నారద మహా పురాణము
13 - ధర్మానుకథనమ్
ధర్మరాజ ఉవాచ :-
దేవతాయతనం యస్తు కురుతే కారయత్యపి ।
శివస్యాపి హరేర్వాపి తస్య పుణ్యఫలం శృణు ॥
మాతృతః పితృత శ్చైవ లక్షకోటికులాన్వితః ।
కల్పత్రయే విష్ణుపదే తిష్ఠత్యేవ న సంశయః ॥
మృదైవ కురుతే యస్తు దేవతాయతనం నరః ।
యావత్పుణ్యం భవేత్తస్య తన్మే నిగదతశ్శృణు ॥
దివ్యదేహధరో భూత్వా విమానవరమాశ్రితః ।
కల్పత్రయే విష్ణుపదే తిష్ఠత్యేవ న సంశయః ।
కల్పత్రయం విష్ణుపదే స్థిత్వా బ్రహ్మపురం ప్రజేత్ ॥
కల్పద్వయం స్థితస్తత్ర పునః కల్పం వ సేద్దివి ।
తతస్తు యోగినామేవ కులే జాతో దయాన్వితః ॥
వైష్ణవం యోగమాస్థాయ ముక్తిం ప్రజతి శాశ్వతమ్ ।
దారుభిః కురుతే యస్తు తస్య స్యాద్ధ్వీగుణం ఫలమ్ ॥
త్రిగుణం చేష్టకాభిస్తు శిలాభిస్తచ్చతుర్గుణమ్ ।
స్ఫటికాభిశ్శిలాభిస్తు జ్ఞేయం దశగుణోత్తరమ్ ॥
తామ్రీభిస్తచ్ఛతగుణం హేమ్నా కోటిగుణం భవేత్ ।
దేవాలయం తటాకం వా గ్రామం వా పాలయేత్తు యః ॥
కర్తుః శతగుణం తస్య పుణ్యం భవతి భూపతే ।
దేవాలయస్య శుశ్రూషాం లేప సేచనమండనైః ॥
కుర్యాద్యస్సతతం భక్త్యా తస్య పుణ్యమనన్తకమ్ ।
వేతనాదిష్టతో వాపి పుణ్యకర్మ ప్రవర్తితాః ॥
తే గచ్ఛత్తి ధరాధారాః శాశ్వతం వైష్ణవం పదమ్ ।
తడాగర్ధఫలం రాజన్కాసారే పరికీర్తితమ్ ॥
కూ పే పాదఫలం జ్ఞేయం వాప్యాం పద్మాకరోన్మితమ్ ।
వాపీ శతగుణం ప్రోక్తం కుల్యాయాం భూపతే ఫలమ్ ॥
దృషద్భిస్తు ధనీ కుర్యాన్మృదా నిష్కించనో జనః ।
తయోః ఫలం సమానం స్యాదిత్యాహ కమలోద్భవః ॥
ధర్మరాజు పలికేను :- శివాలయమును కాని విష్ణ్వాలయమును స్వయముగా నిర్మించిననూ, నిర్మింప చేసినను అతను మాత్సవంశమున పితృవంశమున లక్ష కోట్లకులములతో మూడు కల్పములు విష్ణులోకమున నివసించును. సందేహములేదు. మట్టితో దేవాలయమును నిర్మించినవాడు దివ్యదేహమును ధరించి ఉత్తమవిమానమధిరోహించి మూడు కల్పములు విష్ణులోకమున నివసించి బ్రహ్మలోకమున కేగును. అచట రెండు కల్పములు నివసించి స్వర్గమును చేరి ఒక కల్పము నివసించి తరువాత యోగుల కులమున జన్మించి దయకలవాడై వైష్ణవయోగమును అవలంబించి శాశ్వతమైన ముక్తిని పొందును. చెక్కతో దేవాలయమును నిర్మించిన వానికి రెట్టింపు ఫలితము కలుగును. ఇటుకలతో నిర్మించిన మూడు రెట్లు ఫలము కలుగును. శిలలతో నిర్మించిన నాలుగు రెట్లు ఫలితము కలుగును. స్పటికశిలలతో నిర్మించిన పదిరెట్లధికముగా ఫలము లభించును. రాగితో నిర్మించిన నూరు రెట్లు ఫలితము, బంగారముతో నిర్మించినచో కోటిరెట్లధికముగా ఫలము కలుగును. దేవాలయమును కొని తటాకమును కొని గ్రామమును కొని పరిపాలించువానికి నిర్మించు మౌనికన్నా నూరురెట్లు ఫలితము కలుగును, దేవాలయమున నీరుచల్లి, అలికి ముగ్గులువేసి శుశ్రూషచేయువారికి కలుగు పుణ్యఫలమునంతయు వేతనము తీసుకొని కాని, ఇష్టముతో కాని పుణ్యకార్యములలో ప్రవర్తించువారు ఈ భూమీకి ఆధారభూతులై శాశ్వతమైన విష్ణులోకమును పొందేదరు. సరస్సును నిర్మించినచో తటాకమును నిర్మించుదానిలో సగము ఫలమును పొందును. కూపమును నిర్మించినచో నాలుగవ భాగము ఫలము కలుగును. దిగుడు బావి నిర్మించినచో పద్మసరస్సును నిర్మించిన ఫలము కలుగును. కాలువ నిర్మించినచో వాపికి నూరు రెట్లు ఫలము కలుగును. ధనవంతుడు రాళ్ళతో నిర్మించినను, దరిద్రుడు మట్టితో నిర్మించిననూ ఫలము సమానముగా కలుగునని బ్రహ్మ చెప్పెను.
