వరాహ మహా పురాణము
అధ్యాయము - 90
వరారోహా! మరియొక విషయము వినుము. శివుడు పరమేష్ఠియు నిర్దేశించిన ఆ త్రిశక్తికి సంబంధించిన మహా విధిని గూర్చి చెప్పెదను.
అందు సృష్టిని గూర్చి యింతకు ముందు తెలిపితిని. ఆమె తెల్లని వన్నె కలది. చక్కని తనదగు రూపము కలది. ఒక అక్షరమే ఆమె స్వరూపము. అయినను సర్వాక్షరములు ఆయమ స్వరూపమే.
ఆమెను వాగీశ అందురు. కొండకచో సరస్వతీ దేవి. ఆమెయే విద్యలకు ఈశ్వరి. ఆమెయే ఒకప్పుడు అమితాక్షర. జ్ఞానవిధి. ఆమెను ఒక్కొక్కప్పుడు విభావరి అనియు అందురు.
ఓ విశాలాక్షీ! వరాననా! సౌమ్యములు, జ్ఞానము నుండి పుట్టినవి యగు నామము లన్నియు ఆ తల్లి నామములుగా చూడదగును.
విష్ణువు వలన ఏర్పడినది, రక్తవర్ణ. సురూపిణి యగు నామెయు, రుద్రుని వలన రూపుగొన్న మరియొక పరాశక్తియు ఈ మువ్వురును తత్త్వమునకు ఒక్కరే. రుద్రుని చక్కగా తెలిసి కొన్న వారికి ఈ మువ్వురు సిద్ధింతురు. అంతట నుండు ఈ మువ్వురి స్వరూపము ఒక్కటియే.
వరారోహా! నీకు మున్ను నేను చెప్పిన ఆ పురాతని సృష్టి మాత ఉన్నదే ఆమెయే ఈ స్థావర జంగమాత్మక మైన జగత్తు నంతటిని వ్యాపించి యున్నది.
మొదట అవ్యక్తము నుండి జన్మమును పొందిన బ్రహ్మ వలన వృద్ధి పొందిన ఆ సృష్టి మాతకు తగిన విధముగా పితామహుడు ఆ దేవి నిట్లు స్తుతించెను.
దేవీ! సత్యము వలన పుట్టిన దానా! స్థిరమైన దానా! శ్రేష్ఠమైన వర్ణములే స్వరూపమైన ఓ సర్వజననీ! సర్వగా! సర్వ భూతములకు మహేశ్వరివైన నీవు జయము గొనుము.
నీవు అన్నియు నెరిగిన దానవు. అన్ని సిద్ధులను అనుగ్రహించు దానవు. సిద్ధిని బుద్ధిని కలుగ జేయు దానవు. జననివి. పరమేశ్వరివి.
నీవే స్వాహా కారమవు. నీవే స్వధా కారమవు. నీవు ఉత్పత్తి స్వరూపిణివి. నీవు ఓంకారము నిలయమైన దానవు. నీవే వేదముల ఉత్పత్తికి కారణమైన దానవు. (స్వాహా = దేవతలకు సంబంధించిన నమస్కారము. స్వధా పితృ దేవతలకు సంబంధించిన నమస్కారము.)
దేవతలు, దానవులు, యక్షులు, గంధర్వులు, రక్షస్సులు. పశువులు, పంటలు అనునవి నీ నుండియే పుట్టు చున్నవి.
నీవు విద్యవు, విద్యలకు ఈశ్వరివి. సిద్ధవు, ప్రసిద్ధవు, నీవు దేవతలకు ఈశ్వరివి. అన్నియు నెరిగిన దానవు. అన్ని సిద్ధులను అనుగ్రహించు దానవు.
శుభములు కలుగ జేయు ఓ దేవీ! నీవు అంతట నుండు దానవు. ఏ సందేహము లేని దానవు. శత్రువు లందరిని పరిమార్చు దానవు. సర్వ విద్యలకు పాలకు రాలవు. నీకు నమస్సు.
నిన్ను స్తుతించి ఋతుస్నాత అయిన భార్యను పొందు వానికి నీ అనుగ్రహము వలన తప్పక సంతానము కలుగును. నీవు ప్రజేశ్వరివి, పరమాత్మ స్వరూపిణివి. విజయ రూపము, భద్రరూపము కల దానవు. శత్రువు లందరిని, లోపలి శత్రువుల నన్నింటిని రూపు మాపుదానవు. (లోపలి శత్రువులు = 1. కామము 2. క్రోధము, 3. లోభము 4. మోహము 5. మదము 6. మాత్సర్యము అనునవి.)
