వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము - 98

 

అవ్యక్తము వలన జన్మించిన బ్రహ్మ శరీరము నుండి వెలువడిన ఆ మాయ గాయత్రి ఎనిమిది భుజములు గలదియై వైత్రాసురునితో పోరాడెను. ఆమెయే దేవ కార్యమును చేయ గోరినది యైనది. బ్రహ్మ మాట మేరకు మహిషుడను రాక్షసుని వధ చేయ నున్నది. విష్ణు మాయచే అతడు చచ్చెను. ఇది యెట్లు? ప్రభూ! నాకు చెప్పుము.

 

 

ఇట్లు జగములకు మేలు కోరిన ఈ దేవి శంకరుని ప్రియురాలు గంగయు నగును, ఏది ఎప్పుడు ఎట్లు జరుగ వలయునో తెలిసిన వాడు అన్నియు తెలిసిన పరమాత్మయే.

 

స్వాయంభువ మన్వంతరమున మందర గిరియందు వైష్ణవి మహిషుడను రక్కసుని చంపెను. తరువాత మరియొక మహిషుడు కలడు అతడు వైత్రాసురుడు. మహాబల పరాక్రమ ములు గల ఆతడు వింధ్యమున నంద చేత చచ్చెను.

 

లేదా! ఆ తల్లి జ్ఞానశక్తి, మహిషుడు అజ్ఞానము రూపు కట్టిన వాడు. అజ్ఞానము జ్ఞానము చేతనే రూపు మాయు ననుట చేతను సంశయము లేకుండును.

 

మూర్తి పక్షమున ఇతి హాసము. మూర్తి సంభావన లేనిచో అమెను ఒక స్వరూపముతో హృదయమున సంభావింప వలయును. వేద పండితులు వేద వాక్యములతో దీనిని చక్కగా తెలియ జెప్పుదురు.

 

దేవీ! ఇప్పుడు వినుము. దేవదేవుడగు విష్ణువు పూజ అయిదు మహా పాతకములను నశింప జేయునదియు, పుత్రులను, ధనమును ప్రసాదించు నదియు కలదు. దానిని చెప్పెదను.

 

ఈ జన్మమున లేమి, రోగము, కుష్ఠు మొదలగు వాని చేత పీడ నొందిన వాడు, సంపదలు, పుత్రులు లేని వాడునగు నరుడు మండలము నందు దేవితో పాటుగా ఉన్న దేవుని చూచి వెను వెంటనే సంపదను, ఆయువును, ధనమును, కుమారుని, సుఖమును పొందును.

 

విధానము ననుసరించి తొమ్మిది బొడ్డులు గలదియో పదునారు గాని ఎనిమిది గాని దళములు కలదియో అగు మండలమున పూజ నొందిన వాడు, మంత్రములే ఆకారమైన వాడును, తల్లి కడుపున పుట్టని వాడును అగు పరదైవము నారాయణుని ఆచార్యుడు చూపగా చూచిన వాడు, విశేషించి కార్తిక మాసమున శుక్ల పక్షమున ద్వాదశి నాడు గాని లేదా అన్ని నెలలో ద్వాదశుల యందు గాని, సంక్రాంతి దినమున గాని, సూర్య చంద్రుల గ్రహణ దినము లందు గాని గురువు ద్వారమున అర్చలు గొన్న పరమ దైవము నారాయణుని దర్శించిన వాడు పరమానంద మందును. వాని పాపము లన్నియు పటా పంచ లగును.

 

గురువు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అను భక్తుల పరీక్షను జాతిని బట్టియు, శుద్ధిని బట్టియు, పనులను బట్టియు నొక్క సంవత్సరము చేయ వలయును.

 

అట్లు తన కడకు వచ్చిన వారిని చక్కగా పరీక్షించి తెలిసి కొని గురువు వారిని ఎదకు హత్తుకొన వలయును. వారును భక్తి కలవారై సంవత్సర కాలము గురువును పరమేశ్వరునిగా భావించి విష్ణువునకు వలె చపలత లేని విధముగా భక్తి చేయ వలయును. ఏడు ముగిసిన పిదప గురువును చేసికొన వలయును.

