వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము - 137

స్వామీ! ఈ అపరాధ విశోధనమును విస్తారముగా వింటిని. ఇవి భగవంతునికి సంబంధించినది. శ్రేష్ఠమైనది ఆశ్చర్యకర మైనది. భాగవతు లందరకు మిక్కిలి ప్రియమైనది. నా ప్రియము కొరకు, నీ భక్తుల సుఖము కొరకు, నీవు తెలిపితివి. సర్వ ధర్మములను సాధించునట్టి దీనిని నేను వింటిని. సర్వ పాపముల నుండియు పూర్తిగా విడివడితిని. చంద్రుని వలె నిర్మల నయితిని.

 

అన్ని ధర్మముల సుఖము లకును తావలమైన ఒక పరమ రహస్యమును గూర్చి నిన్నడుగుదును. నీ భక్తుల సుఖము కొరకు నీవు దానిని చెప్ప వలయును.

 

శ్రేష్ఠమైన వ్రతమని దేనిని చెప్పుదురు? శుభమైన కుబ్జామ్రక మెట్టిది? భక్త జనులకు సుఖమును కూర్చెడు క్షేత్రములలో మేలైన దేది?

 

 

భూమీ! నీవు నన్నడిగిన దానికి బదులుగా పరమ రహస్యమును చెప్పెదను. నాకు ప్రియ మైనదియు, భాగవతులకు ఇష్ట మైనదియు నగు క్షేత్రమును గూర్చి తెలియ జెప్పెదను. వినుము.

 

కోకా ముఖము గొప్ప క్షేత్రము. అట్లే కుబ్జామ్రకము కూడ గొప్పదియే. సౌకరకము కూడ మిన్నయే. సమస్తమగు సంసారమును విడిపించు నట్టిది.

 

దేవీ! నిన్నా తావు నందే రసాతలము నుండి నేను ఉద్ధరించి తిని. ఆ సౌకరకమున భాగీరథి యగు గంగయు నున్నది.

 

 

లోకనాథా! సౌకరకమున మరణించిన వారు ఏ లోకముల కరుగుదురు? అందు స్నానము చేసిన వానికి, పానము చేసిన వానికి ఎట్టి పుణ్యము లభించును?

 

విష్ణూ! పద్మాక్షా! నీదగు ఆ సౌకరక క్షేత్రమున ఎన్ని తీర్థములు కలవు. ధర్మ సంస్థాపన కొరకు దానిని నాకు నీవు చెప్ప దగును.

 

 

దేవీ! నీవు నన్నడిగిన దానికి బదులు చెప్పెదను. సౌకరకమున మరణించు వారు ఎట్టి గతి పొందుదురో, స్నానము చేసిన వానికిని, మరణించిన వానికిని ఎట్టి పుణ్యము లభించునో, నా సంస్థానము నందున్న తీర్థము లేవియో చెప్పెదను. వినుము.

 

సుందరీ! పుణ్యాత్మురాలా! నా క్షేత్రములలో సౌకరకమునకు పోయి పొందెడు పుణ్య మెట్టిదియో వినుము.

 

వెనుకటి పది తరముల వారిని, ముందు పదునైదు తరముల వారిని అచటి కరుగు వారు ముక్తి చెందింతురు.

 

ఆ క్షేత్రమునకు పోయినంత మాత్రమున, నా ముఖమును చూచినంత మాత్రమున మానవుడు ఏడు తరములు గొప్ప కులమున జన్మించును.

 

ధనము, ధాన్యము నిండుగా గల కులము లందు, నా భక్తుడు, చక్కని రూపము, గుణములు, పవిత్రత కలవాడై జన్మించును.

 

మనుజుడై పుట్టి ఎట్టి దోషములు లేనివాడు కావలయును. అందు వలననే అతడా క్షేత్రమున కరుగుటయు, అందు మరణించుటయు సంభవించును.

 

సుశ్రోణీ! నా దగు సౌకరక క్షేత్రమున మృతి చెందిన వాడు సంసార మంతటిని వదలి వైచి, ధనుస్సు, అంప పొదులు, ఖడ్గము, గద, గొప్ప తేజస్సు, నాల్గు భుజములు కలవాడై శ్వేత ద్వీపమున కరుగును.

 

వసుంధరా! నీకు మరియొక విషయమును కూడ చెప్పెదను. అందలి తీర్థము లందు స్నానము చేసిన వాడు పరమ గతిని పొందును.

చక్రము ప్రతిష్ఠితమైన చక్ర తీర్థమును సేవించిన నరులు ఎట్టి పుణ్యమును పొందుదురో చెప్పెదను. వినుము.

 

అదియే పనిగ చక్ర తీర్థమున కరిగిన వాడు మేలుగా, పవిత్రతతో విధి ననుసరించి వైశాఖ ద్వాదశి నాడు స్నానము చేసినేని పది వేల పది వందల యేండ్లు ధన ధాన్యములు పుష్కలముగా గల గొప్ప కులమున పుట్టును.

 

అట్టి కులమున నా భక్తుడు, నా అర్చనల యందు శ్రద్ధ కలవాడు పుట్టును. పాపములను విడనాడును. దీక్ష కలవాడగును.

 

అట్లు మంచి కులమున పుట్టి సంసారమను సముద్రమును దాటి ఆ క్షేత్రమున కరిగి అందు మరణించును.

 

అట్టి నరుడు పాపము లన్నింటి నుండి విముక్తి పొంది ధనుస్సు, చక్రము, గద, ఖడ్గము గల నాలుగు భుజములు గలవాడై యలరారును.

 

చక్రతీర్థము పుణ్యము వలన అతడు శ్వేత ద్వీపమున కరుగును. శౌకరక క్షేత్రపు పుణ్య మిట్టిది. చక్ర తీర్థమున చచ్చుట యనగా అధియే కృతకృత్యత.

 

వసుంధరా! మఱియొక విషయమును చెప్పెదను. దానిని వినుము. నాదైన సౌకరక క్షేత్రమున రూప తీర్థమని ప్రఖ్యాతి చెందిన దొకటి కలదు.

 

నా అర్చనల యందు శ్రద్ధ గల నా భక్తుడు, అక్కడ స్నాన మాడినచో, మరణించినచో పొందెడు పుణ్య మెట్టిదియో వక్కాణింతును.

 

తినరాని తిండి తిన్న వాడైనను, గట్టి నియమముతో ఇచట కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి నాడు స్నానము చేసినచో అతని తండ్రులు, తాతలు వెనుకటి పది తరముల వారు, ముందటి పండ్రెండు తరముల వారు తరింతురు.

 

అతని ఒడలిపై ఎన్ని నీటి చుక్కలు నిలుచునో అన్నివేల యేండ్లు ఆతడు నా భక్తుడగును. రూప వంతుడు, గుణ వంతుడు, ధన వంతుడు నగునట్టి నా భక్తుడు చక్కని రూపము గల పతివ్రత యగు భార్యను పొందును.

 

అతడు దాత యగును. క్రోధ రాగములు లేని వాడగును. వివేకవంతుడు, చక్కని శీలము కలవాడు, నా భక్తుల యందు వాత్సల్యము కలవాడు నగును.

 

సంసారమును మూలముట్టుగా దాటి ఆ నా అర్చకుడు నా దయవలన అచటనే మరణమును పొందును. సందియము లేదు.

 

గొప్ప శక్తి గల ఆ రూప తీర్థమున మరణించిన ఆతడు గొప్ప తేజస్సు, కాంతి, నాలుగు చేతులు కలవాడై శ్వేత ద్వీపమును పొంది వాయు భక్షుడై నిలిచి పోవును.

 

సుందరీ! ఆ రూప తీర్థపు గుర్తును చెప్పెదను. వినుము. దానితో నా భక్తుడు దానిని చక్కగా తెలిసి కొనును.

 

అచట దక్షిణపు ప్రక్క భాగమున మిక్కిలి లావు కానిది, పెద్దగా ఎత్తుగా లేనిది అగు ఒకపాటి ఎఱ్ఱ గోరంట వృక్షము కలదు.

 

వైశాఖ మాసమున మానవతుల హృదయములను ఆకర్షించుచు అది పూచును. అట్లే కార్తీక మాసము ద్వాదశి నాడును అది పుష్పించును.

