వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము - 124

కొనియాడ బడు వ్రతములు గల భూదేవి ఆరు ఋతువుల కర్మములను విని నారాయణ దేవునితో మరల ఇట్లనెను.

 

మంగళ కరములు, పవిత్రములు నగు విషయములను చెప్పితివి. ఇవి నా లోకము లందు తేట తెల్లము లగును. నామనస్సునకు మిక్కిలి ఆనందమును కూర్చు చున్నవి.

నీ ముఖము నుండి పలుక బడిన యీ అర్చన కర్మములను విని, దేవా! మాధవా! శరత్కాలపు చంద్రుని వలె నిర్మల నయితిని.

 

మిక్కిలి రహస్యము, వేడుక పుట్టించు నదియునగు ఈ విషయమును, నా మేలు కొరకు విష్ణూ! నీవు చెప్పదగును.

 

దేవా! పలు మారులు నీవు ‘నా మాయ’ అను చుందువు. ఆ మాయ అనగా నేమి? ఎటువంటిది? దేనిని మాయ యందురు. ఈ మాయా రహస్యమును మిక్కిలి ఉత్తమ మైన దానిని తెలియ గోరు చున్నాను.

 

అంత ఆమె మాటను విని మాయకు బరణి యగు విష్ణువు చిరునవ్వు నవ్వి భూదేవితో మధురమగు ఈ వాక్యమును పలికెను.

 

భూదేవీ! ఈ మాయను గూర్చి అడుగకుము. నీవు కష్టపడ నేల? మాయను తెలిసికొన జాలవు.

 

ఈనాటికిని రుద్రుడు, ఇంద్రుడు, బ్రహ్మయు నా మాయను తెలియ జాలరు. విశాలాక్షీ! ఇంక నీ సంగతి చెప్పనేల?

 

ఒకచోట వాన దేవుడు పెద్దగా కురియును. ఆ ప్రాంతము నీటితో నిండి పోవును. మరియొక దేశము నీటి బోట్టు లేక యెండి పోవును. ప్రియా! ఇది నా మాయ.

 

చంద్రుడు ఒక పక్షమున తరుగుదల నందును. మఱియొక పక్షమున పెరుగు దల పొందును. అమావాస్య నాడు మొత్తముగా కనబడడు. ఇదియే నా మాయ.

 

హేమంతమున (చలి కాలమున) నూతిలో నీరు వేడిగా నుండును. గ్రీష్మమున (వేసవి యందు) చల్లగా నుండును. ఇది తత్వమును బట్టి నా మాయ.

 

సూర్యుడు పడమటి దిక్కున చేరి అస్తమించి మరల ఉదయమున తూర్పు దిక్కున ఉదయించును. ఇది నా మాయ.

 

రక్తము, శుక్లము రెండును ప్రాణుల యందు ఉండు ననియే. అవి గర్భమున చేరి క్రొత్త జీవియగు చున్నది. ఇది నా ఉత్తమ మాయ.

 

జీవుడు గర్భమున ప్రవేశించి సుఖమును, దుఃఖమునను పొందును. పుట్టి నంతనే దాని నంతటిని మరచి పోవును. ఇది నా గొప్ప మాయ.

 

తాను చేసిన కర్మములను పట్టి వ్రేలాడి జీవుడు తెలివిని, చేష్టను కోల్పోవును, కర్మము వానిని మరియొక చోటికి గుంజుకొని పోవును. ఇది నా దొడ్డ మాయ.

 

రక్తము, వీర్యము, కలిసి కదా జంతువులు పుట్టుట! వ్రేళ్లు, పెదవులు, ముక్కు, చెవులు, కనులు, బుగ్గలు, నుదురు, నాలుక ఇవన్నియు ఏర్పడుట నా మాయ, దాని తోడనే ప్రాణుల పుట్టుట.

ఆతడు తిన్న తిండిని జఠరాగ్ని పీల్చి వేయగా అది అరిగి పోవుచున్నది. పిదప క్రింది నుండి మల రూపమున జారిపోవు చున్నది. ఇది నా మహా మాయ.

 

శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అను వానితో జంతువు ప్రవర్తించు చున్నది. ప్రియా! ఇది నా మాయ (జంతువనగా పుట్టిన ప్రాణి అని అర్థము)

 

స్థావరము, జంగమము అను వారి యందు అన్ని ఋతువులలో ఒకే ఆకారము. కాని దాని తత్త్వము తెలియ రాదు. ఇది నా మాయ.

 

ఆకసమున నీరు కలదు. భూమి యందు నీరున్నది. అవి వృద్ధి పొంద కున్నవి. ఇది నా పరమ మాయ.

 

వర్షర్తువున గుంటలు, చెరువులు నీటితో నిండి పోవును. గ్రీష్మమున అవి యన్నియు ఎండి పోవును. ఇది నా మాయా బలము.