 

పూజ్యుడా! తపోధనా! నీ దయచేత సంసార సముద్రమును దాటుటను, ఇహ లోకపు భాగ్యమును కోరు చున్నాము.

 

తెలివి గలవాడు గురువును ఎదుట నున్న విష్ణువునుగా చక్కగా ఇట్లు పూజింప వలయును. గురువు కూడ వారట్లు కొలువగా కార్తిక మాసము దశమి నాడు పరమేష్ఠి మంత్రమును జపించుచు మర్రిచెట్టు పాలను పుచ్చుకొని దేవదేవుని సన్నిధి యందు నిదురింప వలయును.

 

మరియు భక్తుడు వివేకముతో గురువు ముందు తాను గాంచిన కలలను గూర్చి విన్నవింప వలయును. గురువు అందలి శుభమును, అశుభమును తెలియ జెప్ప వలయును.

 

ఏకాదశి నాడు ఉపవాస ముండి స్నానము చేసి దేవాలయమున కరుగ వలయును. గురువు చక్కగా తీర్చి దిద్దిన భూమి యందు మండలమును కూర్ప వలయును.

 

వేరువేరు శుభ లక్షణములతో భూమిని చక్కగా అలంకరించి పదునారు అరలు గల చక్రమును గాని, తొమ్మిది బొడిపెలు గల మండలము గాని గీయ వలయును.

 

లేదా ఎనిమిది రేకుల పద్మము వంటి మండలము నైన వ్రాసి చూప వలయును. ప్రయత్నముతో తెల్లని వస్త్రముతో భక్తులకు నేత్ర బంధము చేయ వలెను. తరువాత వారివారి వర్ణముల క్రమము నను సరించి పూవులు చేత దాల్చిన శిష్యులను ప్రవేశపెట్ట వలయును.

 

 

రంగులతో తొమ్మిది బొడిపెల మండలము చేసినపుడు గురువు తూర్పు దిక్కున ఇంద్రుని నిలిపి పూజింప వలయును.

 

లోకపాలుర నందరిని ఇట్లు వారి దిక్కుల యందు నిలుప వలయును. అగ్నిని ఆగ్నేయము నందు, యముని దక్షిణము నందు, నిరృతిని నైరృతి యందు, వరుణుని దక్షిణము నందు, వాయువును వాయవ్యము నందు, కుబేరుని ఉత్తరము నందు, రుద్రుని ఈశాన్యము నందు నిలిపి పూజింప వలయును.

 

ఈ విధముగా శాస్త్రము ననుసరించి ఆయా దిక్కల క్షేత్రములలో దిక్పాలురను పూజించి పద్మము నడుమ పరమేశ్వరుడగు విష్ణువును పూజింప వలయును.

 

తూర్పురేకున బలరాముని, దక్షిణపు ఆకున ప్రద్యుమ్నుని, పడమటి రేకున అనిరుద్ధుని, ఉత్తరమున సర్వపాతకము లను అణచి వేయు వాసుదేవుని నిలిపి పూజింప వలయును.

 

ఈశాన్యమున శంఖమును, ఆగ్నేయమున చక్రమును, దక్షిణమున గదను, వాయవ్యమున పద్మమును, ఈశానదిక్కున రోకలిని, దక్షిణమున గరుడుని పూజింప వలయును. దేవదేవునికి వెనుక వైపుగా లక్ష్మిని నిలుప వలయును.

 

ధనుస్సును ఖడ్గమును దేవుని ముందు భాగమున నిలుప వలయును. శ్రీవత్సమును, కౌస్తుభమును కూడ దేవుని ముందుంచి పూజింప వలయును.

 

ఇట్లు పద్ధతి ప్రకారము దేవదేవుడగు జనార్దనుని పూజించి దిక్కు లందలి మండలములలో ఎనిమిది కుంభములను పద్ధతి ననుసరించి ఉంచ వలయును. మరియు విష్ణు సంబంధమైన తొమ్మిదవ కలశము నొక దానిని కూడ ఉంచ వలయును. ముక్తిని కోరుచు వైష్ణవ ఘటముతో దేవుని అభిషేకింప వలయును.

