11 - గంగోత్పత్తిః  - గంగామాహాత్మ్యమ్

నారద ఉవాచ :-

అహో హ్యత్యద్భుతం ప్రోక్తం త్వయా భౌతందం మమ

స వహ్నిరదితిం ముక్త్వా కథం తానదహత్ క్షణాత్

వదాదితేర్మహాసత్త్వం విశేషాశ్చర్యకారణమ్

పరోపదేశనిరతాః సజ్జనా హి మునీశ్వరాః

నారదమహర్షి పలికెను :- “ఓ భ్రాతా ! చాల ఆశ్చర్యకరమైన విషయమును చెప్పితిరి. ఆ యగ్ని ఆదితిని వదిలి రాక్షసులను ఎట్లు క్షణములో దహించి వేసెను ? మిక్కిలి ఆశ్చర్యమును కలిగించు ఆదితి మహాత్మ్యమును తెలుపుము. సజ్జనులైన మునీశ్వరులు పరులకు ఉపదేశించుట యందే ఆసక్తి కలిగియుందురు కదా !”

సనక ఉవాచ :-

శృణు నారద మాహాత్మ్యం హరిభక్తిరతాత్మనామ్

హరిధ్యానపరాన్సాధూనస్సమర్థః ప్రబాధితుమ్

హరిభక్తిపరో యత్ర తత్ర బ్రహ్మ హరిశ్శివః

దేవాః సిద్దా మునీశాశ్చ నిత్యం తిష్ఠంతి సత్తమాః

హరిరా స్తే మహాభాగ హృదయే శాన్త చేతసామ్

హరినామపరాణాం చ కీము ధ్యానరతాత్మ నామ్

శివపూజారతో వాపి విష్ణుపూజాపరోఽపి వా

యత్ర తిష్ఠతి తతైవ లక్ష్మీస్సర్వాశ్చ దేవతాః

యత్ర పూజాపరో విష్ణుర్వహ్నిస్తత్ర న బాధతే

రాజా వా తస్కరో వాపి వ్యాధయశ్చ న సత్తి హి

ప్రేతాః పిశాచా కూష్మాండగ్రహా బాలగ్రహాస్తథా

డాకిన్యో రాక్షసాశ్చైవ న బాధన్తేఽచ్యుతార్చకమ్

పరపీడారతా యే తు భూతవేతాలకాదయః

నశ్యన్తి యత్ర సద్భక్తో హరిలక్ష్మ్యర్చనేరతః

జితేన్ద్రియః సర్వ హితో ధర్మకర్మపరాయణః

యత్ర తిష్ఠతి తవ సర్వతీర్ధాని దేవతాః

నిమిషం నిమిషార్థం వా యత్ర తిష్ఠన్తి యోగినః

తతైవ సర్వ శ్రేయాంపి తత్తీర్థం తత్తపోవనమ్

యన్నా మోచ్చారణాదేవ సర్వే నశ్యన్యుపద్రవాః

స్తోతైర్వాస్వర్ణణాభిర్వా కిముధ్యానేన కథ్యతే

ఏవం తేనాగ్నినా విప్ర దగ్ధం సాసురజాననమ్

సాదితిర్నైవ దగ్ధభూద్విష్ణుచక్రాభిరక్షితా

సనకమహర్షి పలికేను:- ఓ నారదా ! హరిభక్తియందు ఆసక్తిగల మనసు కలవారి మహాత్మ్యమును వినుము. శ్రీహరి ధ్యానమునందు మనసునుంచిన సాధువులను ఎవరు బాధించగలరు ? హరిభక్తి పరుడున్న ప్రదేశమున బ్రహ్మ, శివుడు, శ్రీహరి, దేవతలు, సిద్ధులు మునీశ్వరులు ఎల్లపుడు నివసింతురు. శాంత చిత్తులైన వారి హృదయమున శ్రీహరి నీవసించును. హరి నామ కీర్తనము చేయువారికి ధ్యానము నందాసక్తి కలవారి విషయమునేమీ చెప్పువలయును. శివపూజ చేయువాడు కాని. శ్రీమహావిష్ణువును పూజించువాడు కొని ఉన్న ప్రదేశముననే లక్ష్మి, దేవతలందరు నివసించేదరు. విష్ణుపూజాపరుడున్న ప్రదేశమున అగ్ని బాధించదు. రాజు కాని, చోరులు కానీ, వ్యాధులు కానీ బాధించవు. పేతములు, పిశాచములు, కూష్మాండ గ్రహములు, బాలగ్రహములు, డాకీనులు, రాక్షసులు అచ్యుతుని పూజించువానిని బాధించజాలవు. పరులను పీడించు స్వభావము కల భూతభేతాలొదులు లక్ష్మీనారాయణులను పూజించు సద్భక్తులున్న చోట నశించుపోవును, ఇంద్రియజయము కలవారు, అందరి హితమును కోరువారు, ధర్మబద్దమైన కర్మలను ఆచరించువారు ఉన్న ప్రదేశముననే అన్ని తీర్థములు, దేవతలు ఉందురు. ఒక నిమిషము గాని నిమిషార్థము కాని యోగులున్న ప్రదేశముననే అన్ని శ్రేయస్సులు కలుగును. ఆ ప్రదేశమే పుణ్యతీర్థము. అదియే తపోవనము. శ్రీహరినామమును కీర్తించినంతనే అన్ని ఉపద్రవములు నశించును. స్తోత్రములచే పూజలచే నశించును. ధ్యానము చేసినచో నశించునని విడిగా చెప్పవలెయునా ? ఇట్లు రాక్షసులు సృష్టించిన అగ్నిచే రాక్షసులతో కూడియున్న అరణ్యమంతయూ కాలిపోయెను. విష్ణుచక్రముచే రక్షించబడిన అదితి మాత్రమే దగ్ధము కాలేదు.”

తతః ప్రసన్నవదనః పద్మపత్రాయతేక్షణః

ప్రాదురా సీత్సమీపేఽస్యాః శంఖచక్రగదాధరః

ఈషద్ధాస్యస్ఫురద్ధనప్రభాభాసితదిజ్ముఖః

స్పృశన రేణ పుణ్యేన ప్రాహ కశ్యపవల్లభామ్

తరువాత ప్రసన్నమైన ముఖము కలవాడు, పద్మదళమువలె విశాలమైన నేత్రములు కలవాడు, శంఖ చక్ర గదొద్యాయుధములను ధరించినవాడు, చిరునవ్వుతో వెలుగుచున్న దన్తముల కాంతితో దిక్కులను ప్రకాశింపచేయువాడు అయిన శ్రీమన్నారాయణుడు అదితి సమీపములో ప్రత్యక్షమాయెను. పరమ పవిత్రమైన తన చేతితో అదితిని తాకుచు ఇట్లు పలి కెను.

శ్రీ భగవానువాచ :-

దేవమాతః ! ప్రసన్నోఽస్మి తపసారాధితస్త్వయా

చిరం శ్రాంతాసి భద్రం తే భవిష్యతి న సంశయః

వరం వరయ దాస్యామి యత్తే మనసి రోచతే

మా భీర్భధ్రే మహాభాగే ధ్రువం శ్రేయో భవిష్యతి

ఇత్యుక్తా దేవమాతా సా దేవదేవేన చక్రిణా

తుష్టావ ప్రణిపత్యైనం సర్వలోకసుఖానహమ్

శ్రీమన్నారాయణ భగవానుడు పలికెను :- “ఓ దేవమాతా ! నీవు తపస్సుచే నన్ను ఆరాధించితివి. నేను నీకు ప్రసన్నుడనైతిని. చాలకొలము అలసిఉంటివి నీకు శుభము కలుగును. సంశయించవలసిన పనిలేదు. నీకు నచ్చిన వరమును కోరుకొనుము. ఈయగలను. ఓ మహానుభావురాలా ! భయపడకుము. తప్పక మేలు జరుగును.” ఇట్లు శ్రీహరి పలుకగా శ్రీహరికి నమస్కరించి అన్ని లోకములకు ఆనందమును కలిగించు శ్రీహరిని స్తోత్రము చేసెను.

అదితిరువాచ :-

నమస్తే దేవదేవేశ సర్వవ్యాపిన్ జనార్దన !

సత్త్వాదిగుణభేదేన లోకవ్యాపొరకారణ !

నమస్తే బహురూపాయారూపాయ చ మహాత్మనే

సర్వేకరూపరూపాయ నిర్గుణాయ గుణాత్మనే

నమస్తే లోకనాథాయ పరమజ్ఞానరూపిణీ

సద్భక్తజనవాత్సల్యశాలినే మంగలాత్మనే

యస్యావతారరూపాణి హ్యర్చయస్తి మునీశ్వరాః

తమాదిపురుషం దేవం నమామి హ్యర్థ సిద్దయే

శ్రుతయో యం న జానస్తి న జానప్తి చ సూరయః

తం నమామి జగద్దెతుం సమాయం చాప్యమాయినమ్

యస్యావలోకనం చిత్రం మయోపద్రవకారణమ్

జగద్రూపం జగఢ్తుం తం వన్డే సర్వవందితమ్

యత్పాదాంబుజకింజల్క సేవారక్షితమస్తకాః

అవాపుః పరమాం సిద్ధిం తం వన్డే కమాలాధవమ్

యస్య బ్రహ్మాదయో దేవా మహిమానం న వై విదుః

అత్యాసన్నం చ భక్తానాం తం వన్దే భక్తసంగినమ్

యో దేవస్త్యక్తసంగానాం శాంతానాం కరుణార్ణవః

కరోతి హ్యాత్మనః సంగం తం దేవం సంగవర్జితమ్

యజ్ఞేశ్వరం యజ్ఞకర్మ యజ్ఞకర్మసు నిషితమ్

నమామి యజ్ఞఫలదం యజ్ఞకర్మ ప్రబోధకమ్

అజామిలోఽపి పాపాత్మా యన్నామోచ్చారణాదను

ప్రాప్తవానరమంధామ తం వన్దే లోకసాక్షిణమ్

హరిరూపీ మహాదేవః శివరూపీ జనార్దనః

ఇతి లోకస్య నేతా యస్తం నమామి జగద్గురుమ్

బ్రహ్మాద్యా అపి దేవేశా యన్మాయాపాశయశ్రితాః

న జానప్తి పరం భావం తం వన్డే సర్వనాయకమ్

హృత్పద్మస్థోఽప్యయోగ్యానాం దూరస్థ ఇవ భాసతే

ప్రమాణాతీతసద్భావస్తం వన్దే జ్ఞానసాక్షిణమ్

యన్ముఖాదాహ్మణో జాతో బాహుభ్యాం క్షత్రియోఽజని

ఊర్వశ్య స్సముత్పన్నః పద్భ్యాం శూద్రోఽభ్యజాయత

మనసశ్చన్దమా జాతో జాతస్సూర్యశ్చ చక్షుషః

ముఖాదగ్నిస్తథేన్దశ్చ ప్రాణాద్వాయురజాయత

ఋగ్యజుస్సామరూపాయ సప్తస్వరగతాత్మనే

షడంగరూపిణే తుభ్యం భూయో భూయో నమో నమః

తమిస్ట్రః పవనస్సోమస్తమీశానస్త్వనన్తకః

త్వమగ్న్నిఋతి శ్చైవ వరుణస్త్వం దివాకరః

దేవాశ్చ స్థావరాశ్చైవ పిశాచాశ్చైవ రాక్షసాః

గిరయ సిద్ధగంధర్వా నద్యో భూమిశ్చ సాగరా

త్వమేవ జగతామీశో యసి త్వం పరాత్పరః

త్వద్రూపమఖిలం దేవ తస్మాన్నిత్యం నమోఽస్తుతే

అనాథనాథ ! సర్వజ్ఞ భూతదేవేన్దవిగ్రహ !