 

హిమవంతుని శిఖరము నుండి జాలు వారిన నదికి మందాకిని అని పేరు. అదియే నేలకు దిగు నప్పటికి గంగ అయినది. ఇది నా మాయ. (గాంగతా = నేలకు వచ్చినది = గంగా).

ఉప్పునీటి సముద్రము నుండి మేఘములు నీరు గ్రహించు చున్నవి. లోకమున తీయని నీటిని కురియు చున్నవి. ఇది నా మాయా బలము.

 

కొన్ని ప్రాణులు రోగములను పొంది గొప్ప ఔషధములను తిను చుందురు. వాని శక్తి యందు నేను నా మాయను జార విడుతును.

 

మందు నొసగినను ప్రాణి మరణించు చున్నది. అనగా ఔషధమును శక్తి హీనము చేసి నేను కాల రూపుడనై హరించు వేయుదు నన్నమాట.

మొదట గర్భము ఏర్పడు చున్నది. తరువాత పురుషుడు పుట్టు చున్నాడు. కొంత కాలమునకు నడి వయస్సు వాడగు చున్నాడు. అటుపై ముసలి తనము, ఆపై ఇంద్రియములు నశించు చున్నవి. ఇది యంతయు నా మాయా బలము.

 

నేల యందు విత్తనము నాటుదురు. అది మొలకెత్తు చున్నది. వెదజల్లిన ఒక్క విత్తనము నుండి గింజలు పెక్కులు కలుగు చున్నవి. దాని యందు నేను మాయ కూర్పుతో అమృతమును జాలు వార్తును.

 

గరుడుడు విష్ణువును మోయు చున్నాడని లోకము సంభావించును. నిజమునకు నేనే వేగముతో గరుడుడనై నన్ను నేను మోసికొను చున్నాను.

 

ఈ దేవత లందరు యజ్ఞ భాగముతో సంతసించు చున్నారు. నేనే ఈ మాయను కల్పించి స్వర్గ వాసులను తృప్తి పరచు చున్నాను.

 

దేవతలు ఎల్లవేళల యజ్ఞము నందలి హోమ ద్రవ్యములను భుజింతురని లోకు లందరు తలచు చున్నారు. నేనే మాయను కల్పించి సర్వదా ఆ దేవతలను రక్షించు చుందును.

 

బృహస్పతి యజ్ఞకర్త అని లోక మంతయు కొనియాడు చుండును. ఆంగీరస మాయను కల్పించి దేవతల యాగములను చేయించు నది నేనే.

 

వరుణుడు సముద్రమును పాలించు చున్నాడని లోకు లందరు తలతురు. వారుణ మాయ కల్పించి మహా సముద్రమును కాపాడు చున్నవాడను నేనే.

 

కుబేరుడు ధనమునకు ప్రభువని లోకము లన్నియు సంభావించును. కుబేర మాయను స్వీకరించి ఆ ధనమును నేనే రక్షింతును.

 

వృత్రుని ఇంద్రుడు పరిమార్చెనని లోకులు అనుకొను చున్నారు. ఇంద్ర సంబంధమగు మాయను తాల్చి వృత్రుని రూపు మాపినది నేనే!

 

లోకులు ఆదిత్యుడు కదలని మహా గ్రహమని తల పోయుదురు. మాయా మయమగు దేహమును తాల్చి ఆదిత్యుని మోయు చున్నది నేనే.

 

నీరంతయు వట్టి పోవు చున్నదని లోకము వాకొనును. బడబాగ్ని రూపము తాల్చి దానింతటిని నేనే త్రాగివేయు చున్నాను. వాయు మాయను తాల్చి దానిని మేఘము లందు వదలు చున్నాను.

 

లోకము ఈ నీరంతయు గూడుకట్టి యెక్కడ నిలుచు చున్నది అని పలుకును. అమృత మొక్కడ నిలుచునో దేవతలును ఎరుగరు. అది నా మాయ చేసిన ఆజ్ఞ మేరకు ఓషధుల యందు నిలిచి యున్నది.

 

రాజు ప్రజలను పాలించునని లోకము భావన. కాని రాజ మాయను కల్పించి వసుంధరను నేను పాలించు చున్నాను.

 

యుగము ముగియు నప్పుడు పన్నిద్దరు భాస్కరులు ఉదయింతురు. నేను వారిలో చొరబడి లోకమున మాయను సృజింతును.

 

భూమి! వర్షము ధూళితో పాటు లోకముల యందు పడు చున్నది. పాంసుమయా మాయను కల్పించి నేనే జగత్తును నింపుదును.

 

సంవర్తమను మేఘము రోకలిపాటి ధారలతో కురియును. సంవర్తక మాయను గ్రహించి లోక మంతటిని నింపు వాడను నేను.

 

ధాత్రీ! నేను శేషునిపై పవ్వళించి నిద్రింతునని లోకము భావించును. అనంత మాయతో ఆ శేషుని మోయుచు నిద్రించు చుందును. (అనంతుడు = ఆదిశేషుడు)

 

భూమి! వరాహ మాయను తాల్చిన సంగతి నీవెరుగవా! దేవులందరు అందు లీనమై పోవుదురు. అది నా మాయ.

