18 - మాతృ సన్మానమ్

రాజోవాచ :

నాధికారో మయా భీరు కృతో నృప పరిగ్రహే

శ్రమాతురస్య నిద్ర మే ప్రవృత్తా సుఖదాయినీ

ధర్మాంగదం సమాభాష్య మోహినీం నయ మందిరమ్

పూజయస్వ యధాన్యాయ మేషా పత్నీ ప్రియా మమ

నిజం కమల పత్రాక్ష సర్వరత్న విభూషితమ్

నిర్వాత వాత సంయుక్తం సర్వర్తు సుఖదాయకమ్

ఏవమాదిశ్య తనయ మహం నీద్రాముపొగతః

శయనం ప్రాప్య కష్టా త్తే అభాగ్యో హి ధనం యధా

విబుద్ధమాత్ర స్సహసా త్వత్సమిపము పాగతః

యద్భ్రవీషి వచో దేవి ! తత్కరోమి న సంశయః

రాజు పలికెను :-

ఓ భయశీలా ? నేను రాజరికమును గ్రహించుటకు ప్రయత్నము చేయుటలేదు. శ్రమచే అలసిన నాకు ఆనందమును కలిగించు నిద్ర వచ్చినది. మోహినిని సర్వరత్న విభూషితము, తగినంతగాలి వెలుతురు కల, అన్ని ఋతువుల అనుభూతిని కలిగించు నీ మందిరమునకు తోడ్కొని పొమ్ము. ఈమె నాకు అత్యంత ప్రియమగు భార్య. కావున యధావిధిగా పూజించుము. అని పుత్రుని ఆదేశించి నేను శయ్యను చేరి దరిద్రుడు ధనమును పొందినట్లుగా, ఏ ప్రయత్నము లేకనే నిద్రను పొందితిని. మెలకువ రాగానే నీ వద్దకు వచ్చుచున్నాను. నీవెట్లు చెప్పిన అట్లే చేసెదను. అని పలికెను.

మోహిన్యువాచ :

పరిసాన్త్వయ రాజేన్ద్ర ! ఇమాన్దారాన్సు దుఃఖితాన్

మమోర్వా హెన నిర్విణ్ణా న్నిరాశాన్కామభోగయోః

జ్యేష్టానాం రూపయుక్తానాం కలత్రాణాం విశాంపతే

మూర్ద్ని కీలం కనిష్ఠాఖ్యం యో హి రాజన్ని ఖానయేత్

న సద్గతి ర్భవేత్తస్య న చ సా విందతే పరమ్

పతివ్రతాశ్రుదగ్ధాయా: కా శాంతిర్మే భవిష్యతి

జనితారం హి మే భస్మ కుర్యుల్దేవ్య: పతివ్రతాః

కిం పునం ప్రాకృతం భూప త్వాదృశం మాదృశీం తధా

సంధ్యావలీ సమా నారీ త్రైలోక్యే నాస్తి భూమిప

తవ స్నేహనిబద్ధాంగీ సంభోజయతి షడ్రసైః

ప్రియాణి చాటు వాక్యాని వదతీ తవ గౌరవాత్

ఏవం విధాహి శతశో నార్య స్సన్తి గృహే తవ

యాసాం న పాదర జసా తులాహం భూపతే క్వచిత్

మోహినీ వచనం శ్రుత్వా వీడితో హ్య భవనృపః

సపుత్రా స్సమాపే తు జ్యేష్ఠాయా నృపతి స్తదా

ఇంగిత జ్ఞ స్సుతో జ్ఞాత్వా దశావస్థాగతం నృపమ్

పితరం కామ సంతప్తం మోహిన్యర్థే విమోహితమ్

మాతృస్సర్వా స్సమాహూయ సంధ్యావలి పురోగమాః

కృతాంజలి పుటో భూత్వా ఏవమాహ ప్రియం వచః

విమోహినీ మే జననీ నవోడా బ్రహ్మణ సుతా

సా చ ప్రార్థయతే దేవ్యో రాజానం రహసి స్థితమ్

ఆత్మనా సహ ఖేలార్థం తన్మో దధ్వం సహర్షితాః

మోహినీ పలికెను :

