విష్ణు మహా పురాణము

15 - కృష్ణావతార ప్రసంగము

శ్రీమైత్రేయుడు:

హిరణ్యకశిపుత్వేచ రావణత్వేచ విష్ణువా

అవాప నిహతోభోగానప్రాప్యానమరై రపి

న లయం తత్రతేనైవ నిహతస్సకథంపునః

సంప్రాప్తశ్శిశుపాలత్వే సాయుజ్యంశాశ్వతేహరౌ

ఏతదిచ్చామ్యహంశ్రోతుం సర్వధర్మభృతాంచర!

కౌతూహలపరేణై తత్పృష్టో మే వక్తుమర్హసి

శ్రీమైత్రేయుడు:

హిరణ్యకశిపుడుగా రావణుడుగాపుట్టి విష్ణువు చేత గూలి దేవతలు గూడ పొందనలవి గాని భోగములను బడెసెను. కాని భగవంతునిలో లయము నందలేదు. ఆ హరి చేతనే యతడు శిశుపాలుడుగా హతుడై శాశ్వతుడైన హరితో సాయుజ్యము నెట్లు గాంచెను. ఈ వివరము విన నాకు గుతూహలమగు చున్నది.

శ్రీపరాశరుడు:

దైత్యేశ్వరస్యవధాయాఖిల లోకోత్పత్తిస్థితి వినాశకారిణా పూర్వంతనుగ్రహణం కుర్వతా నృసింహ రూప మావిష్క్రుతమ్

తత్రచ హిరణ్యకశిపోర్విష్ణురయమిత్యేతన్మనస్య భూత్

నిరతిశయ పుణ్యసముద్భూతమేతత్సత్త్వజాతమితి

రజోద్రేక ప్రేరితైకాగ్రమతిస్తద్భావనాయోగాత్ తతోఽవాస్తవధహేతుకీం నిరతిశయామేవా ఖిలత్రైలోక్యాధిక్య కారిణీం దశాననత్వేభోగసంపదమావాప

సతు నతస్మిన్ననాదినిధనే పరబ్రహ్మభూతేభగవత్య నాలమ్బినికృతే మనసస్తల్లయమవాప

ఏవందశాననత్వేఽప్య నంగపరాదీనతయా జానకీ సమాసక్త చేతసా భగవతా దాశరథిరూపదారిణా హతస్యతద్రూపదర్శనమేవాసీత్ నాయ మచ్యుత ఇత్యాసక్తిర్విపద్యతోఽన్తః కరణే మానుషబుద్ధిరేవకేవల మస్యాభూత్

పునరప్యచ్యుతవినిపాతమాత్రఫల మఖిలభూమణ్డల శ్లాఘ్యచేదిరాజకులేజన్మ అవ్యాహతైశ్వర్యం శిశుపాలత్వేఽప్యవాప

శ్రీపరాశరుడు:

దైత్యేశ్వరుడగు హిరణ్యకశిపుని జంపుట కొఱకు మున్ను భగవంతునిచే నృసింహావతారము ప్రకటింప బడినది. అత్తరి హిరణ్యకశిపుని మనసులో నీతడు విష్ణువన తలంపు గలుగ లేదు. నిరతిశయ పుణ్యముచే నావిర్భావించిన జంతువిదియను నూహ కలుగ తన యుద్రేకముచే బ్రేరేపింప బడిన ఏకాగ్రమైన మతికలవాడై యా విధమైన భావన చేసి (ఆ భావనా రూప యోగముచే) నా నర మృగాకారముచే నైన మరణముచే నిరతి శయమైన సకల త్రైలోక్యమును మించిన యాదిక్యమును గూర్చు భోగ సంపదను రావణుడుగా బుట్టి యనుభవించెను. అంతియ కాని అనాది నిధనము కేవలము పరబ్రహ్మము నిరాలంబమునైన భగవత్తత్వ మిదియని భావన సేసి యందు మనస్సు యొక్క లయమును బొందలేదు. రావణుడయి పుట్టినపుడు గూడ యిట్లే కామవశుడగుటచే జానకి యందంటిన మనస్సుచే దశరథ కుమార రూపము ధరించిన రామచంద్ర పరమాత్మ రూప భగవంతునిచే హతుడైన తఱి వానికి రాముడే కనిపించెను గాని యితడచ్యుతుడను భావన కలుగ లేదు. చనిపోవునెడ వాని యంతః కరణ మందు రాముడు కేవలము మనుష్యుడను భావనయే కలిగెను. అవ్వలనో అచ్యుతుని చేతిలో నీల్గుట మాత్రమె ఫలముగా గలది చేదిరాజకుల మందు శిశుపాలుడై యఖిల భూవలయుము మెచ్చున వ్యాహతైశ్వర్యమైన జన్మ మందెను.