 

ఓ మహాభాగా! ఆ నా శౌకరక క్షేత్రమున తిరుగాడు నరుడు ఈ గుర్తుతో దాని నెరుగును. సంశయము లేదు.

 

ఆ నా శౌకరక క్షేత్రమున మరియొక దానిని గూర్చి చెప్పెదను. అచట యోగ తీర్థమని చెప్పబడు నది ఒకటి కలదు. దానిని దేవతలును ఎరుగ జాలరు.

 

నా భక్తులు, నా అర్చన యందు మిక్కిలి నేర్పు కలవారు ఆ యోగ తీర్థమున స్నానమాడి యెట్టి గతిని పొందుదురో చెప్పుదును. వినుము.

 

వారు పదునొకండు వేల యేండ్లు ఎట్టి దోషములు లేనివారు, క్రోధరాగములు వదలిన వారు, అహింస యందు గట్టి పట్టుదల కల వారునగు నా భక్తులుగానే అయి పుట్టుదురు.

 

ఓ మహానుభావా! దొడ్డదైన ఆ యోగ తీర్థమున ఒక దినము నివసించిన వాడు సంసార బంధముల నన్నింటిని త్రెంచుకొని నా అర్చనల యందు శ్రద్ధకల వాడగును.

 

యోగము నందు నిష్ఠ కలవాడు ఆ తీర్థమును వెదకు చుండును. నా దయ వలన దానిని పొందును. ఆ శౌకరకమున పుణ్యమైన స్నానము నాచరించును.

 

అట్టి నా ఆరాధకుడు అందు ప్రాణములను వదలి యోగియై కడకు శ్వేత ద్వీపమున కరుగును.

మంచిదానా! యోగ తీర్థపు గొప్ప ఫలమును యోగులైన నా భక్తులు అరుగుతావును గూర్చి నీకు చెప్పితిని.

 

నన్ను శ్రద్ధతో అర్చించు వారు ఆ యోగ తీర్థమునెట్లు తెలిసి కొందురో ఆ గుర్తును చక్కగా వివరింతును.

 

మార్గశీర్ష శుక్లపక్ష చతుర్దశినాడు ఆ తీర్థపు తావులందు ఒక్క పెట్టున చీకటి ఏర్పడును.

 

మూడు వేల మూడు వందల మూడు మూరల కొలత ఆ తీర్థమునకు చేయ బడినది.

 

ఈ గుర్తును పట్టుకొని అందు మరణించుటయో, స్నాన మాడుటయో చేయువాడు మునుపు చెప్పిన గతి కరుగును.

 

ఓ మహాభాగా! నేనున్న యోగ తీర్థపు గుర్తిట్టిది. అందు సిద్ధిని కోరువాడు, పరమ గతిని ఆపేక్షించు వాడును నన్ను పూజింప వలయును.

 

వసుధా! శౌకర తీర్థము నందలి మరియొక విశేషమును చెప్పెదను. అందు చంద్రుడు తపస్సు చేసెను.

 

అయిదే వేల యేండ్లు ఒంటి కాలిపై నిలిచి యుండెను. అయిదు వేల యేండ్లు చేతులు పైకెత్తి కొని నిలిచెను.

 

తల వంచుకొని అయిదు వేల యేండ్లు, తల పైకెత్తి అయిదు వేల యేండ్లు, గాలిని తినుచు అయిదు వేల యేండ్లు, ఆహరాము లేనివాడై అయిదు వేల యేండ్లు ఆతడు వ్రతమున నిలిచి యుండెను.

 

ఇట్లు వేల కొలది యేండ్లు తపస్సు చేసెను. నా ఆరాధన యందే తగులుకొని యుండెను. బ్రహ్మజ్ఞాన సంపన్నుల హితము నందు ప్రీతి కలవాడై యుండెను.

 

ఆతని ఈ పలుకు విని వసుంధర ఏదో అడుగ గోరినదై తలపై దోసిలి యొగ్గి పిదప మెల్లగా ఇట్లు పలికెను.

 

జనార్దనుని ఆ చంద్రుని డేకారణమున మెచ్చించెను? ప్రభూ! దీనిని నాకు చక్కగా తెలుప వలయును. నాకు దానిని విన వలయునను ఉత్కంఠ మిక్కుటముగా నున్నది.

 

భూదేవి పలుకు విని మాయల పెట్టె యగు విష్ణువు ఉరుము వంటి కంఠ ధ్వనితో తీయగా నిట్లు పలికెను.

 

భూమీ! నేను ప్రయత్న పడి చెప్పుచున్న దానిని వినుము. ఆతడు నన్నేల ఆరాధించెనో ఆ కారణమును చెప్పెదను.

 

ఆతని విశుద్ధమగు అంతరాత్మతో నేను ప్రీతుడ నైతిని. దేవతలకు దుర్లభమైన నా ఆత్మ నాతనికి చూపితిని.

 

చంద్రుడు నా రూపమును చూచెను. వెంటనే మూర్ఛనందెను. నా తేజస్సుచే మిక్కిలి మోహము నందిన వాడై నా రూపమును మొత్తముగా చూడజాలక పోయెను.

 

అట్లే మోడ్పు కన్నులు కలవాడై తలతో దోసిలి ఒగ్గి, మాటలు పెకలి రాని వాడై బెదరు కన్నులతో దిగులు దిగులుగా ఉండెను.

 

ఇట్లు తిరుగుళ్లు పడుచున్న బ్రాహ్మణాధిపతి యగు సోమునితో నేను మెల్లని చల్లని వాక్కుతో ఇట్లంటిని.

 

సోమా! నీవు ఏమి చేయ దలచితివి? నీ తపమునకు కారణమేమి? ఉన్నదున్నట్లు చెప్పుము. నీవు కోరినదేదో దాని నంతటిని అనుగ్రహముతో చేసెదను. సంశ యింపకుము.

 

సోమ తీర్థమున నున్న ఆ గ్రహపతి నా మాట విని తీయగా నిట్లు పలికెను.

 

ప్రభూ! జనార్దనా! లోకనాథా! లోక స్రష్టా! సర్వ యోగేశ్వరేశ్వరా! నా విషయమున నీవు తుష్టుడ వైనచో ఈ లోకము లుండు నందాక, నీవు ఉండునంత వరకు నీ యందు నా భక్తి సాటి లేనిదై నిలువ వలయును.

 

నీవు నా యందు నెలకొల్పిన ఆ నా రూపము, ఏడు ద్వీపముల యందును ఎక్కడి కక్కడ నిలుచుచు నందరకు కానవచ్చు గాక!

 

యజ్ఞము లందు బ్రాహ్మణులు సోమమను పేరున నా అమృతమును త్రావుదురు. అది దేవతల కమృతము వలె పరమ గతికి కారణమగు గాక!

 

అమావాస్య నాడు నేను క్షీణించి నప్పుడు బ్రాహ్మణులు చేయు పిండ పితృ యజ్ఞము విధి తప్పనిదై జరుగుగాక! నే నప్పుడు చక్కని దర్శనము కలవాడ నగుదును గాక!

విష్ణూ! నా బుద్ధి ఎన్నటికిని అధర్మమున నిలువ కుండు గాక! నేను ఓషధులకు పతి నగుదును గాక! ఈ విధముగా నీవను గ్రహింపుము.

 

నా యెడల నీవు తుష్టుడ వైనచో అవ్యక్తమగు మాయతో నా ప్రియము కొరకు, దేవా! నీవు నాకీ వరము ననుగ్రహింపుము.

 

స్వచ్ఛమగు వ్రతములు కల ఆ చంద్రుని మాట విని నేనాతనితో సోమా! అట్లే అగును. నీవు కోరినది నెరవేరును. సందేహము లేదు అని పలికితిని.

 

అంత ఆ బ్రాహ్మణుడు (సోముడు) నిర్మలమగు అంత రాత్మతో ‘సరి సరి’ అని పలుకుచు నా మాటను అనుగ్రహముగా భావించెను.

 

అంత నా సోముని మాట విని అతనికి వర మనుగ్రహించి, సోమా! పోయి రమ్మని పలికి అదృశ్యుడ నయితిని.

 

మహాభాగా! ఇట్లు చంద్రుడు చెదరని బుద్ధితో సోమ తీర్థమున తప మాచరించెను. పరమ సిద్ధి నందెను.

