నారద మహా పురాణము
19 - మోహినీ ప్రణయ వర్ణనమ్
వసిష్ఠ ఉవాచ :
సోఽను జ్ఞాతో మహీపాల: ప్రియాభి: ప్రియకాముకం ।
ప్రహర్ష మతులం లేభే ధర్మాంగద మువాచ హ
ఏతాం ద్వీపవతీం పృధ్వీం పరిపాలయ పుత్రక ।
కృత్వా దుష్ట వధం త్వాదౌ అప్రమత్త స్సదోద్యతః
సదావసర సంయుక్త స్సదాచార నిరీక్షకః ।
సదా చేతన సంయుక్త స్సదా వాణిజ్య వల్లభః
సదా భ్రమణ శీలశ్చ సదా దానరతిర్భవ ।
సదా కౌటిల్య హీనశ్చ సదాచార రతస్సదా
అపరం శృణుమే పుత్ర ! యత్కర్తవ్యం త్వయాధునా ।
అవిశ్వాసస్తు సర్వత్ర భూమిపానాం ప్రశస్యతే
కోశస్య చ పరిజ్ఞానం జనానాం జనవల్లభ ।
రస వర్ద్రవ్య మా కర్షేః పుషేభ్య ఇవ షట్పదః
త్వయా పుత్రేణ సంప్రాప్తం పునరే వేహ యౌవనమ్
ఇమా మ పూర్వాం వరరూప మోహినీం సంప్రాప్య భార్యాం ద్విజ రాజ వక్త్రాంమ్ ।
సుఖేన సంయోజ్య చ తేఽద్య భారం సప్తా దధి ద్వీప భవం ప్రరంధ్యే
వ్రీడాకర స్తాత మనుష్యలోకే సమర్థ పుత్రే సురతాభికామి ।
భవేత్పితా చే ద్వలిభిశ్చయుక్తో జీర్ణద్విజ శ్వేత శిరో రుహశ్చ
జీర్ణోఽప్య జీర్ణస్తవ సౌఖ్యవృద్ధో వాంఛ ఇమాం లోకవరాం వరారామ్ ।
సంత్యజ్య దేవాన్మ మ హేతు మాగతా మనంగ బాణాభిహతాం సునేత్రామ్
కామం రమిష్యే ద్రుత కాంచనాభాం హ్యేకాంత శీల: పరిపూర్ణ చేతాః ।
భూత్వా తు గుప్తో వన నిర్ఘరేషు రమ్యేషు దివ్యేషు నదీతటేషు
ఇయం పురంధ్రీ మమ జీవితాధికా సుఖేన ధార్యా త్రిదివేక నారీ ।
అస్యాస్తు హేతో ర్విబుధా విమూఢ యధా రమాయై ధరణీ శ సంఘాః
తద్వాక్య మాకర్ణ్య పితుస్సుబుద్ధిః ప్రణమ్య భక్త్యా జననీ సమేతమ్ ।
నృపోత్తమం తం నృపనందనోఽసౌ దిదేశ భోగార్థ మనేకవిత్తమ్
ఆజ్ఞా విధే యాంస్తు పితుర్నియోజ్య దాసాశ్చ దాసీంశ్చ హిరణ్య కంఠీః।
మత్స్యధ్వ జార్తస్య సుఖాయ పుత్ర స్తతో మహీరక్షణ మాచచార
నృపై స్సుతో ధర్మ విభూషణోఽసౌ సమావృతో ద్వీపవతీం సమగ్రామ్ ।
తస్యేత్ధ ముర్వీం చరతశ్చ భూప నపాప బుద్ధిం కురుతే జ నౌఘః
న చాపి వృక్షః ఫల పుష్పహీనో నక్షేత్ర మాసీ ద్యవ శాలిహీనమ్ ।
స్రవన్తి గావో ఘట పూరదుగ్ధం మృతాధికం శర్కర వత్సుమిష్టమ్
క్షీరం సుపేయం సకలార్తినాశనం పాపాపహం పుష్టి వివర్థనం చ ।
జనో న కశ్చి ద్విభవస్య గోప్తా భర్తుర్హి భార్యా న కటూక్త వాదినీ
పుత్రో వినీతః పితృ శాసనే రతో వధూ స్థ్సీతా హస్తపుటే చ శ్వశ్రః ।
ద్విజోపదేశే హి జనో వ్యవస్థతో వేదోక్త ధర్మాచరణా ద్విజోత్తమాః