 

సంపద యందు కోరికతో ఇంద్రఘటము తోడను, వస్తువులు ప్రతాపము కోరువాడు ఆగ్రేయ ఘటము తోడను అభిషేకము చేయ వలయును.

 

మృత్యువును గెలుచు పద్ధతి కొరకు దక్షిణదిక్కు కలశము తోడను, దుష్టులను రూపుమాపు కోరికతో నైరృతమగు కలశము తోడను స్నానము చేయింప వలయును.

 

శాంతికై దక్షిణ కలశము తోడను, పాపములు నశించుటకై వాయవ్య కలశము తోడను, ద్రవ్య సంపత్తి వాంఛ కలవాడు ఉత్తర కలశము తోడను అభిషేకము చేయ వలయును.

 

ఈశాన దిక్కు కలశముతో జ్ఞాన సంపదకై స్నానము చేయింప వలయును. ఇవి లోకపాలుర ఘటములు. ఒక్కొక్క కలశముతో నరుడు స్నానము చేసినను సర్వ పాపములను పోగొట్టు కొనును. అడ్డులేని జ్ఞానమును సంపదను విప్రుడు వివేకము కలవాడు పొందును. ఇంక తొమ్మిది కలశములతో స్నానము చేసినచో చెప్ప నేల? పాతకము లన్నియు వానికి నశించును.

 

మరియు విష్ణు వంతటి వాడగును. లేదా వెను వెంటనే రాజగును.

అట్లుకాక సంఖ్య ననుసరించి అన్ని దిక్కుల యందును తన శాస్త్ర విధానమును బట్టి లోక పాలురను పూజింప వలయును.

ఇట్లు ప్రసన్న మగుబుద్ధి కలవాడై లోకపాలురగు దేవులను చక్కగా పూజించి తరువాత కన్నులకు గుడ్డ కట్టుకొన్న శిష్యులను ప్రదక్షిణముగా ప్రవేశపెట్ట వలయును.

 

అగ్ని తేజస్సు తాల్చినవి, కాలినవి. వాయువు చేత విసర బడినవి, సోమ రసము చేత తృప్తి నందినవి అగు సమయములను (ప్రతిజ్ఞలను) పండితుడగు ఆచార్యుడు శిష్యులకు వినిపింప వలయును.

 

బ్రాహ్మణులు వేదములు నిందింప రానివి. బ్రాహ్మణుడు విష్ణువే, రుద్రుని, ఆదిత్యుని, అగ్నిని, లోక పాలురను, గ్రహములను గురువులను, విష్ణు భక్తులను, మునుపు దీక్షగొన్న పురుషుని నిందిపను అని ప్రతిజ్ఞ చేయించి తరువాత హోమ కార్యమును చేయింప వలయును.

 

శిష్యుని దేహము నందున్న తత్త్వములను (పంచ భూతములు మొదలగు వానిని) శుద్ధిచేయ వలయును. “ఓం నమోభగవతే సర్వ రూపిణే హుంఫట్‌ స్వాహా” అను పదునారక్షరముల మంత్రముతో జ్వలించు చున్న అగ్ని యందు హోమము చేయింప వలయును.

 

గర్భాధానము మొదలగు సంస్కారములను మూడు మూడు ఆహుతులతో దేవదేవుని సన్నిధి యందు కావింప వలయును.

 

హోమము మగిసిన పిదప దీక్షగొన్న రాజు గురు దక్షిణగా ఏనుగులు, గుఱ్ఱములు, వలయములు, సువర్ణములు, అగ్రహారములు మొదలగు వాని నొసగ వలయును.

 

బుద్ధిశాలి యగు మధ్యముడు (ఎక్కువ ధన సంపదలేని వాడు) మధ్య విధమగు గురు దక్షిణను ఒసగ వలయును. ఇతరుడు (సామాన్యుడు) కొంచెము పాటి సువర్ణముతో ఏదైన తనకు కల దానిని జంటగా నొసగ వలయును.