తత్ర త్వఖిలానామెవసభగవన్నామ్నాం త్వంకారకారణమభవత్

తతశ్చ తత్కాల కృతానాం తేషామశేషాణమేవాచ్యుతనామ్నా మనవరతమనేకజన్మసు వర్ధిత

విద్వేషానుబన్దిచిత్తో వినిన్దనసంతర్జనాదిశూచ్చారణ మకరోత్

తచ్చరూప ముత్పుల్లపద్మదళామలాక్ష మత్యుజ్జ్వల పీతవస్త్రదార్యమల కిరీటకేయూరహారకటకాది

శోభిత ముదారచతుర్ బాహు శంఖచక్రగదాధర మతిప్రరూడవై రానుభావాదటనభోజన

స్నానాసన శయనాది శ్వశేషావస్థాన్తరేషు నాన్యత్రోపయయావస్యచేతసః

తటస్తమేవాక్రోశేషూచ్చారయంస్తమేవ హృదయేనధారయ న్నాత్మవధాయయావత్ భగవద్దస్తచక్రాంశు

మాలోజ్జ్వల మక్షయ తేజస్స్వరూపం బ్రహ్మభూతమపగతద్వేషాదిదోషం భగవన్తమద్రాక్షీత్

తావచ్చభగవచ్చక్రేణాశు వ్యాపాదితః

తత్ స్మరణదగ్దాఖిలాఘసంచయో భగవతాఽన్తముప నీతః తస్మిన్నేవలయముపయయౌ

ఏతత్తవాఖిలం మయాఽభిహితమ్

ఆ పుట్టువు నందు ఆతడు సర్వ భగవన్నమములను త్వంకరించుటకు కారణమయ్యెను. (త్వంకరించుటయనగా నీవు నీవని తృణీకరించుట యన్నమాట) అందుచే తత్కాలముగా నొనరించిన యా పేర్లన్నిటి యందు నిరంతరము పెక్కు జన్మము లందు పెంచుకొనిన విద్వేషముతో నుడివడిన చిత్తము గలవాడై నిదించుట బెదరించుట మొదలగు వానియందా భగవన్నా మోచ్చరణము సేసెను. మఱియు విప్పారిన తామర పూరేకుల వంటి కన్నులు మెరుగారు పీతాంబరము దాల్చినది అమల కీరిట కేయూర హార కటకాది శోభితము ఉదార చతుర్భాహు శంఖ చక్ర గదాదారమునైన యా పరమ సుందర రూపము ప్రగాడ వైరాను భావముచే నట్టిటు తిరుగాడు నపుడు స్నాన భోజనాసనశయనాది సర్వావస్థల యందును వీని చిత్తమింకొక తెరుపునకు బోదయ్యే. అందుచే ఆక్రోశము (ఆక్షేప వచనము) లందు ఆ విష్ణు నామములనే ఉచ్చరించుచు నాతనిని హృదయ మందవధరించుచు తన చావునకు భగవంతుని హస్తమందలి చక్రాయుధము యొక్క కిరణ మాలికలచే నుజ్జ్వలమైన అక్షయ తేజస్స్వరూపము గల ద్వేషాది దోష దూరమునైన యా కేవల పరబ్రహ్మ రూపమును దర్శించు చున్నంతట నా భగవంతుని చక్రముచే హతుండయ్యె. తదను స్మరణమున నఘసంచయమెల్ల దగ్ధమై భగవంతునిచే నంతమొందింపబడ యా తత్త్వమందే లయ మందెను. ఇది యెల్ల నీ కేను దెల్పితిని.

అయంహి భగవాన్ కీర్తితశ్చ సంస్మృతశ్చ ద్వేషానుబన్దేనాపి అఖిలసురాసురాదిదుర్లభం ఫలం ప్రయచ్చతి కిముతసమ్యగ్భక్తిమతామితి

వాసుదేవస్యత్వానక దుందుభేః పౌరవీరోహిణీ మదిరా భద్రా దేవకీ ప్రముఖా బహ్వ్యః పత్న్యోఽభవన్

భద్రశటసారణ దుర్మదాదీన్ పుత్రాన్ రోహిణ్యా మానకదుందుభి రుత్పాదయామాస

బలదేవోఽపి రేవత్యాంవిశఠోల్ముకౌ పుత్రావజనయత్

సార్ ష్టిమాష్టిశిశుసత్యధృతి ప్రముఖాస్సారణాత్మజాః

భద్రాశ్వభద్రబాహుదుర్దమభూతాద్యాః రోహిణ్యాః కులజాః

నన్దోపనన్దకృతకాద్యా మదిరాయాస్తనయాః

భద్రాయాశ్చోపనిధిగదాద్యాః

వైశాల్యంచ కౌశికమేకమేవాజనయత్

ఆనకదున్ధుభేః దేవక్యామపి కీర్తిమత్సుషేణోదాయుభద్రసేన ఋజుదాసభద్రదేవాఖ్యాః షట్పు త్రాజజ్ఞిరే

