16 - భగీరథగంగానయనమ్

నారద ఉవాచ :-

హిమవద్గరిమాసాద్య కిం చకార మహీపతిః

కథమానీతవాన్గంగా మేతన్మే వక్తుమర్హసి

నారదమహర్షి పలికెను:- భగీరధ మహారాజు హిమవత్పర్వతమును చేరి ఏమి చేసెను ? గంగ నెట్లు తీసుకొని వచ్చెను? ఈ విషయమును నాకు తెలుపుము.

సనక ఉవాచ :-

భగీరథో మహారాజో జటాచీరధరో మునే

గచ్ఛన్హిమాద్రిం తపసే ప్రాప్తో గోదావరీతటమ్

తత్రాపశ్యన్మహారణ్యే భృగోరాశ్రమముత్తమమ్

కృష్ణసారసమాకీర్ణం మాతంగగణ సేవితమ్

భ్రమద్భమరసంఘష్టం కూజద్విహగసంకులమ్

ప్రజద్వరాహనికరం చమరీపృచ్ఛవీజితమ్

నృత్యన్మయూరనికరం సారంగాదిని షేవితమ్

ప్రవర్ధితమహావృక్షం మునికన్యాభిరాదరాత్

శాలతాలతమాలాడ్యం నూనహిన్తాలమండితమ్

మాలతీయూధికాకుంధచంపకాశ్వత్థభూషితమ్

ఉత్ఫుల్లకుసుమో పేతమృషిసంఘని షేవితమ్

వేదశాస్త్రమహాఘోషమాశ్రమం ప్రావిశద్భృగోః

సనకమహర్షి పలికెను :- భగీరధమహారాజు జడలను, నారవస్త్రములను ధరించి తపస్సు చేయుటకు హిమవత్పర్వతమునకు వెళ్ళుచు గోదావరీతీరమును చేరెను. అచట ఆ మహారణ్యమున ఉత్తమము పవిత్రమైన భృగుమహర్షి ఆశ్రమమును చూచెను. ఆయాశ్రమమున జింకలు, యేనుగులు, తిరుగాడు తుమ్మెదల ఝుంకారములు, కూయుచున్న పక్షుల కోలాహలములు, వెళ్ళుచున వరాహ బృందములు, పుచ్ఛములతో వీచుచున్న చమరీ మృగములు, నాట్యముచేయుచున్న నెమళ్ళ గుంపులు, లేళ్ళు మొదలగు సాధుజంతువులు మునికన్యలచే ఆదరముతో పెంచబడిన వృక్షములు, శాలతమాలతాళమీంతలములు మాలతి, సంపేగ, మల్లె, సన్నజాజి, రాగి, మొదలగు లతావృక్షములు, వికసించిన పూవులు కలిగి, ఋషిసమూహములచే వేదఘోష చేయబడుచుండగా భగీరధ మహారాజు ఆయాశ్రమమున ప్రవేశించేను.

గృణన్తం పరమం బ్రహ్మ వృతం శిష్యగణైర్ము నిమ్

తేజసా సూర్యసదృశం భృగుం తత్ర దదర్శ సః

ప్రణనామాథ విప్రేన్ద్రం పాదసంగ్రహాణాదినా

ఆతిథ్యం భృగురప్యస్య చక్రే సన్మానపూర్వకమ్

కృతాతిథ్యక్రియో రాజా భృగుణా పరమర్షిణా

ఉవాచ ప్రాంజలిర్భూత్వా వినయాన్ము నిపుంగవమ్

పరబ్రహ్మను ధ్యానము చేయుచు, శిష్య బృందముతో కూడి ఉన్న సూర్యుని వంటి తేజస్సు గల భృగుమహర్షిని చూచెను. పాదముల పట్టుకొని భృగుమహర్షికి నమస్కరించెను. భృగుమహర్షి కూడా సన్మాన పూర్వకముగా భగీరథ మహారాజునకు అతిథి మర్యాదను చేసెను. ఇట్లు భృగుమహర్షిచే అతిథి మర్యాదను పొందిన భగీరథమహారాజు చేతులు జోడించి వినయముతో భృగుమహర్షిని గూర్చి ఇట్లు పలికెను.

భగీరథ ఉవాచ :-

భగవన్సర్వధర్మజ్ఞ ! సర్వశాస్త్రవిశారద !

పృచ్ఛామి భవభీతోఽహం నృణాముద్ధారకరణమ్

భగవాంస్తుష్యతే యేన కర్మణా మునిసత్తమ !

తన్మమాఖ్యాహి సర్వజ్ఞ అనుగ్రాహ్యోఽస్మి తే యది

సర్వధర్మములను తెలుసుకొని సర్వశాస్త్రములందు విశారదుడవైన ఓ మహర్షీ ! సంసారమునకు భయపడిన నాకు మానవులు సంసారమును దాటు కారణమును తెలుపుము. ఓ మునిసత్తమా ! శ్రీమన్నారాయణుడు సంతోషించు కర్మను నామీది దయతో తెలుపుము.

