వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము - 73

మునివరా! వేడుక గొలుపు ఒక వృత్తాంతమును వినుము. నేను నీట మునిగి నపుడు ఒక అపూర్వ సంఘటన సంభవించినది.

 

మొదట బ్రహ్మ నన్ను సృజించి ప్రజలను సృష్టి చేయుమని నాతో పలికెను. అది యెట్లో తెలియక, సమర్థత లేని నేను నీట మునిగి యుంటిని.

 

చెదరని మనస్సు కలవాడనై బొటన వ్రేలంత పురుషుడగు పరమేశ్వరుని ధ్యానించుచు నేనచట క్షణ కాలము నిలిచితిని.

 

ఇంతలో ఆ జలము నుండి ప్రళయాగ్ని వంటి కాంతులు గల పురుషులు పదు నొకండ్రు ఆ జలముల నుడికించుచు పైకి లేచిరి.

 

అయ్యా! నీటి నుండి లేచి తేజస్సుతో ఈ జలమును తపింప జేయుచున్న మీరెవ్వరు? ఎక్కడి కేగు చున్నారు? చెప్పుడు? అని నేను వారి నడిగితిని.

 

నేనిట్లనగా వారు ఏమియు పలుక కుండిరి. ఊరక ఆ పురుషులు వెడలి పోయిరి.

 

అంత వారి వెనుక ఒక మహా పురుషుడు, పరమ సుందరుడు, మేఘము వంటి వన్నె కలవాడు, పద్మములకు ఈడైన కన్నులు కలవాడు, అందు కానవచ్చెను.

 

ఓ మహా పురుషా! నీవెవరు? ఆ వెడలిన పురుషు లెవ్వరు? ఇచట మీ పని యేమి? నాకు చెప్పుము. అని అతని నడిగితిని.

 

భవా! వెలిగి పోవుచున్న తేజస్సుతో అట్లు అరిగిన వారు ఆదిత్యులు. బ్రహ్మ వారిని తలపోయగా త్వరతో అరుగు చున్నారు.

 

బ్రహ్మ సృష్టిని చేయును, ఈ పురుషులు ఆ సృష్టిని పరి రక్షించుట కొరకరుగు చున్నారు. సంశయము లేదు.

 

 

స్వామీ! నేను నీకు తెలియని వాడను కదా! నన్ను భవా! అని పేరు పెట్టి పిలిచితివి. నీకది యెట్లు తెలిసినది? అది యంతయు నాకు చెప్పుము.

 

రుద్రుడిట్లనగా ఆ పురుషుడు సమాధానము నిట్లు చెప్పెను. నేను నారాయణ దేవుడను నీటి యందు నిద్రింతును. సనాతనుడను.

 

నీకు దివ్యమగు కన్ను ఏర్పడు గాక! ప్రయత్నించి నన్ను చూడుము.

 

ఇట్లతడు పలుకగా నేను అటు చూచునంతలో వెలు గొందుచున్న సూర్యుని తేజస్సు కలవాడు, బొట్టన వ్రేలంత వాడునగు స్వామి కాన వచ్చెను. నేనాతనినే పరీక్షించి చూచితిని. ఆతని బొడ్డున పద్మమును, అందు బ్రహ్మను, దేహమున నన్ను కాంచితిని.

ఆ మహాత్మునట్లు కాంచి పరమానంద మందితిని. ఆతనిని స్తుతింప వలయునను బుద్ధి పుట్టినది.

 

ఆతనికొక ఆకృతి ఏర్పడగా, తపస్సు చేత స్మృతికి వచ్చిన కర్తవ్యము గల నేను ఆ విశ్వాత్ముని ఈ స్తోత్రములతో కొనియాడితిని.

 

అనంతుడు, విశుద్ధ హృదయుడు, తనకు తానే సాటి యగు రూపము కలవాడు, వేయి బాహువులు గలవాడు, వేల కొలది కిరణములు గల శ్రేష్ఠుడు సృష్టికర్త, విశాల మగు దేహము, పవిత్రమగు కర్మములు కలవాడు అగు దేవా! నీకు నమస్కారము.

 

 

విశ్వము లన్నింటి ఆర్తిని హరించు వాడు, శంభువు, వేలకొలది సూర్యుల వాయువుల తీవ్ర తేజము కలవాడు, ఎల్ల విద్యలను ధరించు వాడు, చక్రము కలవాడు, దేవత లందరి స్తుతు లందు కొనువాడు, ఎల్లప్పుడు పాపములు లేనివాడు అగు దేవా! నీకు నమస్కారము.

 

దేవా! నీకు మొదలు లేదు. చ్యుతిలేదు. శేషుడే నీకు శేఖరము. ప్రభూ! సర్వపతీ! జగత్పతీ! భువః పతీ! భువన పతీ! నీకు సర్వదా నమస్కారము.

