విష్ణు మహా పురాణము

6 - నరక వర్ణనము

శ్రీపరాశరుడు:

తతశ్చ నరకావిప్ర భువోఽధస్సలిలస్యచ

పాపినోయేషు పచ్యన్తే తాన్ శృణుష్వ మహామునే

రౌరవస్సూకరోరోథస్తాలోవిశసనస్తథా

మహాజ్వాలస్తప్తకుమ్బో లవణోఽథవిలోహితః

రుధిరామ్బోవై తరణిః క్రుమిశః కృమి భోజనః

అసిపత్రవనం కృష్ణో లాలాభాక్షశ్చ దారుణః

తథాపూయవహః పాపోవహ్నిజ్వాలోహ్యధశ్శిరాః

సందంశః కృష్ణసూత్రశ్చ తమశ్చావీచిరేవచ

శ్వబోజనశ్చాప్రతిష్టోహ్య వీచిశ్శతథాపరః

ఇత్యేవమాదయశ్చాన్యే నరకాభృశదారుణాః

యమస్యవిషయేఘోరాశ్శాస్త్రాగ్ని భయదాయినః

పతన్తియేషు పురుషాః పాపకర్మరతాస్తుయే

శ్రీపరాశరుడు:

ఓ విప్రులారా! పాపాత్ములు పడవేయ బడు రౌరవాది నరకములను గూర్చి యిక వినుడు. రౌరవము, సౌకరము, రోధము, తాలము, విశసనము, మహాజ్వాల, తప్తకుంభము, మహాలోభము, విమోచనము, రుదిరాంభము, వసాతప్తము, క్రుమీశము, కృమి భోజనము, అసిపత్రవనము, కృష్ణము, లాలాభక్షము, పూయవహము, వహ్నిజ్వాల, అధశ్శిరము, సందంశము, కృష్ణ సూత్రము, తమస్సు, ఆవీచి, శ్వభోజనము, అప్రతిష్టము, మావీచి అనునవి. పరమ దారుణములైన మరిపెక్కు నరకములు గలవు. ఇవి యముని పరిపాలన దేశములు. శస్త్ర, అగ్ని, విషములం బ్రయోగించు యమభటులు పాపకర్మాసక్తి గల వారు వీని యందుందురు. 

కూటసాక్ష్యం తథాసమ్యక్పక్షపాతేన యేవదేత్

యశ్చాన్యదనృతం వక్తి సనరోయతి రౌరవమ్

భ్రూణహా పురహన్తాచ గోఘ్నశ్చ మునిసత్తమ

యాన్తి తేనరకం రోధం యశ్చోచ్చ్వాస నిరోధకః

సురాపోబ్రహ్మహాహర్తా సువర్ణస్యచ సూకరమ్

ప్రయాన్తి నరకంశ్చ తైస్సంసర్గము పైతివై

రాజన్యవైశ్య హన్తాయస్తథైవ గురుతల్పగః

తప్తకుమ్భేస్వసృగామీ హన్తి రాజభటాంశ్చయః

సాధ్వీవిక్రియకృద్భన్ధపాలః కేసరివిక్రయీ

తప్తలోహే పతన్త్యేతే యశ్చభక్తం పరిత్యజేత్

దొంగ సాక్ష్య మిచ్చిన వాడు, పక్షపాత బుద్ధితో మాట్లాడు వాడు, అబద్ధము చెప్పువాడు రౌరవమున కేగును. భ్రూణ హత్య నగర ధ్వంసము గోహత్య చేసిన వాడు, జీవుల యూపిరి యాడకుండ చేసిన వాడు భయంకర రౌరవమున కేగుదురు. బ్రహ్మ హత్యా కారకుడు, బంగారమును దొంగిలించిన వాడు వాని స్నేహితుడు శూకర నరకమున బడుదురు. క్షత్రియ, వైశ్య ఘాతకుడు, గురు పత్నిని, అప్ప చెల్లెండ్రను గూడిన వాడు, రాజభటుని హత్య చేసిన వాడు తప్తకుంభమను నరకమున గూలును. మద్య విక్రేత, వధ్య పాలుడు, ఉరితీయు స్థానమును గాయువాడు (లేక) వధింప దగిన వానిని గాపాడిన వాడు, కేసర విక్రేత (విషమమ్ము వాడు) భక్తుని విడిచిన వాడు తప్తలోహమను నరకమున గూలుదురు.