భృగురువాచ :-

రాజoస్త వేప్సితం జ్ఞాతం త్వం హి పుణ్యవతాం వరః

అన్యథా స్వకులం పర్వం కథముద్ధర్తుమర్హసి

యో వా కో వాపి భూపాల స్వకులం శుభకర్మణా

ఉద్ధర్తుకామస్తం విద్యాన్నరరూపధరం హరిమ్

కర్మణా యేన దేవేశ నృణామిష్టఫలప్రదః

తత్ప్రవక్ష్యామి రాజేన్ద్ర శృణుష్వ సుసమాహితః

భవ సత్యపరో రాజన్న హింసానిరతస్తథా

సర్వభూతహితో నిత్యం మానృతం వద వై క్వచిత్

త్యజ దుర్జనసంసర్గం భజ సాధుసమాగమమ్

కురు పుణ్యమహారాత్రం స్మర విష్ణుం సనాతనమ్

కురు పూజాం మహావిష్ణోర్వా హి శాన్తిమనుత్తమామ్

ద్వాదశాష్ఠాక్షరం మన్త్రం జప శ్రేయో భవిష్యతి

భృగుమహర్షి పలికేను:- ఓ రాజా ! నీ కోరిక తెలిసినది. నీవు పుణ్యాత్ములలో శ్రేష్ఠుడవు. కావుననే నీ కులము నుద్ధరించదలచితివి. మంచిపనులచే . తన కులమునుద్దరించదలచు నరుని సాక్షాత్తు శ్రీహరిగా తెలియవలయును. ఓ రాజేన్హా ! శ్రీహరి సంతోషించు కర్మను తెలి పెదను. సావధానముగా వినుము. సత్యపరుడుగా అహింసా నిరతుడుగా ఉండుము. అన్ని ప్రాణుల హితమును కోరుము. అసత్యమును పలుకకుము. దుర్జనులతో సాంగత్యమును విడువుము. సాధు జనసమాగమును కోరుము. రాత్రింబవళ్ళు పుణ్యము నాచరించుము. సనాతనుడైన శ్రీమహావిష్ణువును స్మరించుము. మహావిష్ణువును పూజించి సాటిలేని శాంతిని పొందుము. ద్వాదశాక్షర మంత్రమును కాని, అష్టాక్షర మంత్రమును కాని జపించుము. నీకు మేలు కలుగును.

భగీరథ ఉవాచ:-

సత్యం తు కీదృశం ప్రోక్తం సర్వభూతహితం మునే !

అనృతం కీదృశం ప్రోక్తం దుర్జనాశ్చాపి కీదృశాః

సాధవః కీదృశాః ప్రోక్తాస్తస్య పూజా చ కీదృశీ

స్మర్తవ్యశ్చ కథం విష్ణుస్తస్య పూజా చ కీదృశీ

శాన్తిశ్చ కీదృశీ ప్రోక్తా మునే తత్త్వార్థకోవిద !

కృపాం కృత్వా మయి పరాం సర్వం వ్యాఖ్యాతుమర్హసి

భగీరథ మహాజు పలికెను :- సత్యమనగా నెట్టిది ? సర్వభూతహితమననేమి ? అసత్యమనగానేమి ? దుర్జనులెట్టివారు ? సాధువులనగా నెవరు ? పుణ్యమనగా నెట్టిది ? విష్ణువునెట్లు స్మరించవలయును ? ఎట్లు పూజించవలయును - శాంతి యనగా నేమి ? అష్టాక్షర మంత్రమనగా నేమి ? ద్వాదశాక్షరమంత్రమేది ? వాస్తవార్థమును తెలిసిన ఓ మహర్షీ ! నా మీద దయయుంచి అంతయు తెలుపుము.

భృగురువాచ :-

సాధు ! సాధు ! మహాప్రాజ్ఞ తవ బుద్దిరనుత్తమా ! యత్పృష్టోఽహం త్వయా భూప !