 

ఆ తీర్థమున స్నానము చేయువాడు నాలుగు దినములు ఉపవాస ముండు వాడునగు నా ఆరాధకుడు పొందు ప్రయోజనము చెప్పెదను. వినుము (అష్టమేవ భక్తేన = ఎనిమిదవ కాలపు భోజనము చేత, అనగా రోజునకు రెండు చొప్పున ఎనిమిది భోజనములను విడచి నాలుగు రోజులు ఉపవాసము చేసి అని తాత్పర్యము)

 

ఆ సోమ తీర్థమున స్నానము చేసి ఆరాధన చేయు వాడు పొందెడు ఫలమును వక్కాణించెదను.

 

మూడు వేల మూడు వందల సంవత్సరములు ఆతడు, వేదములయు, వేదాంగములయు పారమును ముట్టిన బ్రహ్మ జ్ఞాని యగును.

 

ఆతడు ద్రవ్య వంతుడు, గుణ వంతుడు, వివేకము కలవాడు, దోషములు లేనివాడు నగు నా భక్తుడగును. సంసార సాగరమున నున్నను బ్రహ్మ జ్ఞానము కల వాడగును.

 

నా మార్గము ననుసరించు భక్తుడు తెలిసి కొనెడు సోమ తీర్థపు గుర్తును తెలిపెదను.

 

వైశాఖ మాస కృష్ణపక్ష ద్వాదశి నాడు చీకట్లు క్రమ్ముకొని యుండగా అందేమియు కాన రాకుండును. అప్పుడు ఆ నేల చంద్రుడు లేకయే చంద్రుని కాంతితో మెరసి పోవు చుండును. వెన్నెల కానవచ్చును. చంద్రుడు కానరాడు.

 

దారి యందు నిలిచి యుండగా తన నీడ కాన వచ్చును. చంద్రుడు కానరాడు. ఇది మిక్కిలి ఆశ్చర్యము.

 

పుణ్యమగు నా సౌకరక క్షేత్రమున సోమ తీర్థపు గుర్తిట్టిది. మానవు లిందు ముక్తి పొందుదురు.

 

భద్రులారా! సంసారమను సముద్రమున చిక్కిన నరులు ఎచట తరింతురో ఆ సోమ తీర్థమును గూర్చి నీకు వివరించితిని.

 

వసుంధరా! ఈ క్షేత్రము ప్రభావమును గూర్చి మరియొక విషయమును చెప్పెదను. వినుము. అది పరమ ఆశ్చర్యమును కలిగించును.

 

తన పూర్వ కర్మ నిర్ణయము వలన తన కోరిక లేకయే ఈ క్షేత్రమున చచ్చిన ఆడు నక్క మనుష్య స్త్రీ అయినది.

 

ఆమె విశాలమైన కన్నులు కలది. దోషములు లేనిది, నిలువెల్ల సౌందర్యము కలది. రూపవతి, గుణవతి, అరువది నాలుగు కళలలో ఆరితేరినది అగు రాజపుత్రి అయినది.

ఆ సోమ తీర్థమునకు తూర్పు ప్రక్కగా గృధ్రవటమను తీర్థము కలదు. అచట అనుకొనకయే మరణించిన గ్రద్ద మనుష్యత్వమును పొందెను.

 

నారాయణుని వలన పై మాట విని శుభ లక్షణ యగు భూదేవి విష్ణు భక్తుల సుఖమునకు ఆస్పదమైన వాక్యమును తీయగా ఇట్లు పలికెను.

 

ఆ తీర్థ ప్రభావము ఎంత గొప్పది? నీవెంత శుభ లక్షణుడవు! అట్టి నీ ప్రభావము చేత పశు పక్ష్యాది జన్మములను పొందిన గ్రద్దయు నక్కయు మానవ దేహమును పొందినవి.

 

జనార్దనా! అచటి తీర్థము లందలి స్నానము, మరణము పొందిన వారు ఎట్టి గతిని పొందుదురో నాకు చక్కగా తెలియ జెప్పుము.

 

వారిని గుర్తింపదగు చిహ్న మెట్టిది? విష్ణు భక్తులకు సుఖమును కూర్చెడు నీ క్షేత్రము నందలి తీర్థము లెట్టివి?

 

ఎట్టి కర్మ పరిపాకముతో, కోరుకొన కుండియు గ్రద్దయు, నక్కయు నీ క్షేత్రము లందు మరణించి గొప్ప ప్రియమును పొందినవి?

 

అంతట ధర్మ వేత్తలలో శ్రేష్ఠుడగు విష్ణువు భూదేవి మాట విని ధర్మ మెరుగ గోరు వసుంధరతో తీయగా ఇట్లు పలికెను.

 

భూమీ! ఆ రెండును ఏ కారణమున మనుష్య దేహము పొందెనని నన్ను నీవడిగితివి. దానిని చక్కగా తెలియ జెప్పెదను. వినుము.

 

ఆ కృత యుగము నా ఏర్పాటు వలన గడువగా యుగముల వరుసలో త్రేత రాగా, కాంపిల్య నగరము నందు సర్వ కర్మముల చక్కని జ్ఞానము కలవాడు, పుణ్య మూర్తి బ్రహ్మదత్తుడని ప్రసిద్ధి కన్నవాడు నగు ఒక రాజు ఉండెడి వాడు.

 

అతని కుమారుడు సోమదత్తుడు. సర్వ ధర్మములలో నిష్ఠ కలవాడు. పుణ్యాత్ముడు. శుభమైన లక్షణములు కలవాడు.

 

అతడు పితృ క్రియ కొరకు (శ్రాద్ధము కొరకు) ఒక అమావాస్య నాడు మృగమును పొంద గోరి పులులు, సింహములు తిరుగాడెడు అడవికి వేటకై అరిగెను. కాని ఆ రాజు అందొక్క మృగమును కూడ శ్రాద్ధమునకై పొంద జాల కుండెను.

 

ఇట్లు తిరుగు చుండగా అతని కుడి వైపున నిలిచిన ఒక నక్క కాన వచ్చెను. సర్వ శుభములు కల ఆ నక్క వేగముగా పోవు చుండగా ఆతడు దానిని దేహము నడుమ బాణముతో కొట్టెను.

 

అట్లు ఆ బాణము కాల్చి వేయు చుండగా నిలువెల్ల వేదనతో కూడిన ఆ ఆడు నక్క సోమ తీర్థము కడ యాదృచ్చికముగా ప్రాణములను వదలెను.

 

ఇంతలో ఆ రాజ పుత్రుడు ఆకలి గొన్న వాడై గృధ్రవట తీర్థము నకు చేరి అచట విశ్రాంతి గొను చుండెను.

 

అంతలో రావి చెట్టు కొమ్మ పై నన్ను ఒక గ్రద్దను చూచి ఒక బాణముతో దానిని కూల నేసెను.

 

బాణముతో ముక్కలైన గుండె గల ఆ గ్రద్ధ ప్రాణములు పోయినదై, చైతన్యము లేనిదై ఆ రావి చెట్టు మొదట కూలెను.

 

రాజ పుత్రుడు అట్లు కూలిన గ్రద్దను కాంచి, తెగి పడిన రెక్కలు గల ఆ గ్రద్ద నెత్తుటితో ఎరు పెక్కిన బాణములతో దాని రెక్కలను తొలగించి దానిని ఆ వటమున నుంచి తన పురమునకు తిరిగి వచ్చెను.

 

అదియు పెక్కు కాలమునకు కోరకయే అచట కూలి, కళింగ రాజు కుమారుడై పుట్టెను.

సర్వ శాస్త్రములను చక్కగా తెలిసిన దాయెను.

 

అతడు పండితుడు. గుణవంతుడు. తన దేశమునకు ప్రియము చేయువాడు. ఆయాస మెరుగడు. దుఃఖ మాతనికి ఎన్నడు కలుగదు.

 

భూమీ! ఆ నక్క ఉన్నదే, అది కాంతీ రాజ్య పాలకుని కులమున రాజ పుత్రియై మనోరమ యను పేరున పుట్టెను.

 

చక్కని రూపము కలది. గుణములు కలది. సమర్థ సర్వాంగ సుందరి. అరువది నాలుగు కళలలో ఆరితేరినది. కోకిల వలె చక్కని కంఠ స్వరము కలది.

