విష్ణు మహా పురాణము

12 - ద్రువోపాఖ్యానము

శ్రీపరాశరుడు:

నిశమ్యతదశేషేణ మైత్రేయనృపతేస్సుతః

నిర్జగామవనాత్తస్మాత్ప్రణిపత్య సతా నృశీన్

కృతకృత్యమివాత్మానం మన్యమానస్తతోద్విజ

మధుసంజ్ఞం మహాపుణ్యం జగామమయమునాతటమ్

పునశ్చమదుసంజ్ఞేన దైత్యేనాదష్ఠితంయతః

తతోమధువనంనామ్నా ఖ్యాత మాత్రమహీతలే

హత్వాచలవణంరక్షో మధుపుత్రం మహాబలమ్

శత్రుఘ్నోమధురాంనామ పురీంయాత్రచకారవై

యత్రవై దేవదేవస్య సాన్నిధ్యం హరిమేధసః

సర్వపాపహరేతస్మిం స్తపస్తీర్థే చచారసః

మరీచిమిశ్రైర్మునిభిర్యథోద్దిష్టమభూత్తథా

ఆత్మన్యశేషదేవేశంస్థితం విష్ణుమమన్యత

అనన్యచేతసస్తస్యధ్యాయతో భగవాన్ హరిః

సర్వభూతగాతోవిష్ణుస్సర్వభాగవతోఽభవత్

మనస్యవస్థితేతస్య విష్ణౌమైత్రేయ యోగినః

నశశాక ధరా భారముద్వోయఢుంభూతధారణీ

వామపాదస్థితేతస్మిన్ ననామార్దేనమేదినీ

ద్వితీయంచననామార్ధంక్షితేర్ధక్షిణతస్ద్సితే

పాదాజ్గుష్ఠేన సంపీడ్య యదా స వసుదాంస్థితః

తదా సమస్తా వాసుధా చచాలసహపర్వతైః

శ్రీపరాశరుడు:

సర్వము నది విని యారాచ బిడ్డడు ఆ ఋషులకు ప్రణామములు సేసి తాను కృతార్ధుడనైతి ననుకొనుచు నటనుండి మహా పుణ్యమైన యమునా తటమందలి మధు వనమున కేగెను. మధువను రాక్షసుండున్న వన మగుటచే నది మధువనంబన బ్రసిద్ధ మయ్యెన. మధుని కొడుకును లవణాసురునిం జంపి శత్రుఘ్నుడు మధురాపురిని నిర్మించిన తావదియే. దేవదేవుడు హరి మేధుసుడను నర్చామూర్తి సాన్నిధ్య మక్కడనే యున్నది. సర్వపాప హరమైన యా తీర్ధమందు ధ్రువుడు తప మాచారించెను. మరీచి ప్రముఖులైన మునులచే నుపదిష్ట మైనట్లు తన యందశేష దేవదేవుడు విష్ణు వున్నట్లు తలంచెను. వేరు తలుపు లేక ధ్యానించు నతనికి సర్వ భూతగాతుడైన విష్ణు భగవానుడు సర్వ భావగతుడై సర్వాంతర్యామియై గోచరించెను. సర్వాత్మకుండైన విష్ణువా యోగి మనస్సు నందున్నంతట సర్వభూత ధారిణియైన యీ దారుణి యా బరువు మోయ జాలనిదయ్యె. ఎడమ పాదము బొటన వ్రేలు నొత్తి నిలువబడి నంత నిమ్మేదిని పర్వతములతో గూడ గంపించెను.