ఓ రాజేంద్రా! నన్ను వివాహ మాడినందు వలన దుఃఖితులై కామభోగములందు నిరాశలైన నీ భార్యలను మొదట ఓదార్చుము. ఓ రాజా రూపవతులగు పెద్ద భార్యల శిరమున చిన్న భార్య యనేడు మొలను నాటిన వాడు సద్గతిని పొదజాలడు. ఆనందమును పొందజాలడు. పతివ్రతల కన్నీటితో దహించబడు నాకు శాంతియెట్లు కలుగును? పతివ్రతా స్త్రీలు నన్ను పుట్టించిన బ్రహ్మను కూడా భస్మము చేయగలరు. ఇక సామాన్యులైన మన విషయమున ఏమి చెప్పవలయును. ఓ రాజా? సంధ్యావలి వంటి స్త్రీ ఈ మూడు లోకములలో లేదు. నీ మీది ప్రేమతో నన్ను షడ్రసములతో భుజింప చేసెను. నీ మిది గౌరవముతో నాతో ప్రియముగా మితముగా మాటలాడుచున్నది. ఇటువంటి పతివ్రతలు వందల మంది నీ ఇంటిలో కలరు. నేను వారి కాలి దుమ్ముతో సరికా జాలను. అంతట రుక్మాంగద మహారాజు మోహిని మాటలను విని బిడియ పడెను. పుత్రునితోనున్న పెద్ద భార్యయగు సంధ్యావలిని చూచి మరి కొంత సంకోచించెను. అంతట ఇంగితము నెరిగిన ధర్మాంగదుడు తండ్రి దశావస్థలను పొందుట, కామ సంతప్తుడగుట, మోహిని యందు మోహము కలిగి యుండుట తెలిసి సంధ్యావలి మొదలగు తల్లులందరిని పిలిచి చేతులు జోడించి ఇట్లు పలికెను. తల్లులారా? నా తల్లియగు మోహిని కొత్తగా పెళ్ళి యాడినది. బ్రహ్మపుత్రిక. ఆమె తనతో క్రీడించుటకు రాజును రహస్యముగా ఉండవలయునని కోరుచున్నది. కావున మీరు సంతోషముతో ఆమోదించుడు.

మాతర ఊచుః :

కో ను మోదయతే పుత్ర ! సర్వ భక్షణ మాత్మనః

కోహి దీపయతే వహ్నిం స్వదేవో దేహినాం వర !

కో భక్షయే ద్విషం ఘోరం కశ్చిన్ద్యా దాత్మన శ్శిరః

కస్తరేత్సాగరం బద్ద్వా గ్రీవాయాం దారుణాం శిలామ్

కోగచ్చే ద్ద్వీపి వదనం కఃకేశాన్సు హరే ర్హరేత్

కో నిషీదతి ధారాయాం ఖడ్గస్యా కాశ భాసినః

కాను మోదతే భర్త్రా సపత్న్యా: క్రీడనం కిల

సర్వస్యాపి ప్రదానేన నైతన్మనసి వర్తతే

వరం హి ఛేదనం మూర్ద్న స్తత్క్షణాత్తు వరాసినా

కా దృష్ట్యా దయితం కాన్తం నిరీక్షేదన్యయా దృతమ్

కాసా సీమంతినీ లోకే భవేదేతా దృశీ క్వచిత్

ఆత్మ ప్రాణ సమం కాంత మన్య స్త్రీకుచ పీడనమ్

సంశ్రుత్య సహతే యాతు కింపునస్స్వేన చక్షుషా

సర్వేషా మేవదు:ఖానాం దుఃఖమేత దనస్తకమ్

యద్భర్తాన్యాంగ నాసక్తో దృశ్యతే స్వేన చక్షుషా

వరం సర్వా మృతాః పుత్ర యుగపన్మాతర స్తవ

న తు మోహిని సంయుక్తో దృశ్యోఽయం నృపతి: పతి:

తల్లులు పలికిరి :

