11 - మోహినీ దర్శనమ్

 వసిష్ఠ ఉవాచ :-

 తఛ్ఛ్రుత్వా నృపతేర్వాక్యం మహాజ్ఞానీ మునీశ్వరః

చింతయిత్వా   క్షణం జ్ఞాత్వా కారణం తమువాచ హ

వసిష్ఠ మహర్షి పలికెను :-

రుక్మాంగద మహారాజు మాటలను విని మహాజ్ఞాని యగు మునీశ్వరుడు క్షణకాలమాలోచించి కారణమును తెలుసుకొని ఆ కారణమును ఇట్లు చెప్పెను.

వామదేవ ఉవాచ :-

పురాత్వమవనీపాల శూద్రజాతి సముద్భవః

దారిద్య్రేణ పరాభూతో దుష్టయా భార్యయా తధా

పరసేవనయా చైవ వేతనేన భుజిక్రియా

 నివసన్దుః ఖసంతప్తో బహు వర్షాణి పార్థివ

 కదా చిద్ద్విజసంసర్గా త్తిర్థయాత్రాం గతో భవాన్

 తతస్సర్వాణి తీర్ధాని పరిక్రమ్య మహీపతే

 ద్విజసేవాపరో జాతో మధురాం పుణ్యరూపిణీమ్

 తత్ర స్నాతం త్వయా విప్ర సంగేన యమునా జలే

 విశ్రాంతి సంజ్ఞకే తీర్దే సర్వతీర్ణోత్తమోత్తమే

 మందరే చ వరాహస్య కథ్యనూనాం కధాం నృప

 పురాణోక్తం చ శుశ్రావ అశూన్య శయన వ్రతమ్

 చతుర్భిః పారనై  ర్యస్య నిష్పత్తిస్తు విధీయతే

యేన చీర్లీన దేవేశో జీమూతాభః ప్రసీదతి

లక్ష్మీభర్తా జగన్నాధ్ నిశ్శేషాఘౌఘనాశనః

తత్కృతం భవతా రాజన్పునరభ్యేత్య మందిరమ్

అశూన్య శయనం పుణ్యం గృహే వృద్ధికరం పరమ్

అకృత్వేదం మహారాజ ! వ్రతం పాతక నాశనమ్

 గార్హస్థ్య మను తిష్ఠేత వంధ్యావన్నిష్ఫలో భవేత్

సుఖమిదృగ్విధం లోకే దుర్లభం ప్రతిభాతి మే

శ్రావణస్య తు మాసస్య ద్వితీయాయాం మహీపతే

 గ్రాహ్యమేత ద్ర్వతం పుణ్యం జన్మమృత్యు జరాపహమ్

 లక్ష్మీయుక్తో జగన్నాధః పూజనీయోత్ర పార్థివ

 ఫలైః పుష్ఫై  స్తధా ధూపై శ్చారు రక్తానులేపనైః

 శయ్యాదానైర్వస్త్రదానై  స్తధా బ్రాహ్మణ భోజనైః

తత్త్యయా సర్వమేతద్ధి కృతం రాజన్సుదుస్తరమ్

తస్యైవ కర్మణః పుష్టి రశూన్యస్య మహీపతే

ఇమానేవాగ్రతః పుణ్యాః స్త్వయోక్తా న్విస్తరాచ్ఛృణు

 నా ప్రసన్నే జగన్నాధే భవేయురితి నిశ్చితమ్

పూర్వజన్మని దేవేశ స్త్వయా శూన్యేన పూజితః

 ఇహ జన్మని రాజేణ్ద్ర ద్వాదశ్యార్చయసే హరిమ్

 అవశ్యం ప్రాప్య సే రాజన్ విష్ణో స్సాయుజ్యతాం ధ్రువమ్

 ఏష ప్రశ్నో మయా రాజన్ వ్యాఖ్యాతస్తే సుమంగలః

 సంపదాం ప్రభవోపేతో జ్ఞాతే రుత్కర్షణార్థకః

కిమన్యత్తే మహీపాల దదామిహ కరోమి చ

