వరాహ మహా పురాణము
అధ్యాయము - 39
పూజ్యుడా! నీవు బ్రహ్మ వేత్తలలో శ్రేష్ఠుడవు. నీవు రెండు శరీరములను గూర్చి పలికితివి. వాని భేద మేమి. అవి ఏవి? నాకు చెప్పుము.
శరీరములు రెండు కావు. మూడు అని చెప్ప వలయును. భోగములకు నెల వైనది, వేరైనది అగు శరీరము ప్రాణులకు మూడు విధములుగా నుండును.
మొదటి అవస్థ లోని దానికి అధర్మము అను పేరు గలదు. అందు జ్ఞానము స్పర్శ యుండదు. రెండవది సవ్రతము. అది అత్యంత ధార్మికముగా తెలియ వచ్చును.
ఇంద్రియములను దాటినది ధర్మము, అధర్మముల అనుభవము కొరకు అయినది మూడవది. వేదముల తత్వముల నెరిగిన వివేకవంతులు ఈ మూడు విధములైన భేదములను చక్కగా నిరూపించిరి. యాతన, ధర్మ భోగము, భుక్తి అని మూడు భేదములు ఇందు గలవు. (యాతనా = కర్మ ఫలమునుల పొందునది, ధర్మ భోగః ధర్మ ఫలములను అనుభవించునది, భుక్తిః పుణ్య ఫలమును పొందునది.)
ప్రాణులను చంపు నపుడు మున్ను నీకు గల భావము పాపమను పేరు గల శరీరముగా చెప్ప బడును.
ఇప్పుడు శుభమైన ప్రవృత్తి గల కపటము లేని తపస్సు చేయు చున్న నీ శరీరము ధర్మ రూప మైనది. దానిచేత నీవు వేదములను పురాణములను నిస్సంశయముగా ఎఱుగ వచ్చును.
ఎనిమిదేండ్ల ప్రాయము నిండు సరికి మానవుడు ఈ మూడు దశలు కల వాడగును. ఎనిమిదేండ్ల వయస్సు దాటిన పిదప ఆతడు మూడు దశలను పొందు వాడై నిర్మలుడు, అచంచలుడు, ఆత్మ నిగ్రహము కలవాడు అగును.
మానవుడు అయిదింటిని, మరల అయిదింటిని, ఇంకను అయిదయిదుగా నయిన వానిని వదలునో అపుడు అతడు ఒకే దారి కలవాడై శాశ్వతమగు బ్రహ్మమును పొందును. (ఇందలి నాలుగు అయిదులకు ఇట్లు అర్థము చెప్పుకొన వచ్చును. 1. అయిదు = జ్ఞానేంద్రియ ములు, 1) చర్మము, 2) కన్ను 3) చెవి 4) నాలుక, 5) ముక్కు. 2. అయిదు = కర్మేంద్రియములు 1) నాలుక 2) చేయి 3) కాలు 4) మల విసర్జ నేంద్రియములు. 5) జన నేంద్రియము 3. అయిదు = విషయములు - 1) శబ్దము 2) స్పర్శ 3) రూపము 4) రసము 5) గంధము. 4. అయిదు = పంచ భూతములు 1) పృథివి 2) నీరు 3) అగ్ని 4) వాయువు 5) ఆకాశము. ఈ ఇరువదింటి తగులము లేనివాడు బ్రహ్మమును వీడ గలడని శ్లోక తాత్పర్యము.)
మహాత్మా! విజ్ఞాన రూపమైన శరీరము పుట్టదనుము. అప్పుడు ఏ విధముగా పర బ్రహ్మము పట్టు వడును?
కర్మముల సముదాయ మునకు జ్ఞానము మూలము. జ్ఞానమునకు కర్మము మొదలైనది మూలము. రాతికిని మట్టికిని వలె ఈ రెండికిని, భేదము లేదు.