నద్యోనదాస్సముద్రాశ్చసంక్షోభం పరమంయయుః

తతోభాదమరాః క్షోభం పరంజగ్ముర్మహామునే

యమా నామ తదా దేవా మైత్రేయపరమాకులాః

ఇన్ద్రేణసహసం మన్త్ర్యద్యానభఙ్గం ప్రచక్రముః

కూష్మాణ్డా వివిధై రూపైస్సహేన్ద్రేణమహామునే

సమాధిభఙ్గమత్యర్ధమారబ్ధాః కర్తుమాతురాః

సునీతిర్నామతన్మాతా సాస్రా తత్పురతః స్థితా

పుత్రేతికరుణాంవాచమాహ మాయామయీతదా

పుత్రకాస్మాన్నివర్తస్వ శరీరత్యాయదారుణాత్

నిర్బన్ధతో మయాలబ్దోబహుబిస్త్వం మనోరథైః

దీనామేకాంపరిత్యక్తుమనాథాం నత్వమర్హసి

సపత్నీ వచనాద్వత్సహ్యగతేస్త్వం గతిర్మమ

క్వచ్చత్వం పఙ్చవర్షీయః క్వచై తద్దారుణంతపః

నివర్ త్యతాంమనః కష్టాన్నిర్భన్దాత్ఫాలవర్జితాత్

కాలఃక్రీడనకానాం తే తదన్తేఽధ్యాయనస్యతే

తతస్సమస్తభోగానాం తదన్తే చేష్యతేతపః

కాలఃక్రీడనకానాం యస్తవ బాలస్య పుత్రక

తస్మిం స్త్వ మిచ్చం స్థపసేవినాషాయాత్మనోరతః

మత్ప్రీతిః పరమోధర్మో వయోవస్థా క్రియక్రమమ్

అనువర్తస్వ మాం మోహా న్నివార్ త్యా స్మాదధర్మతః

పరిత్యజపి వత్సాద్య యద్యేత న్నభవాంస్తపః

త్యక్షామ్యహమపి ప్రాణాంస్తతో వైపశ్యతస్తవ

నదీనద సముద్రములు సంక్షోభ మందినవి. ఓ మహామునీ! ఆ సంక్షోభముచే నమరులు మిగుల క్షోభమందిరి. అప్పుడు యామాఖ్య దేవతలు వ్యాకులురై యింద్రునితో నాలోచించి యాబాలుని ధ్యాన భంగము గావించిరి. ఆందోళించి కూష్మాండ దేవత లింద్రునితో బలు రూపులు దాల్చి యా పాపని సమాధి భంగము సేయ నారంభించిరి. ఆతని తల్లి సునీతి మాయా మయియై వచ్చి యాతని యెదుట కొడుకా! యని జాలిగ బిల్చి కన్నీరుగార నెదుట నిలువడి నట్లయ్యె. నాయనా! పెక్కు విధముల ముచ్చట పడి నిన్ను గంటిని. ఈ శరీర ఘాతకమైన ఈ దారుణ మయిన నిర్భందము నుండి మరలుము. దీననై యనాధనై యొంటిగత్తెనైన నన్నీవు సవితి మాటలచే వదలదగదు. దిక్కు లేని నాకీవే దిక్కు. ఇదేండ్లు యీడు వాడవు నీవేడ? ఈ దారుణ తపమ్మేడ? ఫలము లేని యీ నిర్భందము నుండి యీ కష్టము నుండి నీ మనస్సు ద్రిప్పుకొనుము. ఇది నీకాటలకు కాలము. అవ్వల నధ్యయ నమునకు అవ్వల సకల భోగములకు గాలము. ఆ మీద తపస్సు సేయదగును. ఆటలాడు కొనవలసిన తఱి నీవు తపస్సును గావించి యాత్మ వినాశము గావించుకొన గోరెదవిదేమి? నాకు బ్రీతి గూర్చుట పరమ ధర్మము. వయస్సు తదను గుణమై యవస్థ తదను గుణ మగు క్రియ ఈ క్రమమును ననుసరింపుము. ఈ యధర్మము నుండి మరలుము. నన్న నుసరించుము. అర్హతకును ఈడునకును మించిన ధర్మము సేయుట యధర్మమే యని యామె యభిప్రాయము. వత్సా! నీవీ తపస్సు చాలింపనేని నేనును నీవు చూచుచుండ బ్రాణములు వాసెదను.

పరాశరుడు:

తాంప్రలాపవతీ మేవం భాష్పావిలవిలోచనామ్

సమాహితమనావిష్ణౌ పశ్యన్నపి నదృష్టవాన్

వత్సవత్ససుఘోరాణి రక్షాంస్యేతాని భీషణే

వనేఽభ్యుద్యతశస్త్రాణి సమయాన్త్యపగమ్యతామ్

ఇత్యుక్త్వా ప్రయయౌసాథ రక్షాంస్యావిర్భభుస్తతః

అభ్యుద్యతోగ్రశస్త్రాణి జ్వాలామాలాకులైర్ముఖైః

తతోనాదా నతీవోగ్రాన్ రాజపుత్రస్యతేపురః

ముముచుర్దీ ప్తశస్త్రాణిభ్రామయన్తో నిశాచరాః

శివాశ్చశతశోనేదుస్సజ్వాలాకబలై ర్ముఖైః

త్రాసాయతస్యబాలస్య యోగయుక్తస్యసర్వతః

హన్యతాంహన్యతామేషభిద్యతాంభిద్యతామయమ్

భక్ష్యతాంభక్షతాంఛాయవిత్యూచుస్తేనిశాచరాః

తతోనానావిధాన్ నాదాన్ సింహోష్ట్రమకరాననాః

త్రాసాయరాజపుత్రస్య నేదుస్తే రజనీచారాః

రక్షాంసితాని తేనాదాశ్శివా స్తాన్యాయుధానిచ

గోవిన్దాసక్త చిత్త స్యయయుర్నేన్ద్రియగోచరమ్

తతస్సర్వా సుమాయాసువినష్టాసు పునస్సురాః

సంక్షోభం పరమం జగ్ముస్తత్పరాభవశజ్కితాః

తే సమేత్య జగద్యోని మనాదినిధనం హరిమ్

శరణ్యం శరణం యాతాస్తపసా తస్యతాపితాః

అని ఇట్లు కన్నుల నీరు గ్రక్కుకొనుచు పలవించు నమ్మనాతడు విష్ణువు నందు నిలిచిన మనసు గలవాడగుటచే జూడ డయ్యెను (పరధ్యాన మందుండె నన్నమాట). అంత నామె వత్సా! వత్సా! అల్లదె ఈ భయంకరాటవి నాయుధము లంగొని ఘోరమైన రాక్షస్సులు మీద బడుచున్నవి. పారిపొమ్మని యామె యతనుంది తొలగి పోయెను. వెంటనే రక్షస్సు లెదుట నిల్చినవి ఆయుధము లెత్తి జ్వాలా మాలాకులము లైన ముఖములతో భయంకరముగ నఱచుచు రాజ సుతనెదుట గిరగిర దిప్పి ప్రజ్వలించు నస్త్రములను వదలినవి. మంటలు గ్రమ్ము నోళుల నక్కలార్చినవి. చంపుడు చంపుడు వీనిని బట్టి చీల్చుడు చీల్చుడు తినుడు తినుడు యన్నిశాచరు లార్చినవి మఱియు నా నిశాచరులు సింహము లట్లొంటెలట్లు మొసళ్ళట్టి పలు మొగముల గొని యా రాచ బిడ్డని జడిపింప నర్చిరి. ఆ రక్కసులు వాండ్ర యా పెడబొబ్బలు అయాయుధము లేవియు గోవిందు నందు డెంద మత్తికొన్న యా బాలుని కంట బడవయ్యెను. రాజపుత్రు డేకాగ్రచిత్తుడై లోనున్న విష్ణునే చూచెంగాని మరి యొండెట్లునుం జూడడయ్యె. ఇట్లు మాయలెల్ల మాటుమాయ మైనంత సురలు మరియాతడు తమ్మింకను బరిభవించునని శంకించి యతని తపస్సు వేడిమికి దపించి యట నిలువక యందరుం గలసి జగత్కారణుని ఆది మధ్యాంతము లేని వానిని శరణ్యుని హరిని శరణందిరి. మఱియు నా స్వామి నిట్లు స్తుతించిరి.

దేవతలు:

దేవదేవ జగన్నాథ పరేశ పురుషోత్తమ

ధ్రువస్యతపసాతప్తా స్త్వాంవయం శరణంగతాః

దినేదినేకలాలేశైశ్శశాఙ్కః పూర్యతేయథా

తథాయంతపసాదేవ ప్రయాత్యృద్దిమహర్నిశమ్

ఔత్తానపాదితపసా వయ మిత్థం జనార్ధన

భీతాస్త్వాం శరణం యాతా స్తపసస్తంనివర్తయ

నవిద్మఃకిం స శక్రత్మం కిం సూర్యత్వమభీప్సతి

విత్తపామ్బుపసోమానాం సాభిలాషః వదేషుకిమ్

తదస్మాకం ప్రసీదేశ హృదయాచ్చల్యముద్దర

ఉత్తానపాద తనయం తపస్సన్నివర్తయ

దేవతలు:

దేవదేవ! జగత్ప్రభూ! పరేశ! పురుషోత్తమ! ధ్రువుని తాపమ్మున నుడిక నిన్ను శరణంద వచ్చితిమి. దినదిన ప్రవర్ధమాను డగు చంద్రుడట్లీ ధ్రువుడు రేయిం బవళ్ళు నీ ప్రసాదమున బెంపొందు చున్నాడు. జనార్ధనా! ఔత్తానపాది తపముచే మేమిట్లు జడిసి పోయి నిన్ను శరణు జొచ్చితిమి. వానిని తపము నుండి మరల్పుము. అతడు ఇంద్రత్వమునే కోరునో సూర్యత్వమునే కోరు చున్నాడో యెరుంగము. కుబేరుని వరుణుని సోముని యే పదవులం డాతని కభిలాషయో! కావున మమ్ము ననుగ్రహింపుము. మా హృదయ మందు గ్రుచ్చికొన్న శల్యము (బాధను) దీసి వేయుము.

శ్రీహరి:

నేన్ద్రత్వంనచాసూర్యస్త్వ వైవామ్బుప ధనేశతామ్

ప్రార్ధయత్యేష యంకామం తంకరోమ్యఖిలంసురాః

యాత దేవా యథాకామం స్వస్థానంవిగత జ్వరాః

నివర్తయా మ్యహంబాలం తపస్యాసక్తమానసమ్

ఇత్యుక్తాస్తేన దేవేన ప్రణమ్యత్రిదశాస్తతః

ప్రయయుస్స్వాని దిష్ణ్యాని శతక్రతువరోగమాః

భగవానపిసర్వాత్మా తన్మయత్యేన తోషితః

గత్వాధ్రువమువాచేదం చతుర్భుజవ పుర్హరిః

శ్రీహరి:

వీడు ఇంద్రత్వము గాదు, సూర్యత్వమునూ గాదు. వరుణ కుబేరాదు లగుట నుంగాదు ఇహదేమి కోరిన నదియెల్ల బొనరించెద. ఓ వేల్పులారా! మీ యిచ్చ వచ్చినట్లు మీ తావునకు దిగులు విడచి చనుడు. నేనీ బాలుని తపస్సు నందంటిన మనసు మరలింతును. అని హరిచే దెలుపబడి త్రిదషులు స్వామికి బ్రణతులై ఇంద్రాదులు తమ సదనముల కరిగిరి. సర్వాత్మకుడు భగవంతుడు ధ్రువుడు తన్మయుండగుటకు సంతుష్టుడై నలు చేతులం గొని చని ధ్రువునితో నిట్లనియె.

శ్రీహరి:

ఔత్తనపాదే! భద్రంతే తపసా పరితోషితః

వరదోఽహమనుప్రాప్తో వరంవరయసువ్రత

బాహ్యార్ధ నిరపెక్షంతేమయిచిత్తంయదాహితమ్

తుష్టోహం భవత స్తేన తద్వృణీష్వవరంపరమ్

శ్రీహరి:

ఔత్తానపాదీ! నీకు భద్రమగు గాక. నీ తపమ్మునకు సంతోషించితిని. వరదుడనై యేతెంచితిని. ఓ సువ్రత! వరము వరింపుము. నీ చిత్తము బాహ్యవిషయ నిరపేక్షమై నా యందు సమాహిత మైనది గావున నీవలన నేను సంతుష్టుడ నైతిని. కావున పరమోత్తమ వరమర్ధింపుము.