 

అయినను నీవు విష్ణు మాయను ఏ విధముగను ఎరుగ జాలవు. నిన్ను నేను పదునేడు మారులు పట్టి నిలిపితిని.

 

నేను ఈ భూమి నంతటిని ఒకే సముద్రముగా చేసి ఆ జలమున నిలుతును. ఇది నా మాయా బలము.

 

నేను బ్రహ్మను, రుద్రుని సృజింతును. హరింతును. అయినను వారు నా మాయకు మోహితులై దాని నెరుగ కుందురు.

 

సూర్యుని తేజస్సు వంటి తేజస్సు గల ఈ పితృ గణముల వారున్నారే వారిని పితృమయ యగు మాయతో నేను పట్టుకొని యుందును.

 

మరియు శోభనాంగీ! మరియొక మాయను గూర్చి చెప్పెదను. వినుము. ఒక ఋషిని పురుష స్వరూపుని స్త్రీ యోని యందు ప్రవేశ పెట్టితిని. (స్త్రీని చేసితి నని భావము)

 

అంత విష్ణుని పలుకు విని మరియు విన గోరినదై వసుంధర చేతులతో దోసిలి పట్టి యీ వాక్యమును పలికెను.

 

ఆ ఋషి ముఖ్యుడు అంత చేయరాని పని యేమి చేసెను? ఆతడు స్త్రీ రూపము నేల పొందెను? ఆ బ్రాహ్మణ ముఖ్యుడు స్త్రీ యగుటకు చేసిన పాప మెట్టిది? నాకు మిక్కలి కుతూహలము కలుగు చున్నది. అది యంతయు వివరించి చెప్పుము.

 

అంత భూదేవి మాటవిని మిక్కిలి ఆనంద మందిన హృదయము గల హరి తీయని మాటను గొని భూదేవి కిట్లనెను.

 

దేవీ! విశాలాక్షీ! మహామతీ! ఆ ధర్మా ఖ్యానమును వినుము. ఒడలు గగుర్పొడుచు నా మాయను గూర్చి చెప్పెదను.

 

నా మాయ కూర్పు వలన సోమశర్మ పడరాని పాట్లు పడెను. పెక్కు గతులు పొందెను. అందు కొన్ని ఉత్తమములు, కొన్ని నీచములు, కొన్ని మధ్యమములు. మరియు తిరిగి నా మాయ త్రోయగా బ్రాహ్మణ త్వమును పొందెను.

 

ఆ బ్రాహ్మణ ముఖ్యుడు స్త్రీ రూపము నెట్లు పొందెనో తెలిపెదను. ఆతడు చేసిన వికృత కర్మము లేదు. అపరాధము లేదు.

 

ఆతడు నిత్యము నా అర్చన యందు, నా పనుల యందు మిక్కిలి శ్రద్ధ కలవాడు. సర్వదా నన్ను గూర్చిన భావనయే అతని హృదయము నలరించును.

 

అంత పెద్ద కాలమునకు ఈతడు అనన్య హృదయముతో చేసిన తపస్సు. కర్మము, భక్తి అను వానికి నేను మిక్కిలి తృప్తి నందితిని.

 

అంత నేనతనికి నా ఉత్తమమగు దర్శన మొసగితిని నీ విషయమున తృప్తుడ నైతిని. వరము కోరు కొమ్మంటిని.

 

నాయనా! నీ హృదయమున నున్న వరము నెల్ల కోరుకొనుము. అన్ని కోరికలతో కూడిన ఆ వరముల నెల్ల నీకు ఇత్తును.

 

సువర్ణమా? గోవులా? ఏ పీడయు లేని రాజ్యమా? లేక అప్సరసల గణముల స్వర్గమా? దేనిని కోరుదువు?

 

లేదా! ఓ విప్రవరా! ఋషుల మహా తపస్సును కోరెదవా? కాక నా కర్మముల యందు మహా శ్రద్ధకల వాడగుదువా?

 

అట్లు కాక వేయు మంది దివ్య కన్యలను ధనములు రత్నములు సమృద్ధిగా కలవారిని, స్వర్ణా భరణములు అలంకరించు కొన్న వారిని కోరెదవా?

 

అప్సరసల కీడైన దివ్య రూపము గల ఇంతులను కోరెదవా? నీకు వర మిత్తును. నీవేది తలతువో చెప్పుము.

 

అంత ఆ బ్రాహ్మణ వరేణ్యుడు నా మాట విని శిరస్సు నేలకు తాకునట్లుగా నేలపై వ్రాలి తీయని పలుకుతో ఇట్లనెను

 

దేవా! నీవు కోపగింప వేని ఒక్క వరమ డుగుదును. నీవు పలికిన విధముగా నేను కోరిన దొసగ వలయును. నాకు బంగారము వలదు. ఇంతి వలదు, రాజ్యము వలదు. అప్సరస వలదు. స్వర్గము వలదు. మనసున కింపైన ఐశ్వర్యము వలదు.