తాంశ్చసర్వానేవ కంసోఘాతితవాన్

ఈ భగవంతుడు పగనైన కీర్తింపబడి స్మరింపబడి యఖిల సురాసురాది దుర్లభమైన ఫలము నిచ్చును. మంచి భక్తి సంపన్నుల మాట వేరే చెప్పవలెనా? వసుదేవునికి (ఆనక దుందుభికి) పౌరవి రోహిణి మదిర భద్ర దేవకీ మొదలయిన పెక్కుమంది భార్యలుండిరి. అతడు భద్రశఠసారణ దుర్మదాదులం దనయులను రోహిణి యందు గనెను. బలరాముడు రేవతి యందు విశఠుడు ఉల్ముకుడు ననునిద్దరు కుమారులం గనియె. సాష్టీ మాష్టి శిశు సత్యధృతి ప్రముఖులు సారణుని కొడుకులు. భద్రాశ్వ భద్రబాహు దుర్దమభూతాదులు రోహిణీ కులజులు నంద ఉపనంద కృతకాదులు మదిర యొక్క తనయులు. ఉపనిది గదాదులు భద్రా సంతానము. వైశాలి యందు కౌశికు నొక్కనినే కనెను. ఆనకదుందుభికి దేవకీ యందు కూడా కీర్తింమంతుడు సుషేణుడు ఉదాయువు భద్రసేనుడు ఋజుదాస భద్రదేవుడు నను నార్వురు పుత్రులు గల్గిరి. వారి నందరను కంసుడు సంహరించెను.

అనన్తరంచ సప్తమం గర్భమర్ధరాత్రే భగవత్ప్రహిత యోగనిద్రా రోహిణ్యా జఠరమాకృష్య నీతివతీ

కర్షణాచ్చాసావపి సంకరాఖ్యమగమత్

తతశ్చ సకల జగన్మహాతరుమూలభూతో భూతభవిష్యదాది సకలసురాసుర మునిజమనసా మప్యగోచరోఽబ్జభవ ప్రముఖై రనలముఖైః ప్రణమ్యా వనిభారహరణాయ ప్రసాదితోభగవా ననాదిమధ్యనిధనో దేవకీగర్భమవతతార వాసుదేవః

తత్ప్రసాదవివర్దమానోరు మహిమాచ యోగనిద్రా నన్దగోపపత్న్యా యశోదాయా గర్భమధిష్టితవతీ

అటుపై సప్తమ గర్భమున అర్థరాత్రి భగవంతుడంప యోగనిద్ర రోహిణి యుదర మాకర్షించి గొంపోయెను. కర్షణ మొనరించుట వలన నీ శిశువు సంకర్షణుడను పేరొందెను. అవ్వల సకల జగన్మహా తరువునకు మొదలు, భూత భవిష్యదాది సకల సురాసురమునిజన మానసముల కేని యగోచరుడు బ్రహ్మాదులగు నగ్నిముఖులచే (దేవతలచే) ప్రణమిల్లి యవని భారము దింప ప్రసన్నత నొందింప బడిన భగవాను డనాదిమధ్య నిధనుడు హరి వాసుదేవుడు దేవకీ గర్భము నవతరించెను. ఆ దేవు ననుగ్రహముచే దినదినాభివర్ధమాన మహిమ గల యోగ నిద్ర నన్దగోపుని పత్నియగు యశోద గర్భము నందునికి సేసెను.

సుప్రసన్నాదిత్య చన్ద్రాదిగ్రహ మావ్యాళాదిభయం స్వస్థమానసమఖిలమేవై తజ్జగ

దపాస్తాధర్మమభవత్ తస్మింశ్చపుణ్రీకనయనే జాయమానే

జాతేనచ తేనాఖిలమేవైతత్ సన్మార్గివర్తి జగదక్రియత

భగవతోప్యత్రమార్త్య లోకేవతీర్ణస్య షోడశసహస్రాణ్యేకోత్తరశతాధికాని భార్యాణామభవన్

తాసాంచ రుక్మిణీ సత్యభామా జాంబవతీ చారుహాసినీ ప్రముఖా హ్యష్టౌపత్న్యః ప్రధానా బభూవుః

