వరాహ మహా పురాణము
అధ్యాయము - 14
తెలివి గల గృహస్థు విద్యలలో ఆరితేరిన వారిని మొదట నిమంత్రణ చేయ వలయును. పిదప ఇంటికి వచ్చిన బ్రాహ్మణులకు, యతులకు భోజనము పెట్ట వలయును.
విశ్వే దేవులకు బియ్యము ఉదకము కలిపి అర్ఘ్య మొసగ వలయును. యథావిధిగా సుగంధము, ధూపము, దీపము సమర్పింప వాయును.
పితృ దేవతలకు మంత్ర పూర్వకముగా బుధుడు ఆవాహనము చేయ వలయును. నువ్వులు కలిపిన నీటితో అపసవ్యముగా అర్ఘ్యము మొదలగు దాని నొసగ వలయును.
అన్నము కోరి బాటసారి యెవ్వడేని అతిథిగా వచ్చిన యెడల బ్రాహ్మణుల అనుమతితో ఆతనిని కూడ అన్నముతో అర్చింప వలయును.
యోగులు మానవులకు మేలు చేయుచు ఎన్నో రూపములతో, తమ రూపము తెలియ రాకుండ ఈ భూమిపై తిరుగు చుందురు.
కూరలు పచ్చళ్లు, పులుపు పదార్థములు లేని అన్నమును అగ్నిలో వ్రేల్వ వలయును. దీనికి బ్రాహ్మణుల అనుమతి గొన వలయును. ఆ హోమము మూడు పర్యాయములు చేయ వలయును.
“అగ్నయే కవ్య వాహనాయ స్వాహా” కవ్య వాహానుడైన అగ్నికి ‘స్వాహా’ అనుచు మొదటి ఆహుతి సమర్పింప వలయును. పితృ దేవత లతో కూడిన సోమునికి, అని రెండవ ఆహుతి వేయ వలయును. (కవ్యము = పితృ దేవతల కిడు ఆహారము).
సూర్యుని కుమారుడగు యమునికి మూడవ ఆహుతి నొసగ వలయును. హోమము చేయగా మిగిలిన మెతుకులను బ్రాహ్మణుల భోజన పాత్రము లందు ఉంచ వలయును.
అటుపై ప్రీతికరము, చక్కగా వండినది, బ్రాహ్మణుల కిష్టమైనది అగు అన్నమును వడ్డింప వలయును. అయ్యా! మీ కోరిక ననుసరించి దయతో భుజింపుడు, అని మృదువుగా చెప్ప వలయును.
నా తండ్రి, తాత, ముత్తాత ఈనాడు ఈ హోమముతో ఆనంద పడిన వారై తృప్తి నందెదరు గాక!
నా తండ్రియు, తాతయు, ముత్తాతయు భక్తితో నేను తెచ్చిన యీ పదార్థముతో తృప్తి నందెదరు గాక!
నా తల్లి తండ్రియు, అట్లే ఆతని తండ్రియు, అతని తండ్రియు తృప్తి పడుదురు గాక! అట్లే విశ్వ దేవతలు పరమ ప్రీతి నందుదురు గాక! రక్కసులు నశింతురు గాక.
వారు తృప్తిగా భుజించి మిగిలిన పదార్ధము నేలపై వదిలిన తరువాత పిండములు మొత్తము పదార్ధములతో కలిపి చక్కగా చేయ వలయును. నీటిని పితృ తీర్ధముతో వదల వలయును. అట్లే మాతా మహులకును జలాంజలి నొసగ వలయును. ఆ నీటిపై పిండముల నుంచ వలయును. (పితృ తీర్థమనగా కుడిచేతి చూపుడు వ్రేలికి, బొటన వ్రేలికి నడుమ నుండి నీరు వదలుట)
అందరు కొనియాడు వ్రతములు గల ఋషులును దీని నాశ్రయించి నిర్వాణము పొందిరి. గౌరముఖా! నీవును దీని యందు శీఘ్రముగా ఆసక్తి కలవాడ వగుము.