 

వేయి స్వర్గములలో ఒక్కటియు నాకు రుచింపదు. నీవు ఎల్లప్పుడు క్రీడించు నీ మాయను తెలియ గోరు చున్నాను.

 

అంత నతని మాట విని నేనిట్లంటిని: ఓ విప్రవరేణ్యా! నీకు ఆ మాయతో పని యేమి? కాని పని నడుగు చున్నావు. విష్ణు మాయ చేత మిక్కిలి మోహితులై దేవతలు కూడ దాని నెరుగరు.

 

అప్పుడా బ్రాహ్మణోత్తముడు నా మాట విని మాయా కర్మము పురికొల్పగా తీయగా ఇట్లు పలికెను.

 

దేవా! నా కర్మము, నా తపస్సు నీకు తృప్తి కలిగించినచో నీ అనుగ్రహము వలన నాకీ వరమునే ఒసగ వలయును.

 

అప్పుడా తపస్వియగు బ్రాహ్మణునితో, కుబ్జామ్రక మనుచోట కరుగుము. అందు గంగలో స్నానము చేసి నా మాయను చూతువు, అంటిని.

 

ఈ నామాట విని ఆ విప్రుడు నా మాయను చూడ గోరినవాడై నాకు ప్రదక్షిణ మొనరించి కుబ్జామ్రకమున కరిగెను.

 

అంత నాతడు కమండలువును, దండమును, ఇతర వస్తువుల భాండములను ఒకచోట నుంచి తీర్థమును సేవించెను.

 

అంత నాతడు శాస్త్రము చెప్పిన తీరున గంగ లోనికి దిగి నీట మునిగి అన్ని అవయములను తడుపు కొనెను.

 

అంత ఆ బ్రాహ్మణుడు హఠాత్తుగా ఒక నిషాద వనిత గర్భమున నిలిచెను. గర్భ క్లేశము పీడింపగా హృదయమున ఇట్లు తలపోసెను.

 

అయ్యో! ఎంత కష్టము! నేనేమి పాడుపని చేసితినో ఆటవిక స్త్రీ కడుపున పడితిని. ఈ నరకము లందుంటిని.

 

ఛీ! నా తపమేల? నాకర్మ మెట్టిది? దాని ఫలమేమి. నా బ్రదుకెంత నికృష్ట మయినది! నేను నిషాద గర్భమున ఏ భాగ్యము లేని చోట నలిగి పోవు చున్నాను.

 

మూడు నూర్ల ఎముకలు, తొమ్మిది ద్వారములు, మలమూత్రముల సంకీర్ణత, రక్త మాంసముల బురద, భరింప నలవి కాని దుర్వాసన, వాతము, పిత్తము, శ్లేష్మముల వికారములు, పెక్కు రోగముల రొంపి, పెక్కు దుఃఖముల గందర గోళము గల ఈ గర్భమున, నోటితో చెప్పనేల? పడరాని పాట్లు పడు చున్నాను.

 

విష్ణు వెక్కడ? నేనెక్కడ? గంగా జలము లెక్కడ? ఈ గర్భ సంసారము నుండి వెలువడి యటుపై నేనేమి చేయ వలసి యున్నదో?

 

ఇట్లు తల పోయుచు ఆతడు వెను వెంటనే గర్భము నుండి వెలువడెను. వెంటనే అతని ఆభావ మంతయు నశించెను.

 

అంత నతడు ఒక నిషాదుని (ఆటవికుని) యింట కన్యగా పుట్టెను. కమండలువు, దండము నది ఒడ్డున నుండెను. నా మాయ వలన ఆతడు దాని నెరుగ కుండెను.

 

అంత పెద్ద కాలము ధన ధాన్యములు నిండుగా గల ఆ నిషాదుని యింట ఆ బ్రాహ్మణుడు తిరుగు చుండెను. విష్ణు మాయ క్రమ్మగా ఆతడేమియు తెలియ కుండెను.

 

పిదప పెద్ద కాలమునకు ఆమె వివాహము చేసికొని నా మాయ వలన కొడుకును కూతురును కనెను.

 

తిన దగిన దానిని, తగని దానిని తినెను. త్రాగ దగిన దానిని, తగని దానిని త్రాగెను. చంపిన జంతువులను అందందు అమ్ముకొని బ్రతుకు చుండెను.

 

ఏది చేయ నగునో ఏది చేయరాదో, ఏది పలుక నగునో ఏది పలుక రాదో, ఏది పొంద దగినదో, ఏదికాదో ఏదియు నా మాయా జాలము మోహమున తెలియ కుండెను.

 

ఏబది యేండ్లు గడచిన పిమ్మట నా తలపు వలనను తపస్సు ప్రభావము వలనను ఆ బ్రాహ్మణుడు కుండను తాకెను.

