నృపాణాం కథితస్సర్వోభవతా వంశవిస్తరః।
వంశానుచరితమ్ చైవ యథావదనువర్ణితమ్॥
అంశావతారో బ్రహ్మర్షే! యోఽయంయదుకులోద్భవః।
విష్ణోస్తం విస్తరేణాహం శ్రోతుమిచ్చామి తత్త్వతః॥
“క్షత్ర వంశ చరిత్రమును వంశాను చరితమును వర్ణించిరి. యదుకుల మందు వ్యాపకుడగు నారాయణుని యంశావతారమైన శ్రీకృష్ణుని యొక్క చరితమును విస్తరముగను, యథార్తముగను విన వేడుక పడుచున్నాను. భగవంతుడగు పురుషోత్తముడు అంశాంశలుగ భూమి యందవతరించి చేసిన పనులను సవిస్తారముగ వర్ణింపుడు” అన
మైత్రేయ! శ్రూయతామేత ద్యత్పృష్టోఽమిహత్వయా।
విష్ణోరం శాంశసం భూతిచరితం జగతో హితమ్॥
దేవకస్య సుతాం పూర్వం వాసుదేవో మహామునే!।
ఉపయే మే మహాభాగం దేవకీం దేవతోపమామ్॥
కంసస్తయోర్వర రథం చోదయామాస సారథిః।
వసుదేవస్య క్యాసంయోగే భోజనన్దనః॥
అథాన్తరిక్షే వాగుచ్చైః కంసమాభాష్య సాదరమ్।
మేఘగమ్భీర నిర్ఘోషం సమాభాష్యేద మబ్రవీత్॥
యామేతాం వహసేమూడ! సహభర్త్రా రథేస్థితామ్।
అస్యాస్తవాష్టమో గర్భః ప్రాణానపరిష్యతి॥
ఇత్యాకర్ణ్య సముత్పాట్యఖడ్గం కంసో మహాబలః।
దేవకీం హన్తుమారబ్ధో వసుదేవోఽబ్రవీదిదమ్॥
న హన్తవ్యా మహాభాగా! దేవకీభవతాఽనఘ!।
సమర్పయిష్యే సకలాన్ గర్భానస్యోదరోద్భవాన్॥
తథేత్యాహ తతః కంసో వసుదేవం ద్విజోత్తమ!।
నఘాతయామాస చతాం దేవకీం తస్యగౌరవాత్॥
ఏతస్మిన్నేవకాలేతు భూరిభారావపీడితా జగామ ధరణీ మేరౌ సమాజం త్రిదివౌకసామ్॥
మైత్రేయా! ఇది జగన్మంగళకర చరిత్ర. వసుదేవుడు దేవకుని కుమార్తెను దేవతా సమానురాలగు, మహానుభావురాలగు దేవకిని వివాహమాడెను. ఆమె యన్న కంసుడామేను రథముపై నత్తవారింటికి గొని పోవుటకు సారథ్యము వహించెను. అపుడు మేఘ గంభీర స్వరమున నాకాశవాణి బిగ్గరగా ఓ మూడుడా! ఈ నీ చెల్లెలిని భర్తతో నత్త వారింటికి వంపించు చున్నావు. ఈమె యెనిమిదవ గర్భము నీ ప్రాణములను హరించునని వినిపించెను. కంసుడు విని యొర నుండి కత్తిదీసిం దేవకిం జంప బూనెను. వసుదేవుడు మహానుభావా! ఈమెం జంప వలదు. పుట్టిన పిల్లల నెల్లర నీ కర్పింతునన కంసుడు సరియని వసుదేవునిపై గౌరవము గొని చెల్లెలిం జంపుట విరమించెను. అదే సమయమున భూదేవి భారము నోర్వలేక మేరు పర్వత మందున్న దేవ సమాజము దరికేగి మ్రొక్కి తన కష్టమును జాలిగా చెప్పి కొనెను.