శ్రీపరాశరుడు:

శ్రుత్వేత్థంగదితంతస్య దేవదేవస్యబాలకః

ఉన్మీలితాక్షో దదృశే ధ్యానదృష్టిర్హ రింపురః

శఞ్ఖ చక్ర గదా శార్ఙ్గ వరాసిధర మచ్యుతమ్

కిరీటినం సమాలోక్య జగామ శిరసామహీమ్

రోమాఞ్చితాఙ్గ స్సహసా సాధ్వాసం పరమంగతః

స్తవాయ దేవదేవస్య సచక్రే మానసంద్రువః

కింవదామిస్తుతావస్య కేనోక్తేనాస్యసంస్తుతిః

ఇత్యాకులమతి ర్దేవం తమేవశరణంయయౌ

శ్రీపరాశరుడు:

అన దేవదేవుడు పలుకులు విని ధ్యాన దృష్టియైన బాలకుడు కనులు దెరచి యెదుట శంఖము, చక్రము, గదా, శార్ఙ్గము, వరద ముద్ర, కత్తియుం జేపట్టి కిరీటము దాల్చి యున్న యచ్యుతుని గాంచి తలతో నిలనంటెను. అనగా బ్రణతు డయ్యె నన్న మాట. తనువు గగుర్పొడువ తటాలున మిగుల జడుపుగొని దేవదేవుని స్తుతింప వలెనన తలపుగొని ధ్రువుడు ఏమందును? ఎవరు చెప్పిన స్తోత్రముచే నీయనను స్తుతించుట అని యట్టెట్టయిన మదితో నా దేవునే శరణొందెను.

ధ్రువుడు:

భగవాన్ యదిమేతోషం తపసా పరమంగతః

స్తోతుంత్వామహమిచ్చామితత్ర ప్రజ్ఞాంప్రయచ్చమే

ధ్రువుడు:

భగవాన్! నా తపస్సుచే నీవు పరమానంద మందెదవేని నిన్నేను బొగడ గోరెదను అందు నాకు బ్రజ్ఞం దయ సేయుము.

అధికపాఠ శ్లోకౌ:

బ్రహ్మాదైర్వే దతత్త్వజ్ఞెర్ జ్ఞాయతేయస్యనోగతిః

తంత్వాంకథమహందేవస్తోతుం శక్ష్యామి బాలకః

త్వద్భాక్తి ప్రవణం హ్యేతత్పరామేశ్వర మన్మనః

స్తోతుంకామయతేవిష్ణోతత్రప్రజ్ఞాం ప్రయచ్చమే

అధిక పాఠము:

వేదం తత్త్వ మెరిగిన వేధమున్నుగా దేవతలే దేవుని జాడ నెరుంగరు. అట్టి నిన్ను చంటి కుర్రను నేనెట్లు పొగడ గలను? ఈ నా మనస్సు నీ భక్తి యందాదరము గొన్నది. నిన్ను స్తుతింప గోరుచున్నది. అందు నాకు బ్రజ్ఞం దయ సేయుము.

శ్రీపరాశరుడు:

శఙ్కప్రాన్తేనగోవిన్ద స్తంపస్పర్శకృతాఞ్జలిమ్

ఉత్తనపాదతనయం ద్విజవర్యజగత్పతిః

తతః ప్రసన్న వదనస్తత్ క్ష తాన్నృప నన్దనః

తుష్టావప్రణతోభూత్వాభూతదాతారమచ్యుతమ్

శ్రీపరాశరుడు:

అన విని గోవిందుడు కేలుమోడ్చి యెదుట నిలబడిన యయ్యుత్తానపాద తనయుని జగత్పతి శంఖము కొనతో (వేదాంత భాగములో ) దాకెను. అంతట ముఖము ప్రసన్నమై (తెలివి గొని) యాక్శనము నృప నందనుడు ప్రణతుడై భూతధాత నచ్యుతుని స్తుతించెను.

ధ్రువుడు:

పురుషసూక్త భావానుకృతా ధ్రువకృత స్తుతిః

భూమిరాపోఽనలో వాయుఃఖం మనోబుద్దిరేవచ

భూతాదిరాది ప్రకృతిర్యస్య రూపంనతోఽస్మితమ్

శుద్దస్సూక్ష్మోఖిలవ్యాపీప్రధానత్పరతః పుమాన్

యస్యరూపం నమస్తస్మై పురుషాయగుణాత్మనే

భూతాదీనాం సమస్తానాంగన్దాదీనాంచ శాశ్వతః

బుద్ధ్యాదీనాంప్రధానస్య పురుషస్య చయః పరః

తంబ్రహ్మ భూతమాత్మన మశేష జగతః పతిమ్

ప్రపద్యేశరణం శుద్ధంత్వద్రూపం పరమేశ్వర

బృహత్త్వద్బృంహణత్వాచ్చయద్రూపం బ్రహ్మసంజ్ఞితమ్

తస్మైనమస్తే సర్వాత్మన్ యోగిచిన్త్యావికారవాత్

ధ్రువుడు (పురుషసూక్త మంత్రభావ గర్భముగా చేసిన విష్ణుస్తుతి):

