వరాహ మహా పురాణము
అధ్యాయము - 28
మాయా రూపిణి కాత్యాయని దుర్గ, మంగళరూప యెట్లు ఉదయించెను? ఆమె మొదటి స్థితిలో సూక్ష్మ రూపముతో ఉండెను గదా! వేరు స్వరూపముతో ఎట్లు ఆవిర్భవించెను?
రాజా! మునుపు సింధు ద్వీపుడను గొప్ప ప్రతాపము గల రాజుండెను. ఆతడు వరుణుని అంశముతో పుట్టిన వాడు. అరణ్యమున తపస్సున నెలకొని యుండెను.
ఆ రాజు నాకుమారుడు ఇంద్రుని నశింప జేయు వలయునని నిశ్చయించి గొప్ప తపస్సుతో తన దేహమును ఎండ గట్టెను.
బ్రహ్మణవరేణ్యా! ఆతనికి ఇంద్రుని వలన అపకార మెట్లు సంభవించెను? దానితో గదా ఆతడు ఇంద్రుని చంపు పుత్రుని గోరుచు తపమున నిలిచెను.
ఆతడు పూర్వ జన్మమున త్వష్టుడను వాని కొడుకు. గొప్ప బలము గలవాడు. ఏ ఆయుధములకు చావని వాడు. నీటి నురుగుతో ఇంద్రుని వలన మరణించెను.
ఆతడు నీటి నురుగుతో మడిసి యందు లయము పొందెను. తిరిగి బ్రాహ్మణ వంశమున పుట్టి సింధు ద్వీపుడను పేరు గల వాడాయెను. ఆ ఇంద్రుని తోడి పగను మరవక ఆతడు ఘోరమైన తపస్సు గావించెను.
అంత పెద్ద కాలమునకు వేత్రవతి యను నది చక్కని అలంకారములు, అంద చందములు గల మనుష్య వేషము తాల్చి ఆ రాజు తపము చేయుచున్న తావునకు వచ్చెను.
చక్కని రూప సంపద గల ఆ కాంతను గాంచి రాజు కోపముతో మండిపడి ఓ భామినీ! నీవెవరవు? నిజము చెప్పుమని యడిగెను.
నేను మహాత్ముడు, జలాధి దేవతయు నగు వరుణుని పత్నిని. పేరు వేత్రవతి. పుణ్యురాలను. నిన్ను కామించి యిటకు వచ్చితిని.
కోరి వచ్చినదియు, తన్ను సేవించు నదియు నగు ఇంతి పర స్త్రీ అయినను ఆమెను వదలి వైచు మనుజుడు పాపుడగును. బ్రహ్మ హత్యా పాతక మందును. ఇది యెరిగి నిన్ను కోరిన నన్ను పొందుము.
ఇట్లు ఆమె పలుకగా రాజు అభిలాషతో ఆమె ననుభవించెను. వెనువెంటనే ఆతనికి పండ్రెండుగురు సూర్యులకు దీటైన కాంతి గల కొడుకు పుట్టెను.
వేత్రవతి కడుపున పుట్టెను గనుక వాడు వైత్రాసురు డయ్యెను. గొప్ప బలము, దొడ్డ తేజము గల ఆతడు ప్రాగ్జ్యోతిషమునకు ఏలిక యయ్యెను.
కొంత కాలమునకు ఆతడు యువకుడు, బల పరాక్రమములు గల వాడునై పెద్ద యోగము కలసి రాగా ఈ భూమిని గెలిచెను.
ఇట్లు ఏడు ద్వీపములుగా నున్న భూమి నంతటిని గెలిచి పిదప మేరు పర్వతము నెక్కెను. అందు మొదట ఇంద్రుని తరువాత అగ్నిని, అటుపై యముని, నిరృతిని, వరుణుని, వాయువు, కుబేరుని, ఈశానుని వరుసగా గెలిచెను.
ఇంద్రుడు దెబ్బ తిని అగ్నికడ కరిగెను. అగ్ని ఓడి యముని జేర బోయెను. యముడు నిరృతి కడకు వచ్చెను. నిరృతి వరుణుని చేరెను. ఇంద్రాదులతో కూడిన వరుణుడు వాయువు నాశ్రయించెను. వాయువు కుబేరుని కడ కరిగెను.