దద్యాదాఢ్యస్తు నగరం హస్తమాత్రమకించనః ।
భువం తయోస్సమఫలం ప్రాహుర్వేదవిదో జనాః ॥
ధనాఢ్యః కురుతే యస్తు తడాగం ఫలసాధనమ్ ।
దరిద్రః కురుతే కూపం సమం పుణ్యం ప్రకీర్తితమ్ ॥
ఆశ్రమం కారయేద్యస్తు బహుజనూపకారకమ్ ।
స యాతి బ్రహ్మ భువనం కులత్రయసమన్వితః ॥
ధేనుర్వా బ్రాహ్మణో వాపి యో వా కో వాపి భూపతే ।
క్షణార్థం తస్య ఛాయాయాం తిష్ఠన్స్వర్గం నయత్యముమ్ ॥
ఆరామకారకా రాజన్దేవతాగృహకారిణః ।
తడాగగ్రామకర్తారః పూజ్యన్తే హరిణా సహా ॥
సర్వలోకోపకారార్థం పుష్పారామం జనేశ్వర ।
కుర్వతే దేవతార్థం వా తేషాం పుణ్యఫలం శృణు ॥
తత్ర యావన్తి వర్ణాని కుసుమాని భవని చ ।
తావద్వర్షాణి నాకస్థో మోదతే కులకోటిభిః ॥
ప్రాకారకారిణస్తస్య కంటకొవరణప్రదాః ।
ప్రయాన్తి బ్రహ్మణః స్థానం యుగానామేకసప్తతిమ్ ॥
తులసీరోపణం యే తు కుర్వతే మనుజేశ్వర ।
తేషాం పుణ్యఫలం రాజన్నదతో మే నిశామయ ॥
సప్తకోటికులైర్యుక్తో మాతృతః పితృతస్తథా ।
వ సేత్కల్పశతం సాగ్రం నారాయణపదం నృప ॥
ఊర్ధ్వపుండ్రధరో యస్తు తులసీమూలమృత్స్నయా ।
గోపికాచన్దనేనాపి చిత్రకూటమృదొపి వా ।
గంగామృత్తికయావ తస్య పుణ్యఫలం శృణు ॥
విమానవరమారూఢో గంధర్వాప్సరసాం గణైః ।
సంగీయామానచరితో మోదతే విష్ణుమందిరే ॥
పత్రాణి తులసీమూలాధ్యావన్తి పలితాని వై ।
తావన్తి బ్రహ్మహత్యాదిపాతకాని హాతాని చ ॥
తులస్యాం సేచయేద్యస్తు జలం చులుకమాత్రకమ్ ।
క్షీరోదవాసినా సార్థం వ సేదాచన్ద్రతారకమ్ ॥
దదాతి బ్రాహ్మణానాం యః కోమలం తులసీదళమ్ ।
స యాతి బ్రహ్మ సదనే కులత్రితయసంయుతః ॥
శాలగ్రామేఽర్పయేద్యస్తు తులస్యాస్తు దలాని చ ।
స వ సేద్విష్ణుభవమే యావదాభూతసంప్లవమ్ ॥
కంటకావరణం యస్తు ప్రాకారం వాపి కారయేత్ ।
సోఽప్యేకవింశతికులైరోదతే విష్ణుమందిరే ॥
యోర్చయేద్ధరిపాదాబ్జం తులస్యాః కోమలైర్దలైః ।
న తస్య పునరావృత్తిర్విష్ణులోకాన్న రేశ్వర ! ॥
ధనవంతుడు నగరమును, దరిద్రుడు ఒక మూర భూమిని దానము చేసినచో. వారిరువురికి సమానఫలము లభించును అని వేదపండితులు చెప్పేదరు. ఫలమునిచ్చు తటాకమును ధనవంతుడు నిర్మించినను, దరిద్రుడు కూపమును తవ్వించిననూ పుణ్యము సమానముగా లభించును. పలుప్రాణులకుపకరించు ఆశ్రమమును నిర్మించినవాడు మూడు తరముల వరకు బ్రహ్మలోకమును పొందును. ఆ యాశ్రమవృక్షచ్ఛాయలో ఒక ఆవుకొని, బ్రాహ్మణుడు కాని అరక్షణము నిలిచినచో కర్త దేహాంతమున స్వర్గమును పొందును. ఆరామమును నిర్మించిన వారు, దేవాలయమును నిర్మించిన వారు, తటాకమును గ్రామమును నిర్మించినవారు శ్రీహరితో సమానముగా పూజించబడుదురు. ప్రజలందరికొఱకు కాని దేవతల కొఱకు కాని పూలతోటను ఏర్పరచినవారు కోటికులముల వరకు ఆ తోటలో నున్న ఆకుల పండ్ల సంఖ్యలో అన్ని సంవత్సరములు స్వర్గములో నివసించును. ముళ్ళు బాధించనట్లు ఆ తోటలో ఆవరణమును నిర్మించినవారు, పూలతోటకు ప్రాకారమును నిర్మించినవారు డెబ్బది యొకటి యుగములు బ్రహ్మలోకమున నివసింతురు. తులసీ వృక్షమును నాటిన వారు ఏడు కోట్లకులములవరకు మాత్సవంశమున పితృవంశమున నుండువారితో నూరు కల్పములు నారాయణుని లోకమున నివసించును. తులసీ మూలమృత్తికతో కాని, గోపీ చన్దనముతో కాని, చిత్రకూట మృత్తికతో కాని గంగా మృత్తికతో కాని ఊర్థ్వపుండ్రమును ధరించినవారు గంధర్వాపరోగణములతో కలిసి గానము చేయబడుచు విష్ణు మందిరమున ఆనందింతురు. తులసీ మూలములనుండి ఎన్ని ఆకులు రాలుచుండునో అన్ని బ్రహ్మ హత్యాది పాతకములు నశించును. ఒక చుళుక మాత్రము జలమును తులసీమూలమున తడిపినచో సూర్యచంద్రులున్నంతవరకు శ్రీమహావిష్ణువుతో కలిసి యుండును. బ్రాహ్మణులకు తులసీ దళమును ఇచ్చినవారు మూడు తరముల వరకు బ్రహ్మ లోకమున నివసింతురు. తులసీదళములను శాలగ్రామమున అర్పించినవారు ప్రళయకాలము వరకు విష్ణు భవనమున నివసించును. తులసీ వృక్షమునకు ముళ్ళతీగ ఆవరణముగా, ప్రాకారము కాని చేయించినవారు ఇరువది యొక్కతరములు విష్ణులోకమున ఆనందింతురు. తులసీదళములతో శ్రీహరి పాదపద్మములను అర్చించినవారు విష్ణులోకమును చేరి శ్వాశ్వతముగా మరల తిరిగి రాక అచటనే నివసింతురు.
ద్వాదశ్యాం పౌర్ణమాస్యాం యః క్షీరేణ స్నాపయేద్దరిమ్ ।
కులాయుతయుతః సోఽపి మోదతే వైష్ణవే పదే ॥
ప్రస్థమాత్రేణ పయసా యః స్నాపయతి కేశవమ్ ।
కులాయుతాయుతయుతస్కోఽ పి విష్ణుపురే వసేత్ ॥
ఘృతప్రస్థేన యో విష్ణుం ద్వాదశ్యాం స్నాపయేన్నరః ।
కులకోటియుతో రాజనాయుజ్యం లభతే హరేః ॥
పంచామృతేన యః స్నానమేకాదశ్యాం తు కారయేత్ ।
విష్ణోః సాయుజ్యకం తస్య భవేతులశతాయుతైః ॥
ఏకాదశ్యాం పౌర్ణమాస్యాం ద్వాదశ్యాం వా నృపోత్తమ ।
నాలి కేరోదకైర్విష్ణుం స్నాపయేత్తత్ఫలం శృణు ॥
దశజన్మార్జితైః పా పైర్విముక్తో నృపసత్తమ ! ।
శతద్వయకులైర్యుక్తో మోదతే విష్ణునా సహ ॥
ఇక్షుతోయేన దేవేశం యస్స్నాపయతి భూపతే ! ।
కేశవం లక్ష పితృభిస్సార్థం విష్ణుపదం వ్రజేత్ ॥
పుష్పోదకేన గోవిన్దం తథా గంధోదకేన చ ।
స్నాపయిత్వా హరిం భక్త్యా వైష్ణవం పదమాప్నుయాత్ ॥
జలేన వస్త్రపూతేన యస్స్నాపయతి మాధవమ్ ।
సర్వపాపవినిర్ముక్తో విష్ణునా సహ మోదతే ॥
క్షీరాద్యైస్నాపయేద్యస్తు రవిసంక్రమణే హరిమ్ ।
స వ సేద్విష్ణుపదనే త్రిసప్తపురు షెస్సహ ॥
శుక్లపక్షే చతుర్ధశ్యామష్టమ్యాం పూర్ణిమా దినే ।