 

 

దేవా! జలములకు ప్రభుడవు. నారాయణుడవు. విశ్వము లన్నింటికి శుభము కూర్చు వాడవు. భూమికి భర్తవు. విశ్వేశ్వరుడవు. విశ్వమునకు నేత్ర మయిన వాడవు. నీవే చంద్రుడవు. సూర్యడవు. అచ్యుతుడవు. వీరుడవు. విశ్వ మంతయు వ్యాపించు వాడవు. ఊహల కందని మూర్తి కలవాడవు. అమృత మూర్తివి. అవ్యుయుడవు.

 

జ్వలించు చున్న అగ్ని కీలలతో అన్యులకు చొరవ శక్యము కాని మండలము కల నారాయణా! విశ్వతోముఖా! నన్ను కాపాడుము. దేవతల ఆర్తిని అంతము చేయు అమృతుడవు. అవ్యయుడవు. అచ్యుతుడవు, ఎల్లప్పుడు శరణు జొచ్చిన నన్ను కాపాడుము.

 

ప్రభూ! నీ మోములను పెక్కింటిని నేను చూచు చున్నాను. నీ బొడ్డు నందున్న పురాణుడు, ఈశ్వరుడు, సర్వ లోకములకు సృష్టికర్త అయిన బ్రహ్మను నేను కనుగొను చున్నాను. అట్టి పితా మహునకు నీకు నమస్సు.

 

సంసారమును చక్రమున తిరుగు చుండు పెక్కండ్రు, జ్ఞానము చేత విశుద్ధమైన సత్వ గుణము గల సన్మార్గులు ఓ ఆది దేవా! దేవదేవా! ఒక్కచో నిన్ను ఉపాసింతురు. అట్టి నిన్ను గూర్చి నేనేమి పలుకుదును?

 

ప్రకృతి కావల ఒక్కడవై యున్న నిన్నెరిగిన వాడు. సర్వము తెలిసిన వాడు మొదటి జ్ఞాని. నీ గుణములు వారి యందు (జ్ఞానుల యందు) విభజించి చూప గలిగినవి కావు. నీవు విశాల మూర్తివి. పరమ సూక్ష్మ రూపుడవు.

 

 

నీకు పలుకు లేదు. మనసు లేదు. ఇంద్రియములు లేవు. కర్మములు లేకున్నను చైతన్యము నిండిన వాడవు. సంసారము కల వాడవు. సంసారము లేని వాడవు. దేవవరా! నిన్ను తెలియుట ఎట్లు?

 

 

ఆకారము కలదియు, లేనిదియు, సాటి లేనిదియు నగు నీ పరమ దేహము విశుద్ధ భావులకు, సంసారమును తెగ త్రెంపులు చేసికొన గోరి అర్చించు వారికి మాత్రమే లభించును. అందు వలననే నిన్ను చతుర్భుజుడని నిర్ణ యింతురు.

 

 

కాని అచ్చెరువు కొలువు నీ దేహమును దేవాదులు కూడ ఎరుగ జాలరు. కనుకనే బ్రహ్మ మొదలగు వారు అవతారములుగా చెప్పబడు నీ పురాణమైన తనువును ఆరాధింతురు.

 

విశ్వము నెల్ల సృజించు వాడు, పద్మము పుట్టుక తావైన వాడు, మహానుభావుడు నగు బ్రహ్మయు మొత్తముగా నీ దేహము నెరుగడు. నేను మాత్రము తపస్సు చేత విశుద్ధుడనై ఆద్యుడవు. పురాణుడవు. కవివి అగు నిన్నె రుగుదును.

 

 

బ్రహ్మ దేవుడు నాకు జనకుడని, పెక్కు మారులు పురాణములు చేత ప్రసిద్ధుడు. ఈ పుట్టుక విషయమున నావంటి వాడు కూడ తెలియ రాకున్నాడు. ఇంక తపశ్శక్తి లేనివారు నిన్నెట్లె రుగుదురు?

 

బ్రహ్మ మొదలగు శ్రేష్ఠులకును తెలియని నిన్ను వేద హీనులగు మూర్ఖులు అనంతము లగు నమస్కారములతో తెలియ గోరు చుందురు. గొప్ప కీర్తి కల అట్టి వారి యందును సరియగు బుద్ధి లేదు.

 

 

నీ అనుగ్రహము వలన వేదములను చక్కగా ఎరిగిన వానికి పెక్కు జన్మములలో వివేక బుద్ధి కలుగును. నీవు దొరికిన లాభమునకు మనుష్యత్వము, దేవత్వము, గంధర్వత్వము మొదలగునవి శుభములు కావు. (అవి యేవియు నిన్ను పొందుట వంటివి కావని తాత్పర్యము)

 

నీవు అంతట వ్యాపించిన రూపము కలవాడవు. మిక్కిలి సూక్ష్మ రూపుడవు. స్థూల రూపుడవును. ఈ స్థూల రూపము భక్తులను కృత కృత్యులను చేయుట కొరకు ఏర్పడినది. ఇట్లు స్థూల సూక్ష్మ రూపములతో నుండు నీవు మిక్కిలి సులభుడవు. నీకు వెలియైన నడవడితో జనులు నరకమున కూలుదురు.