 

మనసులో స్నానమును భావించి వస్త్రములను తీసివైచి వానిని నేలపై ఉంచి గంగలో మునిగెను.

 

మిక్కిలి చెమట తాపమున కుడికి తలను నీట ముంపగా అంత ఆ వనిత దండ కమండలువులు తాల్చిన తపోధనుడుగా ఆయెను.

అంత నా విప్రుడు వస్తువుల పెట్టెను, కమండలువును, త్రిదండమును, మున్ను తానుంచిన వస్త్రములను చూచెను. విష్ణు మాయను తెలిసికొన గోరిన విప్రుడనను జ్ఞానము కలిగెను.

 

అంత గంగకు ఉత్తరముగా ఆ తపోధనుడు సిగ్గుతో వాసమును కల్పించు కొని దగ్గరలో ఉన్న ఆ యిసుక తిన్నె యందు కూర్చిండి యోగమును గూర్చి భావించుచు నుండెను.

 

అంత నాతనికి తాను నిషాద వనితగా నుండగా అందందు చేసిన పాప కర్మము లన్నియు స్మృతికి వచ్చెను. పాప కర్ముడను. చేయరాని పనులు ఎంతగా చేసితిని! అగాధములో కూలి పోయితిని. ఈ స్త్రీ జన్మ మెత్తితిని.

 

బోయ కులమున పుట్టితిని. విచక్షణ లేని తిండి తింటిని. నేలపై నీటిలో నుండు ప్రాణుల నన్నింటిని చంపితిని.

 

అన్ని విధములగు త్రాగుడులను త్రావితిని. అమ్మరాని వాని నమ్మితిని. పొంద రాని వారిని పొందితిని. అనరాని మాట లంటిని.

 

అన్ని కొంపల నుండి తినరాని తిండ్లు సంకోచింపక తింటిని. నిషాదుని వలన కొడుకులను, కూతుండ్రను కంటిని.

 

నేనేమి తప్పు చేసితిని? ఏ పాప కర్మముచేత ఈ నిషాద వనితయగు దశను పొందితినో చెప్పగల ఎవనిని నేనిప్పుడు భావింతును?

 

అని యిట్లనుకొను చున్నంతలో ఆ మాయా తీర్థమునకు ఆ నిషాదుడు (ఆ సోమశర్మ నిషాదిగా ఉన్నప్పటి మగడు) బిడ్డలు చుట్టు కొనిరాగా ఒడ లెరుగని కోపముతో వచ్చెను.

 

చక్కని లక్షణములు గల భార్యను మిక్కిలి అనురాగము కలవాడై వెదకు చుండెను.అచట తపస్సు చేయుచున్న ప్రతి తపోధనుని అడుగు చుండెను.

 

అయ్యలారా! నా యింటిది నీటి కొరకు కుండ పట్టుకొని గంగ ఒడ్డునకు వచ్చినది. మీరు చూచితిరా?

 

ఆ మాయా తీర్థమునకు వచ్చిన జనులు, తాము ఒక సన్యాసిని, అదిగో అచట ఉన్న కుండను చూచితిమని చెప్పిరి.

 

అంత నతడు తన ప్రియురాలిని కానక పెను దుఃఖముతో కుమిలి పోవుచు ఆమె తాల్చిన వస్త్రమును, నీటి కుండను చూచి జాలి కలుగు నట్లుగా ఏడ్చు చుండెను.

 

ఇదిగో వస్త్రము. ఇదిగో కుండ నది ఒడ్డున నున్నవి. గంగకు వచ్చిన నా యింటిది మాత్రము కానరాదు.

 

ఆ దీనురాలు స్నానము చేయు చుండగా నీట నున్న మొసలి ఏదైన జిహ్వా చాపల్యము చేత తిని వేసెనేమో!

ఒక్క నాడును, కలలో కూడ నేనామెను మనసునకు కష్టము కలుగు నట్లు తిట్టి యుండలేదు.

 

ఒక వేళ ఏ పిశాచమో, భూతమో, రక్కసియో మ్రింగ లేదు కదా! గంగ ఒడ్డునకు చేరిన ఆమెను ఏ రోగమో పట్ట లేదు కదా!

 

నేను మునుపు ఎంత ఘోరమైన పాపము చేసితినో నా ముందు నా భార్య మీరు చూచు చుండగా దుర్గతి పాలైనది.

 

ఓ సుందరీ! నా యిష్టమును బట్టి నడచుకొను దానవు. రా! ఇదిగో పరమ దుఃఖముతో నలిగి పోవుచు అటుఇటు తిరుగు చున్న ఈ బిడ్డల నైన చూడుము.

 

ఓసి నా ప్రియురాలా! ఈ నీ పాల బుగ్గల పసి బాలురు ముగ్గురు కొడుకులను, నలుగురు బిడ్డలను చూడుము. నీవే నాకు అన్నియు అయితివి.

 

నీ కొరకు అంగలార్చు చున్న ఈ పిల్లలు ఏడ్చు చున్నారు. పాపాత్ముడనగు నా బిడ్డలను కాపాడుము.