ఏకాదశ్యాం భానువారే ద్వాదశ్యాం పంచమీతిథౌ ॥
సోమసూర్యోపరా గే చ మన్వాదిషు యుగాదిషు ।
అర్దోదయే చ సూర్యస్య పుష్యార్కే రోహిణీ బుధే ॥
తథైవ శనిరోహిణ్యాం భౌమాశ్విన్యాం తథైవ చ ।
శనౌ భృగుమృగే చైవ భృగు రేవతిసంగమే ॥
తథా బుధానురాధాయాం శ్రవణార్కె తథైవ చ ।
తథా చ సోమశ్రవణే హస్తయుక్తే బృహస్పతౌ ॥
బుధాష్టమ్యాం బుధాషాఢే ఫుణ్యే చాన్యే దినే తథా ।
స్నాపయేత్పయసా విష్ణుం శాన్తిమాన్ వాగ్యతశ్శుచిః ॥
ఘృతేన మధునా వాపి దధ్ని వా తత్ఫలం శృణు ॥
సర్వయజ్ఞఫలం ప్రాప్య సర్వపాపవివర్జితః ।
వ సేద్విష్ణుపురే సార్థం త్రిసప్తపురుషైర్నృప ॥
తత్రైతైవ జ్ఞానమాసాద్య యోగినామపి దుర్లభమ్ ।
మోక్షమాప్నోతి నృపతే పునరావృత్తిదుర్లభమ్ ॥
ద్వాదశీతిథియందు పూర్ణిమాతిథి యందు పాలతో శ్రీహరిని స్నానము చేయించినచో పది వేల తరములతో విష్ణులోకమున ఆనందించును. ఒక గరిటెడు పాలతో శ్రీహరిని స్నానము చేయించినచో లక్షతరములతో విష్ణులోకమున నివసించును. ద్వాదశినాడు గరిటెడు నెయ్యితో శ్రీహరిని స్నానము చేయించినచో కోటితరములతో శ్రీహరి సాయుజ్యమును పొందును. ఏకాదశీ తిథిన పంచామృతముతో శ్రీహరిని స్నానము చేయించినచో పదిలక్షల తరములతో శ్రీహరి సాయుజ్యము లభించును. ఏకాదశి, పూర్ణిమ, ద్వాదశీతిథులలో నాలి కేర జలముతో శ్రీహరిని స్నానము చేయించినచో పదిజన్మలలో చేసిన పొపములు, తొలగి రెండువందల తరములతో శ్రీమహావిష్ణువుతో ఆనందించును. చెఱకు రసముతో శ్రీహరిని స్నానము చేయించినచో లకతరములతో విష్ణులోకమున నివసించును. పుష్పోదకముతోకాని, గంధోదకముతో కాని శ్రీహరిని స్నానము చేయించిన విష్ణులోకము లభించును. వస్త్రముచే వడపోసిన జలముచే శ్రీహరిని స్నానము చేయించినచో అన్ని పాపములు తొలగి శ్రీమహావిష్ణువుతో ఆనందించును. సూర్యసంక్రమణమున క్షీరాదులతో శ్రీహరిని స్నానము చేయించినచో ఇరువదియొక్కతరములతో శ్రీవిష్ణులోకమున నివసించును. శుద్దచతుర్ధశి యందు అష్టమీతిథి యందు పూర్ణిమాతిధి యందు ఏకాదశీతిథి యందు, ఆదివారము నందు, ద్వాదశీతిథి యందు పంచమీతిథి యందు సోమ సూర్యగ్రహణములలోను, మన్వాదియుగాది సమయమునందు, సూర్యుని అర్థోదయమున, సూర్యుడు పుష్యమీ నక్షత్రమున ఉన్నపుడు, బుధుడు రోహిణీ నక్షత్రమున నుండగా, శని రోహిణిలో, కుజుడు అశ్వినిలో, శని అశ్వనిలో, శుక్రుడు మృగశిరలో రేవతిలో, బుధుడు అనూరాధలో, సూర్యుడు శ్రవణములో, చంద్రుడు శ్రవణములో, బృహస్పతి హస్తలో ఉన్నప్పుడు, బుధాష్టమియందు, బుధాషాఢలో, ఇతర పుణ్యదినములలో శాంతి కలిగి వాజియమముతో శ్రీహరిని పొలతో స్నానము చేయించవలయును. నేయితో, తేనెతో, పెరుగుతో నైనను స్నానము చేయించినచో అన్నియజ్ఞములు ఆచరించిన ఫలమును పొంది, అన్ని పాపములనుండి విముక్తిని పొంది ఇరువది ఒకటి తరములతో విష్ణుపురమున నివసించి అచటనే జ్ఞానమును పొంది యోగులకు కూడా దుర్లభము పునరావృత్తిరహితమైన మోక్షమును పొందును.
కృష్ణపక్షే చతుర్థశ్యాం సోమవారే చ భూపతే ।
శివం సంస్నాప్య దుగ్గేన శివసాయుజ్యమాప్నుయాత్ ॥
నాలికేరోదకేనాపి శివం సంస్నాప్య భక్తితః ।
అష్టమ్యామిందువారే వా శివసాయుజ్యమశ్నుతే ॥
శుక్లపక్షే చతుర్ధశ్యామష్టమ్యాం వాపి భూపతే ।
ఘృతేన మధునా స్నాప్య శివం తత్సామ్యతాం వ్రజేత్ ॥
తిలతైలేన సంస్నాప్య విష్ణుం వా శివమేవ చ ।
స యాతి తత్తతారూప్యం పితృభిస్సహ సప్తభిః ॥
శివమిక్షుర సేనాపి యస్స్నాపయతి భక్తిత ।
శివలోకే వసేత్కల్పం స సప్తపురుషైస్సహ ॥
ఘృతేన స్నాపయేల్లింగముత్థానే ద్వాదశీదినే ।
క్షీరేణ వా మహాభాగ తత్ఫలం శృణు మద్గిరా ॥
జన్మాయుతకృతైః పాపై ర్విముక్తో మనుజో నృప ।
కోటిసంఖ్యం సముద్ధృత్య స్వకులం శివతాం వ్రజేత్ ॥
సంపూజ్య గన్దకుసుమైర్విష్ణుం విష్ణుతిథే నృప ।
జన్మాయుతార్జితైః పాపైర్ముక్తో వ్రజతి తత్పదమ్ ॥
పద్మపుష్పేణ యో విష్ణుం శివం వా పూజయేన్నరః ।
స యాతి విష్ణుభవనం కులకోటిసమన్వితః ॥
హరిం చ కేతకీపుష్పైశ్శివం ధత్తూరజెర్నిశి ।
సంపూజ్య పాపనిర్ముక్తో వ సేద్విష్ణుపురే యుగమ్ ॥
హరిం తు చంపకైః పుష్పైర్కపు ష్పైశ్చ శంకరమ్ ।
సమభ్యర్చ్య మహారాజ తత్తత్సాలోక్యమాప్నుయాత్ ॥
శంకరస్యాథవా విప్లోర్ఘృతయుక్తం చ గుగ్గులుమ్ ।
దత్వా ధూపే నరో భక్త్యా సర్వపాపైః ప్రముచ్యతే ॥
తిలతైలాన్వితం దీపం విష్ణోర్వా శంకరస్య వా ।
దత్త్వా నరః సర్వకామాన్సంప్రాప్నోతి నృపోత్తమ ॥
ఘృతేన దీపం యో దద్యాచ్ఛంకరాయాథ విష్ణవే ।
స ముక్తస్సర్వపాపేభ్యో గంగాస్నానఫలం లభేత్ ॥
గ్రామ్యేణ వాపి తైలేన రాజన్నన్యేన వా పునః ।
దీపం దత్వా మహావిష్ణోః శివస్యాపి ఫలం శృణు ॥
సర్వపాపవినిర్ముక్తః సర్వేశ్వర్యసమన్వితః ।
తత్తత్సాలోక్యమాప్నోతి త్రిస్సప్తపురుషాన్విత ॥
యద్యదిష్టతమం భోజ్యం తత్తదీశాయ విష్ణవే ।
దత్త్వా తత్తత్పదం యాతి చత్వారింశత్కులాన్వితః ॥
యద్యదిష్టతమం వస్తు తత్తద్వీప్రాయ దాపయేత్ ।
స యాతి విష్ణుభవనం పునరావృత్తిదుర్లభమ్ ॥
