను.
ఓ వరాననా! అనఘా! చారుగాత్రీ! ఆతని ఆశ్చర్యములు అనేకములు. నేను ఆ అన్నింటిని చెప్పెదను. వినుము.
అనేక వర్ణముల ధాతువులతో (కొండరాలతో) చిత్రమై అందమైన కైలాస శిఖరమున శూలపాణి, ముక్కంటి యగు దేవుడు నిత్యము నివాస ముండును.
సర్వ భూతములు మ్రొక్కులిడు ఆ దేవుడు ఒకనాడు భూత గణములు చుట్టుకొని యుండగా గౌరీ దేవితో కూడి యుండెను.
అందు కొందరు సింహ ముఖులు. సింహము వలె గర్జింతురు. మఱి కొందరు ఏనుగు మోముల వారు. ఇంకను కొందరు గుఱ్ఱము ముఖముల వారు. వేరు కొందరు మొసలి మొగముల వారు. ఇంకను ఇతరులు పంది ముఖముల వారు. అన్యులు ఆడు గుఱ్ఱముల మొగముతో భయంకరమైన వారు. అట్లే గాడిద మొగముల వారు. మేక మొగముల వారు, పొటేలు మొగముల వారు, చేప మొగముల వారు క్రూరులు, శస్త్ర పాణులు అనంత సంఖ్యలో ఉన్నారు.
కొందరు పాడు చున్నారు. కొందరాడు చున్నారు. కొందఱు పరువెత్తు చున్నారు. కొందరు పగుల బడు చున్నారు. కొందరు నవ్వు చున్నారు. కిలకిల ధ్వనులు చేయు చున్నారు. మహా బలము గలవారు గర్జించు చున్నారు.
కొందరు గణ నాయకులు రాలు పట్టుకొని పోరాడ జొచ్చిరి. మరి కొందరు బల గర్వముతో మల్ల యుద్ధములు చేయు చుండిరి. ఇట్టి ప్రమధ గణములు వేల కొలదిగా కొలిచి యుండగా మహా దేవుడు కొలు వుండెను.
ఈ విధముగా దేవదేవుడు తనకు తానై దేవితో క్రీడించు చుండగా త్వరతో బ్రహ్మ దేవతలతో కూడి అట కరుదెంచెను.
అట్లు వచ్చిన బ్రహ్మను గాంచి విధానము ననుసరించి రుద్రుడు పూజించి అవ్యయుడగు నాతనితో ఇట్లు పలికెను.
బ్రహ్మా! నీవిచటకు వచ్చిన పనియేమి? త్వరగా చెప్పుము. మరియు దేవత లందరు తొందరతో నుండి నా కడకు వచ్చిరి. పనియేమి?
అంధకుడను మహా రాక్షసుడు కలడు. దేవలోక వాసు లందరు అతని చేత బాధల నొంది నన్ను శరణు కోరిన వారై నా కడ కరుదెంచిరి.
నేనా దేవత లందరికి భవుడవగు నిన్ను గూర్చి తెలిపి అచటకు పోద మంటిని. అందు వలన వీరందరు ఇచటకు వచ్చరి.
ఇట్లు పలికి బ్రహ్మ పినాకి వైపు చూచు చుండెను. (పినాకము శివుని విల్లు - పినాకము కలవాడు పినాకి.) మరియు మనస్సున నారాయణ పరమేశ్వరుని స్మరించెను. అంత నారాయణుడు విచ్చేసి వారిరువురి నడుమ నిలుచుండెను.
అంత ఒక్క చోట నున్న ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పర మానందముతో ఒకరి నొకరు సూక్ష్మ దృష్టితో చూచుకొనిరి.
అపుడు ఆ మువ్వురి మూడు విధములగు దృష్టి ఒక్కటిగా రూపొందెను. ఆ దృష్టి యందు ఒక దివ్య రూపము గల కుమారి ఉదయించెను.
నల్లని కలువల రేకుల వంటి దేహ కాంతియు, నల్లని నొక్కులు గల కేశములును, అందమైన ముక్కు, చక్కని నెన్నుదురు, అందమైన మొగము కలిగి ఆ కుమారి చక్కగా నిలిచి యుండెను.
త్వష్ట అగ్ని జిహ్వకు ఏ లక్షణములను నిర్ధేశించెనో అది యంతయు ఒక్క చోట నిలిచిన తీరున ఆ కన్య యందు కాన వచ్చెను.
అంత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ కన్యను చూచి కాంతా! నీవెవరు? నీవు భావించిన పని యేమి? అని అడిగిరి.
నలుపు, తెలుపు, పసుపు అను మూడు వన్నెలు గల ఆ కుమారి, ఉత్తములారా! మీ దృష్టి యోగము వలన నేను పుట్టితిని. నన్నెరుగరా? నేను మీ శక్తి స్వరూపిణిని. పరమేశ్వరిని. అని పలికెను.
అంత బ్రహ్మాదులు ఆనంద మంది ఆమెకు వరము నొసగిరి. దేవీ! నీపేరు త్రికళ. ఎల్లవేళల ఈ విశ్వమును రక్షించు చుండుము.
మరియు పుణ్యాత్మా! నీకు గుణములను బట్టి ఏర్పడునవి, అన్ని సిద్ధులు కలిగించు నవియు నగు వేరు పేరులు కూడ కలుగును.
