వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము – 10

 

శ్రీవరాహ దేవుడు:

ఏవం సృష్ట్వా జగత్పర్వం భగవాన్‌ లోకభావనః,

విరరామ తతః సృష్టి ర్వ్యవర్ధత ధరే తదా.

 

శ్రీవరాహ దేవుడు:

ఓ ధరణీ! లోకముల నన్నింటిని చక్కగా మనసున భావించిన ఆ భగవానుడు ఈ సర్వమును సృజించి యూర కుండెను. అంత సృష్టి పెంపొంద దొడగెను.

 

వృద్ధాయా మథ సృష్టౌతు సర్వే దేవాః పురాతనమ్‌,

నారాయణాఖ్యం పురుషం యజంతో వివిధై ర్మఖైః.

ద్వీపేషు చైవ సర్వేషు వర్షేషు చ మఖై ర్హరిమ్‌,

దేవాః సత్రై ర్మహద్భి స్తే యజన్తః శ్రద్ధయాన్వితాః,

తోషయామాసు రత్యర్థం స్వం పూజ్యం కర్తుమీప్సవః.

 

ఇట్లు సృష్టి వృద్ధి పొందగా దేవత లందరు ఆయా ద్వీపములలో, ఆయా వర్షములలో (వర్షమనగా కొన్ని ఖండములు కలసిన భూ భాగము) పెక్కు విధములగు యజ్ఞములతో గొప్ప సత్ర యాగములతో తమ పూజ్యత నపేక్షించి పురాతనుడగు శ్రీమన్నారాయణుని సంతోషపరచు చుండిరి.

 

ఏవం తోషయతాం తేషాం బహువర్ష సహస్రికమ్‌,

కాలే దేవ స్తదా తుష్టః ప్రత్యక్షత్వం జగామ హ.

 

ఇట్లు పెక్కు వేల యేండ్లు వారు నారాయణుని సంతోష పెట్టగా తుష్టి నందిన దేవుడు వారికి ప్రత్యక్ష మయ్యెను.

 

అనేకబాహూదర వక్త్రనేత్రో మహాగిరేః శృఙ్గ మివోల్లిఖం స్తదా,

ఉవాచ కింకార్య మథో సురేశో బ్రూతాం వరం దేవవరా వరం వః.

 

పెక్కు చేతులు, కడుపులు, మోములు, కన్నులు గిలిగి పెద్ద కొండ కొమ్ము వలె ఆకసము నొరయుచు ఆ దేవేశుడు దేవ వరులారా! చెప్పుడు! మీ కిష్టమైన వరము కోరు కొనుడు అని పలికెను.

 

దేవతలు:

 

దేవతలు:

మహానుభావా! గోవిందా! నీకు జయము. నాథా! శ్రేష్ఠుడవగు నీ వలన మేము దేవతల మయితిమి. కాని మనుష్య లోకము నందు ఏ ఒక్కడును ఆద్యుడవగు నిన్ను విడచి మమ్ము మన్నించుట లేదు.

 

రుద్రాదిత్యా వసవో యే చ సాధ్యా విశ్వేశ్వినౌ మరుత శ్చోష్మపాశ్చ,

సర్వే భవన్తం శరణం గతాః స్మ కురుష్వ పూజ్యా నిహ విశ్వమూర్తే.

 

రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వులు, అశ్వులు, మరుత్తులు, ఊష్మపులు అను పేర్లు గల మేమందరము నిన్ను శరణు చొచ్చితిమి. ఓ విశ్వమూర్తీ! మమ్ములను పూజ్యులనుగా చేయుము.

 

ఏవ ముక్త స్తదా తైస్తు మహాయోగేశ్వరో హరిః,

కరోమి సర్వాన్‌ వః పూజ్యా నిత్యుక్త్వాన్తరధీయత.

 

వారిట్లు పలుకగా మహా యోగీశ్వరుడగు హరి మీ అందరను పూజ్యులను గావింతు నని అదృశ్యుడాయెను.

 

దేవా అపి నిజౌకాంసి గతవన్తః సనాతనమ్‌,

స్తువంతః పరమేశోపి త్రివిధం భావ మాస్థితః.

 

దేవతలును సనాతనుడగు నారాయణుని స్తుతించుచు తమ తమ స్థానముల కరిగిరి. పరమేశ్వరుడు మూడు విధములగు భావములను పొందెను.

 

ఏవం త్రిధా జగద్ధాతా భూత్వా దేవాన్‌ మహేశ్వరః,

ఆరాధ్య సాత్వికం రాజం తామసం చ త్రిధా స్థితమ్‌.