కృష్ణపక్ష చతుర్దశీ తిథి యందు సోమవారమునాడు శివుని పాలతో అభి షేకము చేసినచో శివసాయుజ్యమును పొందును. అష్టమీతిథి యందు కొని, సోమవారమునాడు కాని తొలి కేర జలముచే శివాభి షేకము చేసిననూ శివసాయుజ్యమును పొందును. శుక్లపక్ష చతుర్దశినాడు, అష్టమినాడు నేతితోకాని తేనేతో కాని-శివాభి షేకము చేసినచో శివసామ్యమును పొందును. నువ్వుల నూనెతో శివుని కాని విష్ణువును కాని అభి షేకము చేసినచో ఏడు తరములతో శివవిష్ణు సారూప్యమును పొందును. చెరుకు రసముతో శివుని స్నానము చేయించినచో ఏడు తరములతో శివలోకమున ఒక కల్పము నివసించును. ఉత్థాన ద్వాదశినాడు పాలతో కాని నేతితో కాని అభి షేకము చేసినచో "పది వేల జన్మలలో చేసిన పాపములనుండి విముక్తుడై కోటి తరములతో శివసామ్యమును పొందును. ఏకాదశితిథినాడు గంధపుష్పములతో శ్రీవిష్ణువును ఆరాధించి పదివేల జన్మలలోని పాపముల నుండి విముక్తుడై శ్రీవిష్ణుపదమును పొందును. పద్మములతో శివుని కాని శ్రీమహావిష్ణువును కొని పూజించినచో కోటి తరములతో విష్ణుభవనమును చేరును. శ్రీహరిని మొగిలి పుష్పములతో, శివుని ఉమ్మేంత పూవులతో రాత్రిపూట పూజించినచో పాపములు నశించి శ్రీవిష్ణు నగరమున ఒక యుగమున నివసించునుసం పెంగ పూలతో శ్రీహరిని, జిల్లేడు పూలతో శంకరుని పూజించి హరి శివసాలోక్యములను పొందును. శంకరునికి కాని విష్ణువునకు కాని నేతితో సాంబ్రాణి ధూపమును వేసినచో అన్ని పాపములనుండి విముక్తుడగును. నువ్వుల నూనెతో దీపమును శ్రీమహావిష్ణువునకు కాని శంకరునికి కాని అర్పించినచో అన్ని కోరికలు తీరును. శంకరునికి కాని శ్రీమహావిష్ణువునకు కాని నేతితో దీపము పెట్టినచో అన్ని పాపముముల నుండి విముక్తుడై గంగా స్నానఫలమును పొందును. గ్రామ్యములైన ఏ నూనెలతో నైనను శ్రీమహావిష్ణువునకు, శివునికి దీపమును వెలిగించినచో అన్ని పాపముల నుండి విముక్తుడై సర్వేశ్వర్యములతో కూడి విష్ణు శివసాలోక్యములను పొందును. అత్యంతము ఇష్టమైన భోజనమును విష్ణువునకు కాని శివునికి కానీ అర్పించి విష్ణులోకమును శివలోకమును చేరును. అత్యంతము ఇష్టమైన వస్తువును బ్రాహ్మణునకు దానము చేసినచో పునరావృత్తిరహితమైన వైకుంఠమును చేరును.
భ్రూణహా స్వర్ణదానేన శుద్దో భవతి భూపతే ।
అన్నతోయసమం దానం న భూతం న భవిష్యతి ॥
అన్నదః ప్రాణదః ప్రోక్తః ప్రాణదశ్చాపి సర్వదః ।
సర్వదానఫలం యస్మాదన్నదస్య నృపోత్తమ ! ॥
అన్నదో బ్రహ్మసదనం యాతి వంశాయుతాన్వితః ।
న తస్య పునరావృత్తిరీతి శాస్త్రేషు నిశ్చితమ్ ॥
సద్యస్తుష్టికరం జ్ఞేయం జలదానం యతోఽధికమ్ ।
అన్నదానాన్నప శేష్ఠ నిర్దిష్టం బ్రహ్మవాదిభిః ॥
మహాపాతకయుక్తో వా యుక్తో వాప్యుపపాతకై ।
జలదో ముచ్యతే తేభ్య ఇత్యాహ కమలోద్భవః ॥
శరీరమన్నజం ప్రాహుః ప్రాణాన్యున్నజాన్విదుః ।
తస్మాదన్నప్రదో జ్ఞేయః ప్రాణదః పృథివీపతే ॥
సద్యస్తుష్టికరం దానం సర్వకామఫలప్రదమ్ ।
తస్మాదన్నసమం దానం నాస్తి భూపాల భూతలే ॥
అన్నదస్య కులే జాతా ఆపహస్రం నృపోత్తమ నరకం తే న పశ్యన్తి తస్మాదన్నప్రదో వరః ॥
పాదాభ్యంగం భక్తియుక్తో యోఽతిథేః కురుతే నరః ।
స స్నాతః సర్వతీర్ధేషు గంగాస్నానపురస్సరమ్ ॥
తైలాభ్యంగం మహారాజు బ్రాహ్మణానాం కరోతి యః ।
సస్నాతోఽష్టశతం సాగ్రం గంగాయాం నాత్ర సంశయః ॥
రోగితాన్భ్రాహ్మణాన్యస్తు ప్రేమ్ణా రక్షతి రక్షకః ।
స కోటికులసంయుక్తో వసేద్భ్రహ్మపురే యుగమ్ ॥
యో రక్షేత్పృథివీపాల ! రంకం వా రోగిణం నరం ।
తస్య విష్ణుః ప్రసన్నాత్మా సర్వాన్కామాన్ప్రయచ్ఛతి ॥
మనసా కర్మణా వాచా యో రక్షేదామయాన్వితమ్ ।
సర్వాన్కామానవాప్నోతి సర్వపాపవివర్జితః ॥
గర్భస్థ శిశువును చంపినవాడు సువర్ణమును దానము చేసినచో ఆ పాపము తొలగి పరిశుద్దుడగును. అన్నదానముతో జలదానముతో సమానమైన దానము " ఇదివరకు లేదు. ఇకముందుండబోదు. అన్నదానము చేసినవాడు ప్రాణదానము చేసిన వానితో సమానుడు. ప్రాణదానము చేసినవాడు అన్నిదానములు చేసిన వానితో సమానుడు. కావున అన్నదానము చేసినవాడు సర్వదానములు చేసిన వాని ఫలితమును పొందును. అన్నదానమును చేసినవాడు తన పదివేల మంది వంశస్థులతో బ్రహ్మ లోకమును చేరును. మరల తిరిగి రాడని శాస్త్రములు నిశ్చయించినవి. జలదానము వెంటనే తృప్తి కలిగించునది కావున అన్నదానము కం టే జలదానము ఉత్తమమని బ్రాహ్మవాదులు నిర్దేశించిరి. మహాపాతకములతో కూడియున్నను ఉపపాతకములతో కూడియున్ననూ జలదానము చేసినవాడు విముక్తుడగునని బ్రహ్మ చెప్పెను. శరీరము అన్నము వల్లనే పుట్టును. ప్రాణములు కూడా అన్నము వల్లనే కలుగును. కావున అన్నదానము చేసిన వాడు ప్రాణదానము చేసిన వాడే యగును. అన్నదానము వెంటనే తృప్తి కలిగించునది. అన్ని కోరికలను తీర్చునది. కావున ఈ భూలోకమున అన్నదానముతో సమానమైన దానము మరియొకటి లేదు. అన్నదానము చేసిన వారి కులములో పుట్టిన వారు వేయి. తరముల వరకు నరకమును చూడరు. కావున అన్నదానము చేసినవాడు సర్వ శ్రేష్ఠుడు. అతిథికి పొదప్రక్షాళనము చేసినవాడు గంగాస్నానముతోపాటు అన్ని పుణ్యతీర్ణములలో స్నానముచేసిన ఫలము పొందును.. బ్రాహ్మణులకు తైలాభ్యంగనమును చేయించినవాడు గంగలో నూట ఎనిమిది స్నానములు చేసినవాడగును. వ్యాధిగ్రస్తులైన బ్రాహ్మణులను ప్రేమతో రక్షించువాడు కోటితరములతో బ్రహ్మ లోకమున నివసించును. పేదవానిని కాని రోగిని కాని రక్షించువానికి విష్ణువు ప్రసన్నుడై అన్ని కోరికలను తీర్చును. రోగముతో నున్న వానిని మనసుతో వాక్కుతో కర్మతో త్రికరణ శుద్ధిగా రక్షించువాడు అన్ని పాపముల నుండి విముక్తుడై అన్ని కోరికలను నెరవేర్చుకొనును.
