వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము – 118

 

ఇట్లు సంసారము నుండి విముక్తి కలిగించు పూజా విధానమును విని భూదేవి ప్రసన్న మగు ముఖము గల దేవునితో మరల ఇట్లు పలికెను.

 

 

నీ మార్గము నను సరించు వాని గొప్ప శక్తి గల కర్మమును గూర్చియు, నీకు నైవేద్యము నొసగుటను గూర్చియు, దేవా! నేను ప్రీతితో వింటిని. నివేదనము ఏ వస్తువుతో కూడి నదియో, మాధవా! నాకు తెలియ జెప్పుము.

 

భూదేవి పలుకు విని గొప్ప ఆత్మ కలవాడు, ధర్మజ్ఞుడు, వాక్య కోవిదుడు అగు వరాహ దేవుడు ధర్మముతో కూడుకొన్న విధముగా నిట్లు పలికెను.

 

 

నాకు నైవేద్యమును మంత్ర పూర్వకముగా ఒసగ వలయును. ఏడు విధములగు ధాన్యములను పాలతో పాటుగా గ్రహించి, కూరలను, ఇప్ప పూవులను, మేడి పూవులను నాకు సమర్పింప వలయును.

 

ఇంకను ఇట్టి పనికి ఉపయోగ పడునవి వందల కొలదిగా వేల కొలదిగా కలవు. వానిని నేను చక్కగా చెప్పి యుంటిని.

 

మాధవీ! నీ నివేదనమునకు ఉపయోగింప దగిన ధాన్యములను చెప్పెదను. స్థిరమగు చిత్తముతో ఆలకింపుము.

 

ధర్మచిల్లిక శాకము, సుగంధము, రక్త శాలికములు, దీర్ఘశాలి, మహాశాలి, వర కుంకుమము, మక్షికము, ఆమోదములు, సివ సుందరి, శిరిక, కుల, కాలికములు మొదలగునవి ఉపయోగ పడునవిగా కర్మజ్ఞుడు తెలియ దగును.

 

పప్పు ధాన్యములతో పెసలు, మినుములును, నూవులు, కొఱ్ఱలు, ఉలవలు, అడవి వడ్లు, మహా మోహము, మకుంఠము, వాహిజము అనునవి ఈ కర్మమునకు పనికి వచ్చునవి.

ఇంకను, ఓ వసుంధరా! చామలు కూడ నైవేద్యమునకు యోగ్యములు. ఇంకను భాగవతులకు ప్రియమైన వానిని నేను గ్రహింతును. వ్యంజనములను గూర్చి చెప్పెదను వినుము.

 

పశువుల పాలు మొదలగు వానిలో నేవి ఉపయోగింప దగినవో చెప్పెదను. గోవు పెరుగు, పాలు, నెయ్యు నాకు ఒసగ దగినవి. గేదె, గొఱ్ఱె, మేక అనువాని పాలు మొదలగునవి యజ్ఞమునకు పనికి రానివిగా చెప్పుదురు.

 

లేడి, పొట్టేలు, కుందేలు అనువాని మాంసము నాకు ప్రియ మైనది. కనుక నైవేద్యమున నాకొస గదగును. వేదము కడదాక చదివిన బ్రాహ్మణుడు యజ్ఞము నందును వీనిని వాడు చుండును.

 

ఆ యజ్ఞము నందు నాకును ఆ పశువు మాంసము నందు భాగము కలదు. గేదె పాలు, పెరుగు, నెయ్యి అను వానిని నా విషయమున వదలిపెట్ట వలయును.

 

విష్ణు సంబంధమైన పూజలో యజుర్వేద మంత్రములతో చేయు దానిలో మాంసములను ముఖ్యముగా ఒంటి గిట్టలు గల జంతువుల పాలు మాంసము మొదలగు వానిని పరి హరింప వలయును.

 

నా పూజల యందు ఉపయోగింప దగిన పక్షులను గూర్చి తెలిపెదను వినుము.

 

కౌకుర మాంసము, నెమలి, కోడి, లావుక పిట్ట, వార్తికము కముజు పిట్ట, వేణుకము, కశ్చికము, గొప్ప శక్తి గల సమాతము కుకురము అనువాని మాంసములు నాకు ప్రియమైనవి. అట్లే పంచ కోటకము, ఖారిక, అనునవియు పక్షులలో ఇష్టము లైనవి.

 

పక్షులలో నల్లని రెక్కలు కల దానిని నాకు ఒసగ రాదు. కాని గిరివర్తికము, పదవిలాసకము, చిత్రము, అంగకపోతము అను నాలుగు పక్షి జాతులు పూజ కుపయోగింప దగినవి.

 

ఇవియు, మరియు వందల కొలది వేల కొలదిగా నా పూజల యందు ఉపయోగింప దగిన కలవు.

 

వీనిని చక్కగా తెలిసికొని పూజా కార్యము నొనరించు వాడెన్నటికిని అపరాధము చేయువాడు కాదని నేనే పలుకు చున్నాను.

 

నాకును, నాక్తులకును సుఖము కూర్చెడు భోజ్యములు, మంగళ వస్తువులు అను వానితో ఉత్తమ సిద్ది కోరువాడు పూజల నాచరింప వలయును.

 

ఈ విధానముతో పూజ నొనరించు వారు నా పూజను ముగించిన వారై పరమ సిద్ధిని పొందెదరు.