వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము - 121

 

వసుంధరా! పశు పక్ష్యాది జన్మము లందిన వారు కూడ పాపము నుండి విడివడు మిక్కిలి రహస్యమును వినుము.

 

అష్టమి, చతుర్దశి, అమావాస్య తిథుల యందును, సంక్రాంతి, గ్రహణ కాలము లందును మిధున కర్మమును చేయని వాడును.

 

ఇతరుని అన్నములు తిని పెట్టిన వారిని రోత పడని వాడు పిన్న వయసు నందును నా యందు చెదరని వ్రతము కలవాడు.

 

ఏ కొంచెము లభించినను తృప్తి నందు వాడు, తల్లి దండ్రులను పూజించు వాడు, లభించిన దానిని తాను మాత్రమే తినక ఇతరులకును పంచి అనుభవించు వాడు.

 

అన్ని పనుల యందును లోభి తనము లేని వాడు, స్వతంత్రడు, తన్నుదాను అదుపున నుంచు కొను వాడు, పాడు పనులు చేయని వాడు, కుమార వ్రతము నందు (బ్రహ్మచర్యము నందు) స్థిరముగా నిలిచి యుండువాడు.

 

ఎల్లప్పుడు సర్వ భూతముల యందును దయగల వాడు, వివేకము కలవాడు, సత్యము తప్పని వాడు, బుద్ధిమంతుడు, ఇతరుల సొమ్ముల కొఱకు ఎన్నడును ఆశపడి తాపము పొందని వాడు.

 

ఇట్టి బుద్ధి నల వరచుకొని నా పూజా క్రియలను ఆచరించు వాడు పశువుల పుట్టుక పొందడు నా లోకమున కరుగును.

 

దేవతలకును సాధింప రాని ఈ రహస్యమును, నేను చెప్పు చున్నాను, సుందరీ! శ్రద్ధగా వినుము.

 

స్వేదజములు (చెమట వలన పుట్టునవి) ఉద్భిజ్జములు, (విత్తనమును చీల్చుకొని పుట్టునవి) అండజములు (గ్రుడ్డు నుండి పుట్టునవి) జరాయుజములు (రక్త శుక్లముల కలయిక వలన పుట్టునవి) అను నాలుగు విధములైన ప్రాణులలో వేనిని హింసింపని వారు, శుద్ధమైన బుద్ది గలవారు, అన్ని ప్రాణుల యందును జాలి నిండుగా గలవారు, కోకాముఖ క్షేత్రమున తుది శ్వాస విడుచు వారును.

 

ఇతరులకు మనస్సుతో కూడ సాధ్యము కాని నాలో లీన మగుటను పొందుదురు.

 

అంత విష్ణుని పలుకు విని అతి విశుద్ధమైన వ్రతములు గల భూదేవి వరాహ రూపుడగు ఆ విష్ణు దేవునితో మరల ఇట్లు పలికెను.

 

 

మాధవా! నేను నీకు శిష్యను, దాసిని, నీ యందు భక్తురాలను. ఇట్టి పరమ రహస్యములను నీవు నాకు చెప్ప వలయును.

 

నీవు చక్ర తీర్థమును, వారణాసిని, అట్టహాసమును, నైమిశమును, భద్రకర్ణమను మడుగును, కోకాముఖ తీర్థమును ఏల ప్రశంసింతువు?

 

సుగంధము, ద్విరండము, ముకుటము, మండలేశ్వరము కేదారము అను పుణ్య భూములను వదలి కోకాముఖము నేల కొని యాడుదువు?

 

దేవదారు వనము, జాగేశ్వరము, మహాలయ దుర్గము అను పుణ్య స్థలములను కాక కోకాముఖము నేల పెద్దగా చెప్పెదవు?

 

గోకర్ణము, శుద్ధమగు జాలేశ్వరము, ఏక లింగము అను వానిని వదలి కోకాముఖము నేల గొప్పగా చెప్పెదవు?

భక్తితో ఆ మాధవి యిట్లడుగగా మాధవుడు వరాహ రూపియగు భగవంతుడు వసుంధర కిట్లు బదులు చెప్పెను.

