వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము - 117

 

భద్రా! ప్రాయశ్చిత్తము నున్న దున్నట్లు విధి ననుసరించి చెప్పెదను వినుము. మరియు ఏ తెలివితో నా భక్తునకు దాన మొసగ వలయునో చెప్పెదను.

 

తలంటు స్నానము, నలుగు బెట్టుట, సామాన్యముగా చేసెడు శివ స్నానము అను నాకు ప్రియమైనవి యెట్లు ఒసగ వలయునో తెలిపెదను వినుము.

ఉషః కాలమున నిద్ర లేచి తగు విధమైన భేరిని మ్రోగింప వలయును. భేరి మ్రోగించుటకు వీలు కానిచో తలుపుల నైన శబ్దము చేయ వలయును.

 

కుడి మోకాలితో ఇరువది రెండు పదములు ‘నమో నారాయణాయ’ అని పలుకుచు తిరుగుచు ఈ క్రింది మంత్రమును పలుక వలయును.

 

ఓ పరమ దైవమా! ఆదియు, మధ్యయు, అవసానము అయిన దేవా! అవ్యక్త రూపా! అవ్యయా! మేల్కొనుము. నీ కార్యములు నిర్వహించుటకు, నీ పనుల యందు నిష్ఠ గలవాడు వచ్చెనని తెలియుము.

 

ఈ మంత్రముతో తలుపులను తెరువ వలయును. పలుదోము పుల్లను సమర్పింప వలయును.

 

భూమిని తాక కుండ దీపమును వెలిగింప రాదు. దీపము వెలిగించిన పిదప చేతిని శుద్ధి చేసికొన వలయును.

 

చేతులు కడిగి కొని మరల లోనికి వచ్చి విగ్రహపు చరణములకు మ్రొక్కి దంత ధావనమును కావింప వలయును.

 

పిదప మంచి నీరు తెచ్చి దంతములను శుభ్రము చేసి, ఏ దొసగు లేనివాడు, ఏ పక్షపాతము లేని వాడునగు భక్తుడు ఈ మంత్రము నుచ్చరింప వలయును.

 

భువనముల పుట్టుకకు కారణమైన వాడా! సూర్యుని అస్తమింప జేయువాడా! అనంతుడా! అన్నింటికి మధ్య నుండు దేవా! ఇదిగో దంత ధావనమును స్వీకరింపుము.

 

భూదేవీ! ఇది నీవు నన్నడిగిన దానికి సమాధానము దంతములను తోముట ముగిసిన పిదప మిగిలిన జలములను భక్తుడు తన శిరస్సున భక్తితో చల్లుకొన వలయును.

 

పిదప నీటితో పవిత్రమగు చేతితో కొంచెము పాటి నీటితో స్వామికి ముఖ కార్యములను చేయ వలయును.

 

ముఖము కడుగు నపుడు చెప్ప వలసిన మంత్రమును, సుందరీ నా వలన వినుము. ఈ మంత్రముతో ఆ పని చేయువాడు సంసారము నుండి ముక్తి పొందును.

 

దేవా! నీవు హరించు వాడవు, చేయు వాడవు, విపరీతము చేయు వాడవు. జలమును గ్రహింపుము. నిన్నే మేము కొనియాడుదుము. నీ కొరకు తెచ్చిన నీటి గుణమును గూడ గ్రహింపుము.

 

ఇట్లు అంతట దేవతల ముఖ ప్రక్షాళనము చేసి

 

ఇట్లు మంత్రములతో పూజించి ధూపములతో నైవేద్యములతో సుగంధములతో మరల స్వామిని సమర్చింప వలయును.

 

పిదప భగవంతుడు, భక్తవత్సలుడు అయిన స్వామికి పూల దోసిలి సమర్పించి ‘నమో నారాయణాయ’ అని పలికి ఈ మంత్రమును పఠింప వలయును.

 

యజ్ఞములను సృజించిన వాడు, యజ్ఞముల నాచరించు వాడు. భూతములను సృష్టించిన వాడునగు మాధవుని ప్రాతః కాలమున లేచి, మరియొక పుష్పమును కొని తెచ్చి, నేను పూజింతును.

 

జ్ఞానము కలవాడు, పవిత్రుడు నగు భక్తుడు ఈ విధముగా భగవంతుని కొరకు పూవులను పూజా కర్మము లన్నింటితో కూడిన వాడై సాష్టాంగ పడి నమస్కరింప వలయును.

 

అట్లు సాష్టాంగ నమస్కారము చేసి జనార్దనుని ప్రసన్నడవు కమ్మని ప్రార్థించి శిరస్సున దోయిలి చేర్చి ఈ మంత్రమును పలుక వలయును.

 

నాథ! నేను తెలివి నొంది ప్రసన్నమగు కోరికతో సంసారము నుండి ముక్తి పొందుటకై నీ పూజను చేయు చున్నాను. నీవు మునుపు పలికి నట్లు నాకు ప్రసన్ను డవగుదువు గాక!