దైలేయైర్బాధితాన్పుతాన్మమ పాహి జనార్దన !

ఇతి స్తుత్వా దేవమాతా దేవం నత్వా పునః పునః

ఉవాచ ప్రాంజలిర్భూత్వా హర్షాశ్రుక్షాలితస్తనీ

అదితి పలికెను:- ఈ దేవతలకు దేవుడవు, ప్రభువును, అంతటా వ్యాపించియుండువాడవు, సత్త్వరజస్తమో గుణభేదములచే లోకవ్యాపారములకు కారణభూతుడవు అయిన ఓ జనార్థనా! నీకు నమస్కారము. అనేక రూపములు గలవాడవు, రూపములేనివాడవు, మహానుభావుడవు అన్నిటిలో ఒకే రూపముతో నుండువాడవు, గుణరహితుడవు, అనన్త కళ్యాణగుణస్వరూపుడవు అయిన నీకు నమస్కారము. అన్ని లోకములకు నాధుడవు, పరమజ్ఞానస్వరూపుడవు, సజ్జనులగు భక్తులను వాత్సల్యముతో చూచు స్వభావము కలవాడవు, మంగళస్వరూపుడవు అయిన నీకు నమస్కారము. మునీశ్వరులు పూజించి అవతార రూపములు గల ఆదిపురుషుని నా కోరిక సిద్ధించుటకు నమస్కరించుచున్నాను. శ్రుతులకు, జ్ఞానులకు తెలియ శక్యము కానివాడు జగత్కారణభూతుడు, మాయతో కూడియుండువాడు, మాయకు వశము కానివాడు అయిన పరమాత్మకు నమస్కరించుచున్నాను. ఆశ్చర్యమును కలిగించు నీ దర్శనము మాయను పారద్రోలుటకు కారణము. జగత్స్వరూపుడు, జగత్కారణ భూతుడు అయిన అందరిచే నమస్కరించబడు వానిని నమస్కరించుచున్నాను. నీ పాదపద్మముల పరాగములను సేవించుటచే తమ మస్తకములను కాపాడు కొనుచు పరమసిద్ధిని పొందుచున్నారు. కమలాపతివైన నీకు నమస్కారము. బ్రహ్మాదులకు కూడా తెలియ శక్యము కాని మహిమ కలవాడు, భక్తులకు సన్నిహితముగా నుండువాడు, భక్తులతో కలిసి ఉండువాడు అయిన స్వామిని నమస్కరించుచున్నాను. అన్ని సంగములను వదిలి శాంతచిత్తులయిన వారికి ఆత్మ సంగతిని కలిగించు కరుణాసముద్రుడు, సంగరహితుడు, యజ్ఞములకు ప్రభువు యజ్ఞకర్మస్వరూపుడు, యజ్ఞకర్మలయందు ఉండువాడు, యజ్ఞఫలములనిచ్చువాడు యజ్ఞకర్మలను బోధించువోడు అయిన ఆదిదేవునికి నమస్కరించుచున్నాను. కేవలము నామసంకీర్తనముచే అజామిలునికి పరమపదమును ప్రసాదించిన లోకసాక్షిని నమస్కరించుచున్నాను. హరిరూపముతో నున్న మహాదేవుడుగా, శివరూపముతో నున్న జనార్దనుడుగా, లోకాధిపతిగానున్న జగద్గురువునకు నమస్కరించుచున్నౌను. నీ మాయాపొశముతో బంధించబడి బ్రహ్మాదిదేవాధిపతులు కూడా పరస్వరూపమును తెలియలేకున్నారు. అట్టి సర్వనాయకుడవగు నీకు నమస్కారము. అయోగ్యులకు హృదయపద్మములో నున్ననూ దూరమున నున్నవానీ వలే తోచుచున్నావు. ప్రమాణములకు అందని సత్త (ఉనికి) గల జ్ఞాన సాక్షికి నమస్కారము. నీ ముఖమునుండి బ్రాహ్మణులు పుట్టిరి. బాహువులనుండి క్షత్రియులు పుట్టిరి. ఊరువులనుండి వైశ్యులు పుట్టిరి. పాదములనుండి శూద్రులు పుట్టిరి. మనసు నుండి చంద్రుడు, నేత్రము నుండి సూర్యుడు, ముఖము నుండి అగ్ని, ఇంద్రుడు, ప్రాణము నుండి వాయువు పుట్టెను. ఋగ్యజుస్సామ స్వరూపునకు సత్యవాక్స్వరూపునకు షడంగరూపునకు మాటిమాటికి నమస్కారము. నీవే ఇంద్రుడవు; వాయువు; చంద్రుడవు; శంకరుడవు; యముడవు; అగ్నీవి; నిర్ఋతివి; వరుణుడవు; సూర్యుడవు, దేవతలు, స్థావరములు, పిశాచములు, రాక్షసులు, పర్వతములు సిద్దులు, గంధర్వులు, నదులు, భూమి, సముద్రములు అన్నియు నీవే. జగత్తునకు ఈశ్వరుడవు నీవే. పరములన్నిటికీ పరుడవు నీవే. ఈ ప్రపంచమంతయూ నీరూపమే. కావున నీకు సర్వకాలములందు నమస్కారము. దిక్కులేని వారికి నీవే దిక్కు. సర్వజ్ఞుడవు. భూతముల, దేవతల, అధిపతుల స్వరూపుడవు నీవే. ఓ జనార్దనా ! రాక్షసులచే బాధించబడు నా పుత్రులను కాపాడుము.” ఇట్లు దేవమాతయగు అదితి జనార్ధనుని స్తుతించి, మాటిమాటికి నమస్కరించి చేతులు జోడించి ఆనందాశ్రువులతో తడిసిన స్తనములు కలదై మరల ఇట్లు పలికెను.

అనుగ్రాహ్యాస్మి దేవేశ త్వయా సర్వాదికారణ

అకంటకాం శ్రియం దేహి మత్సుతానాం దివౌకసామ్

అన్తర్యామిన్ జగద్రూప సర్వజ్ఞ పరమేశ్వర !

అజ్ఞాతం కిం తవ శ్రీశ ! కింమామీహయసి ప్రభో

తథాపి తవ వక్ష్యామి యన్మే మనసి రోచతే

వృధాపుత్రోస్మి దేవేశ ! దైతేయైః పరిపీడితా

తాన్న హింసితు మిచ్ఛామి యతస్తేఽపి సుతా మమ

తానహత్వా శ్రియం దేహి మత్సుతేభ్యస్సురేశ్వర !

ఇత్యుకో దేవదేవేశః పునః ప్రీతిముపాగతః

ఉవాచ హర్షయనిప్ర ! దేవమాతరమాదరాత్

“అన్నిటికి ఆదికారణభూతుడవైన ఓ దేవేశా ! నీ అనుగ్రహమునకు పాత్రురాలగుదునేని స్వర్గవాసులగు నా పుత్రులకు అడ్డులేని ఐశ్వర్యమును ప్రసాదించుము. ఓ అంతర్యామీ ! జగత్స్వరూపా ! సర్వజ్ఞుడా ! పరమేశ్వరా ! నీకు తెలియనిదేమున్నది ? నన్ను పరీక్షించుచుంటివా ? అయిననూ నా మనసునకు నచ్చిన దానిని నీకు చెప్పేదను. నా పుత్రులు వ్యర్ధులై ఉన్నారు. దైత్యుల చేత పీడింపబడుచున్నారు. అయిననూ నేను దిలీపుత్రులను హింసించదలచలేదు. వారు కూడా నా పుత్రులే. వారికి హాని కలుగకుండా నా పుత్రులకు ఐశ్వర్యమును ప్రసాదింపుము.” ఇట్లు అదితి పలుకగా దేవదేవేశుడగు శ్రీమన్నారాయణుడు మరల ప్రీతిచెంది అదితిని సంతోషింపచేయుచు ఆదరముతో దేవమాతను గూర్చి ఇట్లు పలికెను.

శ్రీభగవానువాచ :-

ప్రీతోఽస్మి దేవి భద్రం తే భవిష్యామి సుతో హ్యహమ్

యతస్సపత్నీపుత్రేషు వాత్సల్యం దేవి ! దుర్లభమ్

త్వయా తు యత్కృతం స్తోత్రం తత్పఠంతి నరాస్తు యే

తేషాం సంపద్వరాః పుత్రా న హీయంతే కదాచన

ఆత్మజే వాన్యపుత్రే వా యస్సమత్వేన వర్తతే

న తస్య పుత్రశోకః స్యాదేష ధర్మ సనాతనః

శ్రీమన్నారాయణ భగవానుడు పలికెను :- “ఓ దేవమాతా ! నేను సంతోషించితిని. నీకు శుభమగు గాక. నేను నీకు పుత్రుడనగుదును. సవతి కొడుకుల యందు దుర్లభమగు వాత్సల్యమును నీవు చూపితివి. నీవు చేసిన స్తోత్రమును చదివిన మానవులకు ఐశ్వర్యముతో కూడిన పుత్రులు తరుగకుండా ఉందురు. తన పుత్రునియందు ఇతరుల పుత్రుని యందు సమభావములో నుండు వారికి పుత్రశోకము కలుగదు. ఇది సనాతన ధర్మము.”