దేవీ! నీవు మూడు వన్నెలు కలదాన వగుటలో మరియొక కారణమును కలదు. మూడు రంగులతో మూడు మూర్తలను నీవిగా చేసి కొనుము.
వారిట్లు పలుకగా ఆమె తన దేహము తెల్లనిది, ఎర్రనిది. నల్లనిది అగునట్లు చేసికొని మూడు మూర్తుల స్థితిని పొందెను.
బ్రహ్మ సంబంధమైన శుభమైన మూర్తితో సౌమ్య రూపముతో ఆసుశ్రోణి బ్రహ్మ సృష్టి పద్ధతిని బట్టి ప్రజలను సృజించును.
ఎర్రని వన్నెతో ఏర్పడిన ఆ సూరూప శంఖ చక్రములను తాల్చినదై విష్ణు సంబంధమైన కళగా ఏర్పడి ‘విష్ణు మాయ’ అని పిలువ బడుచు ఈ సకల విశ్వమును సంరక్షించును.
నల్లని వన్నెతో రౌద్ర రూపముతో త్రిశూలమును తాల్చి కోరలతో భయము గొలుపు ఆ దేవి జగమును సంహరించును.
బ్రహ్మ సృష్టియై తెల్లని వన్నెతో విరాజిల్లు వికసించిన పద్మ దళముల వంటి చూపులు గల ఆ పుణ్య స్వరూపయగు కుమారి వెంటనే బ్రహ్మకడ సెలవు కైకొని అంతర్ధానము పొందెను.
వరదయగు ఆ దేవి విశ్వ రూపము పొంద గోరినదై త్రీవ్రమగు తపస్సు చేయుటకు శ్వేత పర్వతమున కరిగెను.
మహా దుష్కర మైన తపస్సు చేయుటకై వైష్ణవియగు, ఆ కుమారి హరిని వీడ్కొని మందరాద్రి కరిగెను.
రుద్ర సంబంధిని యగు విశాలాక్షి, దంష్ట్రలతో భయము గొలుపు ఆ కృష్ణ నీల పర్వతమునకు తపస్సునకై అరిగెను.
అంత పెద్ద కాలము గడువగా బ్రహ్మ ప్రజలను సృజించుటకై మొదలిడి బలమును పెంపొందింప జూచు కొనెను.
బ్రహ్మ తన మానస ప్రజ పెంపొందక పోవుటకు గాంచి ఇదేమి ప్రజ వృద్ధి పొందదేమి? అని భావించెను.
అంత బ్రహ్మ యోగా భ్యాసము గల హృదయముతో ధ్యానించెను. శ్వేత పర్వతమున మహా ఘోర తప మాచరించుచు పాపములను కాల్చి వేసి కొనిన ఆ కన్యను గూర్చి తెలిసి కొనెను.
అంత బ్రహ్మ ఆ కమలేక్షణ తపస్సు చేయుచున్న తావున కరిగి ఆమెను గాంచి యిట్లు పలికెను.
భద్రా! ఏపనిని తలపోసి నీవు తపస్సు చేయు చున్నావు? తుష్టి నందితిని. విశాలాక్షీ! నీకేమి వరము కావలయునో ఇత్తును. కోరు కొనుము.
స్వామీ! నేను ఒక్కచోట నిలుచుటకు ఇష్టపడను. కావున నిన్నొక వరము కోరెదను. నేను ఎల్ల చోటుల నుండు దాన నగుటను కోరు చున్నాను.
సృష్టి దేవి యిట్లు పలుకగా ప్రజాపతి యగు బ్రహ్మ ఆ దేవితో నీవు సర్వగతపు అగుదువు అని పలికెను.
బ్రహ్మ యిట్లు పలుకగా ఆ కమలేక్షణ సృష్టి దేవి ఆతని ఒడిలో లయ మొందెను. అది మొదలుకొని బ్రహ్మ సంబంధమగు సృష్టి వృద్ధి పొందెను.
బ్రహ్మ మానస పుత్రులు, ఏడుగురు తపోధనులు, వారి తరువాత తక్కిన వారు, తరువాత నాలుగు విధములైన భూతముల స్పష్టియు, స్థాపర జంగమాత్మక మైన దంతయు నేర్పడెను.
(మానస పుత్రులు: వీరినే నవ బ్రహ్మలు, ప్రజా పతులు అందురు. 1. భృగువు 2. పులస్త్యుడు. 3. భరద్వాజుడు 4. అంగిరసుడు 5. అత్రి 6. క్రతువు 7. దక్షుడు 8. వసిష్ఠుడు 9. మరీచి. ఏడుగురు తపోధనులు సప్తర్షులు: 1. కశ్యపుడు 2. అత్రి 3. భరద్వాజుడు 4. విశ్వామిత్రుడు 5. గౌతముడు 6. జమదగ్ని 7. వసిష్ఠుడు. నాలుగు విధములైన సృష్టులు: 1. జరాయుజము 2. అండజము 3. స్వేదజము 4. ఉద్భిజ్జము).
లోకమున వాగ్రూపము, స్థావరము, జంగమము అయిన సమస్తమైన సృష్టియు, భూతము, భవిష్యత్తు అయిన సర్వము ఈ విధముగా స్థాపిత మైనది.
