వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము - 111

 

మహారాజా! ఇటుపై వరాహ దేవుడు భూదేవికి మునుపు చెప్పిన ఉభయ ముఖ్యములగు ధర్మములను చెప్పెదను. అది నీపుణ్య ఫలమును అగును. (ఉభయములు = పరము, ఇహము.)

 

 

ప్రభూ! నీవు మునుపు కపిలను సృజించితివి. ఆ హోమ ధేనువు ఎల్లవేళల పుణ్య అయినదిగా తెలియ దగినది. దానికెన్ని లక్షణములు?

 

ఓ జగద్గురూ! మాధవా! స్వయంభువు స్వయముగా ఎన్ని విధములగు కపిల గోవులను వక్కాణించెను? ఈను చున్న కపిలను దానము చేయుట వలన కలుగు పుణ్య మెట్టిది? దీనిని సవిస్తరముగా వినగోరు చున్నాను.

 

 

భద్రురాలా! తత్త్వ పూర్వకముగా చెప్పెదను. వినుము. ఇది పవిత్ర మైనది. పాపములను నశింప జేయునది. దీనిని విని సర్వ పాపముల నుండియు మానవుడు ముక్తుడగును. సంశయము లేదు.

 

వరాననా! అగ్ని హోత్రము కొరకును, యుజ్ఞము కొరకును సర్వ తేజస్సులను పైకి తెచ్చి బ్రహ్మను మునుపు కపిలను సృజించెను.

 

వసుంధరా! కపిల పవిత్రములలో పవిత్రము. మంగళము లలో మంగళము. పుణ్యములలో పుణ్యము.

 

తపస్సులలో మిన్నయగు తపస్సు, వ్రతములలో ఉత్తమమగు వ్రతము. దానములలో ఉత్తమమగు దానము. నిధులలో ఇది తరుగు పోనిది.

 

భూమి యందు గల సర్వ తీర్థములతో, అందరకు తెలియ రాకుండు పవిత్ర స్థలములతో, సర్వ పవిత్రములతో, సర్వ లోకముల పుణ్యములతో ఇది సాటి యగును.

 

బ్రాహ్మణులు సాయం కాలములలో ప్రాతః కాలములలో చేయు అగ్ని హోత్రములను కపిల గోవు నేతితో గాని పెరుగుతో గాని పాలతో గాని అర్చింప వలయును.

 

పెక్కు విధములగు మంత్రములతో ఎల్లవేళల అగ్ని హోత్రములను పూజించు వారును, మిక్కిలి భక్తితో అతిథులను అర్చించు వారును అగు ఉత్తమ బ్రాహ్మణులు సూర్యుని వంటి వన్నె కల విమానములతో విహరింతురు.

 

మునుపు బ్రహ్మ సూర్య మండలము నడుమ, గోరోచనము రంగు కన్నులు గలదియు, సర్వ సౌఖ్యములను ప్రసాదించు నదియు, సిద్ధి బుద్ధుల ననుగ్రహించు నదియు, అనంత రూపములు గలది యునునగు కపిల ధేనువును నిర్మించెను.

 

వరాననా! ఈ కపిలలు పదునొకండు విధములు. ఇవి యన్నియు గొప్ప మహిమ కలవి. తరింప జేయునవి. సంశయము లేదు. నదీ సంగమములలో దానములకు ప్రశస్తము లయినవి. పాపముల నన్నింటిని పోకార్చునవి.

 

అగ్ని పుచ్ఛ (అగ్ని వంటి తోక కలది.) అగ్ని ముఖ (అగ్ని వంటి ముఖము కలది.) అగ్ని లోను (అగ్ని వంటి వెంట్రుకలు కలది), అనల ప్రభ (అగ్ని వంటి కాంతి గలది) ఆగ్నేయి (అగ్ని లక్షణములు కలది) సువర్ణాఖ్య (బంగారు వంటి వన్నె కలది.) అని కపిలలో పెక్కు విధము లైనవి కలవు.

 

కపిలను కైకొని ఇష్టము వచ్చినట్లు పాలు పిండుకొని త్రావు శూద్రుడు ద్విజు లందరకు పనికి రానివాడు. అతడు చండాల సదృశుడు.

 

కావున శూద్రుని నుండి విప్రుడు కపిల గోవులను దానము పుచ్చుకొన రాదు. వానిని కుక్కలను వలె దూరముగా తొలగించ వలయును.

 

ఆ విధముగా కపిలలను పీకుకొని బ్రదుకు పాపకర్ములగు శూద్రులను సర్వ సమయములలో విడిచి పెట్టవలయును. వారితో మాటాడ రాదు. వారి నుండి దానములు కొనరాదు.