 

ఇట్లు కాగా, మంచి భావనల వలనను, ఒకరి కొకరికి ఏర్పడిన ఆత్మీయత వలనను, పరస్పరము కులములు కలసి నందు వలనను, నా అనుగ్రహము వలనను కాంతీ రాజ్య కళింగ రాజ్య పాలకులకు సంబంధము ఏర్పడెను.

 

అంత కొంత కాలమునకు కాంతీ రాజ కళింగ రాజులు శాస్త్రము చూపిన పద్ధతితో వారిరువురకు వివాహము చేసిరి.

 

కళింగ రాజ కుమార దంపతులకు సమృద్ధము లైన ధనములను, రత్నములను, రమణీయములును, యోగ్యములు నగు ఆభరణములను, వస్తువులను కానుకగా ఇచ్చిరి.

 

కళింగ రాజు వివాహము కావించి తన తనయునితో కూడియున్న కోడలిని కైకొని మిక్కిలి సంతోషము నొందిన మనస్సుతో వేగముగా తన పురమునకు వచ్చెను.

 

ఇట్లు ఆ దంపతులకు అనుకూలముగా కాలము గడచు చుండగా ఒకరి యెడ నొకరికి ప్రీతియు, రోహిణీ చంద్రులకు వలె, వృద్ధి పొందు చుండెను.

వారిరువురు చక్కని రమణీయ ప్రదేశము లందును, దేవాయముల యందును, నందనముతో సరి తూగెడు ఉద్యాన వనముల యందును ప్రీతితో విహరించిరి.

 

చక్కని ప్రతిష్ఠ గల రాజపుత్రి ఏ క్షణము నందైనను, భర్త తన పార్శ్వమున కనబడనిచో తాను మరణించిన నట్లే భావించెడిది.

 

అతడును, సర్వమైన రూపము చేత మిక్కిలి సౌందర్యము కల తన భార్యను ఒక్క క్షణమైన చూడకుండె నేని తానుచు మరణించి నట్లే భావించెడి వాడు. ఇట్లు వారిరువురకు ప్రేమ పెరుగుచునే యుండెను.

 

సముద్రపు నేల వలె వారి ప్రీతి పెరుగుచునే యుండెను. ఆమె తన హృదయమున మరియొక పురుషుని తలచి యెరుగదు.

 

ఆమెయు తన చక్కని శీలము చేతను, నడవడి చేతను, కళింగ రాజును, పౌరులను, జానపదులను సంతోష పరచు చుండెను.

 

కళింగ రాజు అంతః పురము నందలి కాంతులు, రాజును వారి నడవడితో, పనులతో, మన్ననలతో పరమానంద మందిరి.

ఇట్లు వారిరువురకు, శచీ పురందరులకు వలె, ఒకరి యెడ నొకరికి ప్రీతి పెరుగు చుండెను. ఆనందమందు చుండిరి.

 

అంత నొకనాడు ఆ బాల ఏకాంతమున ప్రేమతో, సిగ్గుతో ఆ రాజ పుత్రునితో ఇట్లు పలికెను.

 

రాజపుత్రా! యశోధనా! నిన్నొక్క చిన్న విషయ మడుగ గోరు చున్నాను. నా యందలి స్నేహముతో, ప్రియముతో నీవు దానిని గూర్చి చెప్ప వలయును.

 

అంత కళింగ రాజు కుమారుడు, పద్మ పత్రముల వంటి కన్నులు కలవాడు ప్రియురాలి మాట విని తీయగా నిట్లు పలికెను.

 

మంచిదానా! నీవేదేది కోరుదువో దాని నంతటిని చేసెదను. సత్యము మీద ఒట్టు వేసి చెప్పు చున్నాను.

 

రాణీ! సత్యము బ్రాహ్మణులకు కుదురు. విష్ణువు సత్యము నందే నెలకొని యుండును. దాని కుదురు తపస్సు. రాజ్యము సత్యము నందే ప్రవర్తించును.

 

నేను ఎన్నటికిని అసత్యము పలుకను. సుందరీ! ఇంత వరకు అసత్య మాడలేదు. చెప్పు. నీ కొరకు నేనేమి చేయ వలయును?

 

ఏనుగులు, గుఱ్ఱములు, రథములు, వాహనములు, మిక్కిలి శక్తి కల రత్నములు, నీకు వలయునా? లేక అన్నిటి కంటె మిన్నయినది నా పట్ట బంధమును నీ కొసగుదునా? (పట్ట బంధము = రాజ లాంఛనమగు కిరీటము)

 

కాంతీరాజ పుత్రి యగు ఆమె భర్త పలుకు విని ఆతని రెండు పాదములను చక్కగా పట్టుకొని భర్త కిట్లు బదులు చెప్పెను.

 

నేను రత్నమును కోరను. ఏనుగులు, గుఱ్ఱములు, రథములు నాకక్కర లేదు. నా భర్త జీవించి యున్నంత వరకు నాకు కిరీటముతో పనిలేదు.

 

నేను మధ్యాహ్నమున ఒంటరిగా నిద్రింప గోరుచున్నాను. ఎక్కువ సేపు కాదు. చాల తక్కువ కాలము. అట్లు నేను నిద్రించు నపుడు నన్నెవ్వడు చూడరాదు.

 

మామ కాని, అత్త గాని, మరి యెవరు కాని, నేను నిద్రించు చుండగా చూడరాదు. ఇది ఒక్క ముహూర్త కాలము నాకు వ్రతము.

 

ఇంటి పరిచారకులు గాని, బంధు జనులు గాని ఎవ్వరు గాని నేను నిద్రించు చుండగా నన్ను చూడరాదు.

 

కళింగ సంపదల పెంపొందించు ఆ రాజ కుమారుడు భార్య మాట విని అట్లే అని పలికెను.

 

సుశ్రోణీ! నమ్మకముతో నుండుము. శుభముగా నీ వ్రతమును చేసి కొనుము. నీ శయనీయ మహా వ్రతమును ఎవ్వడును చూడడు.

 

ఇట్లు వారిరువురకు కాలము గడచు చుండగా కళింగుడు ముసలి తనము పొంది పుత్రుని రాజ్యమున అభిషేకించెను.

 

వంశపు మొలక అయిన కొడుకునకు న్యాయము ననుసరించి తాను నిష్కంటకముగా అనుభవించిన రాజ్యమును ఒసగి కళింగుడు మరణించెను.

ఇట్లు తండ్రి ఒసగినదియు, తన కీర్తిచే చేతి కందినయు నగు రాజ్యమును ఆతడు అనుభవించు చుండెను. ఆమెయు తన్నెవ్వరు చూడని తావున ఒంటరిగా నిద్రించు చుండెను.

 

అంత పెద్ద కాలమునకు ఆ కళింగ వంశ వర్ధనుడు సూర్యునితో సమానమగు తేజస్సు గల పవిత్రులగు అయిదుగురు పుత్రులను పొందెను.

 

ఈ విధముగా నా మాయతో మోహితమైన మనుష్య లోకము తమ తమ కర్మములతో చక్కగా కూడుకొని చక్రము వలె తిరుగు చున్నది.

 

జనుడు పుట్టు చున్నాడు. పుట్టి బలుడగు చున్నాడు. తరువాత తరుణుడగు చున్నాడు. వెనుక నడిమి వయస్సు కలవాడగు చున్నాడు. అటుపై ముదుసలి యగు చున్నాడు.

 

బాలుడై తెలియక చేయు కర్మములను బట్టి పాపముతో అంటు పొందడు. ఇందు సంశయము లేదు.

 

అన్ని విధములగు అడ్డంకులతో కూడిన రాజ్యము నట్లత డేలు చుండగా డెబ్బది యేడేండ్లు కడచినవి.

 

డెబ్బది యెనిమిదవ ఏట ఆ రాజు ఏకాంతమున సూర్యుడు మధ్యాహ్నమున నుండగా ఆమెను గూర్చి ఆలోచించెను.

 

వైశాఖమాస శుక్లపక్ష ద్వాదశి నాడు ఆతనికి ప్రియురాలిని చూడ వలయునను బుద్ధి పుట్టెను.

 

ఇందు ప్రయోజన మేమి? ఈ వ్రత మెట్టిది? ఈమె జనులు లేని చోట నిద్రించెడు వ్రతమేమి? ఏ ధర్మ శాస్త్ర గ్రంథమునను ఇట్టి నిద్రించు వ్రత మేదియు కానరాదే!