యో దదాతి మహీపాల నివాసం బ్రాహ్మణాయ వై ।
తస్య ప్రసన్నో దేవేశః స్వలోకం సంప్రయచ్ఛతి ॥
బ్రాహ్మణాయ బ్రహ్మవిదే యో దద్యాద్గాం పయస్వినీమ్ ।
స యాతి బ్రహ్మ సదనమన్యేషామతిదుర్లభమ్ ॥
అన్వేభ్యః ప్రతిగృహ్యాపి యో దద్యాద్గాం పయస్వినీమ్ ।
తస్య పుణ్యఫలం వక్తుం నాహం శక్తోఽస్మి పండిత ॥
కపిలాం వేదవిదు షే యో దదాతి పయస్వినీమ్ ।
స ఏవ రుద్రో భూపాల సర్వపాపవివర్జితః ॥
విప్రాయ వేదవిదు షే యో దద్యాదుభయతో ముఖీమ్ ।
యస్తస్య పుణ్యం సంఖ్యాతుం న శక్తోఽబ్ధశతైరపి ॥
తస్య పుణ్యఫలం రాజన్ శృణు వక్ష్యామి తత్త్వతః ।
ఏకతః క్రతవస్సర్వే సమగ్రవరదక్షిణాః ॥
ఏకతో భయభీతస్య ప్రాణినః ప్రాణరక్షణమ్ ।
సంరక్షతి మహీపాల యో విప్రం భయవిహ్వలమ్ ॥
స స్నాతః సర్వతీర్ధేషు సర్వయజ్ఞేషు దీక్షితః ।
వస్త్రదో రుద్రభవనం కన్యాదో బ్రహ్మణః పదమ్ ॥
హేమదో విష్ణుభవనం ప్రయాతి స్వకులాన్వితః ।
యస్తు కన్యామలంకృత్య దదాత్యధ్యాత్మ వేదినే ॥
శతవంశసమాయుక్తస్సవ్రజేద్భ్రహ్మణః పదమ్ ।
కార్తి క్యాం పౌర్ణమాస్యాం వా ఆషాఢ్యం వాపి భూపతే ॥
వృషభం శివతుష్ఠ్యర్థం ఉత్సృజేత్తత్ఫలం శృణు ।
సప్తజన్మార్జితైః పాపై ర్విముక్తో రుద్రరూపభాక్ ॥
కులసప్తతిసంయుక్తో రుద్రేణ సహ మోదతే ।
శివలింగాంకితం కృత్వా మహిషం యస్సముత్ప్సజేత్ ॥
న తస్య యాతనాలోకో భవేన్నృపతిసత్తమ ।
తామ్బూలదానం యః కుర్యాచ్ఛక్తితో నృపసత్తమః ॥
తస్య విష్ణుః ప్రసన్నాత్మా దదాత్యాయుర్యశశ్శ్రియమ్ ।
క్షీరదో ఘృతద శ్చైవ మధుదో దధిదస్తథా ॥
దివ్యాబ్ధాయుతపర్యన్తం స్వర్గలోకే మహీయతే ।
ప్రయాతి బ్రహ్మసదనమిక్షు దాతా నృపోత్తమ ॥
గన్దదః పుణ్యఫలదః ప్రయాతి బ్రహ్మణః పదమ్ ।
గుడేక్షురసద శ్చైవ ప్రయాతి క్షీరసాగరమ్ ॥
బ్రాహ్మణునకు గృహదానము చేసిన వానికి శ్రీహరి ప్రసన్నుడై తన లోకమునిచ్చును. వేదాధ్యయనపరుడైన బ్రాహ్మణునకు పాలిచ్చు ఆవును దానము చేసినవాడు ఇతరులకు దుర్లభమైన బ్రహ్మలోకమున కేగును. తన వద్ద లేనిచో ఇతరుల నుండి తీసుకొనైనను పాలిచ్చు ఆవును బ్రాహ్మణునకు దానము చేసిన దానికి కలుగు పుణ్యఫలమును నేను చేప్పజాలను. వేదములు తెలిసిన బ్రాహ్మణునికి కపిలగోవును దానము చేసినవాడు అన్ని పాపములనుండి విముక్తుడై స్వయముగా రుద్రుడే యగును. వేదములు చక్కగా తెలిసిన బ్రాహ్మణునికి ప్రసవించుచున్న ఆవును దానము చేసిన వానికి కలుగు ఫలమును నూరు సంవత్సరములలో కూడా లెక్కించలేరు. సంపూర్ణముగా ఉత్తమ దక్షిణలిచ్చు అన్ని యాగములు, ప్రాణభయముతో నున్న ప్రాణి ప్రాణములను కాపాడుట ఈ రెంటి వలన కలుగు ఫలితము ప్రసవించు ఆవును దానము చేసిన వానికి కలుగును. భయముతో వణుకుచున్న బ్రాహ్మణుని రక్షించిన వానికి సర్వతీర్థస్నానఫలము, సర్వయజ్ఞదీక్షాఫలము కలుగును. వస్త్రదానము చేసిన వానికి రుద్రలోకము, కన్యాదానము చేసిన వానికి బ్రహ్మ లోకము కలుగును. బంగారము నిచ్చినవాడు విష్ణులోకమును పొందును. అలంకరించిన కన్యను అధ్యాత్మజ్ఞానము కలవానికి దానము చేసిన వాడు నూరుతరములతో బ్రహ్మలోకమున కేగును. కార్తీక పూర్ణిమనాడు, ఆషాడ పూర్ణిమనాడు శివుని ప్రీతి కొఱకు వృషభమును విడచినవాడు ఏడు జన్మల పాపములనుండి విముక్తుడై రుద్రరూపమును పొంది డెబ్బది తరములతో రుద్రునితో కలిసి ఆనందించును. శివలింగ చిహ్నమును చిత్రించి మహిషమును వదలిన వానికి యాతనా లోకము (నరకము) కలుగదు. తాంబూల దానము చేసిన దానికి శ్రీహరి ప్రసన్నుడై ఆయుష్యమును కీర్తిని సంపదను ఇచ్చును. పొలు పెరుగు నెయ్యి తేనెలను దానము చేయువారు పదివేల దీవ్యవర్షములు స్వర్గమున నివసింతురు. చెరుకును దానము చేయువారు బ్రహ్మలోకమును చేరును. గంధమును పుణ్యఫలమును దానము చేయువారు బ్రహ్మలోకమును చేరుదురు. గుడమును చెరుకు రసమును దానము చేయువారు క్షీరసాగరమునకేగెదరు.