 

ధరాదేవీ! ఇట్లు చేయగా కలుగు పుణ్యము మహిమను నూరుల ఏండ్లు వర్ణించినను తీరదు.

 

ముందు దీక్షితాత్ముడై వరాహ పురాణమును వినునేని వానికి వేదములు పురాణములు, అన్ని మంత్రములును చేతికి చిక్కినట్లే.

 

పుష్కర తీర్థము నందును, ప్రయాగ యందును, సింధు సాగరము నందును, దేవనిలయ మగు కురుక్షేత్రము నందును, విశేషించి వారాణసి యందును, గ్రహణ కాలమునను, విషువము నందును జపించు వారికి ఏ పుణ్యము కలుగునో దానికి రెట్టింపు ఫలము దీక్షితుడై ఈ వరాహ పురాణము విన్నవానికి కలుగును. (విఘవము = రాత్రింబవళ్లు సమానముగా ఉన్న దినము).

 

దేవతలు కూడ తపము చేసి ధ్యానింతురు. మేము భారత వర్షమున ఎప్పుడు పుట్టుదుమో, దీక్షితులమై ఎప్పుడు వరాహ పురాణమును విందుమో, అని పలుకు చుందురు.

 

పదునారు విభాగములు గల వరాహ పురాణమును వినుచు ఎప్పుడు దేహమును వదలి మరల పుట్టుకలేని పరమ స్థానమును పొందుదుమో కదా! అని ధ్యానించు చుందురు.

 

ఓ భూదేవీ! మేము కార్తిక మాసమున ఎప్పుడు వరాహ యాగము చూతుమో! అని విబుధులు పలుకు చుందురు. మనసున చింతించు చుందురు.

 

ఓ భూత ధారిణీ! నేను నీకు ఈ యాగ విధానమును చెప్పితిని. ఇది దేవతలకు, గంధర్వులకు, యక్షులకు అన్ని వేళలందును దుర్లభ మైనది.

 

 

దేవీ! దీనిని తత్త్వముతో ఎరిగిన వాడు, మండలమును తత్త్వ పూర్వకముగా దర్శించు కొనువాడు, ఈ విధానమును తత్వముతో వినువాడు, ఈ అందరును ముక్తులని వేదము చెప్పుచున్నది.

 

 

దేవా! ఈ ద్వాదశుల ఫలమును నీవు చెప్పితివే దానిని అల్పమగు ఆయువు గల మనుష్యులు, పొంద జాలరు.

 

తక్కువ శ్రమతో ఒక సంవత్సరము కాలము ఉపవాస ముండి మహా ఫలమును పొందు మార్గమును నాకు తెలియ జెప్పుము.

 

 

దేవీ! ఈ యర్థమునే ముందు గొప్పకీర్తి గల శ్వేతుడను రాజు స్వర్గమున గొప్ప ఆకలికి పీడనొంది వసిష్ఠుని అడిగెను.

 

ఇలావృత వర్షమున దొడ్డబుద్ధి కల శ్వేతుడను రాజుండెను. ఆతడు పత్తనములతో, తోటలతో, చెట్లతో కూడిన సమస్త భూమిని. భగవంతుడా! బ్రాహ్మణులకు ఒసగ గోరుచున్నాను. నాకనుమతి నిమ్ము, అని వసిష్ఠునితో పలికెను. అపుడు వసిష్ఠుడు ఆరాజు సత్తమునితో ఇట్లనెను.

 

రాజా! అన్నదానము సర్వకాలము లందును సుఖమును కలిగించునది. అన్న మొసగినచో భూతలమున ఈబడనిది ఏముండును?

 

అన్ని దానములలో అన్నదానము మిన్న. అన్నము వలననే సర్వ ప్రాణులును పుట్టు చున్నవి. అన్నము చేతనే వృద్ధి పొందు చున్నవి.