 

ఇట్లు పరమేశ్వరుడు, లోకపతి సత్వ గుణము, రజో గుణము, తమో గుణము అను వానితో నేర్పడిన మూడు రూపములను పొందెను. దేవతలను తృప్తి పరచెను.

 

సాత్వికేన పఠేద్‌ వేదాన్‌ యజేద్‌ యజ్ఞేన దేవతాః

 

అట్టి సత్త్వ స్వరూపముతో వేదములను పఠించును. యజ్ఞము లతో దేవతలను పూజించును.

 

ఆత్మనో వయవో భూత్వా రాజసేనాపి కేశవః,

సకాలరూపిణం రౌద్రం ప్రకృత్యా శూలపాణినమ్‌,

ఆత్మనో రాజసీం మూర్తిం పూజయామాస భక్తితః.

 

ఆ కేశవుడు తన అంశమగు రజో గుణముతో కాల స్వరూపుడు, స్వభావము తోడనే భయంకరుడు, శూలము చేత ధరించు వాడునగు రుద్రుని సృజించెను. అట్టి తన రాజస మూర్తిని భక్తితో అర్చించెను.

 

తామసేనాపి భావేన అసురేషు వ్యవస్థితః.

 

తమో గుణమయమగు భావముతో రక్కసుల యందు నెలకొనెను.

 

ఏవం త్రిధా జగద్ధాతా భూత్వా దేవాన్‌ మహేశ్వరః,

ఆరాధయామాస తతో లోకేపి త్రివిధోభవత్‌.

బ్రహ్మ విష్ణు మహేశాననామ్నా గృహ్య వ్యవస్థితః,

స చ నారాయణో దేవః కృతే యుగవరే ప్రభుః.

 

అట్లు పరమ ప్రభువు, లోక పాలకుడు మూడు రూపములు పొంది దేవతల నారాధించెను. అటుపై లోకము నందును బ్రహ్మ విష్ణు మహేశ్వర నామములు గైకొని మూడు విధములుగా నయ్యెను.

 

త్రేతాయాం రుద్రరూపస్తు ద్వాపరే యజ్ఞమూర్తిమాన్‌,

కలౌ నారాయణో దేవో బహురూపో వ్యజాయత.

 

ఆ దేవుడు కృత యుగమున నారాయణుడుగా, త్రేతా యుగమున రుద్ర రూపుడుగా, ద్వాపరమున యజ్ఞ మూర్తిగా, కలి యందు అనేక రూపములు గలవాడుగా నయ్యెను.

 

తస్యాదికృత్తతో విష్ణో శ్చరితం భూరితేజసః,

శృణుష్వ సర్వం సుశ్రోణి గదతో మమ భామిని.

 

ఓ సుందరీ! ఇట్లు ఆదిసృష్టి చేసిన మహా తేజస్సు గల ఆ విష్ణువు చరితము చెప్పుదును. వినుము.

 

ఆసీత్‌ కృతయుగే రాజా సుప్రతీకో మహాబలః,

తస్య భార్యా ద్వయం చాసీ దవిశిష్టం మనోరమమ్‌.

 

మున్ను కృత యుగమున సుప్రతీకుడను మహా బలవంతుడగు రాజుండెను. ఆతనికి సమానమగు సౌందర్యము, ఎగుడు దిగుడులు లేని గుణములు గల యిద్దరు భార్య లుండిరి.

 

విద్యుత్ర్పభా కాన్తిమితీ తయో రేతే తు నామనీ,

తయోః పుత్రం సమం రాజా న లేభే యత్నవానపి.

 

విద్యుత్ర్పభ, కాంతిమతి యని వారి పేర్లు. ఆ రాజెన్ని సత్కార్యములు చేసినను వారి యందు ఆతనికి సంతానము కలుగ లేదు.

 

యదా తదా మునిశ్రేష్ఠ మాత్రేయం వీతకల్మషమ్‌,

తోషయామాస విధినా చిత్రకూటే నగోత్తమే.

 

అపుడా రాజు చిత్ర కూటమును దొడ్డ కొండపై పుణ్యాత్ముడగు ఆత్రేయుడను ముని శ్రేష్ఠుని చక్కని పూజతో తృప్తి పరచెను.

 

స ఋషి స్తోషిత స్తేన దీర్ఘ కాలం వరార్థినా,

వరం దిదత్సయా యావ దబ్రవీ దత్రిజో మునిః.

 

వరము పొందు కోరికతో ఆ రాజు పెద్దకాల మాతనిని సేవించెను. ఆ అత్రి వంశపు మునియు వరము నిచ్చు అభిలాషతో ఇట్లు పలుక బోయెను.