భూమి నీరు అగ్ని వాయువు ఖము(నింగి) మనస్సు బుద్ది భూతాది ఆదిప్రకృతియే వాని రూపమా దేవునిం గూర్చి వినతుడ నయ్యెదను. శుద్దుడు సూక్ష్ముడు సర్వవ్యాపి ప్రధానము కంటే బై పురుషుడు ఎవ్వని రూపమా పురుషునకు గుణ మయునకు నమస్కారము. ఆకాశాది భూతములకు శబ్దాది గుణములకు బుద్ది మొదలయిన వానికి ప్రధానమునకు పురుషునకు నెవ్వడు మీది వాడు (పరుడు) అట్టి బ్రహ్మమైన పరమాత్మను జగత్పతిని శుద్దుని నీ రూపున నున్న వానిని బరమేశ్వర! శరణందేదను. ఏ రూపము బృహత్వాత్ (అన్నిటి కంటే పెద్దది యగుట వలన) బృంహణత్వాత్ (అంతట నిండియున్న డగుట వలన) “బ్రహ్మము” అను సంజ్ఞ నందినదో అట్టి నీకు ఓ సర్వాత్మక! యోగిచింత్య! అవికారి! నమస్కారము.

పురుషసూక్త స్తుతి:

సహస్రశీర్షాపురుషస్సహ స్రాక్షస్సహస్రపాత్

సర్వవ్యాపీ భువాస్స్పర్షదత్యతిష్ఠద్దశాఙ్గులమ్

యద్భూతం యచ్చవైభవ్యం పురుషోత్తమ! తద్భవాన్

త్వత్తోవిరాట్స్వరాట్సమ్రాట్ త్వత్తశ్చాప్యధిపూరుషః

అత్యరిచ్యత సోధశ్చతిర్యక్చోర్ ద్వంచవైభువః

త్వత్తోవిశ్వమిదంజాతంత్వత్తోభూతంభవిష్యతి

త్వద్రూపధారిణశ్చాన్తస్సర్వభూతమిదంజగత్

త్వత్తోయజ్ఞస్సర్వహుతః పృషదాజ్యం పశుర్ ద్విధా

త్వత్తోఋచోథసామాని త్వత్తశ్ఛన్దాంసిబజ్ఞిరే

త్వత్తోయజూంష్యజాయన్త త్వత్తోశ్వాశ్చైకతో దతః

గావస్త్వత్తస్సముద్భూతాస్త్వత్తోజా అవయోమృగాః

త్వన్ముఖాద్బ్రాహ్మణా బాహ్వోస్తవక్షత్రమజాయత

వైశ్యాస్తథోక్షరుజా శ్శూద్రాస్తవపద్భ్యాం సముద్గతాః

అక్ష్ణోస్సూర్యోఽనిలః ప్రాణాచ్చన్ద్రమామనసస్తవ

ప్రాణోఽన్తస్సుషిరాజ్జాతో ముఖాదగ్నిరజాయత

నాభితోగగనంద్యౌశ్చశిరసస్సమవర్తత

దిశః శ్రోత్రాత్ క్షితిఃపద్భ్యాంత్వత్తస్సర్వ మభూదిదమ్

న్యగ్రోధస్సుమహానల్పే యథాబీజే వ్యవస్థితః

సంయమేవిశ్వమఖిలం బీజభూతేతథాత్వయి

బీజాదంకు రసంభూతో న్యాగ్రోధస్సుసముచ్చ్రితః

విస్తారంచయథాయాతి త్వయాసృష్టంతథాజగత్

యథాహికదళీనాన్యా త్వక్పత్రాదథ దృశ్యతే

ఏవం విశ్వస్య నాన్యస్త్వంత్వత్స్థాయీశ్వర దృశ్యతే

హ్లాదినీసందినీ సంవిత్త్వయ్యేకాసర్వ సంస్థితౌ

హ్లాదతాపకరీ మిశ్రా త్వయి నోగుణవర్జితే

పృథగ్భూతై కభూతాయభూతాయతే నమః

ప్రభూతభూతరూపాయతుభ్యం భూతాత్మనేనమః

వ్యక్తం ప్రధానపురుషౌవిరాత్సమ్రాట్స్యరాట్తథా

విభావ్యతేఽన్తః కరణేపురుషేష్వక్షయోభవాన్

సర్వస్మిన్ సర్వభూతస్త్వంసర్వస్సర్వరూపధృత్

సర్వంత్వత్తస్తతశ్చత్వం నమస్సర్వాత్మనేఽస్తుతే

సర్వాత్మకోసిసర్వేశ సర్వభూతస్థితోయతః

కథయామి తతఃకింతేసర్వంవేత్సిహృదిస్థితమ్

సర్వాత్మన్ సర్వభూతేశసర్వసత్త్వసముద్భవ

సర్వభూతోభవాన్ వేత్తిసర్వ సత్త్వమనోరథమ్

యోమే మనోరథోనాథ సఫల స్సత్వయాకృతః

తపశ్చతప్తంసఫలంయద్దృష్టోఽసిజగత్పతే

పురుషసూక్త స్తుతి:

సహస్ర శీర్షుడు (అనంత శిరస్సులు గలవాడు) సహస్రాక్షుడు (వేయి కన్నులు గలవాడు) సహస్రపాత్ = వేయి పాదములు గలవాడై సర్వ వ్యాప్తియై భూమిందాకి నింగినంటి యామీద గూడ పది యంగుళములు దాటి యున్నది. పుట్టనిది పుట్ట బోవునది యదెల్ల పురుషోత్తమ! తమరు. నీనుండి విరాట్టు సమ్రాట్టు నీ నుండియే పురుషాతీ తత్వమును నేర్పడినవి. ఆ ఆది పురుషుడు (పరమాత్మ) భూమికి క్రిందను అడ్డముగను మీదునను, నీ నుండి ఈ విశ్వము పుట్టినది. పుట్ట గలదు. ఈ సర్వ భూతాత్మక జగత్తు నీ రూపమును ధరించినదే. నీ నుండి సర్వహుతమైన యజ్ఞము పృషదాజ్య (దధి మిశ్ర ఘాృతము) హవిస్సు పశువునకు రెండు రకముల గ్రామారణ్యక పశుద్వయము ఏర్పడినది. నీ నుండి ఋక్కులు సామములు నీ నుండి ఛందస్సులు జనించినవి. నీ నుండి యజస్సులు గోవులు మేకలు గొర్రెలు మృగములు అశ్వములు జన్మించినవి. నీ ముఖము నుండి బ్రాహ్మణులు బాహువుల నుండి క్షత్రము పుట్టినది. అట్లూరువుల నుండి వైశ్యులు పాదముల నుండి శూద్రులు పొడమిరి. నీ కన్నుల నుండి సూర్యుడు ప్రాణము నుండి అనిలుడు నీ మనస్సు నుండి చంద్రుడు పుట్టెను. అన్తస్సుషిరము (నాసా రంధ్రము) నుండి ప్రాణము ముఖము నుండి అగ్ని పుట్టెను. నాభి నుండి గగనము, శిరస్సు నుండి ద్యులోకము ప్రవర్తించెను. శ్రోత్రము నుండి దిక్కులు పాదముల నుండి క్షితి (ధరణి) నీనుండి యీ సర్వము నయ్యెను. పెద్దమర్రి చిన్న విత్తులో నేట్లున్నదో ప్రలయమున బీజమైయి మిడిక గొన్న నీయందీ అఖిల విశ్వమున్నది. విత్తనము నుండి మొలక పుట్టి విస్తారమును నందినట్లీ జగత్తు నీచే స్పష్టమై విస్తరిల్లినది. అరటి చెట్టు త్వక్కు(డిప్పల) కంటె ఆకుల కంటె వేరుగా గానిపించదో యట్లు విశ్వము కంటె నీవు వేరుగా గనిపింపవు. జగత్తు నీ యందున్నది. హ్లాదినీ శక్తి ఆహ్లాదము నిచ్చును. సంధినీ శక్తితాపము నొసంగును. ఈ రెండు శక్తులు కేవలము చిచ్చిక్తిగా సర్వాధార మయిన నీయందున్నవి. చిచ్చాక్తిహ్లాదతాపములు రెండింటి మిశ్రానుభవ మిచ్చును. గుణ శూన్యవయిన నీ యందు నిజానికి లేనేలేవు. వేరై ఒకటై భూతస్వరూపుడై ప్రభూత భూత స్వరూపుడై భూతాత్మకుడైన నీకు నమస్కారము. వ్యక్తము ప్రధానము (ప్రకృతి) పురుషుడు విరాట్టు సామ్రాట్టు స్వరాట్టు ననుపేర పురుషు లందు అంతః కరణమందు నీవు భావింప బడుదువు. అన్నిటా నన్నిరూపవై సర్వమై సర్వ స్వరూపుల దాల్చిన వాడనై యున్నావు. నీనుండి సర్వము. ఆ సర్వము నుండి నీవు నేర్పడినారు. అట్టి సర్వాత్మకునకు నీకు నమస్కారము. ఓ సర్వేశ్వర! నీవు సర్వాత్మకుడవు. సర్వ భూతముల యందు నున్నందున నీకేమి చెప్పుదును! హృదయ మందున్నదెల్ల నీవేరుంగుదువు. ఓ సర్వాత్మక! ఓ సర్వభూతేశ! సర్వసత్వోత్పత్తికారణ! సర్వము నీవై సర్వ సత్వములు (జీవుల) మనోరథమేమో యెరుంగుదువు. నాథ! నా కోరిక యేదోయది నీ చేత సఫలము చేయబడినది. నీవు దర్శన మిచ్చుట వలన నా జేసినా తపస్సు ఫలించినది.

శ్రీహరి:

తపసస్తుఫలం ప్రాప్తం యద్దృష్టోహంతవయాధ్రువ

మద్దుర్శనంహివిఫలం రాజపుత్రనహాయతే

వరంవరయతస్మాత్త్వం యథాభిమతమాత్మనః

సర్వంసంపద్యతేపుసాంమయి దృష్టిపథం గతే

శ్రీహరి:

నీకు నేను గనబడి నాడను గావున ధ్రువా! నీ తపస్సునకు ఫలము సిద్దించినది. నా దర్శన మెన్నడు విఫలము కాదు. నీకభిమత మైన వరమడుగుము నేను జూపులం బదితినేని పురుషుల కంతయు సుసంపన్న మగును.

