వరాహ మహా పురాణము
అధ్యాయము - 109
రాజా! ఉత్తమ మగు దాన మాహాత్మ్యమును వినుము. దీనిని సంకీర్తించి నంత మాత్రమున పార్వతీ దేవి సంతోష మందును. విశేషించి విషువము నందును, అయనము నందును, కార్తీక మాసము నందును ఇది విన వలయును.
అందు వలన ఇప్పుడు ధాన్య ధేనువు దాన పద్ధతిని చెప్పెదను. దీని నిచ్చినచో పాపము లన్నింటి నుండి విముక్తుడై రాహువు వదలిన చంద్రుని వలె కాంతి మంతుడై శోభిల్లును.
పది ఆవులను దానము చేయుట వలన కలుగు ఫలమును అంతటిని ధాన్య ధేనువు నొసగు నరుడు పొందును.
ఆవు పేడతో అలికిన నేలపై తూర్పు దిక్కునకు కంఠభాగ ముండు నట్లుగా నల్ల లేడి చర్మమును ఉంచ వలయును. దానిపై వస్త్రములతో కూడిన ధాన్య ధేనువును వేది నడుమ ఉంచి వేద నాదములతో మంగళ వాద్యములతో పాటుగ పూజింప వలయును.
నాలుగు తూములతో చేయు ధేనువు ఉత్తమ. అందు సగమై నచో మధ్యమ, ధనము విషయమున వంచన చేయరాదు. ఆవులో నాలుగవ భాగముతో దూడను కూర్ప వలయును.
బంగారముతో కొమ్ములు, వెండితో గిట్టలు, గోమేధికముతో కడుపు, అగురు చందనముతో నాసిక, ముత్యములతో దంతములు, నేయి వెన్నలతో ముఖము, మంచి ఆకులతో చెవులు, కంచుపాత్ర, చెరకు గడలతో పాదములు, పట్టు బట్టతో తోకను కూర్చి సర్వ విధము లగు పండ్లను, రత్నములను సమీపమున నుంచ వలయును. పాదుకలు, చెప్పులు, గొడుగు, పాత్ర, మంచి భోజనములను ఏర్పరుప వలయును.
ఇట్లు అన్నియు చక్కగా ఏర్పరచి దీపార్చన మొదలగు నవి కూర్చుకొన వలయును. పుణ్య కాలము రాగా స్నానము చేసి తెల్లని వస్త్రములు తాల్చి గృహస్థు మంత్రములను చదువుచు మూడు మారులు ప్రదక్షిణము తిరుగ వలయును.
మహనుభావా! వేదవేదాంగ విశారదా! ద్విజోత్తమా! విప్రా! నీవు నా ఉపకారము నకై ఈ ఆవును గ్రహింపుము. దీని వలన భగవంతుడు, దేవ దేవుడు, మధుసూదనుడు నా విషయమున ప్రీతి నందు గాక.
తల్లీ ధాన్య లక్ష్మీ! నీవు గోవిందుని యందు లక్ష్మివి. అగ్ని యందు స్వాహవు. ఇంద్రుని యందు శచివి. శివుని విషయమున గౌరివి. బ్రాహ్మణుని యందు గాయత్రివి. చంద్రుని యందు వెన్నెలవు. రవి యందు ప్రభవు. బృహస్పతి యందలి బుద్ధివి. మునుల యందు ఉత్తమయగు మేధవు. ఇట్లని ప్రశస్తి కెక్కితివి. అందు వలన నీవు సర్వమయివి. ధాన్య రూపమున నెలకొని యున్నావు.
ఇట్లు పలికి ఆ ధేనువును ప్రదక్షిణించి బ్రాహ్మణునికి క్షమాపణము చెప్పుకొని దాన మొసగ వలయును.
సమస్తమైన పృథివి ఎంతయో, సమస్తమగు వస్తు రత్నము లెంతటియో వాని నన్నింటి నిచ్చిన పుణ్యముతో వ్రీహి ధేనువు నిచ్చిన ఫలము సమాన మగును. లేదా అధిక మగును.
అందు వలన రాజా! భుక్తి ముక్తులనెడు ఫలముల నొసగు ఈ ధాన్య ధేనువును దాన మీవలమును. దీని వలన ఈ లోకమున సౌభాగ్యము, ఆయువు, ఆరోగ్యము పెంపొందును.
సూర్యుని కాంతి వంటి కాంతి కలదియు, చిరు గంటల రత్నముల మాలలు కలదియునగు విమానముతో, అప్సరసలు కొనియాడు చుండగా అతడు శివ మందిరమున కరుగును.
జన్మ స్మరణ మున్నంత కాలము స్వర్గమున ప్రసిద్ధిపడయును. పిమ్మట స్వర్గము నుండి దిగి వచ్చి జంబూద్వీప పతి యగును.
ఇట్లు శివుని ముఖము నుండి వెలువడిన వాక్యమును విని సర్వ పాపములు పోగా విశుద్ధమైన ఆత్మ కలవాడై రుద్ర లోకమున ప్రతిష్ఠ నొందును.