 

తావ దింద్రోపి కరిణా గతః పార్శ్వేన తస్య హ,

దేవసైన్యైః పరివృత స్తూష్ణీమేవ మహాబలః.

 

ఇంతలో దేవ సేనలతో కూడి యున్న మహాబలుడగు దేవేంద్రుడు ఐరావత మెక్కి ఆ ఋషి కడకు ఊరకయే వచ్చెను.

 

తం దృష్ట్వాన్తర్గతప్రీతి మప్రీతిం ప్రీతవాన్‌ మునిః,

చుకోప దేవరాజాయ శాపముగ్రం ససర్జ హ.

 

రాజు నెడల ప్రీతిగా నున్న ఆ ముని, లోపల ప్రేమ యున్నను పైకి ప్రీతి లేనట్లు కాన వచ్చిన ఇంద్రుని చూచి కోపించి తీవ్రమగు శాపము నిట్లొసగెను.

 

యస్మాత్‌ త్వయా మమావజ్ఞా కృతా మూఢ దివస్పతే,

తత స్త్వం చాలితో రాజ్యా దన్యలోకే వసిష్యసి.

 

‘స్వర్గాధిపతీ! ఒడ లెరుగక నీవు నాకవమానము చేసితివి. ఆ కారణమున రాజ్యము నుండి భ్రష్టుడవై వేరు లోకమున వసింతువు.’

 

ఏవ ముక్త్వాపి కోపేన సురేశం తం చ భూపతిమ్‌,

ఉవాచ రాజన్‌ పుత్ర స్తే భవితా దృఢవిక్రమః.

 

ఇట్లు కోపముతో దేవేంద్రుని శపించి రాజును గాంచి ‘రాజా! గట్టి పరాక్రమము గల పుత్రుడు నీకు పుట్టును,’ అని పలికెను.

 

ఇన్ధ్ర రూపోపమః శ్రీమా నుద్యచ్ఛస్త్రః ప్రతాపవాన్‌,

విద్యాప్రభావకర్మజ్ఞః క్రూరకర్మా భవిష్యతి,

దుర్జయోతిబలీ రాజా ఏవ ముక్త్వా గతో మునిః.

 

‘ఇంద్రుని వంటి రూపము, సంపద, చక్కని ఆయుధ విద్య, ప్రతాపము, విద్య, ప్రభావము, ఆయా పనులు నిర్వహించుటలో నేర్పు, ఎవ్వరికిని జయింపరాని తనము, గొప్ప బలము కలవాడయ్యు ఆతడు క్రూర కర్ముడగును’ అని పలికి మహర్షి వెడలి పోయెను.

 

సోపి రాజా సుప్రతీకో భార్యాయాం గర్భ మావహత్‌,

విద్యుత్ర్పభాయాం ధర్మజ్ఞః సాపి కాలే వ్యసూయత.

 

ధర్మవేత్త అయిన ఆ రాజు సుప్రతీకుని భార్య విద్యుత్ర్పభకు గర్భమాయెను. ఆమెయు తగు కాలమున ప్రసవించెను.

 

తస్యాః పుత్రః సమభవద్‌ దుర్జయాఖ్యో మహాబలః,

జాతకర్మాది సంస్కారం తస్య చక్రే మునిః స్వయమ్‌.

 

ఆ విద్యుత్ప్రభకు దుర్జయుడను పేరు గల గొప్ప బలము గల కొడుకు పుట్టెను. వానికి జాతకర్మము మొదలగు సంస్కారము లను ఆ మునియే స్వయముగా గావించెను.

 

తస్య చేస్టే ర్బలేనాసౌ మునేః సౌమ్యో బభూవ హ,

వేద శాస్త్రార్థవిద్యాయాం పారగో ధర్మవాన్‌ శుచిః.

 

ఆ ముని కావించిన యజ్ఞము బలమున ఆ బాలుడు మంచి వాడయ్యెను. వేదములలో, శాస్త్రములలో, ఇతర విద్యలలో ఆరితేరిన వాడయ్యెను. ధర్మవంతుడు, శుచియు నయ్యెను.

 

యా ద్వితీయాభవత్‌ పత్నీ తస్య రాజ్ఞో మహాత్మనః,

నామ్నా కీర్తిమతీ ధన్యా తస్యాః పుత్రో బభూవ హ,

నామ్నా సుద్యుమ్న ఇత్యేవం వేదవేదాంగపారగః.

 

మహాత్ముడగు ఆ రాజు రెండవ భార్య యగు కీర్తి మతికి ఒక పుత్రుడు కలిగెను. ఆతని పేరు సుద్యుమ్నుడు. వేద వేదాంగములను తుదిముట్ట చదివెను.

