వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము - 56

ఇటుపై మిక్కిలి శ్రేష్ఠమగు ధన్య వ్రతమును గూర్చి చెప్పెదను. దాని చేత అధన్యుడు కూడ వెను వెంటనే ధన్యుడగును.

 

మార్గశీర్ష మాసము శుక్ల పక్షమున పాడ్యమి నాడు రాత్రి పూట ఈ వ్రతమును చేయ వలయును. ఆనాడు విష్ణు రూపుడైన అగ్ని దేవుని పూజింప వలయును.

 

 

‘ఓం నమో వైశ్వానరాయ’ అని పాదములను, ‘నమోగ్నయే’ అని ఉదరమును, నమో హవిర్భుజాయ అని వక్షస్సును, ‘నమో ద్రవిణోదాయ’ అని భుజములను, ‘నమః సంవర్తాయ’ అని శిరస్సును, ‘నమో జ్వలనాయ’ అని సర్వాంగ ములను విధి ననుసరించి దేవ దేవుడైన జనార్దనుని అభ్యర్చింప వలయును.

 

ఆ దేవుని ముందు విధానము ననుసరించి హోమ కుండమును ఏర్పరుప వలయును. ఈ మంత్రములతో వివేకవంతుడు హోమమును అందు చేయ వలయును.

 

పిదప నేయి కలిపిన సగ్గు బియ్యపు అన్నమును భుజింప వలయును. కృష్ణ పక్షము నందును ఇట్లే చేయ వలయును. ఈ విధముగా నాలుగు మాసములు చేయ వలయును.

 

చైత్రము మొదలగు నెలలలో నేయి కలిపిన పాయసమును, శ్రావణము మొదలగు వాని యందు పేల పిండిని భుజించి వ్రతము ముగింప వలయును.

 

 

 

వ్రతము ముగిసిన పిదప బంగారు అగ్ని దేవుని ప్రతిమను చేయింప వలయును. ఎర్రని వస్త్రములు రెండు చుట్ట వలయును. ఎర్రని పూలతో కప్ప వలయును. కుంకుమ పూయ వలయును. ఇట్లు బ్రాహ్మణునకును చేయ వలయును. ఏ అంగ వైకల్యము లేని వాడు, చక్కని రూపము కలవాడు నగు ఆ బ్రాహ్మణునకు రెండు ఎర్రని వస్త్రములను దాన మొసగి పూజింప వలయును. పిదప నేను ధన్యుడను. ధన్యమగు కర్మములు కలవాడను, ధన్యమగు చేష్టలు కలవాడను. పుణ్య వంతుడను. ఉత్తమముగా సాగించిన ఈ వ్రతము చేత సర్వ కాలము లందును సుఖిని అగుదును’ అను మంత్రముతో ఆ ప్రతిమను ఆ బ్రాహ్మణునకు దాన మీయ వలెను.

 

ఇట్లు పలికి ఆ కోశమును విప్రుని యందు సమర్పించిన మహాత్మునకు వెను వెంటనే ధన్యత కలుగును. ఆతడు భాగ్యహీను డైనను నిది సిద్ధించును.

 

ఈ వ్రతము చేసిన మాత్రమున ఈ జన్మము నందు సౌభాగ్యము, ధనము, ధాన్యము పుష్కలముగా కలుగును. సంశయము లేదు.

 

మునుపటి జన్మము లందేర్పడిన ఆతని పాపమును కూడ అగ్ని కాల్చి వేయును. అట్లు పాపము దగ్ధము కాగా ఆతడు విము క్తాత్ముడు ఈ జన్మము నందే యగును.

 

ప్రతి దినము దీనిని విను వాడును, భక్తితో పఠించు వాడును ఇద్దరును ఈ లోకమున వెంటనే ధన్యు లగుదురు.

 

మరియు పూర్వ కల్పమున మహాత్ముడగు కుబేరుడు శూద్ర జన్మమున నున్నవాడై ఈ వ్రతము నాచరించినట్లును విన వచ్చు చున్నది.