 

ఇట్లు మంత్ర విధి ననుష్ఠించి నా భక్తి యందు నిలుకడ కలవాడై పూజ ముగియు నంత వరకు వెనుక వైపుగా నడచుచు (భగవంతుని వైపు ముఖము నిలిపి అని తాత్పర్యము.) వస్తువుల నన్నింటిని కూర్చుకొని మిక్కిలి శ్రద్ధ కలవాడై తైలముతో గాని నేతితో కానీ నాకు తలంటు స్నానమును సమర్పింప వలయును.

 

మంత్రముల నెఱిగిన వాడు, క్రియల యందు నేర్పు గలవాడు నగు భక్తుడు తైలమును గూర్చి మనసు నేకాగ్రము చేసికొని ఈ మంత్రమును పలుక వలయును.

 

 

లోకనాథా! నేను తెచ్చిన నూనెను స్నేహముతో గ్రహింపుము. నీవు సర్వ లోకముల యందును సిద్ధమైన ఆత్మ కలవాడవు. ఇతరులు చెప్పిన మంత్రమును పఠించుచు నేను నా చేతితో దీనిని నీకు సమర్పించు చున్నాను. నీకు నమస్సు, నమస్సు.

 

ఇట్లు మంత్రములతో భగవంతుని ప్రార్థించి మొదట నూనెను శిరమున ఉంచ వలయును. తరువాత కుడివైపు అంగముల యందును, పిదప ఎడమ వైపునకు ఉంచ వలయును.

 

తరువాత వెనుక వైపు నీటితో కడుగ వలయును. పిదప నడుమునకు నూనె రాయ వలయును. అటుపై భూమిని ఆవు పేడతో అలుక వలయును.

 

ఇట్లు నా మార్గము ననుసరించి అను లేపనము చేయు వాడు పొందు పుణ్యములను వింటివా? ఓ వసుంధరా!

 

అట్లు స్వామికి పూయుచున్న జల బిందువు లెన్ని గలవో అన్ని వేల ఏండ్లు ఆతడు స్వర్గ లోకమున ప్రతిష్ఠ పొందును.

 

తాను పుణ్యములతో సాధించిన లోకములను తన మలముతో అలుకు కొన్నవాడు (ఘెర పాపములు చేసిన వాడు) ఈ ఆవు పేడతో ఒక్క మారు అలికిన పుణ్యముతో ఆ పాపముల నుండి విముక్తు డగును.

 

ఇట్లు విశిష్ట మైన విధానముతో నాకు అభ్యంజనము చేయు వాడు, ఆ నూనెలో, లేదా నేతిలో ఎన్ని బిందువు లుండునో అన్ని వేల ఏండ్లు నాలోకమున స్థిరముగా నివసించును.

 

భద్రా! ఇక నలుగు బెట్టుటకు గూర్చి చెప్పెదను. అది నాకు ప్రియమైనది. భక్తులు దానితో సంతోషింతురు. నాకు వశ మగుదురు. నాకు దాని వలన విశుద్ధి కలుగును.

 

చేతితో చేసిన పిండితో గాని, పిండిగా అయిన చూర్ణముతో గాని నా దేహమునకు సుఖము కలుగు నట్లు నలుగు బెట్ట వలయును. నా కర్మమును అనుసరించు అట్టి వానికి పరమ సిద్ధి కలుగును.

 

ఇట్లు నలుగు బెట్టి తక్కిన పను లన్నియు ముగించి నా మనసునకు ప్రియము కలిగించు స్నానమును చేయింప వలయును.

 

అటుపై ఉసిరిక, వస, గంధర్వము మొదలగు ఉత్తమ ద్రవ్యములతో నా అన్ని అవయవములను మర్దింప వలయును. అటుపై నీటి కుండను పట్టుకొని ఈ మంత్రమును పఠింప వలయును.

 

దేవా! నీవు దేవులకు దేవుడవు, అనాదివి, అనంతుడవు. ప్రతిమా రూపమున వ్యక్తమైన వాడవు. నా స్నానమును గ్రహింపుము.

 

నా పని యందు శ్రద్ధ గల భక్తుడు బంగారు కుండతో గానీ, వెండి కుండతో కానీ, లభింపనిచో రాగి కుండతో గానీ నాకు ఉత్తమముగ స్నానమును, విధాన మెరిగిన వాడై, చేయింప వలయును.

 

ఇట్లభిషేకము గావించి శాస్త్రము చెప్పిన విధానము నను సరించి శ్రేష్ఠమగు గంధమును మంత్ర పూర్వకముగా సమర్పింప వలయును.