అవశ్యం సర్వయోగోసి భక్తోసి త్వం జనార్దనే

వామదేవ మహిర్షి పలికెను :-

ఓ రాజా! నీవు పూర్వజన్మలో శూద్రజాతిలో పుట్టితివి. దారిద్ర్యముతో దుష్టురాలగు భార్యతో బాధల ననుభవించితివి. పరుల సేవించుటవలన వచ్చిన వేతనముతో భోజనము లభించెడిది. ఇట్లు చాలా సంవత్సరములు దుఃఖములనను భవించుచుండి, ఒకపుడు బ్రాహ్మణుల వెంట తీర్థయాత్రలకు వెళ్ళితివి. వారితో అన్ని తీర్థములందు పర్యటించి, బ్రాహ్మణ సేవా పరుడవైతివి. వారి వెంట మధురకు వెళ్ళి వారితో యమునా జలమున స్నానమాడితివి. సర్వతీర్ధోత్తమమగు విశ్రాంతి యను తీర్థమున వరాహ మందిరమున పురాణోక్తమగు ఆ శూన్యశయన వ్రత కధను వింటివి. నలుగురి పారణతో ఈ వ్రతము సిద్ధించును. ఈ వ్రతము నాచరించినచో లక్ష్మీ భర్త, జగన్నాధుడు సకల పాపనాశకుడు నీలమేఘశ్యాముడగు శ్రీహరి ప్రసన్నుడగును. ఆ కధను వినిన నీవు మరల వరాహమందిరమునకు వచ్చి గృహవల ఎను వృద్ధి పరచగల పవిత్రనుగు ఆ శూన్యశయన వ్రతము నాచరించితివి. గృహస్థాశ్రమమున నుండువాడు ఈ వ్రతము నాచరించక చేయు గృహస్థ ధర్మములన్నియూ గొడ్రాలివలె వ్యర్ధములగును. ఈ వ్రతము వలన లభించు సుఖము ఈ భూమండలమున దుర్లభము. శ్రావణమాస ద్వితీయనాడు పరమపవిత్రము, జన్మమృత్యు జరాపహమగు ఈ వ్రతమును స్వీకరించవలయును. ఈ వ్రతమున లక్ష్మీ సహితుడగు జగన్నాధుని పూజించవలయును. పుష్పములను ఫలములను, ధూపదీప చందనాద్యనులేపనములను సమర్పించవలయును. బ్రాహ్మణులకు శయ్యాదానములను వస్త్రదానములను, భోజనములను సమర్పించవలయును. ఇట్టి కష్టసాధ్యమగు, నీ వ్రతమును యధావిధిగా నాచరించితివి. ఇపుడు నీవు చెప్పిన భోగములన్నియు ఆ అశూన్యవ్రతమువలన లభించినవే. ఇంకను విస్తరముగా వినుము. జగన్నాధుడు ప్రసన్నుడు కానిచో ఇన్ని భోగములు లభించవు. ఇది నిజము. నీ పూర్వజన్మలో అశూన్యశయన వ్రతముతో లక్ష్మీనాధుని పూజించితివి. ఇక ఈ జన్మలో ద్వాదశీ వ్రతముచే శ్రీహరిని పూజించుచున్నావు. కావున నీవు తప్పక శ్రీహరి సాయుజ్యమును పొందగలవు. ఓ రాజా! నీవడిగిన ప్రశ్నను వివరించితిని. దీని వలననే నీవు సర్వసపందలను పొందితివి. బంధులకు హితమును కూర్చుచున్నావు. ఓరాజా నీకు ఇంకను ఏమి చేయవలయును? దేనినీయవలయును. నీవు శ్రీహరికి భక్తుడవు కావున అన్నిటికి యోగ్యుడవు.