 

 

పుణ్యాత్మురాలా! నీవు నన్ను అడిగినది మనోజ్ఞమైన విషయము. కోక ఏల అన్నింటి కంటె మిన్న అయినదో ఆ రహస్యమును వివరించెదను.

 

నీవు ప్రశంసించిన క్షేత్రము లన్నియు రుద్రునకు నిలయములగు పాశుపత క్షేత్రములు. శ్రేష్ఠము లైనవి. కాని కోక భగవ ద్భక్తునకు సంబంధించినది.

 

ఓ వరాననా! సుందరీ! నీకు నా క్షేత్రములలో కోకాముఖమున జరిగిన ఒక గొప్ప వృత్తాంతమును వివరించెదను.

 

ఒకప్పుడు ఒక బోయవాడు కోక మండలమున మాంస రూపమగు ఆహరమునకై తిరుగుచు కొంచెము పాటి నీరు గల మడువు నందు నడుమ నున్న చేపను మెలకువతో కొట్టెను.

 

బలము గల ఆ చేప బోయ చేతి నుండి తప్పించు కొని దూరమునకు దూకి పడెను.

 

ఒక డేగ ఊర్పులు పుచ్చుచు ఆకసమున తిరుగుచు ఆ చేపను చంప నుంకించెను. అప్పుడది నా క్షేత్రమగు కోకాముఖమున వ్రాలెను. అంతనది రూపము, బలము, పరిశుద్ధత కలదియై శకుడను వాని పుత్రుడై పుట్టెను.

 

అంత కొంత కాలమునకు మృగముల వేట కాడొకడు కోకమున తిరుగుచు ఆ మాంస భాగములను తీసికొని అచటకు వచ్చెను.

 

అంత మాంసమును హరించు కోరిక గల ఆడు పిట్ట ఆకసమున నెగురుచు ఆ తావునకు వచ్చి మాంసము నెత్తుకొని పోవుటకై చూచు చుండెను.

 

ఆ బోయవాడు మాంసము నెగురు గొట్టికొని పోవు ఆ పిట్టను ఒక్క బాణముతో నేల గూల్చెను.

 

ఆకాశము నుండి నేల గూలిన ఆ పిట్ట నా క్షేత్రమగు కోకయందు పడి చంద్ర పురమున చక్కని పేరు ప్రతిష్ఠలు గల రాజ పుత్రియై పుట్టెను.

 

ఆమె చక్కగా పెరిగెను. అరువది నాలుగు కళలలో ఆరితేరెను. రూపము, యౌవనము నిండుగా పొందెను. కాని మగ వానిని చీదరించు కొనుచుండెను.

 

రూప వంతుడు, గుణ వంతుడు, శూరుడు, యుద్ధ తంత్రములలో నిలుకడ కలవాడు, సౌమ్యుడు అయినను పురుషుని ఆమె కాదని ఏవగించు చుండెను.

అంత కొంత కాలమునకు నా కోరిక మేరకు, ఆనంద పురమున శకునితో వారికి సంబంధము సాగెను.

 

అట్లు సంబంధము కలుగగా విధి విధానము ననుసరించి వివాహము జరిగెను.

 

ఆతడామెతో, ఆమె అతనితో ఒక్క ముహూర్త మైనను వేరు పడక పరస్పరా నురాగముతో విహరించిరి.

 

ఇట్లు వారికి ఏ దోషము లేకుండ పెద్ద కాలము గడచెను. నాయిక అతని యందు ప్రేమతో, స్నేహముతో కూడి యుండెను.

 

ఇట్లు వారిరువురు మిక్కిలి స్నేహముతో నుండగా సమ భోగములతో కూడిన పెద్ద కాలము గడచెను.

 

శకుల కానందము పెంపొందించు ఆ రాజ పుత్రునకు ఒకనాటి మధ్యాహ్నమున మిక్కిలి భయంకరమగు తల నొప్పి పుట్టెను.

 

ఔషధముల యందు మిక్కిలి నేర్పుగల వైద్యు లందరు అతనికి అన్ని చికిత్సలు కావించిరి కాని వేదన తగ్గ దాయెను.

