వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము - 122

ఇట్లు భూదేవి ధర్మము నిండుగా గల కోకా మాహాత్మ్యమును, పిక్కటిల్లిన సత్తువ గల ధర్మమును విని పరమా శ్చర్యమును పొందెను.

 

 

అహో! కోకాతీర్థ ప్రభావము, వరాహ రూపదేవుని మహిమ! పశు పక్ష్యాదుల కడుపున పుట్టినవియు పరమ గతిని పొందినవి.

 

దేవా! నీదయతో మరియొక విషయము తెలియ గోరు చున్నాను. దీనిని కూడ మున్ను నిన్నడిగితిని. ఏ ధర్మముతో, ఏ తపస్సుతో, ఏ కర్మముతో, మాధవా! మానవులు నిన్ను దర్శింతురో దానిని ప్రాసాద ముఖుడవై సర్వమును చెప్పుము.

 

ఆ మాధవీ దేవి యిట్లడుగగా మాధవుడు నవ్వి ఇట్లు చెప్ప మొదలిడెను.

 

పుణ్యాత్మురాలా! నీవు పలికి నట్లే సంసారము నుండి ముక్తిని ప్రసాదించు ధర్మము నంతటిని చెప్పెదను.

 

వర్షర్తువు గడచిన తరువాత ప్రసన్నమగు శరత్కాలము రాగా ఆకాశము నిర్మలమై చంద్ర బింబము స్వచ్ఛమై యుండగా, ఎక్కువ చలి ఎక్కువ వేడి లేని కాలమున హంసల మధుర నాదములు వినవచ్చు వేళ కార్తీక మాసము శుక్ల పక్షమున ద్వాదశి నాడు నన్నర్చింప వలయును. ప్రభావమును వినుము.

 

వసుంధరా! లోకము లన్నియు నిలుచు కాలము దాక నా భక్తుడు ధన్యుడై యుండును. అన్య భక్తుడ ట్లెన్నటికిని కాడు.

 

ఆ ద్వాదశి యందు పూజా కార్యము లన్నియు చేసికొని నా ఆరాధన కొఱకు ఈ మంత్రమును పఠింప వలయును.

 

బ్రహ్మ రుద్రులు స్తుతించు ఆ భగవంతుడు ఋషి వందితుడు, వందనీయుడు. స్వామీ! ఈ ద్వాదశి తిథి ప్రాప్తించినది.

 

దేవా! లోకనాథా! మేల్కొనుము. మేఘములు వెడలి పోయినవి చంద్రుడు నిండుగా నిర్మలుడై యున్నాడు. నీవు ధర్మముకు హేతువవు. అట్టి నీకై శరత్కాలపు పూవులను సమర్పించు కొందును.

 

లోకనాథా! మేల్కొని మెలకువతో ప్రకాశించు చున్న నిన్ను యజ్ఞముతో యజించు చున్నారు. భాగవతులు వేదములతో నిన్ను కొనియాడు చున్నారు. పరిశుద్ధులు, మేల్కొన్న వారు, నీ యెడల జాగరూకత కలవారునై నిన్నర్చించు చున్నారు.

 

ఇట్లు ద్వాదశి నాడు నా భక్తులు మిక్కిలి శ్రేష్ఠమైన వ్రతమును, పూజా కార్యములను చేయ వలెను. దాని వలన పరమ గతి పొందుదురు.

 

దేవీ! శరత్కాల పూజా విధానమును సర్వమును ఇట్లు నీకు తెలిపితిని. ఇది భక్తునికి సంసార మోక్షమును కలిగించును. సుఖమునకు తావల మగును.

 

దేవీ! నీకు మరియొక విషయము చెప్పెదను. అది శుభమైన శిశిరర్తు పూజనము. ఆ పనులు భక్తితో చేయు మానవులు పరమ గతి నందుదురు.

 

చలి ఈదురు గాలి అను వానికి పీడ నొందిన వారయ్యు నా భక్తులు చెదరని హృదయముతో యోగము కొఱకు నిశ్చయము చేసికొని శిశిరమున చేయ వలసిన పనులను వివరించెదను. మోకాళ్లపై నిలిచి చేతులను జోడించి ఈ మంత్రమును పఠింప వలయును.

 

లోకనాథ! ఈ శిశిరర్తువు మంచుతో గడప శక్యము కానిది. చొరరాని కాలము ఇట్టి సంసారము నుండి నన్ను తరంప జేయుము. నన్ను చేపట్టుము.