స్నుషాంసుతాంవాపిగత్వా మహాజ్వాలే నిపాత్యతే

అవమన్తా గురూణాంయో యశ్చాక్రోష్టానరాధమః

వేదదూషయితాయశ్చ వేదవిక్రయికశ్చయః

అగమ్యగామీయశ్చస్యాత్తేయాన్తిలవణం ద్విజ

చోరోవిలోహేపతతి మర్యాదాదూషకస్తథా

దేవద్విజపితృద్వేష్టారత్నదూషయితాచయః

సయాతికృమిభక్షేవైకృమిశేచదురిష్టకృత్

పితృదేవాతిథీం స్త్యక్త్వాపర్యశ్నాతినరాధమః

లాలాభక్షేసయాత్యుగ్రేశరకర్తాచవేధకే

కరోతికర్ణినో యశ్చయశ్చఖడ్గాదికంనరః

ప్రయాతస్తౌవిశసనే నరకేభృశదారుణే

అసత్ప్రతి గృహీతాతు నరకేయాత్యధోముఖే

అయాజ్యయాకశ్చైవ తథానక్షత్రసూచకః

వేగీపూయవహేచైకో యాతిమృష్టాన్నభుం నరః

లాక్షామాంసరసానాంచ తిలానాం లావణస్యచ

విక్రేతాబ్రాహ్మణో యాతితమేవనరకం ద్విజ

మార్జారకుక్కుటచ్చాగశ్వవరాహవిహంగమాన్

లాలయన్నరకం యాతితమేవ ద్విజసత్తమ

(అపూపవిక్రయీచైవతథాపుస్తక విక్రయీ) 

రంగోపజీవికై వర్తః కుణ్డాశీగరదస్తథా

సూచీమాహిషికశ్చైవ పర్వకారీచయోద్విజ

కూతురును కోడలిని సంగమించిన వాడు మహా జ్వాలమను నరకమున పడవేయ బడును. వేద దూషకుడు, వేద విక్రయి, అగమ్యగామి, శబలమను నరకము పాలగును. దొంగ హద్దు మీరిన వాడును విమోహ నరకమున బడును. దైవ, బ్రాహ్మణ, పితృ ద్వేషియు, రత్నములను (శ్రేష్ఠ వస్తువులను) దూషించిన వాడు కృమిభక్ష్యమను నరకమును పొందును. దుర్యాగము చేసిన వాడు క్రుమీశమను నరకము పాలగును. పితృ దేవతాతిథులను విడిచి కుడిచిన వాడు లాలా (చొంగ) భక్ష్యమను నరకమున బడును. బాణములను చేయువాడు వేధక నరకమున బడును. ఖడ్గాదులను చేయు వాడును, కర్ణికారుడును, (కర్ణి - ఒక విధమైన యాయుధము) పరమ దారుణమైన విశసనమను నరకమున పడుదురు. అపాత్ర దానము పట్టిన వాడు, ఆయాజ్య యాజనము చేయ కూడని వానిచే యజ్ఞము చేయించిన వాడు, నక్షత్ర సూచకుడు, జ్యోతిష శాస్త్రము తెలియకనే జాతక ముహూర్తములు చెప్పువాడు అధోముఖ నరకము నందుండును. అతిథికి పెట్టక మృష్టాన్న మారగించు వాడు కృమిపూయ నరకమున కేగును. లాక్ష (లక్క), మాంసము, రసములు, మధుర పానీయములు, నువ్వులు, ఉప్పు అను వానినమ్ము బ్రాహ్మణుడు కూడ కృమిపూయ నరకమున పడును. పిల్లి, కోడి, మేక, కుక్క, పంది, పక్షులు వీనిని పెంచు వానికిని అదేగతి.

