97 - నారదీయపురాణానుక్రమణీకథనమ్

శ్రీ బ్రహ్మోవాచ :-

శృణు విప్ర ప్రవక్ష్యామి పురాణం నారదీయకమ్

పంచ వింశతి సాహస్రం బృహత్కల్పకథాశ్రయమ్

సూత శౌనక సంవాద స్సృష్టి సంక్షేప వర్ణనమ్

 నానాధర్మ కథాః పుణ్యాః ప్రవృత్తేః సముదాహృతః

ప్రాగ్భాగే ప్రథమే పాదే సనకేన మహాత్మనా

 ద్వితీయే మోక్షధర్మాఖ్యే మోక్షోపాయ నిరూపణమ్

వేదాంగానాం చ కథనం శుకోత్పత్తిశ్చ విస్తరాత్

 సనందనేన గదితా నారదాయ మహాత్మనే

మహాతంత్ర సముద్దిష్ట పశుపాశ విమోక్షణమ్

మంత్రాణాం శోధనం దీక్షా మంత్రోద్ధారశ్చ పూజనమ్

 ప్రయోగాః కవచం నామ సహస్రం స్తోతమేవ చ

గణేశ సూర్య విష్ణుం శివ శక్త్యారను క్రమాత్

 సనత్కుమారమునినా నారదాయ తృతీయకే

 పురాణ లక్షణం చైవ ప్రమాణం దానమేవ చ

పృథక్ప్రథ క్సముద్దిష్టం దానకాల పురస్సరమ్

చైత్రాది సర్వమాసేషు తిథీనాం చ పృధక్ప్రధక్

 ప్రోక్తం ప్రతిపదాదీనాం వ్రతం సర్వాఘనాశనమ్

 సనాతనేన మునినా నారదాయ చతుర్థకే

 పూర్వభాగ్యముదితో బృహదాఖ్యాన సంజ్ఞాతః

అస్యోత్తరే విభాగే తు ప్రశ్న ఏకాదశీవ్రతే

వసిష్టే నాథ సంవాదో మాంధాతుః పరికీర్తితః

రుక్మాంగద కథా పుణ్యా మోహిన్యుత్పత్తి కర్మ చ

వసుశాపశ్చ మోహిన్యై పశ్చాదుద్దరణక్రియా

గంగా కథా పుణ్యతమా గయా యాత్రాను కీర్తనమ్

కాశ్యా మాహాత్మ్యమతులం పురుషోత్తమ వర్ణనమ్

 యాత్రా విధానం క్షేత్రస్య బహ్వాఖ్యాన సమన్వితమ్

ప్రయాగ స్యాథ మాహాత్మ్యం కురుక్షేత్రస్య తత్పరమ్

హరిద్వారస్య చాఖ్యానం కామోదాఖ్యానం తధా

బదరీతీర్థమాహాత్మ్యం కామాక్షాయాస్త థైవ చ

ప్రభాసస్య చ మాహాత్మ్యం పుష్కరాఖ్యానకం తథాః

 గౌతమాఖ్యానకం పశ్చాద్వేదపాదస్తవస్తతః

గోకర్ణక్షేత్ర మాహాత్మ్యం లక్ష్మణాఖ్యానకం తధా

సేతుమాహాత్మ్య కథనం నర్మదా తీర్థ వర్ణకమ్

 అవంత్యాశ్చైవ మాహాత్మ్యం మధురాయాస్తతః పరమ్

 బృందావనస్య మహిమాం పశోర్ర్బహ్మంతికే గతిః

మోహినీ చరితం పశ్చాదేవం వై నారదీయకమ్

 యశ్నణోతి నరో భక్త్యా శ్రావయద్వా సమాహితః

 స యాతి బ్రహ్మణో ధామ నాత్ర కార్యా విచారణా

యస్వైతదిష పూర్ణాయాం ధేనూనాం సప్తకాన్వితమ్

 ప్రదద్యాద్విజవర్యాయ సలభేన్మోక్షమేవ చ

యశ్చానుక్రమణిమేతాం నారదీయస్య వర్ణయేత్

 శృణుయాద్వైకచిత్తేన సోపి స్వర్గ గతిం లభేత్

ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణే పూర్వభాగే బృహదుపాఖ్యానే చతుర్థపాదే నారదీయ పురాణానుక్రమణీ కధనం నామ సప్తనవతి తమోధ్యాయః.