అదితిరువాచ :-

నాహం వోడుం క్షమా దేవ త్వామాద్యం పురుషం పరమ్

అసంఖ్యాతాండరోమాణం సర్వేశం సర్వకారణమ్

యత్ర్పభావం న జానస్తి శ్రుతయస్సర్వదేవతాః

తమహం దేవదేవేశం ధారయామి కథల ప్రభో

అశోరణీయాంసమజం పరాత్పరతరం ప్రభుమ్

ధారయామి కథం దేవ త్వామహం పురుషోత్తమ్

మహాపాతకయుక్తోఽపి యన్నామస్మృతిమాత్రతః

ముచ్యతే స కథం దేవో గ్రామ్యేషు జనిమర్హతి

యథా సూకరమత్స్యా ద్యా అవతారాస్తవ ప్రభో

తథాయమపి కో వేద తవ విశ్వేశ చేష్టితమ్

త్వత్పాదపద్మప్రణతా త్వన్నామస్మృతితత్పరా

త్వామేవ చింతయే దేవ యథేచ్ఛసి తథా కురు

అదితి పలికెను :- ఆదిపురుషుడవు పరమపురుషుడవు అయిన నిన్ను నేను మోయలేను. నీవు లెక్కలేనన్ని బ్రహ్మాండములు రోమకూపములుగా గలవాడవు. సర్వేశ్వరుడవు సర్వకారణుడవు. దేవతలందరూ శ్రుతులన్నియూ నీ ప్రభావమును తెలియజాలవు. అట్టి దేవదేవేశుడవైన నిన్ను నేనెట్లు ధరించగలను ? అణువుకంటె అణువు, పుట్టుకలేని వాడవు, పరము కంటే పరుడవు, ప్రభువువు, పురుషోత్తముడవైన నిన్ను నేనెట్లు ధరించగలను ? నీ నామస్మరణ మాత్రముననే మహాపాతకములతో కూడి యున్నవాడు కూడా పాతకముల నుండి విడివడును. అట్టి దేవదేవుడవైన నీవు గ్రామ్యులమైన (అజ్ఞానులు) మాయందేట్లు పుట్టెదవు ? మత్స్యవరాహాద్యవతారములవలె ఇది కూడా ఒక అవతారమే. నీ విశేష చేష్టలనెవరు తెలియగలరు ? నీ పాదపద్మములకు వందనములాచరించుచు, నీ నామమును స్మరించుచు నిన్నే ధ్యానించుచుందును. నీ సంకల్పము ప్రకారము చేయుము.

సనక ఉవాచ :-

తయోక్తం వచనం శ్రుత్వా దేవదేవో జనార్దనః

దత్త్వాభయం దేవమాతురిదం వచనమబ్రవీత్

సనకమహర్షి పలికెను :- దేవదేవుడగు జనార్దనుడు అదితి పలికిన మాటలను విని దేవమాతకు అభయమిచ్చి ఇట్లు పలికేను.

శ్రీ భగవానువాచ :-

సత్యముక్తం మహాభాగే ! త్వయా నాస్త్యత్ర సంశయః

తథాపి శృణు వక్ష్యామి గుహ్యాద్దుహ్యతరం శుభే !

రాగద్వేషవిహీనా యే మద్భక్తి మత్పరాయణాః

వహస్తి సతతం తే మాం గతాసూయా అదాంభికాః

పరోపతాపవిముఖాః శివభక్తిపరాయణాః

మత్కథాశ్రవణాసక్తా వహస్తి సతతం హి మామ్

పతివ్రతాః పతిప్రాణాః పత్తిభక్తిపరాయణాః

వహస్తి సతతం దేవి ! స్త్రీయోఽపి త్యక్తమత్సరాః

మాతాపిత్రోశ్చ శుశ్రూషుగ్గురుభక్తోఽతిథిప్రియ

హితకృదాహ్మణానాం యః ప మాం వహతి సర్వదో

పుణ్యతీర్థరతా నిత్యం సత్సంగనిరతాస్తథా

లోకానుగ్రహశీలాశ్చ సతతం తే వహస్తా మామ్

పరోపకారనిరతాః పరద్రవ్యపరాజ్ముఖాః

నపుంసకాః పర షు తే వహస్తి చ మాం సదా

తులస్యుపాసనిరతాః సదా నామపరాయణాః

గోరక్షణపరా యే చ సతతం మాం వహస్తి తే

ప్రతిగ్రహనివృత్తా యే పరాన్నవిముఖాస్తథా

అన్నోదకప్రదాతారో వహస్తి సతతం హి మామ్

త్వం తు దేవి ! పతిప్రాణా సాధ్వీ భూత హితే రతా

సంప్రాప్య పుత్రభావం తే సాధయిష్యే మనోరథమ్

ఇత్యుక్త్వా దేవదేవేశో హ్యదితిం దేవమాతరమ్

దత్వా కంఠగతాం మాలామభయం చ తిరోదధే

సా తు సంహృష్టమనసా దేవసూర్దక్షనందినీ

ప్రణమ్య కమలాకొన్తం పునస్స్వస్థానమావ్రజత్

శ్రీమన్నారాయణ భగవానుడు పలికెను :- “ఓ మహానుభావురాలా ! నీవు నిజమునే చెప్పితివి. ఈ విషయమున సంశయమే లేదు. అయిననూ రహస్యములన్నింటికంటే పరమ రహస్యమును నేను చెప్పుచున్నాను, వినుము. రాగద్వేషములు లేనివారు, అసూయను పోగొట్టినవారు, డాంబికము లేని వారు, నా భక్తులు నాయందే మనసును నిలిపిన వారు, నన్ను ధరించగలరు (మోయగలరు). ఇతరులను బాధించుటలో వైముఖ్యము కలవారు, శివభక్తి పరాయణులు, నా కథను వీనుటలో ఆసక్తి కలవారు నన్ను మోయగలరు. పతివ్రతలు, పతియందు పేమ గలవారు, పతిభక్తి పరాయణులు మాత్సర్యమును విడిచిన స్త్రీలు కూడా నన్ను మోయగలరు. తల్లిదండ్రులను సేవించువారు, గురుభక్తి కలవారు, అతిథియందు ప్రీతిని చూపువారు, బ్రాహ్మణులకు హితమును చేయువారు నన్ను మోయగలరు. పుణ్యతీర్థములను సేవించుటయందాసక్తి కలవారు, సత్సంగమునందు కోరిక గలవారు, లోకులను అనుగ్రహించు స్వభావము కలవారు నన్ను మోయగలరు. ఇతరులకు ఉపకారము చేయువారు, ఇతరుల ద్రవ్యమును ఆశించనివారు, ఇతరుల స్త్రీల విషయమున నపుంసకుల వలె నుండు వారు నన్ను మోయగలరు. తులసిని ఉపాసించువారు, నామసంకీర్తనము చేయువారు, గోవులను రక్షించువారు నన్ను మోయగలరు. ఇతరుల నుండి దానమును గ్రహించనివారు, ఇతరుల అన్నమును భుజించనివారు, ఇతరులకు అన్నమును జలమును ఇచ్చువారు నన్ను మోయగలరు. ఓ దేవీ ! నీవు భర్తయందు అనురాగము కలదానవు. సాధ్వివి. ప్రాణులహితమును కోరుదానవు. కావున నీకు పుత్రునిగా జన్మించి నీ కోరికను తీర్చగలను.” దేవదేవేశుడగు శ్రీమన్నారాయణుడు ఇట్లు పలికి దేవమాతయగు అదితికి తన మెడలోని పుష్పమాలను, అభయమునిచ్చి అంతర్థానమును చెందెను. దక్షప్రజాపతి పుత్రిక దేవమాతయగు అదితి సంతోషముతో నిండిన మనసుగలదై శ్రీమన్నారాయణునికి నమస్కరించి తన ఇంటికి వెళ్ళెను.

తతోఽదితిర్మహాభాగా సుప్రీతా లోకవందితా

అసూత సమయే పుత్రం సర్వలోకనమస్కృతమ్

శంఖచక్రధరం శాంతం చంద్రమండలమధ్యగమ్

సుధాకలశదధ్యన్నకరం వామనసంజ్ఞితమ్

సహస్రాదిత్యసంకాశం వ్యాకోశకమలేక్షణమ్

సర్వాభరణసంయుక్తం పీతామ్బరధరం హరిమ్

స్తుత్యం మునిగజైర్యుక్తం సర్వలోకైకనాయకమ్

ఆవిర్భూతం హరిం జ్ఞాత్వా కశ్యపో హర్షవిహ్వలః

ప్రణమ్య ప్రాంజలిర్భూత్వా స్తోతుం సముపచక్రమే

మహానుభావురాలు, సంతోషయుక్తు రాలు, లోకములచే నమస్కరించదగినది అయిన అదితి కొంతకాలమునకు సరిఅయిన సమయమున అన్ని లోకములచే నమస్కరించబడు శ్రీమన్నారాయణుని పుత్రునిగా ప్రసవించెను. శంఖచక్రములను ధరించినవాడు, శాంతుడు, చంద్రమండల మధ్యమున గోచరించువాడు, అమృతకలశమును, పెరుగన్నమును చేత ధరించినవాడు, వామనుడను పేరుగలవాడు, వేయి సూర్యుల ప్రకాశము కలవాడు, వికసించిన కమలముల వలె విశాలములైన నేత్రములు కలవాడు, అన్ని ఆభరణములు కలవాడు, పచ్చని వస్త్రమును ధరించినవాడు, స్తోత్రము చేయదగినవాడు, మునిగణములతో కూడియుండువాడు, అన్ని లోకములకు ఒక నాయకుడు అయిన శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించుట చూచిన కశ్యప మహర్షి ఆనందముతో తడబడుచు నమస్కరించి చేతులు జోడించి స్తోత్రము చేయుటకు ఉపక్రమించెను.