న భుంజతే మాధవ వాసరేజనా న యాంతి శోషం భువి నిమ్నగాస్తు ।
సంభుజ్య మానా న హి యాంతి సంపదః సంభోగ యుక్తైరపి మానవైః క్షయం
వివృద్ధి మాయాంతి జలైరివోర్డ్వం దూర్వాతృణం శాద్వలతా ముపైతి ।
కృతీ చ లోకోహ్య భవత్సమస్తో ధర్మాంగదే పాలన సంప్రవృత్తే
భుక్త్యా తు సౌఖ్యాని చ యాన్తి మానవాః హరేర్దినం తద్దిన సేవనేన ।
ద్వారాణి సాధ్వన్త నిశాసు భూప గుప్తాని కుర్వన్తి నద స్సుభీతాః
న చాపి గోపేషు దదన్తి వృత్తిం స్వేచ్ఛా చరా మందిర మా వ్రజన్తి ।
క్షీరం క్షరన్త్యో ఘటనత్సు భూరిశో వత్సప్రియా శ్శాంతికరాశ్చ గావః
అకృష్ట పచ్యా ధరణీ సమస్తా ప్రరూఢ సస్యా కిల లాంగలం వినా ।
మాతుః పయోభిశ్శిశవ స్సుపుష్టా భర్తుః ప్రయోగైః ప్రమదాసుపుష్టాః
నృపైస్సు పుష్టాస్తు జనాస్సు పుష్టా స్సత్యాభి యుక్తోహి వృషస్సు పుష్టః ।
ఏవం విధే ధర్మరతి ప్రధానే జనే ప్రవృత్తే హరి భక్తియుక్తే
సంరక్ష్య మాణే హి నృపాత్మజేన జగామ కాల స్సుఖహేతు భూతః ।
నిరామయో భూతి సమన్వితశ్చ స భూరి వర్హోత్సవ కారకశ్చ
పృధ్వీపతి శ్చాతి విమోహితశ్చ విమోహినీ చేష్టిత సౌఖ్య యుక్తః ।
దినం న జానాతి న చాపి రాత్రిం మాసం చ పక్షం చ స వత్సరంచ
అతీవ ముగ్ధ స్సురతేన తస్యా విరించి పుత్ర్యా శ్శుభ చేష్టితాయాః ।
విమోహినీ సంగమనే నృపస్య బభూవ శక్తి స్వధికా మనోజ్ఞే
యధా యధా సేవత ఏవ భూప స్తధా తధా వృద్ధి మియర్తి వీర్యమ్ ।
పక్షేషు శుక్లేష్వివ శీతభాను ర్నక్షీయతే సంతతసేవ నేన
వృన్దారకః పీత సుధారసో యధా సంస్పృశ్య సంస్పృశ్య పునర్నవోఽసౌ ।
పి బంస్తు పానం సుమనోహరం హి శృణ్వం స్తు గీతం సుపద ప్రయుక్తమ్
పశ్యం శ్చ రూపం స నితంబినీనాం స్ప్రశస్పృశన్మోహిని వక్త్ర చంద్రమ్ ।
విమర్ధ మానస్తు కరేణ తుంగౌ సుఖేన పీనౌ పిశితో పరూడౌ
ఘనస్తనౌ కాంచన కుంభతుల్యౌ ప్రచ్చాదితౌ హారవిభూషణేన ।
వలిత్రయం నాతి వివర్థమానం మనోహరం లోమ శరాజి శోభమ్
స్తనస్య రూపం పరితో విలోక్య దధ్రే వరాంగ్యా శ్శుభలోచనాయాః ।
నహీ దృశం చారుతరం నితాంతం నితంబినీనాం మనసోఽభిరామమ్
యా దృగ్విధం మోహిని మోహనార్థం వినిర్మితం యద్విధినా స్వరూపమ్ ।
మృగేన్ద్ర శత్రోః కరసన్ని కాశే జంఘే విలోమే ద్రుత కాంచనాభే
శశాంక కాంతి ర్దశనస్య పంక్తిః నిగూఢ గుల్భే జనమోహ నార్దమ్ ।
ఆపాద శీర్షం కిల తత్స్వ రూపం సంపశ్యతశ్చారు విశాల నేత్య్రాః
మేనే సురాణా మధికం హి రాజా కృతార్థ మాత్మాన మతీవ హర్షాత్ ।