 

అథ కాలేన మహతా స రాజా రాజసత్తమః,

సుప్రతీకః సుతం దృష్ట్వా దుర్జయం యోగ్యమన్తికే.

ఆత్మనో వృద్ధభావంచ వారాణస్యధిపో బలీ,

చింతయామాస రాజ్యార్థం దుర్జయం ప్రతి భామిని.

 

అంత పెద్దకాలము గడచిన పిదప వారాణసి ఏలిక యగు సుప్రతీకుడు యోగ్యుడగు కుమారుని దుర్జయుని గాంచి తన ముదిమిని తలపోసి రాజ్యమున దుర్జయుని నిలుపుటకై యోచన చేసెను.

 

ఏవం సంచిన్త్య ధర్మాత్మా తస్య రాజ్యం దదౌ నృపః,

స్వయం చ చిత్ర కూటాఖ్యం పర్వతం చ జగామ హ.

 

ఆ ధర్మాత్ముడిట్లు భావించి దుర్జయునకు రాజ్య మిచ్చెను. తానును చిత్రకూట పర్వతమున కరిగెను.

 

దుర్జయోపి మహద్రాజ్యం హస్త్యశ్వరథ పత్తిభిః,

సంయోజ్య చిన్తయామాస రాజ్యవృద్ధిం ప్రతి ప్రభుః.

 

దుర్జయుడును పెద్ద రాజ్యమును పొంది ఏనుగులు, గుఱ్ఱములు, రథములు, కాల్బలము గల సేనను సమకూర్చు కొని రాజ్యము పెంపు దలను గూర్చి తలపోసెను.

 

ఏవం సంచిన్త్య మేధావీ హస్త్యశ్వరథపత్తిభిః,

సమేతాం వాహినీం కృత్వా ఉత్తరాం దిశ మాశ్రితః.

 

ఆ మేధావి తలపోసి ఏనుగులు, గుఱ్ఱములు, రథములు, కాల్బలము అను వానితో కూడిన సేనను సమకూర్చు కొని ఉత్తర దిక్కునకు బయలు దేరెను.

 

తస్య చోత్తరతో దేశాః సర్వే సిద్ధా మహాత్మనః.

 

మహాత్ముడగు ఆతనికి ఉత్తర దిక్కున నున్న దేశములన్నియు వశ మైనవి.

 

భారతాఖ్య మిదం వర్షం సాధయిత్వా సుదుర్జయః,

తతః కింపురుషం నామ వర్షం తేనాపి సాధితమ్‌.

 

ఓటమి యెరుగని ఆతడు భరత వర్షమును సాధించి యటుపై కింపురుషుమను వర్షమును గూడ చేజిక్కించు కొనెను (వర్షము - దేశము).

 

తతః పరతరం చాన్య ద్ధరివర్షం జిగాయ సః,

రమ్యం హిరణ్మయం చాపి కురుభద్రాశ్వ మేవచ,

ఇలావృతం మేరుమధ్య మేతత్సర్వం జిగాయ సః.

 

దానికి పైనున్న హరి వర్షమును, రమణీయ మగు హిరణ్మయ వర్షమును, కురు భద్రాశ్వమును, మేరువు నడుమ నున్న ఇలావృత వర్షమును జయించెను.

 

జిత్వా జంబ్వాఖ్య మేతద్ధి ద్వీపం యావదసౌ నృపః,

జగామ దేవరాజానం జేతుం సర్వసురాన్వితమ్‌.

 

ఇట్లు జంబూ ద్వీపము నంతటిని జయించి ఆ రాజు దేవత లందరితో కూడిన దేవేంద్రుని గెలుచుటకు బయలు దేరెను.

 

మేరు పర్వత మారుహ్య దేవ గంధర్వ దానవాన్‌,

గుహ్యకాన్‌ కింనరాన్‌ దైత్యాంస్తతో బ్రహ్మసుతో మునిః,

నారదో దుర్జయజయం దేవ రాజాయ శంసత.

 

అతడు మేరు పర్వత మెక్కి దేవతలను, గంధర్వులను, దానవులను, గుహ్యకులను, కిన్నరులను, దైత్యులను గెలిచెను. అంత బ్రహ్మ మానస పుత్రుడగు నారదుడు దుర్జయుని జయమును దేవరాజున కెరిగించెను.

 

తత ఇంద్రస్త్వరా యుక్తో లోకపాలైః సమన్వితః,

జగామ దుర్జయం హంతుం సోచిరేణాస్త్రనిర్జితమ్‌,

విహాయ పర్వతం మేరుం మర్త్యలోక మిహాగతః.