ధ్రువుడు:

భగవాన్ సర్వభూతేశ! సర్వస్యాస్తే భవాన్ హృది

కిమజ్ఞాతంతవస్వామిన్ మనసాయన్మయేపితమ్

తథాపితుభ్యం దేవేశ కథయిష్యామియన్మయా

ప్రార్ థ్యతేదుర్వినీతేన హృదయేనాతిదుర్లభమ్

కింవాసర్వజగత్స్రష్టః ప్రసన్నేత్వయిదుర్లభమ్

త్వత్ప్రసాదఫలంభుఙ్క్తె త్రైలోక్యం మఘవానపి

నైత ద్రాజాసనంయో గ్యమజాతస్యమమోదరాత్

ఇతిగర్వాదవోచన్మాంసపత్నీమాతురచ్యుత

ఆధారభూతం జగతస్సర్వేషాముత్తమోత్తమమ్

ప్రార్ధయామిప్రభోస్థానంత్వత్ప్రసాదాదతోవ్యయమ్

ధ్రువుడు:

భగవంతుడ! సర్వభూతేశ! నీవందరి హృదయ మండున్నావు. నా మదినేమి కోరిక గలదో యది నీ వెరుంగనిదా! స్వామీ! అయినను దేవేశ్వర! యవినయ శీలమైన హృదయముతో నేను చెప్పెదను. నేను అతి దుర్లభమైన కోరిక నడుగు చున్నాను. సర్వ జగద్విధాతవు నీవు ప్రసన్నుడవుగాగా దుర్లభమనున దేముండును? ముల్లోమును ఇంద్రుడును గూడ నీ ప్రసాదము యొక్క ఫలము ననుభవించును. నా కడుపున బుట్టని వానికీ మర్హముగాదని గర్వమున నా సవతి తల్లి పలికినది. అచ్యుతా! సర్వులకు జగత్తునకు ఆధారమైన నాశనము లేని ఉత్తమోత్తమ స్థానమును నీ యనుగ్రహముచే నాకిమ్మని ప్రార్ధించు చున్నాను అనెను.

శ్రీహరి:

యత్త్వయాప్రార్ థితంస్తానమేతత్ప్రాప్స్యతిభవాన్

త్వయాహంతోషితః పూర్వమన్యజన్మని బాలక

త్వమాసీఃబ్రాహ్మణఃపూర్వంమయ్యేకాగ్రమతిస్సదా

మాతాపిత్రోశ్చ్షుశ్రూషుఃనిజధర్మానుపాలకః

కాలేనగచ్చ తామిత్రం రాజపుత్రస్తభవత్

యౌవనేఖిలభోగాఢ్యోదర్శ నీయోజ్జ్వలాకృతిః

తత్సంగాత్తస్య తామృద్ధిమవలోక్యాతిదుర్లభామ్

భవేయంరాజపుత్రోహమితివాఞ్ఛాత్వయాకృతా

తతోయథాభిలషితా ప్రాప్తాతే రాజపుత్రతా

ఉత్తనపాదస్యగృహే జాతోసిధ్రువ! దుర్లభే

అన్యేషాంతత్పరంస్థానంకులే స్వాయంభువస్యయత్

తస్యైతదపరంబాలయేనాహంపరితోషితః

మామారాధ్యనరోముక్తి మవప్నోత్యవిలమ్భితమ్

మయ్యర్పితమనాబాలకిము స్వర్గాదికంపదమ్

త్రైలోక్యాదధికస్తానేసర్వతారాగ్రహశ్రయః

భవిష్యతినసందేహోమత్ప్రసాదాద్భవాన్ ధ్రువ

శ్రీహరి:

నీవేది ప్రార్ధించితివా స్థానము నీవందెదవు. బాలక! ఇపుడే కాదు మరి యితర జన్మము నందు నీవు నన్ను సంతోష పరిచి యున్నావు. మున్ను నీవు బ్రాహ్మణుడవై నాయందేకాగ్ర మనస్కుడవై యెప్పుడును తల్లి తండ్రుల శుశ్రూషసేసి స్వధర్మమును బాలించితివి. అట్లుండ యౌవన మందు నీకొక రాజ కుమారుడు మిత్రుడయ్యెను. అతదఖిల భోగి సుందరుడు యువకుడును. వాని సంగము వలన నీవు దుర్లభమైన యాతని యా సమృద్దిగని నేను గూడ రాజపుత్రుడను గావలయునను వాంఛ గొంటివి. అంతట నీ కభిలషించిన రాజ పుత్రత్వము ప్రాప్తించినది. ఉత్తానపాదుని యింట బుట్టితివి. స్వాయంభువు కుల మందు బుట్టుట దుర్లభమైన విషయము. అట్టిదాన నీకు జన్మము గల్గినది. ఆ మీద నన్ను సంతోష పెట్టుట యను నీ యదృష్టము గూడ నీకు బుట్టినది. నన్నారాధించి ననరుడ విలంబముగ ముక్తి వడయును మనసు నాయందర్పించిన బాలక! స్వర్గాది పున్య స్థానము లెక్కేమి? ముల్లోకములకు అతీతమైన స్థానమున నా ప్రాసాదముచే సర్వతారా గ్రహములకు నాదర మయ్యెదవు. సందేహము లేదు.