ఆహో సు తన్వీ విపులేక్షణీయం యాచిష్యతే యచ్చ తదేవ దేయమ్
అస్యాస్తు రమ్యే సురతే శుభాయా దాస్యామి చాంతే నిజవిత్త జాతమ్ ।
సుదుర్లభం దేయ మ దేయ మన్యై ర్దాస్యామి చాస్యా యది వాప్యదేయమ్
యద్యప్య దేయం మమ జీవితంహి యాచిష్యతే చేద్యది హేమ వర్ణా ।
దాస్యామి చేదం నవిచారయిష్యే పుత్రం వినా నాస్తి న దేయ మ స్యాః
ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణే ఉత్తరభాగే మోహినీ ప్రణయ వర్ణనం నామ ఏకోన వింశోఽధ్యాయః.
వసిష్ఠ మహర్షి పలికెను :-
ఇట్లు ప్రియురాళ్ళచే అనుమతిని పొందిన రుక్మాంగద మహారాజు సంతోషించిన వాడై ధర్మాంగదునితో ఇట్లు పలికెను. ఓ పుత్రా! ఎప్పుడూ ప్రమాద రహితుడవై మొదట దుష్టులను వధించి సప్తద్వీపములు గల ఈ భూమండలమును పరిపాలించుము. సత్కాలమున సదాచారమును పరిశీలించుచు, జ్ఞానివై వాణిజ్యము నందు ప్రీతి కలవాడవై, ఎప్పుడూ పర్యటించుచు, సర్వకాలములందు దానములను చేయుచు కుటిలత్వమును విడిచి సదాచారమునందు ప్రీతికలవాడవై యుండుము. ఓ పుత్రా ! ఇపుడు నీవు చేయవలసిన మరియొక పనిని వినుము. రాజులు ఎప్పుడూ అందరి యందు అవిశ్వాసమునే కలిగి యుండవలయును. జనుల కోశమును తెలియుచుండ వలయును. పూవుల నుండి తుమ్మెద మరందమును పరిగ్రహించునట్లు పాదరసమువలె అంతటా పరిభ్రమించుచు ప్రజల నుండి ధనమును గ్రహించవలయును. ఇక నేను నీచే లభించిన యౌవనమును పొంది చంద్రముఖి, అపూర్వ సౌందర్య రాశి, అగు మోహినిని భార్యగా పొంది సప్తద్వీప భూ భారమును నీ కప్పగించి సుఖముగా ఆనందించెదను. పుత్రా! మనుష్యలోకమున యావనవంతుడు సమర్థుడగు పుత్రుడుండగా దంత భ్రంశమును చెంది, తలపండి, ముడుతలు పడిన శరీరము కల తండ్రి స్త్రీ సౌఖ్యమును కోరుట సిగ్గును కలిగించు విషయమే. అయిననూ నేను వృద్దుడనై కూడా యువకుడనే. కావున అన్ని లోకములలో శ్రేష్టురాలగు, నా కొరకు దేవతలను కూడా వదలివచ్చిన, మన్మధ బాణ విద్దయగు ఈ మోహినిని, చారునేత్రను స్వర్ణ వర్ణ దేహను, ఏకాంత శీలుడనై నిండు మనసుతో, రహస్యముగా సుందరములగు సెలయేరులలో నదీ తీరములందు రమించెదను. దేవతలందరిలో శ్రేష్ఠురాలగు ఈ మోహిని నాజీవితము కంటే అధికురాలు. సుఖముగా నుంచదగినది. లక్ష్మీదేవి కొరకు దేవతలు లోకపాలులు మూఢులైనట్లు ఈ మోహిని కొరకు దేవతలందరూ మోహితులైరి. ఇట్లు పలికిన తండ్రి మాటను విని సుబుద్ధియగు ధర్మాంగదుడు జననీ సమేతముగా