వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము - 94

 

అంత మహిషుడు దూతగా పంపిన విద్యుత్ప్రభుడు దేవి సమీపమున కరిగి ఆ సుమధ్యమతో ఇట్లు పలికెను.

 

ప్రణమిల్లి భక్తి యుక్తుడై వందల కొలది కన్యలతో ఉన్న ఆమె ఆస్థానమున వినయము కలవాడై యిట్లు పలికెను.

 

 

దేవీ! మొదటి సృష్టిలో జలము నందు పుట్టిన సుపార్శ్వుడను ఋషి కలడు. అతడు సారస్వత మహర్షికి మిత్రము.

 

అతనికి గొప్ప తేజస్సు, ప్రతాపము గల సింధు ద్వీపుడను కొడుకు పుట్టెను. అతడు మాహిష్మతియను గొప్ప పట్టణమున తీవ్రమగు తపస్సు చేసెను.

 

అట్లు నిరాహారుడై మహా ఘోర తప మాచరించు చున్న అతనికి మాహిష్మతి యను కూతురు పుట్టెను. ఆమె విప్రచిత్తికి అక్క, రూపములో సాటి లేనిది. దేవకన్య వంటిది.

 

ఆమె చెలులతో కూడి ఒకనాడు విహరించుచు అనుకొనకుండ మందర పర్వతము లోయలో అంబరుడను పేరుగల ముని తపో వనమును, పెక్కు విధముల చెట్ల వరుసలు కలదానిని, చేరు కొనెను.

 

ఆ మహాత్ముని తపోవనము పెక్కు పొదరిండ్లతో, పెక్కు విధములగు పొగడలు, గజ నిమ్మలు, మంచి గంధపు చెట్లు, సాలములు, సరళములు, విచిత్రములగు తోటలు మొదలగు వానితో అలంకృతమై యుండెను.

 

అట్టి అంద మైనది, శుభ మైనది అగు ఆశ్రమ పదమును గాంచి ఆ రాక్షస కన్య మాహిష్మతి ఇట్లు తలపోసెను.

 

నా సఖు లందరు నన్ను మిన్నగా మన్నించు చుండగా ఈ తాపసుని భయపెట్టి స్వయముగా నేనే ఇందు క్రీడించుచు నిలిచి పోయెదను.

 

ఇట్లు తలపోసి ఆ దేవి చెలులతో పాటు మిక్కిలి వాడి యయిన కొమ్మలు తాల్చి మహిషిగా ఆయెను. (మహిషి = గేదె)

 

సుందరమగు మొగము గల ఆ రాక్షసి చెలులతో పాటు అతనిని భయ పెట్టుటకై అరిగెను. అంత ఋషి జ్ఞాన నేత్రముతో ఆమెను గుర్తించి క్రోధము పెచ్చు రేగగా ఆ అసుర కన్యను శపించెను.

 

నన్ను గేదె రూపు తాల్చి భయ పెట్టిన కారణముగా ఓ పాప కర్మురాలా! నూరేండ్లు గేదెవు కమ్ము.

 

ఇట్లు పలుకగా ఆమె చెలులతో పాటు వణకి పోవుచు శాపము తీరు దారి చెప్పుమని మరల మరల పలుకుచు అతని పాదములపై పడెను.

 

ఆమె ఆ మాట విని ఆ ముని కరుణ కలవాడై శాపము తీరుటను ఏర్పరచెను. ఈ వాక్యమును పలికెను.

 

మంచిదానా! నీవు ఈ స్వరూపము తోడనే ఒక కొడుకును గని శాపాంతమును పొందుదువు. నా వాక్యము అబద్ధము కాదు.

 

అత డట్లు పలుకగా ఆమె సింధు ద్వీప మహర్షి ఘోరమగు తపస్సు చేసిన ఉత్తమమగు నర్మద తీరమున కరిగెను.

 

అచట ఇందుమతి యను ఒక దైత్య కన్య మహా రూపవతి వివస్త్రయై జలమున మునుగుచు ఆ ముని కంట బడెను.

 

అంత నా మహా తాపసుడు రాతి దొన్నె యందు శుక్రమును వదలెను. దివ్యమైన పరిమళము, శ్రేష్ఠమగు వాసన గల ఆ శుక్రమును జూచి మాహిష్మతి సఖులతో నేనీ నీరమును త్రావెద ననెను.

