వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము - 63

 

మహారాజా! పుత్రప్రాప్తి వ్రతమను మరియొక పుణ్య వ్రతమును సంగ్రహముగా చెప్పెదను. వినుము.

 

భాద్రపద మాసము కృష్ణ పక్షమున అష్టమి నాడు ఈ పుత్ర ప్రాప్తి వ్రతమును చేయ వలయును.

 

షష్ఠి నాడు సంకల్పించి సప్తమి నాడు దేవకీ దేవి ఒడిలో నున్న వాడు, తల్లుల నడుమ నున్నవాడు అగు శ్రీకృష్ణ దేవుని అర్చింప వలయును.

 

 

అష్టమి నాడు స్వచ్ఛమైన ప్రభాత కాలమున నిష్ఠ కలవాడై హరిని మునుపు చెప్పిన విధానముతో అర్చింప వలయును.

 

పిమ్మట యవలు, నల్లని నువ్వులు నేయి కలిపిన పెరుగును హోమము చేయ వలయును. భక్తితో శక్తి ననుసరించి దక్షిణల నొసగుచు బ్రాహ్మణులకు సంతర్పణము చేయ వలయును.

 

పిదప తానై మొదట ఒక మారేడు ఫలమును తిని తరువాత ఇష్టము ననుసరించి తైల పాకములను, అన్ని రసములతో కూడిన వానిని భుజింప వలయును.

 

ఇట్లే పుత్రులు లేని నరుడు ప్రతిమాసమునను విధి పూర్వకముగా కృష్ణ పక్షము అష్టమి నాడు ఉపవసించి వ్రత మాచరింప వలయును. అతనికి తప్పక పుత్రుడు కలుగును. సంశయము లేదు.

 

ఒక కథ వినవచ్చు చున్నది. మునుపు ప్రతాప వంతుడగు శూరసేను డను రాజు సంతానము లేనివాడై హిమవత్పర్వతమున తపస్సు చేసెను.

 

ఇట్లతడు తపస్సు చేయు చుండగా దేవుడాతని కీ వ్రతమును గూర్చి ఉపదేశించెను. అతడును దానిని చక్కగా చేసి పుత్రుని పొందెను.

 

ఆ రాజర్షి అనేక యాగములు చేసిన పుణ్యాత్ముడు వసుదేవుని కుమారునిగా పొంది పరమానంద మందెను.

 

ఇట్లు, రాజా! నీకు కృష్ణష్టమిని గూర్చి తెలిపితిని. ఏడు గడచిన పిదప కృష్ణ ప్రతిమలను రెండింటిని బ్రాహ్మణునకు దాన మొసగ వలయును.

 

పుత్ర వ్రతమను దీనిని గురించి నీకు వివరించితిని. దీని నాచరించి నరుడు పాపము లన్నింటి నుండి విడుదల పొందును.