జనకునికి ప్రణమిల్లి, తండ్రి భోగము కొరకు బహువిత్త సంచయమును సమకూర్చెను. తండ్రి కొరకు ఆజ్ఞావిధేయులగు దాసులను దాసీ జనమున నియమించి కామబాణార్హుడగు తండ్రికి అన్ని సౌకర్యములను సమకూర్చి భూరక్షణమును ఆచరించెను. ధర్మాంగదుడు రాజులచే స్తుతించబడుచు సప్తద్వీప సమన్వితమగు భూమండలమును పర్యటించుచు పరిపాలించు చుండగా ప్రజలు పాపమునందు బుద్దిని విడిచిరి. ఫలములు పుష్పములు లేని చెట్లు లేకపొయేను. యవశాలి రహితమగు క్షేత్రము లేదు. గోవులు ఘట పూర్ణముగా పాల నిచ్చుచున్నవి. ఆ పాలు శర్కరవలె తీయనివి. ఎక్కువ నేయి కలవి. సుఖముగా త్రాగదగిన పాలు. అందరి ఆర్తిని నశింప చేయునవి. పాపములను తొలగించగలవి. పుష్టిని పెంచునవి. ప్రజలలో ఏ ఒక్కరూ సంపదను దాచరు. భర్తతో భార్య పరుషముగా మాటలాడదు. వినయశీలులగు పుత్రులు తండ్రి ఆజ్ఞను పాలించువారు. కోడలు అత్త చేతుల్లో నిలుచు. ప్రజలందరూ బ్రాహ్మణుల ఉపదేశములో నిలుచువారు. బ్రాహ్మణులు వేదోక్త ధర్మములను ఆచరించువారు. ఏకాదశినాడు ఏ ఒక్కరూ భుజించరు. నదులు ఎండిపోవుటలేదు. భోగములందు కోరికగల మానవులు భోగములననుభవించుచున్ననూ వారి సంపదలు తరుగుట లేదు. నదులలోని నీరువలే సంపదలు పేరుగుచున్నవి. దూర్వాత్పణము జలముచే పెరుగుచున్నది. ధర్మాంగద మహారాజు రాజ్యపాలన చేయుచుండగా సమస్త లోకము ధన్యత నందెను. భోగానుభవముచే సౌఖ్యములను పొందుచున్నారు. హరి దినమును సేవించుటచే గడుపుచున్నారు. రాజ్యములలో ఎవ్వరూ దొంగల భయముచే తలుపులు మూయుట లేదు. స్వేచ్చాచారులు లేరు. గోపాలకులకు ఇతర వృత్తులను ఇచ్చుటలేదు. గోవులు పుష్కలముగా బహుఘట పూర్ణములుగా పాలనిచ్చును. దూడలయందు ప్రీతి కలవి. శాంతిని కలిగించునవిగా యున్నవి. నాగలి దున్నకనే క్షేత్రములన్నియూ సస్యములు పెరిగి పండుచున్నవి. తల్లులలోను బాలతో శిశువులు పుష్టిని పొందుచున్నారు. భర్తల అనురాగముచే భార్యలు సంతుష్టలు. రాజులచే ప్రజలు, ప్రజలచే రాజులు పుష్టి తుష్టి కలవారుగా నుండిరి. సత్యముచే కూడిన ధర్మము పుష్టి నొందెను. శ్రీహరి యందు భక్తి కల ధర్మాంగద మహారాజు ధర్మప్రీతి కలవాడై పరిపాలన చేయుచుండగా ప్రజలు సంతోషముతో నుండిరి. కాలము సుఖదాయకముగా గడుచు చుండెను. లోకమంతయూ రోగ రహితము. సంపద్యుతము. వర్ష సమృద్ది ఉత్సవ సమృద్ధి కలిగియున్నది. రుక్మాంగద మహారాజు కూడా మోహినీ దేవి చేష్టలచే