వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము – 15

 

 

ప్రభూ! గౌరముఖుడు మార్కండేయుని వలన ఇట్లు శ్రాద్ధ విధిని విని అటుపై ఏమి చేసెను?

 

 

మేధాశాలి యగు మార్కండేయుని వలన పితృ క్రియా విషయములను విన్న గౌరముఖునకు నూరు జన్మల స్మరణము కలిగెను.

 

 

మహానీయా! ఈ గౌరముఖుడు పూర్వ జన్మమున నెవ్వడు? ఏ జన్మములను స్మృతికి తెచ్చు కొనెను? ఎట్లు స్మరించెను? స్మరించి ఆ సజ్జన శ్రేష్ఠుడేమి చేసెను?

 

 

ఈ గౌరముఖుడు పూర్వ జన్మమున భృగువను బ్రాహ్మణుడు. ఈ మార్కండేయ మహాముని ఆ వంశమున పుట్టిన వాడు.

 

 

ఇంతకు ముందు చెప్పిన విధముగా “మీరు మీ పుత్రుల భోధ వలన సుగతి పొందుదు’ అన్న బ్రహ్మ వాక్యము వలన అతడు మార్కండేయునితో ఉపదేశము పొందెను.

 

 

అతడు పూర్వ జన్మము లన్నింటి జ్ఞానము పొందెను. అటుపై అతడేమి చేసెనో సంగ్రహముగా చెప్పెదను వినుము.

 

 

ఇట్లు విన్న శ్రాద్ధ పద్దతితో పండ్రెండు సంవత్సరములు పితృ దేవతలను యజించి పిదప శ్రీహరి స్తోత్రము చేయ దొరకొనెను.

 

 

మూడు లోకములలో పేరు గాంచిన ప్రభాసమను తీర్థమున నివసించి, యా గౌరముఖుడు రక్కసులను రూపు మాపు ఆ దేవుని స్తుతింప మొదలిడెను.

 

 

మహా ప్రభువు, శత్రువుల గర్వ మనచు వాడు, మంగళ స్వరూపుడు, బ్రహ్మ జ్ఞానులకు మిక్కిలిగా వరణీయుడు, సూర్యుడు, చంద్రుడు, అశ్వినీ దేవతలు అను నిట్టి వారిలో నుండు వాడు, ఆద్యుడు, పురాతనుడు, రక్కసుల రూపు మాపువాడు నగు శ్రీహరిని ఎల్ల వేళల స్తుతింతును.

 

 

ఏ పురాణ దైవము, వేదములు అపహృతము లయినపుడు తన దేహమును చేపగా చేసెనో, మహా భూమిని తాల్చెనో, దేహము తుది నున్న తోక కాంతులే యుద్ధ జ్వాలలు కాగా రాక్షసుని రూపు మాపెనో అట్టి దైవమును ఎల్లవేళల స్తుతింతును.

 

 

అట్లే సముద్రమును త్రచ్చి నపుడు తాబేటి రూపు దాల్చి, అందరి మేలు కోరి కొండను మోసిన పురాణ పురుషుడు రాక్షస హంత, దేవ దేవుడు మమ్ము చక్కగా కాపాడు గాక!

 

 

మహాత్ముడు, సురలు సిద్ధులు గుంపులుగా కూడి యజ్ఞ స్వరూపమని కొనియాడు నట్టి దేవుడు, భూమి నుండి తలాతలములకు చొచ్చుకొని పోయిన వాడు, దైత్య హరుడు, పురాణ దేవుడు అగు మహా వరాహము నన్ను రక్షించు గాక!

 

 

ప్రతి యుగమున నృసింహ రూపము తాల్చువాడు, యోగులు సతతము కాంక్షించు స్వామి, భయంకరమైన మూర్తి గలవాడు, ఘోరమగు ముఖము, బంగారు వన్నె, దొడ్డ మనస్సు గల రాక్షసాంతకుడు మమ్ములను కాపాడు గాక.

 

 

బలి యజ్ఞము పాడు చేసిన వాడు, అప్రమేయుడు, యోగమే స్వరూపమైన వాడు, యోగమే దేహమైన వాడు, ఆత్మా స్వరూపుడు, దండము, చర్మము, బ్రహ్మ చారి భూమి నంతటిని ఆక్రమించిన దేహము కలవాడు నగు వామన త్రివిక్రముడు మమ్ము కాపాడు గాక!

 

 

ఇరువది యొక్క మారులు భూమిని గెలిచిన మహాతీక్ష స్వభావుడు, భూమి నంతటిని కశ్యపున కిచ్చి వైచిన వాడు, అట్టి జమదగ్ని కుమారుడు, ఉత్తమ జనులకు రక్షకుడు, బ్రహ్మాండ రూపమైన బంగారము గర్భమున గలవాడు, దైత్య సంహారకుడు మమ్ము రక్షించు గాక!

 

 

ఏ స్వామి బ్రహ్మాండమును చాచి ఊహింపదగు తన దేహమును నాలుగు విధములుగా విభజించి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అను రూప భేదములు గల దానినిగా చేసెనో అట్టి రాక్షసులను రూపు మాపిన ప్రభువు మమ్ములను రక్షించు గాక!

 

 

చాణూరుడు, కంసుడు మొదలగు రక్కసులకు వెరచిన దేవతలకు అభయ మొసగుటకై ఏ దేవుడు ప్రతి యుగము నందును వాసు దేవు డయ్యెనో, ప్రతి కల్పము నందును అద్భుత రూపములను తాల్చునో ఆ ప్రభువు మమ్ములను పరి రక్షంచు గాక!

 

 

మహాత్ముడు, సనాతనుడు, బ్రహ్మ మయుడు, పురాతనుడు అగు ప్రభువు ప్రతి యుగమున ‘కల్కి’ నామము కలవాడై వర్ణములను చక్క దిద్దుటకు పెక్కు రూపములు తాల్చు చుండును. దేవతలు, సిద్ధులు, దైత్యులును, అతని రూపమును చూడ జాలరు. దానిని కనుగొనుటకు విజ్ఞాన మార్గము తప్ప వేరు దారి లేదు. సర్వ ప్రాణులను రూపు మాపు యమునితో పాటు ఆ దేవతలు మొదలగు వారు ఈ కారణము వలననే ఆ ప్రభువు తాల్చన మత్స్యము మొదలగు రూపములను భక్తి భావముతో పూజింతురు. అట్టి భగవానుడు మనలను రక్షించు గాక!

 

 

అట్టి పురుషోత్తమునకు మరల మరల తిరిగి తిరిగి నమస్కరింతును. స్వామీ! నన్ను ముక్తి మార్గమునకు మళ్లింపుము. నీకు మ్రొక్కెదను.

 

 

ఇట్లు చక్కగా పరమాత్మను మనసార భావించిన ఆ గౌరముఖ మహర్షి స్వయముగా చక్రము, గద చేత దాల్చిన దేవుడు ప్రత్యక్ష మయ్యెను.

 

 

అట్లు గౌరముఖుడా పరమాత్మను గాంచి ఆటు పోటులు లేని ఆత్మా జ్ఞానమును పొంది తన దేహము నుండి వెలికి వచ్చెను. శాశ్వతము, బ్రహ్మము, దేవాత్మ, మరల పుట్టుట వంటి వికారములు లేనిది యగు ఆ పరతత్త్వములో లయము పొందెను.