వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము - 64

ఇటుపై నీకు మిక్కిలి శ్రేష్ఠమైన శౌర్య వ్రతమును గూర్చి చక్కగా తెలిపెదను. దీని వలన పిరికి వానికిని అప్పటి కప్పుడు గొప్ప శౌర్యము కలుగును.

 

ఆశ్వయుజ మాస శుక్ల పక్షమున నవమి నాడు ఉపవాసము చేయ వలయును. సప్తమి నాడు సంకల్పము చేసి అష్టమి నాడును ఉపవాసము ఉండ వలయును.

 

నవమి నాడు మొదట పిండిని భుజింప వలయును. భక్తితో బ్రాహ్మణుకు సంతర్పణము చేయ వలయును. మహామాయ, మహాప్రభ మహాభాగ యగు దుర్గా దేవిని పూజింప వలయును.

 

ఇట్లు ఒక సంవత్సర కాలము విధానము ననుసరించి ఆ తిథి యందు ఉపవాస ముండి బుద్ధి మంతుడగు నరుడు వ్రతము ముగిసిన వెనుక శక్తి ననుసరించి కన్యకలకు అన్న మొసగ వలయును.

 

బంగారు వస్త్రములు మున్నగు వానితో శక్తి మేరకు వారి నలంకరించి పిదప దేవి నా యెడల ప్రీత యగుగాక అని వారి నుద్దేశించి విన్నపము చేయ వలయును.

 

ఇట్లు చేసినచో రాజ్యమును కోలుపోయిన వాడు రాజ్యమును తప్పక పొందును. విద్య లేని వాడు విద్యను పొందును. భయము నందిన వాడు శౌర్యమును పొందును.