 

కపిలా క్షీరమును ఎంత కాలము త్రావుదురో అంత కాలము వారి తాతలు పురుగులై మట్టి మలమును తిను చుందురు.

 

కపిల గోవుల పాలు, నెయ్యి, వెన్న అను వానితో జీవనము పుచ్చు వారి గతి యెట్టిదో వినుము.

 

కపిల గోవులపై ఆధార పడి బ్రదుకు వారు క్రూరులై రౌరవ నరకమున కరుగుదురు. అందు నూరు కోట్ల ఏండ్లు పాతక మనుభవింతురు.

 

కొంత కాలమునకు దాని నుండి విముక్తులై కుక్క కడుపున కరుగుదురు. అటుపై బురదలో పురుగై పుట్టుదురు.

 

మల స్థానములలో పరమ దుర్వాసన గలచోట పాపిష్ఠులు పుట్టు చుందురు. నాశము పొందు చుందురు.

 

విద్వాంసుడగు బ్రాహ్మణు డిట్టి వారి నుండి దానము పుచ్చు కొన్నచో అది మొదలు మలముతుదిగా గల నరకములలో వాని పితరులు పడి యుందురు.

 

అట్టి విప్రునితో ఎవ్వడు పలుక రాదు. ఒక ఆసనముపై కూర్చుండ రాదు. వాడు యజ్ఞమున దూరముగా విడువ దగిన వాడు.

 

ఒకవేళ మాటాడినచో, ఒక ఆసనమున కూర్చున్నచో ప్రయత్నముతో ప్రాజాపత్యమను ప్రాయశ్చిత్తమును చేసి కొనవలయును. అప్పుడా ద్విజుడు శుద్ధుడగును.

 

ఒక కపిలను దానము చేయుట వేయి రెట్లు ఫలితమును నింపును. కోట్ల కొలదిగా విస్తరించిన అనేక దానముల సంగతి చెప్పనేల?

 

వేదము చక్కగా చదువు కొన్నవాడు, దరిద్రుడు, మంచి నడవడి కలవాడు, అగ్ని హోత్రములను నిత్యము అర్చించు వాడు అగు బ్రాహ్మణునకు ఈనమోసిన కపిల ధేనువుని రక్షించి, ఈను చుండగా దాన మీవలయును.

 

బిడ్డ పుట్టు చుండగా ముఖము యోని యందు కన్పడు చుండగా ఇంకను గర్భమును పూర్తిగా వదలక ముందు, అట్టి ఆవును పృథివిగా తెలియ దగును.

 

కపిల గోవును దాన మొసగువారు, దూడతో పాటు ఆ ఆవునకు ఎన్ని రోమములు కలవో, ఆ గర్భపు నీటి కంటుకొని ఎన్ని ధూళి కణములు కలవో అన్ని కోట్ల వర్షములు బ్రహ్మవేత్తలు కొలుచు చుండగా బ్రహ్మ లోకమున నివసింతురు.

 

బంగారు కొమ్ములు, వెండి గిట్టలు గల కపిల ధేనువును సువర్ణము గాని వెండిని గాని దక్షిణగా ఇచ్చి తోక దగ్గర నీటిని వదలి దానము చేయు చున్నానని పలుక వలయును. అట్టివాడు సముద్రముతో వనములతో కొండలతో అడవులతో కూడినదియు, రత్నములతో నిండి నదియు అగు భూమిని దానము చేసిన వాడగును. ఇందు సంశయము లేదు.

 

భూదానముతో సమానమగు ఈ దానముతో నరుడు ఆనంద మొంది తన పితృ దేవతలతో పాటు విష్ణువు అను పేరు గల పరమ పదమున కరుగును.

 

బ్రాహ్మణుని సొమ్ము దొంగిలించిన వాడు, గోవును చంపిన వాడు, భ్రూణ హత్య చేసిన వాడు (భ్రూణము= గర్భము లోని శిశువు) కొంపలు తగుల బెట్టిన వాడు, మహా పాతకములు చేసిన వాడు, వంచకుడు, బ్రహ్మ జ్ఞానులను నిందించు వాడు, ధర్మమును దూషించు వాడు ఇట్టి వారందరు కపిల గోవు దానము చేత శుద్ధి పొందుదురు.

 

‘ఉభయ ముఖి’ అని ప్రసిద్ధి గల కపిలను గొప్ప ధనముతో కూడిన దానిని దాన మొసగు వాడు ఆ దినమున పాయసము గాని పాలు గాని ఆహారముగా కొని ఉండ వలయును. (ఉభయ ముఖి - ఈనుచున్న ఆవు)

 

వేయి కాసులు గాని, అందు సగము గాని, దానిలో సగము గాని, నూరు గాని, ఏబది గాని, దానిలో సగము గాని దక్షిణగా ఒసగ వలయును. విత్తము విషయమున వంచన పనికి రాదు.