అగ్నిస్సు వర్ణస్య గురుర్గవాంసూర్యః పరోగురుః।
మమాప్యఖిలలోకానాం గురుర్నారాయణో గురుః॥
ప్రజాపతి పతిర్ బ్రహ్మాపూర్వేషామపి పూర్వజః।
కళాకాష్ఠానిమేషాత్మాకాలశ్చావ్యక్తమూర్తిమాన్॥
తదంశభూతస్సర్వేషాం సమూహోవస్సురోత్తమాః!॥
ఆదిత్యా మారుత స్సాధ్యా రుద్రావస్వశ్వివహ్నయః।
పితరోయేచలోకానాంస్రష్టారోఽపుత్రపురోగమాః॥
ఏతేతస్యా ప్రమేయస్య విష్ణోరూపం మహాత్మనః॥
యక్షరాక్షసదై తేయపిశాచోరగదానవాః।
గంధర్వాప్సరసశ్చైవ రూపం విష్ణోర్మహాత్మనః॥
గ్రహర్ క్షతారకాచిత్రగగనాగ్ని జలానిలాః।
అహంచవిషయాశ్చైవ స్వరం విష్ణుమయం జగత్॥
తథాచానేక రూపస్యయస్య రూపాణ్యహర్నిశమ్।
బాధ్యబాధకతాంయాన్తి కల్లోలా ఇవసాగరే॥
తత్సాంప్రతమమీదైత్యాః కాలనేమి పురోగమాః।
మర్త్యలోకంసమాక్రమ్యబాధన్తేఽహర్నిశం ప్రజాః॥
కాలనేమిహతోయోఽసౌవిష్ణునాప్రభవిష్ణువా।
ఉగ్రసేనసుతః కంసస్సం భూతస్సమహాసురః॥
అరిష్టోధేనుకః కేశీప్రలమ్బోనరకస్తథా।
సన్దోఽసురస్తథాఽత్యు గ్రోబాణశ్చాపిబలేస్సుతః॥
తధాన్యేచమహావీర్యా నృపాణాంభవనేషు యే।
సముత్పన్నాదురాత్మానస్తాన్నసంఖ్యాతుముత్సహే॥
అక్షౌహిణ్యోఽత్రబహులాదివ్యమూర్తిధరా స్సురాః।
మహాబలానాందృప్తానాందై త్యేన్ద్రాణాంమమోపరి॥
తద్భూరిభారపీడార్తానశక్నోమ్యమరేశ్వరాః।
బిభర్తుమాత్మానమహమితి విజ్ఞాపయామి వః॥
క్రియతాంతన్మహాభాగా మమభారావతారణమ్।
యథారసాతలం నాహంగచ్చేయమితివిహ్వాలా॥
అగ్ని బంగారమునకు గురువు. (కారణము) గోవులకు సూర్యుడు పరమ గురువు. సర్వలోక గురువగు నారాయణుడు నాకు గురువు. ప్రజాపతుల కెల్ల పతియగు బ్రహ్మ పూర్వుల కెల్ల పూర్వుడాయన కులంబున బుట్టినాడు. కలా కాష్ఠనిమేషము ఇత్యాది మానము గల కాల స్వరూపము అవ్యక్త రూపుడు నతడే. మీరందరును విష్ణువు యొక్క యంశ భూతులు. ఆదిత్యులు మరుత్తులు రుద్రులు యక్షరాక్షసాదులు గ్రహములు పంచ భూతములు నేను భూతతన్మాత్రలు మొదలగు జగత్తంతయు విష్ణుమయము. కడలిలో కెరటములట్లు సర్వస్వరూపుడగు నతని యొక్క రూపములు ఒకదాని నొకటి బాధించునది బాధింపబడునదియునై తోచును. కావున నిపుడు కాలనేమి మొదలగు దైత్యులు మానవ లోకము నాక్రమించి యహర్నిశము ప్రజలను బాధించు చున్నారు. విష్ణుహతుడైన కాలనేమి మొదలగు దైత్యులు మానవ లోకము నాక్రమించి యహర్నిశము ప్రజలను బాధించు చున్నారు. విష్ణు హతుడైన కాలనేమి కంసుడై యుగ్రసేనునికి బుట్టినాడు. అరిష్టుడు ధేనుకుడు కేశి ప్రలంబుడు నరకుడు సుంధుడు బలి కుమారుడయిన బాణుడు ఇతరులైన పరమదుష్టులు మహావీర్యులు రాజుల యిండ్ల యందు పుట్టి యున్నారు. వారిని లెక్కింప జాలను. అనేకాక్షౌహిణుల దేవతలు మదోన్మత్తులగు రాక్షసులు నా మీద వసించి విపరీత భారములు కూర్చు చున్నారు. ఇది దేవతలారా! నాకు దుర్భరమైన వేదనగా నున్నది. నేను పాతాళమునకు క్రుంగి పోకుండ నీ బరువుం దింపుడన విని భారము తగ్గింప దేవతలచే ప్రేరితుడై బ్రహ్మ యిట్లనియె.