 

ఇది విష్ణువు చేసిన కర్మము కాదు. ఈశ్వరుడు ఉపదేశించినది కాదు. మనువు ఏర్పాటు చేసిన ధర్మముగా కానరాదు.

 

కశ్యపుడు చేసిన ధర్మము కాదు. మహాయోగు లెవ్వరి వ్రతము కాదు. ఈ వ్రతము నాచరించిన వాడెవ్వడు ఇంతవరకు కానరాడు.

 

బృహస్పతి చెప్పిన ధర్మము లందు గాని, యముడు బోధించిన ధర్మము లందు గాని యిది కానరాదు. ఈమె నిద్రించుచు ఈ వ్రతము నాచరించు చున్నది.

 

ఇష్టమైన భోగముల ననుభవించుచు, చక్కని మాంస భోజనములు చేయుచు, తాంబూలము వేసికొని, ఎఱ్ఱని వస్త్రములను, సన్నిని వలిపెములను ధరించి, రత్నమయములగు ఆభరణము లతో నిండిన శరీరమున సుగంధముల లందుకొని ఆ వెడద కన్నుల నా కాంత ఏ వ్రతము చేయు చున్నది?

 

కమలముల వంటి కన్నులు గల నా ప్రియురాలు కోపగించినను తప్పక ఆమె ఎట్టి వ్రతమును చేయుచున్నదో చూడనే వలయును.

 

ఇతరులను వశపరచు కొనెడు కిన్నరుల వ్రతము చేయు చున్నదా? కాక యోగీశ్వరయై యిచ్చ వచ్చిన తావున కరుగు చున్నదా?

 

అట్లుకాక ఇతరుని మరిగి కామ రోగముతో పైకొని యున్నదా? లేక ముహూర్త కాలము చెడిపె యై మరియొక పురుషుని అంటి పెట్టుకొని యుండెనా?

 

ఇట్లతడు తలచు చుండగా సూర్యు డస్తమించెను. జను లందరకు సుఖము కలిగించు రాత్రి అరుదెంచెను.

 

అంత రాత్రి గడువగా వేకువజాము రాగా వందులు మాగధులు, వైతాళికులు స్తోత్ర పాఠములు చేయ మొదలిడిరి.

 

సర్వ లోకముల మేలు కొరకు సూర్యుడు ఉదయింపగా రాజు శంఖములయు, దుందుభులయు నాదములతో మేల్కాంచెను.

 

తన ప్రియురాలిని (నిద్రించు చుండగా) చూడ వలయునని తాను వెనుకటి దినమున తలచిన ఆ తలపే తక్కిన అన్ని చింతలను పారద్రోలి తిరుగ సాగెను.

 

స్నానము చేసి సంధ్య వార్చి తగు విధముగా పట్టు పుట్టములు గట్టి అందరను తొలగించి తగు విధముగా ఇట్లు ఆజ్ఞను ప్రకటించెను. వ్రతమున నున్న నన్ను స్త్రీ గాని, పురుషుడు గాని చూచినచో ధర్మ యుక్తమైన దండముతో ఆ వ్యక్తి నాకు చంప దగినది యగును.

 

ఇట్లాజ్ఞాపించి ఆ కళింగ నృపతి తొందరతో దీరుడై యాచోటి కరిగి అందు ప్రవేశించెను.

 

ఆమెను చూడ వలయునను ఆస కల ఆ రాజు పాన్పుపై నున్న ఆ సుందరిని చూచి చింతాసక్తు డాయెను.

 

ఆ కమల పత్రాక్షి వేదనతో, ఆయాసముతో, తలనొప్పితో రోగ పీడితయై యేడ్చు చుండెను.

 

నేను పూర్వ జన్మమున ఎట్టి చేయరాని పని చేసితినో, నా పుణ్యము తరిగి పోగా ఇట్టి దశను పొందితిని.

 

దిక్కు లేని దానివలె పాటు పడుచున్న నన్ను నా భర్త యెఱుగడు. నా భర్త నన్ను గూర్చి యేమి అనుకొను చున్నాడో? అతని జనుల భావము లెట్టివో?

 

ఇచట పడియున్న నేను చెలుల కేమి చెప్పుదును? నేను తలచెడు తీరు సరికాదను కొందును.

 

కోరి తెచ్చుకొన్న దానికి ఈ దుఃఖము తగదు. భర్త నన్ను గూర్చి యేమి తలచునో? తక్కిన జను లేమనుకొను చున్నారో? సరికాని విధముగా నేనీ వ్రతమును చేపట్టితిని. ఇది అన్ని యెడల వికటించినది.

 

ఏనాటికైన సౌకరక క్షేత్రమునకు పోవలయును. అప్పుడు నామదిలో నున్న మాటను చెప్ప వలయును.

 

అంత ప్రియురాలి మాట విని రాజు లేచి చేతులతో భార్యను కౌగిలించుకొని యిట్లు పలికెను.

 

ప్రియా! నిన్ను నీవు ఏల నిందించు కొందువు. మెచ్చుకొన వేల? శోకింపరాని దానవు. శోకింప దగిన దాన వేల అయితివి?

 

ఎనిమిది అంగములు గల వైద్యమున నేర్పు గల వైద్యులు లేరా? పెరిగిన నీ తలపోటును మెల్లగా తొలగింప గలరు కదా!

 

ఏ దోషము చేత నీవు దీనిని ఇంత గుట్టుగా నుంచితిని? తలపోటు నిన్ను పీడింపగా ఏల నలిగి పోవు చున్నావు?

 

వాత రోగమా? కఫముతో కూడిన పైత్య దోషమా? రక్త దోషమా? శ్లేష్మ దోషమా? సన్నిపాతమా? దేనితో నీ తల నొచ్చు చున్నది?

 

 

కాలము, అకాలము అనువాని తత్త్వ మెరిగిన వారు, ఉపాయములు తెలిసిన వారు ఎందరో కలరు. మాంసపు కూడు తిను చున్నావు. దాని వలన నీ తల నొచ్చు చున్నదేమో?

తల నరములను గట్టిగా పొడిచినచో చెడు రక్తము వెలువడును. తలకు తైలము మర్దించినచో తలనొప్పి పోవ కుండునా?

 

దీని నింత గుట్టు చేసితివి. నాకును మునుపు చెప్ప వైతివి. వ్రతమను నెపముతో నిన్ను నీవు హింసించు కొంటివి.

 

నీలో నీవు సౌకరమునకు పోవుటను గూర్చి మాటాడుకొను చున్నావు. అందు నీవే గుట్టుగా చేయ వలసినది కలదేమో! దాని చేతనే వేదన నిన్ను పీడించు చున్నది.

 

అంత ఆ కమల పత్రాక్షి సిగ్గుతో దుఃఖముతో కుమిలి పోవుచు ఆతని రెండు పాదములను పట్టుకొని యిట్లు పలికెను.

 

రాజేంద్ర! నీవు అనుగ్రహముతో నన్నడుగ దగదా? ఇది నా పూర్వ కర్మ ననుసరించి వచ్చిన విషయము. దీనిని నీవడుగ దగును.

 

అంత భార్య మాటను విని కళింగ జనేశ్వరుడు మనసు కుదుట పరచుకొని తీయగా నిట్లు పలికెను.

 

ఓ కీర్తి శాలినీ! ఈ రహస్యమును నాకును దాచెదవేల? అడుగు చున్నను నాకును చెప్పవేల?

 

భర్త మాట విని విస్మయముతో విప్పారిన కనులు గల ఆమె కళింగ జనాధిపునితో మెల్లగా ఇట్లనెను.

 

భర్తయే ధర్మము, భర్తయే యశస్సు. భర్తయే అన్నింటి కంటె ప్రియముతో చూడ దగిన వ్యక్తి. నన్ను నీవడిగిన దానిని తప్పక చెప్ప వలసినదే.

 

కానీ రాజా! నా హృదయమున ఏమి తిరుగు చున్నదో, ఈ దుఃఖమేమో నేను నీకు ఇందు ఎన్నటికిని చెప్ప జాలను.

 

నీవు మహారాజువు. నిత్యము సుఖముతో నున్న వాడవు. అంద గాడవు. నా వంటి భార్యలు నీకు అంతః పురమున పెక్కండ్రు కలరు. మాంస భోజనములు చేయు చుందువు. ప్రజలు నీ మాటపై నడతురు.