కుబేరుడు దేవతలతో కూడి ఒక గద చేపట్టి తన మిత్రుడగు ఈశానుని చేరుకొనెను. బలముతో కనుగానని ఆ దానవుడు గదను లాగుకొని వానిని శివ లోకమునకు తరిమెను.
శివుడును, ఆ రాక్షసుడు చంపరాని వాడని తలపోసి దేవతలను గైకొని, సురలు, సిద్ధులు మొదలగు పుణ్యవంతులు కొనియాడు బ్రహ్మనగరి కరిగెను.
జగత్తులను సృష్టి చేయు బ్రహ్మ అచట విష్ణు పాదము లందు పుట్టిన పవిత్ర జలము లోపలి భాగమున ఆకాశమును ఏర్పాటు చేసికొని క్షేత్రజ్ఞుడగు పరమాత్మ మాయయగు గాయత్రిని జపించు చుండెను. అంత దేవతలు పెద్దగా దుఃఖముతో అరచిరి.
ప్రజాపతీ! కాపాడు. రక్కసుని వలన భయము పొందిన దేవతలను, ఋషి వరులను కాపాడు, కాపాడు అని తొందర చేసిరి.
అంత బ్రహ్మ అట్లు వచ్చిన దేవత లందరును గాంచి ఇది యంతయు దేవుని మాయ. జగత్తంతయు దీనితో నిండినది. ఇచట రక్కసులు లేరు. దేవతలు లేరు. ఇది యెట్టి మాయయో కదా! అని తల పోసెను.
ఆత డిట్లు భావించు చుండగా ఆతని ముందు ఒక కన్య ప్రత్యక్ష మాయెను. ఆమె స్త్రీ గర్భమున పుట్టినది కాదు. తెల్లని వస్త్రములను ధరించి యుండెను. పూమాలతో కిరీటములతో ఆమె మోము వెలుగొందు చుండెను. ఆమె యెనిమిది చేతులతో, దివ్యములగు ఆయుధములు తాల్చి యుండెను.
చక్రము, శంఖము, గద, పాశము, ఖడ్గము, ఘంట, విల్లు అను వానిని మరియు ఇతర ఆయుధములను చేపట్టి అమ్ముల పొది కట్టుకొని నీటి నుండి వెలువడి ఆ మహాదేవి సింహ వాహనయై వడివడిగా వచ్చెను. ఒక్కతెయే పెక్కు రూపములు తాల్చి రక్కసు లందరితో పోరు సల్ఫెను.
దేవతల వేయి సంవత్సరముల కాలము, దివ్యములగు అస్త్రములతో ఆ మహా బలునితో ఆ దేవి యుద్ధము చేసెను. అట్లు పోరి కొంత కాలము గడచిన పిదప ఆ వైత్రాసురుని రణమున చంపి వైచెను. అంత దేవతల సేన యందు కిలకిలా రావములు పెద్ద పెట్టున చెలరేగెను.
అట్లు భయంకరుడగు వైత్రాసురుడు చావగా స్వర్గ వాసులందరు గెలువుము, పోరుము అని ఆమెను ప్రశంసించుచు ప్రణమిల్లిరి. స్వయముగా ఈశ్వరుడు ఇట్లు స్తుతి చేసెను.
దేవీ! గాయత్రీ! మహామాయా! మహాప్రభా! మహాదేవి! గొప్ప శక్తియు, గొప్ప ఆనందము గల ఓ పుజ్యులారా! జయము గొనుము.
దివ్యములగు గంధముల పూతగల దేహముతో, దివ్యములగు పూల మాలలతో అలరారు మహేశ్వరీ! మూడక్షరము లందున్న ఓ వేద మాతా! నీకు నమస్సులు. (మూడక్షరములు - ఓం కారము)
మూడు లోకము లందును మూడు తత్త్వము లందును మూడగ్నుల యందును నెలకొని యున్న ఓ త్రిశూల ధారిణీ! మూడు కన్నులు, భయము గొలుపు మోము, భయము గొలుపు కన్నులు గలిగిన భయంకర స్వరూపిణీ! కమలము ఆసనముగా గల బ్రహ్మ వలన పుట్టిన ఓ సరస్వతీ దేవి! నీకు నమస్కారము.