భటానాం జలదో యాతి సూర్యలోకమనుత్తమమ్ ।
విద్యాదానేన సాయుజ్యం మాధవస్య వ్రజేన్నరః ॥
విద్యాదానం మహీదానం గోదానం చోత్తమోత్తమమ్ ।
నరకాదుద్ధరన్త్యేవ జపవాహనదోహానాత్ ॥
సర్వేషామపి దానానాం విద్యాదానం విశిష్యతే ।
విద్యాదానేన సాయుజ్యం విష్ణోర్యాతి నృపోత్తమ ॥
నరస్త్విన్దనదానేన ముచ్యతే హ్యుపపాతకైః ।
శాలగ్రామశిలాదానం మహాదానం ప్రకీర్తితమ్ ॥
యద్దత్వా మోక్షమాప్నోతి లింగదానం తథా స్మృతమ్ ।
బ్రహ్మాండకోటీదానేన యత్ఫలం లభతే నరః ॥
తత్పలం సమవాప్నోతి లింగదానాన్న సంశయః ।
శాలగ్రామశిలాదానే తతోఽపి ద్విగుణం ఫలమ్ ॥
శాలగ్రామశిలారూపీ విష్ణు రేవతి విశ్రుతః ।
యో దదాతి నరో దానం గృహేషు మహతాం ప్రభో ॥
గంగాస్నానఫలం తస్య నిశ్చితం నృప జాయతే ।
రత్నాన్వితసువర్ణస్య ప్రదానేన నృపోత్తమ ॥
భుక్తిం ముక్తిమవాప్నోతి మహాదానం యతస్స్మృతమ్ ।
నరో మాణిక్యదానేన పరం మోక్షమవాప్నుయాత్ ॥
ధ్రువలోకమవాప్నోతి వజ్రదానేన మానవః ।
స్వర్గం విద్రుమదానేన రుద్రలోకమవాప్నుయాత్ ॥
ప్రయాతి యానదానేన ముక్తా దానేన చైందవమ్ ।
వైడూర్యదో రుద్రలోకం పుష్పరాగప్రదస్తథా ॥
పుష్పరాగప్రదానేన సర్వత్ర సుఖమశ్నుతే ।
అశ్వదో హ్యశ్వసాన్నిధ్యం చిరం వ్రజతి భూమిప ॥
గజదానేన మహతా సర్వాన్కామానవాప్నుయాత్ ।
ప్రయాతి యానదానేన స్వర్గం స్వర్యానమాస్థితః ॥
మహిషీదో జయత్యేవ హ్యాపమృత్యుం న సంశయః ।
గవాం తృణప్రదానేన రుద్రలోకమవాప్నుయాత్ ॥
వారుణం లోకమాప్నోతి మహీశ లవణప్రదః ।
స్వాశ్రమాచారనిరతా స్సర్వభూతహితే రతాః ॥
అదాంభికా గతాసూయా ప్రయాంతి బ్రహ్మణః పదమ్ ।
పరోపదేశనిరతా వీతరాగా విమత్సరాః ॥
హరిపాదార్చనరతాః ప్రయాత సదనం హరేః ।
సత్సంగాస్థిదనిరతా సత్కర్మసు సదోద్యతాః ॥
పరాపవాదవిముఖా ప్రయాన్తి హరిమందిరమ్ ।
నిత్యం హితకరా యే తు బ్రాహ్మణేషు చ గోషు చ ॥
పరస్త్రీసంగవిముఖా న పశ్యన్తి యమాలయమ్ ।
జితేన్ద్రియా జితాహారా గోషు క్షాన్తాస్సులినః ॥
బ్రాహ్మణేషు క్షమాశీలాః ప్రయాన్తి భవనం హరేః ।
అగ్నిశుశ్రూషవశ్చైవ గురుశుశ్రూషకాస్తథా ॥
పతిశుశ్రూషణరతా న వై సంసృతిభాగినః ।
సదా దేవార్చనరతా హరినామపరాయణాః ॥
ప్రతిగ్రహనివృత్తాశ్చ ప్రయాంతి పరమం పదమ్ ।
అనాథం విప్రకుణపం యే ద హేయుర్నృపోత్తమ ।
అశ్వ మేధసహస్రాణాం ఫలమశ్నువతే సదా ॥
రాజ భటులకు మంచినీరిచ్చిన వారు సూర్యలోకమును పొందును. విద్యాదానము చేసినవారు హరి సాయుజ్యమును పొందెదరు. విద్యాదానము, భూదానము, గోదానము పరమోత్తమములు. కావున నరకమును తప్పించును. అన్ని దానములలో విద్యాదానము విశిష్టమైనది. విద్యాదానముతో విష్ణు సాయుజ్యమును పొందును. వంట చెరకును దానము చేసినచో ఉపపాతకములనుండి విముక్తి లభించును. శాలగ్రామశిలాదానము మహాదానమని చెప్పబడుచున్నది. కావున శాలగ్రామదానమును చేసిన వారు మోక్షమును పొందెదరు. లింగదానమును చేసిన వారు కోటిబ్రహ్మాండములను దానము చేసిన వారికంటే రెట్టింపు ఫలమును పొందెదరు. శాలగ్రామదానమును చేసినవారు లింగదానమునకు రెట్టింపు ఫలమును పొందెదరు. శాలగ్రామ శిలారూపమున నున్నది. శ్రీమహావిష్ణువేనని ప్రసిద్ధి కలదు. కావున ఇంటిలో దానము చేసిన వారు గంగా స్నాన ఫలమును పొందును. రత్నములతో కూడిన బంగారమును దానము చేయుట మహాదానము కావున ఆ దానమును చేసిన వారు భోగమును మోక్షమును పొందెదరు. మాణిక్యదానముతో మోక్షమును పొందును. వజ్రదానముతో ధ్రువలోకమును పొందును. పగడమును దానము చేసినచో స్వర్గమును, వాహనమును దానము చేసినచో రుద్రలోకమును, ముత్యములను దానము చేసినచో చంద్రలోకమును, వైడూర్యదానమున రుద్రలోకమును పొందెదరు. పుష్పరాగ దానముతో ఇహపరములలో సుఖమును పొందెదరు. అశ్వదానమున అశ్వలోకమును, గజదానమున సర్వకామములను పొందును. వాహనమును దానము చేసినచో దివ్యవిమానమునధిరోహించి స్వర్గమును పొందును, గేదెను దానము చేసిన వారు అపమృత్యువును జయించును. గోవులకు తృణము నొసగిన వారికి రుద్రలోకము లభించును. లవణ దానముచే వరుణలోకమును పొందెదరు. తమ తమ ఆశ్రమాచారములలో నుండువారు అన్ని ప్రాణుల హితమును కోరువారు, డంబాచారములు లేనివారు, అసూయ తొలగినవారు బ్రహ్మ లోకమును పొందెదరు. ఇతరులకు మంచిని ఉపదేశించువారు, రాగములేనివారు, మాత్సర్యము తొలగినవారు, శ్రీహరి పాదములను అర్చించువారు శ్రీహరి లోకమును పొందెదరు. సజ్జనులతో కలిసి యుండవలయునని అభిలషించువారు, సత్కర్మలను చేయువారు ఇతరుల పై అపవాదు వేయనివారు శ్రీహరి మందిరమును పొందెదరు. బ్రాహ్మణులకు, గోవులకు ఎపుడూ హితమునే చేయువారు, పరస్త్రీ సంగమమును కోరని వారు యమలోకమును చూడరు. ఇంద్రియ జయము, ఆహారజయము కలవారు, గోవుల విషయమున క్షమాపరులు, సౌశీల్యము కలవారు, బ్రాహ్మణుల విషయమున క్షమాశీలురు శ్రీహరి లోకమును చేరెదరు. అగ్నిని, గురువులను, భర్తను సేవించువారలు సంసారమున బడరు. ఎపుడూ దైవార్చనను, కోరువారు హరినామ సంకీర్తనమును చేయువారు, ఎవరినుండి దేనిని గ్రహించనివారు పరమపదమును పొందెదరు. దిక్కులేని బ్రాహ్మణ శవమును దహనము చేసిన వారికి వేయి అశ్వమేధయాగముల ఫలము లభించును.