 

నీవు నాకు దేవుడవు. గురువవు. సాక్షాత్తు భర్తవు. సనాతనమైన యజ్ఞమవు. ధర్మము, అర్థము, కామము కీర్తి, స్వర్గము, పాలకుడు అన్నియు నీవే. రాజా! నీవు అడిగినపుడు ఇది యంతయు నేను చింతింప దగినది.

 

రాజేంద్రా! సమస్తమగు రాజ్యమున కోరిక గల సుముఖుడ వగు నీకు ఆ కారణమును తప్పక చెప్ప వలయును.

 

నీకు పెక్కండ్రు భార్యలు కలరు. నీవు వారిని నా వేదనను గూర్చి అడుగ దగును. ఇక నేనో మాంసపు కూడులను తినుచున్నాను. నామాట చెల్లు చున్నది. గంధములు, భోగములు కలవు. అట్టి నన్ను నీవు అడుగ రాదు.

 

అంత భార్య పలికినది విని కళింగ దేశ మహారాజు కమలముల వంటి కన్నులు గల ఆమెతో తీయగా ఇట్లు పలికెను.

మంచిదానా! శ్రద్ధగా వినుము. అది శుభమో, అశుభమో, నీవు తప్పక చెప్ప వలయును. ఇది ధర్మము. సంశయము లేదు.

 

ధర్మ మార్గమున నున్న స్త్రీలకు గ్రహింప దగిన వెన్ని యున్నను, భర్తను పొందిన పిమ్మట వారు రహస్యములను దాచరు.

 

ఎంత దుష్కరమగు పని చేసినను రాగ లోభములకు కక్కుర్తి పడి రహస్యమును దాచునేని ఆమెను పండితులు ‘సతి’ అనరు.

 

దీనిని బాగుగా విచారించి ఓ యశస్వినీ! పుణ్యాత్మురాలా! సత్యమును చెప్పుము. ఆ రహస్యమగు విషయమును నాకు చెప్పుట వలన నీకు అధర్మము కలుగదు.

 

అంత భర్త మాట నాలకించి కాంతీరాజ కులమున పుట్టిన ఆయమ కళింగాధిపతికి ప్రియమగు మాట నిట్లు చెప్పెను.

 

రాజే దైవము. రాజు గురువు. రాజు చంద్రుడని గ్రంథము లందు చదువుదురు. తప్పక చెప్ప వలయును. ఇది సనాతనమగు ధర్మము.

 

నీతో రహస్యము చేయరాని దగునేని, రాజసత్తమా! విను. నీ పెద్ద కుమారుని రాజ్యమున నభిషేకింపుము.

న్యాయము ననుసరించి కులమునకు తగినట్లుగా రాజ్యమును పుత్రున కొసగి నాతో పాటు రమ్ము. సౌరక్షేత్రమునకు పోదము.

 

అంత తన యిల్లాలి పలుకు విని కళింగ రాజు అట్లే అని పలికి ఆమె మాట నంగీకరించెను.

 

నేను నా తండ్రి నుండి క్రమమైన మార్గమున మునుపు పొందిన రాజ్యమును, నీ మాట మీద కుమారున కొసగెదను.

 

అంత రాజును, రాజపుత్రియు వెలుపలికి వచ్చిరి. అచట జనులను గాంచిరి.

 

అంత రాజు పెద్దకంఠ ధ్వనితో, ఎవరక్కడ ద్వారము కడ నిలిచినది? అని కంచుకిని త్వరగా రమ్మని పిలిచెను.

 

ఈ జనుల నందరను, నా పరిచారకులను ఇక్కడ ఉండి పంపి వేయుము. ఒక వింత జరిగినది. ఈ కీర్తి శాలిని త్వరగా వెడలుగాక!

 

అంత హలాహలా అను శబ్దము, నవ్వులు అంతఃపుర జనము నుండి వెలువడినవి. మమ్ములను తోలి వేయుటకు కారణమే మని వారు పలికిరి.

 

రాజులకు పెక్కు చింతలు. పెక్కు పనుల తొందరలు కనుక మమ్ముల నెందులకు తొలగ ద్రోయు చున్నారో మేము వినరాదా?

 

పిమ్మట రాజు పెక్కు విధములగు అన్న పానములను తీసి కొనెను. అభిషేకముకై మంత్రులను ఆయా కార్యములకు నియోగించెను.

 

రాజధానికి వచ్చిన మంత్రుల నందరిని చూచి వెడద కన్నులు గలవాడు, రాజనీతిలో ఆరితేరిన వాడునగు కళింగుడు ధర్మముతో కూడినది, శబ్ద శాస్త్ర మర్యాదలు తప్పనిది అగు మదుర మగు మాట నిట్లాడెను.

 

రేపు ఉదయమున పుత్రుని రాజ్యము నందభిషేకింప గోరు చున్నాము. కుమారుని అభిషేకమునకు చేయ వలసిన దానిని వెంటనే సిద్ధ పరపుడు.

 

అంత మంత్రులు రాజుతో అంతయు సిద్ధమే యనిరి. రాజా! నీవు పలికినది మాకును ప్రియమే అనియు పలికిరి.

 

ఇట్లు పలికి మంత్రులు వెడలి పోయిరి. సూర్యుడు అస్తమించెను. ఆ రాత్రి ఆట పాటలతో సుఖముగా గడచి పోయెను.

 

సూతులు, మాగధులు, వందులు, వైతాళికులు స్తోత్ర పాఠములతో మంగళ గీతములతో రాజును మేల్కొల్పిరి.

 

రాత్రి గడచిన పిదప సూర్యుడుదయించి నంత శుభ ముహూర్తమున రాజు కుమారు

నభిషేకించెను.

 

కుమారునకు రాజ్య మొసగి ఆతని శిరస్సు మూర్కొని పుత్రులు కలవారిలో శ్రేష్ఠుడు, ధర్మవేత్తయు నగు ఆ రాజు కొడుకుతో నిట్లనెను.

 

కుమారా! రాజ్య పదవి యందున్న నీకు కర్తవ్య మెట్టిదో నా వలన వినుము. పరమ ధర్మమును, పితృ దేవతల ముక్తని కోరినచో నీవిది విన వలయును.

 

ఈయ దగిన వారి యందు ఆర్తిని కలిగించ రాదు. పరుల భార్యలను చెరచు వారిని, బాలురను, స్త్రీలను హింసించు వారిని కఠినముగా శిక్షింప వలయును.

పరుల భార్యల యందు, ముఖ్యముగా బ్రాహ్మణ స్త్రీల యందు లోభము ఎన్నటికి చేయ వలదు. చక్కని రూపము గల పర స్త్రీని చూచి కన్నులు మూసికొన వలయును.

 

ఇతరుల ధనము లందును, అన్యాయముగా సంపాదించు ధనము లందును లోభము కూడదు. మంత్రు లందరు సర్వ కాలముల యందును ఒక్క తీరున నిలువరు.

 

కుల ధర్మమును బట్టియు, కీర్తిని బట్టియు నీవు సాధించిన దేశమును రక్షించుకొన వలయును. ఏమరుపాటు లేక నిలువ వలయును. మంత్రుల మాటలు పాటింప వలయును.

 

మంత్రులు చెప్పిన దానిని బాగుగా విమర్శించి చేయ వలయును. శరీర రక్షణమును తప్పని సరిగా చేయ వలయును.

 

నాకు ప్రియమును, హితమును కోరెడు నీవు ప్రజలను సంతోషపెట్ట వలయును. వేద వేత్తలను ఆనందింప జేయ వలయును. కుమారా! ఇది నీకు కర్తవ్యము.

 

ఏడు వ్యసనములను రాజు విడువ వలయును. రాజ సుతులలో దోషములు మెండుగా నుండును. వానితో ఎంత సంపద గల వాడైను, ఎంతటి తేజశ్శాలి అయినను రాజు నశించును. (1. స్త్రీ 2. జూదము 3. పానము 4. వేట 5. పలుకులలో పరుస దనము. 6. కఠినమైన దండనము 7. సొమ్మును వ్యర్థముగా వెచ్చించుట ఇవి సప్త వ్యసనములు.)