పద్మ పత్రముల వంటి కన్నులు గల ఓ మహా మాయా! అమృతమును జాలువార్చు ఓ దేవీ! అంతట నిండిన తల్లీ! సర్వ భూతములకు ఏలికయైన మాతా! స్వాహాకార స్వరూపిణీ! స్వధా రూపిణీ! అంబికా! నీకు నమస్సు.
సంపూర్ణా! పూర్ణచంద్రుని కాంతి వంటి కాంతి గల దానా! తళతళ లాడు దేహ కాంతి గల దేవీ! భవుని పుట్టుకకు కారణమైన తల్లీ! మహా విద్యా స్వరూపిణీ! జ్ఞాన స్వరూపిణీ! మహా దైత్యులను రూపుమాపు కరుణామయీ! శోకము లేని ఆనంద రూపా! పర్వత రాజ పుత్రీ! నీకు నమస్కారము.
ఓ దేవి! నీవు నీతివి. నీవు వాక్కు. నీవు భూమివి. నీవు అక్షరమవు. నీవు బుద్ధి స్వరూపిణివి. నీవు లక్ష్మీ దేవివి. నీవు ఓంకారమువు. నీవు తత్వమున నిలిచి యున్న దానవు. సర్వ ప్రాణులకు హితము చేయు దానవు. ఓ పరమేశ్వరీ! అట్టి నీకు నమస్కారము.
పరమేశ్వరుడగు శివు డిట్లు ఆదేవిని సంస్తుతించెను. దేవత లందరును జయ జయనాదములు ఆ పరమేశ్వరిని గూర్చి పెద్దగా చేసిరి.
ఆ బ్రహ్మ దేవుడు నీటి నుండి వెలుపలికి వచ్చి కార్యము నెరవేరిన ఆ దేవిని దర్శించు కొనెను.
బ్రహ్మ ఆమెను గాంచి దేవ కార్యము నెరవేరినదని తలచి రాబోవు కార్యమును గూర్చి యిట్లు పలికెను.
ఈ దేవి హిమవత్ప ర్వతమునకు అరుగు గాక! దేవతలారా! మీరందఱు కూడ నచట కరిగి ఆనంద మందుడు. ఆలసింపకుడు.
ఈ దేవిని ఏకాగ్ర బుద్ధితో నవమి నాడు పూజింప వలయును. అట్లు ఆమె సర్వ లోకములకు వరముల నొసగునది యగును. సంశయము లేదు.
నవమి నాడు మగవాడు కాని, స్త్రీ కాని, పిండి భోజనము నియమముగా చేసికొని యీమె నర్చించినచో మనసులోని కోరిక తీరును.
ఓ మహాదేవా! నీవు పలికిన ఈ స్తోత్రమును ఉదయ సాయం కాలములలో పఠించు వానికి నీవు దేవితో పాటు వరముల నొసగుము. ఆపద లన్నింటి నుండియు వాని నుద్ధరింపుము.
ఇట్లు శివునితో పలికి బ్రహ్మ మరల దేవితో నిట్లనెను.
దేవీ! నీవు మాకు చేయ వలసిన మరియొక ఘన కార్యము కలదు. మహిషుడను రక్కసుని వినాశనమును నీవు భవిష్యత్తున చేయ వలయును.
బ్రహ్మ యిట్లు పలుకగా సర్వ దేవతలును ఆయనను హిమ గిరి యందు ప్రతిష్ఠించి తమతమ నెలవుల కరిగిరి. ఆమెనట్లు ప్రతిష్ఠించి వారందరు ఆనందము పొందుట వలన ఆమెకు ‘నంద’ యను పేరు కలిగెను.
ఈ దేవి జన్మ కథను విను వాడును, తనకు తాను, పఠించు వాడును సర్వ పాపముల నుండి విముక్తుడగును. మోక్షము నొందును.