కర్మ కాండము నాలుగు రూపములుగా బ్రాహ్మణాదుల యందు చెప్ప బడినది. అందు వేదము ఉపదేశించిన కర్మములను మొదటి మూడు వర్ణముల వారును ప్రతి దినము ఆచరించు చుందురు. ఒకడు (నాల్గవ వర్ణము వాడు) ఈ మువ్వురకు శుశ్రూష చేయును. ఇది వేదము చెప్పిన క్రియ. (శుశ్రూష అనగా సేవ, సేవ యనగా వృత్తులను నర్థము సంభావింప వలయును, కమ్మరము, వడ్రంగము, కుమ్మరి పని, రజక వృత్తి మొ||వి)
బ్రాహ్మణుడు ఈ ధర్మములను అవలంభించి వేదము లందు ప్రీతి కలవాడై ఉపాసన చేయు చుండెనేని ఆతనికి ముక్తి తప్పక కలుగును.
ఓ మహామునీ! నీవు బోధించు ఈ పరబ్రహ్మ మున్నదే, ఆ మహాత్మమగు పరబ్రహ్మము రూపము యోగులు కూడ ఎరుగరు కదా!
అయ్యా! ఆ పర బ్రహ్మమునకు పేరులేదు. సగోత్రమగు పదార్థము లేదు. దానికి ఆకారము లేదు. ఏ స్వరూపమును ఆశ్రయించి యుండదు. ఇట్లు నామ రూపములు లేని ఆ బ్రహ్మము నెరుగుట యెట్లు?
వేద మార్గము తీర్చి దిద్దిన దాని సంజ్ఞను నాకు చెప్పుము.
వేద మంత్రము లందు పేర్కొన బడిన ఆ పరబ్రహ్మము అనునది పుండరీకాక్షుడగు దేవుడే. స్వయముగా పరుడైన నారాయణుడే.
ఉత్తముడా! ఆ హరి, నారాయణుడను పరమ దైవము యజ్ఞముల చేతను, వివిధములగు యాగముల చేతను, దానముల చేతను, దాన వస్తువుల చేతను పొంద బడును.
మహాత్మా! వేదము తుదిముట్ట అధ్యయనము చేసిన ఋత్విక్కులు, పెక్కు ధనములు గల పుణ్యాత్ములే కదా యజ్ఞములు చేసి ఆ బ్రహ్మమును పొందు దురు. ఇతరులకు ఆ యజ్ఞ మెక్కడిది? ఆ విధముగా పడిన కష్టముతో భగవంతుడు దొరకు నన్నమాట!
విప్రవరేణ్యా! ధనము లేక దాన మిచ్చుట సాధ్యము కాదు. ధన మున్నను కుటుంబము నందు తగులము గల బుద్ధి కల వానికి దాన మిచ్చు బుద్ధి పుట్టదు. బ్రాహ్మణోత్తమా! అట్టి వానికి మోక్ష మెట్లు? వానికి హరి ఏ విధముగాను దుర్లభు డన్నమాట!
తక్కువ శ్రమతో సనాతనుడైన ఆ దేవుని పొందు మార్గము సర్వ వర్ణముల యందును ఎట్లుండునో సామాన్యమగు తీరున నాకు తెలుపుము.
మునుపు భూమి రసాతలమున మునిగి పోవుచు, చేసిన దానిని, మిక్కిలి రహస్యమైన దానిని, దేవతలు నిర్మించిన దానిని నీకు తెల్పెదను.
భూమి యొక్క మట్టి తనము నీటి యందు మించి పోకుండెను. అది నీటిలో మునుగగా భూమి రసాతలమునకు పోయెను.
భూతలము లన్నింటిని పట్టి నిలిపెడు ఆ దేవి రసాతలమున కరిగినదై పరమ దైవమగు నారాయణ ప్రభువును ఉపవాస వ్రతములతో, వేర్వేరు నియమములతో ఆరాధించెను.
పెద్ద కాలమునకు గరుడ ధ్వజుడామె యెడ ప్రసన్ను డాయెను. ఆమెను పైకి కొనివచ్చి అవ్యయుడగు ఆ దేవుడు మునుపటి స్థితిలో ఆమెను నిలిపెను.
ఓ మహామునీ! ఆ భూదేవి చేసిన ఉపవాస మదియేమి? ఆమె చేసిన వ్రతము లేవి? ఇది నాకు తెలుప వలయును.
మార్గ శిరమున దశమి నాడు నియమవంతుడై దేవతా ర్చనమును, అగ్ని కార్యమును యథావిధిగ నాచరింప వలయును.