 

మద్యము త్రావుటను వదలి వేయ వలయును. వేటను ఎల్లప్పుడు వదల వలయును. పరుషమైన పలుకు పలుక రాదు. చొల్లు వాగుడు ఎన్నటికిని చేయరాదు.

 

రాజ్య సంబంధమగు రహస్యమును రట్టు సేయరాదు దూత మనసు విరుగ గొట్టరాదు. దండమున పరుస దనమును, చెడువారి సహవాసమును వదల వలయును.

ధనమును వ్యర్థ పరుపరాదు. రాజ కార్యము నెరవేర వలయునన్న కోరిక యున్నచో మంత్రితో అప్రియము పలుక రాదు.

 

వెడలి పోవుటకు దారి యందున్న నన్ను వారింప వలదు. అది నా కిష్టము కాదు. నా యందు నీ కిష్టమున్నచో వెంటనే దీనిని ఆచరింపుము. (నా యాత్రను అంగీకరింపు మని తాత్పర్యము)

 

అంత తండ్రి మాట విని రాజ పుత్రుడు, ఓ యశస్వినీ! రెండు పాదములను పట్టుకొని దీనముగా ఇట్లు బదులు పలికెను.

 

నాయనా! నీవు లేనపుడు నాకు రాజ్యమేల? కోశమేల? బలమేల? ఏను కాలు చేతు లాడించుటకును చాలను.

 

అభిషేకము, రాజ శబ్దము వీనిని నాకు నీవంట గట్టుచున్నావు. నీవు లేని నేను వీనిని గొప్పవిగా భావింపను.

ఏదో ఆటలాడుట మాత్ర మెరుగుదును. బాలకులు క్రీడింతురు గదా! రాజులు చేసెడు రాజ్యచింత యననేమో నాకు తెలియదు.

 

కళింగ మహీపతి ఆ మాటను విని మెత్తని మాటలతో ఇట్లు పలికెను.

 

కుమారా! ఇట్లాడుదువేమి? నేను నీ పలుకును తెలియ కున్నాను. పౌరులు, జానపదులు నీకు అన్నియు నేర్పుదురు.

 

ఇట్లు ధర్మ శాస్త్రానుసారము ఆ రాజు కుమారునికి బోధించి గట్టి నిశ్చయము చేసికొని బయలు దేరుటకు సిద్ధమాయెను.

 

అట్లు బయలు దేరిన రాజును గాంచి పౌరులు, జానపదులు ఆలు బిడ్డలతో పాటు ఆ రాజును వెంట నంటిరి.

 

ఏనుగులు, గుఱ్ఱములు, రథములు, వాహనములు, స్త్రీలు, అంతఃపురము పొంగులెత్తు ఆనందముతో అందరు రాజు వెంట పోసాగిరి.

 

మాధవీ! పెద్ద కాలమున కాతడు సౌకరక క్షేత్రమును చేరుకొనెను. ధనములను, ధాన్యములను, పెద్ద యెత్తున దాన మొసగెను.

 

వసుంధరా! ఈవిధముగా ధర్మ సంబంధములగు కార్య కలాపముతో న్యాయము తప్పని రీతితో అతనికి కాలము గడచు చున్నది.

 

అంత నొకనాడు పద్మముల రేకుల వంటి కన్నులు గల ఆ కళింగ రాజు కాంతీ రాజ సుతతో తీయగా ఇట్లు పలికెను.

 

సుందరీ! నా జీవితమున వేయి యేండ్లు నిండినవి. నిన్ను నేనడిగిన ఆ పరమ రహస్య మేమియో చెప్పుము.

 

అంత పతిమాట విని నవ్వి ఆ శుభేక్షణ ఆతని రెండు పాదములను పట్టుకొని రాజుతో ఇట్లు పలికెను.

 

పుణ్యాత్మా! నీ వడిగినది అది యట్లే యగును. మూడు రాత్రుల ఉపవాసము తరువాత దానిని విందువు.

 

ఓ యశస్వినీ! పద్మపత్ర విశాలాక్షీ! నిండు చంద్రుని బోలు మోము కలదానా! ఆ రాజు ‘సరే’ అని ఆమెకు బదులు పలికెను.

 

పండ్రెండంగుళముల పలుదోము పుల్లను గ్రహించి చక్కగా కూర్చుండి విధి ననుసరించి ఆమె ఉప వాసమును ప్రారంభించెను.

 

మూడు రాత్రులు కడచిన పిమ్మట ఆ దంపతు లిద్దరు స్నాన మాచరించి తెల్లని వస్త్రములు ధరించి విష్ణు దేవునకు ప్రణమిల్లిరి.

 

అంత చక్కని మోము గల ఆ సుందరి తన రత్నా భరణము లన్నింటిని తీసి నా ఆయా అవయవముల యందు సమర్పించెను.

 

ఆభరణము లన్నింటిని తీసి వైచిన ఆ కాంత రాజుతో నాథా! రమ్ము, రమ్ము నీవు కోరిన చోటి కరుగుదము. అని పలికెను.

 

అంత ఆ కీర్తిశాలిని భర్త చేతిని చేతితో పట్టుకొని లేచి తీయగా ఆ కళింగ రాజుతో ఇట్లు పలికెను.

 

రాజా! నేను పూర్వ జన్మమున ఆడు నక్కను. పశు జాతి దానను. మృగమును పొంద గోరిన సోమదత్తుడు బాణముతో నన్ను కొట్టెను.

రాజా! ఇదిగో నా తల యందు నాటు కొనియున్న ఈ బాణమును చూడు. దీని దోషము వలన నేను రజస్సు, తమస్సులకు వశమై పోయితిని.

 

కాంతీరాజ కులమున నా పుట్టుక అయినది. నా తండ్రి నన్ను నీ కొసగెను. నేను నీకు క్రపియ నయితిని. రాజా! పద్ధతి ప్రకారము నీవు పరమ సిద్ధి కరుగుము. నీకు నమస్కారము.

 

అంత తామర రేకుల వంటి కన్నులు గల ఆ కళింగ రాజు ఆ మాట విని విశుద్ధమైన అంతరంగముతో మనోహరమగు నవ్వు గల తన ప్రియురాలితో తీయగా ఇట్లు పలికెను.

 

మహాభాగా! నేను గ్రద్దను. ఆడవి యందు తిరుగు చున్న ఆ సోమదత్తుడే ఒక్క బాణముతో నన్ను కూలవేసెను.

 

అందు వలన నేనును ఓ సుశ్రోణీ! కళింగ దేశపు నృపతి నయితిని. గొప్ప భాగ్యము, రాజ్యము నాకు లభించినది. సర్వాంగ సుందరీ! సిద్ధియు నాకు దొరకినది.

 

గొప్ప సత్తువతో తిరుగుచు నేనొకనాడు కోరుకొనకయే యిచట మరణము పొంది పరమ సిద్ధిని, రాజ్య లక్ష్మిని పొంద గలిగితిని.

 

కాంతా! రమ్ము. నాతో పాటు పూజలను చేయుము అని పలికెను. శ్రేష్ఠులైన భగవద్భక్తులు, నారాయణ ప్రియులు, పౌరులు, పల్లెల వారు అందరు లాభ నష్టములను లెక్క గొనక పూజలు చేసిరి.

 

వారందరు పెద్ద కాలమునకు తమ గతిని కూర్చు కొనుచు నిర్మలమగు కర్మము లాచరించి దేహములను వదలిరి.

 

వారందరు నాలుగు భుజముల వారు, శంఖ చక్రములను దాల్చిన వారు, ఆయుధములతో కూడిన వారునై శ్వేత ద్వీపమున కరిగిరి (విష్ణు సారూప్యమును సామీప్యమును పొందిరని భావము)

 

అందలి స్త్రీలందరు శ్వేత ద్వీపమున అన్ని భోగములతో కూడిన వారై స్తుతులచే మన్నింప దగిన వారు, గొప్ప దేహశక్తి కలవారునై పరమానంద మందిరి.

 

భూదేవి! సౌకరక క్షేత్రము నందలి మహా భాగ్యమును గూర్చి నీకు చెప్పితిని. కోరకయే అందు మరణించిన వారు కూడా శ్వేత ద్వీపమున కరుగు చున్నారు.

 

ఈ విధానముతో ఆ తీర్థమున నివాసము కల్పించుకొని మరణము పొందెడు వాడు, విశాలాక్షీ! తప్పక శ్వేత ద్వీపమున కరుగును.

