వరాహ మహా పురాణము
అధ్యాయము - 81
ఇటుపై పర్వతము లందలి దేవతల స్థానములను వివరింతును. అందు ‘శాంతము’ అను పేరు గల దేవేంద్రుని క్రీడా స్థలము కలదు. అది మహేంద్ర గిరిపై భాగమున నున్నది. అందు దేవతల రాజు ఇంద్రుని పారిజాతక వృక్షముల తోట కలదు. దాని తూర్పు భాగమున కుంజరమను కొండయు, దానిపై దానవుల ఎనిమిది పురములను కలవు.
నీలకములు, కామ రూపులు మొదలగునవి వాని పేర్లు. మహా నీలమనియు ఇవి పర్వతములపై నున్న పురములు. కిన్నరుల పురములు పదునైదు వేలు ప్రసిద్ధి కెక్కినవి. దేవదత్తుడు, చంద్రుడు మొదలగు వారు కిన్నరుల రాజులు. పదునైదుగురు గర్వితులు. కలుగులు ప్రవేశముగా గలవారి పురములు స్వర్ణ మయములు.
చంద్రోదయమను గొప్ప పర్వతము నాగులకు నివాస భూమి. రంధ్రములలో ప్రవేశించు ఆ నాగులు ఆ రంధ్రములలో గరుత్మంతునకు దొరకక తిరుగు చుందురు. అనురాగమను పర్వతమున రాక్షసేంద్రులు నివసింతురు.
వేణుమంతమను పర్వతమున విద్యాధరుల మూడు పురములు కలవు. ఒక్కొక్కటి ముప్పది ఆమడల వైశాల్యము కలిగినది. ఉలూకుడు, రోమశుడు, మహావేత్రుడు మొదలగు వారు విద్యాధరుల రాజులు. ఒక్కొక్క పర్వత రాజమున స్వయముగా గరుడుడు నివసించి యుండును.
కుంజరమను ప్రసిద్ధి గల కొండపై పశుపతి, వృషభము గుర్తుగా గలవాడు, మహా దేవుడు, యోగులలో శ్రేష్ఠుడు అగు శంకరుడు నిత్యము నివసించును.
పెక్కు గణములుగా గల భూతలముల సముదాయములు వేలకొలదిగా సేవించెడు భగవానుడు అనాది పురుషుడు శంకరుడందు కాపుర ముండును.
వసుధారము పుష్పవంతులగు వసువుల నెలవు. వసుధార రత్నధార పర్వతముల శిఖరముపై ఎనిమిది, ఏడు సంఖ్యలు గల పురములు అష్ట వసువులకు, సప్తర్షులకు సంబంధించినవి కలవు.
ఏక శృంగమను పర్వతమున భగవంతుడగు చతుర్ముఖుని స్థానము కలదు. గజ పర్వతమున మహా భూతములు కొలిచి యుండగా భగవతియే స్వయముగా నెలకొని యున్నది. వసుధారము అను పర్వతము మునులు, సిద్ధులు, విద్యాధరులు అను వారి నెలవు. గొప్ప ప్రాకారములు తోరణములు గల ఎనుబది నాలుగు పురములు అందు గలవు. అచట అనేక పర్వతులను గంధర్వులు యుద్ధములు చేయుటలో ఆరితేరిన వారు నివసింతురు. వారి అధిపతి రాజరాజగు ఏక పింగళుడు. (కుబేరుడు)
పంచకూటమున సురలయు, రాక్షసులయు, శత శృంగమున దానవులయు, యక్షులయు నూరేసి పురములు కలవు. తామ్రాభమున తక్షకుని నూరు పురములు, విశాఖ పర్వతమున గుహుని నివాసము కలవు. శ్వేతో దయమను గిరవర మందు గరుడుని పుత్రుడగు సునాభుని నివాసము, పిశాచకమను గిరివరమున మహా గంధర్వుల భవనము కలవు.
హరి కూటమున హరి దైవము. కుముదమున కిన్నరుల నెలవు, అంజనమున మహా సర్పములు, కృష్ణమున గంధర్వ నగరము, విద్యాధరుల పురములు ఏడు అలరారు చున్నవి. సహస్ర శిఖరమున భయంకర చేష్టలు గల దైత్యుల నివాసములు కలవు.
హేమమాలి పర్వతముల యందు ఒక వేయి పురములు కలవు. అందు శిఖరమున పాముల రాజు లుందురు. ప్రపక్షమను పర్వత వరమున వివస్వంతుడు, సోముడు, వాయువు, నాగరాజు అనువారి భవనములు నాలుగు కలవు. ఈ విధముగా మేరు పర్వతముల యందు దేవతల నివాసము లున్నవి.
మర్యాదా పర్వతమున దేవ కూటమున పురముల స్థితిని తెలుపు చున్నాను. దానిపై నూరు యోజనముల మేర గరుడుని స్థాన మేర్పడి యున్నది. దాని ప్రక్క భాగముననే ముప్పది ఆమడల వెడల్పు, నలుబది ఆమడల పొడవు గల ఏడు గంధర్వ నగరములు కలవు. అచటి గంధర్వులు ఆగ్నేయు లనువారు. గొప్ప బలము కలవారు.
అందు మరియొక పురము సైంహికేయులది ముప్పది యోజనముల మండలము కలదు. అందు దేవర్షులు దేవ కూటమున తిరిగెడు తావులు కాన వచ్చును. కాలకేయుల పురము కూడ అందే కలదు. దానికి దక్షిణమున ముప్పది యోజనముల వెడల్పు అరువది రెండు యోజనముల పొడవు గల మహా గర్వము గల కామరూపుల పురము కలదు. హేమ కూటము నడుమ మహాదేవుని రావి చెట్టు కలదు.