శ్రీ బ్రహ్మపలికెను :-

ఓ బ్రాహ్మణోత్తమా! ఇపుడు ఇరువది ఐదు వేల శ్లోకములు కల, బృహత్కల్ప కథాశ్రయమగు నారదీయ పురాణమును చేప్పెదను వినుము. ఈ పురాణమున సూత శౌనక సంవాదము, సృష్టి సంక్షేప వర్ణనము, పవిత్రములగు నానాధర్మకథలు, చెప్పబడినవి. పూర్వ భాగమున ప్రథమ పాదమున సనకమహర్షి నారద మహర్షికి చెప్పెను. ద్వితీయ పాదమున సనందన మహర్షి నారదునకు మోక్షోపాయ నిరూపణమును వేదాంగములను, శుకోత్పత్తిని చెప్పెను. మహాతంత్రమున పశుపాశ విమోక్షణమును, మంత్ర శోధనమును, దీక్షా మంత్రోద్ధారమును, పూజనమును, ప్రయోగములను, కవచమును, నామ సహస్రమును, స్తోత్రములను, గణేశ సూర్య విష్ణు శివశక్తుల ఆరాధనా విధానమును సనత్కుమారముని నారదునకు చెప్పెను. ఈ మహాతంత్రము తృతీయ పాదమున చెప్పబడినది. ఇక చతుర్థ పాదమున సనాతనముని నారద మహర్షికి పురాణ లక్షణమును, ప్రమాణముము, దానమును, దానకాలపురస్పరముగా చెప్పబడినది. చైత్రాది ద్వాదశ మాసములందు తిథులయందు చేయవలసిన విధానమును వేరువేరుగా చెప్పెను. ప్రతిపదాదితిథుల యందు చేయవలసిన ప్రతములను వివరించెను. ఇట్లు ఈ నాలుగు పాదములు కలది పూర్వభాగము బృహదాఖ్యానమనబడును. ఇక ఉత్తర భాగమున ఏకాదశి వ్రత విషయక ప్రశ్నము మాంధాతృ వసిష్ఠ సంవాద రూపముగా చెప్పబడినది. పవిత్రమగు రుక్మాంగద కథ, మోహినీ పుట్టుక, చేసిన పనులు, మోహినికి వసు విచ్చిన శాపము, శాపోద్దారము, పవిత్రమగు గంగాకధ, గయా యాత్రాను కీర్తనము, సాటిలేని కాశీమాహాత్మ్యము, పురుషోత్తమ వర్ణనము, క్షేత్రయాత్రా విధానము, బహ్వాఖ్యానములు, ప్రయాగ మాహాత్మ్యము, కురుక్షేత్ర మాహాత్మ్యము, హరిద్వార కథా, కామోదాఖ్యానము, బదరీ తీర్థమాహాత్మ్యము, కామాక్షీమాహాత్మ్యము ప్రభాస తీర్థ మాహాత్మ్యము, పుష్కరాఖ్యానకము, గౌతమాఖ్యానము, వేదపాదస్తవము, గోకర్ణక్షేత్ర మహాత్మ్యము, లక్ష్మణాఖ్యానము, సేతు మాహాత్మ్యము, నర్మదా తీర్థ వర్ణనము, అవంతీ మాహాత్మ్యము, మధురా మాహాత్మ్యము, బృందావన మాహాత్మ్యము, బ్రహ్మ సమీపమున పశుగమనము, మోహినీ చరితము ఇవి అన్నియూ చెప్పబడినవి. ఈ నారదీయ పురాణమును చెప్పినవాడు, వినినవాడు, బ్రహ్మలోకమును పొందును. ఈ పురాణమును వ్రాసి ఆశ్వయుజ శుద్ధపూర్ణిమ నాడు ఏడు గోవులతో బ్రాహ్మణోత్తమునకు దానము చేసినచో మోక్షము లభించును. సావధాన చిత్తముచే ఈ నారదీయ పురాణాను క్రమణికను చెప్పినవారు, వినినవారు స్వర్గమును పొందెదరు.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున చతుర్థపాదమున నారదీయ పురాణ అనుక్రమణిక అను తొంబదియేడవ అధ్యాయము.