వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము - 33

 

 

ధర్మము నిర్వహించుటలో సమర్థుడు, క్షమయే గొప్ప ఆయుధముగా ధరించిన వాడు, గొప్ప తేజస్సు గల వాడు అగు మహా తపుడను ఋషి ప్రీతితో ‘రాజా! వినుము, మొట్ట మొదటి దగు రుద్రుని పుట్టుకను గూర్చి మరియొక కథను వినిపింతును’ అని పలికెను.

 

 

భయము గొలుపు తేజస్సు గల ప్రజాపతి పుట్టి అన్నిటి కన్న మిన్నయగు జ్ఞాన భావమును తెలిసికొని సృష్టి చేయ గోరిన వాడై జగత్తు ఎక్కువగా వృధ్ది పొందని కారణమున పట్టరాని కోపముతో క్షోభ పడెను.

 

 

అంత బ్రహ్మ తపస్సు చేయు చుండగా స్థిరమైన కీర్తి కలవాడు పురాణుడు, రజస్తమో గుణములు జారిన ప్రవృత్తి కలవాడు, శ్రేష్ఠుడు, వరముల నొసగు వాడు, ప్రతాపము గలవాడు, నలుపు తిరగిన యెఱ్ఱని వన్నె కలవాడు, పసుపు వన్నె కన్నులు గల వాడునగు ఒక పురుషుడు ఉదయించెను.

 

 

ఆతడు పెద్దగా అరచు చుండగా బ్రహ్మ అరువకు మని పలికెను. అందు వలన ఆ పురాణ పురుషునకు రుద్రుడను పేరు కలిగెను. ‘మహానుభావా! నీవు సమర్థుడవు. సృష్టిని చక్కగా వ్యాపించిన స్వరూపము గల దానినిగా చేయుము’ అని బ్రహ్మ పలికెను. (రుద్రుడు - రోదనము - ఏడుపు గలవాడు - మారుద - ఏడువకు)

 

 

ఇట్లన్నంత మాత్రమున ఆతడు నీట మునిగెను. మునిగి సమర్థుడై కొడుకు కొరకు సృష్టి చేసెను. అట్లు దేవతలలో శ్రేష్ఠుడగు అతడు నీట నుండగా బ్రహ్మ మానస పుత్రులు సృష్టిని విస్తార పరచిరి.

 

 

అట్లు సృష్టి వ్యాప్తి చెందగా దేవేంద్రుడు బ్రహ్మకు సంబంధించిన గొప్ప యజ్ఞమును సాగించెను. మునుపు నీట మునిగిన రుద్రుడు దాని నుండి వెలువడి దేవతలను సృజింప గోరిన వాడాయెను.

 

 

ఆ యజ్ఞమును, దానికై వచ్చిన సురలు, సిద్ధులు, యక్షులు, మొదలగు వారిని గాంచి ఆ రుద్రుడు కోపగించెను. నన్ను కాదని నాకంటె వేరుగా మోహము వలన ఈ జగత్తు నంతటిని ఎవ్వడు సృజించెనని కోపముతో మండి పడెను.

 

 

హా! హా! అని ఆతడు అరచు చుండగా ముదురు పసుపు వన్నె గల ఆతని నోటి నుండి అగ్ని జ్వాలలు కదలాడ జొచ్చెను. అంత క్షుద్రులగు పిశాచములు, బేతాళ భూతములు, యోగులు గుంపులు గుంపులుగా వెలువడిరి.

 

 

భూమియు, ఆకాశము, అన్ని దిక్కులు, అన్ని లోకములు వారితో గొప్పగా నిండి పోగా, ఆతడు సర్వము నెఱిగిన వాడు కనుక ఇరువది నాలుగు మూరల కొలత గల వింటి నొక దానిని నిర్మించెను.

 

 

మూడు పేటల అల్లె త్రాటిని ఆ ధనువునకు ఏర్పరచెను. రోషముతో దివ్యములగు ఆ ధనువును, త్రాటిని పట్టుకొని దానితో పూషుని పండ్లు విరుగ గొట్టెను. భగుని నేత్రములు డుల్చెను. క్రతువు వృషణములు రాల గొట్టెను.

 

 

ఊడిన వృషణములు గల క్రతువు అట నుండి వాయు దేవుని దారి పట్టి యజ్ఞ భూమి నుండి పారి పోయెను. దేవత లందరు పశుపతిని సమీపించి ఆతనికి మ్రొక్కులిడిరి.

 

 

బ్రహ్మయు నచటికే వచ్చి శివుని శాంత పరచి దేవతలను కౌగిలించు కొని ‘దేవా! వీరబాహూ! భక్తి భావము గల వీరి నందరను చూడుము. మరల నీ విజ్ఞానమును మనసునకు తెచ్చు కొమ్ము’ అని ప్రార్థించెను.

 

 

దేవదేవా! నన్ను మొట్ట మొదట నీవు సృజించితివి. వీరిని కాదు. యజ్ఞము నందు నాకు వీరేల భాగమును కల్పింపరు? కావున కోపముతో నేను వీరి జ్ఞానమును కొల్ల గొట్టితిని. అంగ భంగము గావించితిని.