 

ఇట్లు పలికి ఆమె ముని వలన ఏర్పడిన ఆ శుక్రమును త్రావెను. ముని బీజము వలన గర్భము తాల్చెను. కుమారుని కనెను.

 

ఆమెకు కొడుకు పుట్టెను. అంతడు గొప్ప బుద్ధిశాలి. గొప్ప బలము, పరాక్రమము కలవాడు. బ్రహ్మ వంశమును పెంపొందించు వాడు. పేరు మహిషుడు. దేవీ! దేవ సైన్యమును పిండి గొట్టిన ఆతడు నిన్ను వరించు చున్నాడు.

 

అతడు దేవతలను యుద్ధమున గెలిచి మిక్కిలి ప్రీతి కలవాడై పుణ్యురాలా! నీకు మూడు లోకముల నొసగును. నీవును నిన్ను ఇచ్చు కొనుట ద్వారా, గొప్ప కృత్యమును ఆచరింపుము.

 

ఇట్లా దూత పలుకగా ఆ శోభన, ఆ పరమ దేవి నవ్వెను. ఏమియు పలుక కుండెను.

 

అట్లు నవ్వు చున్న ఆమె కడుపులో చరాచరాత్మక మయిన మూడు లోకములను ఆ క్షణమున ఆ దూత చూచెను. తల తిరిగి పోయెను.

 

అంత దేవి ప్రతీహారి జయ అను గొప్ప తేజశ్శాలిని సన్నని నడుము గలది, దేవి హృదయమున నున్న భావమును గూర్చి యిట్లు పలికెను.

 

 

కన్యను కోరువాడు పలుక వలసినది పలికితివి. కాని ఈయమ సర్వ కాలమునకు సంబంధించిన కౌమార వ్రతమును పట్టినది. అట్లే ఇక్కడి కన్య లందరు ఆమె అడుగు జాడలలో నడచు వారు కలరు.

 

వారిలో ఏ యొక్కతెయు మీకు లభింపదు. ఇక పరమ పవిత్ర యగు దేవి సంగతి చెప్పనేల? ఓయి దూతా! త్వరగా నీకిక్కడ ఏదో మూడక ముందే పొమ్ము.

 

ఇట్లు పలుకగా ఆ దూత వెడలి పోయెను. ఇంతలో మహా ముని నారదుడు పెద్దగా నృత్యము చేయుచు అచటకు వడివడిగా విచ్ఛేసెను.

 

భాగ్యము భాగ్య మనుచు ఆ శుభ లోచన యగు దేవిని గూర్చి పలుకుచు మంచి మన్నన గొన్నవాడై పరమాసనమును కూర్చుండెను.

 

ఆ మహా తాపసుడు సర్వేశ్వరియగు ఆ దేవికి ప్రణమిల్లి యిట్లు పలికెను. అమ్మా! దేవత లందరు ప్రీతి నంది నన్ను పంపగా నీకడకు వచ్చితిని.

 

దేవీ! మహిషుడను రక్కసునికి దేవత లందరు ఓడిరి. ఆ దైత్యరాజు నిన్ను చేపట్టుటకు ప్రయత్నము చేసి యున్నాడు.

 

మంచి మొగము గల ఓ తల్లీ! మహా దేవీ! దేవతలు నీకిది తెలుపు మని నన్ను పలికిరి. నీవు గట్టిగా నిలబడి ఆ రక్కసుని పరమార్పుము.

 

 

ఇట్లు పలికి నారదుడు వెను వెంటనే అంతర్ధానము చెంది యిచ్చ వచ్చిన చోటి కరిగెను. దేవియు ఆ కన్యల నందరను సిద్ధము కండని పలికెను.

 

అంత నా పుణ్యాత్మలగు కన్య లందరు దేవి ఆజ్ఞ వలన కత్తులు, డాళ్లు, విండ్లు చేత దాల్చి ఘోర రూపము కలవారై యుద్ధ మునకును, దైత్యుని రూపు మాపుటకును సిద్ధ పడిరి.

 

ఇంతలో ఆ రక్కసుని సైన్య మంతయు దేవ సేనను వదలి గొప్పది యగు స్త్రీ బలమున్న చోటికి పరుగున వచ్చెను.