 

ఈ కపిల ధేనువును గ్రహింపుము. నన్ను భయము నుండి కాపాడుము. వంశము వృద్ధి పొందుటకై ఈ దానము చేయు చున్నాను. నాకు శుభమును కల్పింపుము అని దాత పలుక వలయును

 

ధేనూ! కుటుంబము కొరకు ప్రత్యేకించి నిన్ను గ్రహించు చున్నాను. రుద్రాంగా! నీకు స్వస్తియగు గాక! నమస్కారము! (రుద్రాంగ = రుద్రుని అంగము అయినది.)

 

‘‘ఓంద్యౌస్త్వా దదతు’’ మొదలగు మంత్రములను, ‘కోదదాద్‌’ మొదలగు మంత్రములను పఠించి గ్రహించు వాడు దానమును కైకొన వలయును. తరువాత దాత ఆ బ్రాహ్మణుని ఇంటికి పంపి ఆవును ఆతని యింటికి చేర్ప వలయును.

 

ఇట్లు ఈనుచున్న ఆవును ఇచ్చు వాడు, ఏడు ద్వీపములతో కూడిన భూమి నంతటిని ఇచ్చిన వాడగును. సంశయము లేదు.

 

చంద్రునితో సమానమగు ముఖము కలవారు, బాగుగా కరగిన బంగారు వంటి వన్నె కలవారును, గొప్ప ఖడ్గముల వంటి వాడియగు తత్వము కలవారును, సన్నని గుండ్రని నడుములు గల వారును, నిత్య జాగరూకత కలవారును అగు దేవులు అతనిని ఎల్లవేళల సేవించుచు తిరుగు చుందురు.

 

ఉదయమున లేచి భక్తుడు ఈ ధేను కల్పమును ఇంద్రియ నిగ్రహము కలవాడై పవిత్రుడై చదివినచో, మూడు మారులు గోవునకు ప్రదక్షిణము చేసినచో సంవత్సరము కాలము అతడు చేసిన పాపము ఆ క్షణములో, గాలికి దుమ్ము కొట్టుకొని పోయినట్లు, నశించును.

 

పవిత్రము, ఉత్తమము అగు ధేను కల్పమును శ్రాద్ధ కాలమున పఠించినచో చక్కగా సంస్కారము పొందిన ఆ అన్నమును పితృ దేవతలు ప్రీతితో భుజింతురు.

 

అమావాస్య నాడు బ్రాహ్మణుల ముందు దీనిని పఠించినచో ఆతని పితృ దేవతలు నూరేండ్లు తృప్తి పడుదురు.

 

దీనిని శ్రద్ధతో నిత్యము విను వానికిని ఏడాది చేసిన పాపము ఆ క్షణమున నశించును.

 

రాజా! శ్రీవరాహ దేవుడు భూదేవికి చెప్పిన రహస్యము, పురాతనము అయిన ఈ ధేను మాహాత్మ్యమును, నేను నీకు సర్వమును సర్వ పాపములను పోగొట్టు దానిని చెప్పితిని.

 

మాఘ మాసము శుక్లపక్ష ద్వాదశి యందు తిలధేనువు నిచ్చువాడు నిండిన కోరిక లన్నింటితో సమృద్ధమైన విష్ణు పదమును పొందును.

 

శ్రావణ మాసమున శుక్ల పక్ష ద్వాదశి తిథి యందు సువర్ణముతో పాటు నిజమైన గోవును దానమీ వలయును.

 

ఎప్పుడైనను అన్ని విధములైన గోవులను దానము చేయుట సర్వ పాపములను అణచు నట్టిది. భుక్తిని ముక్తిని ప్రసాదించు నట్టిది.

 

ఈ సర్వము బహు విస్తరముగా ఒక్క రూపమున నీకు చెప్పితిని. లోక కర్తయగు బ్రహ్మ దీనికి అపారమైన ఫలమును నిర్ణయించెను.

 

రాజా! నీవు ఆకలితో మిక్కిలిగా పీడనొందు చున్నావు. ఇప్పుడు కార్తికము నడచు చున్నది. కావున ఇప్పుడు నీవు దానము చేయుము.

 

ఈ బ్రహ్మండము భూతములతో రత్నములతో, ఓషధులతో, దేవ దానవ యక్షులతో కూడి ఎల్లవేళల సర్వ సంపదలు కలిగి యున్నది.