 

అందువలన సర్వ ప్రయత్నముతో రాజా! అన్నము ఇమ్ము.

 

రాజామాటను లెక్క చేయక వసిష్ఠునితో ఇట్లనెను. నీ అన్నమిది, ఏమి ఒక గొప్ప దానమిచ్చు వస్తువా? చెప్పు.

 

అని రత్నములను, వస్త్రములను, అలంకారములను, నగరములను, ఏనుగులను, మృగ చర్మములను ఆ శ్రీమంతుడు బ్రాహ్మణుల కిచ్చు చుండెను.

 

అంత గొప్ప ధర్మవేత్తయగు ఆరాజు భూమి నంతటిని జయించి పురోహితుడు తాపస శ్రేష్ఠుడగు వసిష్ఠునితో భగవానుడా! వేయి అశ్వమేధములను చేయగోరు చున్నాను. అని పలికెను.

 

బంగారు కాసులు, రత్నములు, వెండి వస్తువులు మొదలగు వానిని యజ్ఞము చేసి ఆ రాజు బ్రహ్మణులకు దాన మొసగెను. కాని తక్కువ వస్తువని తలచి అన్నమును గాని నీటిని గాని ఒసగ లేదు.

 

ఇట్లు గొప్ప విభవము గల మహాత్ముడగు ఆ రాజునకు కాలధర్మ వశమున మృత్యువు సంప్రాప్తించెను.

 

దప్పి ఆకలి అనునవి బాధింపగా ఆ రాజవరుడు అప్సరసల నివాసమగు శ్వేతమను పర్వతమున కరిగెను. పరలోకమున తిరుగుచు దొడ్డ బుద్ధిగల ఆ రాజు ఆకలి దప్పులచే పీడ నొందెను.

 

అందాతని వెనుకటి జన్మపు మూర్తి కాలినదై యుండెను. ఆ రాజు దాని ఎముకలను ప్రోగు చేసికొని నాకుచు నుండెను. మరల విమాన మెక్కి స్వర్గమున కరిగెను.

 

అంత పెద్ద కాలమునకు చక్కగా చేసిన వ్రతములు గల ఆ రాజు ఎముకలను నాకుచు మహాత్ముడగు వసిష్ఠునకు కాన వచ్చెను. వసిష్ఠుడు: ఇదియేమి? రాజా! నీ ఎముకనే తిను చున్నావు? అని అడిగెను.

 

ఇట్లు మహర్షి యగు వసిష్ఠుడు పలుకగా శ్వేత మహారాజు ఆమునితో ఇట్లు పలికెను.

 

స్వామీ! ఆకలితో నున్నాడను. మునుపు నేను అన్న పానముల నొసగ లేదు. అందుకై నా ఆకలి దారుణమైనది.

 

రాజిట్లనగా ముని పుంగవుడగు వసిష్టుడు ఆ మహారాజు శ్వేతునితో మరల ఇట్లు పలికెను.

 

రాజా! విశేషముగా ఆకలి గొన్న నీకేమి చేయుదును? దాన మోసగనిది ఎవ్వనికి ఏదియు మేలైనది లభింపదు.

 

రత్నములు, బంగారము దాన మొసగుట చేత నరుడు భోగముల కలవాడగును. అన్నము నొసగుట చేత అన్ని కామములతో తృప్తికల వాడగును. రాజా! అదియెంత దానమును కొని నీవు అన్నదానము చేయవైతివి.

 

 

మహామునీ! భక్తి నిండిన తలతో నిన్నడుగు చున్నాను. దాన మొసగనిది పొందుట యెట్లో నాకు తెలియె జెప్పుము.

 

 

రాజా! దానికొక దారి యున్నది. సంశయము లేదు. చెప్పు చున్నాను. వినుము.

 

పూర్వ కల్పమున వినీతాశ్వుడను రాజొ కడుండెను. ఆతడు సర్వ మేధమను ఉత్తమ యజ్ఞ మును ఆరంభించెను.

