వరాహ మహా పురాణము
అధ్యాయము - 58
మహారాజా! ఇటుపై సౌభాగ్య కరణమను వ్రతమును గూర్చి చెప్పెదను. వినుము. అది స్త్రీలకు, పురుషులకు సౌభాగ్యమును శీఘ్రముగా ప్రాసాదించును.
ఫాల్గున మాసము శుక్ల పక్షము తదియ నాటి రాత్రి సత్యమునే పలుకు పరిశుద్ఢుడు ఈ వ్రతమును చేయ వలయును.
ఆనాడు లక్ష్మీ దేవితో కూడిన విష్ణువును గాని, ఉమా దేవితో కూడిన రుద్రుని గాని పూజింప వలయును. ఏలయన లక్ష్మియే గిరిజ, హరియే ముక్కంటి అని శాస్త్రములు చెప్పు చున్నవి.
ఈ విధముగా అన్ని శాస్త్రముల యందును, పురాణముల యందును పటింప బడినది. దీని కంటె భిన్నముగా ఎవ్వడైన రుద్రుడు విష్ణువు కంటె వేరు అన్నట్లు మానవులకు చెప్పునేని అది కావ్యము కాజాలదు. శాస్త్రము కాజాలదు. విష్ణువు రుద్రుడు కాడు. లక్ష్మి గౌరి కాదు అని చెప్పునది నాస్తిక నరుల కావ్యమని వివేకులు తెలిసికొన వలయును.
ఇది తెలిసికొని లక్ష్మితో కూడిన హరిని భక్తితో పూజించి ఆ పరమేశ్వరుని క్రింది మంత్రముతో అర్చింపవలయును.
‘ఓం నమో గంభీరాయ’ అని పాదములను, ‘నమః సుభగాయ’ అని నడుమును, ‘నమో దేవ దేవాయ’ అని ఉదరమును, ‘నమస్త్రి నేత్రాయ’ అని ముఖమును, ‘నమో వాచస్పతయే’ అని శిరస్సును, ‘నమో రుద్రాయ’ అని సర్వాంగ ములను పూజింప వలయును.
బుద్ధిశాలి ఈ విధముగా లక్ష్మీ సహితుడగు హరిని, లేదా గౌరీ సహితుడగు హరుని గంధ పుష్పాదులతో క్రమముగా పూజింప వలయును.
పిదప ఆ దేవుని ముందు తేనెతో, క్రొత్త నేతితో, నువ్వులతో, ‘ఓం నమః సౌభాగ్యపతయే’ అనుచు హోమము చేయింప వలయును.
అటుపై ఉప్పు కారములు లేనిదియు, నూనె తగులనిదియు అగు గోధుమ అన్నమును తిన వలయును. కృష్ణ పక్షము నందును ఇదియే విధానము. ఆషాడము మొదలగు నెలలలో విదియ నాడు యవల భోజనము.
అటుపై కార్తికము మొదలు కొని మూడు నెలలు నియమముతో పరిశుద్ధుడై చామల అన్నమును తిన వలయును.
పిదప మాఘమాస శుక్ల పక్షమున తదియ నాడు గౌరీ రుద్రుల బంగారు ప్రతిమను, లేదా లక్ష్మీ నారాయణుల బంగారు ప్రతిమను శక్తి మేరకు చేయించి యోగ్యతయు, వివేకము కల బ్రాహ్మణునకు సమర్పింప వలయును.
వేదములు తుదిముట్ట చదివిన వాడు, అన్నము లేని వాడు. సదాచారుడు. దరిద్రుడు అగు బ్రాహ్మణున కొసగ వలయును.
ఆ ప్రతిమలను ఆరు పాత్రలతో కలిపి బ్రాహ్మణున కొసగ వలయును. ఒకటి తేనె పాత్ర, రెండవది నేతిది. మూడవది నువ్వుల నూనె కలది. నాలుగవది బెల్లము కలది. అయిదవది ఉప్పుతో నిండినది. ఆరవది ఆవుపాలు కలది.
ఇట్లు ఈ పాత్రల నిచ్చిన వ్యక్తి స్త్రీ గాని పురుషుడు గాని ఏడు జన్మముల వరకు సుందరుడు, దర్శనీయుడు అగును.