యథాహ వసుధా సర్వంసత్యమేవదివౌకసః।
అహంభవోభవన్తశ్చ సర్వేనారాయణాత్మకాః॥
విభూతయస్తుయా స్తస్యతాసామేవ పరస్పరమ్।
ఆధిక్యన్యూనతాబాధ్యబాధకత్వేన వర్తతే॥
తదాగచ్చతగచ్చామ క్షీరాబ్ధేస్తటముత్తమమ్।
తత్రారాధ్యహరింతస్మైసర్వం విజ్ఞాపయామవై॥
సర్వథై వజగత్యర్థేససర్వాత్మా జగన్మయః।
సత్త్వాంశేనావతీర్యోర్ వ్యాంధర్మస్యకురుతేస్థితిమ్॥
భూదేవి పలికినది నిజము. నేను శివుడు మీరు నందరమును నారాయణ స్వరూపులమే. ఆయన విభూతులే పరస్పరము పెద్ద చిన్న బాధించువాడు బాధింప బడువాడుగా వర్తించును. అందువలన క్షీర సముద్ర తీరమున కందరముం జని హరిని సేవించి స్వామికి స్వరమును విన్నవింతము. సర్వాత్మకుడైన శ్రీహరి సత్త్వ గుణాంశముచే నవని నవతరించి ధర్మస్థితి చేయును. అని పలికి దేవతలతో గూడ పితామహుడటజని సమాధి నిష్టుడై గరుడ ధ్వజుని స్తుతించెను.
ద్వేవిద్యేత్వమనామ్నాయ! పరాచైవాపరాతథా।
త ఏవభవతోరూపేమూర్తామూర్తాత్మికే ప్రభో॥
ద్వేబ్రహ్మాణీత్వణీయోఽతిస్థూలాత్మన్ సర్వసర్వవిత్।
శబ్దబ్రహ్మ పరంచైవ బ్రహ్మబ్రహ్మమయస్యయత్॥
ఋగ్వేదస్త్వం యజుర్వేదస్సామా వేదస్త్వథర్వచ।
శిక్షాకల్పోనిరుక్తంచ చన్దోజ్యోతిషమేవచ॥
ఇతిహాస పురాణేచ తథా వ్యాకరణం ప్రభో!।
మీమాంసాన్యాయకంతద్వద్ధర్మశాస్త్రాణ్యధోక్షజ!॥
ఆత్మాత్మదేహగుణవద్విచారాచారియద్వచః।
తదప్యాద్యపతే! నాన్యదధ్యాత్మాత్మ స్వరూపవత్॥
త్వమవ్యక్తమనిర్దేశ్యమచిన్త్యానామవర్ణవత్।
అపాణిపాదరూపంచశుద్ధంనిత్యం పరాత్పరమ్॥
శృణోష్యకర్ణః పరిపశ్యసిత్వమచక్షురూపోబహురూపరూపః।
అపాదహస్తోజవానో గృహీతా త్వంవేత్సిసర్వంనచసర్వవేద్యః॥
అణోరణీయంసమసత్స్వరూపం త్వాంపశ్యతోఽజ్ఞాననివృత్తిరగ్య్రా।
ధీ రస్సధీరస్య బిభర్తినాన్యద్వరేణ్యరూపాత్పరతః పరాత్మన్॥
త్వం విశ్వనాభిః భువనస్యగోప్తా సర్వాణిభూతానితవాన్తరాణి।
యద్భూతతభవ్యంయదణోరణీయః పుమాంస్త్వమేకః ప్రకృతేః పరస్తాత్॥
ఏకశ్చతుర్ధాభగవాన్ హుతాశో వర్చోవిభూతింజగతోదదాతి।
త్వంవిశ్వతశ్చక్షురనన్తమూర్తే! త్రేధాపదంత్వంనిదధాసిధాతః॥
యథాఽగ్ని రేకోబహుధాసమిధ్యతే వికారభేదైరవికారరూపః।
తథాభవాన్ సర్వగతైకరూపీ రూపాణ్య శేషాణ్యనుపుష్యతీశ!॥
ఏకంతవాగ్ర్యంపరమం పదంయత్పశ్యన్తిత్వాం సూరయోజ్ఞానదృశ్యమ్।