 

అంత ఇంద్రుడు హూటా హుటిని లోక పాలురతో గూడి దుర్జయుని చంపుటకై బయలు దేరెను. కాని కొలది కాలమునకే దుర్జయుని బాణములకు ఓడి మేరు పర్వతమును విడచి మర్త్య లోకమునకు వచ్చెను.

 

పూర్వదేశే చ దేవెంద్రో లోకపాలైః సమం ప్రభుః,

స్థితవాం స్తస్య సుమహచ్చరితం సంభవిష్యతి.

 

దేవేంద్రుడు లోక పాలురతో పాటు తూర్పు దేశమున నివసించి యుండెను. ఆతని గొప్ప చరితము ఇటుపై చెప్ప బడును.

 

దుర్జయశ్చ సురాంగిత్వా యావత్‌ ప్రతినివర్తతే,

గంధమాదన పృష్ఠే తు స్కన్ధావారనివేశనమ్‌,

కృత్వావస్థిత సంభార మాగతం తాపసౌ తు తమ్‌.

 

ఇట్లు దుర్జయుడు దేవతలను గెలిచి తిరిగి వచ్చు నపుడు గంధమాదన పర్వతముపై సేనలను విడిది చేయించెను. అట్లు విశ్రమించి యున్న ఆతని కడకు ఇద్దరు తాపసు లరుదెంచిరి.

 

తా వాగతా వథాబ్రూతాం రాజన్‌ దుర్జయ లోకపాః,

నివారితా స్త్వయా సర్వం లోకపాలై ర్వినా జగత్‌,

న ప్రవర్తేత తస్మాన్‌ నౌ దేహి తత్పద ముత్తమమ్‌.

 

అట్లు వచ్చిన వారిరువురు ‘దుర్జయా! రాజా! నీవు లోకపాలుర నందరిని ఊడ గొట్టితివి. లోక పాలుర లేకుండ లోకము నడవదు. కావున ఉత్తమమగు ఆ పదమును మాకిమ్ము’ అని పలికిరి.

 

ఏవ ముక్తే తత స్తౌ తు దుర్జయః ప్రాహ ధర్మవిత్‌,

కౌ భవంతా వితి తత స్తా పూచతు రిరిందమౌ,

విద్యుత్‌ సువిద్యు న్నామానా వసురా వితి మానద.

 

వారిట్లనగా ధర్మ మెరిగిన దుర్జయుడు మీరెవ్వరని యడిగెను. అంత వారు ‘మేము రాక్షసులము. విద్యుత్తు, సువిద్యుత్తు - అని మా పేర్లు’ అని చెప్పిరి.

 

త్వయా సంప్రతి చేచ్ఛామో ధర్మ్యం సత్సు సుసంస్కృతౌ,

లోక పాలమతం సర్వ మావాం కుర్మ సుదుర్జయః.

 

‘దుర్జయా! నీవు మమ్ము చక్కగా తీర్చి దిద్దినచో సజ్జనుల యందు ధర్మము తప్పని పని చేయ గోరు చున్నాము. లోకపాలుర పనినంతయు మేము చేయుదుము.’

 

ఏవ ముక్తే దుర్జయేన తౌ స్వర్గే సన్నివేశితౌ,

లోకపాలౌ కృతౌ సద్య స్తతోంతర్ధానం జగ్మతుః.

 

వారిట్లు పలుకగా దుర్జయుడు వారిరువురను స్వర్గమున పాదుకొలిపెను. లోక పాలురను గావించెను. పిదప వారు అదృశ్యులైరి.

 

తయో రపి మహత్కర్మ చరితం చ ధరాధరే,

భవిష్యతి మహారాజో దుర్జయో మన్దరోపరి.

ధనదస్య వనం దివ్యం దృష్ట్వా నన్దనసన్నిభమ్‌,

ముదా బభ్రామ రమ్యేస్మిన్‌ సయావ ద్రాజసత్తమః.

 

భూదేవీ! వారు చేసిన ఘన కార్యములను, వారి చరిత్రమును ముందు చెప్పెదను. మహారాజు దుర్జయుడు మందర పర్వతమున నందనము వంటిదయిన కుబేరుని దివ్య వనమును చూచి అందమైన దాని యందు ఆనందముతో విహరించెను.

 

తావత్‌ సువర్ణ వృక్షాధః కన్యాద్వయ మపశ్యత,

అతీవరూప సంపన్న మతీవాద్భూత దర్శనమ్‌.

 

ఇంతలో ఒక బంగారు చెట్టు క్రింద గొప్ప రూప సంపద గల చూడ ముచ్చట గొలుపు ఇద్దరు కన్యలు ఆతనికి కాన వచ్చిరి.