తత్సర్వం ప్రవదామి తే

యథార్థకథనం యత్తత్సత్యమాహుర్విపశ్చితః

ధర్మావిరోధతో వాచ్యం తద్ధి ధర్మపరాయణైః

దేశకాలాది విజ్ఞాయ స్వయమస్యావిరోధతః

యద్వచః ప్రోచ్యతే సద్భిస్తత్సత్యమభిధీయతే

సర్వేషామేవ జన్తూనామ క్లేశజననం హి తత్

అహింసా సా నృప ప్రోక్తా సర్వకామప్రదాయినీ

కర్మకార్యసహాయత్వమకార్యపరిపంథితా

సర్వలోకహితత్వం వై ప్రోచ్యతే ధర్మకోవిదైః

ఇచ్ఛానువృత్త కథనం ధర్మాధర్మవివేకినః

అనృతం తద్ధి విజ్ఞేయం సర్వశ్రేయోవిరోధి తత్

యే లోకే ద్వేషిణో మూర్ఖా కుమార్గరతబుద్ధయః

తే రాజన్దుర్జనా జ్ఞేయాస్సర్వధర్మ బహిష్కృతాః

ధర్మాధర్మవివేకేన వేదమార్గానుసారిణః

సర్వలోకహితాసక్తాః సాధవః పరికీర్తితాః

హరిభక్తికరం యత్తత్సద్భిశ్చ పరిరంజితమ్

ఆత్మనః ప్రీతిజనకం తత్పుణ్యం పరికీర్తితమ్

సర్వం జగదిదం విష్ణుర్విష్ణుస్సర్వస్య కారణమ్

అహం చ విష్ణుర్యజ్ఞానం తద్విష్ణుస్మరణం విదుః

సర్వదేవమయో విష్ణుర్విధినా పూజయామి తమ్

ఇతి యా భవతి శ్రద్దా సా తద్భక్తిః ప్రకీర్తితా

సర్వభూతమయో విష్ణుః పరిపూర్ణః సనాతనః

ఇత్యభేదేన యా బుద్ధిః సమతా సా ప్రకీర్తితా

సమతా శత్రుమీత్రేషు వశిత్వం చ తథా నృప

యదృచ్ఛాలాభ సంతుష్టిః సా శాన్తిః పరికీర్తితా

ఏతే సర్వే సమాఖ్యాతాస్తపస్సిద్ధిప్రదా నృణామ్

సమస్తపాపరాశీనాం తరసా నాశహేతవః

అష్టాక్షరం మహామన్త్రం సర్వపాపప్రణాశనమ్

వక్ష్యామి తవ రాజేన్ద్ర పురుషార్థికసాధనమ్

విష్ణోః ప్రియకరం చైవ సర్వసిద్ధిప్రదాయకమ్

నమో నారాయణాయేతి జపేత్ప్రణవపూర్వకమ్

నమో భగవతే ప్రోచ్య వాసుదేవాయ తత్పరమ్

ప్రణవాద్యం మహారాజ ! ద్వాదశార్ణముదాహృతమ్

ద్వయోస్సమం ఫలం రాజన్నష్టద్వాదశవర్ణయోః

ప్రవృత్తౌ చ నివృత్తౌ చ సామ్యముద్దిష్టమేతయోః

శంఖచక్రధరం శాంతం నారాయణమనామయమ్

లక్ష్మీసంశ్రితవామాంకం తథా భయకరం ప్రభుమ్

కిరీటమండలధరం నానామండనశోభితమ్

బ్రౌజత్కౌస్తుభమాలాఢ్యం శ్రీవత్సాంకితవక్షసమ్

పీతాంబరధరం దేవం సురాసురనమస్కృతమ్

ధ్యాయేదనాదినిధనం సర్వకామఫలప్రదమ్

అన్తర్యామీ జ్ఞానరూపీ పరిపూర్ణస్సనాతనః

ఏతత్సర్వం సమాభ్యాతం యత్తు పృష్టం త్వయా నృప

స్వస్తి తేఽస్తు తపస్సిద్ధిం గచ్ఛ లబ్దుం యథాసుఖమ్

భృగుమహర్షి పలికెను :- ఓ మహాప్రాజ్ఞుడా ! బాగు ! బాగు ! నీ బుద్ధికి సాటిలేదు. . నీవడిగిన వాటినన్నింటినీ నీకు తెలి పెదను. ఉన్నది యున్నట్లుగా యధార్థమును చెప్పుట సత్యమని పండితులందురు. ధర్మపరాయణులు ధర్మమునకు విరుద్ధము కాని విధముగా చెప్పవలయును. దేశాకాలాదులను చక్కగా తెలిసి తనకు తన ధర్మమునకు విరుద్ధముగా కాని విధముగా చెప్పబడు మాటయే సత్యమని సత్పురుషులు చెప్పెదరు. అన్ని ప్రాణులకు కష్టమును కలిగించకయుండటమే అహింసయనబడును. ఈ అహింస అన్ని కోరికలను తీర్చును. చేయదగిన కార్యమునకు సాయపడుట చేయరాని పనిని అడ్డగించుటయే సర్వలోక హితమని ధర్మకోవిదులు చెప్పెదరు. ధర్మాధర్మములు తెలియక ఇష్టమొచ్చినట్లు చెప్పుటయే అసత్యమనబడును. ఈ సత్యము అన్ని శ్రేయస్సులకు విరోధియేయగును. లోకమున అందరిని, అన్నిటిని ద్వేషించువారు, మూర్భులు, చెడుదారిన నడుచుటలో ఆసక్తి కలవారు దుర్జనులని తెలియును. ఈ దుర్జనులు అన్ని ధర్మ కార్యములలో, ధర్మములలో బహిష్కృతులే. ధర్మధర్మ వివేకముతో వేదమార్గము ననుసరించుచు అన్ని ప్రాణులకు హితమును సమకూర్చవలయుని కోరువారు సజ్జనులనబడుదురు. శ్రీహరియందు భక్తిని కలుగజేయునది, సత్పురులకానందమును కలిగించునది, తమకు ప్రీతిని కలిగించునది, సత్పురులకానందమును కలిగించునది, తమకు ప్రీతిని కలిగించునది పుణ్యమనబడును. ఈ జగత్తంతయూ విష్ణువే. అన్నిటికీ కారణము విష్ణువే. నేను కూడా విష్ణువునే. అను జ్ఞానమే విష్ణుస్మ రణ మనబడును. విష్ణువు సర్వదేవ స్వరూపుడు. శ్రీమహావిష్ణువును విధిగా పూజించెదను అను శ్రద్ధయే భక్తియనబడును. విష్ణువు సర్వప్రాణి స్వరూపుడు. పరిపూర్ణుడు. సనాతనుడు అని అభేదబుద్ధియే సమతయనబడును. శత్రుమిత్రవిషయమున సమబుద్దితో నుండుట, ఇంద్రియ జయము, దైవసంకల్పముచే లభించిన దానితో తృప్తి చెందుట శాంతియనబడను. ఈ పైన చెప్పబడినవన్నియూ మానవులకు తపస్సిద్దిని కలిగించునవి. అన్ని పాపరాశులను వెంటనే నశింపచేయగలవి. అన్ని పాపములను నశింపచేసి అన్ని పురుషార్ధములను సాధించగల ఒకే సాధనము అయిన అష్టాక్షరీ మహామంత్రమును నీకు చెప్పెదను. ఈ మంత్రము విష్ణువునకు ప్రియము, అన్ని సిద్ధులను అందించునది. మొదట ప్రణవమునుచ్చరించి పిదప నమో నారాయణాయ అని జపించినచో అష్టాక్షరీ మహామంత్రమగును. మొదట ప్రణవమునుచ్చరించి, పిదప నమో భగవతే అని పలికి పిమ్మట వాసుదేవాయ అని ఉచ్చరించినచో ద్వాదశాక్షరీ మంత్రమగును. అనగా “ఓమ్ నమో నారాయణాయ” అనునది అష్టాక్షరీ మంత్రము, “ఓమ్ నమో భగవతే వాసుదేవాయ” అనునది ద్వాదశాక్షరీ మంత్రము అని భావము. ఈ రెండు మంత్రములకు సమానమైన ఫలమే లభించును. ప్రవృత్తిలోను నివృత్తిలోను అనగా ఇహపరములలో ఈ రెండు మంత్రములు సమములే. శంఖచక్రధరుడు, వికారరహితుడు, శాంతుడు, లక్మీవామాంకమున కలవాడు, అభయప్రదుడు, కిరీటమండలాదినాసాభరణశోభితుడు, కౌస్తుభమణిచే ప్రకాశించు హారము కలవాడు, శ్రీవత్సమను పుట్టుమచ్చ వక్షస్థలమున కలవాడు, పీతాంబరధారి, సురాసురులతో నమస్కరించబడువాడు, ఆద్యంతములు లేనివాడు అందరి కోరికల నీడేర్చువాడు, అంతర్యామి, జ్ఞానస్వరూపుడు, పరిపూర్ణుడు, సనాతనుడు, అగు శ్రీమన్నారాయణుని ధ్యానించవలయును. ఇట్లు నీవడిగినదంతయూ చెప్పితిని. నీకు శుభమగుగాక ! తపస్సిద్ధిని పొందుటకు యథావకాశముగా వెళ్ళుము.

