వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము - 57

ఇటుపై మిక్కిలి శ్రేష్ఠమగు కాంతి వ్రతమును గూర్చి చెప్పెదను. దీని నాచరించి మునుపు చంద్రుడు తిరిగి కాంతిగల వాడాయెను.

 

చంద్రుడు మునుపు దక్షుని శాపము చేత క్షయ రోగము పొందిన వాడాయెను. ఈ వ్రతమును చేసి వెంటనే మరల కాంతి గల వాడాయెనట.

 

కార్తిక మాస శుక్ల పక్ష ద్వితీయ నాడు రాత్రి బలకేశవ దేవుని అర్చించుచు ప్రయత్నముతో ఈ వ్రతము నాచరింప వలయును.

 

‘ఓంనమో బలదేవాయ’ అని పాదములను, ‘నమః కేశవాయ’ అని శిరస్సును అర్చింప వలయును. బుద్ధిశాలి ఈ విధముగా ఉత్తమ మగు విష్ణువు రూపమును పూజించి సోముడను పేరు గల పరమాత్మ స్వరూపమునకు రెండు కళలు కలదానికి ఈ క్రింది బ్రహ్మ మంత్రముతో అర్ఘ్యము నొసగ వలయును.

 

అమృత స్వరూపుడు, సమస్త మగు ఓషధులకు రాజు, యజ్ఞ లోకమునకు అధిపతి అగు చంద్రరూప పరమాత్మకు నమస్కారము.

 

ఇదే విధముగా బ్రహ్మకును అర్ఘ్య మొసగి రాత్రి విప్రులతో కూడి నేయి కలిపిన యవల అన్నమును తిన వలయును.

 

ఫాల్గునము మొదలు నాలుగు నెలల యందు ఇట్లు పవిత్రుడై పాయసాన్నమును పెట్టుచుండ వలయును. కార్తికమున యవలతో శాలి హోమము చేయింప వలయును.

 

ఆషాడము మొదలగు నాలుగ నెలల నువ్వులతో హోమము చేయింప వలయును. అట్లే నువ్వులు కలిసిన అన్నమును తిన వలయును. ఇదియే పద్ధతి.

 

అంత సంవత్సరము నిండిన తరువాత చంద్రుని వెండి ప్రతిమను చేసి తెల్లని వస్త్రములను రెండింటిని కప్పి తెల్లని పూలతో గంధములతో అర్చింప వలయును. ఇట్లా విప్రునకు కూడ వస్త్రాదికముల నొసగి ఆ ప్రతిమ నాతనికి దాన మీయ వలయును.

 

చంద్రరూపు డవగు శ్రీ నారాయణా! నీకు నమస్కారము. నీ ప్రసాదము వలన నేనును ఈ లోకమున కాంతి మంతుడ నగుదును. సర్వ మెరిగిన వాడ నగుదును. చూడ ముచ్చట అయిన వాడ నగుదును.

 

ఈ మంత్రము చదువుచు వాక్కునందు నియమము కలవాడై విప్రునకు దానమీయ వలయును. ఇచ్చి నంతనే ఆ నరుడు కాంతి మంతుడగును.

 

అత్రి పుత్రుడగు సోముడు, రాజా! ఈ వ్రతమును మును పాచరించెను. ఆ వ్రతము ముగిసి నంతనే స్వయముగా జనార్ధనుడు సంతుష్టి నంది క్షయ రోగమును తీసివైచి అమృత అను కళను ప్రాసాదించెను.

 

ఇట్టి గొప్ప తపస్సు వలన ఆ కళను చంద్రుడు పొందెను. కనుక ఆతనికి సోమత్వము సిద్ధించెను. మరియు ఓషధులకు రాజై యాతడు ప్రకాశించెను.

 

విదియ నాడు అశ్వినీ దేవతలు సోమమును భుజించిరని తెలియ వచ్చు చున్నది. వారు రెండు పక్షము లందును శేష విష్ణులుగా ప్రసిద్ధి కెక్కిరి.

 

రాజా! విష్ణువు కంటె వేరైన దైవము లేదు. అన్ని యెడల నామ భేదము చేత పరమేశ్వరుడే నెలకొని యున్నాడు.