 

నాపై మిక్కిలి ప్రేమకల దానవు, ఆకలి దప్పులతో అలమటించు చున్న నన్ను వదలి పోయితివి.

 

ఇట్లు పరమ కరుణగా ఆ నిషాదుడు ఏడ్చు చుండగా ఆ విప్రుడు సిగ్గుతో నిషాదునితో ఇట్లు పలికెను. ఆమె లేదు. పొమ్ము. ఆలు బిడ్డలు నశించుట సుఖమైన యోగమని పెద్దలు చెప్పుదురు.

 

 

ఇంకను అట్లే కరుణతో నిలువెల్ల మునిగిన ఆ నిషాదునితో ఆ విప్రుడు ఇట్లు పలికెను. వెళ్లు. ఊరక యేల అట్లు కుమిలి పోయెదవు?

 

పెక్కు విధములగు ఆహారములతో ఈ పిల్లలను రక్షింపుము. ఈ నీ బిడ్డలను ఎల్లవేళ నీవు రక్షింప వలయును గదా!

 

ఆ నిషాదుడు అ సన్యాసి పలుకువిని, దుఃఖము నిలువెల్ల క్రమ్ముకొనగా మెల్లగా ఇట్లు పలికెను.

 

అయ్యవారా! గొప్ప ధర్మము తెలిసిన వాడవు. తీయని మాటలతో నన్ను ఓదార్చితివి.

 

నిష్ఠతో చేసిన వ్రతములు గల ఆ ముని నిషాదుని మాట విని దుఃఖము తన్ను ముంచి యెత్తగా ఇట్లు పలికెను.

 

ఏడవకు! నీకు చెప్పెదను. నీకు శుభ మగును. నేనే నీ దొడ్డ భార్యను. ఈ గంగ ఒడ్డుకు వచ్చి నీకు ప్రియురాల నయితిని.

 

సన్యాసి మాట విని నిషాదుడు కొంత తేరుకొని ఆ బ్రాహ్మణోత్తమునితో ప్రియమైన పలుకులతో నిట్లనెను.

 

బాపనయ్యా! ఏమి యిట్లు అయోమయముగా పలుకు చున్నావు? మగవాడు ఆడుది యగుట ఎన్నడు విన్నది కూడ కాదు.

 

నిషాదుని మాటవిని బ్రాహ్మణుడు ఒడ లెరుగని శోకముతో గంగ ఒడ్డున ఆ బోయతో తీయగా ఇట్లు పలికెను.

 

త్వరగా నీ తావునకు ఈ పసి వారిని కొని పొమ్ము. అందరి యందును సమాన మగు ప్రేమ చూప వలయును.

 

ఆతడట్లు చెప్పు చున్నను నిషాదున కేమియు తెలియ వచ్చుట లేదు. తీయని స్వరముతో ఆ బ్రాహ్మణున కిట్లు పలికెను.

 

అయ్యా! నేను నీ దొడ్డ యిల్లాలి నను చున్నావు. ఇట్లగుటకు నీవు మున్ను చేసిన మహా పాపమేమి?

 

ఋషి పుంగవా! ఏ తప్పు చేత నీకు ఆడుదనము కలిగినది? మరల ముని వెట్లయితివి? ఇది నాకు చెప్పుము.

 

అని యిట్లు పలుకగా ఆఋషి మాయా తీర్థము జలమున సంభవించిన దానిని గూర్చి తీయగా ఇట్లు పలికెను.

 

నిషాదుడా! నా కథ ఉన్న దున్నట్లు చెప్పెదను. వినుము. నేనెన్నడు తప్పుడు పనిని చేయ లేదు. నాచేత ఎవ్వరు చేయింప లేదు.

 

నేను భక్తి నిండిన ఆచారములు కలిగి, తినరాని దానిని వదలి వైచి అనేక పుణ్య కార్యములతో లోకనాథుడగు జనార్దనుని దర్శనము కోరి ఆరాధించితిని.

 

అంత పెద్ద కాలమునకు జనార్దనుడు నాకు దర్శన మిచ్చెను. నేనును మహా భయంకరమగు విష్ణు మాయను చూడ గోరితిని.

 

అంత విష్ణువు నాతో విప్రా! నీకా మాయతో పనియేమి? సరే! కుబ్జామ్రక క్షేత్రమున కరుగుము. గంగలో స్నానము చేయుము.

 

ఇట్లు పలికి విష్ణు వంతర్థానము చెందెను. నేనును మాయ నెరుగు పిచ్చి కోరికతో గంగ ఒడ్డునకు వచ్చితిని. దండమును కుండిని, పాత్రను, వస్త్రములను ఒకచోట ఉంచితిని.

 

తగు విధమైన ఉపచారముతో గంగ నీట మునిగితిని అటుపై ఏమి జరిగినదో ఏమియు తెలియ నైతిని.