సౌఖ్యము కలవాడై మోహముతో నుండెను. రుక్మాంగద మహారాజు మోహినీ మోహములో పరవశుడై పగలును, రాత్రిని, పక్షమును, మాసమును, సంవత్సరమును తెలియజాలక పొయెను. శుభకరముల చేష్టలు కల బ్రహ్మపుత్రికయగు మోహినీ సంగమమున మిక్కిలి మోహముతో నుండెను. రుక్మాంగద మహారాజునకు మోహినీ సంభోగమున శక్తి అధికమాయేను. మోహినిని అనుభవించుచున్నపుడల్లా అతని బలము అధికముగా జొచ్చెను. శుక్ల పక్షమున చంద్రునివలే రుక్మాంగదునికి మోహినీ సంగమమున శక్తి ప్రతిదినము తరుగుట లేదు. అమృతపానమును చేసిన దేవతలవలె మోహినిని స్పృశించుచు స్పృశించుచు పునర్నవత్వమును పొందుచుండెను. మనోహరముగా పానము సేవించుచు మధుర పదయుక్తముగా గానమును వినుచు రూపవతుల రూపమును చూచుచు, మోహినీదేవి వక్రమును తాకుచు, ఉన్నతములు, సుఖముతో బాగుగా బలిసియున్న, మాంసముతో వృద్ధి చెందిన, బంగారు కలశముల వలెనున్న, హార భూషములచే కప్పబడియున్న మోహినీదేవి యొక్క ఘనములగు స్తనములను చేతితో మర్ధించుచు ఎక్కువగా పెరుగని త్రివళులను మనోహరముగా లోమశరాజి శోభితముగా నుండుటచే స్తనరూపమును పొందుటచే మోహినీ గాత్రములందు దృష్టిని నిలిపెను. బ్రహ్మ స్వయముగా మోహింప చేయుటకు స్త్రీలు మనసారా ఆశించు సుందర రూపమును మోహినికి సమకూర్చెను. యేనుగు తొండము వంటి పిక్కలు రోమ రహితముల కొంచన సన్నిభములు, పలువరుస చంద్రకాంతి సన్నిభములు, జనమోహకములగు నిగూఢగుల్పములు. సుందర విశాల నేత్రములు మోహినీదేవి యొక్క రూపమును ఆపాదమస్తకమును చూచుచు దేవతలందరిలో తానే అధికునిగా భావించెను. తనను కృతార్థునిగా తలించెను. ఆహా! ఈ సుందరి విశాలనేత్ర అడిగినదేదైనను తప్పక ఈయదగినది. సుందరమగు ఈమె సమాగమము కొరకు నా సంపదనంతటిని ఈయగలను. దుర్లభమైన దానినైనను, ఇతరులకు ఈయరానిదైను ఈమె కోరినచో ఈయదగినదే. ఈయరాని నా ప్రాణమును కూడా ఈయగలను. ఒక్క నాకుమారుని తప్ప ఇక దేనినైననూ ఈమె కోరినచో ఈయగలవాడను.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తరభాగమున మోహినీ ప్రణయ వర్ణన మను పందొమ్మిదవ అధ్యాయము.
Summary of chapter 146 of the Nārada Mahā Purana is as follows:
సమస్త ధర్మములకు, పవిత్ర యజ్ఞములకు పుణ్యభూమియైన కురుక్షేత్ర మాహాత్మ్యము ఈ అధ్యాయంలో వర్ణించబడినది. సూర్య గ్రహణ కాలంలో కురుక్షేత్ర పానపత్ర స్నానము వలన లభించే కోటి యజ్ఞ ఫలము ఇక్కడ అభివర్ణించబడినది.