రంగోపజీవి (నాటకములను నటించి జీవించు వాడు), జాలరి, కుండా భగభక్షకుడు (వీర్య పానము చేయువాడు) లేక జారాజుని అగ్రము నుతించు వాడు, విషము పెట్టువాడు, సూచీ (చాడీ కోరు), పేచీ కోరు, మహిషకుడు (దున్నపోతుల వ్యాపారి) పర్వములందు స్త్రీ సంయోగము చేసిన బ్రాహ్మణుడు, కొంప లంటించు వాడు, మిత్ర ఘాతకుడు, శకునముల చెప్పువాడు, గ్రామ పాచకుడు, సోమ విక్రయ రుదిరాంధ కూపమున పడుదురు. తేనె పుట్టలను రేపిన వాడు, గ్రామ నాశనము చేసిన వాడు వైతరిణిం బడును. 

అగారదాహీమిత్రఘ్నశ్శాకునిర్ గ్రామయాజకః

రుధిరాపేపతన్త్యేతేసోమవిక్రయిణశ్చయే

మఖహాగ్రామహప్తాచ యాతివైతరణీం నరః

ధనయౌవనమత్తాశ్చ మర్యాదాభేదినోహియే

తేకృష్ణంయాన్త్యశౌచాశ్చకుహకాజీవినశ్చయే

అసిపత్రవనంయాతి వనచ్చేదీవృథై వయః

ఔరభ్రకోమృగవ్యాధా వహ్నిజ్వాలేపతన్తివై

యాన్త్యేతేద్విజ! తత్రైవ యశ్చాపాకేషువహ్నిదః

వ్రతేషులోపకోయశ్చస్వాశ్రమాత్ప్రచ్యుతశ్చయః

సందంశేయాతనామధ్యేపతతస్తావుభావాపి

దివాస్వప్నేషుస్కన్దన్తియేనరా బ్రహ్మచారిణః

పుత్రైరధ్యాపితాయేచ తేపతన్తిశ్వ భోజనే

ఏతేచాన్యేచనరకాశ్శాతశోఽథ సహస్రశః

తేషుదుష్కృతకర్మాణః పచ్యన్తేయాతనాగతాః

తథైవ పాపాన్యేతానితథాఽన్యాని సహస్రశః

భుజ్యన్తెయానిపురుషై ర్నరకాన్తర గోచరైః

వర్ణాశ్రమవిరుద్దంచ కర్మకుర్వన్తి యేనరాః

కర్మణామనసావాచా నిరయేషుపతన్తితే

అధశ్శిరోభిః దృశ్యన్తేనారకైః దివిదేవతాః

దేవాశ్చాధోముఖాన్ సర్వానధః పశ్యన్తినారకాన్

రేతః పానము చేసిన వాడు, మర్యాదోల్లంఘనము చేసిన వాడు (సదాచారములను, కట్టుబాట్లను దప్పిన వాడు), మాయాజీవులు, ఆచారహీనులు, కృచ్చ్ర నరకమున బడుదురు. ఔరభ్రికులు (గొర్రెల మందచే జీవించు వారు) మృగవ్యాధులు వహ్నిజ్వాలమను నరకమున బడుదురు. అపాకము లందు (వండ కూడని వస్తువులకు) అగ్నిని పెట్టిన వాడు అదే నరకమునం బడును. వ్రత లోపము, ఆశ్రమ ధర్మచ్యుతి చేసిన వాడు, సందంశ యాతనమను నరకమున బడును. బ్రహ్మచారులు, కొడుకుల దగ్గర యధ్యయనము చేసిన వారు, శ్వభోజనమను నరకమున బడుదురు. ఇట్టివి నూర్ల కొలది, వేల కొలది నరకములు కలవు. పాపములను చేసిన వారు ఈ బొంది విడిచి, యాతనా శరీరముల నొంది యిందు హింసింప బడుదురు. వర్ణాశ్రమ విరుద్ధమైన కర్మను త్రికరణములచే చేసిన వారు నరకము పాలగుదురు. ద్యులోక మందలి దేవతలు, తల క్రిందులుగా నుండు నరక లోక జీవులచే చూడబడు చుందురు. దేవతలు నరక లోక వాసులను అథోముఖులుగా జూచు చుందురు. జీవులు, స్థావరములు, కృములు, జల జంతువులు, పక్షులు, పశువులు, నరులు, ధార్మికులు, దేవతలు నను వరుసలో జన్మించి క్రమముక్తి నందుదురు. 