పత్రైః పుష్పైః ఫలైర్వాపి జులైర్వా మనుజేశ్వర ॥
పూజయా రహితం లింగమర్చయేత్తత్ఫలం శృణు ।
అప్సరోగణగంధర్వైస్తూయమానో విమానగః ॥
ప్రయాతి శివసాన్నిధ్యమిత్యాహ కమలోద్భవః ।
చులుకోదకమాత్రేణ లింగం సంస్నాప్య భూమిప ॥
లక్షాశ్వమేధజం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః ।
పూజయా రహితం లింగం కుసుమైర్యోఽర్చయేత్సుధీః ॥
అశ్వమేధాయుతఫలం భవేత్తస్య జనేశ్వర ! ।
భక్ష్యర్భోజ్యెః ఫలైర్వాపీ శూన్యం లింగం ప్రపూజ్య చ ॥
శివసాయుజ్యమాప్నోతి పునారావృత్తివర్జితమ్ ।
పూజయా రహితం విష్ణుం యోర్చయేదరవంశజ ॥
జలేనాపి స సాలోక్యం విష్ణోర్యాతి నరోత్తమ ।
దేవతాయతనే యస్తు కుర్యాత్సంమార్జనం సుధీః ॥
యావత్పాంసుయుగావాసం వైష్ణవే మందిరే లభేల్ ।
కీర్ణం స్ఫటికలింగం తు యస్సందధ్యాన్నపోత్తమ ॥
శతజన్మార్జితైః పా పైర్ము చ్యతే స తు మానవః ।
యస్తు దేవాలయే రాజన్న పి గోచర్మమాత్రకమ్ ॥
జలేన సించేద్భూభాగం సోఒపి స్వర్గం లభేన్నరః ।
గంధోదకేన యస్సించేద్దేవతాయతనే భువమ్ ॥
యావత్కణానుకల్పం తు స తి పేద్దేవసన్నిధౌ ।
మృదా ధాతువికారైర్వా యో లిం పేద్దేవతాగృహమ్ ॥
స కోటికులముద్ధృత్య యాతి సామ్యం మధుర్విషః ।
శిలాచూర్ణేన యో మర్త్యో దేవాగారం తు లేపయేత్ ॥
స్వస్తికదీని వా కుర్యాత్తస్య పుణ్యమనన్తకమ్ ।
యః కుర్యాద్దీపరచనాం దేవతాయతనే నృప ॥
తస్య పుణ్యం ప్రసంఖ్యాతుం నోత్స హేఽబ్దశతైరపి ।
అఖండ దీపం యః కుర్వాద్విష్ణోర్వా శంకరస్య చ ॥
క్షణే క్షణేశ్వమేధస్య ఫలం తస్య న దుర్లభమ్ ।
అర్చితం శంకరం దృష్ట్యా విష్ణుం వాపి నమేత్తు యః ॥
స విష్ణుభవనం ప్రాప్య మోదతే చ యుగాయుతమ్ ।
దేవ్యాః ప్రదక్షిణామేకాం సప్తసూర్యస్య భూమిప ॥
తిస్రో వినాయకస్యాపి చతస్రో విష్ణుమందిరే ।
కృత్వా తత్తద్గృహాం ప్రాప్య మోదతే యుగలక్షకమ్ ॥
యో విష్ణోర్భక్తి భావేన తథైవ గోద్విజస్య చ ।
ప్రదక్షిణాం చరేత్తస్య హ్యశ్వ మేధః పదే పదే ॥
కాశ్యాం మా హేశ్వరం లింగం సంపూజ్య ప్రణమేత్తు యః ।
న తస్య విద్యతే కృత్యల సంసృతిర్నైవ జాయతే ॥
శివం ప్రదక్షిణం కృత్వా సవ్యేనైవ విధానతః ।
నరో న చ్యవతే స్వర్గాచ్ఛంకరస్య ప్రసాదతః ॥
పూజలులేని లింగమును పత్రములతో ప్పుములతో ఫలములతో జలముతో పూజినంచివారు దివ్య విమానము నధిరోహించి గంధర్వాపురోగణములచే స్తుతించబడుచు శివసాన్నిధ్యమును చేరెదరని బ్రహ్మ చెప్పియుండెను. చారెడు నీటితో శివలింగమునకు అభి షేకమును చేసిన వారికి లక్షాశ్వమేధయాగముల ఫలము లభించి తీరును. సంశయముతో పనిలేదు. పూజలులేని శివలింగమును పుష్పములతో పూజించిన వారికి పది వేల అశ్వమేధయాగముల ఫలితము లభించును. భక్ష్యభోజ్యఫలములతో పూజలులేని శివలింగమును పూజించినవారికి పునరావృత్తిరహితమైన శివలోకము లభించును. పూజలులేని శ్రీహరిని జలముతో పూజించిననూ విష్ణుసాలోక్యమును పొందును. దేవాలయమున మార్జనము చేసినచో ధూళిరేణువుల సంఖ్యగల సంవత్సరములు విష్ణులోకమున నివసించును. భిన్నమైన స్పటిక లింగమును సంధానము చేసినవారు నూరు జన్మల పాపములనుండి విముక్తడగును. దేవాలయమున గో చర్మమాత్రమైనను భూమిని నీటితో చల్లి తడిపినచో స్వర్గమును పొందును. దేవాలయమున గంధోదకమును చల్లినచో తడిసిన ధూళికణముల సంఖ్య గల సంవత్సరములు దేవలోకమున నివసించును. మట్టితో కాని, రంగురంగుల ధాతువులచే కాని దేవాలయమును అలికినచో కోటి తరములనుద్దరించి విష్ణుసామ్యమును పొందెదరు. దేవాలయమున ముగ్గులు దిద్దినచో, స్వస్తికాదులను చిత్రించినచో వారికి లభించేడు పుణ్యము అనంతము. దేవాలయమున దీపమునుంచిన వాని పుణ్యమును నూరు సంవత్సరములలో కూడా లేక్కించలేము. విష్ణువునకు కాని, శంకరునకు కాని అఖండదీపమునుంచిన వారికి ప్రతిక్షణము అశ్వమేధయాగము చేసిన ఫలము లభించును. పూజించిన శంకరుని కాని, విష్ణువును కొని చూచి నమస్కరించినవారు శ్రీ విష్ణులోకమును చేరి మహావిష్ణువుతో కలిసి ఆనందింతురు. దేవికి ఒక ప్రదక్షిణమును, సూర్యునికి ఏడు ప్రదక్షిణములును, వినాయకునికి మూడు ప్రదక్షిణములు, విష్ణువునకు నాలుగు ప్రదక్షిణములను చేసి, వారివారి లోకములను చేరి లక్షయుగములు ఆనందింతురు. భక్తి భావముతో విష్ణువునకు, గోవునకు, బ్రాహ్మణులకు ప్రదక్షిణములను చేసినవారికి అశ్వమేధయాగఫలము లభించును. కాశీలోని మహేశ్వర లింగమును పూజించి నమస్కరించిన వారికి కర్మ, సంసారము ఉండదు. యథావిధిగా సవ్యముగా శివునికి ప్రదక్షిణము చేసినవారు శివుని అనుగ్రహము వలన స్వర్గమునుండి పతనమును పొందరు.