 

ఇట్లు పెక్కు కాలములు గడచినవి. కాని అతడు విష్ణు మాయ చేత మోహితుడై తన్ను దానెరుగ కుండెను.

 

చివరకు వారిరువురకు సమయము నిండెను. పూర్వ జన్మ జ్ఞానము కలుగు సమయ మాసన్న మాయ్యెను.

 

అట్లు కాలము గడువగా ఒకరియెడ నొకరికి మిక్కిలి ప్రేమగల వారిరువురు ఎడబాయక, జరిగిన దేమో తెలియ గోరిరి.

 

అప్పుడా పరమ సుందరి నీకు తల యందు ఈ వేదన ఏల కలిగినది? నీకు నేను ప్రియ నైనచో దీనినున్న దున్నట్లు నాకు చెప్పుమని భర్త నడిగెను.

 

పెక్కె శాస్త్రములలో ఆరితేరిన వైద్యులు పెక్కండ్రు నీకు చికిత్సలు చేయు చున్నారు. కాని తల యందు వేదన అట్లే యున్నది అనియు నడిగెను.

 

ఇట్లు ప్రియురాలు పలుకగా ఆతడా మెతో ఇట్లనెను. భద్రా! నీవు మరచితి వేల? పుట్టుక మాత్రమున జీవి సర్వ రోగములతో కూడి దుఃఖమనో సుఖమనో పొందు చుండును.

ఇట్లు జన్మ మేర్పడినది. మనుష్యత్వము కూడ కలిగినది. సంసారమను సముద్రమున దిగ బడితిమి. ఇంక ఎక్కువగా అడుగ వలసిన పని లేదు.

 

ఆతడామెతో ఇట్లు పలుకగా ఆమెకు మరియు విన వలయు నను కుతూహలము కలిగినది. పక్షములు, నెలలుగా కాలము గడువగా వారిరువురు ఒకనాడు ఒకశయ్యపై నుండగా ఆమెకు మరల వేడుక పుట్టి మెల్లగా అడిగెను. నేను మునుపు అడిగిన విషయమునే చెప్పుము. నేను నీకు ప్రియమైన దానను కలతపడి యుంటిని. నీవు నాకు దానిని చెప్ప కున్నావు.

 

ఇందు దాచ దగినది ఏమైన కలదా? నా ముందు దాచెద వేల? నేను నీకు ప్రియురాల నైనచో తప్పక చెప్ప వలయును.

 

అని ఒత్తిడి చేసి అడుగగా ఆ శక దేశపు రాజు ప్రణయముతో మన్ననతో ప్రియురాలి కిట్లు పలికెను. నీవు మానుష భావమును వదలుము. నీ పూర్వపు జాతిని గుర్తు తెచ్చు కొనుము.

 

కాంతా! నీకు కోరిక యున్నచో నా తల్లిదండ్రుల అనుమతి కొనుము. ముఖ్యముగా నన్ను పెంచి పెద్ద చేసిన తల్లికి చెప్పుము. దేవతలకును లభింపని కోకాముఖమున కరిగి అచట నీకు సర్వ వృత్తాంతమును చెప్పుదును. అనగా ఓ భూదేవీ! ఆమె భర్త మాట కట్లే యని బదులు చెప్పెను.

 

ఆమె అత్త మామల చరణములు పట్టుకొని పుణ్య మైనది, గొప్పది యగు కోకాముఖమున కరుగ గోరు చున్నాము.

 

పని దొడ్డది యగుట చేత మమ్ము మీరు వలద నరాదు. ఇంత వరకు ఎన్నడును మిమ్ము నేనేమియు అడుగలేదు.

 

మీ ముందు నిలిచి నేనడిగిన ఈ యొక్క కోరికను మీరు తీర్ప వలయును. ఈ మీ కుమారుడు ఎల్ల కాలము తల నొప్పితో బాధపడు చున్నాడు.

 

చికిత్స లేని బాధతో మధ్యాహ్న కాలము నందు మరణించి నట్లే యగు చున్నాడు. సుఖములను, సర్వ విషయములను వదలి పరమ వేదన పడు చున్నాడు.

