వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము - 110

 

ఇక ఇటుపై యగు కపిలా ధేనువును గూర్చి చెప్పెదను. దాని దానము వలన నరుడు అత్యంత శ్రేష్ఠమగు విష్ణు లోకమును పొందును.

 

మునుపు చెప్పిన విధానముతో దూడతో కూడిన కపిల ధేనువును, అన్ని అలంకారములు, అన్ని రత్నములు కల దానిని దానము చేయ వలయును.

 

కపిల ధేనువు తల యందు, కంఠము నందును బ్రహ్మ ఆదేశము వలన సర్వ తీర్థములు నెలకొని యుండును.

 

ఉదయమున లేచి మానవుడు పుల్లావు మెడ నుండియు, తల నుండియు జారిన నీటిని భక్తితో తలకద్దు కొనుచు శుచియై ఆ పవిత్ర జలము వలన ఆప్పటి కప్పుడు మాడిన సర్వ పాపములు కల వాడగును. ముప్పదేండ్లు చేసిన పాపమును కూడ, అగ్ని కట్టెను వలె, కాల్చి వేయును.

 

ఉషః కాలమున లేచి కపిల గోవులకు ప్రదక్షిణము చేయు నరుడు, ఓ భూదేవి! భూమికి ప్రదక్షిణము చేసిన వాడగును.

 

శ్రద్ధతో కూడిన ఒక ప్రదక్షిణము చేత పది జన్మములలో చేసిన ఆతని పాపము నశించును. సంశయము లేదు.

 

కపిల గోవు మూత్రముతో స్నానము చేసిన మానవుడు మిక్కిలి పతివ్రతు డగును. గంగ మొదలగు తీర్థము లందు స్నానము చేసిన వాడగును.

 

ఆ ఒక్క స్నానము మంచి భావముతో చేసిన నరుడు పుట్టినది మొదలు కొని చేసిన సర్వ పాపముల నుండి విముక్తు డగును. సంశయము లేదు.

 

వేయి గోవులను ఇచ్చు వాడును. ఒక్క కపిల ధేనువు నిచ్చు వాడును సమాన మేయని లోకపితా మహుడగు బ్రహ్మ మునుపు నొక్కి చెప్పెను.

 

గోవుల ఎముకను కాల్పరాదు. చచ్చిన ఆవు వాసనను నిందింప రాదు. ఆ వాసనను గ్రహించు నంత వరకు ఆతడు పుణ్యములతో నిండి పోవును.

 

గోవులను గోకుట ఉత్తమ కార్యము. అట్లే గోవులను పెంచుట మంచిది. వానికి భయము, రోగము కలిగి నపుడు రక్షించుట నూరావులను దానము చేయుటతో సమానము.

 

ప్రతి దినము ఆకలి గల ఆవులను గడ్డి నీరు ఇచ్చు ఉత్తమ మానవుడు గోమేధము చేసిన ఫలమును పొందును.

 

అట్టివాడు పెక్కు విధములగు దివ్య విమానములతో చుట్టు నున్న కన్యలతో మంచి గంధములతో సేవలు కొనుచున్న వాడై అగ్నుల వలె వెలిగిపోవు చుండును.

 

బంగారు వన్నెతో గోరోచన వర్ణము కలిసినది మొదటిది. పసుపు ఎరుపులు కలిసినది రెండవది. ఎర్రని కన్నులు కలది మూడవది. బెల్లము రంగు కలది నాలుగవది. పెక్కు రంగులు కలది అయిదవది. తెలుపు గోరోజనము వన్నెలు కలది ఆరవది. తెలుపు గోరోచనముల వన్నెకల కన్నులు కలది ఏడవది. నలుపు గోరోచనముల వన్నెలు కలిసినది ఎనిమిదవది. తెలుపు ఎరుపుల కలయిక కలది తొమ్మిదవది. తోక యందు గోరోజన వర్ణము కలది పదియవది. గిట్టల యందు తెలుపు కలది పదు నొకండవది. వీనిలో అన్ని లక్షణములు కలది గొప్పది.

 

అన్ని లక్షణములు కలదియు సర్వాలంకారము లతో చూడ ముచ్చట అయినదియు నగు గోవును బ్రాహ్మణునకు సమర్పింప వలయును. గోవులు భుక్తిని ముక్తిని ఇచ్చునవి. వాని దానము చేసిన వాడు విష్ణు లోకమున కరుగును.