కశ్యప ఉవాచ :-

నమో నమస్తేఽఖిలకొరణాయ నమో సమ స్తేఽఖిలపాలకాయ

నమో నమస్తేఽమరనాయకాయ నమో నమో దైత్యవినాశకాయ

నమో నమో భక్తజనప్రియాయ నమో నమస్సజ్జనరంజితాయ

నమో నమో దుర్జననాశనాయ నమోఽస్తు తస్మై జగదీశ్వరాయ

నమో నమః కారణవామనాయ నౌరాయణాయామితవిక్రమాయ

సశార్ఙ్గచక్రౌపీగదాధరాయ నమోఽస్తు తస్మె పురుషోత్తమాయ

నమః పయోరాశినివాసనాయ నమోఽస్తు సద్దత్కమలస్థితాయ

నమోఽస్తు సూ ర్యోద్యమీతప్రభాయ నమో నమః పుణ్యకథాగతాయ

నమోనమోఽర్కేళ్లువిలోచనాయ నమోఽస్తు తే యజ్ఞఫలప్రదాయ

నమోఽస్తు యజ్ఞాజ్ఞవిరాజితాయ నమోఽస్తు తే సజ్జనవల్లభాయ

నమో జగత్కారణకొరణాయ నమోఽస్తు శబ్దాదివివర్జితాయ

నమోఽస్తు తే దివ్యసుఖప్రదాయ నమో నమో భక్త మనోగతాయ

నమోఽస్తు తే ధ్వాన్తవినాశకాయ నమోఽస్తు తే మన్టరధోరకాయ

నమోఽస్తు యజ్ఞవరాహనామ్నే నమో హిరణ్యాక్షవిదారయకొయ

నమోఽస్తు తే వామనరూపభాజే నమోఽస్తు తే కత్తకులాంతకాయ

నమోఽస్తు తే రావణమర్దనాయ నమోఽస్తు తే నన్దసుతాగ్రజాయ

నమస్తే కమలాకాంత ! నమస్తే సుఖదాయినే

స్మృతార్తినాశినే తుభ్యం భూయో భూయో నమః

యజేశ యజ్ఞవిన్యాస యజ్ఞవిఘ్నవినాశన

యజ్ఞరూప యజద్రూప యజ్ఞాంగం త్వాం యజామ్యహమ్

ఇతి పుతస్స దేవేశో వామనో లోకపావనః

ఉవాచ ప్రహసన్తర్షం వర్థయన్కశ్యపస్య సః

కశ్యపమహర్షి పలికెను :- “సమస్త జగత్తునకు కారణభూతునకు నమస్కారము. సమస్తలోకములను రక్షించు వానికి నమస్కారము. దేవతల నాయకునికి నమస్కారము. దైత్యులను నశింపచేయువానికి నమస్కారము. భక్తజన ప్రియునికి సజ్జనరంజకునికి, దుర్జననాశకునికి, జగదీశ్వరునికి నమస్కారము. కారణార్థము వామనుడైన వానికి, అమిత పరాక్రమము కలవానికి శార్జము చక్రము ఖడ్గము గదను ధరించిన పురుషోత్తముడైన శ్రీమన్నారాయణునకు నమస్కారము. సముద్రమున నివసించువానికి, సజ్జనహృదయకమలముల యందు నివసించు వానికి, సూర్యాదితేజోరాశులను మించిన తేజస్సు కలవానికి, పుణ్య కథలలో నివసించువానికి నమస్కారము. సూర్యచంద్రులు నేత్రములుగా గలవానికి, యజ్ఞఫలము నిచ్చువానికి, యజ్ఞాంగములతో ప్రకాశించువానికి, సజ్జన ప్రియునికి నమస్కారము. జగత్కారణములకు కొరణమైన వానికి, శబ్దాదిగుణములు అంటని వానికి, దివ్యానందము నిచ్చువానికి, భక్తుల మనసులో నుండు వానికి నమస్కారము. చీకటిని తొలగించువానికి, మందరపర్వతమును మోసిన వానికి, యజ్ఞవరాహమను పేరుగల వానికీ, హిరణ్యాక్షుని చీల్చిన వానికి నమస్కారము. వామన రూపమును ధరించిన మౌనికీ, క్షత్రియ కులాంతకునికి, రావణాసురుని మర్ధించిన వానికి, నందసుతునికి నమస్కారము. కమలాకాంతునకు, ఆనందము నిచ్చువానికి, తలచిన వారి ఆర్తీని తొలగించువానికీ, మాటి మాటికి నమస్కారము. యజ్ఞేశునకు, యజ్ఞవిన్యాసునకు, యజ్ఞవిఘ్నవినాశునకు, యజ్ఞరూపునకు, పూజారూపునకు, యజ్ఞాంగునకు నమస్కారము. నిన్ను పూజింతును. లోకవనుడైన వామనుడు ఇట్లు స్తుతించబడి చిరునవ్వుతో కశ్యపునికి ఆనందమును పెంచుచు ఇట్లు పలికెను.

శ్రీ భగవానువాచ:-

తాత ! తుష్టోఽస్మి భద్రం తే భవిష్యతి సురార్చిత !

అచిరాత్సాధయిష్యామి నిఖిలం త్వన్మనోరథమ్

అహం జన్మ ద్వయే శ్వవల యువయోః పుత్రతాంగతః

అస్మి న్జన్మన్యపి తథా సాధయామ్యుత్తమం సుఖమ్

అత్రాంతరే బలిళ్లైత్యో దీర్ఘసత్రం మహామఖమ్

ఆరేభే గురుణా యుక్తః కావ్యేన చ మునీశ్వరైః

తస్మిన్మఖే సమాహూతో విష్ణుర్లక్ష్మీపమన్వితః

హవిస్వీకరణార్థాయ ఋషిభిరహ్మవాదిభిః

ప్రవృద్ధేశ్వర్యదైత్యస్య వర్తమానే మహాక్రతౌ

ఆమన్త్య మాతాపితరౌ స వటుర్వొమనో యయౌ

స్మితేన మోహయన్ లోకం వామనో భక్తవత్సలః

హవిర్బోకుమివాయాతో బలేః ప్రత్యక్షతో హరిః

దుర్వృత్త వా సువృత్త వా జడో వాయం హిత్కోఽపి వా

యో భక్తియుక్తస్తస్యాన్తః పదా సన్ని హితో హరిః

ఆయాన్తం వామనం దృష్ట్వా ఋషయో జ్ఞానచక్షుషః

జ్ఞాత్వా నారాయణం దేవముద్యయుః సభ్యసంయుతాః

ఏతద్ జ్ఞాత్వా దైత్యగురురేకాంతే బలిమబ్రవీత్

స్వసారమవిచార్యైవ ఖలాః కార్యాణి కుర్వతే

శ్రీమన్నారాయణ భగవానుడు పలికెను :- “ఓ తండ్రీ ! దేవతలచే పూజించబడువాడా ! నీ విషయమున సంతోషించితిని. నీకు శుభము కలుగును. త్వరలోనే నీ కోరికను సాధించగలను. నే నిదివరకు రెండు జన్మలలో మీకు పుత్రుడినైతిని. అట్లే ఈ జన్మలో కూడా మీకు ఉత్తమానందమును అందించగలను.”

ఇంతలో బలిచక్రవర్తి గురువైన శుక్రాచార్యులతో, ఇతర మునీశ్వరులతో కలిసి దీర్ఘసత్రమను. గొప్పయజ్ఞము నారంభించెను. ఆ యజ్ఞమున హవిస్సును స్వీకరించుటకు లక్ష్మీనారాయణుని ఋషులు ఆహ్వానించిరి. వృద్ధిచెందిన ఐశ్వర్యముకల బలిచక్రవర్తి చేయుచున్న యజ్ఞములో పాల్గొనుటకు తల్లిదండ్రుల ఆజ్ఞను పొంది బ్రహ్మచారి అయిన వామనుడు భక్తవత్సలుడు కావున చిరునవ్వుతో లోకమును మోహింప చేయుచు శ్రీహరి ప్రత్యక్షముగా హవిస్సును స్వీకరించుటకు వచ్చేనా అనునట్లు అచటికి వచ్చెను. చెడునడక గలవాడుకాని, మంచి నడక గలవాడుకొని, జడుడు కాని హితుడు కొని భక్తి కలవానిలో హారీ వేంచేసి యుండును. జ్ఞాననేత్రము గల ఋషులు వచ్చుచున్న వామనుని చూచి శ్రీమన్నారాయణ దేవునిగా తెలిసి సభ్యులతో కలిసి లేచిరి. దైత్యగురువైన శుక్రాచార్యులు ఈ విషయమును తెలుసుకొని ఏకాన్తమున బలిచక్రవర్తితో ఇట్లు పలికెను. మూర్బులు తన బలమును తెలియకనే కార్యములను చేతురు కదా.

శుక్ర ఉవాచ :-

భో ! భో ! దైత్యపతే ! సౌమ్య ! హ్యాపహర్తా తవ శ్రియమ్

విష్ణుర్వామన రూ పేణ హ్యదితేః పుత్రతాం గతః

తవాధ్వరం స ఆయాతి త్వయా తస్యాసురేశ్వర !

న కించిదపి దాతవ్యం మన్మతం శృణు పండిత !

ఆత్మబుద్ధిస్సుఖకరీ ! గురుబుద్ధిర్విశేషతః

పరబుద్ధ్వినాశాయ స్త్రీబుద్ధిః ప్రలయంకరీ

శత్రూణాం హితకృద్యస్తు స హన్తవ్యో విశేషతః

శుక్రాచార్యులు పలికెను :- “ఓ దైత్యరాజా ! సౌమ్యుడా ! శ్రీమహావిష్ణువు వామనరూపముతో అదితి పుత్రుడై నీ సంపదను హరించబోవుచున్నాడు. ఇపుడు నీ యజ్ఞమునకు వచ్చుచున్నాడు. కావున నీవు అతనికి ఏ కొద్దిదైనను ఈయకుము. ఓ పండితుడా ! నా అభిప్రాయమును వినుము. తన బుద్దిసుఖము నిచ్చును. గురుబుద్దీ విశేషముగా సుఖము నిచ్చును. పరబుద్ధి వినాశనము కలిగించును. స్త్రీబుద్ధి ప్రళయమునే కలిగించును. శత్రువులకు హితమును చేయువానిని చంపియే తీరవలయును.”

బలిరువాచ :-

ఏవం గురో న వక్తవ్యం ధర్మమార్గవిరోధతః

యదాదత్తే స్వయం విష్ణుః కిమస్మాదధికం వరమ్

కుర్వన్త విదుషో యజ్ఞాన్విష్ణుప్రీణనకారణాత్

స చేత్సాక్షార్థవిర్భోణీ మత్తః కోఽభ్యధికో భువి

దరిద్రోణాపి యత్కించి ద్దీయతే విష్ణవే గురో !