 

 

దేవతలారా! అసురులారా! మీరందరు జ్ఞానము కొఱకు పెద్దగా సూక్తులతో శంభుని కొలువుడు. దానితో భగవంతుడగు రుద్రుడు తుష్టి నందును. ఆతడు తుష్టి చెంది నంతనే మీకు సర్వ విషయములు జ్ఞానము కలుగును.

 

 

బ్రహ్మ యిట్లు పలుకగా దేవత లందఱు ఆ మహత్ము నిట్లు స్తుతించిరి.

 

 

దేవాది దేవునకు, ముక్కంటికి, ఎఱుపెక్కిన గోరోజనము వంటి కన్నులు గల స్వామికి జటలనెడు కిరీటము ధరించు మహాత్మునకు నమస్సులు.

 

 

భూతములతో బేతాళము లతో కూడిన వానికి పెను బాములు జన్నిదముగా గల దేవరకు, భయము గొలుపు అట్టహాసము చేయు మోము గల ప్రభువునకు, కపర్దమను జడల ముడి గల స్వామికి స్థాణువునకు నమస్కారము.

 

 

పూషుని దంతములను, భగుని నేత్రములను డుల్చిన దేవునకు, మున్ముందు ఎద్దు గురుతుగా చేసికొను ప్రభువునకు మహా భూతములకు ఏలిక యైన వానికి నమస్కారము.

 

 

భవిష్యత్తు నందు త్రిపురాసురులను, అంధకా సురుని పరమార్చు వానికి, కైలాస మనెడు శ్రేష్ఠమగు చోట నివసించు వానికి, ఏనుగు తోలు వస్త్రముగా ధరించు వానికి నమస్కారము.

 

 

మిక్కిలిగా భయము గొలుపు నట్టి పైకి లేచిన జుట్టు గల వానికి, భైరవునకు, అగ్ని జ్వాలలతో వెరపు గొలుపు వానికి చంద్రుని శిరో భూషణముగా తాల్చిన వానికి నమస్కారము.

 

 

భవిష్యత్తు నందు కాపాలి వ్రతము (పుఱ్ఱ తాల్చు వాని వ్రతము) కల వానికి, ఉత్కృష్టమగు స్థానమున నుండు వానికి, దారు వనమును ధ్వంసము చేయు వానికి, పదునైన శూలము గల వానికి నమస్కారము.

 

 

పాములను కంకణములుగా తాల్చు స్వామీ! నీలకంఠా! త్రిశూల ధారీ, భయము గొలుపు దండము చేత బట్టిన నీకు, ముఖము నుండి బడబాగ్ని వెలువరుచు నీకు నమస్కారము.

 

 

వేదాంతము చేత తెలియ దగిన వానికి, యజ్ఞ మూర్తికి, దక్షుని యజ్ఞమును పాడు చేసిన వానికి, జగత్తునకు భయము కలిగించు వానికి నీకు నమస్కారము.

 

 

విశ్వమునకు ప్రభువు, దైవము, మంగళ స్వరూపుడు, శుభము కూర్చువాడు, భవుడు, జటాధారి, వెఱపు గొలుపు వాడునగు మహా దేవునకు నీకు నమస్కారము.

 

 

ఇట్లు దేవతలు స్తుతింపగా భయంకరమగు ధనువు తాల్చిన సనాతనుడగు దేవుడు శంభువు ‘నేను దేవులకు దేవుడను, ఏమి చేయ వలయునో చెప్పుడు’ అని పలికెను.

 

 

ప్రభూ! భవా! మా యెడల నీవు ప్రసన్నుడ వైతివేని వేద శాస్త్రములను, విజ్ఞానమును, రహస్యములతో కూడిన యజ్ఞ విధానమును ఆలసింపక మాకు దయ చేయము.

 

 

‘మీరందరు కూడి పశువులగుడు. నేను మీకు పతి నగుదును. ఆ విధముగా మీరందరు మోక్షమును పొందుడు’ అనగా దేవతలు అట్లే అనిరి. శివుడు పశుపతి యాయెను.

 

 

అంత బ్రహ్మ పశుపతితో ప్రసన్న మగు హృదయముతో ఇట్లు పలికెను. దేవదేవా! నీకు చతుర్దశి ప్రీతి కరమగు తిథియగు గాక!

 

 

ఆ తిథి యందు శ్రద్ధతో పూజించి ఉపవాస ముండి, గోధుమ అన్నముతో బ్రాహ్మణులకు సంతర్పణ చేయు వారికి నీవు తృప్తి చెంది మిక్కిలి శ్రేష్ఠమగు స్థానమును ప్రసాదింపుము.

 

 

అవ్యక్తము నుండి ఉదయించిన బ్రహ్మ యిట్లు పలుకగా అంత రుద్రుడు భగునకు దంతములను, పూషునకు కనులను క్రతువునకు బీజములను ఒసగెను. దేవత లందరకు చక్కని జ్ఞానమును ప్రసాదించెను.

 

 

ఇట్లు బ్రహ్మ వలన రుద్రుని పుట్టుక సంభవించెను. ఈ ప్రయోగము వలననే ఆతడు దేవతలకు ప్రభువాయెను.

 

 

వేకువ జామున లేచి యీ కథను విను మానవుడు సర్వ పాపముల నుండి విడివడి రుద్ర లోకమును పొందును.