ఏవముక్తో మహీపాలో భృగుణా పరమర్షిణా

పరమాం ప్రీతిమాపన్నః ప్ర పేదే తపసే వనమ్

హిమవద్గరిమాసాద్య పుణ్యదేశే మనోహరే

నాదేశ్వరే మహాక్షేత్రే తప స్తే పేఽతదుశ్చరమ్

రాజా త్రిషవణస్నాయి కందమూలఫలాశనః

సర్వభూత హితశ్శాన్తో నారాయణపరాయణః

పత్రైః పుష్పైః ఫలైస్తోయైస్త్రికాలం హరిపూజవః

ఏవం బహుతిథం కాలం నీత్వా చౌత్యన్త దైర్యవాన్

ధ్యాయన్నారాయణం దేవం శీర్ణపర్ణాశనోఽభవత్

ప్రాణాయామపరో భూత్వా రాజా పరమధార్మికః

నిరుచ్ఛ్వాసస్తపస్తప్తుం తతస్సముపచక్రమే

ధ్యాయన్నారాయణం దేవమనంతమపరాజితమ్

షష్టి వర్షసహస్రాణి నిరుచ్ఛ్వాసపరోఽభవత్

తస్య నాసాపుటాద్రాజ్ఞో వహ్నిర్జజ్ఞే భయంకరః

తం దృష్ట్వా దేవతాస్సర్వే విత్రస్తా వహ్నితాపితాః

అభిజగ్ము ర్మహావిష్ణుః యత్రాస్తే జగతాంపతిః

క్షీరోదస్యోత్తరం తీరం సంప్రాప్య త్రిదశేశ్వరాః

అస్తువన్దేవదేవేశం శరణాగతపాలకమ్

పరమర్షి అయిన భృగువిట్లు పలుకగా పరమానందమును పొందిన భగీరథ మహారాజు తపస్సు చేయుటకు అరణ్యమును చేరెను. హిమవత్పర్వతమును చేరి పవిత్రము సుందరము అయిన నాదేశ్వరమను క్షేత్రమున కఠోరమైన తపస్సుచరించేను. మూడు వేళలలో స్నానమును చేయుచు కందమూల ఫలములను భుజించుచు, అతిథులకు హితమును కలిగించుచు నారాయణుని యందు మనసు నిలిపి, పత్రపుష్పఫలతోయములతో మూడు వేళలా శ్రీహరిని పూజించుచు, మిక్కిలి ధైర్యముతో చాలాకాలమును గడిపి శ్రీమన్నారాయణుని ధ్యానము చేయుచు రాలిపడిన ఆకులను తినుచు తపమునాచరించెను. పరమధార్మికుడైన భగీరథమహారాజు ప్రాణాయామముచే ఊపిరి పీల్చకనే తపస్సును చేయ సంకల్పించెను. అనంతుడు అపరాజితుడు అగు శ్రీమన్నారాయణుని ధ్యానము చేయుచు అరువది వేల సంవత్సరములు గాలి పీల్చకనే యుండగా, అతని నాసికాపుటము నుండి గొప్ప అగ్ని పుట్టెను. ఆ యగ్నిచే తపించిన దేవతలు భగీరథుని చూచి భయమును చెంది జగత్పతి యగు శ్రీమన్నారాయణుడు నివసించు క్షీరసారోత్తర తీరమును చేరి శరణాగత పాలకుడు దేవదేవేశుడగు శ్రీమన్నారాయణుని ఇట్లు స్తుతించిరి.

దేవా ఊచుః :-

నతాః స్మ విష్ణుం జగదేకనాథం స్మరత్సమస్తార్తిహరం పరేశమ్ స్వభావశుద్ధం పరిపూర్ణభావం వదన్తి యం జ్ఞానతనుం చ తద్జ్ఞాః

ధ్యేయస్సదా యోగివరైర్మహాత్మా స్వేచ్ఛాశరీరైః కృతదేవకార్యః

జగత్స్వరూపో జగదాదినాథస్త స్మై నతాస్స్మః పురుషోత్తమాయ

యన్నామసంకీర్తనతో ఖలానాం సమస్తపాపాని లయం ప్రయాన్తి తమీశమీడ్యం పురుషం పురాణం

నతాస్మ విష్ణుం పురుషార్థసిద్ధ్యై

యత్తేజసా భాన్తి దివాకరాద్యా నాతిక్రమన్త్యస కదాపి శిక్షా కాలాత్మకం తం త్రిదశాధినాథం నమామహే వై పురుషార్థరూపమ్

జగత్కరోత్యబ్జభవోఽత్తి రుద్రః పునాతి లోకాన్ శ్రుతిభిశ్చ విప్రాః తమాదిదేవం గుణసన్నిధానం సర్వోపదేష్టారమితాః శరణ్యమ్

వరం వరేణ్యం మధుకైటభారిం సురాసురాధ్యర్చితపాదపీఠమ్

సద్భక్తిసంకల్పిత సిద్ధి హేతుం జ్ఞానైక వేద్యం ప్రణతాస్స్మ దేవమ్

అనాదిమధ్యాన్తమజం పరేశమనాద్యవిద్యాఖ్యతమోవినాశమ్ సచ్చిత్పరానన్దఘనస్వరూపం రూపాదిహీనం ప్రణతాస్స్మ దేవమ్

నారాయణం విష్ణుమనన్తమీశం పీతామ్బరం పద్మభవాని సేవ్యం యజ్ఞప్రియం యజ్ఞకరం విశుద్ధం నతాస్స్మ సర్వోత్తమమవ్యయం తమ్