 

నా భక్తి యందు స్థిరముగా నిలిచి శిశిరమున ఈ మంత్రముతో పూజ చేయువాడు పరమ సిద్ధి పొందును.

 

వసుంధరా! నీకు మరియొక విషయమును కూడ చెప్పెదను. మార్గశిర వైశాఖ మాసములు నాకు మిక్కిలి ప్రియము లైనవి.

 

నేనిపుడు ఆ ఋతువు నందలి పుష్పాదుల ఫలమును వివరింతును. గంధ పత్రమను పూవును నాకు ఈ కాలమున సమర్పించు వాడు తొమ్మిది వేల తొమ్మిది వందల ఏండ్లు బుద్ధి ప్రజ్ఞలు కలవాడై విష్ణు లోకమున నిశ్చలముగా నిలుచును.

 

మరియొక విషయము చెప్పెదను. కార్తీకము, మార్గశిరము వైశాఖము అను మూడు నెలలు ఏకాగ్ర చిత్తముతో ద్వాదశి నాడు నాకు గంధపత్ర పుష్పములను సమర్పించినచో పండ్రెండు సంవత్సరములు నాకు ఆ పూలతో పూజ చేసినట్లగును.

 

కార్తీకమున గంధ పత్రముతో శాల పుష్పములను కలిపి అర్చింప వలయును. మార్గశిరమున కలువ పూవులతో కలిపి అర్చింప వలయును. అది మహాఫలము నొసగును.

 

మాధవుని యిల్లాలు భూదేవి ఈ మాట విని చనవుతో మెల్లగా నవ్వి మధుసూదనునితో ఇట్లు పలికెను.

 

నిండు వత్సరమున మూడు వందల అరువది దినములలో ఇవి పండ్రెండు నెలలు కాగా నీవు రెండే మాసములను ఏల పొగడు చున్నావు. అట్లే ద్వాదశిని కూడ ఎల్లప్పుడు నా ముందు ఏల పెద్ద చేయు చున్నావు?

 

ఇట్లు భూదేవి తన్నడుగగా మాధవుడు నవ్వి ధర్మముతో కూడిన వాక్యము నిట్లు పలికెను.

 

దేవీ! ఈ రెండు నెలలును నాకెందుకు మిక్కిలి ప్రియుములై నవో తత్త్వముతో చెప్పెదను. వినుము. తిథులలో ద్వాదశి సర్వజ్ఞముల ఫలముల కంటె మిన్న అయినది.

 

వేల కొలది బ్రాహ్మణులకు దాన మొసగిన ఫలమంతటిని ద్వాదశి నాడిచ్చి పొందును.

 

నేను కార్తీకమున మేల్కొంటిని. వైశాఖమున నిన్ను ద్ధరించితిని. కనుక ఈ యోగము మహా దానముల కంటె గొప్పది. అందు వలన వీనికి ఈ ప్రభావము కలిగినది.

 

అందువలన కార్తీకము నందును, వైశాఖము నందును మనస్సును నిగ్రహించు కొని గంధ పుష్పమును చేత దాల్చియీ మంత్రమును ఉచ్చరింప వలయును.

 

భగవంతుడా! ఆనతిమ్ము. ఇది మిక్కిలి గొప్ప కాలము. వైశాఖము, కార్తీకము. ఈ గంధ పుష్పములను స్వీకరింపుము. ధర్మమును వృద్ధి పరపుము. అని పలికి ఓం నమో నారాయణాయ అని గంధ పత్రమును సమర్పింప వలయును.

 

గంధ పత్ర పుష్పములను సమర్పించుట వలన నా భక్తులకు కలుగు గుణమును ఫలమును తెలిపెదను. ఆ పుష్పమును గ్రహించి ఈ మంత్రమును పఠింప వలయును.

 

 

విశుద్ధములగు ఆత్మకల చక్కని నిశ్చయ జ్ఞానము కల ఓ భగవంతుడా! మంచి పరిమళము గల ఈ పుష్పమును స్వీకరింపుము.

 

నా పూజ యందు పరమ శ్రద్ధ గలిగి నాకిట్లు పుష్పము నర్పించు వాడు వేయి దివ్య వర్షములు, పుట్టుక, చావు, అలసత, ఆకలి అనునవి లేక నా లోకముల యందు నివసించును.

 

దేవీ! ఒకొక్కక్క పుష్పము యొక్క పుణ్యము, మహా ఫలము అను వానిని నీవడిగిన దానికి సమాధానముగా చెప్పితిని.