ఓ పుత్రా ! తనను సంపూర్ణముగా భక్షించుటకు ఎవరు అంగీకరింతురు? తన దేహమున తామే అగ్నిని ఎవరు వెలిగింతురు? ఘోరమగు విషమునెవరు భక్షించెదరు? తన శిరమును తానుగా ఎవరు ఖండించు కొందరు. మేడకు పెద్ద శిలను కట్టుకొని ఎవరు సముద్రమును దాటగరు? పులినోటిలోనికి ఎవరు ప్రవేశించెదరు. సింహము కేశముల నెవ్వరు లాగెదరు? ఆకాశమున ప్రకాశించు ఖడ్గము అంచుపై ఎవరు కూర్చుందురు? అట్లే తమ భర్త సవతితో క్రీడించుటకు ఏ స్త్రీ ఆమెదించును? అన్నిటిని ఈయవచ్చును కాని భర్తను ఈయజాలము. దీనికన్నా ఖడ్గముతో శిరము ఛేదించుకొనుటమేలు. మరొక స్త్రీచే ఆదరించబడిన ప్రియుడగు భర్తను ఏ యువతి ప్రేమతో చూడజాలదు. తన ప్రాణసముడగు భర్త అన్యస్త్రీ కుచపీడనమును చేయుటకు ఏ స్త్రీ అంగీకరించ జాలదు. ఈ విషయమును వినియే సహించజాలదు. ఇక కంటితో ఎట్లు చూడగలదు? తన భర్త పర స్త్రీ యందు ఆసక్తుడగుటను తన కంటితో చూచుటయే అన్ని దుఃఖములలో గొప్ప దుఃఖము. ఈ దుఃఖమున కంటే నీ తల్లులందరూ ఒకేసారి చనిపోవుట మేలు. అంతే కాని మా భర్త మోహినితో కలిసి యుండగా చూడజాలము.

ధర్మాంగద ఉవాచ :

యది మేహి పితు సౌఖ్యం కరిష్యథ శుభాననా:

విషమాలోడ్య పాస్యామి యుష్మత్సౌఖ్యం మృతే మయి

కర్మణా మనసా వాచా యా పితుర్దుఃఖ మాచరేత్

సా మే శత్రు ర్వధార్హాస్తి యది సంధ్యావలీ భవేత్

సర్వాసాం సాధికా దేవీ మోహినీ జనక ప్రియా

క్రీడార్థ మాగతా బాలా మందరా చలమందిరాత్

తత్పుత్ర వచనం శ్రుత్వా వేపమానా హి మాతరః

ఊచు స్స గద్గదాం వాచం హితార్థం తనయస్య హి

అవశ్యం తవ వాక్యం హి కర్తవ్యం న్యాయ సంయుతమ్

కింతు దానప్రదో భూత్వా మోహినీం యా తు తే పితా

యో భార్యా ముద్వహేద్భర్తా ద్వితీయా మపరా మపి

జ్యేష్టాయై ద్విగుణం తస్యా దద్యా చ్చైవాన్యధా ఋణీ

అను జ్ఞాప్య యదా భర్తా జ్యేష్ఠా మన్యాం సముద్వదౌత్

తదా జ్యేష్టా భిలషితం దేయ మాహుః పురావీదః

జ్యేష్ఠయా సహితః కుర్యా దిష్టి పూర్తం నరోత్తమః

ఏష ధర్మోఽ న్యధా న్యాయో జాయతే ధర్మ సంక్షయః

శ్రుత్వా తు మాతృవచనం ప్రహృష్టే నాన్త రాత్మనా

ఏకైక స్యై దదౌ సాగ్రాం కోటిం కోటిం సుతస్తదా

సహస్రం నగరాణాంచ గ్రామాణాం ప్రదదౌ తధా

చతురశ్వ తరీభిశ్చ పృధగ్యుక్తా నృపాత్మజాః

ఏకైకస్యై దదావష్టౌ రధాన్కాంచన మాలినః

వాససా మయుతం ప్రాదా ద్యేషాం మూల్యం శతాధికమ్

శుద్ధస్య మేరు జాతస్య అక్షయస్య నృపాత్మజః

కాంచనస్య దదౌ లక్ష మేకైకం ప్రతి మాతరమ్

దాసానాం చ శతం సాగ్రం దాసీనాం చ నృపాత్మజః

ధేనూనాం ఘట దోగ్ద్రీణా మేకైకస్యై తధాయుతమ్

యుగంధరాణాం భద్రాణాం శతాని దశ వై పృధక్

దశప్రకారం నృపతే ధాన్యంచ ప్రదదౌ సుతః

వాటీనాంతు సహస్రాణాం శతం ప్రాదాద్ధ సన్నివ

కుంభయుతం సరిషస్తు శైలస్య చ పృధగ్గరౌ

అజావిక మసంఖ్యాత మేకైకస్యై న్యవేదయత్

సహస్రేణ సహస్రేణ సువర్ణస్య వ్యభూషయత్

ఆఖండ లాస్త్రయుక్తస్య భూషణస్య సుభక్తిమాన్

ధాత్రీ ప్రమాణైర్హారైశ్చ మౌక్తి కైర్దీప్తి సంయుతైః

ప్రదదౌ సంహతా నృత్వా వలయా న్పంచ సప్తచ

పంచాశచ్చ శతే ద్వే తు మౌక్తి కాని మహీపతే

సంధ్యావల్యాం స్థితానీహ శీతాంశు ప్రతిమాని చ

ఏకైకస్యై దదౌ పుత్ర హారయుగ్మం మనోహరమ్

కుంకుమం చందనం భూరి కర్పూరం ప్రస్థ సంఖ్యలో

కస్తూరికాం తధా తాభ్యో భూయసీం ప్రదదౌ సుతః

మాతృణా మవిశేషేణ పితు స్సుఖమభీప్సయన్

భోజనాని విచిత్రాణి జలపాత్రాణ్య నేకశః

ఘృత క్షీరస్య పాత్రాణి పేయస్య వివిధస్య చ 

చతుర్దశ శతం ప్రాదా త్సహస్రేణ సమన్వితమ్

స్థాలీనాం కాంచనీనాం హి స కుంభానాం నృపాత్మజః

 ఏకైక స్యై దదౌ భూప శతాని త్రీణి పంచ చ

కరేణూనాం సవేగానాం మాంస విక్రాంత కంధరామ్

వింశతిం వింశతిం ప్రాదా దుష్ట్రీణాం చ శతం శతమ్

శిబికానాం సవేషాణాం పుంసాం పీవరగామినామ్

ప్రదదౌ దశ సప్తా శ్వా న్మాతృణాం సుఖయాయినః

ఏవం దత్వా బహుధనం బహ్వీభ్యో నృప నన్దనః

ధన్యో ధనపతి ప్రఖ్య శ్చక్రే తాసాం ప్రదక్షిణాః

కృతాంజలి పుటో భూత్వా ఇదం వచన మబ్రవీత్

మమోపరోధాత్ప్రణతస్య మూర్ద్నా పతిం సముద్దిశ్య యధా భవత్యః

బ్రువంతు సర్వాః పితరం మమాద్య స్వైరేణ సంభుంక్ష నరేశ మోహినీమ్

న చాస్మదీయా భవతా కిలేర్ష్వా స్వల్పాపి కార్యా మనసి ప్రతీతా

విమోహినీం బ్రహ్మసుతాం సుశీలాం రమస్వ సౌఖ్యేన రహశ్నతాని

తత్పుత్ర వాక్యం హి ని శమ్య సర్వా సంహృష్ట లోమ్న్యో నృప నాధ మూచు:

స్వభూదుహిత్రా సుచిరం రమస్వ విదేహ పుత్ర్యైవ రఘు ప్రవీరః

న శల్య భూతా కుశకేతు పుత్రీ త్వత్సంగమా ద్విద్ది న సంశయోఽత్ర

పుత్రౌజసా దుఃఖ విముక్త భావా త్సమాంతం వాక్యమిదం ప్రతీహి

ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణే ఉత్తరభాగే మాతృసన్మానం నామ అష్టాదశోఽధ్యాయః.