సూర్యాత్సోమాత్తథాభౌమాత్సోమపుత్రాద్బృహస్పతేః

సితార్కతనయాదీనాంసర్వక్షాణాంతథాధ్రువ

సప్తర్షీణామశేషాణాంయేచవై మానికాస్సురాః

సర్వేశాముపరిస్థానంతవదత్తంమయాధ్రువ

కేచిచ్చతుర్యుగంయావత్కేచిన్మన్వన్తరంసురాః

తిష్ఠంతిధ్రువతేదత్తామయావై కల్పసంస్థితిః

సునీతిరపితేమాతా త్వదాసన్నా తినిర్మలా

విమానేతారకాభూత్వాతావత్కాలంనివత్స్యతి

యేచత్వాంమానవాఃప్రాతః సాయంచసుసమాహితాః

కీర్తయిష్యన్తితేషాంచమహాత్పుణ్యంభవిష్యతి

సూర్యుని కంటె చంద్రుని కంటె కుజుని కంటె బృహస్పతి కంటె సూర్య తనయుడు శని కంటె నన్ని నక్షత్రముల కంటె సప్తర్షుల కంటె యెల్ల వైమానికులు సురల కంటె మీది స్థానము నేను నీకోసంగితిని. కొందఱు దేవతలు నాల్గు యుగములు (ఒక్క మహా యుగము) కొందఱు మన్వంతరము(71 మహా యుగములు) నుందురు. కాని ధ్రువ! నేను నీకు కల్పాంతస్థాయి నిచ్చినాడను. అంతకాలము నీ తల్లి సునీతియు నీ దగ్గరకు మిక్కిలి నిర్మల కాంతితో తారకయై (చక్కని చుక్కయై నక్షత్రమై) విమానము నందుండును. అంతియు కాదు ఏ మానవులు ప్రాతస్సాయం కాల మందు సమాహిత మనస్కులై నిన్ను గుర్తింతురో వారికిని మహా పుణ్యము గలుగ గలదు.

శ్రీ పరాశరుడు:

ఏవంపూర్వంజగన్నాథాద్దేవదేవాజ్జనార్ధనాత్

వరంప్రాప్యధ్రువస్థ్సానమధ్యాస్తేసుమహామతే

స్వయంశుశ్రూషణాద్ధర్ మ్యాత్ మాతాపిత్రోశ్చవైతథా

ద్వాదశాక్షరమాహాత్మ్యత్తపసశ్చప్రభావతః

తస్యాభిమానమృద్దింమహిమానంనిరీక్ష్యచ

దేవాసురాణామాచాచార్యశ్శోక మత్రోశనా జగౌ

శ్రీ పరాశరుడు:

ఇట్లు దేవదేవుడగు మును జగన్నాథుని వలన వరము నంది ధ్రువుడు ధ్రువ స్థానము నధిష్టించి యున్నాడు. తల్లిదండ్రులకు స్వయముగా ధర్మవిహిత మయిన శుశ్రూష చేసినందు వలన ద్వాదశాక్షర మంత్ర జప మహిమ వలన తపః ప్రభావము వలన నతనికీ దివ్య పదము లభించినది. అతని యాత్మాభిమానము (రాచ బిడ్డకుండ వలసినది) సమృద్ది. మహిమను జూచి దేవతలకు రాక్షసులకు యాచార్యుడైన శుక్రాచార్యు డిట్లు కీర్తించెను.

శుక్రాచార్యుడు:

ఆహోఽస్యతపసోవీర్యమహోఽస్యతపసః ఫలమ్

యదేనంపురతఃకృత్వాద్రువం సప్తర్షయస్థ్సితాః

ధ్రువస్యజననీచేయంసునీతిర్నామసూనృతా

అస్యాశ్చమహిమానంకశ్శక్తోవర్ణ యితుంభువి

త్రైలోక్యాశ్రయతాంప్రాప్తంపరంతత్తత్ స్థిరాయతి

స్థానం ప్రాప్తా పరంధృత్వా యా కుక్షివివరేధ్రువమ్

యశ్చైతత్కీర్తయేన్నిత్యంధ్రువస్యారోహణందివి

సర్వపాపవినిర్ముక్తఃస్వర్గాలోకే మహీయతే

స్థానభజ్గంనచాప్నోతిదివివాయదివాభువి

సర్వ కళ్యాణసంయుక్తో దీర్ఘకాలం సజీవతి

శుక్రాచార్యుడు:

ఆహా! ఏమివీని తపశ్శక్తి! వీని తపః ఫలము! ఈ వీనిని ముందిడుకొని సప్తర్షులు జ్యోతిర్మండల మందున్నారు. ఈ ధ్రువుని జనని సునీతి పేరిది సూనృత వచన! ఈమె ప్రభావ మెవ్వడీ భువిని వర్ణింప శక్తుడు? వీని స్థానము స్థిరాయతి (ఏనాటికి జెక్కు చెదరని స్థాయి గలది) యైనది త్రిలోకాశ్రయ మైనది ప్రప్తించినది. కుక్షి వివరమున నీ ధ్రువుని భరించిన నయామెకు నీ స్థానము లభించినది. ధ్రువుడు ద్యులోకాగ్రమున కెక్కిన యీ కథ నెవ్వడు సంకీర్తించునో యాతడు సర్వపాపము లంబాసి స్వర్గ మందు కాని భూమింగాని స్థాన భ్రంశముం బొందడు. సర్వ కళ్యాణ సంపన్నుడై యాతడు దీర్ఘాయుష్మంతు డగును.