దేవతలు పలికిరి :- జగదేకనాథుడు, పరేశుడు, స్మరించువారి ఆర్తిని నశింపచేయువాడు, సహజశుద్దుడు పరిపూర్ణకాముడు, తెలిసిన వారిచే జ్ఞానరూపునిగా చెప్పబడుచున్న శ్రీమహావిష్ణువును నమస్కరించుచున్నాను. ఉత్తమయోగులచే సర్వకాలములందు ధ్యానము చేయబడు మహానుభావుడు, తన సంకల్పముచే స్వీకరించిన శరీరములచే దేవకార్యములను నిర్వహించినవాడు, జగత్స్వరూపుడు, జగత్తునకు మొదటి ప్రభువు, పురుషోత్తముడు అయిన శ్రీహరికి నమస్కరించుచున్నాము. నామ సంకీర్తనచే ఖలుల పాపములను కూడా నశింపచేయు పురాణపురుషుడు, స్తుతించదగినవాడు, ప్రభువు అయిన శ్రీహరిని పురుషార్ధ సిద్దికి నమస్కరించుచున్నాము. శ్రీహరి తేజస్సుచే సూర్య చంద్రాదులు ప్రకాశించుచున్నారు. శ్రీహరి ఆజ్ఞను ఎవ్వరూ అతిక్రమించలేరు. అట్టి కాలాత్మ కుడు దేవాధినాథుడు పురుషార్ధరూపుడు అయిన మహావిష్ణువునకు నమస్కరించుచున్నాము. బ్రహ్మరూపముతో జగత్తును సృష్టించి, రుద్రరూపముతో లయము చేసి బ్రాహ్మణ రూపముతో పావనము చేయుచున్న ఆదిదేవుడు, సకలసద్గుణరూపుడు, అందరికి అన్నిటిని ఉపదేశించువాడు అయిన శ్రీహరిని శరణువేడుచున్నాము. ఉత్తముడు, సర్వోత్తముడు, మధు కైటభులను సంహరించినవాడు, దేవదానవులచే పూజించబడు పాదపద్మములు కలపోడు, సద్భక్తుల సంకల్పము సిద్ధించుటకు హేతుభూతుడు, జ్ఞానముచే మాత్రమే తెలియదగువాడు అగు శ్రీహరికి నమస్కరించుచున్నాము. ఆది మధ్యాంతములు లేనివాడు, పుట్టుక లేనివాడు, పరేశుడు, అనొదియైన ఆవిద్యయను ఆజ్ఞానమును నశింపచేయువాడు, సచ్చిదాననఘనస్వరూపుడు, రూపొదిర హితుడగు దేవునికి నమస్కరించుచున్నాము. అననుడు, ఈశుడు పీతాంబరుడు బ్రహ్మాదులచే సేవించబడువాడు, యజ్ఞప్రియుడు, యజ్ఞములను చేయువాడు, విశుద్దుడు, సర్వోత్తముడు, అవ్యయుడు, సర్వవ్యాపి అయిన శ్రీమన్నారాయణునికి నమస్కరించుచున్నాము.

ఇతి స్తుతో మహావిష్ణుర్దేవైరిన్ద్రాదిభిస్తథా

చరితం తస్య రాజర్షేర్దేవానాం సంన్యవేదయత్

తతో దేవాన్సమాశ్వాస్య దత్త్వా భయమనంజనః

జగామ యత్ర రాజర్షిస్తపస్తపతి నారద

శంఖచక్రధరో దేవస్సచ్చిదానన్దవిగ్రహః

ప్రత్యక్షతామగాత్తస్య రాజ్ఞస్సర్వజగద్గురుః

తం దృష్ట్వా పుండరీకాక్షం భాభాసితదిగన్తరమ్

అత సీపుష్పసంకాశం స్ఫురత్కుండలమండితమ్

స్నిగ్ధకుంతలవక్తాబ్దం విభాజన్మ కుటోజ్జ్వలమ్

శ్రీవత్సకౌస్తుభధరం వనమాలావిభూషితమ్

దీర్ఘబాహుముదారాంగం లోకేశార్చితపత్కడమ్

ననామ దండవద్భూమౌ భూపతిర్నమకంధరః

అత్యంతహర్షసంపూర్ణస్వరోమాంచస్సగదదః

కృష్ణ కృష్ణేతి కృష్ణేతి శ్రీకృష్ణేతి సముచ్చరన్

తస్య విష్ణుః ప్రసన్నాత్మా హ్యన్తర్యామీ జగద్గురుః

ఉవాచ కృపయావిష్ణో భగవాన భూతభావనః

ఇట్లు ఇంద్రాది దేవతలచే స్తుతించబడిన శ్రీమహావిష్ణువు భగీరధమహారాజు చరిత్రను దేవతలకు తెలియ చేసెను. తరువాత దేవతలనోదార్చి అభయమునిచ్చి భగీరధుడు తపస్సు చేయుచున్న ప్రదేశమునకు వెళ్ళెను. సర్వజగద్గురువు, సచ్చిదానన్ద స్వరూపుడు అయిన శ్రీహరి శంఖ చక్రములను ధరించి భగీరధమహారాజునకు ప్రత్యక్షమాయెను. తన కొంతిచే దిగంతములను ప్రకాశింపచేయుచున్నవాడు, పుండరీకాక్షుడు, అవిశపూవు వన్నె కలవాడు, ప్రకాశించు మండలములచే అలంకరించబడువాడు, దట్టమైన ముంగురులచే ప్రకాశించు ముఖ పద్మము కలవాడు, కిరీటముచే ప్రకాశించువాడు, శ్రీవత్సమును కౌస్తుభమును ధరించినవాడు, వనమాలచే అలంకరించబడినవాడు, ఆజానుబాహువు, ఉదారావయవములు కలవాడు లోకపాలకులచే పూజించబడు పాద పద్మములు కలవాడు, అయిన శ్రీమన్నారాయణుని చూచి దండవతణామము లాచరించెను. మిక్కిలి సంతోషముతో నిండినవాడై పులకింతలు తడబాటు రాగా కృష్ణ, కృష్ణ, కృష్ణ శ్రీకృష్ణ అని కీర్తించెను. జగద్గురువు, అంతర్యామి అయిన శ్రీహరి భూతసృష్టి చేసిన భగవానుడు కావున భగీరథ మహారాజునకు ప్రసన్నుడై దయతో నిట్లు పలికెను.