 

యజ్ఞము చేయుచు ఆతడును విప్రులకు గోవులను, ఏనుగులను, ధనములను ఒసగెను కాని అన్నము తక్కువది అని నీవలెనే భావించి ఒసగ కుండెను.

 

సార్వ భౌముడు, మహారాజునగు ఆ వినీతాశ్వుడు పుణ్యము చేసి నీవలెనే స్వర్గమున కరిగెను.

 

అతడును ఆకలి పైకొనగా నీవలెనే మానవ లోకమున గంగా నది ఒడ్డున నీల పర్వతమున కరిగెను.

 

సూర్యుని వలె ప్రకాశించు చున్న విమానముతో దేవుని వలెనున్న ఆ రాజు ఆకలి కొన్నవాడై తన శవమును చూచెను.

 

తన పురోహితుడు హోతయను వానిని ఆ గంగ ఒడ్డున ఆరాజు చూచెను. ఆతడును ఆముని సత్తముని నా ఆకలికి కారణ మేమి? అని యడిగెను. ఆ హోత అతనితో నిట్లనెను.

 

రాజా! నీవు వెంటనే తిల ధేనువు, జలధేనువు, ఘృత ధేనువు, దధి ధేనువు, రస ధేనువు అను వానిని దాన మొసగుము. దానితో నీ ఆకలి నిన్ను వదలును. సూర్య చంద్రులు ప్రకాశించు చున్నంత వరకు ఆకలి నిన్ను దరిజేరదు.

 

ఇట్లతడు పలుకగా రాజాతనిని తిల ధేనువు విధానమును గూర్చి అడిగెను.

 

 

బ్రాహ్మణోత్తమా! గెలుపు గోరువారు ఏవిధముగా తిలధేనువు నిత్తురు? స్వర్గము నెట్లు అనుభవింతురు. అది నాకు చెప్పుము.

 

 

రాజా! తిల ధేనువు నిచ్చు పద్ధతిని నీవు వినుము.

 

నాలుగు కుడవములతో ఒక ప్రస్థమగును. పదునారు ప్రస్థములతో ఆ ధేనువు ఏర్పడును. నాలుగింటితో దూడ ఏర్పడును.

 

చెరకు గడలతో పాదములు, పుష్పములతో దంతములు, గంధముతో ముక్కు, బెల్లముతో నాలుకయు చేయ వలయును.

 

తోక యందు పూలమాలను కూర్ప వలయును. గంటల అభరణములతో అలంకరించిన ఆ తిల ధేనువును బంగారు కొమ్ములు కల దానినిగా చేయ వలయును.

 

కంచు పాత్రను, వెండి గిట్టలను ఆ ఆవునకు విధి ననుసరించి చేసి దానిని శీఘ్రముగా బ్రాహ్మణునకు దానము చేయ వలయును.

 

నల్లని లేడి చర్మము ఆ ఆవునకు వస్త్రము. ఇట్లు ఆ శుభమగు నందితను కల్పించి సర్వ రత్నములతో కూడిన హారమును కూర్చి సకల విధములగు ఓషధులను ఏర్పరచి ఈ క్రింది మంత్రముతో పవిత్రను చేసి దానము చేయ వలయును.

 

ఓ తిలధేనూ! నిన్ను ద్విజున కర్పించు చున్నాను. నాకు దీని వలన అన్నము, పానము, అన్ని రసములు కలుగు గాక మాకు సర్వమును సంపాదించి పెట్టుము.

 

 

దానము గ్రహించు వాడు, ఓ తిలధేనూ! నీకు నమస్కారము. విశేషమగు భక్తితో నాకుటుంబము కొరకు నిన్ను గ్రహించు చున్నాను. నా కోరికలను, నన్ను ఆదరింపుము, అన వలయును.

 

ఇట్టిదగు తిల ధేనువును దానము చేయ వలయును. అది అన్ని కోరికలను తీర్చును. సంశయము లేదు.

 

దీనిని భక్తితో వినువాడు, చేయువాడు, చేయించు వాడును సర్వ పాపములను వదలించు కొని విష్ణు లోకమున కరుగును.