తదేవ పరమం దానం దత్తం భవతి చాక్షయమ్

స్మృతోఽపి పరయా భక్తాఽ పునాతి పురుషోత్తమః

యేన కేనాప్యర్చిత శ్చేద్దదాతి పరమాం గతిమ్

హరిర్హరతి పాపాని దుష్టచిత్తెరపి స్మృతః

అనిచ్ఛయా సంస్పృష్టో దహత్యేవ హి పావకః

జిహ్వాగ్రే వర్తతే యస్య హరిరిత్యక్షరద్వయమ్

స విష్ణులోకమాప్నోతి పునరావృత్తిదుర్లభమ్

గోవిందేతి సదా ధ్యాయేద్యస్తు రాగాదివర్జితః

స యాతి విష్ణుభవనమితి ప్రాహుర్మనీషిణః

అగ్నౌ వా బ్రాహ్మణే వాపి హూయతే యద్దవిర్గురో

హరిభక్త్యా మహాభాగ తేన విష్ణుః ప్రసీదతి

అహం తు హరిశుద్ధ్యర్థం కరోమ్యద్వరముత్తమమ్

స్వయమాయాతి చేద్విష్ణుః కృతార్థోఽస్మి న సంశయః

ఏవం వదతి దైత్యేన్గో విష్ణురామనరూపధృక్

ప్రవేశాధ్వరస్థానం హుతవహ్నిమనోరమమ్

తం దృష్ట్వా కోటిసూర్యాభం యోగ్యావయవసుందరమ్

వామనం సహసోత్థాయ ప్రత్యగృహోత్కృతాంజలిః

దత్త్వాసనం చ ప్రక్షాల్య పాదౌ వామనరూపిణమ్

సకుటుంబో వహన్మూర్ధ్నా పరమాం ముదమాప్తవాన్

విష్ణవేఽస్మై జగద్ధామ్నే దత్త్వార్ఘ్యం విధివద్బల్వి

రోమాంచితతనుర్భూత్వా హర్షాశ్రునయనోఽబ్రవీత్

బలిచక్రవర్తి పలికెను :- “ఓ గురువర్యా ! ఇట్లు ధర్మమార్గవిరోధముగా చెప్పవద్దు. స్వయముగా శ్రీమహావిష్ణువే స్వీకరించినచో ఇంతకన్నా ఎక్కువ కావలసినదేమున్నది. శ్రీమహావిష్ణువునకు ప్రీతి కలిగించుటకే విద్వాంసులు యజ్ఞమును చేసెదరు. ఆ శ్రీమహావిష్ణువే స్వయముగా హవిస్సును స్వీకరించినచో ఈ భూమండలమున నన్ను మించినవాడెవడుండును ? దరిద్రుడైనను శ్రీమహావిష్ణువునకు ఏ కొంచెమర్పించిననూ అదియే ఉత్తమమైన, అక్షయమైన దానమనబడును. పురుషోత్తముని పరమభక్తి చే స్మరించిననూ ఏదో విధముగా ఆర్చించినను ఉత్తమ గతిని ప్రసాదించును. దుష్టచిత్తులు స్మరించినను శ్రీహరి పాపములను హరింపచేయును. అనుకోకుండా తాకిననూ అగ్ని కాల్చును కదా ! శ్రీహరి నామము నాలుక చివర నుంచుకొనినవాడు మళ్ళీ తిరిగి రాని విష్ణులోకమును పొందగలడు. రాగద్వేషాదులను వదిలి ఎప్పుడూ గోవిందనామస్మరణము చేసిన వారు విష్ణుభవనమును చేరునని పండితులు చెప్పెదరు. శ్రీహరియందు భక్తిచే అగ్నియందు కాని, బ్రాహ్మణునియందు కాని హవిస్సును అర్పించినచో శ్రీహరి ప్రసన్నుడగును. నేను శ్రీహరి సంతోషము కొఱకే ఉత్తమ యాగమును చేయుచున్నాను. “ఈ యాగమునకు స్వయముగా శ్రీమహావిష్ణువే వచ్చినచో కృతార్థుడనగుదును. సంశయములేదు.” ఇట్లు బలిచక్రవర్తి చెప్పుచుండగా వామన రూపమును ధరించిన శ్రీమహావిష్ణువు హవిస్సులచే జ్వలించుచున్న అగ్నిచే సుందరమైన యాగస్థానమునకు వచ్చెను. కోటిసూర్యుల కాంతి గలవాడు తగిన విధముగా అవయముల పొందికలో అందముగానున్న వామనుని చూచి తొందరతో లేచి చేతులు జోడించి స్వాగతము పలి కెను. అసనము నర్పించి వామనరూపముతో నున్న శ్రీమహావిష్ణువునకు పాదప్రక్షాళనము చేసి కుటుంబముతోపాటు పాదోదకమును శిరస్సున ధరించి పరమానందమును చెందెను. బలిచక్రవర్తి జగన్నివాసుడగు - శ్రీమహావిష్ణువునకు, యథావిధిగా అర్ఘ్యమునిచ్చి శరీరమున పులకలు, కన్నుల ఆనందబాష్పములు రాగా ఇట్లు పలికెను.

బలిరువాచ :-

అద్య మే సఫలం జన్మ అద్య మే సఫలో మఖః

జీవితం సఫలం మేఽద్య కృతార్ధో స్మి న సంశయః

అమోఘమృతవృష్టిర్మే సమాయాతాతిదుర్లభా

త్వదాగమనమాత్రేణ హ్యనాయాసో మహోత్సవః

ఏతే చ ఋషయస్సర్వే కృతార్థా నాత్రసంశయః

యైః పూర్వం చ తపస్తప్తం తదద్య సఫలం ప్రభో

కృతార్థోఽస్మి కృతార్థోఽస్మి కృతార్థోఽస్మి న సంశయః

నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం నమో నమః

త్వదోజ్ఞయా త్వనియోగం సాధయామీతి మన్మనః

అత్యుత్సాహసమాయుక్తం సమాజ్ఞాపయ మాం ప్రభో!

ఏవముక్తా దీక్షితేన ప్రహసన్వామనోఽబ్రవీత్

దేహి మే తపసి స్థాతుం త్రిపదసంమితామ్

ఏతచుత్వా బలిః ప్రాహ రాజ్యం యాచితవాన్నహి

గ్రామం వా నగరం చాపి ధనం వా కిం కృతం త్వయా

తన్నిశమ్య బలిం ప్రాహ విష్ణుస్సర్వశరీరభృత్

ఆసన్న భ్రష్టరాజ్యస్య వైరాగ్యం జనయన్నివ

బలిచక్రవర్తి పలికెను :- “ఈవేళ నా జన్మ సఫలమైనది. ఈ వేళ నా యజ్ఞము సఫలమైనది. నా జీవితము ధన్యమైనది. నేను కృతార్థుడనైతిని. సంశయము లేదు. ఎంత శ్రమించిననూ లభించని సఫలమైన అమృతవర్షము నాకు లభించినది. నీ రాకచే శ్రమలేకనే గొప్ప పండుగ వచ్చినది. ఈ ఋషులందరూ కృతార్డులైరి. సంశయము లేదు. వీరు మొదట చేసిన తపస్సు ఈ వేళ సఫలమైనది. నేను ముమ్మాటికీ కృతార్థుడనైతిని. నీకు ముమ్మారు వందనములు. నీ ఆజ్ఞచే నీ పనిని చేయవలయునని నా సంకల్పము. మిక్కిలి ఉత్సాహముతో నున్న నన్ను ఆజ్ఞాపించుము” ఇట్లు బలిచక్రవర్తి పలుకగా వామనుడు నవ్వుచు పలికెను. తపస్సు చేసుకొనుటకు నాకు మూడడుగుల భూమి నిమ్ము. ఈ మాటలను వినిన బలి “రాజ్యమునో, నగరమునో, గ్రామమునో కోరక, చివరకు ధనమునైన కోరక ఇది యేమీ ఇట్లు అడిగితిరి.” అని పలికెను. ఆ మాటలను వినిన వామనుడు రాజ్యభ్రష్టుడు కానున్న వానికి వైరాగ్యమును కలిగించునట్లు ఇట్లు పలికెను.

శ్రీ భగవానువాచ :-

శృణు దైత్యేన్ద్ర వక్ష్యామి గుహ్యాద్దుహ్యతరం పరమ్

సర్వసంగవిహీనానాం కిమర్థైః సాధ్యతే వద

అహం తు సర్వభూతానామన్తర్యామీతి భావయ

మయి సర్వమిదం దైత్య కిమన్యైః సాధ్యతే వద !

రాగద్వేషవిహీనానాం శాంతానాం త్యక్తమాయినామ్

నిత్యానందస్వరూపాణాం కిమన్యే స్సాధ్యతే ధనైః

ఆత్మ వత్సర్వభూతాని పశ్యతాం శాంతచేతసామ్

అభిన్నమాత్మనస్సర్వం కో దాతా దీయతే చ కిమ్

పృథ్వీయం క్షత్రియవ ఇతి శాషు నిశ్చితమ్

తదాజ్ఞాయాం స్థితాస్సర్వే లభనే పరమం సుఖమ్

దాతవో మునిభిశ్చాపి షషాంశో భూభుజే బలే!