 

దృష్ట్వా తు విస్మయావిష్టః క ఇమే శుభ లోచనే,

ఏవం సంచిన్త్య యావత్‌ స క్షణ మేకం వ్యవస్థితః,

తస్మిన్‌ వనే తానదుభౌ తాడసౌ సోవ లోకయత్‌.

 

వారిని చూచి అచ్చెరువున మునుగుచు ఈ సుందరాక్షు లెవ్వరో! అని తల పోయుచు ఒక్క క్షణ ముండెను. ఇంతలో ఆ వనమున తాపసు లిరవురు గోచరించిరి.

 

తౌ దృష్ట్వా సహసా రాజా యయౌ ప్రీత్యా పరాంముదమ్‌,

అవతీర్య ద్విపాత్‌ తూర్ణం నమశ్చక్రేతయోః స్వయమ్‌.

 

వారిరువురను గాంచి రాజు ప్రీతితో పరమానంద మందెను. ఏనుగు నుండి దిగి వారిరువురకు నమస్క రించెను.

 

ఉపవిష్టః సతాభ్యాం తు కౌశ్యే దత్తే వరాసనే,

పృష్టః కస్త్వం కుతశ్చాసి కస్య వా కి మిహ స్థితః.

 

వారికి శ్రేష్ఠములగు దర్భాసనము లొసగి వారితో పాటు కూర్చున్న పిదప వారు నీవెవరవు? ఎందుండి వచ్చితివి? ఎవని కుమారుడవు? ఇచట ఎందు కున్నావు? అని యడిగిరి.

 

తౌ ప్రహస్యా బ్రవీద్‌ రాజా సుప్రతీకేతి విశ్రుతః,

తస్య పుత్రః సముత్పన్నో దుర్జయో నామ నామతః.

 

రాజు నవ్వి వారితో నేను సుప్రతీకుడను. గొప్ప ప్రతిష్ఠకల రాజు కుమారుడను. నా పేరు దుర్జయుడు.

 

పృథివ్యాం సర్వరాజానో జిగీషన్నిహ సత్తమౌ,

ఆగతోస్మి ధ్రువం చైవ స్మర్తవ్యోహం తపోధనౌ,

భవంతౌ కౌ సమాఖ్యాతం మమానుగ్రహకాంక్షయా.

 

పుణ్యాత్ములగు తపోధనులారా! నేను రాజుల నందరిని గెలుచు కోరికతో ఇటకు వచ్చితిని. నన్ను స్మరింపుడు. దయచేసి మీరెవ్వరో చెప్పుడు.

 

తాపసులు:

ఆవాం హేతృప్రహేత్రాఖ్యౌ మనోః స్వాయంభువఃసుతౌ,

ఆవాం దేవవినాశాయ గతౌ స్వో మేరు పర్వతమ్‌.

 

తాపసులు:

మేము స్వాయంభువ మనువు కొడుకులము. హేత, ప్రహేత అని మాపేర్లు. మేము దేవతలను రూపు మాపుటకై మేరు పర్వతమున కేగితిమి.

 

తత్రావయో ర్మహాసైన్యం గజాశ్వరథ సంకులమ్‌,

జిగాయ సర్వదేవానాం శతశోథ సహస్రశః.

 

అచట మా దొడ్డ సేన గజములతో, గుఱ్ఱములతో, రథములతో నిండినదై దేవతలను వందల కొలదిగా, వేల కొలదిగా ఓడించెను.

 

తే చ దేవా మహత్సైన్యం దృష్ట్వా సర్వం నిపాతితమ్‌,

అసురై రుజ్ఘితప్రాణం తతస్తే శరణం గతాః.

క్షీరాబ్ధౌ యత్ర దేవేశో హరిః శేతే స్వయం ప్రభుః,

తత్ర విజ్ఞాపయామాసుః సర్వే ప్రణతిపూర్వకమ్‌.

 

రక్కసుల వలన ప్రాణములు కోల్పోయిన పెద్ద సేనను గాంచి ఆ దేవతలు పాల కడలిలో నిద్రించు దేవ దేవుడగు హరి కడ కరిగి మ్రొక్కులు చెల్లించి యిట్లు విన్నవించు కొనిరి.

 

దేవ దేవ హరే సర్వం సైన్యం త్వసురసత్తమైః,

పరాజితం పరిత్రాహి భీతం విహ్వల లోచనమ్‌.

 

దేవదేవా! హరీ! మా సైన్య మంతయు గొప్ప రక్కసుల చేత ఓడి పోయినది. భయముతో గ్రుడ్లు తేలవైచిన ఆ సేనను రక్షింపుము.

