వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము - 78

 

ఇప్పుడు నేను క్రమముగా ఆ నాలుగు పర్వత రాజముల సుందరములైన శిఖరములను గూర్చి చెప్పెదను. వినుడు. అందు పిట్టల కూతలు విన సొంపుగా నుండును. పెక్కు పక్షులు జతకట్టి తిరుగు చుండును. దేవతలు దివ్య కాంతలతో పాటుగా క్రీడించు తావులు అందు కలవు. కిన్నరులు గొంతెత్తి గానములు చేయు చుందురు. చల్లని మెల్లని సువాసన గల గాలులు మిక్కిలి యింపు నింపుచు వీచు చుండును.

 

అచట నాలుగు దిక్కులకు ప్రవహించు వాగులను గూర్చి చెప్పెదను. పుణ్యాత్ములారా! వినుడు. తూర్పున చైత్ర రథము, దక్షిణమున గంధ మాదనము అను వాగులు కలవు. అందు మిక్కిలి రుచి గల నీరు, ఒడ్డు లందు మేల్తరములైన వనములు కలవు.

 

ఆ తోటలను ఆక్రమించి దేవతలు స్త్రీలతో కూడిన వారై ఆ తావులలో మిక్కిలి సంతోషముతో క్రీడించు చుందురు.

 

ఆ నాలుగు కొండల యందును మిక్కిలి అందమైన సరస్సులు కలవు. పక్షుల కూతలు, రత్నములు తాపిన రేవులు, అతి పుణ్యమైన జలములు, విన నింపైన ధ్వనులు గల పెద్ద పెద్ద జల యంత్రములు, నీటి లోనికి వ్రాలు చున్న కొమ్మలపై మనోజ్ఞముగా కూయు పక్షుల గూళ్లు, పద్మములు, కలువలు, ఎర్ర కలువలు మున్నగు వానితో ఆ సరస్సులు కలకల లాడు చుండును. ఇంకను పెక్కు గుణములు వాని యందు కలవు.

 

తూర్పున అరుణోదము, దక్షిణమున మానసము, పడమటి దిక్కున అసితోదము, ఉత్తరమున మహాభద్రము అని ఆ సరస్సుల పేర్లు. అనేక వర్ణముల పద్మములు కలువలు వాని నలంకరించు చుండును.

 

అరుణోదము నావరించి యున్న కొండలను ప్రాచ్యము లందురు. వానిని గురించి చెప్పెదను. వినుడు.

 

కంకము, మణి శృంగము, సుపాత్రము, మహోపలము, మహా నీలము, కుంభము, సుబిందువు, మదనము, వేణు నద్ధము, సుమేదస్సు, నిషధము, దేవ పర్వతము అనునవి అచ్చటి మేలైన పర్వతములు. ఇంకను పుణ్యములైన కొండలు కలవు.

 

మందరమునకు తూర్పుగా సిద్ధములు, మదాయుతములు అను పర్వతములు గలవు. మానస సరోవరమునకు దక్షిణముగా పెద్ద కొండలు గలవు.

 

అచటి కొండలను గూర్చి మీకు చెప్పితిని. వాని పేర్లను చెప్పుదును. వినుడు. త్రిశిఖరము, శిశిరము, కపి, శతమక్షము, తురగము, తామ్రహము, విషము, శ్వేతోదనము, సమూలము, సరళము, రత్నకేతువు, ఏక మూలము, మహా శృంగము, గజమూలము, శాబకము, పంచ శైలము, కైలాసము, హిమవంతము అనునవి.

 

ఉత్తరమున నున్న మహా పర్వతములను గూర్చి చెప్పితిని. ఇటుపై వినుడు. కపిలము, పింగళము, భద్రము, సరసము, కుముదము, మధుమంతము, గర్జనము, మర్కటము, కృష్ణము, పాండవము, సహస్ర శిరము, పారియాత్రము, శృంగవంతము, ఇవి పశ్చిమ దిక్కున నున్న పర్వత రాజములు.

 

ద్విజవరులారా! మహాభద్ర సరస్సునకు ఉత్తరముగా ఉన్న పర్వతములను గూర్చి పలికెదను. వినుడు.

 

హంస కూటము, వృష హంసము, కపింజలము, ఇంద్ర శైలము, నీలము, కనక శృంగము, శత శృంగము, పుష్కరము, మేఘ శైలము, విరజము, జారుచి, ఇవి ఉత్తర దిక్కు పర్వతములు.

 

ఉత్తరమున నున్న ప్రధాన పర్వతములు, పీఠ భూములు, హ్రదములు, సరస్సులు ఇవి. వీనిని గురించి చక్కగా తెలిసి కొనుడు.