రాజోవాచ :-

ఉత్సుకోహం ద్విజశ్రేష్ఠ ! మందరం పర్వతం ప్రతి

తత్రా శ్చర్యాణ్యనేకాని ద్రష్టు కామ స్తవాజ్ఞయా

 లఘుర్భూత్వా గురుం త్యక్త్యా పుత్రోపరి ద్విజోత్తమ

రాజ్యశాసనజం భారం దుర్వహం యచ్చ భూమిపైః

సోహం స్వేచ్ఛాచ  రో యాతో మత్కృతం తనయశ్చరేత్

తఛ్ఛ్రుత్వా వచనం రాజ్ఞో వామదేవో బ్రవీదిదమ్

ఏతద్ధి పరమం కృత్యం పుత్రస్య నృప పుంగవ

 యత్ల్కే శాత్పీ తరం  ప్రేమ్ణా విమోచయతి సర్వదా

పితుర్వచనకారీచ మనోవాక్కాయ శక్తితః

యస్యభాగీరథీ స్నాన మహత్యహని జాయతే

 నిరస్య పితృవాక్యం తు వ్రజేత్స్నాతుం సురాపగామ్

 నో శుద్ధిస్తస్య పుత్రస్య ఇతీత్దం వైదికీ శ్రుతిః

 సత్వం గచ్ఛ యధాకామం కృతకృత్యోసి భూపతే

హరి ప్రసాదాత్తే జాతో వంశే పుత్రస్స పుణ్యకృత్

 ఏవముకై తు మునినా సమారుహ్య తురంగమమ్

 యయౌ శీఘ్రగతి శ్శ్రీమా న్నదాగతి రివ స్వయమ్

వీక్షమాణో గిరీన్సర్వాన్ వనాని సరితస్తధా

 సర్వాశ్చర్వాణి రాజేన్ద్రస్సరాంస్యుపవనానిచ

సోచిరేశైవ కాలేన సంప్రాప్తో మందరాచలమ్

భ్రామయిత్వా గిరిం శ్వేతం గంథమాదనమేవచ

అతీత్య చ మహామేరుం దృష్ట్యా చైవోత్తరాన్కురూన్

శతసూర్య ప్రతీకాశం సర్వతః కాంచనా వృతమ్

 సంఘష్టం హరి బాహుభ్యాం స్రవంతం కాంచనం రసమ్

 తద్భూభాగం నగాకీర్ణం బహుధాతు విభూషితమ్

 బహు నిర్థర సంయుక్తం బహు కందర భూషితమ్

నిన్నుగాయుత సంపూర్ణం ధౌతం గంగా జలై శ్శుభైః

విశ్వసై ర్యువతి బృనైః కాంతాశర్మోపసేవిభిః

ఘట ప్రమాణై  ర్నృపతే పరిపక్వై స్సుంగధిభిః

 ఫలైర్యువతి సంభూతైః కుచైరివ విభూషితమ్

 ద్విరేఫ ధ్వని సంయుక్తం కోకిల స్వర నాదితమ్

 అనేక సత్త్వ విరుతై స్సమం తాన్నాదితం గిరిమ్

 సంపశ్యమానో నృపతి ర్వివేశ సమహా గిరిమ్

అరోఢు కామస్తు కుతూహలాత్త మన్వేష యనేన పధా ప్రరోహమ్

స వీక్షతే యావదసౌ సమంతా త్తావత్సమస్తం ద్రుమ పక్షి సంఘమ్

విసర్పమాణం ధ్వనినా గృహీతం విమోహినీ వక్త్ర సముద్భవేన

 ఉపప్లవన్తం తరసా మహీప స్తేనైవ సార్థం స జాగామ తూర్ణమ్

 తస్యాపి కర్ణే ధ్వని రావివేశ విమోహినీ వక్త్ర సముద్భవో యః

 విమోహితో యేన విముచ్య వాహం త్రివిక్రమేణేవ విలంఘ్య మానమ్

మార్గం గిరే ర్మోహిని గీత ముగ్గం క్షణేన రాజా సహసా దదర్శ

 గిరౌ స్థితాం తప్తసువర్ణ భాసం కామస్య యష్టిమివ నిర్మితాం చ

 శక్రస్య లింగం గగనే ప్రసక్తం సంపూజ యన్తిమివ లోకసూత్యై

 క్షమా స్వరూపా మివ వై రసాయ గిరే స్సుతాయా ఇవ రూపరాశిమ్

 సింధోస్తు వేలామివ రూపయుక్తాం తస్యాస్తనుం వై రతి మందిరాఖ్యామ్

 వికర్షమాణం సహసాత్రినేత్రం లింగాశ్రయం దేవ వినోదనార్థమ్

తత్పుణ్య కర్తుర్మనసాభి లాషాం వ్యవస్థితో మోహిని రూప దర్శీ

 విమోహితో సౌ నిపపాత రాజా విమోహినీ కామ శరేణ విద్దః

 జ్వరేణ తీవ్రేణ గృహీత దేహ స్సమీప మస్యాస్స ససర్ప శీఘ్రమ్

 విసర్పిణం భూమిపతిం సునేత్రా విలోకయామాస కటాక్ష దృష్ట్యా

విముచ్య వీణాం విరరామ గీతా త్ప్రాప్తం చ కార్యం సహసైవమేనే

 వీధూన యన్తీ మృగపక్షి సంఘా న్సువాససా గండ భుజౌ నివార్య

 శిలీ ముఖాన్శ్వాస సుగంధముగ్దాన్ జగామ దేవీ నృపతే స్సమిపమ్

 త్యక్త్యా హరం పూజ్యతమం సులింగం గత్వా తు పార్శ్వే తముదారచేష్టా

విమోహినీ నీరజ పత్రనేత్రా ఉవాచ వాక్యం మధురం మనోజ్ఞమ్

రుక్మాంగదం కామశరాభితప్త ముత్తిష్ఠ రాజన్వశగా తవాహమ్

 కిం మూర్ఛయా దేహ మిమం క్షిణోసి యస్త్వం ధరా భారమిమం మహాన్తమ్

 తృణీకృతం భూప సముద్వహేధా యన్మామకం రూపమవేక్ష్యహారి

కిం ముహ్యసే దుర్బల గౌరివేహ పంకే నిమగ్నా సుదృఢో భవత్వమ్

 ధీరోసి వీరోసి విడంబయేధాః కిమర్ధ మాత్మాన ముదార చేష్టమ్

 యద్యస్తి వాంఛా తవ భూపతీశ మమాను కూలే సురతేతి హృద్యే

 ప్రదాయ దానం చ సుధర్మయుక్తం భుంక్ష్య స్వదాసీమివ మాం రతిజ్ఞామ్

ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణే ఉత్తరభాగే మోహినీ దర్శనం నామ ఏకాదశోధ్యాయః