శుభ్ర మైన వస్త్రములు తాల్చి ప్రసన్నమగు బుద్ది కలవాడై చక్కగా సంస్కరించిన హవ్యమగు అన్నమును భుజించి అయిద డుగులు వేసి తిరిగి పాదముల శుద్ధి చేసికొన వలయును. ఎనిమిది అంగుళముల పాల చెట్టు పుల్లను పలుదోము పుల్లగా నమలి మరల శ్రద్ధగా ఆచమనము చేయ వలయును.
దేహము ద్వారముల నన్నింటిని తాకి, జనార్దనుని ఎక్కువ సేపు ధ్యానింప వలయును. శంఖము, చక్రము, గద చేతుల యందు తాల్చిన వాడును, కిరీటము గలవాడు, పచ్చని వస్త్రము కట్టిన వాడును. ప్రసన్నమగు ముఖము కల వాడును, శుభ లక్షణము లన్నింటితో కూడిన వాడును అగు దేవుని ధ్యానించి మరల చేతితో నీటిని గ్రహించి సూర్యుని కర్ఘ్యము నొసగ వలయును. ఆ సమయమున నిట్లు పలుక వలయును.
పుండరీకాక్షా! అచ్యుతా! నేను ఏకాదశి నాడు ఆహారము కొనని వాడనై మరు దినమున భుజింతును. నాకు నీవు శరణము కమ్ము.
అని పలికి ఆరాత్రి దేవదేవుని సన్నిధి యందు ‘నమో నారాయణాయ’ (నారాయణునకు నమస్సు) అని జపించుచు నిద్రింప వలయును.
అంత తెల్లవారిన పిదప సముద్రమును కలియు నదికి గానీ, మరేదైన నదికిగాని, చెఱువునకు గాని, ఇంటి యందలి బావికి గాని అరిగి శ్రద్ధతో దేవీ! సర్వ ప్రాణులకు నీ వలననే ధారణము పోషణము. ఆ సత్యముతో నా పాప మంతయు పోగొట్టుము. అను మంత్రముతో పవిత్రమగు మట్టిని తేవలయును.
ప్రభూ! బ్రహ్మాండము కడుపున నున్న తీర్థము లన్నింటిని నీ చేతులతో తాకితివి. అందు చేత నీవు తాకిన ఈ మట్టిని తాకి నేను ఆ యన్నింటిని పొందెదను.
ఓయి వరుణదేవా! నీయందు ఎల్ల కాలము రసము లన్నియు నిత్యములై నిలుచును. దాని చేత ఈ మట్టిని ముంచి యెత్తి పవిత్రము నొనర్పుము.
ఇట్లు మట్టిని నీటిని అనుగ్రహింప జేసికొని ఒంటికి రాసికొన వలయును. ఇట్లు మిగిలిన మట్టితో మూడు మారులు చేయ వలయును. నీటితో గుండ్రని ఆకారమును లిఖింప వలయును.
పిదప ఆ చక్ర ఆకారమున శ్రద్ధతో స్నాన మాచరించి నియమములను తీర్చుకొని మరల దేవ గృహమున కరుగ వలయును.
అచట మహా యోగియు, దేవుడును, ప్రభువును అగు నారాయణుని ఇట్లు పూజింప వలయును. ‘కేశవాయ’ అని పాదములను ‘దామోదరాయ’ అని నడుమును, ‘నృసింహాయ’ అని తొడల జంటను, ‘శ్రీవత్స ధారిణే’ అని రొమ్మును, ‘కౌస్తుభ నాథాయ’ అని కంఠమును ‘శ్రీపతయే’ అని వక్షమును. ‘త్రైలోక్య విజయాయ’ అని చేతులను ‘సర్వాత్మనే’ అని శిరస్సును, ‘రథాంగ ధారిణే’ అని చక్రమును, ‘శంకరాయ’ అని శంఖమును, ‘గంధరాయ’ అని గదను, ‘శాంతి మూర్తయే’ అని పద్మమును ‘నమః’ అనుచు పూజింప వలయును.