 

గొప్ప ఆత్మ ధైర్యము గల ఆ కన్యలు రక్కసులతో పోరి క్షణములో వారి నాలుగు అంగములు గల సేన నంతటిని కూలవైచిరి.

 

అందు కొందరి తలలు పగిలి నేల గూలినవి. మరి కొందరి రొమ్ములను చీల్చి క్రూర మృగములు నెత్తురు త్రావినవి.

 

మరి కొందరు మొండెములు మాత్రము మిగిలిన దైత్య నాయకులు నృత్యములు గావించిరి. ఇంకను మిగిలిన వారందరు మహిషా సురుడున్న చోటికి పారిపోయిరి.

 

అపుడు పెద్దదియగు ఆ రాక్షస సేన హాహాకరములు చేసెను. ఈ గందర గోళమును చూచి మహిషుడు సేనాపతీ! ఇదేమి! నా ఎదుటనే నాసేన నాశన మాయెను? అని పలికెను.

 

అప్పుడు యజ్ఞహను రక్కసుడు ఏనుగు రూపము కలవాడు, ఆ కన్య లందరు ఈ సేనను సర్వ విధముల విరిచి ప్రోవులు పెట్టెనని పలకెను.

 

అంత మహిషుడు గద చేపట్టి చక్కని కనులు గల ఆ కన్నెల నందరిని మహా వేగముతో తరుముచు వచ్చెను.

 

దేవతలు, గంధర్వులు పూజించు చున్న ఆ దేవి ఉన్న చోటికే వాడు పరువెత్తుచు వచ్చెను. ఆమెయు నట్లు వచ్చి పడుచున్న రక్కసుని కని ఇరువది చేతులు కలది ఆయెను.

 

 

విల్లు, కత్తి, శక్తి, బాణములు, శూలము, గద, గొడ్డలి, డమరువు, పెద్ద ఘంట, శతఘ్ని, ఇనుప గుదియ, ఘోరమైన భుశుండి, ఈటె, రోకలి, చక్రము, భింది పాలము, దండము, పాశము, ధ్వజము, పద్మము అను ఈ ఇరువదింటిని చేతులతో పట్టుకొని సింహము నెక్కి చక్కగా కవచము మొదలగు వానిని ధరించి ఆ దేవి సంహార కారణుడు భయంకరుడు నగు రుద్రుని స్మరించెను.

అంత ఎద్దు ధ్వజముగా గల రుద్రుడు తనకు తానై అచటకు వచ్చెను. ఆమె అతనికి ప్రణమిల్లి యిట్లు విన్న వించెను. ఈ దైత్యుల నందరిని నేను గెలుతును.

 

దేవదేవా! సనాతనా! నీవు చేరువలో నున్న చాలును. అని పలికి ఆ అసురుల నందరిని ఆ పరమేశ్వరి గెలిచెను.

 

ఆ మహిషు నొక్కని వదలి తక్కిన మూక నంతటిని చంపివైచి వానిపై కురికెను. ఇంతలో వాడును ఆమెను గాంచి యామెవైపు దుమికెను.

 

ఒక్కయెడ ఆ దైత్య రాజు పోరాడును. కొండొకచో పారి పోవును, మరొక వేళ యుద్ధము చేయును. మరొక యెడ మాని వేయును.

 

ఇట్లు ఆమెతో పోరుచున్న ఆతనికి పదివేల దివ్య వత్సరములు గడచి పోయెను. బ్రహ్మాండ మంతయు బెదరు గుండెతో కదలి పోయెను.

 

అంత పెద్ద కాలమునకు శతశృంగ మహా పర్వతమున ఆ తల్లి పాదములతో నాక్రమించి ఆ ఘోర దైత్యుని శూలముతో పొడిచి చంపి వైచెను.

 

ఖడ్గముతో వాని తలను కోసి వైచెను. అట్లు దేవి ఆయుధము పడుట వలన ఆ మహిషునిలో నున్న ఒక పురుషుడు వాని దేహము నుండి వెలువడి స్వర్గమున కరిగెను.

 

అంత బ్రహ్మతో పాటు దేవత లందరు ఓడి చచ్చిన మహిషుని గాంచి సంతసించిన హృదయముతో దేవి నిట్లు స్తుతించిరి.