త్వత్తోనాన్యత్కించిదస్తిస్వరూపం యద్వాభూతమ్ యచ్చభవ్యంపరాత్మన్!॥
వ్యక్తావ్యక్త స్వరూపస్త్వం సమష్టివ్యష్టిరూపవాన్।
సర్వజ్ఞస్సర్వవిత్సర్వ శక్తిజ్ఞానబలర్ ద్ధిమాన్॥
అన్యూనశ్చాప్యవృద్ధిశ్చ స్వాదీనోఽనాదిమాన్వశీ।
క్లమతన్ద్రభయక్రోధకామాదిభి రసంయుతః॥
నిరవద్యః పరః ప్రాప్తేర్నిరధిష్ఠోఽక్షరః క్రమః।
సర్వేశ్వరః పరాధారోధామ్నాంధామాత్మకోక్షయః॥
మహావిభూతి సంస్థాన సమస్తే పురుషోత్తమ!॥
అనామ్నాయ! (వేదములకు గూడ వర్ణింప నలవి కాని) ప్రభో! పర అపరయను రెండు విద్యలు నీవె. మూర్తము (సాకారము), అమూర్తము (నిరాకారము) నయిననీ స్వరూపములే యవి. ఓ సర్వాత్మక! సర్వజ్ఞ అని రెండును బ్రహ్మ స్వరూపములు ఒకటి మిక్కిలి సూక్ష్మము, ఒకటి అతి స్థూలము. బ్రహ్మమయుడ వయిన నీ యొక్క స్వరూపమయిన యా రెంటిలో నొకటి శబ్ద బ్రహ్మము, ఒకటి పరబ్రహ్మము, ఋగ్యజుస్సామాధర్వణ వేదములు శిక్షా వ్యాకరణ చ్చందో నిరుక్త జ్యోతిషకల్పములను వేదంగము లారును ఇతిహాస పురాణములును పూర్వోత్తర మీమాంసలును న్యాయవై శేషికరూపతర్క శాస్త్రములును ధర్మ శాస్త్రమునునను అష్టాదశ విద్యలు నీ స్వరూపములు. జీవాత్మ పరమాత్మ దేహస్థూల సూక్ష్మగుణవద వ్యక్తముల యొక్క విమర్శకు సంబంధించిన యుపనిషద్వాచనములు కూడ నీ కంటే వేరుకావు. ఆధ్యాత్మ తత్త్వమగు జీవాత్మ ఆత్మతత్మమగు పరమాత్మయు నీ స్వరూపమే. అవ్యక్తము అనిర్దేశ్యము అచింత్యము అనామరూపము పాణిపాదాదులు లేనిది శుద్దము నిత్యము పరాత్పరమైన వస్తువు నీవె. వీనులు లేకుండా విందువు. కన్నులు లేకుండా కాంతువు. రూపము లేకున్నను బహురూపుడవు. పాదములు లేని వేగరివి. హస్తములు లేకయు నందికొందువు. అందరకెరుక పడకున్న నునంతయు నెరుంగుదువు. అణువు కంటే నణువు. దృశ్యరూప రహితుడవు. వరణీయమగు నీ రూపమునే ధారణ చేయు సమర్థమయిన బుద్ధిగల వాడై ధీరుడై నిన్ను దర్శించిన వానికి అజ్ఞాన నాశనము పరమ ఫలము. ఓ పరమ శ్రేష్ఠా! నీ రూపము కంటె మరొకటి ఈ జగత్తును భరించునది లేదు. ఓ పరాత్పరా! ఈ విశ్వమునకు నాభి స్థానమీవు. (విశ్వము గర్భమున ధరించు వాడవు) భువన రక్షకుడవు. సర్వభూతములు నీలోనివి. పుట్టినది పుట్టబోవునది అణువు కంటే నణువు ప్రకృతి కంటే పరుడయిన ఏకైక పురుషుడవు నీవె. ఒక్కడవే త్రేతాగ్నులు ఔపాసనాగ్ని