మరల వివేక వంతుడగు అతడు నీటితో నిండినవియు మాలలతో అలంకరింప బడి నవియు, తెల్లని గంధము పూత గలవియు నగు నాలుగు కుండలను ఆ దేవ దేవుని ముందు నిలువ వలయును.
ఆ కుంభములు కంఠమున మామిడి చిగుళ్ళు కలిగి, తెల్లని వస్త్రములతో చుట్టబడి నువ్వులు, బంగారు నాణములు గల రాగి పాత్రలతో కప్పబడి యుండ వలయును.
ఆ నాలుగు కలశములు నాలుగు సముద్రములుగా భావింప వలయును. వాని మధ్య వస్త్రము పరిచిన శుభమైన పీటను ఉంచ వలయును.
దానిపై బంగారము, వెండి, రాగి, చెక్క అను వానిలో ఏదేనొక పాత్రను ఉంచ వలయును. ఆ పాత్రలలో ఏదియు దొరకనిచో మోదుగ ఆకునైన ఉంచ వచ్చును.
దానిని నీటితో నింపి ఆ పాత్ర యందుంచ వలయును. బంగారపు చేప రూపమున వేద వేదాంగములతో కూడిన వాడును, శ్రుతి స్మృతులతో అలంకృతుడును అగు విష్ణు దేవుని రూపమును చేయ వలయును.
చక్కగా ప్రకాశించు చున్న ఆ దేవునకు పెక్కు విధములగు పిండి వంటలతో, పండ్లతో, పూవులతో, గంధములతో, ధూపములతో, వస్త్రములతో విధి ననుసరించి పూజ సలుప వలయును.
కేశవా! పాతాళమున నున్న వేదములను చేప రూపమున నీవు ఎట్లు పైకి తెచ్చితివో నన్నట్లు ఉద్ధరింపుము’ అని పలికి ఆతని ముందు జాగరము చేయ వలయును.
తెల్ల వారిన తరువాత తన విభవము మేరకు నలువురు బ్రాహ్మణులకు ఆ నాలుగు ఘటములను దానమీయ వలయును.
తూర్పు దిక్కు కుండను బహ్వ్యృచము నధ్యయనము చేసిన వానికి, దక్షిణ దిక్కు కుంభమును ఛందోగునకు, పడమటి ఘటమును యజుశ్శాఖను చదివిన వానికి, ఉత్తర దిక్కు దానిని ఇష్టము వచ్చిన వానికి నొసగ వలయును. ఇదియే ఇచటి విధి.
తూర్పు కడవ యందు ఋగ్వేదము, దక్షిణ కుంభము నందు సామ వేదుమ, పడమటి దాని యందు యజుర్వేదము, ఉత్తర ఘటముతో అధర్వ వేదము ప్రీతి పొందు గాక!
ఈ వరుసతో ‘‘ప్రీయతామ్’’ అని పలుక వలయును. చేప రూపు బంగారు ప్రతిమను ఆచార్యునకు సమర్పింప వలయును.
గంధము, ధూపము, వస్త్రములు, మున్నగు వానితో యథా విధిగ క్రమముతో రహస్యములతో ఈ మంత్రమును జపింప వలయును. దీనిని ఇతరులకు సరహస్యముగా ఉపదేశించు వాడు. కోటిరెట్లు ఫలమును పొందును.
ఈ మంత్రమును గురువు నుండి పొంది మూర్ఖత్వము చేత ఎవడు ఆతనిని కాదనునో ఆ పురుషాధముడు కోటి జన్మములు నరకమున యాతనలు పొందును. ఈ విధానమును ప్రసాదించిన వానిని గురువని బుధులు చెప్పుదురు.
ఇట్లు కానుక లొసగి పద్ధతిని బట్టి ద్వాదశి నాడు విష్ణువు నర్చించి శక్తి మేరకు దక్షినలతో పాటు విప్రులకు భోజనము పెట్ట వలయును.
నువ్వులతో కూడిన రాగి పాత్రలలో కుండలను మూయించి ఆ జల పాత్రల యందున్న దానిని కుటుంబము గల బ్రాహ్మణునకు ఈయ వలయును.