 

త్వయా దేవా సురే యద్ధే పూర్వం త్రాతాః స్మ కేశవ,

సహస్ర బాహోః క్రూరస్య సమరే కాలనేమినః.

 

దేవా! నీవు మునుపు కూడ దేవ దానవుల యుద్ధమున వేయి చేతులు గల, క్రూరుడగు కాలనేమియను రక్కసుని బారి నుండి మమ్ము కాపాడితివి.

 

ఇదానీమపి దేవేశ అసురౌ దేవకంటకౌ,

హేతృప్రహేతృనామానౌ బహుసైన్య పరిచ్ఛదౌ,

తౌ హత్వా త్రాహి నః సర్వాన్‌ దేవదేవ జగత్పతే.

 

దేవాధిదేవా! జగత్పతీ! ఇప్పుడు దేవతలకు ప్రాణ కంటకులు గొప్ప సేన కలవారునగు హేత ప్రహేత అను రక్కసులను చంపి మమ్ముల నందరను కాపాడుము.

 

ఏవ ముక్త స్తతో దేవో విష్ణుర్నారాయణః ప్రభుః,

అహం యాస్యామి తౌ హన్తు మిత్యువాచ జగత్పతిః.

 

వారిట్లు పలుకగా దేవ దేవుడు వారిరువురను హత మార్చుటకై పోయెద నని పలికెను.

 

ఏవ ముక్తా స్తతో దేవా మేరు పర్వత సన్ని ధౌ,

ప్రతస్థు స్తేథ మనసా చింతయంతో జనార్దనమ్‌.

 

విష్ణు విట్లు చెప్పగా దేవత లందరు మనసున జనార్దనుని ధ్యానించుచు మేరు పర్వతము కడకు పోయిరి.

 

తైః సంచిన్తిత మాత్రస్తు దేవ శ్చక్రగదాధరః,

ఆవయోః సైన్య మావిశ్య ఏక ఏవ మహాబలః.

ఏకధా దశధాత్మానం శతధా చ సహస్రధా,

లక్షధా కోటిధా కృత్వా స్వభూత్యా చ జగత్పతిః.

 

ఇట్లు వారు మనసున ధ్యానింపగా చక్రమును గదను చేపట్టిన మహా బలుడగు నారాయణ దేవుడు ఒక్కడే తన్ను తాను పదుగురు, వంద మంది, వేయి మంది, లక్ష మంది, కోటి మందిగా తన మహిమతో చేసికొని మాపై బడెను.

 

ఏవం స్థితే దేవవరే అస్మత్సైన్యే మహాబలః,

యః కశ్చిదసురో రాజ న్నావయో ర్బల మాశ్రితః,

స హతః పతితో భూమౌ దృశ్యతే గతచేతనః.

 

ఆ ప్రభు విట్లు కాగా మా సేనలో దొడ్డ బలము గల ప్రతి రాక్షసుడును మా బలము పుంజుకొన్న వాడయ్యు, ఆతని దెబ్బకు నేల గూలి ప్రాణములు కోల్పోయి కన్పట్టు చుండెను.

 

ఏవం తత్‌ సహసా సైన్యం మాయయా విశ్వమూర్తినా,

నిహతం సాశ్వకలిలం పత్తిద్దిపసమాకులమ్‌.

చతురఙ్గం బలం సర్వ హత్వా దేవో రథాంగధృక్‌,

ఆవాం శేషావథో దృష్ట్వా గతోన్తర్ధాన మీశ్వరః.

 

ఆ విశ్వమూర్తి తన మాయతో గుఱ్ఱములు, కాల్బలము, ఏనుగులు మొదలగు చతురంగ బలములతో కూడిన మా సేన నంతటిని రూపుమాపి మిగిలిన మా యిద్దరను గాంచి యదృశ్యు డాయెను.

 

ఆవయో రీదృశం కర్మ దృష్టం దేవస్య శారింగణః,

తతస్తమేవ శరణం గతా వారాధనాయ వై.

 

మేమిరువురము శార్జ్గపాణిదగు నీ ఘన కార్యమును గాంచి ఆతనినే శరణు చొచ్చితిమి. ఆతనిని పూజింప దొరకొంటిమి.

 

త్వం చాస్మ న్మిత్రతనయః సుప్రతీకాత్మజో నృప,

ఇమేచ ఆవయోః కన్యే గృహాన మనుజేశ్వర,

హేతృకన్యా సుకేశీతు మిశ్రకేశీ ప్రహేతృణః.