ధర్మాంగదుడు పలికెను:-

ఓ తల్లులారా? మీరు నా తండ్రికి సౌఖ్యమును కలిగించనిచో విషమును బాగా కలిపి త్రాగ గలను. నేను మరణించిన తరువాత మీరు ఆనందించుడు. నా తండ్రికి కర్మచే కాని, మనసుచే కాని, వాక్కుచే కాని దుఃఖమును కలిగించు వారు సంధ్యావలీ దేవి అయిననూ నాకు వధించదగిన శత్రువే యగును. మీ అందరిలో నా తండ్రికి మోహిని ఎక్కువగా ప్రియమైనది. చిన్న వయసులో నున్నది. నా తండ్రితో క్రీడించుటకు మందర పర్వత శిఖరము నుండి వచ్చియున్నది. ఇట్లు పలికిన ధర్మాంగదుని మాటలు వినిన తల్లులందరూ భయముచే కంపించుచు తనయుని హితమును కోరి డగ్గుత్తికతో ఇట్లు పలికిరి. పుత్రా ! నీ మాటను న్యాయ సమత్మము కావున తప్పక పాటించ వలయును. కాని మాకు తగిన విధముగా సంపదలనిచ్చి నీ తండ్రి మోహినితో క్రీడించవచ్చును. భర్త ఒక భార్య యుండగా రెండవ దానిని పెళ్ళి యాడినచో పెద్ద భార్య రెండు రెట్లు సంపదల నీయవలయును. లేనిచో ఋణగ్రస్తుడగును. పెద్ద భార్య అనుమతిని పొంది మరోక యువతిని వివాహమాడినచో పెద్ద భార్య కోరినదానిని ఈయవలయునని పెద్దలు చెప్పెదరు. ఇష్టా పూర్తములను మాత్రము పెద్ద భార్యతో కలిసి ఆచరించవలయును. ఇది ధర్మము. అట్లు చేయనిచో అన్యాయము ధర్మ సంక్షయము జరుగును. ఇట్లు చెప్పిన తల్లుల మాటలను విని సంతోషము నిండిన మనసుతో ఒక్కొక్క తల్లికి కోటి కోటిని సువర్ణములను సహస్ర నగరములను, గ్రామములను ప్రదానము చేసెను. నాలుగశ్వములతో కూర్చిన ఎనిమిది రధములను కాంచనమాలలు కలవాటినిచ్చెను. శతాధిక మూల్యము గల పదివేల వస్త్రములను ఇచ్చెను. పరిశుద్ధము, మేరు పర్వత సంజాతము, అక్షయము అగు లక్ష బంగారు ముద్రలను ఒక్కొక్క తల్లికిచ్చేను. నూరుమంది దాసులను, నూరుమంది దాసీ జనమును అర్పించెను. కుంభము నిండపాలు నిచ్చెడు పదివేల ఆవులను ఒక్కొక్కరి కిచ్చేను. యుగంధర గజములన వేయి ఒక్కొక్కరికిచ్చెను. పది విధముగు ధాన్యములను ఇచ్చెను. లక్ష వాటులను నూనే కుండలను, నేతికుండలను ఇచ్చెను. సంఖ్యలేని మేకల నిచ్చెను. వేల కొలది స్వర్ణ భూషణముల నిచ్చెను. వజ్రములు పొదిగిన భూషణములను దానము చేసెను. ప్రకాశవంతములగు ధాత్రీ ప్రమాణములైన హారములను, అయిదు ఏడు చొప్పున కంకణములను ఇచ్చెను. చంద్రునివలే ప్రకాశవంతములైన రెండు వందల యాభై ముత్యములు కల రెండు హారములను ఒక్కొక్కరి కిచ్చెను. ప్రస్థ- సంఖ్యతో కుంకుమను, చందనమును, కస్తూరిని ఎక్కువగా ఇచ్చెను, తండ్రి సుఖమును కోరి తల్లులందరికి భేద దృష్టిని విడిచి భోజన పాత్రలను, జలపాత్రలను, ఘృతక్షీర పాత్రలను, వివిధ పాన పాత్రులను వేలకొలది పదునాలుగు వందలను ఇచ్చెను. కొంచన స్థాలులను కుంభములతో ఎనిమిది వండలు ఇచ్చెను. బాగుగా బలిష్టములగు ఇరువది ఇరువది ఆడ ఏనుగులనిచ్చెను. వంద ఆడ ఒంటెల నిచ్చెను. బలిష్ణులగు పురుషులచే మోయబడు పల్లకులను చాలా ఇచ్చేను. చాలా వేగము గల పదిఏడు అశ్వములను ఇచ్చెను. ఇట్లు ధర్మాంగదుడు తల్లులందరకి చాలా ధనములనిచ్చి ధన పతిసముడుగా ఖ్యాతి పొంది, ధన్యత నంది వారికి ప్రదక్షిణల నాచరించెను. చేతులు జోడించి ఇట్లు పలికెను. నేను శిరసు వంచి ప్రణామము నాచరించి ప్రార్థించితిని కావున మీరందరూ కలిసి మా తండ్రి గారితో యధేచ్ఛముగా మోహినిని అనుభవించుడు అని పలుకుడు. ఈ విషయమున మిరే మాత్రము సంకోచించ వలదు. మాకు ఈర్య కొంచెము కూడా లేదు. సుశీల బ్రహ్మ సుతయగు మోహినిని రహస్యముగా చాలా కాలము ఆనందముగా రమించుము. అని చెప్పుడు. అట్లు ధర్మాంగదుని మాటలను విని తల్లులందరు ఆనందముతో పులకించి భర్తతో సీతాదేవితో రామచంద్రునివలె బ్రహ్మ పుత్రికతో చాలా కాలము రమించుము అని పలికిరి. నీ సంగమమును పొందు మోహిని మాకు ప్రతికూల కాదు. పుత్రుని తేజస్సుచే మా దుఃఖము తొలగి ఇట్లు చెప్పుచున్నాము అని పలికిరి.

ఇది శ్రీ బృహన్నారదీయ మహా పురాణమున ఉత్తరభాగమున మాతృ సన్మానమను పదునెనిమిదవ అధ్యాయము.