పిదప దేవునకు నైవేద్యము పెట్ట వలయును. శ్రేష్ఠమగు అన్నముతో బ్రాహ్మణ సంతర్పణము చేయ వలయును. తరువాత తన బాలురతో కలిసి మౌనముతో, ఇంద్రియ వికారములు లేనివాడై భోజనము చేయ వలయును.
ఈ ప్రకారము ధరణీ వ్రతమును చేయు నరుడు పొందు పుణ్య ఫలము మిక్కిలి శ్రేష్ఠమైనది. బుద్ధి మద్వరుడా! దానిని గూర్చి చెప్పెదను వినుము.
ఓ సువ్రతా! నాకు వేయి నోళ్ళున్నచో, బ్రహ్మతో సమాన మగు ఆయువున్నచో ఈ ధర్మ ఫలమును గూర్చి చెప్పుట సాధ్యము. అయినను దిజ్మాత్రముగా చెప్పెదను వినుము.
నాలుగు లక్షల నాలుగు వేల ఎనిమిది వందల సంవత్సరములు కలిసి నాలుగు యుగముల మొత్తమగును.
అట్టి డెబ్బది యొక్క మహా యుగములు మన్వంతర మగును. అట్టి మన్వంతరములు పదునాలుగు బ్రహ్మదేవునకు ఒక పగలు అంత కాలము మరల రాత్రి యగును.
ఇట్టివి ముప్పది దినములు ఒక నెల. అవి పండ్రెండు సంవత్సరము. ఆ సంవత్సరములు నూరు బ్రహ్మదేవుని ఆయువు. ఇందు సంశయము లేదు.
ఎవడు గాని ఒక్క మారు ఈ ద్వాదశీ వ్రతము నీ విధముగా ఆచరించునో ఆతడు బ్రహ్మ లోకమును పొందును. అంతకాలము అచట నిలుచును.
పిదప బ్రహ్మ లయము పొందు నపుడు ఆతడును లయ మందును. మరల సృష్టి యందు ఆ మహా తాపసుడు వైరాజులకు దేవుడగును.
కోరకయో కోరియో ఈ లోకమున చేసిన బ్రహ్మ హత్య మున్నగు పాపము లన్నియు ఆ క్షణములన నశించును.
ఈ లోకమున దరిద్రుడు గాని, రాజ్యము కోల్పోయిన వాడు గాని ఏకాదశి యందు ఈ విధముగా ఉపవాస మున్న యెడల ఆతడు తప్పక రాజగును.
గొడ్రాలగు ఇంతి ఈ పద్ధతిగ ఉపవాస ముండి పరమ ధర్మమూర్తి యగు కుమారుని పొందును.
నరుడు తాను పొందరాని స్త్రీని పొంది నట్లుగా ఎరిగినచో ఈ విధానమును బట్టి ఆ పాపము నుండి విడివడును.
పెక్కేండ్లు వేద విద్యకు లోపము కలిగిన నరుడు ఈ ఏకాదశి ఉపవాసము ఒక్కమారు భక్తితో చేసి వేద సంస్కారము పొందును.
మహామునీ! పెక్కు మాటలేల. పొంద రానిది పొందక పోవుట కానీ నశింపని పాపము కాని లేదు.
బ్రాహ్మణోత్తమా! నాయనా! పాతాళమున మునిగిన భూమియే స్వయముగా ఉపవాస వ్రత మాచరించి నది. కనుక ఇందు విచారణతో పనిలేదు.
పట్టుదల లేని వానికి, నాస్తికునకు ఈ విధానమును ఉపదేశింప రాదు. దేవతలను, బ్రహ్మ జ్ఞాన సంపన్నులను ద్వేషించు వారికి దీనిని వినిపింప రాదు. అప్పటి కప్పుడు పాపములను పటాపంచలు చేయు దీనిని గురు భక్తి కలవానికి ఒసగ వలయును.
విధి ప్రకారముగా దీని నాచరించు వానికి ఈ జన్మముననే సౌభాగ్యము, ధనము, ధాన్యము, మంచి యిల్లాలు మొదలగు నవి కలుగును.
భక్తితో ఈ ఉత్తమ మగు ద్వాదశీ కల్పమును ఇతరులకు వినిపించు వాడును, విను వాడును, సకల పాపముల నుండియు విముక్తుడగును.