స్థావరాః కృమయోహ్యబ్జాః పక్షిణః పశవోనరాః

ధార్మికాస్త్రీదశాస్తద్వన్మోక్షిణశ్చ యథాక్రమమ్

సహస్రభాగప్రథమాః ద్వితీయానుక్రమస్తథా

సర్వేహ్యేతేమహాభాగ! యావన్ముక్తి సమాశ్రయాః

యావన్తోజన్తవస్స్వర్గేతావన్తోనరకౌకసః

పాపకృద్యాతి నరకం ప్రాయశ్చిత్త పరాఙ్ఞ్ముఖః

పాపానామనురూపాణి ప్రాయశ్చిత్తాని యద్యథా

తథాతదేవసంస్మృత్య ప్రోక్తాని పరమర్షిభిః

పాపేగురూణిగురుణి స్వల్పాన్యల్పే చతద్విరః

ప్రాయశ్చిత్తాని మైత్రేయ జగుస్స్వాయంభువాదయః

ప్రాయశ్చిత్తాన్య శేషాణి తపః కర్మాత్మకానివై

యానితేషామాశేషాణాం కృష్ణానుస్మరణం పరమ్

కృతేపాపేఽనుతాపోవై యస్యపుంసః ప్రజాయతే

ప్రాయశ్చిత్తంతుతస్యైకం హరిసంస్మరణం పరమ్

ప్రాతర్నిశి తథాసంధ్యా మధ్యాహ్నాదిషు సంస్మరన్

నారాయణమవాప్నోతి సద్యః పాపక్షయం నరః

విష్ణు సంసర్మరణాత్ క్షీణసమస్త క్లేశ సంచయః

ముక్తింప్రయాతి స్వర్గాప్తిస్తస్య విఘ్నోఽనుమీయతే

వాసుదేవేమనోయస్య జపహోమార్చనాదిషు

తస్యాన్తరాయో మైత్రేయా! దేవేన్ద్రత్వాదికం ఫలమ్

క్వనాకపృష్ఠ గమనం పునరావృత్తి లక్షణమ్

క్వజపో వాసుదేవేతి ముక్తిభీజమనుత్తమమ్

స్వర్గ మందేందరు జీవు లుందురో నరక మందు నందరుందురు. పాపాము చేసి ప్రాయశ్చిత్తము చేసికొనని వాడు నరకమేగును. ఆయా పాపముల కనురూపములైన ప్రాయశ్చిత్తములను పరమర్షులు స్మరించి (స్మృతులలో) పెద్ద పాపమునకు పెద్దగ, చిన్నదానికి చిన్నగా ప్రాయశ్చిత్తములను దేల్పిరి. స్వాయంభువ మనువు మొదలయిన వారా ప్రాయశ్చిత్త కాండను రచించిరి. అన్నిటికిని ప్రాయశ్చిత్తము కృష్ణ స్మరణము. దానిని మించినది లేదు. ప్రాయశ్చిత్తమనగా తపస్సు. పాపము జేసి యనుతాపము నొందేనేని హరి స్మరణ చేసేనేని దానిని మించిన పుణ్య సాధనము లేదు. దాన జీవి నారాయణుని జెందును. ప్రాతః కాలాహో రాత్రములందు సంధ్యా సమయము లందు నారాయణ స్మరణ చేసి పాప క్షయ మంది నరుడు నారాయణుని పొందును. ఎవ్వని మనస్సు జప హోమార్చనము లందు వాసుదేవు నందు లగ్నమై యుండునో వాడు ముక్తి నొందును. విష్ణువు నందప్పు డప్పుడు మనసు నిలువక చలించెనేని, వానికి దేవేంద్రాది పదవి లభించును. పునరావృత్తి లక్షణమైన స్వర్గ గమన మెక్కడ? ముక్తి భీజమైన వాసుదేవ నామ స్మరణ మెక్కడ? కావున అహర్నిశము పురుషుడు విష్ణు స్మరణ జేయుచు పాపక్షయమంది శుద్దుడైనచో నరకమును జూడడు. స్వర్గము మనః ప్రీతి గూర్చునది. దానికి వ్యతిరేకము నరకము. నరక స్వర్గము లనగా పాప, పుణ్యములే. అవి వానికి పర్యాయ పదములు, వాసు దేవిక చిత్తుడు అపునరావ్రుత్తి లక్షణ మైన సాయుజ్య యుక్తి కర్హుడన్న మాట. 

