విష్ణు మహా పురాణము

29 - నరకాసుర వధ

శ్రీపరాశరుడు:

ద్వారవత్యాంస్థితేకృష్ణశక్రస్త్రి భువనేశ్వరః

ఆజగామాథ మైత్రేయ! మత్తైరావతపృష్ఠగః

ప్రవిశ్యద్వారకాం సోఽథ సమేత్యహరిణాతతః

కథయామాసదైత్యస్య నరకస్య విచేష్టితమ్

త్వయానాథేనదేవానాం మనుష్యత్వేఽపితిష్ఠతా

ప్రశమంసర్వదుఃఖాణి నీతాని మధుసూదన

తపస్వివ్యసనార్థాయ సోరిష్టోధేనుక స్తథా

ప్రవృత్తోయ స్తథాకేశీ తేసర్వేనిహతాస్త్వయా

కంసః కువలయాపీడోపూతనా బాలఘాతినీ

నాశంనీతాస్త్వయాసర్వేయేఽన్యే జగదుపద్రవాః

యుష్మద్దోర్దసంభూతిపరిత్రాతేజగత్త్రయే

యజ్వయజ్ఞాంశాసంప్రాప్త్యా తృప్తింయా న్తిదివౌకసః

సోఽహంసాంప్రతయాతోయన్నిమిత్తం జనార్దన

తచ్చ్రుత్వాతత్ప్రతీకారప్రయత్నం కర్తుమర్హసి

భూమౌఽయం నరకోనామ ప్రాగ్జ్యోతిష పురేశ్వరః

కరోతిసర్వభూతానాముపఘాతమరిందమ

దేవ సిద్దసురాదీనాం నృపాణాంచ జనార్దన

హృత్వాతుసోఽసురః కన్యా రురుధేనిజామన్దిరే

శ్రీపరాశరుడు:

మైత్రేయా! శ్రీకృష్ణుడు ద్వారక యందున్న తఱి త్రిభువనేశ్వారు డింద్రుడు ఐరావత మద గజ మెక్కి వచ్చి ద్వారకం జొచ్చి హరిం గలిసికొని నరకాసురుని ప్రవర్తనము విన్నవించెను. మధుసూదనా! దేవాధినాథుడవు నీవు మనుష్యుడుగా వర్తింపగా గూడ సర్వ దుఃఖము లుపశమింప జేయబడినవి. తపశ్శాలురకు భాధ గూర్ప బూనికొన్ని యరిష్టుడు ధేనుకాసురుడు కేశి మొదలగు నసుర లెల్లరు నీచే నీల్గిరి. కంసుడ కువల యాపీడుడు బాలఘాతిని పూతన మొదలగు జగదుపద్రవము లన్నియు నీచే వినాశ మందినవి. నీదోర్ధండ వైభవమున ముల్లోకము రక్షణ మొంద యజ్వలు పిలిచి యజ్వలు యిచ్చు యజ్ఞ భాగము లందికొని దేవతలు తనియు చున్నారు. జనార్దనా! వారిలో నేనొకడనే నే పని మీద నిపుడిటకు వచ్చితినో యాలించి దాని కనువైన ప్రతిక్రియ గావింప యత్నింపుము. భూమి కొడుకీ నరకుడు ప్రాగ్జ్యోతిష పురాధీశ్వరుడు సర్వ భూతములకు బాధ గూర్చు చున్నాడు. దేవసిద్దుల యొక్కయు ధరణి నాతుల యొక్కయు కన్నియలం గొనిపోయి తన యింటంజెఱ గొన్నాడు.

ఛత్రంయత్సలిలస్రావి తజ్జహారప్రచేతసః

మన్దరస్యతథాశృఙ్గం హృతవాన్ మణిపర్వతమ్

అమృతస్రావిణీదివ్యే మన్మాతుః కృష్ణ! కుణ్డలే

జహారసోసురోదిత్యావాఞ్చత్యైరావతంగజమ్

దుర్నితమేతద్గోవిన్ద! మయాతస్యనివేదితమ్

యదత్రప్రతికర్తవ్యం తత్స్వయంపరిమృశ్యతామ్

ప్రచేతుని (వరుణుని) జల స్రావియైన గొడుగును లాగి కొన్నాడు. మందార పర్వత శృంగమగు మణి పర్వతమును హరించినాడు. మా అమ్మ దివ్యమణి కుండలముల నమృతమును గురియు వానిని కృష్ణా! యయ్యుసుర గాజేసినాడు. ఐరావతముం గోరుచున్నాడు. గోవింద వాని దుర్వినీతి యిది నీకు నివేదించితిని దీనికి బ్రతికర్తవ్యమేమో నీవ పరిశీలింప వలయును.

