వరాహ మహా పురాణము
అధ్యాయము - 87
ఇక క్రౌంచ ద్వీపము నాల్గవది. కుశ ద్వీపము కంటె కొలతలో రెట్టింపుగా నుండును. అందును ఏడే ప్రధానములగు పర్వతములు. మొదటి క్రౌంచ పర్వతము విద్యుల్లతము. అదియే రైవతము. తరువాత మానసము. అదియే పావకము. అటుపై అంధకారము. దానినే ఉచ్ఛోదక మనియు అందురు. తరువాత దేవావృత్తము. దానికి సురాప మనియు పేరు. పిదప దేవిష్ఠము. అదియే కాంచన శృంగము. దేవానందమునకు ప్రక్క గోవిందము దానిని ద్వివింద మనియు నందురు. అటుపై పుండరీకము, అదియే తోషాశయము. ఈ యేడును రత్న మయములగు పర్వతములు క్రౌంచ ద్వీపమున నెలకొని యున్నవి. ఒకదాని కంటె ఒకటి ఎత్తైనది.
అందు దేశములు. క్రౌంచమునకు దేశము కుశలము. దానినే మాధవ మందురు. వామనమునకు మనోనుగము. దానిని సంవర్తక మనియు అందురు. తరువాతిది ఉష్ణవంతము. అదియే సోమ ప్రకాశము. తరువాత నున్నది పావకము. అదియే సుదర్శనము. అటుపై అంధకారము. దానినే సంమోహ మనియు అందురు. ఆ తరువాత మునిదేశము. అదియే ప్రకాశము. తరువాత దుందుభి. దానిని అనర్థ మనియు అందురు.
అందును ఏడు నదు లున్నవి. గౌరి, కుముద్వతి, సంధ్య, రాత్రి, మనోజవ, ఖ్యాతి, పుండరీక అని ఆ ఏడు విధములైన గంగకు పేర్లు.
గౌరియే పుష్పవహ. కుముద్వతియే తామ్రవతి. సంధ్యయే రోధ. సుఖావహయే మనోజవ. ఖ్యాతియే క్షిప్రోద. పుండరీకయే గో బహుళ. రాత్రియే చిత్రవేగ. తక్కినవి చిన్న నదులు. క్రౌంచ ద్వీపమును నేతి సముద్రము చుట్టుకొని యున్నది. దానిని చుట్టుకొని శాల్మల ద్వీపము కలదు.