రూపమున (లేక) వైద్యుత జాఠర నిర్మథ్య బాడబగ్ని రూపమున నలుతెరగులైన యగ్ని స్వరూపుడవై జగత్తునకు వర్చస్సును విభూతిని (ఐశ్వర్యమును) నొసంగు చున్నావు. ఓ అనంతమూర్తీ! విశ్వతశ్చక్షువు (సర్వ ద్రష్టువు, సాక్షివన్న మాట) త్రివిధముగ నీ పదమును విన్యాసము సేయుదువు. త్రివిక్రమావతార మందు మూడు లోకము లందు నీ పాదము నుంచెదవు. ఒకే యగ్ని వికార భేదములతో వికారము లేనిదై పలు రూపముల నారాధింప బడునట్లు సర్వగుడ వైనను నీవు ఒకే రూపమై అశేష రూపములను నీవె యనుపోషణము సేయు చున్నావు. ఏకైకము సర్వోన్నతము జ్ఞానైక దృశ్యము పరమ పదమునుగ సురులు (జ్ఞానులు) నిన్ను దర్శింతురు. నీ కంటె మరియే కొంచెము స్వరూపము మున్ను లేదు. ఇంకా ముందు నుండబోదు. నీవు వ్యక్తముగా వ్యష్టిరూపమునను అవ్యక్తముగ సమష్టి రూపమునను నున్నాడవు. సర్వజ్ఞుడవు, సర్వవేత్తవు. సర్వశక్తి, జ్ఞానబల సమృద్ధులు గలవాడవు. నీవే కొదువ లేని వాడవు. పెరగని వాడవు, స్వాధీనుడవు, ఆది లేని వాడవు, ఇంద్రియ నిగ్రహము కలవాడవు, వసివాడుట, తంద్ర (అలసట) భయము కోపము కామము మొదలయిన గుణములు నీకు లేవు. దోషము లేని వాడవు. ప్రాప్తికి పరుడవు. (ఇంద్రియాదుల యొక్క లక్ష్యమునకు అతీతుడు) సర్వాధారుడవు. సర్వేశ్వరుడవు. పరమాధార మీవు. సర్వ తేజస్సులకే తేజస్సు నీవు. అక్షయుడవు! సర్వావరణముల కతీతుడవు, నిరాలంబన మైన భావన నీ స్వరూపము. (నిర్బీజ సమాధి యందు కేవల జ్ఞాన రూపుడవై ధ్యేయమవుదు వన్న మాట) మహావిభూతి సంస్థాన మగు పురుషోత్తమా! నీకు నమస్కారము. ఆకారణముగను, సకారణముగను, కారణాకారణముల మధ్య స్థితిగను నీవు శరీర గ్రహణము చేయుదువు. ఓ సర్వవ్యాపీ! నీవు శరీరము గ్రహించుట (అవతరించుట) కేవలము ధర్మ రక్షణమునకే అని యిట్లు చేసిన బ్రహ్మస్తవమును భగవంతుడజుడు శ్రీహరి విని సంప్రీత మనసుతో తన విశ్వ రూపమును వెలువరించుచు బ్రహ్మతో నిట్లనియె.
భో భో బ్రహ్మంస్త్వయామత్తస్సహదేవైర్యదిష్యతే।
తదుచ్యతామశేషంచ సిద్ధమేవావదార్యతామ్॥
ఓ బ్రహ్మా! నీవు దేవతలుం గలిసి నా వలన గోరునది ఏమో తెల్పుడు. పని యయినదే యనుకొనుడు. అన హరి యొక్క విశ్వ రూపమును దర్శించి దేవతలు భయ వినయములతో వినతులయి నంతట పితామహుడు మరల విష్ణువు నిట్లు స్తుతించెను.
