వరాహ మహా పురాణము
అధ్యాయము - 99
రాజా! జల ధేనువును గూర్చి చెప్పెదను పుణ్య దినమున విధి పూర్వకముగా గోమయముతో మండలము చేసి దానిపై గోవు చర్మమును ఉంచి దాని నడుమ పూర్ణ కుంభమును ఉంచ వలయును. గంధముతో, కర్పూరము, అగురు, చందనము అనువాని సువాసన గల నీరు నింపి ఆ ధేనువును ఏర్పరుప వలయును.
అట్లే మరియొక కుంభమును నేతితో నింపి ఆకులతో పూవులతో అలంకరింప వలయును. గరిక మొలకలను క్రింద నుంచ వలయును. పూల మాలలతో అలంకరింప వలయును.
అయిదు రత్నములను ఆ కుంభమున నుంచ వలయును. అట్లే మాంసి, ఉశీరము, కుష్ఠము, కొండ మట్టి అను వానిని అందు నిలుప వలయును. (మాంసి = జటామాంసి అను మూలిక; ఉశీరము = వట్టివేరు; కుష్ఠము = చెంగల్వకోష్టు; శైలేయవాలుకము = కొండ ఏటి లోని ఇసుక).
దానిలో ఆమలములు, తెల్ల నువ్వులు, సర్వ ధాన్యములు ఉంచ వలయును. నాలుగు దిక్కు లందును నాలుగు పాత్రలను పెట్ట వలయును. (ఆమలము = ఉసిరిక కాయ)
ఒకటి నేతి పాత్ర, రెండవది పెరుగు పాత్ర, మూడవది తేనె పాత్ర, నాలుగవది చక్కెర గిన్నె.
బంగారు మొగము, నల్లని అగురుతో చేసిన కొమ్ములు, మేలైన ఆకుల చెవులు, ముత్యములతో చేసిన చూపులు, ఎఱ్ఱని పిరుదు, కంచు పాత్ర దర్భలే వెండ్రుకలు, త్రాటితో తోక, నల్లని ఆభరణములు, గంటలు కలిగిన ఆవును చేయ వలయును.
గంగడోలు నందు పూల మాల నుంచ వలయును. బెల్లపు మొగము, ముత్యపు చిప్పల దంతములు, చక్కెరతో నాలుక, వెన్నతో పొదుగు, చెరకు గడలతో కాళ్లు కల ఆవును చేసి సర్వా భరణములతో అలంకరింప వలయును.
నల్లని లేడి చర్మము పైనుండి వస్త్రములతో కప్పి గంధ పుష్పములతో చక్కగా పూజ చేసి దానిని విప్రునకు సమర్పింప వలయును.
వేదము తుదిదాక అధ్యయనము చేసిన వాడు, సాధువు, శ్రోత్రియుడు, ఆహితాగ్ని, తపస్సు చేతను, వయస్సు చేతను పెద్దవాడు, కుటుంబము కలవాడు అగు బ్రాహ్మణునకు ఆ ధేనువును దానము చేయ వలయును.
రాజా! ఇట్లు దానము చేయువాడు, చూచువాడు, వినువాడు, పుచ్చుకొను వాడగు విప్రుడు, వీరందరు పాపము నుండి దాటుదురు.
బ్రహ్మ హత్య, క్రూర హత్య, గోహత్య అనునవి చేసిన వాడు, మద్యము త్రావు వాడు గురు పత్నిని చెరచిన వాడును సర్వ పాపముల నుండియు దీని వలన విముక్తు డగును. విష్ణు లోకమున కరుగును.
రాజా! అశ్వమేధ యాగమును, శ్రేష్ఠమగు దక్షిణలతో పూర్తి చేసిన వాడును, జల ధేనువును దాన మొసగిన వాడును సమానులే.
ఈ జలధేను దానము చేయువాడు ఒక దినము జలాహారము. ఒకదినము పాల ఆహారమును మాత్రమే పుచ్చుకొని వ్రత మాచరింప వలయును. దానము పుచ్చు కొనువాడు గూడ మూడు రాత్రులు ఇట్లే ఉండ వలయును.
ఈ జలధేను దానము చేయువారు పాలతో ప్రవహించు నదులు, తేనె, పాయసముల సమృద్ధి, అప్సరసల పాటలు గల పుణ్య లోకముల కరుగుదురు.
ఇచ్చువాడు, ఇప్పించు వాడు, పుచ్చుకొను బ్రాహ్మణుడును అన్ని పాపములను రూపు మాపుకొని విష్ణు లోకమున కరుగుదురు. సంశయము లేదు.
ఈ జలధేను విధానమును గూర్చి విన్న వాడును, పలికిన వాడును, పాపము లన్నింటిని పోగొట్టు కొని ఇంద్రియములను గెలిచిన వాడై స్వర్గమున కరుగును.