శ్రీపరాశరుడు:

ఇతిశ్రుత్వాస్మితం కృత్వాభగవాన్ దేవకీసుతః

గృహీత్వావాసవంహస్తేసముత్తస్థౌవరాసనాత్

సంచిన్త్యాగతమారుహ్య గరుడంగగనేచరమ్

సత్యభామాంసమారోప్య యయౌప్రాగ్జ్యోతిషంపురమ్

ఆరుహ్యైరావాతం నాగం శక్రోపిత్రిదివం యయౌ

తతోజగామకృష్ణ శ్చపశ్యతాం ద్వారకౌకసామ్

శ్రీపరాశరుడు:

అనన్విని భగవంతు డగు దేవకీ తనయు డల్లన నవ్వి యింద్రుని చేయి పట్టుకొని యాసనము నుండి లేచెను. గరుడుం దలచి వచ్చిన యా పక్షిరాజు నెక్కి సత్యభామను గూడ నెక్కించు కొని ప్రాగ్జ్యోతిషమునకుం దరలెను. ఐరావత మెక్కి యమరపతి స్వర్గమునకుం జనెను. ద్వారకా వాసులు చూచుచుండ నటుపై కృష్ణుడునుం జనియె.

పాగ్జోతిషపురస్యాసీత్సమన్తాచ్చతయోజనమ్

ఆచితామౌరవైః పాశైః క్షురాన్తైః భూః ద్విజోత్తమ

తాచిచ్చేదహరిః పార్శాక్షిప్త్వాచక్రంసుదర్శనమ్

తతోమురస్సముత్తస్థౌతం జఘానచకేశవః

మురస్యతనయాం త్సప్తసహస్రాంస్తాం స్తతోహరిః

చక్రధారాగ్నినిర్దగ్దాంశ్చకారశలభానివ

హత్వామురం హయగ్రీవం తథాపఞ్చజనంద్విజః

ప్రాగ్జ్యోతిషపురంధీమాంస్త్వరావాంత్సముపాద్రవత్

నరకేణాస్య తత్రాభూన్మహాసై న్యేనసంయుగమ్

కృష్ణస్యయత్రగోవిన్దో జఘ్నేదైత్యాంత్సంహస్రశః

శస్త్రాస్త్రవర్షంముఞ్చన్తం తంభౌమంనరకంబలీ

క్షిప్త్వాచక్రంద్విధాచక్రే చక్రీదై తేయచక్రహా

హతేతునరకేభూమిర్ గృహీత్వాఽదితికుణ్డలే

ఉపతస్థేజగన్నాథం వాక్యంచేద మథాబ్రవీత్

ప్రాగ్జ్యోతిషము నలువైపుల భూమి నూరామడ మురాసురుని చుఱకత్తుల తోడి పాశములం జుట్టు కొనబడి యుండెను. సుదర్శన చక్రమును విసరి హరి వానిని ఛేదించెను. అంతట మురుడెగయ వానిం దునిమి వాని కొడుకుల నేడు వేలమందిని మిడుతలనట్లు చక్రధారాగ్ని దగ్ధులం గావించెను. మురాసురుని హయగ్రీవుని పంచజనునిం గూల్చి ప్రాగ్జ్యోతిష పురమునకు బరువిడెను. అక్కడ నరకుని సేనలతో శ్రీహరికి పెను కలనయ్యె. శస్త్రాస్త్ర వర్షపాతమున ముంచెత్తుతూ యా నరకుని భౌముని (భూమి కుమారుని) దైత్య చక్రంతకుడు చక్రము విసరి రెండొనరించెను. నరకుడు హతుడైనంత అదితి కుండలములం గొని భూమి జగన్నాథు సన్నిధానమునకు వచ్చి యిట్లనియె

భూమి (పృథివీ కృత కృష్ణ స్తుతిః):

యదాహముద్ధృతానాథ! త్వయాసూకరమూర్తినా

త్వత్స్పర్శసంభవః పుత్రస్తదాయం మయ్యజాయత

సోఽయంత్వయైవదత్తోమేత్వయైవవినిపాతితః

గృహాణకుణ్డలేచేమేపాలయాస్యచసంతతిమ్

భారావతరణార్థాయమమైవభగవానిమమ్

అంశేనలోకమాయాతః ప్రసాదాసుముఖః ప్రభో!

