వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము - 107

 

 

రాజా! లవణ ధేనువును గూర్చి చెప్పెదను. వినుము.

 

అలికిన నేలపై జింకర్మము, దర్భా సనములపై పదునారు తూముల ఉప్పుతో ఆవు రూపమును చేయ వలయును. నాలుగు తూములతో దూడను చేయ వలయును. ఆవునకు కాళ్లు చెరకు గడలు.

 

బంగారు ముఖము, కొమ్ములు, వెండి గిట్టలు, బెల్లపు నోరు, పండ్ల దంతములు, చక్కెర నాలుక, గంధపు ముక్కు, రత్నము కన్నులు, ఆకుల చెవులు, మంచి గంధపు కొమ్ములు, కడుపు, వెన్న పొదుగు, త్రాటి తోక, రాగి పిరుదులు, దర్భపు రోమములు గల ఆవును కల్పింప వలయును. పాలు పితుకుటకు రాగి పాత్రను ఉంచ వలయును. ఘంటలతో ఆభరణములతో అలంకరింప వలయును.

 

మంచి వాసన గల పూవులతో ధూపములతో విధి ప్రకారము పూజించి జమిలి వస్త్రములు కప్పి బ్రాహ్మణున కొసగ వలయును.

 

గ్రహణము, సంక్రాంతి, వ్యతీపాతము, అయనము, నక్షత్ర గ్రహ పీడా సమయములు అనువానిలో ఈ దానము చేయ వలయును. లేదా ఎప్పు డైనను చేయ వచ్చును.

 

మంచి నడవడి, కులము, బుద్ధి, వేద వేదాంగముల పాండిత్యము, వేద విద్య, అగ్నిహోత్ర నిత్యార్చన కల బ్రాహ్మణునకు, ముఖ్యముగా ఇతరుల యెడ మత్సర బుద్ధి లేని వానికి, ఈ గోవు నొసగ వలయును.

 

గొడుగు, చెప్పులు, ఉంగరము, కుండలములు, దక్షిణ, శాలువ అను వానిని వస్త్రముల జంటతో కప్పి యొసగ వలయును.

 

ఓయి విప్రా! ఈ కామములను పిదుకు గోవును శుభమైన దానిని గ్రహింపుము. తల్లీ! రుద్ర రూపా! నీకు నమస్కారము. నావాంఛ లన్నింటితో నన్ను భరింపుము.

 

నీవు సర్వ భూతములలో మిక్కిలిగా విరాజిల్లు చున్నావు. సర్వ దేవతలు నీకు నమస్కరింతురు. నీవు కామములను తీర్చు ధేనువవు. లవణ ధేనూ! నీకు నమస్కారము.

 

లవణ ధేను దాత ధేనువు నొసగి లవణమును మాత్రము తిని, తక్కిన యన్నింటిని వదలి ఒక దినముండ వలయును. పుచ్చుకొన్న విప్రుడు మూడు రోజులు లవణ భోజియై యుండ వలయును.

 

వేయియో నూరో బంగారు కాసులు తన శక్తి ననుసరించి దక్షిణ నొసగ వలయును. శంకరుడున్న భూమికి దీని వలన అరుగును.

 

దీనిని భక్తితో విను వాడును, వినిపించు వాడును, సర్వ పాపముల నుండి విడివడి రుద్ర లోకమున కరుగును.