 

కోకాముఖమున కరుగక కష్టము మరలదు. మీకింతకు పూర్వమీ పరమ రహస్యమును నేను చెప్పలేదు.

 

ఆ విష్ణుని పరమ పదమునకు, పరమోత్తమ స్థానమునకు మా దంపతులము త్వరగా పోగోరు చున్నాము.

 

అంత కోడలి మాట విని శకాధిపతి చేతితో కోడలిని. కొడుకును స్పృశించి యిట్లు పలికెను.

 

నాన్నా! ఇది ఏమి? కోకాముఖా శ్రమమును గూర్చి తలపోసితి వేమి? ఏనుగులు, గుఱ్ఱములు, రథములు, ఇతర వాహనములు, అప్సరసల వంటి స్త్రీలు, ఏడు అంగములు గలిగి, కోశము మున్నగు దానిలో కూడినది, రత్నముల ప్రోవులు కలదియునగు రాజ్య మంతయు నీ యందు నెలకొని యున్నది.

 

నా శ్రేష్ఠమగు సింహా సనమును, మిత్రులను నా సర్వమును గ్రహింపుము. నా ప్రాణములు నీ యందు నెలకొని యున్నవి. నీవు నా ఉత్తమ సంతానమవు.

 

అంత తండ్రి మాట విని ఆ కుమారుడు, తండ్రి పాదములు పట్టుకొని యిట్లు బదులు పలికెను.

 

తండ్రీ! నాకు రాజ్యము, కోశము, వాహనము, బలము వలదు. వెను వెంటనే నేను కోకాముఖమున కరుగ గోరు చున్నాడను.

 

తల నొప్పితో నున్న నేను బ్రదుకుదు నేని, తండ్రీ! అప్పుడు రాజ్యము, సేన, ధనాగారము అన్నియు నావే. సంశయము లేదు. అచటకు పోయిననే నా తల నొప్పి నాశన మగును.

 

అట్లు పలికి సర్వ కార్యము లెరిగిన ఆ కుమారుడు తండ్రి పాదములు పట్టి నిలిచి యుండెను. అంత తండ్రి అతనితో పుత్రా! అరుగుము. నీకు మేలగు గాక అని అనుమతించెను.

 

వర్తకులు, పురజనులు, వైశ్యులు, ఉత్తమ స్త్రీలును కోకాముఖ మార్గమున నిలిచిన రాజ కుమారుని కడ కరుదెంచిరి.

 

అంత పెద్ద కాలమునకు వారందరు కోకాముఖము కడకు వచ్చిరి. అంత ఆ యింతి భర్తను నేన డిగిన రహస్యమును చెప్పుమని కోరెను.

 

ఇట్లు ప్రియురాలు పలుకగా ఆ రాజపుత్రుడు నవ్వి ప్రియు రాలిని కౌగిలించు కొని ఆమెతో ఇట్లనెను.

 

వరారోహా! ఒక రాత్రి యిచట సుఖముగా నిద్రింపుము. నీవు కోరిన దానిని రేపు నీకు చెప్పెదను.

 

అంత తెల్లవారి నంతనే వారిరువురు స్నానము చేసి పట్టు వస్త్రములు తాల్చి తలతో విష్ణువునకు మ్రొక్కిరి. అంత ఆ రాజ కుమారుడు ప్రియురాలిని చేతితో పట్టుకొని ఈశాన్య దిక్కుగా కొనిపోయి అటనుండి తూర్పునకు నడిపించి తన హృదయమున చక్కగా గుర్తున్న ఒక తావు కడ భూమిని త్రవ్వెను.

 

అందొక చోట మిగిలి యున్న ఎముకలు కాన వచ్చెను. వరాననా! ఇవి నా పూర్వ జన్మము అస్థికలు అని చెప్పెను.

 

నేనొక చేపను కోకము నీళ్ల యందు తిరుగు చుండెడి వాడను. నన్నొక బోయవాడు గాలము వైచి పట్టు కొనెను. నేను వాని చేతి నుండి తప్పించుకొని యీ నేలపై పడితిని.

 

మాంసమున ఆస గొన్న ఒక డేగ గోళ్లతో చీల్చినది నా ఎముకలు లేకుండ చేయ గోరినది... అప్పుడు నేనాకాశము నుండి వ్రాలితిని. ఇదిగో చూడు.