నమో నమస్తేఽస్తు సహస్రకృత్వ స్సహస్రబాహో బహువక్త్రపాద!।
నమో నమస్తే జగతః ప్రవృత్తి వినాశ సంస్థానకరా ప్రమేయ!॥
సూక్ష్మాతి సూక్ష్మాతి బృహత్ప్రమాణ గరీయసామప్యతి గౌరవాత్మన్!।
ప్రధానబుద్దీన్ద్రియవత్ప్రధాన! మూలాత్పరాత్మన్ భగవాన్! ప్రసీద॥
ఏషామహీదేవా! మహీ ప్రసూతైర్మహాసురైః పీడితశై లబన్ధా।
పరాయణంత్వాం జగతాముపైతి భారావతారార్థమాపారసార!॥
ఏతేవయం వృత్రరిపుస్తథాఽయం నాసత్యదస్రౌవరుణ స్తథైవ।
ఇమేచరుద్రా వసవస్ససూర్యాస్సమీరణాగ్ని ప్రముఖాస్తథాఽన్యే॥
బ్రహ్మ హరి విశ్వరూపమును దర్శించి జేసిన స్తుతి:
నమస్కారము. నీకివే వేయి నమస్కారములు. నీవు సహస్ర బాహుడవు. అనేక ముఖములు పాదములు గలవాడవు. జగత్తు యొక్క సృష్టి స్థితి లయ కర్తవు. సూక్ష్మము లన్నిటి కంటే సూక్ష్ముడవు. గొప్ప పదార్థము లన్నిటి కంటే గొప్ప వాడవు. ప్రధానము, బుద్ధి, యింద్రియములు గల జీవకోటికి మూలమైన వానికి మూలమీ స్వామీ! అనుగ్రహము సూపుము. ఇదిగో! ఈ భూదేవి తన యందు ఉద్బవించిన మహా రాక్షసులచే మహా పర్వత శరీర సంధి బంధములు సడలి పోయి అంతులేని సారము (శక్తి) గల ఓ శ్రీహరీ! జగత్పరాయణుడవగు నిన్ను తన భారము హరింతువని శరణంద వచ్చినది. ఇంద్రుడశ్వనీ దేవతలు వసురుద్రాదిత్యులు వాయువు అగ్ని మున్నుగ మేము సేయవలసిన కార్యమానతిమ్ము. నీ యాజ్ఞను బరిపాలింతుము.
ఏవంసంస్తూయమానస్తు భగవాన్ పరమేశ్వరః।
ఉజ్జహారాత్మమనః కేశౌసీత కృష్ణౌ మహామునే!॥
ఉవాచచసురానేతౌ మత్కేశౌవసుధాతలే।
అవతీర్యభువోభారక్లేశహానిం కరిష్యతః॥
సురాశ్చసకలాస్స్వాం శైరవతీర్య మహీతలే।
కుర్వన్తు యుద్దమున్మత్తైః పూర్వోత్పన్నైః మహాసురైః॥
తతః క్షయమశేషాస్తే దైతేయా ధరణీతలే।
ప్రయాస్యన్తినసందేహోమద్ధృక్పాతవిచూర్ణితాః॥
వసుదేవస్య యా పత్నీ దేవకీ దేవతోపమా।
తత్రాయమష్టమోగర్భోమత్కేశోభవితాసురాః॥
పాపములం దొలంగుదుమన భగవంతుడు తన తెల్లని నల్లని కేశములను బీకి వేల్పులలో నివి రెండు వెంట్రుకలు పుడమిపై నవతరించి భూభార క్లేశమును హరింప గలవు. సురలెల్లరు తమతమ యంశములచే నవని యందవతరించి యింతమున్న పుట్టిన మదోన్మత్తులైన రాక్షసులతో బోరుదురు గాక! అందుచే వీండ్రు నశింప గలరు. సందేహము లేదు. నా చూపు పడినంతన నెల్లరు మడియుదురు. వసుదేవుని భార్య దేవకీ దేవతా మూర్తి. ఈ నా కేశ మామె కెనిమిదవ శిశువుగ నుదయింప గలదు. ఇది కాలనేమి రూపుడగు కలమని సంహరించునని పలికి స్వామి యంతర్థాన మయ్యెను.