మహీయం బ్రాహ్మణానాం తు దాతవ్యా సర్వయత్నతః

భూమిదానస్య మాహాత్మ్యం న భూతం న భవిష్యతి

పరం నిర్వాణమాప్నోతి భూమిదో నాత్ర సంశయః

స్వల్పామపి మహీం దత్వా శ్రోత్రియాయాహితాగ్నియే

బ్రహ్మలోకమవాప్నోతి పునరావృత్తిదుర్లభమ్

భూమిదస్సర్వదః ప్రోక్తో భూమిదో మోక్షభాగ్భవేత్

అతిదానం తు తద్ప్లేయం సర్వపాపప్రణాశనమ్

మహాపాతకయుక్తో వా యుక్తో వా సర్వపాతకైః

దశహస్తాం మహీం దత్వా సర్వపాపైః ప్రముచ్యతే

సత్పాతే భూమిదాతా యః సర్వదానఫలం లభేత్

భూమిదానసమం నాన్యత్ త్రిషు లోకేషు విద్యతే

ద్విజాయ వృత్తి హీనాయ యః ప్రదద్యాత్మ హీం బలే

తస్య పుణ్యఫలం వక్తుం న క్షమోఽబ్దశతైరహమ్

సక్తాయ దేవపూజాసు వృత్తి హీనాయ దైత్యప

స్వల్పామపి మహీం దద్యాద్యస విష్ణుర్న సంశయః

ఇక్టుగోధూమతువరీ పూగవృక్షాదిసంయుతా

పృథ్వీ ప్రదీయతే యేన స విష్ణురాత్ర సంశయః

వృత్తి హీనాయ విప్రాయ దరిద్రాయ కుటుంబినే

స్వల్పామపి మహీం దత్వా విష్ణుసాయుజ్యమాప్నుయాత్

సక్తాయ దేవపూజాసు విప్రాయాఢకికాం మహీమ్

దత్వా లభేత గంగాయాం త్రిరాత్రస్నానజం ఫలమ్

విప్రాయ వృత్తి హీనాయ సదాచారరతాయ చ

ద్రోణికాం పృథివీం దత్వా యత్సలం లభతే శృణు

గంగాతీర్థాశ్వమేధానాం శతాని విధివన్నరః

కృత్వా యత్ఫలమాప్నోతి తదాప్నోతి స పుష్కలమ్

దదాతి భారికాం భూమిం దరిద్రాయ ద్విజాయ యః

తస్య పుణ్యం ప్రవక్ష్యామి వదతో మే నిశామయ

అశ్వమేధసహస్రాణి వాజపేయశతాని చ

విధాయ జాహ్నవీతీరే యత్పలం తల్లభేద్ధ్రువమ్

భూమిదానం మహాదానమతి దానం ప్రకీర్తితమ్

సర్వపాపప్రశమనమపవర్గఫలప్రదమ్

శ్రీమన్నారాయణ భగవానుడు పలికెను :- “అన్ని రహస్యములలో పరమ రహస్యమును చెప్పెదను. ఓ దైత్యరాజా ! వినుము. ఏ సంగములు లేనివారికి అర్ధములతో ఏమి ప్రయోజనమో చెప్పుము. నేను అన్ని ప్రాణులలో అన్తర్యామిగా ఉందునని భావించుము. అట్లే ఈ జగత్తంతయూ నాలోనే ఉన్నది. కావున ఇతరులతో నేను సాధించవలసినదేమున్నదో చెప్పుము. రాగద్వేషములు లేక శాంతులై కపటమును వదిలి నిత్యానంద స్వరూపులుగా నున్నవారు ఇతర ధనములతో నేమి సాధించగలరు ? తన వలె అన్ని ప్రాణులు అని చూచువారికీ ఇదియంతయు ఆత్మకంటే భిన్నము కానిదే అయినపుడు ఇచ్చువాడెవడు ? ఇచ్చునదేమి ? ఈ భూమి క్షత్రియాధీనములో నుండును అని శాస్త్రనిర్ణయము. రాజాజ్ఞలో నుండువారికి పరమానందము లభించును. ఓ బలిచక్రవర్తీ ! మునులు కూడా తమ తపస్సులో ఆరవభాగమును రాజునకీయవలయును. అన్నివిధములుగా ప్రయత్నించి ఈ భూమిని బ్రాహ్మణునకు దానమును చేయవలయును. భూదానము యొక్క మాహాత్మ్యము ఇంకొకదానికి లేదు. ఉండబోదు. భూదానమును చేయువారు పరమానందమును పొందుదురు. ఈ విషయమున సంశయము లేదు. నిత్యాగ్నిహోత్రుడు, శ్రోత్రియుడు అయిన బ్రాహ్మణునికి ఏ కొంచెము భూమీనీ దానము చేసిననూ పునరావృత్తి రహితమైన బ్రహ్మలోకమునకు వెళ్ళును. భూమిదానమును చేసినవాడు అన్ని దానములు చేసినవాడగును. భూదానము చేసినవారు మోక్షమును పొందెదరు. భూదానము సర్వ శ్రేష్ఠమైన దానము. భూదానము అన్ని పాపములను నశింపచేయును. మహాపాతకములతో కూడియున్ననూ అన్ని పాతకములున్ననూ పదిమూరలు భూమిని దానము చేసినవారు అన్ని పాపములనుండి విముక్తుడగును. యోగ్యునికి భూదానము చేయువాడు అన్ని దానములు చేసిన ఫలితమును పొందును. భూదానముతో సమానమైనది మరియొకటి ఈ మూడు లోకములలో లేదు. బ్రతుకు తెరువు లేని బ్రాహ్మణునికి భూమిని దానము చేసినవానికి కలుగు పుణ్యఫలమును నేను కూడా నూరు సంవత్సరములలో కూడ చెప్పజాలను. దేవపూజలయందాసక్తుడై బ్రతుకుతెరువులేని బ్రాహ్మణునికి ఏ కొంచెము భూమిని దానము చేసిననూ వోడు. విష్ణువే. ఇచట సంశయములేదు. చెఱుకు, గోధుమ, కంది, పోకచెట్టు గల భూమిని దానము చేసినవాడు విష్ణువే. సంశయములేదు. బ్రతుకు తెరువు లేనివాడు, దరిద్రుడు, కుటుంబము కలవాడు అయిన బ్రాహ్మణునికి కొంచేము భూమిని దానము చేసిననూ విష్ణుసాయుజ్యమును పొందును. దేవపూజలయందు ఆసక్తుడైయున్న బ్రాహ్మణునకు ఒక అడ్డ ధాన్యము (నాలుగు కిలోలు) విత్తుటకు యోగ్యమైన భూమిని దానమును చేసినవాడు మూడు రోజులు గంగా స్నానమును చేసిన ఫలమును పొందును. బ్రతుకుతెరువు. లేనివాడు సదాచార పరాయణుడు అయిన బ్రాహ్మణునకు నాలుగు బస్తాల ధాన్యమును విత్తుటకు తగిన భూమిని దానము చేసిన వానికి నూరు అశ్వమేధ యాగముల ఫలమును నూరు గంగా స్నానముల ఫలము లభించును. దరిద్రుడైన బ్రాహ్మణునకు పుట్టెడు ధాన్యమును (8 బస్తాలు) విత్తుటకు తగిన భూమిని దానము చేసినవానికి, వేయి అశ్వమేధములను నూరు వాజపేయములను గంగాతీరమున చేసిన ఫలము లభించును. అన్ని దానములలో గొప్ప దానము సాటిలేని దానము భూదానమని చెప్పబడినది. భూదానము అన్ని పాపములను నశింపచేయును. మోక్షమును ప్రసాదించును.