 

వసుంధరా! మరియొక విషయమును చెప్పెదను. వినుము. శాఖోటక తీర్థమున స్నానము చేసిన పుణ్య ఫల మెట్టిదో చెప్పెదను. వినుము.

 

పదునొకండు వేల యేండ్లు అట్టివాడు నందన వనమును పొంది ఎల్లప్పుడు ఆనంద మందు చుండును.

 

అటుపై స్వర్గము నుండి తిరిగి వచ్చి గొప్ప కులమున నా భక్తుడై పుట్టును. సంశయము లేదు.

 

మరియొక విషయమును చెప్పెదను. గృధ్రవటమున స్నానము చేసి నీరు పుచ్చుకున్న మాత్రమున నరుడు పొందు ఫలమెట్టిదో చెప్పెదను.

 

తొమ్మిది వేల తొమ్మిది వందల యేండ్లు ఇంద్ర లోకమున నుండి దేవతలతో పాటు ఆనందము పొందు చుండును.

 

ఇంద్ర లోకము నుండి తిరిగి వచ్చి నా తీర్థ ప్రభావము వలన తగులము లన్నింటిని వదలి వైచి నా భక్తుడై పుట్టును.

 

దేవీ! నీవు మున్ను నన్నడిగిన స్నానమాత్ర ఫలమును, సంసార లంపటము లన్నింటిని వదలించు దానిని, నీకు వివరించితిని.

 

శుద్ధమగు వ్రతములు గల భూదేవి నారాయణుని వలన ఈ విషయము లన్నింటిని విని లోకనాథుడగు జనార్దనునితో మధురముగా ఇట్లు పలికెను.

 

ఆతడు చేసిన విశిష్ట కర్మ మెట్టిది? దాని వలన అతడు తీర్థత్వమును పొందెను గదా! ఈ ఉత్తమమైన పరమ రహస్యమును నా కెరిగింపుము.

 

సర్వ లోకములకు ప్రభువైన హరి భూదేవి వాక్యమును విని ధర్మము నందు కోరిక గల వసుంధరతో ఇట్లు పలికెను.

 

దేవీ! నీవు నన్నడిగిని దానికి బదులు చెప్పెదను వినుము. ఆ గ్రద్ధయు, నక్కయు పశు జన్మమును పొందినవి కదా!

 

పెక్కు జన్మములలో సంపాదించిన పుణ్యముల చేతను, తీర్థ స్నాన జపాదుల చేతను, మహా దానముల చేతను, నా భక్తులు తీర్థమున మరణము పొందుదురు.

 

వెనుకటి జన్మములలో చేసిన కర్మయు తక్కువ దియో ఎక్కవదియో అది ఎప్పటి కైనను ఫలించియే తీరును. దానికి పూర్తిగా నశించుట యనునది యుండదు.

 

ఒకప్పుడు పుణ్య తీర్థములు మొదలగు వానిని దర్శించుట వలన కలిగిన పుణ్యము మరింత తోడు తెచ్చుకొని ప్రబలమైనది దుర్బలమగును. కర్మపు గతి అర్థము కానట్టిది.

 

చాల తక్కువదిగా కన్పట్టునది గొప్పది యగుటకును సమర్థ మగును. అందు వలననే తీర్థము ప్రబావము వలన ఆ నక్కకును, గ్రద్ధకును మనుష్యత్వమే కాదు, రాజత్వము కూడ ప్రాప్తించినది.

 

తీర్థమున కేవలము చని పోయిన మాత్రమున వారు నశించిన పాపము కలవారై, పూర్వ జన్మ స్మరణము పొంది శ్వేత ద్వీపమునకు చేరుకొనిరి. వసుంధరా! నీవు దీనిని తెలిసి కొనుము.

 

వసుంధరా! మరియొక విషయమును చెప్పెదను. ఆదిత్యుడు తపస్సు చేసిన తావు వైవస్వత తీర్థమను పేరు పొందినది. యశస్వినీ! అతడు పుత్రుని కొరకు తపము నాచరించెను.

 

పదివేల యేండ్లాతడు చాంద్రాయణ వ్రతమున శ్రద్ధ కల వాడాయెను. పిదప ఏడువేల యేండ్లు వాయు భక్షుడై తపము చేసెను. అంత గొప్ప శక్తి కల ఆ సూర్యుని విషయమున నేను తుష్టుడ నైతిని.

 

అటుపై ఆదిత్యుని వరము కోరుకొమ్మంటిని. ఓయి మహా తేజశ్శాలీ! నీ మనసున నున్న కోరికయేమో తెలుపుమని మహానుభావుడు ,నా ఆరాధన యందు శ్రద్ధ కలవాడు నగు వివస్వంతునితో పలికితిని.

 

అంతనా మాటవిని మహా బలము గల కశ్యప పుత్రుడు చక్కని కంఠ స్వరముతో గొప్ప మాట నిట్లు పలికెను.

 

దేవా నా యెడ ప్రసన్నుడ వైతివేని ఈ వర మొసగుము. నీ దయ వలన నాకొక పుత్రుడు కలుగ వలయును.

 

వరము కోరెడు సూర్యుని పలుకు విని, సుందరీ! నిర్మలమగు మనస్సుతో నేనిట్లంటిని.

 

మహానుభావా! అది అట్టిదే యగును. నీకు యముడు, యమున అను సంతానము కలుగుదురు. సంశయము లేదు.

వసుంధరా! ఇట్లు ఆ సూర్యునకు వర మొసగి నాదైన యోగము ప్రభావముతో అక్కడనే అంతర్ధానము చెందితిని.

 

ఎవ్వరికిని చేయ నలవి కాని కర్మమును ఆ సౌకరక క్షేత్రమున చేసి ఆదిత్యుడును గొప్ప విలువ కల తన గృహమున కరిగెను.

 

రెండు రోజులు ఉపవాస ముండి ఆ తీర్థమున స్నానము చేయువాడు పదివేల యేండ్లు ఆదిత్య లోకములలో ఆనంద మందును.

 

లేదా, ఆ వైవస్వత తీర్థమున మరణించిన వాడు యము నింటికి ఎన్నటికిని పోడు.

 

భూదేవీ! చల్లని చూపులదానా! వైవస్వత తీర్థమున స్నానము, మరణము లభించు వాడు పొందెడు ఫలమును గూర్చి నీకు చెప్పితిని.

 

పదునైదు దినము లచట ఉపవాస ముండిన వాడు అన్ని తగులములను వదలివైచి నా లోకమున కరుగును.

 

మంచిదానా! వైవస్వత తీర్థ ఫలమును నీకు చెప్పితిని. సౌకరక క్షేత్రమున జరిగిన వృత్తమును నీకు వివరించితిని.

 

ఇది ఆ ఖ్యానములలో గొప్ప ఆఖ్యానము. క్రియలలో మహా క్రియ. ఇది జపింప దగినది. ప్రమాణ మైనది. సంద్యను ఉపాసించుట వంటిది. ఇది వేదములు, మంత్రములు. ఇది యంతయు భాగవతులకు ప్రియమైనది.

 

దీనిని పిసిని గొట్టునకు ఒసగ రాదు. భాగవతు డైనను మూర్ఖుడైన వానికి, అట్టి వైశ్యునకు, శూద్రునకు, నన్నెరుగని వారికి ఒసగ రాదు.

 

పండితుల సభ నడుమను, భాగవతుల కడను, వేద మెరిగిన వారిలో శ్రేష్ఠులగు బ్రాహ్మణుల కడను దీనిని చదువ వలయును.

 

చక్కగా శాస్త్రముల నెరిగిన నిష్ఠ కలవారికి మాత్రమే దీని నొసగ వలయును. మంచిదానా! సౌకరక క్షేత్రపు గొప్ప పుణ్యమును నీకెరిగించితిని.

 

ఉదయమున లేచి ప్రతి దినము దీనిని పారాయణము చేయు వాడు పండ్రెండు సంవత్సరములు నన్ను భావించిన వాడగును. అతడు మరల గర్భముల యందు పుట్టడు. సంసారమున చిక్కడు.

ఈ ఒక అధ్యాయమును పఠించుట వలన పది తరముల వారిని తరింప జేయును. సమస్తమగు సంసారము నుండి విముక్తి పొందును. వసుంధరా! ఇంకనేమి అడుగుదువు?