తస్మాదహర్నిశం విష్ణుం సంస్మరన్ పురుషోమునే

నయాతి నరకంసద్య స్సంక్షీణాఖిలపాతకః

మనః ప్రీతికరస్స్వర్గో నరకస్తద్విపర్యయః

నరకస్స్వర్గసంజ్ఞేవై పాపపుణ్యే ద్విజోత్తమ!

వస్త్వేకమేవ దుఃఖాయ సుఖయేర్ ష్యోద్భవాయచ

కోపాయచయతస్తస్మాద్వస్తువస్త్వాత్మకం కుతః

తదేవప్రీతయే భూత్వా పునర్ దుఃఖాయ జాయతే

తదేవకోపాయ యతః ప్రసాదయచ జాయతే

తస్మాదుఃఖాత్మకంనాస్తి నచకించిత్సుఖాత్మకమ్

మనసః పరిణామోఽయం సుఖ దుఃఖాది లక్షణః

జ్ఞానమేవ పరం బ్రహ్మ జ్ఞానంబన్దాయ చేష్యతే

జ్ఞానాత్మకమిదం సర్వం నజ్ఞానాద్విద్యతే పరమ్

విద్యావిద్యేచ మైత్రేయ! జ్ఞానమేవోపధారయ

ఏవమేతన్మయాఖ్యాతం భవతోమణ్డలం భువః

పాతాలదీని సర్వాణి తధైవ నరకాద్విజ!

సముద్రాః పర్వతశ్చైవ ద్వీపావర్షాణి నిమ్నగాః

సంక్షేపాత్సర్వమాఖ్యాతం కింభూయశ్శ్రోతుమిచ్చసి

ఒకే వస్తువు దుఃఖమునకు, సుఖమునకు, ఈర్షకు, కోపమునకు కారణ మగును. కావున నే వస్తువైనను దుఃఖాత్మకమే కాదు. ఆ వస్తువే యోకప్పుడు కోపమునకు హేతువై యదే ప్రసన్నతకు గారణ మగును. కావున కేవలము దుఃఖాత్మకము, కేవలము సుఖాత్మకము నయిన వస్తువు లేనేలేదు. సుఖ, దుఃఖాది లక్షణమైన యీ పరిణామము కేవల మానసికము, బ్రహ్మ జ్ఞాన మొక్కటియే జ్ఞానము. లౌకిక మయిన జ్ఞానము బంధమునకు బ్రహ్మ జ్ఞానము, ముక్తికిని కారణ మగును. ఈ ప్రపంచ వ్యవహారము తెలివి వలననే జరుగును. కాని దీనికే మంటదు. విద్య, అవిద్య యను వానిని బ్రహ్మ జ్ఞానము, లౌకిక జ్ఞానమునుగా గ్రహింప వలెను. (మోక్ష విషయకమైన జ్ఞానమే జ్ఞానమనియు తదన్య విషయకమైన తెలివి విజ్ఞాన మనియు నమరుడు చెప్పెను.) అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయాఽమృత మశ్నుతే అనగా అవిధ్యచే జరా, మరణములను లేకుండ జేసికొని విద్యచే నమృత స్థితిని (మోక్షమును) బొందునని శృతి చెప్పినది. ఔపనిషదమైన జ్ఞానము, బ్రహ్మ జ్ఞాన మగును. వేద విద్యా శబ్ద వాచ్యమై కేవల మపునరావృత్తికమైన ముక్తికి హేతువగును. తక్కిన వేద వేదంగాది విద్యలు తదుదిత కర్మానుష్టానము నవిద్యగా బేర్కొనబడి స్వర్గాది భోగమాత్ర సాధనములగు నన్నమాట. వీనిచే జిత్తశుద్ది వడసి పునరావృత్తి సహితము లయిన పుణ్యలోక భోగములను బొందవచ్చును. కేవలము విద్య వలననే మోక్ష స్థితి కలుగునని భావము. ఈ విధముగా నాచే భూమండలము సమస్త పాతాళములు నరకములు మీకు చెప్ప బడినవి. సముద్రము, పర్వతములు, ద్వీపములు, నదులు సంక్షేపముగ చెప్ప బడినవి. ఇంకేమి వినగోరు చున్నారు.