స్తుత్వా స్తోత్రైర్జగన్నాథం నారాయణమనామయమ్ ।
సర్వాన్కామానవాప్నోతి మనసా యద్యదిచ్ఛతి ॥
దేవతాయతనే యస్తు భక్తియుక్తః ప్రనృత్యతి ।
గాయతే వా స భూపాల రుద్రలో కే చ ముక్తి భాక్ ॥
యే తు వాద్యం ప్రకుర్వన్తి దేవతాయతనే నరాః ।
తే హంసయానమారూఢ ప్రజన్తి బ్రహ్మణః పదమ్ ॥
కరతాలం ప్రకుర్వన్తి దేవతాయతనే తు యే ।
తే సర్వపాపనిర్ముక్తా విమానస్థా యుగాయుతమ్ ॥
దేవతాయతనే యే తు ఘంటానాదం ప్రకుర్వతే ।
తేషాం పుణ్యం నిగదీతుం న సమర్థశ్శివస్స్వయమ్ ॥
భేరీమృదంగపటహమురజైశ్చ సడిండిమైః ।
సంప్రీణయన్తి దేవేశం తేషాం పుణ్యఫలం శృణు ॥
దేవ స్త్రీగణసంయుక్తాః సర్వకామైః సమర్చితాః ।
స్వర్గలోకమనుప్రాప్య మోదన్తే కల్పపంచకమ్ ॥
దేవతామందిరే కుర్వన్నరః శంఖరవం నృప ।
సర్వపాపవినిర్ముక్తో విష్ణునా సహ మోదతే ॥
తాలకాంస్యాదినినదం కుర్వన్విష్ణుగృహే నరః ।
సర్వపాపవినిర్ముక్తో విష్ణులోకమవాప్నుయాత్ ॥
యో దేవస్సర్వదృగ్విష్ణుర్జానరూపీ నిరంజనః ।
సర్వధర్మఫలంపూర్ణం సంతుష్టః ప్రదదాతి చ ॥
యస్య స్మరణమాత్రేణ దేవదేవస్య చక్రిణః ।
సఫలాని భవన్త్యేవ సర్వకర్మాణి భూపతే ॥
పరమాత్మా జగన్నాథస్సర్వకామఫలప్రదః ।
సత్కర్మ కర్తృర్నిత్యం స్మృతః సర్వార్తినాశనః ॥
తముద్దిశ్య కృతం యచ్చ తదానన్త్యాయ కల్పతే ॥
ధర్మాణి విష్ణుశ్చ ఫలాని విష్ణుః కర్మాణి విష్ణుశ్చ ఫలాని భోక్తా ।
కార్యం చ విష్ణుః కరణాని విష్ణురస్మాన్నకించిద్వ్యతిరిక్తమస్తి ॥
ఇతి శ్రీ బృహన్నారదీయపురాణే పూర్వభాగే ప్రథమపాదే ధర్మానుకథనం నామ త్రయోదశోఽధ్యాయః ॥
నిర్మలుడు జగన్నాథుడు అయిన నారాయణుని స్తోత్రములతో స్తుతించి మనసున కోరిన కోరికలనన్నింటిని పొందగలడు. దేవాలయమున భక్తిగల వాడై నృత్యమును కాని, గానమును కాని చేసినచో రుద్రలోకమును పొందును. దేవాలయమున వాద్యములను మోగించినవారు హంసవాహనమధిరోహించి బ్రహ్మలోకమును చేరెదరు. దేవాలయమున కరతాళ ధ్వనిచేయువారు అన్నిపాపములనుండి విముక్తిని పొంది విమానమధిరోహించి దేవలోకమున పదివేల యుగములుందురు. దేవాలయమున ఘంటా నాదమును చేసినవారికి కలుగు పుణ్యమును స్వయముగా శివుడు కూడా చెప్పజాలడు. దేవాలయమున భేరీ మృదంగ పటహ మురజ డిండిమలతో దేవాధీశుని సంతోషింపచేసిన వారు దేవతా స్త్రీ గణములతో కూడి అన్నికోరికలను నెరవేర్చుకొని స్వర్గలోకమును చేరి అయిదు, కల్పములు ఆనందింతురు. దేవాలయమున శంఖనాదమును చేసినవారు అన్ని పాపముల నుండి విముక్తిని పొంది విష్ణువుతో కూడి ఆనందింతురు. విష్ణుమందిరమున కంచుతాళముల ధ్వని చేసినవారు అన్ని పాపములనుండి విముక్తిపొంది విష్ణులోకమును చేరును. శ్రీమహావిష్ణువు సర్వదర్శి; జ్ఞానరూపుడు; నిరంజనుడు. అతడు సంతోషించినచో పరిపూర్ణముగా సర్వ ధర్మఫలములను ప్రసాదించును. దేవదేవుడైన శ్రీమన్నారాయణుని స్మరించినచో సర్వకర్మలు సఫలములగును. పరమాత్మ జగన్నాథుడు అగు శ్రీమన్నారాయణుడు సర్వకర్మల ఫలములనిచ్చువాడు. సత్కర్మలను చేయువారు నిత్యము స్మరింతురు. శ్రీహరి అందరి ఆర్తిని తొలగించును. శ్రీమహావిష్ణువును ఉద్దేశించి చేసినదేదైనను ఆనన్త్యమును ప్రసాదించును. ధర్మములు, ధర్మఫలములు, కర్మలు, కర్మఫలములు, కర్మఫలభోక్త, కార్యము, కరణములు అన్నియూ శ్రీమహావిష్ణువే. శ్రీమహావిష్ణువు కంటే భిన్నమైన దేదీ మరియొకటిలేదు.
ఇది శ్రీ బృహన్నారదీయపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున ధర్మానుకథనమను పదమూడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 13 of the Nārada Mahā Purana is as follows:
సమస్త మానవాళికి సన్మార్గము చూపించే ధర్మముల యొక్క సమగ్ర రూపమును ధర్మదేవత భగీరథునికి ఉపదేశించిన దివ్య అధ్యాయము ఇది. సత్యము, అహింస, దయ, శౌచము, ఇంద్రియ నిగ్రహము మరియు భగవద్భక్తి వంటి ప్రాథమిక ధర్మములు మానవ జీవితాన్ని ఏ విధంగా పునీతం చేస్తాయో ఇక్కడ వివరంగా నిరూపించబడినది.