 

లోభము, మోహము, కామము, క్రోధము అనునవి ముంచి యెత్తు చుండగా నిషాదుని యింట ఉండుట మాత్రము తెలియ వచ్చినది.

 

అంత ఏదో కర్మ వశమున నీటి కొరకు ఇక్కడకు వచ్చితిని. ఇచట నీట మునిగి మరల బ్రాహ్మణుడ నయితిని.

 

నిషాదా! ఇదిగో కుండ, ఇవిగో కావిగుడ్డలు, ఏబది యేండ్లుయినను చెడక ఇక్కడ అట్లే యున్నవి.

 

చివికి పోయిన నా కావి గుడ్డలన్నియు గంగలో కొట్టుకొని పోకున్నవి.

 

ఇట్లతడు పలుకు చుండగా నిషాదుడు అదృశ్యు డాయెను. అచట నున్న బిడ్డలలో ఒక్కడును కాన రాడాయెను.

 

అంత నా బ్రాహ్మణుడు శ్వాసను పైకి గట్టిగా తీసి కొనుచు (ప్రాణాయామము చేయుచు) చేతులు పైకెత్తి, వాయువు మాత్రమే ఆహారముగా గొనుచు తపస్సు చేయు చుండెను.

 

అట్లు నిలిచి యుండగా అపరాహ్ణ సమయ మాయెను. అంత నాతడు నీటిని వదిలి తగు కృత్యములు చేసికొనెను.

 

నా పూజల యందు, పుణ్య కార్యముల యందు ఎల్లవేళల మిక్కిలి ఆసక్తి కలవాడై వీరాసనము వేసికొని నన్నర్చించు చుండెను. గంగా స్నానమునకు వచ్చిన ఉత్తమ బ్రాహ్మణు లందరు ఆతని చుట్టును చేరిరి.

 

అంత నా బ్రాహ్మణు లందరు అట్లు తపస్సున కూర్చున్న ఆ తాపసితో ఇట్లనిరి: బ్రాహ్మణోత్తమా! ఎప్పుడో పూర్వాహ్ణమున ఈమాత్ర, దండము, కమండలువు, నార చీరలు ఇక్కడ ఉంచి ఎటకో పోయితివి. ఈ స్థలమును మరచితివి? త్వరగా రాకుంటివి.

 

ఆ విప్రుల పలుకులు విని ఆ ముని మిన్న కుండెను. వారున్న తావును గూర్చి మనసులో భావించు చుండెను.

 

ఇంతలో ఆ బ్రాహ్మణ ప్రవరుడు మదిలో ఇట్లు తలపోసెను. ఇదియేమి ఆశ్చర్యము? ఏబది వత్సరములు గడచినవి. ఈనాడు అమావాస్య.

 

ఇపుడు ఏ కాలము జరుగు చున్నది? ఈ బ్రాహ్మణులు పలుకు చున్న దేమి? నా సంచిని పూర్వాహ్ణమున ఇచట ఉంచి ఎటకేగి అపరాహ్ణమునకు వచ్చితివను చున్నారు.

 

ఇంతలో అచట బ్రాహ్మణ స్వరూపములో ఉన్న నేను ఆ బ్రాహ్మణునకు దివ్యమైన రూపము తేజస్సు గల నా నిజ రూపమును చూపితిని. చూపి అతనితో ఇట్లంటిని.

 

విప్రా! స్నానము చేయ గోరి జపము కొరకు పూర్వాహ్ణమున వెళ్లితివి. ఇదిగో, చూడు. అపరాహ్ణము. ఇపుడు తిరిగి వచ్చితి వేమి?

 

నా ఆ మాట విని ఆ శ్రోత్రియుడు చేతులు జోడించి తలను నేల కాన్చి దుఃఖము పైకొనగా ఇట్లు పలికెను.

 

నా కేడుగురు పిల్లలు పుట్టిరి. మద్యమును, పిల్లలను, తెల్లని తాబేటిని అమ్మితిని.

 

తినరాని తిండి, త్రాగరాని త్రాగుడు, పొందరాని పొందు పలుక రాని పలుకులు ఈ యన్నింటిని చేసితిని.

 

మాధవా! నిన్ను సేవించుచు నేను చేసిన పాడు పనియేమి? తపస్సు చేయుచు నేను చేసిన వికృతమగు తపస్సెట్టిది? నీ ఆరాధన చేయుచు, అచ్యుతా! నేనే పూజకు పనికి రాని కూడు తింటిని? నీ పూజలో నేను చేసిన అకార్య మేమి? నేనా నరకమునకు పోవుటకు చేసిన పాప మెట్టిదో ఉన్న దున్నట్లు నాకు తెలియ జెప్పుము.

 

ఇట్లు పెను దుఃఖముతో మాయకు వశుడైన ఆ విప్రుని జాలి గొలుపు ఏడుపు పలుకులు విని గంగ పులినము నందు దుఃఖముతో కుమిలి పోయిన కన్నులు గల ఆతనితో ఇట్లు పలికితిని.