రుక్మాంగద మహారాజు పలికెను :- ఓ బ్రాహ్మణోత్తమా? నేను మందర పర్వతమునకు వెళ్ళదలిచితిని. అచటనున్న చాలా ఆశ్చర్యములను చూడకోరుచున్నాను. మీ ఆజ్ఞను అభిలషించుచున్నాను. పుత్రునిపై రాజ్యశాసన భారమును వదిలి తేలికపడి, స్వేచ్ఛాసంచారినై బయలు దేరితిని. నా పనులను నా పుత్రుడాచరించును. ఇట్లు పలికిన రాజు మాటలను విని వామదేవుడిట్లు పలికెను. ఇది పుత్రునికి పరమ కర్తవ్యము. ఎల్లపుడు ప్రేమచే తండ్రిని క్లేశముల నుండి విడిపించవలయును. మనోవాక్కాయములచే శక్తి కొలది పితృవాక్య పరిపాలన గావించ వలయును. ఇట్లు చేసిన పుత్రుడు ప్రతిదినము గంగాస్నాన ఫలమును పొందును. పితృవాక్యమును ఉల్లంఘించి గంగాస్నానమునకు వెళ్ళిన పుత్రునికి శుద్ధి  కలుగదని శ్రుతి చెప్పుచున్నది. కావున నీవు కృతకృత్యుడవు కావున యధేచ్చగా వెళ్ళుము. శ్రీహరి అనుగ్రహము వలన నీకు పుణ్యకార్యములనాచరించుపుత్రుడు కలిగెను. ఇట్లు వామదేవుని అనుమతిని బడసి, అశ్వము నధిరోహించి వాయువు వలె శీఘ్రముగా వెళ్ళెను. అన్ని పర్వతములను, వనములను, నదులను, బహ్వాశ్చర్యములను, సరస్సులను, ఉపవనములను చూచుచు అతి త్వరలో మందరాచలమును చేరెను. శ్వేత పర్వతమును, మందరాచలమును చుట్టి, మహామేరువును దాటి, ఉత్తర కురుదేశములను చూచి, నూరుమంది సూర్యులతో సమానముగా వెలుగొందుచున్న, అంతటా బంగారముతో ఆవరించబడియున్న శ్రీహరి బాహువులచే అదుమబడిన, కాంచన రసమును స్రవించుచున్న, బహుపర్వత సమాకీర్ల భూభాగము కలది, బహుధాతు విభూషితము, బహు నిర్ఘర సంయుక్తము,  బహుకందర భూషితము, బహునదీ సంయుతము, శుభములగు గంగాజలములచే గౌతము, ప్రియులకు సుఖముల నందించు యువతులకు విశ్వాస పాత్రము, యువతులకుచముల బోలిన, ఘటప్రమాణములగు, పరిపక్వములు, సుగంధులు అగు ఫలములతో నిండియున్న వృక్షములు కలది భ్రమర ధ్వని సంయుతము, కోకిల స్వర నాదితము, అనేక ప్రాణి రావములచే నాదిత సమస్త ప్రాంతము అగు పర్వతమును చూచుచు మందర పర్వతమును చేరెను. కుతూహలముచే ఆ పర్వతము నధిరోహించుటకు రుక్మాంగద మహారాజు మార్గమును వెతుకుచుండగా, అంతలో అచటనున్న ద్రుమపక్షి సంఘమంతయూ మోహినీ ముఖము నుండి వచ్చు మధురధ్వనిచే స్తంభితమాయెను. మహారాజు కూడా ఔత్సుక్యముచే ఆ ధ్వని వచ్చు మార్గముననుసరించియే