వరాహ మహా పురాణము
అధ్యాయము - 47
శ్రావణ శుద్ధ ద్వాదశి నాడు జనార్దనుడను పరమ దైవమును కొలువ వలయును.
‘ఓం నమో దామోదరాయ’ అని పాదములను, ‘నమో హృషీకేశాయ’ అని నడుమును, ‘నమస్సనాతనాయ’ అని కడుపును, ‘నమః శ్రీవత్స ధారిణే’ అని వక్షస్సును, ‘నమశ్చక్ర పాణయే’ అని భుజములను, ‘నమో హరయే’ అని కంఠమును, ‘నమో ముంజ కేశాయ’ అని శిరస్సును ‘నమో భద్రాయ’ అని శిఖను పూజింప వలయును.
ఇట్లు సమర్చించి మునుపటి వలెనే కుంభమును పెట్ట వలయును. వస్త్రముల జంటను ఉంచి దానిపై దామోదర నామము గల దేవ దేవుని బంగారు ప్రతిమను నిలుప వలయును. ఆ దేవుని చక్కగా గంధ పుష్పాదులతో విధి ననుసరించి క్రమముగా పూజింప వలయును.
వెనుకటి వలెనే ఆ ప్రతిమను వేద వేదాంగములను తుదముట్ట నధ్యయనము చేసిన బ్రాహ్మణున కొసగ వలయును. ఇట్లు నియమము పాటించిన వాడు పొందు ప్రభావమును నా వలన వినుము.
శ్రావణ మాసము నందు చేయ వలసిన విధానమును చెప్పితిని. ఆ ద్వాదశీ వ్రత ప్రభావమును, పాపమును రూపుమాపు దానిని తెలిపెదను. వినుము.
పూర్వము కృత యుగమున నృగుడను మహా బలము గల రాజుండెను. ఆత డొకప్పుడు వేట యందు తగుల్కొన్న మనసుతో ఘోరమగు అడవిలో తిరుగాడెను.
అతడొక సమయమున గుఱ్ఱము గుంజుకొని పోవగా పెద్ద పులులు, సింహములు, ఏనుగులు, మొదలగు వానితో నిండిన పెద్ద అడవికి పోయెను.
ఒంటరి యగు ఆ రాజు అచట గుఱ్ఱమును వదలి ఒక చెట్టు నీడను దర్భలు పరచు కొని దుఃఖముతో నిద్రించెను.
ఆ రాత్రి పదు నాలుగు వేల మంది బోయవాండ్రు మృగములను చంపుటకై అచటికి వచ్చి రాజు చుట్టును చేరిరి.
అచట వారు బంగారు నగల అలంకారములు గలవాడును, మిక్కిలి తీవ్రముగా నున్న వాడును, గొప్ప తేజస్సుతో వెలిగి పోవుచున్న వాడును నిద్రించు చున్న వాడును అగు ఆ నృగ మహారాజును గాంచిరి.
వారును త్వరత్వరగా పోయి తమ ప్రభువునకు నివేదించిరి. అతడును రత్నములు, బంగారము కొల్ల గొట్టుటకై ఆతనిని చంప బోయెను.
గుఱ్ఱమును కూడ వశ పరచు కొనుటకై ఆ ఆటవికులు నిద్రించు చున్న రాజును చేరుకొని పట్టు కొనుటకు ప్రయత్నించిరి.
ఇంతలో ఆ రాజు శరీరము నుండి తెల్లని ఆభరణములు, మాలలు, చందనములు తాల్చిన ఒక నారి వెలు వడెను. ఆమె లేచి చక్రమును గొని ఆ మ్లేచ్చుల నందరిని కూల వైచెను.
ఆ దేవి ఆ దొంగ మూకలను చంపి మరల ఆ రాజు దేహము లోనికి ప్రవేశించెను. రాజంత మేల్కొని చచ్చి పడిన మ్లేచ్ఛులను, తన దేహములో కలసి పోయిన ఆ నారిని కాంచెను.
గుఱ్ఱమెక్కి ఆ రాజు వామ దేవుని ఆశ్రమమున కరిగెను. అచట భక్తితో ఆ మహర్షిన స్వామీ! ఆమె ఎవరు? ఆ చచ్చిన వారెవరు? దీనిని నాకు తెలుపుము. ప్రసన్నుడ వగుము, అని అడిగెను.
రాజా! నీవు పూర్వ జన్మమున శూద్ర జాతి వాడవు. ఒక బ్రాహ్మణుడు శ్రావణ మాస శుక్ల పక్ష ద్వాదశి నాటి వ్రతమును ఉపదేశించు చుండగా వింటివి.
విధి పూర్వకముగా నీవు భక్తితో ఆ తిథినాడు ఉపవాస ముంటివి. దాని వలన నీకు రాజ్యము లభించినది.
ఆ దేవి అన్ని ఆపదల యందును నిన్ను రక్షించు చున్నది. ఆ పాపాత్ములు, క్రూరులు అగు మ్లేచ్ఛులను సంహరించి నది ఆమెయే. నిన్ను రక్షించిన ఆమె శ్రావణ శుద్ధ ద్వాదశి.
ఒక్కతెయే ఆపదల యందు రక్షించును. ఒక్కతెయే సామ్రాజ్యము నిచ్చును. ఇంక ఈ పండ్రెండు ద్వాదశుల సంగతి చెప్పనేల? వారు ఇంద్ర పదవిని కూడ ఈయరని చెప్పుటకు లేదు.