 

విప్రా! మనసును చెదరగొట్టు కొనకుము. ఇది నీ స్వీయ దోషము. దాని వలన ఈ దుఃఖము పొందితివి. నీచ యోని యందు పడితివి.

 

నేను ముందే చెప్పితిని. విప్రా! నా మాయతో నీకు పనియేమి? దివ్య లోకముల నిత్తును. అంటిని. అవి నీవు కోరకుంటివి.

 

బ్రాహ్మణా! నీవు కోరిన వైష్ణవ మాయను చూచితివి. రోజు గడవ లేదు. అపరాహ్ణము కాలేదు. ఏబది యేండ్లు నీవు నిషాదుని యింట నిలువ లేదు.

 

విప్రవరుడా! మరియొక విషయము కూడ నీకు చెప్పెదను. దానిని ఆలకింపుము. ఇది యంతయు నీవు కోరిన వైష్ణవ మాయ. నీవు శుభమును గాని అశుభమును గాని ఏమియు చేయలేదు. ఇది యంతయు మాయతో నైనది. నీవు విస్మయము వలన కుందుచున్నావు.

 

నీవు చేసిన పాడు పని, వ్యభిచారముల వలన నీ తప మేమియు చెడ లేదు. తపస్సు పాడు కాలేదు.

 

మరియొక విషయము చెప్పెదను. పూర్వ జన్మము నందలి ఏ అపరాధముతో నీవిట్లయితివో దానిని చెప్పెదను.

 

నా భక్తులు, పరిశుద్ధులు నగు భాగవతులను నీవు అభినందింప కుంటివి. ఆ తప్పు ఫలమును నీవిపుడు ఈ రూపమున పొందితివి. నా భక్తులు శుచులు అగు భాగవతులు ఎల్ల విధముల వందనీయులు.

 

భక్తులగు భాగవతులకు వందనము చేయువారు నాకు వందనము చేయు వారగుదురు. ఇందు సందియము లేదు.

 

నన్ను పొందుటకు కోరు వాడును, ఎట్టి నిందలు పొందని వాడును అనన్యమగు మనస్సుతో నాభక్తుల యందు తగులము పొంద వలయును.

 

పొమ్ము! బ్రాహ్మణా! సిద్ధుడవైతివి. ప్రాణముల నిచటనే వదలుము. పద! నాతో పాటు పరమ స్థానమగు శ్వేత ద్వీపమున కరుగుము.

 

నేనిట్లు ఆ బ్రాహ్మణునితో పలికి వరమిచ్చి అంతర్థానము చెందితిని.

 

బ్రాహ్మణుడిట్లు ఇతరులకు చేయ నలవి కాని మహా కార్యము చేసి మాయా తీర్థమున దేహమును వదలి శ్వేత ద్వీపమును చేరు కొనెను.

 

ధనస్సు, అంబుల పొంది, బాణములు, ఖడ్గము తాల్చి గొప్ప బల పరాక్రమములు కలవాడై నిత్యము చక్కని స్థితితో నున్న నా మాయా బలమును ఆతడు చూచు చున్నాడు.

 

కనుక భూమి! నీకు నా మాయతో నేమిపని? నా మాయను నీవెరుగ జాలవు. దేవతలు, దానవులు, రక్కసులును ఎవ్వరు ఎరుగరరు.

 

భూమీ! నీ కిట్లు మాయ కథ చెప్పితిని. ఇది మహా శక్తి కలిగి నట్టిది. దీనిని మాయా చక్ర మని కీర్తింతురు. సర్వ దుఃఖములను పోకార్చి సుఖముల కూర్చు నట్టిది.

 

ఇది కథలలో మహా కథ. తపస్సులలో గొప్ప తపస్సు. పుణ్యములలో పరమ పుణ్యము. గతులలో పరమ గతి.

 

దీనిని భక్తుల నడుమ చదువ వలయును. భక్తి లేని వారి కడ కీర్తింప రాదు. నీచుల నడుమను, శాస్త్రముల నిందించు వారి కడను పఠింప రాదు.

 

నా ముందు, నా వెనుక నా భక్తుల ముందును దీనిని చదువు వాడు శోభిల్లును. కాని శాస్త్ర దూషకుల కడ అట్లు ప్రకాశింపడు.

 

చెదరని దీక్షతో ఉదయమున లేచి నిత్యము దీనిని పఠించు వాడు పండ్రెండేండ్లు నా ముందు పఠించిన వాడగును.

 

కాలము నిండిన తరువాత ఆ నరుడు దేహమును చాలించి నా భక్తుడగును. నీచ జన్మములు పొందడు.

 

వసుంధరా! ఈ మహాఖ్యానమును నిత్యము వినువాడు బుద్ధి హీనుడు కాకుండును. నీచ జన్మము పొంద కుండును.

 

భద్రా! నీవు నన్ను మున్నడిగిన విషయమును వివరించితిని. ఇటు పై ఇంక ఏమి అడుగుదువు?