వరాహ మహా పురాణము
అధ్యాయము - 79
సీతాంతము, కుముదము అను కొండల నడుమ నున్న విశాలమైన భూమి యందు అనేక పక్షులు, పెక్కు మృగములు ఆశ్రయించినది, మూడు వందల యోజనముల పొడవు, నూరు యోజనముల వెడల్పు కలది, చక్కని స్వచ్ఛమైన రుచికరమగు నీరుగల అందమైన సరస్సు ఒకటి కలదు.
పెద్ద కుండ లంతటివి సువాసనలను విర జిమ్మునవి, వేయి రేకులు కలవి అగు తెల్లని మహా పద్మములు దాని నలంక రించినవి.
దేవతలు, దానవులు, గంధర్వులు, మహా సర్పములు అందు నెలకొని యున్నవి. పుణ్యమైన ఆ సరస్సు పేరు శ్రీ సరస్సు. మంచి కాంతితో అలరారును.
ప్రసన్నములగు జలములతో నిండినది, ప్రాణు లన్నింటికి ఆశ్రయ మొసగునది అగు ఆ సరస్సు నడిమి భాగమున పద్మముల తోటలో ఒక పెద్ద పద్మము కలదు. దానికి కోటి రేకులు కలవు. ఉదయించు సూర్యుని వంటి దీప్తి కలదు. ప్రతి దినము వికసించుట చేత మధుర మైనది. కదలు చుండుట చేత పెద్ద మండలము కలిగి యుండెను. అందమైన కేసరములు గుత్తులతో, మదించిన తుమ్మెదల నాదములతో ఒప్పారు చుండును. దాని నడుమ భగవతి లక్ష్మి నిత్య నివాస మొనరించును. ఆ నివాసమున సాక్షాత్తు రూపము ధరించి లక్ష్మి కన్పట్టును. సంశయము లేదు.
ఆ సరస్సు ఒడ్డున సిద్ధులు నివసించెడునది, ఎల్లప్పుడు పూవులతో పండ్లతో సమృద్ధిగా ఉండునది, అందమైనది అగు మారేడు వన మొకటి కలదు.
నూరు యోజనముల వెడల్పు, రెండు నూర్ల యోజనముల పొడవు కలిగి, అర్ధ క్రోశము వరకు వ్యాపించిన చివరలు గలవి, వేల కొలది కొమ్మలు కలవి, గొప్ప కాండములు కలవి అగు మహా వృక్షములతో నిండి యున్నది.
పెద్ద భేరు లంతటి వేలకొలది, పచ్చని, తెల్లని అమృతము వలె రుచికరమైన, మంచి వాసన గల పండ్లతో ఒప్పారును.
పండి పగిలి, రాలి పడుచున్న పండ్లతో ఆ భూమి యంతయు వ్యాపించి యున్నది. దాని పేరు శ్రీవనము. అన్ని లోకములలో ప్రసిద్ధి కెక్కినది.
ఎనిమిది దిక్కు లందును దేవతలతో, బిల్వ ఫలములను మాత్రమే భుజించు పుణ్య వంతులగు మునులతో నిండి యున్నది. అచట సిద్ధ సంఘములు కొలుచు చున్న శ్రీదేవత సర్వ కాలములలో నివాసము చేయును.
ఒక్కొక్క కొండకు కొండకు నడిమి ప్రదేశము నూరు యోజనముల వెడల్పు, రెండునూర్ల యోజనముల పొడవు కలిగి యుండెను. అందు విమల మైన పద్మ వనము కలదు. దానిని సిద్ధులు, చారణులు సేవించి యుందురు. లక్ష్మీ దేవి తాల్చిన పుష్పము వలె ఎల్లప్పుడు వెలిగి పోవుచు ప్రకాశించును.
అర్ధ క్రోశము ఎత్తుగల చివరి భాగములతో పెద్ద పెద్ద కాండములతో బాగుగా పుష్పించిన కొమ్మల చివరలతో ఆ వనము లేత ఎరుపు వన్నెతో అలరారును.
రెండు బారల చుట్టు కొలతయు మూడు బారల విస్తృతియు, మణిశిల చూర్ణము వంటి రంగుతో, తెల్లని కేసరములతో, నిత్యము వికసించుచు, సువాసనలతో అలరారు పూవులతో ఆ వనము మదించిన తుమ్మెదల నాదముతో ప్రకాశించు చుండును.
దానవులు, దైత్యులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, కిన్నరులు, అప్సరసలు, సర్పములు దానిని ఆశ్రయించి యుండును.
అందు భగవంతుడగు కశ్యప ప్రజాపతి ఆశ్రమము కలదు. సిద్ధులు, సాధు గుణములు కలవారు అందు కొల్లలుగా నుందురు. అనేక ఆశ్రమములతో అది నిండి యుండును.
మహా నీలము కుంభము అను కొండల మధ్య ‘సుఖ’ అను నది కలదు. దాని ఒడ్డున పెద్ద వన మున్నది.
ఏబది యోజనముల పొడవు, ముప్పది యోజనముల మండలము కలిగిన ఆ తాల వనము అందమైనది. శోభ నిండినది. అర్ధ క్రోశము ఎత్తు పెరిగిన చెట్లు కలది.
గొప్ప బలము, గొప్ప సారము, గట్టి తనము, గల పండ్లు అందు కాటుక కొండల వలె నుండును. గుండ్రని తనముతో నలరారెడు మహా ఫలములతో ఆ వనము ఒప్పారు చుండును. ఇంపైన పరిమళము ప్రకాశించును. సిద్ధులు సేవించు ఆ ప్రదేశము ఐరావత గజమునకు స్థాన మైనదిగా చెప్పు చుందురు.
ఐరావతము, రుద్రము అను దేవ పర్వతముల నడుమ వేయి యోజనముల పొడవు, నూరు యోజనముల వెడల్పు గల ఒక రాతి భూమి చెట్టు చేమలు లేనిది కలదు. కాలిలోతు నీరులో అన్ని వైపుల మునిగి యుండును.
విప్రవర్యులారా! మేరు పార్శ్వమున అనేక ఆకారములు గల మైదానములను గూర్చి మీకు వివరించి చెప్పితిని.
