వరాహ మహా పురాణము
అధ్యాయము - 62
మహారాజ! మిక్కిలి పుణ్యమైనది, పాపము లన్నింటిని పటాపంచలు చేయునది అగు ఆరోగ్య వ్రతమను పేరుగల వ్రతమును తెలియ జేసెదను.
మాఘ మాసము శుక్లపక్ష సప్తమి నాడు ఉపవాస ముండి విష్ణు రూపుడు, సనాతనుడు నగు భాస్కర దేవుని పూజింప వలయును.
ఆదిత్యా! భాస్కరా! రవీ! భానూ! సూర్యా! దివాకరా! ప్రభాకరా! అనుచు పూజింప వలయును.
షష్ఠినాడు ఆహారము తీసికొని సప్తమి నాడు భానుని పూజింప వలయును. అష్టమి నాడు మరల భోజనము చేయ వలయును. ఇది యిందలి విధి క్రమము.
ఈ విధితో ఒక నిండు సంవత్సరము సూర్యు నర్చించు వానికి ఈ జన్మమున ఆరోగ్యము, ధనము, ధాన్యము లభించును. పరమున, మరల తిరిగి రాని శుభ స్థానము (మోక్షము) కలుగును.
మునుపు అనరణ్యుడను గొప్ప బలము గల రాజు ఈ వ్రతముతో భాస్కరుని అర్చించెను. అతని యెడ తుష్టుడై ఆ దేవుడు ఉత్తమ మగు ఆరోగ్యమును ప్రాసాదించెను.
ఈ వ్రతముతో ఆరోగ్యమును పొందిన ఆరోగ్యము గల రాజెవ్వడు? సార్వభౌమునకు అంతటి రోగమెట్లు కలిగినది?
ఆతడు సార్వభౌముడును, గొప్ప కీర్తియగు మంచి రూపమును కలవాడై యుండెను. ఒకనాడా రాజశ్రేష్ఠుడు మహా బలుడు దేవ గణములతో కూడినదియు దివ్యమును అగు మానస సరోవరమున కరిగెను. అందు సరస్సు నడుమ నున్న తెల్లని పెద్ద తామర పూవును చూచెను.
చూచి సారథితో ఇట్లనెను, ఈ పద్మమును కొని రమ్ము. దీనిని తలపై తాల్చి అందరి యెదుట ప్రశంసకు పాత్రుడ నగుదును. కనుక ఆలసింపక కొనిరమ్ము.
ఇట్లు రాజు పలుకగా సారథి ఆ కొలను లోనికి ప్రవేశించి ఆ పద్మమును కైకొన నుంకించెను.
ఆ పద్మమును తాకినంత మాత్రమున ఒక హుంకారము బయలు వెడలెను. ఆ శబ్దముతో ఆతడు భీతుడై నేల గూలి మరణించెను.
నృపతియు ఆ శబ్దముతో ఒక్క పెట్టున రంగు మారిపోయి కుష్ఠియు, బల వీర్యములు లేని వాడును ఆయెను.
అట్లు అయిన తన్ను చూచుకొని ఆ పురుష వరేణ్యుడు శోకము పైకొనగా ఇది ఏమి? అని చింతించుచు అందే ఉండెను.
అట్లు చింతించు చుండగా ఆతని కడకు మహా తపస్వి బ్రహ్మ పుత్రుడు, బుద్ధి శాలియునగు వసిష్ఠు డరుదెంచి ఆ రాజు నిట్లడిగెను.
మహారాజా! నీ దేహమునకీ శిక్ష యేమి? ఇప్పుడు నీవు చేయ వలసిన దేమి? నాకు చెప్పుము.
ఇట్లు మహాత్ముడగు వసిష్ఠుడు పలుకగా ఆ రాజు ఆ పద్మ వృత్తాంతము నంతటిని ఆతనికి తెలిపెను.
అది విని ముని రాజా! నీవు మంచి వాడవు, చెడ్డ వాడవు అయితివి కనుక నీకీ కుష్ఠరోగము కలిగినది. అని పలికెను.
అతడట్లు పలుకగా రాజు చేతులు జోడించి వణకి పోవుచు విప్రా! నేనెట్లు సాధువను, అసాధువను అయితిని? నాకీ కుష్ఠరోగ మెట్లు వచ్చినది? దీనిని నీవు చెప్ప వలయునని పలికెను.
రాజా! ఇది మూడు లోకములలో ప్రసిద్ధి కెక్కిన బ్రహ్మోద్భవ మను పద్మము. దీనిని చూచినంతనే సర్వ దేవతలును కానవత్తురు. ఇది ఎందైనను ఆరు నెలలు మాత్రమే కాన వచ్చును.
దీనిని చూచినంతనే జలమున ప్రవేశించు నరుడు పాపము లన్నింటిని పాడు చేసికొని మోక్షమును పొందును.
బ్రహ్మము యొక్క మొదటి దశయగు మూర్తి నీటి యందు నెలకొని యున్నది. దానిని చూచి జలమున మునిగిన వాడు సంసారము నుండి ముక్తి పొందును.
రాజా! దీనిని చూచి, దానిని కైకొనుటకై జలమున మునిగి నీ సూతుడు సుగతి కరిగెను. నీవు పాడు బుద్ధితో ఈ కుష్ఠ రోగమును పొందితివి.
నీవు దీనిని చూచి నందు వలన నిన్ను నేను ‘సాధువు’ అంటివి. మోహము పొందితిని కావున ‘అసాధుడవు’ అంటిని.
నేను బ్రహ్మ పుత్రుడను. నేను ప్రతి దినము వచ్చి ఈ పరమేశ్వరుని చూచు చుందును. అట్లే నీవును చూచితివి.
ఈ బంగారు పద్మమును గాంచి దేవతలును బ్రహ్మ పద్మ రూపమున మానస సరోవర మునకు హరి వచ్చి యున్నాడు మేము మరల తిరిగి వచ్చుటన్నది లేని ఆ పర బ్రహ్మమును పొందె దమని పలుకుదురు.
రాజా! నీ కుష్ఠ రోగమునకు కారణమును కూడ చెప్పెదను వినుము. ఈ పద్మము గర్భమున స్వయముగా సూర్య దేవుడు నెలకొని యున్నాడు. ఆతడు నిజమునకు శాశ్వతుడగు పరమాత్మయే అట్టి ఈ పద్మమును గాంచి నీవు దీనిని తలపై విభూషణముగా తాల్చి లోకమున వెలిగి పోయెద నని భావించితివి. ఇట్లు వాగిన నీకు ఈ పాపము నా దేవుడు చూపెను. నీవిపుడా దేవునే ఆరాధింపుము.
అగస్త్యుడు:
అగస్త్యుడు:
ఇట్లు పలికి ఆ వసిష్ఠ మహర్షి ఆతనికి ఆరోగ్య వ్రతమను పేరుగల ఈ వ్రత విధానమును, సూర్య ఆరాధన పద్ధతిని వివరించెను.
ఆ రాజును భక్తితో కూడిన వాడై ఈ వ్రతమును కావించెను. పరమ సిద్ధిని పొందెను. వెను వెంటనే రోగము లేని వాడాయెను.
