విష్ణు మహా పురాణము

19 - అక్రూరకృత కృష్ణ సమర్చనము - మథురా ప్రవేశము - రజక నిగ్రహము - మాలాకారానుగ్రహము

శ్రీపరాశరుడు:

ఏవమన్తర్జలేవిష్ణుమభిష్టూయసయాదవః

అర్చయామాససర్వేశం ధూపపుష్పైర్మనోమయైః

పరిత్యక్తాన్యవిషయో మన స్తత్రనివేశ్యసః

బ్రహ్మభూతేచిరంస్థిత్వా విరరామసమాధితః

కృతకృత్యమివాత్మానం మన్యమానోమహామతిః

ఆజగామరథం భూయోనిర్గంయాయమునామ్భసః

దదర్శరామకృష్టౌచ యథాపూర్వమవస్థితౌ

విస్మితాక్షస్తదాక్రూర స్తంచకృష్ణోఽభ్యభాషత

శ్రీపరాశరుడు:

అయ్యాదవుడు, అక్రూరుడు, యమునావారి విష్ణుని వినుతిసేసి ధ్యానావాహన దూపదీప నైవేద్యాదులను షోడశోపచారములచే మానసిక పూజ గావించెను. ఇతర విషయముల నుండి మరలించి శ్రీకృష్ణ పరబ్రహ్మ మందు మనసు చిరకాలము నిలిపి క్రమముగా సమాధి నుండి వ్యుత్థాన మందెను. ఆ బుద్ధిశాలి తాను ధన్యుడయ్యెనని భావించి యమునా జలంబుల నుండి వెడలి తిరిగి రథము దఱికి వచ్చెను. ముందటి యట్లు రథము లండున్న బలరామ కృష్ణులం దర్శించి విస్మితనయను డయ్యెను.

శ్రీ కృష్ణుడు:

నూనంతేదృష్టమాశ్చర్యమక్రూర! యమునాజలే

విస్మత్ఫుల్లనయనోభవాన్ సంలక్ష్యతేయతః

శ్రీకృష్ణుడు:

“యక్రూర! యమునా తీర్థ మందేదో వింత కనినట్లున్నావు. ఇది నిజము. నీతనువాశ్చర్యముచే వికాస మొంది కనిపించు చున్నది.”

అక్రూరుడు:

అన్తర్జలేయదాశ్చర్యం దృష్టం తత్రమయాచ్యుత

తదత్రాపిహిపష్యామిమూర్తిమత్పురతః స్థితమ్

నిగదేతన్మహాశ్చర్యరూపం యస్యమహాత్మనః

తేనాశ్చర్యవరేణాహం భవతాకృష్ణ! సంగతః

తత్కి మేతేనమథురాం యస్యామోమధుసూదన

బిభేమికం సాద్ధిగ్జన్మపరపిణ్డోపజీవినామ్

ఇత్యుక్త్వాచోదయామాస సహాయాన్ వాతరంహసః

సంప్రాప్తశ్చాపిసాయాహ్నేసోఽక్రూరోమథురాం పురీమ్

విలోక్యమథురాంకృష్ణం రామంచాహసయాదవః

పద్భ్యాంయాతంమహావీర్యౌ రథేనై కోవిశామ్యహమ్

గన్తవ్యం వాసుదేవస్యనోభావద్భ్యాం తథాగృహమ్

యువయోర్ హికృతేవృద్దస్సకంసేననిరస్యతే

అక్రూరుడు:

స్వామి! అచట నన్నీటిలో నేమి వింత నేను చూచితినో అది రూపుగట్టి యిచ్చట కనపడుచున్నది. కృష్ణా! ఈ విశ్వమే మహాత్ముని స్వరూపమో యట్టి పరబ్రహ్మమగు నిన్ను నేనిపుడు గలిసికొన్నాను. ఆ సంగతి కేమిగాని మనము సత్వరము మథురకు జనవలెను. నేనా కంసునికి భయపడు చున్నాను. పరపిండోప జీవుల బ్రదుకు పరమ తుచ్చము. అని వాయు వేగములైన రథాశ్వములను తొలి ప్రోద్దుగుంకు సరికాతడు మథురం జేరెను. బలరామ కృష్ణులం గని “మీరు పాదచారులై రండు. నేనొంటరిగ ఈ రథమున నగరమున ప్రవేశింతును. వసుదేవు గృహమునకు పోవలదు. కంసుడు మీ నిమిత్తముగా నా వృద్దుని గెంటివేయ గలదు” అని పలికి యతడు మథురం బ్రవేశించెను.

శ్రీపరాశరుడు:

ఇత్యుక్త్వాప్రవివేశాథసోక్రూరోమథురాం పురీమ్

ప్రవిష్టౌరామకృష్ణౌచ రాజమార్గాముపాగతౌ

స్త్రీభిర్వరైశ్చసానన్ధం లోచనై రాభివీక్షితౌ

జగ్మతుర్లీలయావీరౌ మత్తౌబాలగజావివా

భ్రమమాణౌతతోదృష్ట్వా రాజకంరఙ్గకారకమ్

ఆయాచేతాం సురూపాణి వాసాంసిరుచిరాణితౌ

కంసస్య రాజకస్సోఽథ ప్రసాదారూఢవిస్మయః

బహూన్యాక్షేపవాక్యానిప్రాహోచ్చైరామకేశావౌ

తత స్తలప్రహారేణకృష్ణస్తస్యదురాత్మనః

పాతయామాసరోషేణ రాజకస్యశిరోభువి

హత్వాదాయచవస్త్రాణి పీతనీలామ్భరౌతతః

కృష్ణరామౌముదాయుక్తౌమాలాకారగృహంగతౌ

వికాసినేత్రయుగళోమాలాకారోఽతివిస్మితః

ఏతౌకస్యసుతౌయాతౌ మైత్రేయాచిన్తయత్తదా

శ్రీపరాశరుడు:

బలరామ కృష్ణులు రాజ వీథి కేతెంచిరి. స్త్రీ పురుషు లానందమున కనులార వారిం గాంచిరి. మదపుటేనుగు గున్నలట్లు ఒయ్యారముగ నడచుచు నట్టటు పరిభ్రమించుచు రంగాలంకరణము సేయు నొక్క చాకలిం గని వారు వాని చేనున్న చక్కని రాజోచిత వస్త్రములను మాకిమ్మని యడిగిరి. కంసరాజు దివాణపు చాకలి యగుట గర్వపడిన వాడై వారి నాక్షేపించుచు నేకసక్కము లాడుచు బిగ్గరగా నరచెను. కృష్ణుడు రోషము గొని యరచేతను గొట్టి వాని తల నేలం బడవేసెను. అవ్వల నీలపీతాంబర ధారులా యన్నదమ్ము లిద్దరూ నమ్మడుగులం దాల్చి మరియును నా రాచబాట మాలాకారు నింటికిం జనిరి. అతడా ముద్దు కుమారులం గాంచి కనుంగవ విప్పార చూచి మిక్కిలి వింతపడి మైత్రేయా! వీరేవ్వరి వారిటకు వచ్చిరని యాలోచించెను.

పీతనీలామ్భరధరౌ తౌ దృష్ట్వాఽతిమానోహరౌ

సతర్కయామాసతదాభువందేవావుపాగాతౌ

వికాసిముఖపద్మాభ్యాం తాభ్యాం పుష్పాణియాచితః

భువంవిష్టభ్యహస్తాభ్యాం పస్పర్శశిరసామహీమ్

ప్రసాదపరమౌనాథౌమమగేహముపాగాతౌ

ధన్యోహమర్చయిష్యామీత్యాహమాల్యోపజీవనః

తతః ప్రహృష్టవదన స్తయోః పుష్పాణికామతః

చారూణ్యేతాన్యథై తానిప్రదదౌసప్రలోభయన్

పునః పునః ప్రణమ్యోభౌమాలాకారోనరోత్తమౌ

దదౌపుష్పాణిచారుణిగన్ధవన్త్యమలానిచ

మాలాకారాయకృష్ణోపిప్రసన్నః ప్రదదౌవరాన్

శ్రీస్త్వాంమత్సం శ్రయాభద్రనకదాచిత్త్యజిష్యతి

బలహానిర్నతేషౌమ్యధనహానిరథాపివా

యావద్దినానితావచ్చ ననశిష్యసంతతిః

భుక్త్వాచవిపులాన్ భోగాంస్త్వమన్తేమత్ప్రసాదతః

మమానుస్మరణంప్రాప్య దివ్యంలోకమవాప్స్యసి

ధర్మేమనశ్చతేభద్ర! సార్వకాలం భవిష్యతి

యుష్మత్సన్తతిజాతానాందీర్ఘమాయుర్భవిష్యతి

నోపసర్గాదికందోషంయుష్మత్సన్తతిసంభవః

అవాస్స్యతి మహాభాగయావత్సూర్యో భవిష్యతి

ఆ నలుపు తెలుపు వలువలుం దాల్చి ముచ్చట గొల్పు నా సుకుమార కుమారులంగని యవనికి దిగి వచ్చిన దేవతలేమో యని వాడు తలచెను. వారును మోము దామరలు వికసింప ఈ పువ్వులు తమకిమ్మని యడిగిరి. అతడు వారిదరి వ్రాలి పుడమిం జేతుల నానించి శిరస్సు ధరణిందాక పరమ ప్రసన్న మూర్తులు నాపాలి ప్రభువులు నా యింటికి దయ సేసినారు. ధన్యుడను. ఇదే యర్చించెదను అని హృష్ట ముఖుడై ఇంతకంటె నివి మంచివి! ఇవి గైకొనుండని వారిని మురిపించి ఊరించుచు వారు మనసు వడిన చక్కని పూవులం గాన్క పెట్టెను. మఱిమరల నయ్యిద్దరకుం బ్రణమిల్లి యా మాలాకారుడు ఆ పురుషోత్తములకు సువాసనలు మించు మంచి పూలెంచి యిచ్చె. అంతట హరి వాని యెడ ప్రసన్నుడై ఎప్పుడు నాతోనుండు మహాలక్ష్మీ నిన్నెపుడును బాయకుండు గాక! మంచివాడవు. బలహాని ధనహాని నీకు కలుగదు. నీ సంతతి వారు పూర్నాయుష్మంతు లగుదురు. ఇహమున మహాభోగము లనుభవించి నా యనుగ్రహమున నా యనుస్మరణము నొంది దివ్య లోకమును బొందుదువు. ఓ భద్రుడా! నీ మనసేవేళ ధర్మము నందు నిలుచును. నీ సంతతి కలకాలము సుఖముండును. సూర్యుడున్నంత కాలము నీ సంతానము కెట్టి యుపద్రవములుం గలుగవు.

శ్రీపరాశరుడు:

ఇత్యుక్త్వాతద్గృహాత్కృష్ణోబలదేవసహాయవాన్

నిర్జగామముని శ్రేష్ఠ! మాలాకారేణపూజితః

శ్రీపరాశరుడు:

అని యా మాలాకారునిం గరుణించి బలదేవునితో వాని పూజ లందుకొని వాని ఇల్లు వెడలెను.