త్వంకర్తాచావికర్తాచ సంహర్తాప్రభవోఽప్యయః

జగతాంత్వంజగద్రూపస్స్తూయతేఽచ్యుతకింతవ

వ్యాపీవ్యాప్యం క్రియాకర్తా కార్యంచభగవాన్ యథా

సర్వభూతాత్మ భూతస్య స్తూయతేతవకింతథా

పరమాత్మాచ భూతాత్మాత్వమాత్మాచాప్యయోభవాన్

యథాతథాస్తుతిర్నాథ! కిమర్థంతేప్రవర్తతే

ప్రసీదసర్వభూతాత్మన్నరకేణతుయత్కృతమ్

తత్ క్షమ్యతామదోషాయత్వత్సుతస్త్వన్నిపాతితః

భూమి:

నాథా! వరాహమూర్తివై నన్ను నీవుద్దరించి నపుడు నీ స్పర్శముచే నాకు బుట్టిన వాడీ నరకుడు. నీ కొడుకును వీనిని నీవె యిచ్చితివి. నీవె కడతేర్చితివి. ఇవిగో కుండలములు గైకొనుము. వీని సంతతిం బ్రోవుము. నా బరువుం దింప భగవంతుడ వీవు అంశావతార మెత్తితివి. ప్రసాద సుముఖుడవు గమ్ము. జగములకు నీవేకర్తవు. వికర్తవు సంహర్తవును. కారణము లయస్థానము. జగద్రూపు డవు నీవు. నిన్నేమని నుతింతును. వ్యాపించు వాడవు వ్యాపింపబడు విశ్వము క్రియయు కర్తవు కార్యమును నీవు. సర్వభూతాంత రాత్మవాగు నిన్నేమి కొనియాడుదును? పరమాత్మవు భూతాత్మవు ఆత్మవు లయ స్థానము. నిన్నున్న వాని నున్నట్లు స్తుతి సేయనెట్లు వాక్కు ప్రవర్తింప గలదు? సర్వ భూతాత్మా! దయసూపుము. ధర్మ సంస్థాపన కొఱకు నీ కొడుకు నీ చేత చంపబడెం గావున వీని తప్పిదమును క్షమింపుము అని భూదేవి స్తుతించెను.

తథేతిచో క్త్వాధరణీం భగవాన్ భూతభావనః

రత్నానినరకావాసాజ్జగ్రహమునిసత్తమ!

కన్యాపురేసకన్యానాం షోడశాతులవిక్రమః

శతాధికానిదదృశే సహస్రాణిమహామునే

చతుర్ధంష్ట్రాగజాంశ్చాగ్ర్యాన్ షట్సహస్రాంశ్చదృష్టవాన్

కామ్భోజానాంతథాఽశ్వానాం నియుతాన్యేకవింశతిమ్

తాః కన్యాస్తాం స్తథానాగాంస్తానశ్వాన్ ద్వారకాపురీమ్

ప్రాపయామాసగోవిన్దస్సద్యో నరకకింకరైః

దదృశేవారుణం ఛత్రం తథైవమణిపర్వతమ్

ఆరోపయామాసహరిర్గరుడేపతగేశ్వరే

ఆరుహ్యచాస్వయం కృష్ణస్సత్యభామా సహాయవాన్

ఆదిత్యాః కుణ్డలేదాతుం జగామత్రిదశాలయమ్

భూత భావనుడు భగవంతుడు డట్లయని యవనిం బలికి నరకు నింటి నుండి రత్నములం దరలించు కొని కన్యాంతః పురమున గల కన్నియల పదారువేల మందిని గనెను. నాల్గు దంతములు గల శ్రేష్ఠము లయిన గజముల నారువేల కాంభోజ దేశమునకు సంబంధించిన యశ్వ రాజముల నిరువది యొక్క లక్షలను జూచెను. ఆ కన్యల నా నాగములం గురములను గోవిందుడు ద్వారకాపురి కప్పటి కప్పుడు నరక కింకరులచే జేర్పించెను. మఱియు వాని వారుణ చ్చత్రమును మణి పర్వతముం జూచి పతగరాజు గరుడుని మూపు నెక్కించి తానును సత్యభామతో నధిరోహించి అదితికి కుండలము లీయ త్రిదశాలయమగు స్వర్గముం గూర్చి యేగెను.