బయలు దేరెను. రుక్మాంగదుని చెవిలో కూడా మోహినీ ముఖము నుండి వచ్చు ధ్వని పడెను. ఆ గానమునకు మోహితుడై త్రివిక్రమునివలె లంఘించు చున్న అశ్వమును వదిలి మోహినీ గానముచే మోహితమగు మార్గమున వెళ్ళి క్షణ కాలములో ఆశ్చర్యముతో పర్వతము మీద చక్కగా అగ్నిలో కాల్చి వన్నెపెట్టబడిన బంగారము కాంతిగల, మన్మధ యష్టివలే నిర్మించబడిన, ఆకాశముననున్న ఇంద్ర ధ్వజమును లోకహితము కొఱకు పూజించుచున్న, భూమిరూపు దాల్చినట్లుగా, పార్వతీవలే రూపరాశి అయిన, రూపమును దాల్చిన సముద్రపు చెలియలి కట్టవలెనున్న, రతిమందిరముగానున్న శరీరము కలది, లింగముగా నాశ్రయించియున్న త్రినేత్రుని దేవవినోదము కొరకు ఆకర్షించుచున్న, బ్రహ్మ మనసులోని అభిలాషయే మూర్తీ భవించియున్నటులనున్న మోహినిని చూచెను. మోహినీ రూపమును దర్శించి మోహినీ కామ శరములచే కొట్టబడి మూర్ఛనంది అచటనే పడిపోయెను. శరీరమును కామ జ్వరము ఆక్రమించగా మోహిని సమీపమునకు చేరెను. తనను సమీపించుచున్న రుక్మాంగద మహారాజును మోహినీ కటాక్షములతో పరికించెను. వీణను వదిలి గానమును ఆపివేసెను. తానొచ్చిన పని ఆసన్నమైనదని తలచెను. తన వస్త్రముచే మృగపక్షి సంఘములను తిరస్కరించుచు, గండ భుజములను శ్వాస సుగంధమునకు మోహించి అనుసరించియున్న తుమ్మెదలను వారించుచు రాజు సమిపమునకు వెళ్ళెను. శివలింగమును విడిచి రుక్మాంగద మహారాజు ప్రక్కన చేరి ఉదారచేష్టలుకల, పద్మపత్రనేత్రయగు మోహినీ దేవి మధురముగా మనోజ్ఞముగా ఇట్లు పలికెను. కామ శరాభితప్తుడగు రుక్మాంగద మహారాజును గూర్చి ఓ రాజా ! లెమ్ము నేను నీ వశములో నుండుదానను. మూర్చచే ఈ దేహమును ఏల క్షీణింప చేయుచున్నావు? ఇంత గొప్ప భూభారమును తృణముగా భావించిన నీవు మనసును హరించు నారూపమును చూచి సహించజాలవా? నా రూపమును చూచి ఏల మూర్చిల్లుచున్నావు? నీవు దృఢముగా నుండుము. ధీరుడవు. వీరుడవు. ఉదార చేష్టుడవగు నిన్ను నీవేల చులకన చేసుకొనుచున్నావు? ఒకవేళ నీకు నా సమాగమము నందు కోరికయున్నచో ధర్మయుక్తముగా నేనడిగిన దానిని దానము చేసి రతిజ్ఞురాలనగు నన్ను దాసిని అనుభవించునట్లు యధేచ్ఛముగా అనుభవించుము.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తరభాగమున మోహినీ దర్శనమను పదునొకండవ అధ్యాయము.