 

 

పూజ్యులారా! దేవీ! ఎరుగ నలవి కాని తత్త్వము కలదానా! భయంకరముగా కానవచ్చు ఓ దేవీ! జయము నందున్న తల్లీ! సిద్ధాంతమును నెలకొల్పు మాతా! మూడు కన్నుల దానా! అన్ని వైపుల ముఖములు గల ఓ అమ్మా! నీకు నమస్కారము.

 

అమ్మా! నీవు విద్యవు, అవిద్యవు, జయవు, పూజ్యవు, మహిషాసురుని మర్దించితివి. అంతట నుందువు. సర్వ దేవతలకు ఈశ్వరివి. విశ్వ మంతయు నీ రూపమే. ఓ విష్ణుశక్తీ! నీకు ప్రణతి.

 

నిన్ను శోకమంటదు. నీవు స్థిరమైన దానవు. తామర రేకుల వంటి చక్కని కన్నులు గల ఓ దేవీ! శుద్ధ సత్వ స్వరూపము గల వ్రతము నందున్న దానవు. చండ రూపము నీయది. రాత్రి రూపిణివి.

 

సంపదను, సిద్ధిని ఒసగుదువు. విద్యవు, అవిద్యవు, అమృత స్వరూపిణివి. మంగళ రూపవు, శంకర, విష్ణు, బ్రహ్మల శక్తులన్నియు కలదానవు. సర్వ లోకములు నీకు నమస్కరించును.

 

ఘంట హస్తమున గలదానవు. త్రిశూలము ఆయుధమైన దానవు. మహా మహిషుని మర్దించిన దానవు. ఉగ్రమగు రూపము గల దానవు. విరూపములగు కన్నులు కల దానవు. మహామాయవు. అమృతమును జాలువార్చు తల్లివి.

 

నీవు సర్వ జంతువులకు మేలు కూర్చు దానవు. సర్వ ప్రాణులు నీ స్వరూపమే అయిన దానవు. స్థిరమైన దానవు. విద్యలు, పురాణములు, శిల్పములు అను వానిని పుట్టించిన దానవు. సర్వ భూతములను పట్టి నిలుపు దానవు.

 

సర్వ దేవతల రహస్యములకు, సర్వ శక్తులు కలవారికి నీవే శరణము. దేవీ! విద్యయు, అవిద్యయు, సంపదయు, నీవే. నీవే తల్లివి. నీవు మూడు కన్నులతో విరూపాక్షివి. సహన స్వరూపిణివి. నీటి లోపలి శక్తి నీ స్వరూపమే. ఏ కలుషము లేని దానవు.

 

మహాదేవి! నీకు నమస్సు. పరమేశ్వరీ! నీకు ప్రణామము. సర్వ దేవతల భావము లందు నిత్యమై వెలయు తల్లీ! అక్షయా! అవ్యయా! నీకు మ్రొక్కులు.

 

పరమేశ్వరీ! దేవీ! ఘోరమగు యుద్ధముల కష్ట సమయములలో నిన్ను శరణు పొందిన వారికి ఏ కీడును కలుగదు.

 

పులి భయము, ఘోరమగు చోర భయము, రాజ భయము కలిగి నపుడు నిశ్చలమగు చిత్తముతో ఈ స్తోత్రమును పఠించు వాడును, బంధనమున నుండి నిన్ను తలచిన నరుడును ఆ అన్నింటి నుండి విముక్తుడై సుఖముతో జీవించును.

 

 

ఇట్లు దేవత లందరు చేతులు మోడ్చి స్తుతింపగా ఆ పరమ సుందరి దేవతలను గాంచి, మేలైన వరము కోరు కొనుడని పలికెను.

 

 

అమ్మా! పుణ్యాత్మా! ఈ స్తోత్రమును భక్తితో చదువు వారు అన్ని కామితములను పొందు వారగు నట్లు చేయుము. ఇదియే మాకు వరము.

 

అట్లే యగుగాక! అని పలికి ఆ పరాపరయగు దేవి తానచటనే నిలిచినదై దేవత లందరిని వారి వారి తావులకు పంపి వైచెను.

 

ఓ ధరిత్రీ! దేవి యీ రెండవ జన్మమును గూర్చి తెలిసి కొన్న వాడు శోకము లేనివాడు, రజో గుణమంటని వాడును అయి ఏ రోగము లేని పదమునకు చేరుకొనును.