 

దాని ఆ దెబ్బకు నాకు తలపోటు కలిగినది. ఇది నేను మాత్రమే ఎరుగుదును. మరి యెవ్వడును ఎరుగడు.

 

నీవు నన్ను మున్నడిగి దానిని చెప్పితిని. సుందరీ! నీకు మేలగు గాక! నీకు బుద్ధి పుట్టిన చోటి కరుగుము.

 

అంత ఎఱ్ఱని పద్మము వంటి మంచి మొగము గల ఆ నిర్మలాంగి జాలి గొలుపు కంఠ స్వరముతో భర్త కిట్లనెను.

 

భద్రా! నీవు మిక్కిలి రహస్య మగు ఉత్తమ విషయమును నాకు చెప్పితివి. కాని ఈ కర్మ మోహమునకు కారణమైన దానిని నేను నీకు చెప్పలేదు.

 

నేనెట్టి దాననో, మునుపు ఏ విధముగా నుంటినో చెప్పెదను. వినుము. ఆకలి దప్పులతో అలసత నొంది నేఎన్నడు మాధవుని కడకు రాలేదు. చెట్టుపై కూర్చుండి తిండిని వెదకుచు నుంటిని.

 

అంతనొక బోయవాడు అడవి మృగములను పెక్కింటిని చంపి మాంసపు మోపులను కూడ బెట్టుకొని ఈ ప్రక్కల తిరుగు చుండెను.

 

అతడు మాంసపు మోపులను ఒక చోట నుంచి కట్టెలను తెచ్చు చుండెను. నేనంత ఒక మృగ మాంసమును చిక్కించు కొని ఆకాశమున తిరుగు చుంటిని. ఆకలి దప్పులకు అలసిన దానవై మరియు మాంసములను చీల్చు చుంటిని.

 

అంత ఆ బోయ కట్టెలు పేర్చి అగ్నిని దరికొల్పెను. ఆకలి దప్పులను తీర్చు కొనుటకై ఆ మాంసములను వండు చుండెను.

అంత నేనొక చెట్టెక్కి మాంసము నందు ఆశతో చూచుచు ఆతడు మాంసమును వండుచున్న చోట పడితిని.

 

మోయలేని బరువు గల మాంసమును నేను వజ్రమయ ములగు గోళ్ళతో చీల్చు చుంటిని. ఆ బరువుతో పీడ నొంది నేను బయట పడుటకు చాల కుంటిని.

 

ఎక్కువ దూరము పోజాలక కొంచెము దగ్గరగా నిలిచి యుంటిని. పొంగి పోయెడు మనస్సుతో ఆ మాంసమును తినుచు నిలిచితిని.

 

మాంసపు తిండితో ఒడ లెరుగని నన్నాతడు చూచెను. క్రుద్ధుడై మాంసమును మరల పొందగోరి నన్నా వ్యాధుడు పరికించెను.

 

అంత ఆతడు విల్లెత్తి బాణమును నాపై వైచెను. మాంసము ముక్క తినుచున్న నేను వానిచేత నేల గూలితిని.

 

అంత నేను గిలగిల గొట్టు కొనుచు చేష్టలుడిగి, బుద్ధి తప్పి దాట శక్యము కాని కాల తంత్రమున పడితిని.

 

ఈ క్షేత్రము మహిమ వలన నేను కోరుకొనక పోయినను రాజ పుత్రినై పుట్టి నీకు ప్రియ నైతిని. పూర్వజ్మమును కూడ స్మరించు చుంటిని.

 

ఇవిగో మిగిలిన నా ఎముకలను చూడుము. పెద్ద కాలమునకు జీర్ణించియు కొన్ని మిగిలి యున్నవి.

 

ఇట్లు భర్తకు వానిని చూపి అతనితో మరల నిట్లనెను. పుణ్యాత్ముడా! నన్ను కోకాముఖముకు తోడి తెచ్చతివి.

 

ఈ క్షేత్రము ప్రభావము వల పశు పక్షి జన్మములు గల మనము మనుష్య జాతి యందు, ఉత్తమ కులముల యందు పుట్టితిమి.