శ్రీభగవానువాచ :-

భగీరథ ! మహాభాగ ! తవాభీష్టం భవిష్యతి

ఆగమిష్యన్తి మల్లోకం తవ పూర్వపితామహాః

మమ మూర్త్యన్తరం శంభుం రాజన్తోత్రైస్సశక్తితః

స్తుహి తే సకలం కామం స వై సద్యః కరిష్యతి

యస్తు జగ్రాహ శశినం శరణం సముపాగతమ్

తస్మాదారాధయేశానం స్తోత్రైస్సుత్యం సుఖప్రదమ్

అనాదినిధనో దేవస్సర్వకామఫలప్రదః

త్వయా సంపూజితో రాజన్సద్య శే యే విధాస్యతి

ఇత్యుక్త్వా దేవదేవేశో జగతాం పతిరచ్యుతః

అంతర్దధీ మునిశ్రేష్ఠ ఉత్తస్థౌ సోఽపీ భూపతిః

కిమిదం స్వప్న ఆహోస్విత్ సత్యం సాక్షాద్ద్విజోత్తమ

భూపతిర్విస్మయం ప్రాప్తః కింకరోమీతి విస్మితః

ఆథాంతరిక్షే వాగుచ్చైః ప్రాహ తం భ్రాంతచేతసమ్

సత్యమేతదితి వ్యక్తం న చింతాం కర్తుమర్హసి

తన్నిశమ్యావనీపాల ఈశానం సర్వకారణమ్

సమస్త దేవతారాజం సమస్తౌ షీద్భక్తితత్పరః

శ్రీమన్నారాయణుడు పలికెను :- ఓ మహానుభావుడగు భగీరథుడా ! నీ కోరికి నెరవేరును. నీ పితామహులు నా లోకమునకు రాగలరు. నాకు మరో రూపమై శంకరుని నీ శక్తి కొలది స్తోత్రములును చేయుము. ఆ శంకరుడు నీ కోరికనంతటిని వెంటనే తీర్చగలడు. శరణు వేడిన చంద్రుని స్వీకరించినవాడు శంకరుడు. కావున స్తుతించదగినవాడు సుఖమునిచ్చువాడు అయిన శంకరుని స్తుతించుము. ఆద్యంతములు లేని ఆ శంకరుడు అన్ని కోరికల నిచ్చువాడు. నీచే పూజింపబడి వెంటనే మేలును చేకూర్చును. జగత్పతియగు ఆచ్యుతుడు ఇట్లు పలికి అంతర్ధానము చెందెను. ఆ భగీరథమహారాజు కూడా లేచి నిలబడెను. ఇది నిజమా ? నేనేమి చేయవలయును అని ఆశ్చర్యముగా చెందెను. ఇట్లు భ్రాంతి చెందిన భగీరథమహారాజును గూర్చి ఆకాశవాణి ఇది సత్యమే. విచారించవలదని పలికెను. ఆ మాటను వినిన భగీరథమహారజు, సమస్త దేవరాజు, జగత్కారణుడు అయిన శంకరుని స్తోత్రము చేసెను.

భగీరథ ఉవాచ:-

ప్రణమామి జగన్నాథం ప్రణతార్తిప్రణాశనమ్

ప్రమాణాగోచరం దేవమీశానం ప్రణవాత్మకమ్

జగద్రూపమజం నిత్యం సర్గస్థిత్యంతకారణమ్

విశ్వరూపం విరూపాక్షం ప్రణతోఽస్యుగ్ర రేతసమ్ ఆదిమధ్యాంతరహితమనన్తనుజమవ్యయమ్

సమామనన్తి యోగీన్ద్రాస్తం వన్డే పుష్టివర్ధనమ్

నమో లోకాధినాథాయ వంచతే పరివంచతే నమోఽస్తు నీలగ్రీవాయ పశూనాం పతయే నమః

నమశ్చైతన్యరూపాయ పుష్టానాం పతయే నమః నమః కల్పకల్పాయ భూతానాం పతయే నమః

నమః పినాకహస్తాయ శూలహస్తాయ తే నమః నమః కపాలహస్తాయ పాశముద్గరధారిణే

నమస్తే సర్వభూతాయ ఘంటహస్తాయ తే నమః నమః పంచాస్యదేవాయ క్షేత్రాణాం పతయే నమః

నమస్సమస్తభూతానామాదిభూతాయ భూభృతే అనేకరూపరూపాయ సద్గుణాయ పరాత్మనే

నమో గణాధిదేవాయ గణానాం పతయే నమః నమో హిరణ్యగర్భాయ హిరణ్యపతయే నమః

హిరణ్య రేతసే తుభ్యం నమో హిరణ్యపతయే నమః నమో ధ్యానస్వరూపాయ నమస్తే ధ్యానసాక్షిణే

నమస్తే ధ్యానసంస్థాయ ధ్యానగమ్యాగు తే నమః యేసేదం విశ్వమఖిలం చరాచరవిరాజితమ్

వర్షే వాభ్రేణ జనితం ప్రధానపురుషాత్మనా స్వప్రకాశం మహాత్మానం పరంజ్యోతిస్సనాతనమ్

యమామనన్తి తత్త్వజ్ఞా స్సవితారం నృచక్షుషామ్ ఉమాకాన్తం నంది కేశం నీలకంఠం సదాశివమ్

మృత్యుంజయం మహాదేవం పరాత్పరతరం విభుమ్ పరం శబ్దబ్రహ్మరూపం తం వన్దేఽఖిలకారణమ్

కపర్దినే నమస్తుభ్యం సద్యోజాతాయ వై నమః భవోద్భవాయ శుద్ధాయ జ్యేష్టాయ చ కనీయ సే

మన్యవే త ఇషే త్రయ్యాః పతయ్పేయజ్ఞతన్తవే ఊర్జే దిశాం చ పతయే కాలాయ ఘోరరూపిణీ

కృశానురేతసే తుభ్యం నమోఽస్తు సుమహాత్మనే

యతస్సముద్రాస్సరితోఽద్రయశ్చ గంధర్వయక్షాసుర సిద్ధసంఘాః స్థాణుశ్చరిష్ణుర్మహదల్పకం చ అసచ్చ సజ్జీవమజీవమాస