అదృశ్యాయతతస్తస్మై ప్రణిపత్య మహామునే।
మేరు పృష్ఠం సురాజగ్మురవతేరుశ్చభూతలే॥
కంసాయచాష్టమోగర్భోదేవక్యా ధరణీధరః।
భవిష్యతీత్యాచచక్షే భగవాన్ నారదోమునిః॥
కంసోఽపితదుపశ్రుత్యనారదాత్కుపితస్తతః।
దేవకీం వసుదేవంచ గృహేగుప్తావధారయత్॥
వసుదేవేన కంసాయ తేనైవోక్తంయథాపురా।
తథైవ వసుదేవోఽపి పుత్ర మర్పితవాన్ ద్విజ!॥
హిరణ్యకశిపోః పుత్రాష్షడ్గర్భా ఇతివిశ్రుతాః।
విష్ణుప్రయుక్తాతాన్నిద్రా క్రమాద్గర్భానయోజయత్॥
సురులా దేవునికి మ్రొక్కి మేరుగిరి కేగిరి. అవ్వల వారే భూమిపై నవతరించిరి. దేవకీ ఏడవ గర్భము ధరణి నుద్ధరించునని నారద భగవానుడు కంసున కేరింగించెను. అది విని కంసుడు కుపితుడై దేవకీ వసుదేవులం బంధించెను. వసుదేవుడన్న మాటకు గట్టువడి తాగన్న నేడ్వురను గంసుని కర్పించెను. మున్ను హిరణ్యకశిపునికిం బుట్టిన వారే వారార్వురు. (షడ్గర్భములు) విష్ణుని నియోగమున యోగనిద్ర వైష్ణవ మాయ వారిని దేవకీ గర్భము నందు సంధానము సేసెను. ఆ మాయాశక్తి చేతనే (అవిద్య చేతనే) సర్వ జగత్తు సంమోహితమగు చున్నది. ఆమెం గూర్చి హరి యిట్లనియే.
నిద్రే! గచ్చమామాదేశాత్పాతాలతల సంశ్రయాన్।
ఏకైకత్వేనషడ్గర్భాన్ దేవకీజఠరం నయ!॥
హతేషుతేషుకంసేన శేషాభ్యోంఽశస్తతోమమ।
అంశాంశేనోదరేతస్యాస్సప్తమస్సం భవిష్యతి॥
గోకులేవసుదేవస్యభార్యాన్యా రోహిణీస్థితా।
తస్యాస్ససంభూతిసమందేవినేయస్త్వయోదరమ్॥
సప్తమోభోజరాజస్యభయాద్రోధోవరోధతః।
దేవక్యాః పతితోగర్భ ఇతిలోకోవదిష్యతి॥
గర్భసంకర్షణాత్సోథ లోకేసంకర్షణేతివై।
సంజ్ఞామావాప్స్యతేవీరశ్శ్వేతాద్రిశిఖరోపమః॥
తతోహంసంభవిష్యామిదేవకీజఠరే శుభే।
గర్భంత్వయాయశోదాయాగన్తవ్యమవిలమ్బితమ్॥
ప్రావృట్కాలేచనభసికృష్ణామ్యామహంనిశి।
ఉత్పత్స్యామినవమ్యాంతు ప్రసూతింత్వమవాప్స్యసి॥
యశోదాశయనేమాంతుదేవక్యాస్త్వామనిన్దతే।
మచ్చక్తిప్రేరితమతిర్వసుదేవోనయిష్యతి॥
కంసశ్చత్వాము పాదాయదేవిశైలశిలాతలే।
ప్రక్షిపత్యన్తరిక్షేచసంస్థానంత్వమవాస్స్యసి॥
తతస్త్వాంశతదృక్చక్రః ప్రణమ్యమమ గౌరవాత్।
ప్రణిపాతానతశిరా భగినీత్వేగ్రహీష్యతి॥
త్వంచశుమ్భనిశుమ్భాదీన్ హత్యాదైత్యాన్ సహస్రశః।
స్థానైరనేకైః పృథివీమశేషాంమణ్డయిష్యసి॥
త్వంభూతిస్సన్నతిః క్షాన్తిః కాన్తిర్ ద్యౌః పృథివీధృతిః।
లజ్జాపుష్టీరుషాయాతు కాచిదన్యాత్వమేవసా॥
యేత్వామార్యేతిదుర్గేతివేదగర్భామ్బికేతిచ।
భద్రేతిభద్రకాళీతిక్షేమదాభాగ్యదేతిచ॥
ప్రాతశ్చైవాపరాహ్ణేచ స్తోష్యన్త్యనమ్రమూర్తయః।
తేషాంహిప్రార్థితం సర్వం మత్ప్రసాదాద్భవిష్యతి॥
సురామాంసొపహారైశ్చ భక్ష్యభోజ్యైశ్చపూజితా।
