వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము - 93

 

ఇష్ట మైన రూపము తాల్పగల వాడు, గొప్ప బలము గలవాడును అగు మహిష రాక్షసుడు మదించిన ఏనుగు నెక్కి మేరు పర్వతమునకు ప్రయాణము కట్టెను.

 

అంత నతడు ఇంద్రుని పురమును ముట్టి దేవతలతో పాటు దేవేంద్రుని తరిమి కొట్టెను. అంత దేవత లందరు కోపా వేశము పొందిరి.

 

తమ శస్త్రములను, వాహనములను పెద్దగా గొని దైత్యులను నిలువరించి ఆనందపు పొంగుతో వారి వెంట బడిరి.

 

ప్రచండులగు యోధులు, ఒకరిపై నొకరు గర్జించు చున్న వారునగు వారికి ఒడలు గగుర్పాటు కలిగించు మహా సంకులమైన సమరము జరిగెను.

 

అందు అంజనుడు, నీలకుక్షి, మేఘ వర్ణుడు, వలాహకుడు, ఉదరాక్షుడు, లలాటాక్షుడు, సుభీముడు, భీమ విక్రముడైన స్వర్భానువు అను ఎనమండ్రు రక్కసులు యుద్ధమున వసువులను తరిమి కొట్టిరి. (వసువులు ఎనమండ్రు)

 

పండ్రెండుగురు దైత్యులు పండ్రెండుగురైన ఆదిత్యులను తరిమి కొట్టిరి. వారిని వివరించెదను వినుము.

 

భీముడు, ధ్వంక్షుడు, ధ్వస్తకర్ణుడు, శంకుకర్ణుడు, వజ్రకాయుడు, గొప్ప వీర్యము కల విద్యున్మాలి, రక్షాక్షుడు, భీమదంష్ట్రుడు, విద్యుజ్జిహ్వుడు, అతికాయుడగు మహాకాయుడు, దీర్ఘబాహువు, కృతాంతుడు అను పండ్రెండుగురు దైత్యులు ఆదిత్యులను పోరున త్రోలిరి. (ఆదిత్యులు పండ్రెండుగురు)

 

 

అట్లే ఇతర రాక్షసులు పదునొకండుగురు మిక్కిలి కోపము కలవారై తమ సైన్యములను కొనిపోయి రుద్రులను పదునొకండు గురను తరిమి వైచిరి.

 

కాలుడు, కృతాంతుడు, రక్తాక్షుడు, హరణుడు, మిత్రహుడు అనిలుడు, యజ్ఞహుడు, బ్రహ్మహుడు, గోఘ్నుడు, స్త్రీఘ్నుడు, సంవర్తకుడు అను ఈ పదునొకండుగురు దైత్యేంద్రులు, యుద్ధమున ఒడ లెరుగని వారు భయంకర శౌర్యము కలవారు అదే సంఖ్య గల రుద్రులను ఎదుర్కొనిరి.

 

మిగిలిన దేవతలను మిగిలిన రక్కసులు దొరకిన వారిని దొరకి నట్లు ఎదుర్కొనిరి. మహిష రాక్షసుడు స్వయముగా దేవేంద్రునితో తలపడి పోరాడెను.

 

ఆ దైత్యుడు మిక్కిలి బలము కలవాడు. బ్రహ్మ వరము వలన పొగ రెక్కిన వాడు. స్వయముగా పినాకము తాల్చిన శివుడెత్తి వచ్చినను యుద్ధమున వధింప రానివాడు.

 

ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, రుద్రులు అనుదేవ జాతుల వారు లెక్క పెట్టరాని సంఖ్యలో రాక్షసులను పరిమార్చిరి.

 

దేవతల సైన్యములు కూడ రక్కసుల చేత నాశన మయినవి. ఇట్లు దేవేంద్రుడు విరిగి పారగా దేవత లందరు చెల్లా చెదరయిరి.

 

శూలములు, పట్టిసములు, ముద్గరములు మొదలగు పెక్కు విధములగు ఆయుధములతో నలుగ గొట్టబడిన దేవత లందరు బ్రహ్మ లోకమునకు అరిగిరి.