నతోఽస్మి తం యోగినతాంఘిపద్మం సర్వాత్తరాత్మనమరూపమీశమ్ స్వతంత్రమేకం గుణినాం గుణం చ నమామి భూయః ప్రణమామి భూయః

భగీరథమహారాజు పలికెను :- జగన్నాథుడు, ప్రణామము చేయువారి ఆర్తిని నశింప చేయువాడు, ప్రమాణములకు గోచరము కానివాడు, ప్రణవస్వరూపుడు అయిన ఈశ్వరునికి నమస్కరించుచున్నాను. జగద్రూపుడు, పుట్టుకలేనివాడు, నిత్యుడు, సృష్టి స్థితి లయకారుడు, విశ్వరూపుడు, ఉగ్రరేతసుడు అయిన విరూపాకుని నమస్కరించుచున్నాను. ఆది మధ్యాంతములు లేనివాడు అవ్యయుడు, పుష్టివర్ధనుడు, యోగీనులచే మననము చేయబడువాడు అయిన ఈశ్వరునికి నమస్కరించుచున్నాను. లోకాధినాథుడు, నీలకంఠుడు అయిన పశుపతికి నమస్కారము. చైతన్యరూపునకి, పుష్టులపతికి, అల్పప్రకల్పునికి భూతపతికి నమస్కారము. పినాకహస్తునకి, శూలహస్తునికి, కపాలహస్తునికి పాశముద్ధరధారికి నమస్కారము. సర్వభూతస్వరూపునికి ఘంటాపస్తునికి పంచముఖునకు, క్షేత్రపతికి నమస్కారము. సమస్త భూతములకు ఆదిభూతుడైనవానికి, భూభరణునకు, అనేకరూపునకు నిర్గుణునకు పరమాత్మునకు నమస్కారము. గణాధిదేవునకు గణపతికి హిరణ్యగర్భునకు హిరణ్యపతికి నమస్కారము. హిరణ్య రేతస్కునకు, హిరణ్యబాహువునకు, ధ్యానస్వరూపునకు, ధ్యానసాక్షికి, ధ్యానసంస్థునకు, ధ్యానగమ్యునకు. నమస్కారము. చరాచరాత్మకమగు ఈ ప్రపంచమునంతటిని ప్రకాశింపచేయువానికి నమస్కారము. ప్రకృతి పురుషరూపముతో నున్నవానికి, స్వయం ప్రకాశునకు, మహాత్మునకు, పరంజ్యోతికి, సనాతనునకు, తత్వజులు మననము చేయువానికి, మానవనేత్రములకు సూర్యుని వంటివారికి నమస్కారము. ఉమాకాంతుడు, నంది కేశుడు, నీలకంఠుడు, సదాశివుడు, మృత్యంజయుడు, మహాదేవుడు, పరాత్పరుడు, విభువుపరుడు, శబ్ద బ్రహ్మరూపుడు, అలకారణుడగు అగు శివునికి నమస్కరించుచున్నాను, కపర్థికి సద్యోజాతునకు నమస్కారము, భవోద్భవుడు, శుద్దుడు, జ్యేష్ఠుడు, కనిషుడు, మన్యువు, త్రయీపతి అయిన ఈశునకు నమస్కారము. దీక్పతికి, కాలునకు అఘోరరూపునకు కృశాను రేతస్కునకు మహాత్మునకు నమస్కారము. సముద్రములు, నదులు, పర్వతములు గంధర్వ, యక్ష అసుర సిద్ద సంఘములు ఎవనినుండి పుట్టినవో, ఆ స్థాణువును మహద్రూపుకు అల్పునకు, చరిష్ణువునకు సదసద్రూపునకు నమస్కరించుచున్నాను. యోగులచే నమస్కరించుబడు పాదపద్మములు గలవానికి, సర్వాంతర్యామికి, రూపరహితునికి స్వతంత్రునికి, గుణవంతుల గుణస్వరూపునికి ఈశ్వరునికి మాటిమాటికి నమస్కరించుచున్నొను.

ఇత్థం స్తుతో మహాదేవశ్శంకరో లోకశంకరః

ఆవిర్బభూవ భూపస్య సంతప్తతపసోగ్రతః

పంచవక్త్రం దశభుజం చంద్రార్ధకృతశేఖరమ్

త్రిలోచనదారాంగం నాగయజ్ఞోపవీతినమ్

విశాలవక్షసందేవం తుహినాద్రిసమప్రభమ్

గజచర్మాంబరధరం సురార్చితపదాంబుజమ్

దృష్ట్వా పపాత పాదాగ్రే దండవద్భువి నారద !

తత ఉత్థాయ సహసా శివాగ్రే విహితాంజలిః

ప్రణనామ మహాదేవం కీర్తయన్నంకరాహ్వయమ్

విజ్ఞాయ భుక్తిం భూపస్య శంకరశ్శశిశేఖరః

ఉవాచ రాజ్ఞై తుష్టోఽస్మి వరం వరయ వాంఛితమ్

తోషితోఽస్మి త్వయా సమ్యక్ స్తోత్రేణ తపన తథా

ఏవముక్తస్స దేవేన రాజా సంతుష్టమానసః

ఉవాచ ప్రాంజలిర్భూత్వా జగతామీశ్వరేశ్వరమ్

ఇట్లు స్తోత్రము చేయబడిన శంకరుడు లోకములకు శుభములకు కలిగించువాడు కావున ఉగ్రమైన తపస్సుచే తపించిన భగీరథ మహారాజునకు ప్రత్యక్షమాయెను. పంచవక్తుడు, దశభుజుడు, అర్ధచంద్ర శేఖరుడు, త్రిలోచనుడు, ఉదారాంగుడు, నాగయజ్ఞోపవీతుడు, విశాలవర్టుడు, హిమాద్రిసమకాంతిదేహుడు, గజచర్మాంబరధారి, సురార్చితపదాంబుజుడు అయిన శంకరుని చూచి భగీరథుడు దండమువలే శివుని పాదముల పై బడెను. తరువాత లేచి నిలబడి శివునిముందు చేతులు జోడించుకొని మహాదేవుని కీర్తించుచు నమస్కరించెను. చంద్ర శేఖరుడగు శంకరుడు రాజు భక్తిని తెలుసుకొని రాజునుద్దేశించి ఇట్లు పలికేను. ఓ రాజా ! నీ విషయమున సంతోషించితిని. నీకు కావలసిన వరమును కోరుకొనుము. నీవు చేసిన స్తోత్రమునకు తపస్సునకు సంతోషించితిని. ఇట్లు శంకరుడు పలుకగా భగీరథమహారాజు సంతోషించి జగదీశ్వరునితో చేతులు జోడించి ఇట్లు పలికెను.