 

దీనిని సువర్ణ మయముగా, అన్ని బీజములతో కూడి నదిగా చేసి రత్నములతో పాటు కార్తిక ద్వాదశి నాడు, లేదా పూర్ణిమ నాడు భక్తితో గురువైన పురోహితునకు సమర్పింప వలయును.

 

అట్లు చేసిన వాడు బ్రహ్మాండము కడుపులో నున్న భూతము లన్నింటిని దానము చేసిన వాడగును, సంగ్రహముగా చెప్పితిని.

 

వేల కొలది మేలైన దక్షిణలతో యజ్ఞములు చేయు వాడును బ్రహ్మాండములో ఒక భాగమును మాత్రమే ఇచ్చిన వాడగును.

 

ఇక ఈ సమస్తమైన బ్రహ్మాండమును అర్చించు నరుడు యజించుట, హోమము, దానము, అధ్యయనము, కీర్తనము చేసినవాడే యగును.

 

ఇది విని రాజు హేమ కుంభమును బ్రహ్మాండముగా కల్పించి విధి పూర్వకముగా దానిని ఋషి కర్పించెను.

 

నిండిన సర్వమైన కోరికలు కలవాడై ఆ రాజు స్వర్గమున కరిగెను. కావున ఓ రాజేంద్రా! నీవును అది యిచ్చి సుఖము కలవాడ వగుము.

 

వసిష్ఠు డిట్లు పలుకగా ఆ రాజు అట్లే కావించెను. దుఃఖము లేని పరమ సిద్ధ పదమునకు ఏగెను.

 

ఓ వరారోహా! అన్ని కోరికలను తీర్చు ఈ వరాహ సంహిత అను పేరుగల దానిని నీకు చెప్పితిని. ఇది సర్వ పాతకములను నాశనము చేయునది.

 

ఇది మొదట సర్వజ్ఞుడగు పరమేశ్వరుని నుండి బయలు దేరినది. అతని వలన బ్రహ్మ తెలిసి కొనెను. అతడు తన కుమారుడు మహాత్ముడునగు పులస్త్యున కొసగెను. పులస్త్యుడు మహాత్ముడగు భార్గవునకు ఇచ్చెను.

 

అతడును తన శిష్యుడగు ఉగ్రున కొసగెను. అతడు ముని కిచ్చెను. ఈ పరంపర ఇట్లుగా చెప్ప బడినది.

 

ఇది పూర్వ కల్పమున చెప్ప బడిన సంబంధము. ఇప్పుడు రెండవ సంబంధమును వినుము. నేను సర్వజ్ఞుని వలన పొందితిని. నా నుండి నీవు గ్రహించితివి.

 

నీ నుండియు తపస్సుతో కూడిన కపిలుడు మున్నగు వారు తెలిసి కొందురు. క్రమముగా వ్యాసుని వలన ఇది లోకమునకు తెలియ గలదు.

 

రోమ హర్షణుడను వాడు అతనికి శిష్యుడగును. అతడు దీనిని యథాతథముగా శౌనకునకు చెప్పెను.

 

ద్వైపాయనుడను గురువు పదు నెనిమిది పురాణము లెరిగిన వాడు. బ్రాహ్మము, పాద్మము, వైష్ణవము, శైవము, భాగవతము, నారదీయము, మార్కండేయము, అగ్నేయము, భవిష్యము, బ్రహ్మ వైవర్తనము, లైంగము, వారాహము, స్కాందము, వామనము, కౌర్మము, మాత్స్యము, గారుడము, బ్రహ్మాండము అనునవి అష్టాదశ పురాణములు.

 

భూదేవీ! కార్తిక ద్వాదశి నాడు భక్తితో దీనిని నిర్వహించు వాడు అపుత్రు డైనను తప్పక పుత్రుని పొందును.

 

భూదేవీ! ఎవని యింట ఈ సంహిత వ్రాయ బడునో పూజింప బడునో ఆ యింట నారాయణ దేవుడు స్వయముగా నిలిచి యుండును.

 

ఈ శాస్త్రమును వదలక భక్తితో చదువు వాడు, విని పూజించు వాడును సనాతనుడగు విష్ణువును పూజించు వాడగును.

 

ధరాదేవీ! గంధములతో, పూవులతో, వస్త్రములతో, బ్రాహ్మణ సంతర్పణలతో శక్తి ననుసరించి గ్రామములతో రాజు వాచకుని పూజింప వలయును.

 

ఈ వరాహమను పేరు గల శాస్త్రమును చదివి పూజించు మానవుడు పాపము లన్నింటి నుండి పూర్తిగా విముక్తి పొంది విష్ణు సాయుజ్యమును పొందును.