నృణామశేషకామాంస్త్వం ప్రసన్నాసంప్రదాస్యసి॥
భగవానుడు:
ఓ నిద్రాదేవతా! నా యానతిగొని నీవు పాతాళ మందున్న షడ్గర్భముల నొక్కొక్కటిగా దేవకీ యుదరమునం జేర్పుము. వారు హతులయినంతట శేషుడు నా యొక్క యంశాంశ మైనవాడు దేవకికి సప్తముడై యామె యుదర మందు బ్రవేశించును. నంద గోకులమందు నందుని యింకొక భార్య రోహిణి యున్నది. నీవామె కడుపున నీ శిశువుం జేర్పుము. భోజరాజ్ఞ వలని భయముచే కారాగారమందలి నిరోధముచే దేవకికి గర్భము పోయినదని లోకము సెప్పి కొనును. ఆ శిశువు గర్భము నుండీ సంకర్షించుటచే (లాగుటచే) సంకర్షుణుడను పేరందును. ఆ బాలుడు మహావీరుడు కైలాసగిరి వంటివాడు. ఆ మీదట నేను శుభస్థానమయిన దేవకీ జఠర మందవతరింప గలను. నీ వా గర్భమున విరామముగ గొంపోయి యశోద యందుంప వలయును. వర్ష ఋతువు శ్రావణ బహూలాష్టమి నాటి రేయి నేను బుట్టుదును. నీవు నవమి నాడు బుట్ట గలవు. నా శక్తి ప్రేరితమైన తలంపుతో వసుదేవుడు నన్ను యశోద ప్రక్కను నిన్ను దేవకీ ప్రక్కనను చేకొని చేర్పగలడు. దేవీ! కంసుడు నిన్ను బట్టి రాతిపైనేసి కొట్టును. అపుడు నీవంతరిక్షము నందు నిలుతువు. అంతట నింద్రుడు వేయి గన్నుల వాడు కావున గమనించి తలవాంచి తన చెల్లలింగా స్వీకరించును. నీవు శుంభ నిశుంభాది దైత్యులను వేలకొలదిగా సంహరించి యనేక స్థానము లందనేక నామములతో నెల్ల పృథివి నలంకరింతువు. నీవు భూతిసన్నతిక్షాంతికాంతిద్యు లోకము పృథివి (ధృతిరాధైర్యాధి దేవత) లజ్జ పుష్టి రుష యను నాయా గుణములు స్వరూపములుగా గలదానివై నీవె యుందువు. నిన్ను ఆర్య దుర్గ వేదగర్భ అంబిక భద్ర భద్రకాళి క్షేమద భాగ్యద యని ప్రాతస్సాయాహ్నము లందు జనులు వినతులై వినుతించి పూజింతురు. నా ప్రసాదముచే నీవు వారి కోరికలను సఫలము సేయ గలవు. మానవులు సుర (మద్యము) మాంసము మొదలయిన వానిని భక్ష్య భోజ్యాదులను నీకు నివేదించి యర్చింప నీవు ప్రసన్నురాలవై వారి యశేష వాంచాఫలముల ననుగ్రహింతువు. ఓ కళ్యాణీ! ఆ ప్రజలందరు నిస్సంశయమతులై నీ యందు భక్తి తత్పరులయి తీరెదరు. సందియము లేదు. నా చెప్పిన చొప్పునం జనుము.
Summary of chapter 1 of the Vishnu Mahā Purāṇa is as follows:
Bhūmādevī's prayer to Brahma and Viṣṇu sets the stage for the Kṛṣṇāvatāra. The ākāśavāṇī (divine voice) curse warns Kaṃsa that the eighth son of Devakī will destroy him. Kaṃsa, terrified, imprisons both Devakī and Vasudeva. The Earth's petition and the Brahmā-Viṣṇu dialogue in Vaikuṇṭha establish Viṣṇu's resolve to descend for the relief of the earth's burden.