తాసుచాష్టావయుతాని లక్షంచపుత్రాణాం భగవానఖిల మూర్తి రనాదిమా నజనయత్

తేషాంచ ప్రద్యుమ్న చారుదేష్ణసామ్బాదయస్త్రయోదశ ప్రధానాః

ప్రద్యుమ్నోఽపిరుక్మిణ ఏవపౌత్రీం సుభద్రాంనామోపయేమే

తస్యామస్యవజ్రోజజ్ఞే

వజ్రస్య ప్రతిబాహుః తస్యాపిసుచారుః

ఏవమనేక శతసహస్ర పురుష సంఖ్యస్య యదుకులస్య పుత్రసంఖ్యా వర్షశతై రపివక్తుంనశక్యతే

యతోహిశ్లోకావిమావత్రచరితార్థౌ

తిస్రః కొత్యస్సహస్రాణామష్టాశీతిశతానిచ

కుమారాణాం గృహాచార్యా శ్చాపయోగేషు యేరతాః

సంఖ్యానం యాదవానాంకః కరిష్యతిమహాత్మనామ్

యత్రాయుతానామయుతలక్షేణాస్తేసదాహుకః

దేవాసురేహతాయేతుదైతేయాస్సు మహాబలాః

ఉత్పన్నాస్తే మనుష్యేషుజనోపద్రవకారిణః

తేషాముత్సాదనార్థాయభువిదేవాయదోః కులే

అవతీర్ణాః కులశతంయత్రైకాభ్యధికం ద్విజ

విష్ణుస్తేషాం ప్రమాణేచ ప్రభుత్వేచవ్యవస్థితః

నిదేశస్థాయినస్తేచవవృధుస్సర్వయాదవాః

ఇతి ప్రసూతిం వృష్ణీనాంయచ్చృణోతినరస్సదా

ససర్వైః పాతకైర్ముక్తోవిష్ణులోకం ప్రపద్యతే

ఆ పుండరీకాక్షుడు అవతరించు చుండగా సూర్య చంద్రాది గ్రహములు సుప్రసన్నము లాయెను. వ్యాళాది భయరహితమై మనసు స్వస్థమై యెల్లజగ మధర్మ దూరమై యుండెను. పుట్టిన క్షణమయాప్రభు వీయెల్ల విశ్వమును సన్మార్గవర్తిగ నొనరించెను. ఈ మానవ లోకమందవతరించిన భగవంతున కిక్కడ పదునాఱు వేల నూరోక్క మంది భార్యలుండిరి. వారిలో రుక్మిణీ, సత్యభామ, జాంబవతి, చారుహాసిని మొదలగు వారెనమండుగురు ప్రధాన భార్యలు. అఖిల మూర్తి యానాదియునగు నా దేవుడు వారియందు ఒక లక్ష ఎనబది వేల మంది పుత్రులం గనియె. వారిలో ప్రద్యుమ్న, చారుదేష్ణ, సాంబాది కుమారులు పదుమువ్వురు ముఖ్యులు. ప్రద్యుమ్నుడు రుక్మి కుమార్తెను రుక్మవతిం బెండ్లాడెను. ఆమెయం దనిరుద్దు డుదయించెను. అనిరుద్ధుడు రుక్మి పౌత్రిని సుభద్రను పెండ్లాడెను. ఆమె యందతనికి వజ్రుడు దయించెను. వజ్రునికి ప్రతిబాహువు అతనికి సుచారువుం కల్గిరి. ఇట్లనేక శతసహస్ర పురుష సంఖ్యాక మీ యదుకుల హరివంశ విస్తరము నూరేండ్లకైన వర్ణింప నలవి గాదు. ఈ క్రింది శ్లోకములీ విషయములో జరితార్థములు వీని భావము. హరి కుమారులకు ధనుర్విద్యను శిక్షించుటకు నియుక్తులైన చాపాచార్యులు మూడుకోట్ల యెనుబదియెనిమిది వేల మంది గలరు. మహాత్ములగు యాదవుల నెవరు లెక్కింప గలరు? అనేక లక్షల కొలది గలరు. ఆహుకుడను వాడెల్లపుడు యదురాజు. దేవాసుర యుద్దమందు చనిపోయిన మహాబలవంతులగు దైత్యులు మనుష్యులందు జనోపద్రవకారులై పుట్టురి. వారిని తుదముట్టించుటకీ భూలోకమున దేవతలు యదుకులమున జన్మించిరి. ఆ వంశములు నూటొక్కటి (నూరుకు మించి) యున్నవి. వాని కార్య నిర్ణయము నందు ప్రభుత్వ మందు (రక్షణ మందు) పూనిక గొని విష్ణువు నిల్చినాడు. ఆయన యాజ్ఞయందుండి యాదవులందరు వృద్ధి పొందిరి. వృష్ణుల ఈ సంతతి నెవ్వడు విను నాతడు సర్వ పాప విముక్తుడై విష్ణులోకమందును.