 

వితత మైన స్వభావము గల నీవు ఆకాశము, చంద్రుడు, అగ్ని, సూర్యుడు, భూమి, వాయువు, జలము అను తత్వములతో ఆత్మ స్వరూపముతో, సమాన మగు రూపములను ధరించు వానితో కూడి యుండగా నింక చెప్ప వలసిన దేమి కలదు?

 

అనంతా! భగవానుడా! భక్తుడనగు నాయీ స్తుతిని స్వీకరింపుము. సృష్టి చేయుమని నీవు పలికితివి. దానికై ఓ విష్ణూ! నాకు సర్వజ్ఞతను ప్రసాదింపుము.

 

నాలుగు మోములు కలవాడు కానిమ్ము కోటి మోముల వాడు కానిమ్ము. ఎందైనను విశుద్ధ బుద్ధి యైనచో కాని కోట్ల కొలది అయిన నీ గుణములను చెప్ప జాలడు. నా యందు ప్రసన్నుడవు కమ్ము.

 

ప్రభూ! సమాధి భావమును పొందిన వాడు, పరిశుద్ధ మైన బుద్ధి కలవాడు, నీ భావము తప్ప అన్య మెరుగని మనస్సు కలవాడు అగువాని హృదయమున నీవు ఎల్లప్పుడు నుందువు. నీకు నమస్కారము. అంతట నుండు వానికి విడిగా నుండు స్థితి ఎక్కడిది?

 

ప్రభూ! ఇట్లు నేను అంతటను ఉండెడు నిన్ను గూర్చి పరమ శుద్ధమైన బుద్ధితో ఈ స్త్రోత్రమును చేసితిని. సంసారమను చక్రమును దాటు ఉపాయము చేత కేవలత్వము నకై భీతుడనైన నన్ను పవిత్రుని చేయుము.

 

మహా తేజస్సు గల రుద్రుడిట్లు స్తుతింపగా అంత ఆ దేవుడు సంతుష్టుడై మేఘము వంటి గంభీరమగు కంఠ ధ్వనితో ఇట్లు పలికెను.

 

దేవా! ఉమాపతీ! నీకు మేలగును. వరము కోరు కొనుము. మన యిరువురకు భేదము లేదు. మన యిరువురము ఒక్కటియే.

 

 

ప్రభూ! బ్రహ్మ నన్ను ప్రజలను సృజింపు మని నియోగించెను. మూడు విధములైన భూతముల భావన కల ఆ జ్ఞానమును నాకు ప్రసాదింపుము.

 

నీవు సర్వజ్ఞుడవు. సనాతనుడవగు జ్ఞాన రాశివి. దేవత లందరకు నీవు ఎల్లవేళల పరమ పూజ్యుడ వగుదువు.

 

హరి యిట్లనగా ఉమాపతి పరమ సంతోషముతో మరల ఇట్లనెను. దేవా! నాకు మఱియు నొక వరమిమ్ము. నీవు ఆరాధింపుము. దేవదేవా! నన్ను వహింపుము. నా నుండి వరము కైకొనుము. దానితో నేను సర్వ దేవతలకు పరమ పూజ్యుడ నగుదును.

 

దేవ కార్యముల కొరకైన అవతారముల యందు నేను మనుష్య భావమును పొందు వాడనై నిన్నే ఆరాధింతును. నీవు నాకు వరముల నొసంగు వాడ వగుము.

 

నీవు నన్ను వహింపు మంటివి. కావున దేవదేవా! ఉమాపతీ! నేను మేఘుడనై నిన్ను నూరేండ్లు మోయుదును.

 

ఇట్లు పలికి హరి తనంత తాను మేఘ రూపమునంది మహేశ్వరుని ఆ నీటి నుండి పైకి తెచ్చెను. మరియు ఇట్లనెను.

 

ఈ పదు నొకండు గురు పురుషు లున్నారే, వీరు వైరాజులు. భూమికి దిగి ఆదిత్యులను పేరుతో వెలు గొందుదురు. నా అంశ గల పండ్రెండవ వాడు విష్ణువను పేరు కలవాడై భూమికి దిగి, శంకరా!, నిన్నా రాధించును.

 

ఇట్లు పలికి తనదైన అంశము వలన ఆదిత్యుని, మేఘమును సృజించి నారాయణుడు, శబ్ధము వలె, ఎందు లయ మయ్యెనో మేమెరుగుము.

 

ఇట్లా హరిదేవుడు అంతట నుండు వాడు. అన్ని బావనలు కలవాడు పూర్వము నాకు వరము నొసగెను. అందు వలన నేను దేవతలలో శ్రేష్ఠుడ నైతిని.

 

నారాయణుని కంటె మిన్నయగు దేవుడు మునుపు లేడు. ముందు కలుగడు. ఇది వేదములయు, పురాణములయు రహస్యము. విష్ణువు ఎట్లు పూజ్యు డయ్యెనో నేను మీ కంతయు తెలియ జెప్పితిని.