అత్రేతిహాసం వక్ష్యామి శృణు దైత్యకులేశ్వర

యచుత్వా శ్రద్ధయా యుక్తో భూదానఫలం లభేత్

ఆపీత్పురా ద్విజవరో బ్రాహ్మకల్పే మహామతిః

దరిద్రో వృత్తి హీనశ్చ నామ్నా భద్రమతిర్బలే

శ్రుతాని సర్వశాస్త్రాణి తేన వేదవిదా బలే

శ్రుతాని చ పురాణాని ధర్మ శాస్త్రాణి సర్వశః

అభవంస్తస్య షట్పత్న్యః శ్రుతిసింధుర్యశోవతీ

కామినీ మాలినీ చైవ శోభాతి ప్రకీర్తితాః

ఆసు పత్నీసు తస్యాసఇత్వారింశచ్ఛతద్వయమ్

పుత్రాణామసురశ్రేష్ఠ సర్వే నిత్యం బుభుక్షితాః

అకించనో భద్రమతిః క్షుధార్తానాత్మజాయాః

పశ్యన్స్వయం క్షుధార్తశ్చ విలలాపాకులేస్త్రియః

ధిగ్టన్మ భాగ్యరహితం ధిగ్టన్మ ధనవర్జితమ్

ధిగ్టన్మ ధర్మరహితం ధిగ్టన్మ ఖ్యాతివర్జితమ్

నరస్య బహ్వపత్యస్య ధిన్జన్మేశ్వర్యవర్జితమ్

అహో గుణాసౌమ్యతా చ విద్వత్తా జన్మ సత్కులే

దారిద్ర్యామ్బుధిమగ్నస్య సర్వ మేతన్న శోభతే

ప్రియాః పుత్రాశ్చ పౌత్రాశ్చ బాంధవా భ్రాతరస్తథా

శిష్యాశ్చ సర్వమనుజాస్త్యజన్యైశ్వర్యవర్జితమ్

చాండలో వా ద్విజో వాపి భాగ్యవానేవ పూజ్యతే

దరిద్రః పురుషో లోకే శవవల్లో కనిన్దితః

అహో సంపత్సమాయుక్తో నిష్ఠురో వాప్యనిష్ఠురః

గుణహీనోఽపి గుణవాన్ మూరో వాప్యధ పండితః

ఐశ్వర్యగుణయుక్త శ్వేత్పూజ్య ఏవ న సంశయః

ఆహా దరిద్రతా దుఃఖం తత్రాప్యాశాతిదుఃఖితా

ఆశాభిభూతాః పురుషాః దుఃఖమశ్నువతేఽక్షయమ్

ఆశాయా దౌసా యే దాసా స్తే సర్వలోకస్య

ఆశా దాసీ యేషాం తేషాం దాసాయతే లోకః

మానో హి మాహతాం లోకే ధనమక్షయముచ్యతే

తస్మిన్నాశాఖ్యరిపుణా మానే నష్ట దరిద్రతా

సర్వశాస్త్రార్థవేత్తా పి దరిద్రా భాతి మూర్భవత్

నైష్కించన్యమహాగ్రాహగ్రస్తానాం కో విమోచకః

అహో దుఃఖమహోదుఃఖం అహో దుఃఖం దరిద్రతా

తత్రాపి పుత్రభార్యాణాం బాహుల్యమతి దుఃఖదమ్

ఏవముక్త్వా భద్రమతిస్సర్వశాస్త్రార్ధపారగః

అన్యమైశ్వర్యదం ధర్మం మనసా చిన్తయత్తదా

ఓ దైత్యరాజా ! ఈ విషయమున ఒక ఇతిహాసమును చెప్పెదను. వినుము. ఈ ఇతిహాసమును శ్రద్దగా వినిన వానికి భూదానఫలము లభించును. పూర్వకోలమున బ్రాహ్మకల్పమున మహామతి, దరిద్రుడు, వృత్తి హీనుడగు బ్రాహ్మణుడు, భద్రమతి అని పేరుగల వాడుండెను. ఇతను అన్నిశాస్త్రములను, అన్ని వేదములను అన్నిపురాణములను, ధర్మ శాస్త్రములను అభ్యసించేను. భద్రమతికి ఆరుగురు భార్యలుండిరి. శ్రుతి, సింధు, యశోవతి, కామిని, మాలినీ, శోభా అని వారి పేర్లు. ఈ భార్యలయందు ఇతనికి రెండు వందల నలభైమంది పుత్రులు కలిగిరి. ఈ పుత్రులు భార్యలు చివరికి తాను కూడా ఆకలిచే పీడించబడుచు ఆకులమైన మనస్సుతో విలపించెను. భాగ్యరహితమైన జన్మ, ధనములేని జన్మ వ్యర్థము. ధర్మము, ఖ్యాతి లేని జన్మము వ్యర్థము. బహుసంతానము గలవానికి ఐశ్వర్యము లేనిచో వాని జన్మము వ్యర్థము. సౌమ్యత, వైదుష్యము, సత్కుల జన్మ మొదలగు సద్గుణములు దారిద్ర్యసాగరములో మునిగిన వారికి శోభించవు. ఐశ్వర్యము లేనివానిని ప్రియులు, పుత్రులు, పౌత్రులు, బాంధవులు, సోదరులు, శిష్యులు అందరూ విడిచెదరు. చండాలుడైనను, బ్రాహ్మణుడైనను భాగ్యవంతుడే పూజింపబడును. దరిద్రుడైన పురుషుడు శవము వలె లోకముచే నిందించబడును. సంపద కలవాడు కఠినుడైనను మృదుస్వభావము కలవాడే. గుణ హీనుడైననూ గుణవంతుడే. మూర్బుడైననూ పండితుడే. ఐశ్వర్యగుణముతో కూడినవాడు పూజించదగినవాడే. సంశయము లేదు. దారిద్ర్యము దుఃఖప్రదము. అందులో ఆశ పరమదుఃఖప్రదము. ఆశతో కూడినవారు అంతులేని దుఃఖమును పొందెదరు. ఆశకు దాసులైనవారు లోకమంతటికీ దాసులగుదురు. ఆశను దాసిగా చేసుకొన్నవారికి లోకమే దాస్యము చేయును. మహాత్ములకు అభిమానమే తిరుగులేని ధనము. ఆశచే అభిమానము నశించినచో దారిద్ర్యము ప్రాప్తించును. సర్వశాస్త్రార్థములు తెలిసినవాడైనను దరిద్రుడైనచో మూర్బుని వలె అనిపించును. దారిద్ర్యమను గొప్ప మొసలి పట్టినవానికి మోక్షము లేదు. దరిద్రత చాలా దుఃఖమును కలిగించును. ఆ దారిద్ర్యములో బహుపుత్రత, బహుభార్యాత్వము మరీ దుఃఖప్రదము. ఇట్లు సర్వశాస్త్రములు తెలిసిన భద్రమతి విలపించి ఐశ్వర్యము నిచ్చు మరియొక ధర్మమును గూర్చి ఆలోచించెను.

భూమిదానం వినిశ్చిత్య సర్వదానోత్తమోత్తమమ్

దానేన యోఽనుమంతేతి స ఏవ కృతవాన్పురా

ప్రాపకం పరమం ధర్మం సర్వకామఫలప్రదమ్

దొనానాముత్తమం దానం భూదానం పరికీర్తితమ్

యద్దత్వా సమవాప్నోతి యద్యదిష్టతమం నరః

ఇతి నిశ్చిత్య మతిమాన్డీరో భద్రమతీర్బలే

కౌశామ్బీం నామ నగరీం కలతాపత్యయుగ్యణో

సుఘోషనామ విపేన్తం సర్వేశ్వర్యసమన్వితమ్

గత్వా యాచితవాన్భూమిం పంచహస్తాయతాం బలే !

సఘోషో ధర్మనిరతస్తం నిరీక్ష్య కుటుంబినమ్

మనసా ప్రియమాణేన సమభ్యర్బ్యేడమబ్రవీత్

కృతార్థోఽర్థోఽహం భద్రమతే సఫలం మమ జన్మ చ

మత్కులం పావనం ఔతం త్వదనుగ్రహతో ద్విజ

ఇత్యుక్త్వాతం సమభ్యర్య సషో ధర్మతత్పరః

పంచహస్తమితాం భూమిం దదౌ తస్మై మహామతిః

పృథివీ వైష్ణవీ పుణ్యా పృథివీ విష్ణుపాలితా

పృధివ్యాస్తు ప్రదానేన ప్రీయతాం మే జనార్దనః

మంత్రేణానేన దైత్యేస్త్ర సుఖోషస్తం ద్విజోత్తమమ్

విష్ణుబుద్ధ్యా సమభ్యర్బ్య తావతీం పృథివీం దదౌ

సోఽపి భద్రమతిర్విప్రో ధీమతా యాచితాం భువమ్

దత్తవాన్లరిభక్తాయ శ్రోత్రియాయ కుటుంబినే

సుఘోషో భూమిదానేన కోటివంశసమన్వితః

ప్రపేదే విష్ణుభవనం యత్ర గత్వా న శోచతి

బలే భద్రమతిశ్చాపి యతః ప్రార్థితవాన్ శ్రియమ్

స్థితవాన్విష్ణుభవనే సకుటుంబో యుగాయుతమ్

తథైవ బ్రహ్మాసదనే స్థిత్వా కోటియుగాయుతమ్

ఐస్త్రం పదం సమాసాద్య స్థితవాన్కల్పపంచకమ్

తతో భువం పమాసాద్య సర్వేశ్వర్యసమన్వితః

జాతిపరో మహాభాగే బుభుజే భోగముత్తమమ్

తతో భద్రమతిర్లైత్య నిష్కామో విష్ణుతత్పరః

పృథివీం వృత్తి హీనేభ్యో బ్రాహ్మణేభ్యః ప్రదత్తవాన్

తస్య విష్ణుః ప్రసన్నాత్మా దత్వైశ్వర్యమనుత్తమమ్

కోటివంశసమేతస్య దదౌ మోక్షమనుత్తమమ్

తస్మాదైత్యపతే మహ్యం సర్వధర్మపరాయణ

తపశ్చరిష్యే మోక్షాయ దేహి మే త్రిపదాం మహీమ్

వైరోచనిస్తతో హృష్టః కలశం జలపూరితమ్

ఆదదే పృథివీం దాతుం వర్ణినే వామనాయ వై

అన్ని దానములలో ఉత్తమ దానము భూదానమని నిశ్చయించి, దానము నిచ్చువాడేవడో అతడే వరిష్ణుడు అని, పరమ ధర్మమును పొందించునది అన్ని కోరికలను నెరవేర్చునది దానములలో ఉత్తమదానము భూదానమని ప్రశంసించబడినది. భూదానము చేసి కావలసిన దానినంతటిని పొందవచ్చును అని నిశ్చయించి బుద్ధిమంతుడు ధైర్యము గలవాడయిన భద్రమతి భార్యాపుత్రలతో కౌశాంబియను నగరమునుకు వెళ్ళెను. సుఘోషుడను పేరుగల ఐశ్వర్యవంతుడైన బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళి అయిదు మూరల భూమిని యాచించెను. సుఘోషుడు ధర్మము యందాసక్తి కలవాడు కావున కుటుంబి అయిన భద్రమతిని చూచి        ప్రీతి గల మనసుతో చక్కగా పూజించి ఇట్లు పలికెను. “ఓ భద్రమతీ ! నేను కృతార్థుడనైతిని. నా జన్మ సఫలమైనది. నీయనుగ్రహముతో నా కులము పొవనమైనది.” అని పలికి భద్రమతిని బాగుగా పూజించి ధర్మ తత్పరుడైన సుషుడు అతనికి అయిదు మూరల భూమిని దానము చేసెను. విష్ణువునకు సంబంధించిన పృథివి, విష్ణువుచే పాలించబడు పృథివి. అట్టి పృథ్విని దానము చేయుటచే నాకు జనార్దనుడు ప్రసన్నడగు గాక అను మంత్రముచే సఘోషుడు ఆ బ్రాహ్మణోత్తముని విష్ణుభావనచే పూజించి ఆతనడిగినంత భూమిని దానము చేసెను. అట్లు భూదానమును స్వీకరించిన భద్రమతి హరిభక్తుడు శ్రోత్రియుడు కుటుంబి జ్ఞాని అయిన బ్రహ్మణోత్తముడు యాచించగా దానము చేసెను. ఇట్లు భూదానము చేసిన సుఘోషుడు కోటి వంశములతో కూడిన వాడై వెళ్ళిన తరువాత దుఃఖించని విష్ణుభవనమును చేరెను. సుఘోషుని నుండి భూమిని స్వీకరించిన భద్రమతి కూడా కుటుంబముతో పదివేల యుగములు విష్ణుభవనమున నివసించి, కోటియుగములు బ్రహ్మ భవనమున నివసించి, అయిదు కల్పములు ఇంద్రపదవిని అధిష్ఠించీ తరువాత భూలోకమునకు చేరి అన్ని ఐశ్వర్యములతో మహానుభావుడై ఉత్తమభోగములను అనుభవించేను. అయినను భద్రమతి కామ రహితుడై విష్ణువునందు భక్తిగలవాడై బ్రతుకుతెరువు లేని బ్రాహ్మణులకు భూమిని దానము చేసెను. భద్రమతికి శ్రీమహావిష్ణువు ప్రసన్నుడై సాటిలేని తత్త్వసంపదను ప్రసాదించి కోటి వంశములతో కూడిన వానికి సాటిలేని, మోక్షము నిచ్చెను. కావున సర్వధర్మ పరాయణుడవైన ఓ దైత్యపతీ ! మోక్షము కొఱకు తపస్సు చేయుటకు మూడడుగుల భూమినిమ్ము. అపుడు బలి చక్రవర్తి సంతోషించినవాడై జలపూర్ణమైన కలశమును తీసుకొని బ్రహ్మ చారియైన వామనునకు భూదానమును చేయుటకు సిద్ధపడెను.

