వరాహ మహా పురాణము
అధ్యాయము - 43
మునీ! ఇట్లే చైత్ర మాసము నను సంకల్పము చేసికొని దేవ దేవుడగు జనార్ధనుని ఆరాధింప వలయును.
‘ఓం నమో వామనాయ నమః’ అని పాదములను, ‘విష్ణవే నమః’ అని నడుమును, ‘వాసుదేవాయ నమః’ అని గర్భమును, ‘సంపూర్ణకాయ నమః’, అని రొమ్మును, ‘విశ్వకృతే నమః’ అని కంఠమును, ‘వ్యోమ రూపిణే నమః’ అని శిరస్సును, ‘విశ్వజితే నమః’ అని బాహువులను, వాని పేరులతో అనగా ‘పాంచ జన్యాయ నమః’ అని శంఖమును, ‘సుదర్శనాయ నమః’ అని చక్రమును పూజింప వలయును.
ఈ పద్ధతి తోడనే సనాతనుడగు దేవ దేవుని అర్చించి మునుపటి వలెనే ఉత్తర దిక్కున రెండు వస్త్రములతో కుంభమును దేవుని ముందు ఉంచ వలయును.
మునుపు చెప్పిన రాగి పాత్ర యందు బంగారముతో వామనుని ప్రతిమను శక్తి మేరకు చేయించి తెల్లని జన్నిదము కల ఆ పొట్టి రూపును నిలుప వలయును.
ప్రక్క భాగమున కమండలువును, గొడుగును, పాదుకలను, జప మాలను, దర్భా సనమును ఉంచ వలయును.
ఈ పరికరములతో కూడిన వామన మూర్తిని తెల్లవారిన పిదప బ్రాహ్మణునకు గుజ్జు రూపు విష్ణువు ప్రీతి నొందు గాక అని పలుకుచు దాన మీయ వలయును.
నెల పేరు కలియు నట్లుగా వామనుని అవతారమును భావించుచు ప్రీతి నొందు గాక అని చెప్పు చుండ వలయును. ఇది అన్ని యెడల విధానము.
పూర్వము హర్యశ్వుడను రాజు విన వచ్చును. అతడు సంతానము లేనివాడు. గొప్ప తప స్సంపద గల కుమారుని కోరుచు తపస్సు చేసెను.
ఇట్లు పుత్రుని కొరకు తపస్సు చేయు చుండగా విష్ణువు బ్రాహ్మణ రూపమును దాల్చి ఆతని కడకు వచ్చెను.
రాజా! తపస్సు చేత నీవు కోరున దేమి? అని అడిగెను. పుత్రుల కొరకు తపస్సు అని అతడు బదులు చెప్పెను. అంత నా రాజునకు నా బ్రాహ్మణు డిట్లు బదులు పలికెను.
“రాజా! ఈ ద్వాదశీ వ్రత విధానమునే ఆచరింపుము.” అని ఆ ప్రభువు క్షణములో అదృశ్యు డాయెను.
రాజును ఆ వ్రతమును మంత్ర సహితముగా వెంటనే ఆచరించెను. దరిద్రుడు, బుద్ధి మంతుడునగు జ్యోతిర్గార్గుడను బ్రాహ్మణునకు ఆ వామన మూర్తిని దాన మొసగెను.
సంతానము లేని అదితికి స్వయముగా కొడుకై జన్మించితివి. అట్లే భగవంతుడా! నాకును ఆ సత్యము తోడనే శ్రేష్ఠుడగు పుత్రుడు కలుగు గాక!
ఈ విధితో ఆతడు దాన మొసగెను. ఆతనికి, ఓ మునీ, కువలాశ్వుడని పేరొందిన చక్రవర్తి మహా బలుడు పుత్రుడు కలిగెను.
సంతానము లేని వాడు పుత్రులను, ధనము లేని వాడు ధనమును, రాజ్యము కోల్పయిన వాడు రాజ్యమును, మరణించిన వాడు విష్ణు పురమును దీని వలన పొందును.
అచట బహు కాలము కీర్తి నొంది మరల మానవ లోకమునకు వచ్చిన ఆ ధీశాలి నహుషుని కుమారుడు యయాతి వలె చక్రవర్తి యగును.