 

 

అన్ని రంగులు, అన్ని సువాసనలు గలవి, ఏడు లోకముల యందును నీవు కూర్చినవి అగు గంధము లన్నింటిని నీకు పూయు చున్నాను. స్వామీ! నేను ఎరిగిన వీనితో సుగంధమును తాల్పుము.

 

నేను భక్తితో సమర్పించిన ఈ గంధమును మాధవా! గ్రహింపుము. అని యిట్లు గంధముల నొసగి శ్రేష్ఠమగు కర్మము నాచరింప వలయును.

 

అనంతరము చక్కని యోగ్యములగు పూల మాలలను సమర్పింప వలయును. ఇట్లు విధానము నెరిగిన కర్మ కుశలుడు మాలార్చనము గావించి పుష్పములను దోయిలి నిండుగా సమర్పించి ఈ మంత్రమును పలుక వలయును.

 

నీట బుట్టినది, నేలపై పుట్టినది, తగు కాలమున పుట్టినది, శుభ్ర మైనది అగు పుష్పమును అచ్యుతా! నా సంసార మోక్షమునకై గ్రహింపుము, గ్రహింపుము.

 

అట్లు విశ్వమున లభించు పుష్పములతో నన్ను ప్రియమార అర్చించి తరువాత మంచి సువాసనలు గల ధూపములను నాకు సమర్పింప వలయును.

 

విధిని బట్టి కూర్చిన ధూపమును చేత దాల్చి రెండు వైపుల త్రిప్పుచు ధూప మంత్రమును పలుక వలయును.

 

దేవా! వనస్పతి రసము కలది, దివ్య మైనది, పెక్కు ద్రవ్యములతో కూడినది యగు ధూపమును, నా సంసార మోక్షమునకై స్వీకరింప వలయును.

 

శాంతి దేవతలు నా గృహమున నివసింతురు. జ్ఞాన సంపన్నులగు శాంతి యోగులకు శాంతి గ్రహింప దగినది యగు గాక! జగద్గురూ! నీవు గాక రక్షకుడు నాకు మఱియొకడు లేడు.

 

ఇట్లు పూల మాలలతో, గంధపు పూతలతో చక్కగా అర్చనము గావించి తరువాత తెల్లనిది, పచ్చని అంచులు గలదియగు పట్టు వస్త్రమును సమర్పింప వలయును.

 

ఇట్లు వస్త్రమును పట్టుకొని శిరసున దోయిలించి చక్కని ధ్యానముతో ఈ మంత్రమును పలుక వలయును.

 

పురుషోత్తముడు, శ్రీనివాసుడు, శ్రీమదానంద రూపుడు, రక్షకుడు, కర్త, ఆది కాలాత్మకుడు, భూతనాథుడు, మొదటి వాడు, అవ్యక్త రూపుడు అగు దేవుడు ప్రీతి నందు గాక! దేవా! మనోహరా! తెల్లని పట్టు వస్త్రమును నీ దేహమును కప్పు కొనుటకు గ్రహింపుము. ఈ వస్త్రమును విభూషణముగా స్వీకరింపుము. అని పలికి పుష్పమును పట్టుకొని ఓంకారము తొలుత నుండు నట్లు ధర్మము పుణ్యమునగు మంత్రముతో ఆసనమును కూర్ప వలయును.

 

 

స్వామీ! నీవు పరాపరములకు నాథుడవు. అన్నింటికి మించిన ప్రమాణమవు. శాస్త్ర రూపుడవు. ప్రమాణము కలవారి కెల్లరకు మించి నిలుచు వాడవు. నేను కూర్చిన పూజను సత్యమైన దానిని సత్వ్య రూపుడవగు నీవు గ్రహింపుము.

 

ఇట్లు నేను చెప్పిన మార్గము ననుసరించి సమర్పణము గావించి వెను వెంటనే ముఖ ప్రక్షాళనమును మంత్ర పూర్వకముగా చేయ వలయును.

దేవతలకును నీ వలననే పరిశుద్ధత. నీవే పరమ గతివి. నేనర్పించిన ఉత్తమమగు ఈ జలమును శౌచము కొఱకు గ్రహింపుము.

 

ఇట్లే భోజనము సమర్పించి దానిని ప్రక్కకు తీసి తాంబూలమును పట్టుకొని ఈ మంత్రమును పలుక వలయును.

 

 

అన్ని యెడల దేవతలకు అలంకారము, గొప్ప వస్తువులతో కూడినది, సువాసన కలదియగు తాంబూలమును గ్రహించి లోకనాథా! నాకు ప్రీతిని కలిగింపుము.

 

ముఖమునకు ఇంపు కలిగించు నది, మనోహర మైనదియగు తాంబూలమును ప్రీతితో నీకొసగితిని. దేవా! శ్రేష్ఠమగు దీనిని గ్రహింపుము.

 

నా భక్తుడు ఈ ఉపచారముతో పూజను గావించి సంసార బంధమును విడివడి నా మహా లోకమును నిత్యము చూచు చుండును.