విష్ణుః సర్వగతో జ్ఞాత్వా జలధారావరోధినమ్

కావ్యం హస్తస్థదర్భాగం తచ్ఛిరే సంన్యవేశయత్

దర్భాగ్రేఽభూన్మహాశస్త్రం కోటిసూర్యసమప్రభమ్

అమోఘం బ్రాహ్మమత్యుగ్రం కావ్యాక్షిగ్రాసలోలుపమ్

శశాప భార్గవః శూరానపురానేవ చక్షుషా

పశ్యేతి వ్యాదిదేశ చ దర్భాగ్రం శస్త్రసన్నిభమ్

బలిర్దదౌ మహావిష్ణోర్మ హీం త్రిపదసంహితామ్

వవృధే సోఽపి విశ్వాత్మా ఆబ్రహ్మ భువనం తదా

అమిమీత మహీం ద్వాభ్యాం పద్భ్యాం విశ్వతనుర్హరిః

స ఆబ్రహ్మ కటాహాంతపదాన్యేతాని స ప్రభుః

పాదాంగుష్ఠాగ్రనిర్భిన్నం బ్రహ్మాండం బిభిదే ద్విధా

తద్వారా బాహ్యసలిలం బహుధారం సమాగతమ్

ధౌతవిష్ణుపదం తోయం నిర్మలం లోకపావనమ్

అజాండబాహ్యనిలయం ధారారూపమవర్తత

తజ్జలం పావనం శ్రేష్ఠం బ్రహ్మాదీనావయత్సురాన్

సప్తర్షి సేవితం చైవ న్యపతన్మేరుమూర్థని

ఏతద్దృష్ట్వాద్భుతం కర్మ బ్రహ్మద్యా దేవతాగణాః

ఋషయో మునయ శ్చైవ హ్యస్తువన్ హర్ష విహ్వలాః

అపుడు అంతటా వ్యాపించియున్న శ్రీమహావిష్ణువు జలధారనడ్డుచున్న శుక్రాచార్యుని తెలుసుకొని తన చేతిలో నున్న ధర్బా గ్రమున బ్రహ్మాస్త్రమును అనుసంధించెను. అపుడు ధర్బాగ్రమున కోటి సూర్యకాంతి గల అమోఘమైన అత్యుగ్రమైన బ్రహ్మాస్త్రము శుక్రాచార్యుల కన్నును మ్రింగవలయునని అసక్తి కలదాయెను. ఒంటి కన్నుగల శుక్రాచార్యుడు శూరులైన ఆ అసురులను శపించెను (చూడుము' అని శస్త్రమువంటి ఆ దర్బాగ్రమును చూపెను. తరువాత బలి చక్రవర్తి శ్రీమహావిష్ణువునకు మూడడుగుల భూమిని ధారవో సేను. విశ్వాత్మకుడైన శ్రీమహావిష్ణువు బ్రహ్మలోకము వరకు పెరిగెను. విశ్వశరీరుడైన శ్రీహరి . ఈ భూమిని రెండు అడుగులతో కొలిచెను. చివర వరకు శ్రీహరి పాదము కాంతివంతమై సాగగా కొలి బొటనవేలు గోరు చివరతో బ్రహ్మండము , రెడుగా చీలిపోయెను. ఆ బ్రహ్మండమునుండి జలము బహుధారలుగా బయటకు వచ్చెను. అట్లు వచ్చి విష్ణుపాదమును కడిగి నిర్మలము, లోకములను పావనము చేయు దాయెను. బ్రహ్మాండము వెలుపులనున్న జలము ధారారూపముగా నుండెను. అట్లు పావనమైన ఆ జలము బ్రహ్మాదిదేవతలను పొవనము చేసెను. సప్తర్షులతో సేవించబడి మేరుపర్వత శిఖరము పై పడెను. ఇట్లు అత్యాశ్చర్యకరమైన ఈ కార్యమును చూచిన బ్రహ్మాదిదేవతలు, ఋషులు, మనువులు ఆనందముతో పరవశులై స్తోత్రమును చేసిరి.

దేవా ఊచు :-

నమః పరేశాయ పరాత్మరూపిణే పరాత్పరాయాపరరూపధారిణే

బ్రహ్మాత్మనే బ్రహ్మరతాత్మ బుద్ధయే నమోఽస్తు తేఽవ్యాహతకర్మ శీలినే

పరేశ పరమానన్ద పరమాత్మన్పరాత్పర

సర్వాత్మనే జగన్మూర్తే ప్రమాణాతీత తే నమః

విశ్వతశ్చక్షుషే తుభ్యం విశ్వతో బాహవే నమః

విశ్వతశ్శిర సే చైవ విశ్వతో గతయే నమః

ఏవం స్తుతో మహావిష్ణుర్భ్రహ్మాద్యైస్స్వర్దీవౌకసామ్

దత్త్వాభయం చ ముముదే దేవదేవస్సనాతనః

విరోచనాత్మజం దైత్యం పదైకార్థం బబన్ద హ

తతః ప్రపన్నం తు బలిం జ్ఞాత్వా చాస్మై రసాతలమ్

దదౌ తద్ద్వారపాలశ్చ భక్తవశ్యో బభూవ హ

దేవతలు పలికిరి :- పరేశునికి, పరాత్మరూపునికి, పరాత్పరునికి, అపర రూపధారికి, బ్రహ్మ స్వరూపునికి, బ్రహ్మయందు ఆసక్తుడైన వాని బుద్దిలో నుండువానికి నమస్కారము. అడ్డులేని కర్మలు చేయు స్వభావము కలవానికి నమస్కారము. ఓ పరేశా ! పరమానన్ద స్వరూపా ! పరమాత్మా ! పరాత్పరా ! సర్వాత్మా ! జగత్స్వరూపా ! ప్రమాణములకు అందనివాడా ! నీకు నమస్కారము. అనేక నేత్రములు గల వానికి, అనేక బాహువులు గల వానికి, అనేక శిరస్సులు గల వానికి, అనేక గతులు గల వానికి నమస్కారములు. ఇట్లు బ్రహ్మాదులచే స్తుతించబడిన శ్రీమహావిష్ణువు సనాతనుడైన దేవదేవుడు స్వర్గవాసులైన దేవతలకు "అభయమునిచ్చి ఆనందించెను. విరోచనుని పుత్రుడైన బలి చక్రవర్తిని మిగిలిన ఒక అడుగు భూమి కొఱకు బంధించెను. తరువాత బలి చక్రవర్తి శరణువేడినవాడని తెలుసుకొని బలి చక్రవర్తికి రసాతల రాజ్యమును ప్రసాదించి, భక్తవత్సలుడైన శ్రీహరి ఇతనికి ద్వారపాలకునిగా ఉండెను.

నారద ఉవాచ :-

రసాతలే మహావిష్ణుర్విరోచనసుతస్య వై

కిం భోజ్యం కల్పయామాస ఘోరే సర్పభయాకులే

నారద మహర్షి పలికెను :- భయంకరము సర్పముల భయముతో ఆకులము అయిన రసాతలమున శ్రీమహావిష్ణువు బలి చక్రవర్తికి ఆహారముగా ఏ పదార్థమును ఏర్పరిచెను ?

సనక ఉవాచ :-

అమన్త్రితం హవిర్యత్తు హూయతే జాతవేదసి

అపాత్ర దీయతే యచ్చ తద్ఘోరం భోగసాధనమ్

హుతం హవిరశుచినా దత్తం సత్కర్మ యత్కృతమ్

తత్సర్వం తత్ర భోగార్హమధః పాతఫలప్రదమ్

ఏవం రసాతలం విష్ణుర్బలయే సాసురాయ తు

దత్వాభయం చ సర్వేషాం సురాణాం త్రిదివం దదౌ

పూజ్యమానోఽమరగణైస్స్తూయమానో మహర్షిభిః

గంధర్వైర్గీయమానశ్చ పునర్వామనతాం గతః

ఏతద్దృష్ట్వా మహత్కర్మ మునయో బ్రహ్మవాదినః

పరస్పరం స్మితముఖాః ప్రణేముః పురుషోత్తమమ్

సర్వభూతాత్మకో విష్ణుర్వామనత్వముపాగతః

మోహయన్నఖిలం లోకం ప్ర పేదే తపసే వనమ్

ఏవం ప్రభావా సా దేవీ గంగా విష్ణుపదోద్భవా

యస్యాః స్మరణమాత్రేణ ముచ్యతే సర్వపాతకైః

ఇదంతు గంగామాహాత్మ్యం యః పఠేచ్ఛృణుయాదపి

దేవాలయే నదీతీరే సోఽశ్వమేథఫలం లభేత్

ఇతి శ్రీ బృహన్నారదీయ పురాణే పూర్వభాగే ప్రథమ పాదే గంగోత్పత్తిర్గంగామాహాత్మ్యం నామ ఏకాదశోఽధ్యాయః

సనక మహర్షి పలికెను :- అగ్నిహోత్రములో మంత్ర పఠనము లేకనే హోమము చేయబడిన హవిస్సు, అయోగ్యునికిచ్చిన దానము, అపవిత్రునిచే అర్పించబడిన హవిస్సు, చేయబడిన దానము, సుకృతము ఇది అంతయు అధఃపతనఫలప్రదమై రసాతలమున బలి చక్రవర్తికి భోగ సాధనము. ఇట్లు శ్రీమహావిష్ణువు బలిచక్రవర్తికి రసాతలము నిచ్చి, దేవతలకు అభయమును స్వర్గము నిచ్చెను. దేవతలు పూజించుచుండగా, మహర్షులు స్తోత్రము చేయుచుండగా, గంధర్వులు గానము చేయుచుండగా మరల వామనత్వమును పొందెను. ఆశ్చర్యకరమైన ఈ పనిని చూచి బ్రహ్మవాదులగు మునులు ఒకరినొకరు చిరునవ్వుతో చూచుచు పురుషోత్తముని నమస్కరించిరి. సర్వప్రాణి స్వరూపుడైన శ్రీమహావిష్ణువు వానమత్వమును పొంది సమస్తలోకమును మోహింపచేయుచు తపస్సునకు అరణ్యమునకు వెళ్ళెను. విష్ణుపాదమునుండి పుట్టిన గంగ ఇంతటి ప్రభావము కలది. గంగను స్మరించుట వలన అన్ని పాపములు నశించును. ఈ గంగామాహాత్మ్యమును దేవాలయమున, నదీతీరమున చదివిన వారికి, వినిన వారికి అశ్వమేధయాగము చేసిన ఫలము లభించును.

ఇది శ్రీ బృహన్నారదీయ పురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున గంగోత్పత్తి గంగామహాత్మ్యము అను పేరుగల పదకొండవ అధ్యాయము సమాప్తము.