 

ఓయి యశోధనా! విష్ణువు చెప్పిన శుభమైన దానిని నీవు దేనిని నాకుపదేశింతువో అదియెల్లను సుఖమునకు తావలమగు ఈ విష్ణు స్థానమున ఆచరింతును.

 

అంత ఆమె మాటను విని పూర్వ వృత్తమును స్మరించి ఆతడు మిక్కిలి ఆశ్చర్యము పొంది ‘బాగు బాగు’ అని పలికెను.

 

క్షేత్రము నందలి విధులను విని, ఆమె పలికిన గొప్ప మాటు ఆలకించి వారితో వచ్చిన వారును వారివారికి రుచించిన విధానములను ఆచరించిరి.

 

కొందరు చాంద్రాయణ వ్రతమును ఆచరించిరి. కొందరు పద్మాసనము వేసికొని ధ్యానము చేసిరి. అట్లు విష్ణుమయము లగు కర్మములను వారు నిరంతరము చక్కగా పాటించిరి.

 

గొప్ప ధాన్య సంపదయు, ధన సంపదయు కల వారయ్యు ఆ దంపతులు చెదరని మహా భక్తి కలవారై పెక్కు వ్రతములను ఆచరించిరి.

 

అట్లు వారందరు పెద్ద కాలము తమ పాపములను తొలగించు కొనువారై ధర్మ కార్యములను చేయుచు చనిపోయిరి.

 

అంత క్షేత్ర మహిమ చేతను, ఆ పూజల ప్రభావము వలనను వారు శ్వేత ద్వీపమున కరిగిరి.

 

ఇట్లా రాజపుత్రుడు సర్వ భూతముల గుణములతో కూడిన వాడై మనుష్య భావమును వదలి పై మెట్టు నందు స్థిరముగా నిలిచెను.

 

నా వ్రతముల యందు నిష్ఠగల ఆతని పరిజనము కూడ మనుష్య భావమును వదలి చక్కని తేజస్సు కలదియై ఆత్మతో ఆత్మ దర్శనము చేసికొన్న కారణముగా నా లోకమునకు చేరెను.

 

అచట నున్న స్త్రీలందరు కలువల సువాసనలు కలవారై మాయను వదలి కాంతులు క్రమ్ముకొన్న వారైరి.

 

ఇట్లు చేపయు, చిల్లియు సాధారణమగు కోరికలు కలిగిన వయ్యు ఆ క్షేత్రముకు వచ్చి నా అనుగ్రహము వలన శ్వేత ద్వీపమునకు చేరుకొనెను.

 

ఇది ధర్మము, ఇది కీర్తి. ఇది శకుల గొప్ప యశస్సు, కర్మములలో శ్రేష్ఠమగు కర్మము తపస్సులలో గొప్పది యగు తపస్సు.

 

కథలలో ఉత్తమ కథ, వెలుగులలో గొప్ప వెలుగు. ధర్మములలో పరమ ధర్మము. వసుంధరా! దీనిని నీకై వర్ణించితిని.

 

కోపిష్ఠి, మూర్ఖుడు, పిసినిగొట్టు, భక్తిలేని వాడు, శ్రద్ధలేని వాడు, మొండి వాడు, అను వీరికి దీనిని ఒసగ రాదు.

 

దీక్షితునకు, నా యందు ప్రపన్న భావము కలవానికి, జ్ఞానము కల వానికి, శాస్త్రములలో నిండైన ప్రజ్ఞ కలవానికి దీని నొసగ వలయును.

 

మరణ కాలమందు చెదరని హృదయముతో దీనిని పట్టు కొనువాడు పవిత్రమగు ఆత్మ కలవాడై గర్భవాసపు భయము నుండి విడుదల పొందును. సుందరీ! గొప్ప శక్తిగల ఈ మహా ఖ్యానమును నీకు వివరించితిని.

 

ఈ విధముగా ప్రతిష్ఠ గల కోకాముఖమున కరిగిన వారు చిల్లియు, చేపయు మున్ను సిద్ధి పొందిన విధముగా పరమ సిద్ధిని పొందుదురు.