భగీరథ ఉవాచ:-

అనుగ్రాహ్యోస్మి యది తే వరదానాన్మ హేశ్వర

తదా గంగాం ప్రయచ్ఛాస్మత్పితృణాం ముక్తి హేతవే

భగీరథుడు పలికేను :- ఓ మహేశ్వరా ! వరములనిచ్చి అనుగ్రహించ దలచినచో మా పితామహులు మోక్షమును చేరుటకు కారణమైన గంగను ప్రసాదించుము.

శ్రీ శివ ఉవాచ:-

దత్తా గంగా మయా తుభ్యం పితృణాం తే గతిః పరా తుభ్యం మోక్షః పరశ్చేతి తముక్త్వాన్తర్ధధే శివః

కపర్థినో జటాస్రస్తా గంగా లోకైకపావనీ పావయన్తీ జగత్సర్వమన్వగచ్చదగీరథమ్

తతః ప్రభృతి సా దేవీ నిర్మలా మలహారిణీ భాగీరథీతి విఖ్యాతా త్రిషు లోకేష్వభూన్ము నే

సగరస్యాత్మజాః పూర్వం యత్ర దగ్ధస్వపాస్మనా

తం దేశం ప్లావయామాస గంగా సర్వసరిద్వరా

యదా సంప్లావితం భస్మ సాగరాణాం తు గంగయా

తదైవ నరకే మగ్నో ఉద్ధృతాశ్చ గతైనసః

పురా సంక్రుశ్యమానేన యే యమేనాతిపీడితాః

త ఏవ పూజితా స్తేన గంగాజలపరిప్లుతాః

గతపాపాన్సా విజ్ఞాయ యమస్సగరసంభవాన్

ప్రణమ్యాభ్యర్చ్య విధివతాహా తానీతమానసః

భో ! భో ! రాజసుతా యూయం నరకాద్భృశదారుణాత్

ముక్త విమానమారుహ్య గచ్ఛధ్వం విష్ణుమందిరమ్

ఇత్యుక్తాస్తే మహాత్మానో యమేన గతకల్మషాః

దివ్యదేహధరా భూత్వా విష్ణులోకం ప్రపేదిరే

ఏవంప్రభావా సా గంగా విష్ణుపాదాగ్రసంభవా

సర్వలోకేషు విఖ్యాతా మహాపాతకనాశినీ

య ఇదం పుణ్యమాఖ్యానం మహాపాతకనాశనమ్

పఠేచ్చ శృణుయాద్యాపీ గంగాస్నానఫలం లభేత్

యస్త్వేతత్పుణ్యమాఖ్యానం కథయేర్భ్రాహ్మణాగ్రతః

స యాతి విష్ణుభవనం పునరావృత్తివర్జితమ్

ఇతి శ్రీ బృహాన్నారదీయపురాణే పూర్వభాగే ప్రథమపాదే గంగామాహాత్మ్యే భగీరథగంగానయనం నామ షోడశోఽధ్యాయః

శ్రీ శివుడు పలికెను :- నీ పితామహుల కొరకు నేను గంగనిచ్చుచున్నాను. నీకు ఉత్తమమైన మోక్షమును కూడా ఇచ్చితిని. అని పలికి అంతర్ధానము చెందెను. తరువాత శంకరుని జటలనుండి జారిపడిన లోకపావని యగు గంగ జగత్తును పావనము చేయుచు భగీరథుని అనుసరించెను. అప్పటినుండి మలమును తొలగించు నిర్మల యగు గంగ మూడు లోకములలో భాగీరథి యని ప్రసిద్ధి చెందేను. సగరపుత్రులు తన పాపములచే దగ్గమైన ప్రదేశమమును నదీ శ్రేష్ఠమైన గంగముంచివేసెను. సగరపుత్రుల భస్మమును గంగ తడి పీన వెంటనే సగరపుత్రులు పాపము తొలగినవారై నరకమునుండి ఉద్దరించబడిరి. పూర్వము యమునిచే పీడించబడిన సగరపుత్రులు గంగాజల సేచనముచే పూజించబడిరి. యముడు వారిని పాపరహితులుగా తెలుసుకొని నమస్కరించి యథావిధిగా పూజించి సంతోషమునీండిన మనసుతో నిట్లు పలికెను. “ఓ రాజా పుత్రులారా! మీరు మిగుల భయంకరమైన నరకమునుండి విముక్తులైతిరి. విమానము నధిరోహించి విష్ణుమందిరమునకు వెళ్ళుడు” ఇట్లు యమధర్మరాజు చెప్పగా పాపము తొలగిన సగరపుత్రులు దివ్య దేహమును ధరించి విష్ణులోకమును పొందిరి. విష్ణుపాదాగ్రమున పుట్టిన గంగ ఇంతటి ప్రభావము కలది. అన్ని లోకములతో మహాపాతకనాశిని అని ప్రసిద్ది చెందినది. మహాపాతకములను నశింపచేయు పవిత్రమైన ఈ కథను చదివిననూ వినిననూ గంగా స్నానఫలము లభించును. బ్రాహ్మణుల ముందు పవిత్రమైన ఈ కథను చెప్పినవారు పునరావృత్తిరహితమైన విష్ణుభవనమును చేరుదురు.

ఇది శ్రీ బృహన్నారదీయపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున గంగామాహాత్మ్యమున భగీరథగంగానయనమను పదునారవ అధ్యాయము సమాప్తము.