 

రాజా! నీవు మా మిత్రుని కుమారుడవు. వీరిరువురు మా బిడ్డలు. ఇందు హేతుని బిడ్డ సుకేశి. ప్రహేత తనయ మిశ్రకేశి. వీరిరువురను నీవు చేపట్టుము.

 

దుర్జయ స్త్వేవముక్తస్తు హేతృణా తే ఉభే శుభే,

కన్యే జగ్రాహ ధర్మేణ భార్యార్థం మనుజేశ్వరః.

 

హేత యిట్లు పలుకగా దుర్జయ మహారాజు చక్కని ఆ కన్యల నిద్దరను ధర్మ మార్గమున భార్యలనుగా స్వీకరించెను.

 

తే లబ్ధ్వా సహసా రాజా ముదా పరమయా యుతః,

ఆజగామ స్వకం రాష్ట్రం నిజసైన్య సమావృతః.

 

అట్లు రాజు వారిరువురను స్వీకరించి పరమానందముతో తనసేనతో కూడి తన రాష్ట్రమునకు తిరిగి వచ్చెను.

 

తతః కాలేన మహతా తస్య పుత్రద్వయం బభౌ,

సుకేశ్యాః సుప్రభః పుత్రో మిశ్రకేశ్యాః సుదర్శనః.

 

అంత కొంత కాలమునకు ఆతనికి సుకేశి యందు సుప్రభుడు, మిశ్రకేశి యందు సుదర్శనుడు అను కొడుకులు పుట్టిరి.

 

సరాజా దుర్జయః శ్రీ మాల్లబ్ధ్వా పుత్రద్వయం శుభమ్‌,

స్వయం కాలాన్తరే శ్రీమాఞ్జగామారణ్య మంతికే.

 

ఇట్లు శ్రీమంతుడగు దుర్జయుడు పుత్రుల నిరువురను పొంది కొంత కాలము గడచిన పిదప దగ్గరలో నున్న ఆరణ్యమున కరిగెను.

 

తత్రస్థో వనజాతీ ర్హి బన్ధయన్‌ వై భయంకరాః,

దదర్శారణ్య మాశ్రిత్య మునిం స్థిత మకల్మషమ్‌.

 

అందుండి ఆతడు భయంకరమగు ఆటవిక జాతుల వారిని లొంగ దీసికొనుచు ఒకనాడు అడవిలో నున్న పుణ్యాత్ముడగు ముని నొక్కని గాంచెను.

 

తపస్యన్తం మహాభాగం నామ్నా గౌరముఖం శుభమ్‌,

ఋషివృందస్య గోప్తారం త్రాతారం పాపినః స్వయమ్‌.

 

ఆ మహర్షి తపస్సు చేసికొను చుండెను. ఆతని పేరు గౌరముఖుడు. ఆతడు ఋషులను కాపాడు చుండెను. పాపాత్ముల పాపములను రూపుమాపు చుండెను.

 

తస్యాశ్రమే విమలజలావిలే మరుత్సుగంధి వృక్ష ప్రవరే ద్విజన్మనః,

రరాజ జీమూత ఇవాంబరా న్మహీముపాగతః ప్రవరవిమానవద్‌ గృమః.

 

నిర్మలము లగు జలములు, గాలికి కదలాడు పువ్వుల నుండి వీతెంచు సువాసనలు గల వృక్షములు గల ఆ బ్రాహ్మణుని ఆశ్రమమున నింగి నుండి నేలకు దిగి వచ్చిన మేఘమో యన్నట్టిదియు, శ్రేష్ఠమగు విమానము వంటిదియు నగు భవన మొకటి వచ్చి నిలిచెను.

 

జ్వలనమఖాగ్ని ప్రతిభా సితామ్బరః సుశుద్ధసంవాసిత వేశకుట్టకః,

శిష్యైః సముచ్చారిత వేదనాదకః సురుపయోషిదృషి కన్యకా కులః,

ఇతీ దృశో స్యావసథో వరాశ్రమే సుపుష్పితాశేష తరుప్రసూనః.

 

ఆ భవనము హోమాగ్నుల జ్వాలలతో విరాజిల్లు ఆకాసము కలదై యుండెను. దాని ముంగిలి భాగములు చక్కని సుగంధ ద్రవ్యముల వాసనలను వెదజల్లు చుండెను. శిష్యులు, వేద వాదములు చక్కగా చేయు చుండిరి. రూపవతులగు కాంతలు, కన్యలు అటు నిటు అందు తిరుగు చుండిరి. అందలి చెట్లన్నియు విరుగ బూచిన పూవులతో అలరారు చుండెను. ఆ దొడ్డ ఆశ్రమమున ఆ ముని గృహమట్లు విరాజిల్లు చుండెను.