ఇటుపై కైలాస వర్ణనము. కైలాసము ఒడ్డున నూరామడల పొడవు వెడల్పులు గల భువన పంక్తి వ్యాపించి యున్నది. దాని నడుమ సభ. అందే పుష్కరమను విమానము కలదు. అదే కుబేరునిది. అదియే అతని నివాస స్థలము. అందు పద్మము, మహా పద్మము, మకరము, కచ్ఛపము, కుముదము, శంఖము, నీలము, నందము అను మహా నిధులు కలవు. అందు చంద్రుడు మొదలగు లోక పాలుర నివాసములును ఉన్నవి. అందే మందాకిని, కనకమంద, మంద అను నదులు, మరియు ఇతర నదులు కలవు.
తూర్పు పార్శ్వమున నూరామడల పొడవు, ముప్పది ఆమడల వెడల్పు గల పది గంధర్వ నగరులు కలవు. అందు సుబాహువు, హరికేశుడు, చిత్రసేనుడు మొదలగు వారు రాజులు. దాని పడమటి శిఖరమున ఒక్కొక్కటి ఎనుబది యోజనముల పొడవు, నలువది యోజనముల వెడల్పు గల యక్ష నగరములు కలవు. అందు మహామాలి, సునేత్రుడు, చక్రుడు మొదలగు వారు నాయకులు.
దాని దక్షిణ పార్శ్వమున పొదలు గల చరియలు గల గుహల యందు సముద్రములు కలవు. సముద్ర ములనగా కిన్నరుల నూరు ఇండ్లు. వాని యందు ద్రుమ, సుగ్రీవ, భగదత్త ప్రముఖులగు రాజులు నూరుగురు కలరు. అందే రుద్రునకు ఉమాదేవితో వివాహము జరిగినది. గౌరియు అందే తపస్సు చేసినది. అందుండియే శంకరుడు ఉమాదేవితో పాటు జంబూ ద్వీపమును చూచెను. అందు పెక్కండ్రు కిన్నరులు, గంధర్వులు గానములు చేయు ఉమా వనము కలదు. అందు పెద్ద సంఖ్యలో అప్సరసలు, పూల తీవెలు కలవు. అందే భగవంతుడగు రుద్రుడు అర్ధనారీనర రూపమును పొందెను.
అందు మరియు కార్తికేయుని (కుమార స్వామి) శరద్వనము కలదు. పుష్ప చిత్రము, క్రౌంచము అనువాని మధ్య కార్తికేయుని అభిషేకము జరిగెను. దాని తూర్పు ఒడ్డున సిద్ధులయు, ముని గణములయు నివాస మగు కలాపమను గ్రామము కలదు. అట్లే మార్కండేయుడు, వసిష్ఠుడు, పరాశరుడు, నలుడు, విశ్వామిత్రుడు, ఉద్దాలకుడు మొదలగు మహర్షుల వేల ఆశ్రమములు కలవు.
మరియు, పడమటి దిక్కున నున్న నిషధ పర్వత భాగమును గూర్చి వినుడు. దాని మధ్య శిఖరమున మహా దేవుని విష్ణ్వాలయము కలదు. దాని ఉత్తరపు ఒడ్డున ముప్పది ఆమడల వైశాల్యము కల ‘లంబ’ అను పేరుగల రాక్షస పురము కలదు. దాని దక్షిణ పార్శ్వమున బిల ప్రవేశ నగరము ఉన్నది.
ప్రభేదకమను కొండకు పడమరగా దేవ దానవ సిద్ధాదుల పురములు కలవు. ఆ గిరి కొమ్మున పెద్ద సోమశిల కలదు. దాని యందు పర్వమున (పూర్ణిమ దినము) చంద్రుడు స్వయముగా అవతరించును. దాని ఉత్తర పార్శ్వమున త్రికూటమను పర్వతము కలదు. అందు అప్పుడప్పుడు బ్రహ్మ ఉండును. మరియు అది అగ్నిదేవుని ఆలయము. రూపుగొన్న అగ్ని దేవుని అచట దేవతలు ఉపాసింతురు.
శృంగము అను ఉత్తర దిక్కు నందలి పర్వతమున దేవతల భవనములు కలవు. తూర్పున నారాయణుని ఆలయము. మధ్య బ్రహ్మ దేవునిది. పడమటి దిక్కున శంకరునిది మరియు అందు యక్షాదుల పురములు కొన్ని కలవు. దాని ఉత్తరపు తీరమున నున్న జాతు భమను పర్వతమున ముప్పది ఆమడల మండలముల నంద జలమను సరస్సు కలదు. అందు నందుడను నాగరాజు నూరు తలలవాడు, ప్రచండుడు ఉండును.
ఈ విధముగా ఈ ఎనిమిది దేవ పర్వతములు తెలియ దగినవి. వరుసగా బంగారము, వెండి, రత్నము, వైడూర్యము, మణిశిల, హింగుళము మొదలగు వర్ణములు వానికి కలవు. (హింగుళము = ఇంగిలీకము). ఈ భూమి నూరు లక్షల కోట్ల జనముతో నిండినది. వాని యందు సిద్ధులు, విద్యాధరులు మొదలగు వారి నివాసములు కలవు. మేరువు ప్రక్కగా నున్న కేసర వలయముల పాదువంటి ఆ నిలయముల నన్నింటిని కలిపి సిద్ధ లోకమని చెప్పుదురు.
ఈ భూమి పద్మము ఆకారముతో నెలకొని యున్నది. ఇది అన్ని పురాణముల యందును సాధారణముగా చెప్పబడు విషయము.
