వరాహ మహా పురాణము

Table of Contents

అధ్యాయము - 53

 

బ్రాహ్మణోత్తమా! నా ప్రశ్నకు నీవీ కథ చెప్పితివి. దాని విభూతి ఎట్లు ఎవని ఏ కార్యము చేత కలిగినది?

 

 

ఈ కథ చాల చిత్రమై వెలువడినది. ఇది అన్నింటి విషయమునకు ఉండునది. నీ దేహమున, నా దేహమున, సర్వ జంతువుల విషయమున అది సమానముగా నుండునది.

 

దీని యందు పుట్టుకను ఎఱుగ కోరు వానికి ఆ పరమాత్మయే స్వయముగా ఉపాయము. పశుపాలుని వలన పుట్టిన ఆ నాలుగు పాదములు నాలుగు మొగములు కలవాడు. ఎవడో అతడే ఈ కథకు గురువు. దీనిని ప్రవర్తింప జేసిన వాడు. అతని పుత్రుడు స్వరుడు. అతనికి ‘సప్తమూర్తి’ అనియు వ్యవహారము ( సప్తమూర్తి ఏడు రూపములు కలవాడు).

 

ఆయన ప్రవచించిన దేది కలదో అది నాలుగు పురుషార్థములకు సాధనము. ఋక్కులను కోరు వారికి ఆ నాల్గింటి చేత ఆ వాక్యములు ఆరాధింప దగిన వయ్యెను.

 

ఆ నాల్గింటిలో మొదటిది నాలుగు కొమ్ములతో కూడి యున్నది. రెండవది వృషభము. అది పలికిన మార్గము తోడనే మూడ వదియు, నాల్గ వదియు ఏర్పడినవి. ఆ మొదటి దానిని భక్తితో పూజించి సుతుని పొందినవి.

 

ఈ ఏడు మూర్తులు గల దేవుని చరితమును వినగోరు వాడు బ్రహ్మ చర్యముతో ప్రవర్తింప వలయును. ఈతని రెండవ దశ సనాతన మయినది. ( అనగా రెండవ గృహస్థాశ్రమ మని భావము)

 

పిదప సేవకులు మొదలగు వారిని భరించుట వృషభ రూపుడగు దైవమును అధిరోహించుట.

 

నేనొకడను అని పలికెను. నాలుగు విధుములుగా, ఒక విధముగా, రెండు విధములుగా, అనేక రూపములు కలిసి పుట్టు నట్లుగా అతనికి కొడుకులు జన్మించిరి.

 

నిత్యములు, అనిత్యములు అగు స్వరూపములు గల వానిని చూచి చతుర్ముఖుడు నేను నా తండ్రి నెట్లు చూతునని విచార మందెను.

 

మహాత్ముడగు నా తండ్రి గుణములు ఈ స్వరుని బిడ్డల యందు ఒక్కరి యందును ఇప్పుడు కాన రావు.

 

తండ్రి కొడుకు కొడుకు తండ్రి పేరు కలవాడగును. శ్రుతి ఈ విధముగా నుండగా స్వరుని బిడ్డల యందు మరియొక విధముగా కారాదు కదా!

 

నా భావమెచట ఫలమునకు వచ్చును. నా తండ్రి నాకెక్కడ చూడ దగిన వాడు. ఇట్టి స్థితికి వచ్చితిని. దీని కార్యమేమి? అని చింతా పరుడాయెను.

 

అట్లతడు చింతించు చుండగా అతని ముందు తండ్రికి సంబంధించిన శస్త్ర మొకటి ప్రకాశించెను. రోషముల వలన ఆ శస్త్రముతో ఆ స్వరుని కుళ్ల బొడిచెను.

 

అట్లు పొడువగా చతుర్వక్త్రునకు పట్ట శక్యము కాని ఆ స్వరుని కొబ్బరి కాయ వంటి ఆకారము గల తల కాన వచ్చెను.

 

అదియు ప్రధానముగా పది వైపులను కప్ప బడి యుండెను. నవ్వు గింజంతగా దానిని నాలుగు పాదముల ఆయుధముతో పగుల గొట్టెను.

 

నువ్వు గింజంతగా ముక్కలు కొట్టినను దాని మూలము, నాకు కాన రాలేదని అత డనుకొను చుండెను. నేను, నేను అని పలుకుచు ఒక భూతము ఏర్పడెను. దానిని కూడా అట్లే బాధించెను.

 

దానిని కూడ ముక్కలు కొట్టెను. కాని ఆ అయిదింటి శూన్యతను చూడ కుండెను. (కాని ఆ అయిదు అక్కడనే యుండెనని భావము) అవి అవకాశమును చేసికొని వాగుచు నిల బడెను.

 

దానిని కూడ అసంగ మనెడు శస్త్రముతో నువ్వు గింజ లంతగా ముక్కలు చేసెను. అది అట్లు పదేసి భాగములుగా ముక్కలు కాగా మరియొక పొట్టి ఆకారము కాన వచ్చెను.

 

ఆ పొట్టి పురుషుని కూడ ముక్కలు కొట్టి తెల్లని వాడు, సౌమ్యుడు అయిన మరియొక పురుషుని కాంచెను. వానిని కూడ అట్లే చేసెను.

 

ఇట్లు చేయగా ఆ ప్రభువునకు ఆ ముక్క లోపల ఒక శరీరము కాన వచ్చెను. అది తన తండ్రిదే.

 

అది త్రస రేణువు అంత ఆకారమున సర్వ జంతువుల యందు అవ్యక్తముగా నుండెను. అట్లు అంతట సమముగా ఉన్న దానిని చూచి వారిరువురు ఆనందము పొందిరి. (త్రస రేణువు ముప్పది పరమాణువు లంతటిది.) అతడే స్వరు డాయెను.

 

ఈ విధమైన ఆ పురుషుడు స్వరమను నామము కల వాడాయెను. అతని మూర్తికి ‘ప్రవృత్తము’ అని పేరు. శిరస్సునకు నివృత్త మని పేరు.

 

రాజా! ఈ కథ వలననే ఆతనికి పుట్టుక కలిగినది. ఇదియే దాని విస్తృతి.

 

ఇది సర్వ జగత్తు యొక్క మొదటి ఇతిహాసము. దీనిని తత్త్వముతో ఎరిగిన వాడు సాక్షాత్తుగా కర్మ పరుడగును.